15-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి పిల్లలైన మిమ్మల్ని స్వచ్ఛ బుద్ధి కలవారిగా తయారుచేయడానికి వచ్చారు, ఎప్పుడైతే స్వచ్ఛముగా అవుతారో, అప్పుడు మీరు దేవతలుగా అవ్వగలుగుతారు’’

ప్రశ్న:-
ఈ డ్రామాలో తయారై, తయారుచేయబడిన ప్లాన్ ఏది, దాని నుండి తండ్రి కూడా విముక్తులవ్వలేరు?

జవాబు:-
ప్రతీ కల్పములో తండ్రి తమ పిల్లల వద్దకు రావలసిందే, పతితులైన, దుఃఖితులైన పిల్లలను సుఖవంతులుగా తయారుచేయవలసిందే - డ్రామాలోని ఈ ప్లాన్ తయారై ఉంది, ఈ బంధనము నుండి తండ్రి కూడా విముక్తులవ్వలేరు.

ప్రశ్న:-
చదివించే తండ్రిలోని ముఖ్యమైన విశేషత ఏమిటి?

జవాబు:-
వారు చాలా నిరహంకారులై పతిత ప్రపంచములోకి, పతిత తనువులోకి వస్తారు. తండ్రి ఈ సమయములో మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు, మీరు మళ్ళీ ద్వాపరములో వారి కొరకు బంగారు మందిరాలు నిర్మిస్తారు.

పాట:-
ఈ పాపపు ప్రపంచము నుండి...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటలో విన్నారు - రెండు ప్రపంచాలు ఉన్నాయి, ఒకటి పాపపు ప్రపంచము, ఇంకొకటి పుణ్య ప్రపంచము. దుఃఖ ప్రపంచము మరియు సుఖ ప్రపంచము. సుఖము తప్పకుండా కొత్త ప్రపంచములో, కొత్త ఇంటిలో ఉండగలదు. పాత ప్రపంచములో దుఃఖమే ఉంటుంది, అందుకే దీనిని అంతం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొత్త ఇంటిలో సుఖములో కూర్చోవడం జరుగుతుంది. భగవంతుని గురించి మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు అని ఇప్పుడు పిల్లలకు తెలుసు. రావణ రాజ్యముగా అయిన కారణముగా పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా, తమోప్రధాన బుద్ధిగా కలవారిగా అయిపోయారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - నన్ను భగవంతుడు అని అయితే అంటారు కానీ నా గురించి ఎవ్వరికీ తెలియదు. భగవంతుడు ఎవరు అనేది తెలియకపోతే వారు ఎందుకూ కొరగానివారు. ఓ ప్రభూ, ఓ ఈశ్వరా అని దుఃఖములోనే పిలుస్తారు. కానీ ఆశ్చర్యమేమిటంటే ఒక్క మానవమాత్రునికి కూడా అనంతమైన తండ్రియైన రచయితను గురించి తెలియదు. వారు సర్వవ్యాపి అని, తాబేలులో, చేపలో పరమాత్మ ఉన్నారని అనేస్తారు. ఇలా పరమాత్మను గ్లాని చేస్తున్నారు. తండ్రిని ఎంతగా నిందిస్తారు, అందుకే భగవానువాచ ఏముందంటే - ఎప్పుడైతే భారత్ లో నన్ను మరియు దేవీ-దేవతలను గ్లాని చేస్తూ-చేస్తూ మెట్లు దిగుతూ తమోప్రధానముగా అయిపోతారో అప్పుడు నేను వస్తాను. పిల్లలంటారు, డ్రామానుసారముగా ఈ పాత్రలోకి మళ్ళీ రావలసి ఉంటుంది. తండ్రి అంటారు, ఈ డ్రామా తయారై ఉంది, నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను, ఈ డ్రామా నుండి నేను కూడా విముక్తుడిని అవ్వలేను, నేను కూడా పతితులను పావనముగా తయారుచేయడానికి రావలసే ఉంటుంది. లేకపోతే కొత్త ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు. పిల్లలను రావణ రాజ్యపు దుఃఖాల నుండి విడిపించి కొత్త ప్రపంచములోకి ఎవరు తీసుకువెళ్తారు? ఈ ప్రపంచములో ధనవంతులైన మనుష్యులు చాలామందే ఉన్నారు, వారు - మేమైతే స్వర్గములో ఉన్నాము, ధనము ఉంది, మహళ్ళు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి అని భావిస్తారు, కానీ అకస్మాత్తుగా ఎవరైనా అనారోగ్యంపాలైతే, కూర్చుని-కూర్చునే చనిపోతే ఎంత దుఃఖము కలుగుతుంది. సత్యయుగములో ఎప్పుడూ అకాల మృత్యువులుండవని, దుఃఖము యొక్క మాటే ఉండదని వారికి తెలియదు. అక్కడ ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడైతే అకస్మాత్తుగా చనిపోతారు. సత్యయుగములో ఇటువంటి విషయాలు ఉండవు. అక్కడ ఏమి ఉంటాయి? ఇది కూడా ఎవరికీ తెలియదు. అందుకే తండ్రి అంటారు, ఎంత తుచ్ఛబుద్ధి కలవారిగా ఉన్నారు. నేను వచ్చి వీరిని స్వచ్ఛబుద్ధి కలవారిగా తయారుచేస్తాను. రావణుడు రాతిబుద్ధి కలవారిగా, తుచ్ఛబుద్ధి కలవారిగా తయారుచేస్తాడు. భగవంతుడు స్వచ్ఛబుద్ధి కలవారిగా తయారుచేస్తున్నారు. తండ్రి మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తున్నారు. పిల్లలందరూ, మేము సూర్యవంశీ మహారాజా, మహారాణులుగా తయారవడానికి వచ్చాము అని అంటారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. నరుడి నుండి నారాయణుడిగా అవ్వాలి. ఇది సత్యనారాయణుని కథ. మళ్ళీ భక్తిలో బ్రాహ్మణులు కథలు వినిపిస్తూ ఉంటారు. నిజముగా ఎవరైనా నరుడి నుండి నారాయణుడిగా తయారవుతారా. మీరైతే నిజముగా నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యేందుకు వచ్చారు. కొందరు మీ సంస్థ ఉద్దేశ్యము ఏమిటి అని అడుగుతారు. నరుడి నుండి నారాయణుడిగా అవ్వడము - ఇదే మా ఉద్దేశ్యము, అని చెప్పండి. కానీ ఇదేమీ సంస్థ కాదు. ఇది పరివారము. తల్లి, తండ్రి మరియు పిల్లలు కూర్చుని ఉన్నారు. భక్తి మార్గములోనైతే - నీవే తల్లివి, తండ్రివి అని పాడేవారు. ఓ మాతా-పితా, మీరు ఎప్పుడైతే వస్తారో, అప్పుడు మేము మీ నుండి అపారమైన సుఖాన్ని తీసుకుంటాము, మేము విశ్వానికి యజమానిగా అవుతాము అని పాడేవారు. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు కదా, అది కూడా స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఓ భగవంతుడా రండి, మీరు వస్తే మేము మీ నుండి ఎంతో సుఖాన్ని పొందుతాము అని ఎవరినైతే అర్ధకల్పము స్మృతి చేసారో, ఇప్పుడు అటువంటి తండ్రిని చూస్తే ఎంతగా సంతోషపు పాదరసము పైకి ఎక్కాలి. ఈ అనంతమైన తండ్రి అయితే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు, అది కూడా 21 జన్మల కొరకు. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని దైవీ సాంప్రదాయులుగా తయారుచేస్తాను, రావణుడు ఆసురీ సాంప్రదాయులుగా తయారుచేస్తాడు. నేను ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. అక్కడ పవిత్రత కారణముగా ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్నది భోగి, అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు. అక్కడ యోగము ద్వారా వారసత్వము లభించి ఉంటుంది. ఆయుష్షు కూడా 150 సంవత్సరాలు ఉంటుంది. తమ సమయానికి ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. ఈ జ్ఞానాన్ని తండ్రియే కూర్చుని ఇస్తారు. భక్తులు భగవంతుడిని వెతుకుతారు. శాస్త్రాలు చదవడం, తీర్థయాత్రలు మొదలైనవి చేయడం - ఇవన్నీ భగవంతుడిని చేరుకునే మార్గాలుగా భావిస్తారు. తండ్రి అంటారు, అసలు ఇవి మార్గాలు కానే కావు. మార్గాన్ని అయితే నేనే తెలియజేస్తాను. అంధులకు చేతికర్ర అయిన ఓ ప్రభూ రండి, మమ్మల్ని శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళండి అని మీరు అనేవారు. కావున తండ్రియే సుఖధామపు మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వరు. తండ్రిపై అసత్యమైన ఆరోపణలు వేసారు. ఎవరైనా మరణిస్తే భగవంతునిపై నిందలు వేయడం మొదలుపెడతారు. తండ్రి అంటారు, నేను ఎవరినైనా హతమార్చుతానా లేక దుఃఖాన్ని ఇస్తానా. ప్రతి ఒక్కరిదీ తమ, తమ పాత్ర. నేను ఏ రాజ్యమునైతే స్థాపన చేస్తానో, అక్కడ అకాల మృత్యువులు, దుఃఖము మొదలైనవి ఎప్పుడూ ఉండవు. నేను మిమ్మల్ని సుఖధామానికి తీసుకువెళ్తాను. పిల్లల రోమాలు నిక్కబొడుచుకోవాలి. ఓహో, బాబా మమ్మల్ని పురుషోత్తములుగా తయారుచేస్తున్నారు. సంగమయుగాన్ని పురుషోత్తమ యుగము అంటారని మనుష్యులకు తెలియదు. భక్తి మార్గములో భక్తులేమో పురుషోత్తమ మాసము మొదలైనవి కూర్చుని తయారుచేసారు. వాస్తవానికి ఇది పురుషోత్తమ యుగము, ఈ సమయములో తండ్రి వచ్చి ఉన్నతోన్నతులుగా తయారుచేస్తారు. ఇపుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. అందరికన్నా ఉన్నతోన్నతులైన పురుషోత్తములు లక్ష్మీ-నారాయణులే. మనుష్యులైతే ఏమీ అర్థం చేసుకోరు. ఎక్కే కళలోకి తీసుకువెళ్ళేది ఒక్క తండ్రియే. మెట్ల చిత్రముపై ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. తండ్రి అంటారు, ఇప్పుడిక నాటకము పూర్తి అయింది, ఇక ఇంటికి పదండి. ఇప్పుడు ఈ పాత ఛీ-ఛీ శరీరాన్ని వదలాలి. మీరు ముందు కొత్త ప్రపంచములో సతోప్రధానముగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలను అనుభవించి తమోప్రధానులుగా, శూద్రులుగా అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి భక్తి ఫలాన్ని ఇవ్వడానికి వచ్చారు. తండ్రి సత్యయుగములో ఫలాన్ని ఇచ్చారు. తండ్రి సుఖదాత. పతిత-పావనుడైన తండ్రి వస్తే మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులనే కాక, ప్రకృతిని కూడా సతోప్రధానముగా తయారుచేస్తారు. ఇప్పుడైతే ప్రకృతి కూడా తమోప్రధానముగా ఉంది. ధాన్యము మొదలైనవి లభించనే లభించవు. వాళ్ళు, మేము ఈ పథకాలను వేస్తున్నాము కావున వచ్చే సంవత్సరము చాలా ధాన్యము పండుతుంది అని భావిస్తారు కానీ ఏమీ జరగదు. ప్రకృతి వైపరీత్యాలను ఎవరేమి చేయగలరు! కరువు ఏర్పడుతుంది, భూకంపాలు వస్తాయి, రోగాలు వస్తాయి, రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇది అదే మహాభారత యుద్ధము. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు మీ వారసత్వాన్ని పొందండి. నేను పిల్లలైన మీకు స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను. మాయా రావణుడు శాపాన్ని ఇస్తాడు, నరక వారసత్వాన్ని ఇస్తాడు. ఇది కూడా నాటకముగా తయారై ఉంది. తండ్రి అంటారు, డ్రామానుసారముగా నేను కూడా శివాలయాన్ని స్థాపన చేస్తాను. ఈ భారత్ శివాలయముగా ఉండేది, ఇప్పుడు వేశ్యాలయముగా ఉంది. విషయ సాగరములో మునకలు వేస్తూ ఉంటారు.

బాబా మనల్ని శివాలయములోకి తీసుకువెళ్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు కావున ఆ సంతోషము ఉండాలి కదా. మమ్మల్ని అనంతమైన భగవంతుడు చదివిస్తున్నారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారుచేస్తాను. భారతవాసులకు తమ ధర్మము గురించే తెలియదు. మన వంశము అన్నింటికన్నా పెద్దది, దీని నుండి ఇతర వంశాలు వెలువడుతాయి. ఆది సనాతనమైనది ఏ ధర్మము, ఏ వంశము అన్నది అర్థం చేసుకోరు. ఆది సనాతనమైనది దేవీ-దేవతా ధర్మము వారి వంశము, ఆ తర్వాత రెండవ శ్రేణిలో చంద్రవంశము, ఆ తర్వాత ఇస్లామ్ ధర్మము వారి వంశము. ఆ మొత్తం వృక్షము యొక్క రహస్యాన్ని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఇప్పుడు చూడండి, ఎన్ని ధర్మాలు ఉన్నాయి. శాఖోపశాఖలు ఎన్ని ఉన్నాయి. ఇది వెరైటీ ధర్మాల వృక్షము, ఈ విషయాలను తండ్రియే వచ్చి బుద్ధిలో వేస్తారు. ఇది చదువు, దీనిని రోజూ చదవాలి. భగవానువాచ, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను. వినాశీ ధనాన్ని దానం చేయడము ద్వారా పతిత రాజులుగా అవ్వవచ్చు. నేను మిమ్మల్ని ఎంత పావనముగా తయారుచేస్తానంటే ఇక మీరు 21 జన్మల కొరకు విశ్వానికి యజమానులుగా అవుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు సంభవించదు. తమ సమయానికి శరీరాన్ని వదులుతారు. పిల్లలైన మీకు డ్రామా రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. ఆ బయోస్కోపులు (సినిమాలు), డ్రామాలు మొదలైనవి వెలువడడంతో ఈ విషయము గురించి అర్థం చేయించడం కూడా సహజమవుతుంది. ఈ రోజుల్లోనైతే ఎన్నో డ్రామాలు మొదలైనవి చాలా తయారుచేస్తున్నారు. మనుష్యులకు చాలా అభిరుచి ఏర్పడింది. అవన్నీ హద్దులలోనివి, ఇది అనంతమైన డ్రామా. ఈ సమయములో మాయ ఆర్భాటము చాలా ఉంది. ఇప్పుడే స్వర్గము తయారైపోయింది అని మనుష్యులు భావిస్తారు. ఇదివరకు ఇన్ని బిల్డింగులు మొదలైనవి ఏమైనా ఉండేవా. కావున ఎంత అపోజిషన్ ఉంది. భగవంతుడు స్వర్గాన్ని రచిస్తుంటే మాయ కూడా తన స్వర్గాన్ని చూపిస్తుంది. ఇదంతా మాయ ఆర్భాటము. దీని పతనము జరగనున్నది. మాయ ఎంత శక్తివంతమైనది. మీరు దాని నుండి మీ ముఖము తిప్పుకోవాలి. తండ్రి ఉన్నదే పేదల పాలిటి పెన్నిధి. షావుకారుల కొరకు ఇది స్వర్గము, పేదవారు పాపం నరకములో ఉన్నారు. కావున ఇప్పుడు నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేయాలి. పేదవారే వారసత్వము తీసుకుంటారు. షావుకారులైతే మేము స్వర్గములోనే కూర్చున్నాము అని భావిస్తారు. స్వర్గము-నరకము రెండూ ఇక్కడే ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. భారత్ ఎంత బికారిగా అయిపోయింది. భారత్ యే ఎంత షావుకారుగా ఉండేది. ఒకే ఒక్క ఆది సనాతన ధర్మము ఉండేది. ఇప్పుడు కూడా ఎన్ని పాత వస్తువులను వెలికితీస్తూ ఉంటారు. ఇది ఇన్ని సంవత్సరాల నాటి పాత వస్తువు అని అంటారు. తవ్వకాలలో ఎముకలను తీస్తారు, ఇవి ఇన్ని లక్షల సంవత్సరాల నాటివి అని అంటారు. ఇప్పుడు లక్షల సంవత్సరాల నాటి ఎముకలు ఎక్కడి నుండి బయటపడగలవు. అంతేకాక వాటి వెల కూడా ఎంత కడతారు.

తండ్రి అర్థం చేయిస్తారు, నేను వచ్చి అందరి సద్గతి చేస్తాను, వీరిలోకి ప్రవేశించి వస్తాను. ఈ బ్రహ్మా సాకారీ, ఇతనే మళ్ళీ సూక్ష్మవతనవాసీ ఫరిశ్తాగా అవుతారు. వారు అవ్యక్తము, వీరు వ్యక్తము. తండ్రి అంటారు, నేను అనేక జన్మల అంతిమములో కూడా అంతిమములో వస్తాను, ఎవరైతే నంబర్ వన్ పావనులో అతనే మళ్ళీ నంబర్ వన్ పతితులు. నేను ఇతనిలోకి వస్తాను ఎందుకంటే ఇతనే మళ్ళీ నంబర్ వన్ పావనముగా అవ్వాలి. ఇతను నేను భగవంతుడిని, నేను ఫలానా అని ఎక్కడ అంటున్నారు. నేను ఈ తనువులోకి ప్రవేశించి ఇతని ద్వారా అందరినీ సతోప్రధానముగా తయారుచేస్తాను అని తండ్రి కూడా అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీరు అశరీరిగా వచ్చారు, మళ్ళీ 84 జన్మలు తీసుకుని పాత్రను అభినయించారు, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహాభిమానాన్ని వదలండి. కేవలం స్మృతియాత్రలో ఉండాలి. ఇంకే కష్టమూ లేదు. ఎవరైతే పవిత్రముగా అవుతారో, జ్ఞానాన్ని వింటారో, వారే విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇది ఎంత పెద్ద స్కూల్. చదివించే తండ్రి ఎంత నిరహంకారిగా అయి పతిత ప్రపంచములోకి, పతిత తనువులోకి వస్తారు. భక్తి మార్గములో మీరు వారి కొరకు ఎంత మంచి బంగారు మందిరాలను నిర్మిస్తారు. ఈ సమయములో మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను, దాని కొరకు పతిత శరీరములోకి వచ్చి కూర్చుంటాను. మళ్ళీ భక్తి మార్గములో మీరు నన్ను సోమనాథ మందిరములో కూర్చోబెడతారు. బంగారము, వజ్రాలతో మందిరాన్ని తయారుచేస్తారు ఎందుకంటే, వారు మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారని మీకు తెలుసు కావున మీరు ఆ మర్యాద చేస్తారు. ఈ రహస్యాలన్నీ అర్థం చేయించాను. భక్తి మొదట అవ్యభిచారిగా ఉంటుంది, ఆ తర్వాత వ్యభిచారిగా అవుతుంది. ఈ రోజుల్లో చూడండి, మనుష్యులకు కూడా పూజ చేస్తూ ఉంటారు. గంగా నది ఒడ్డున చూడండి, శివోహం అంటూ కూర్చుండిపోతారు. మాతలు వెళ్ళి పాలు అర్పిస్తారు, పూజ చేస్తారు. ఈ దాదా స్వయం కూడా ఇవన్నీ చేసారు, వారు నంబర్ వన్ పూజారిగా అయ్యారు కదా. అద్భుతము కదా. తండ్రి అంటారు, ఇది అద్భుతమైన ప్రపంచము. స్వర్గము ఎలా తయారవుతుంది, నరకము ఎలా తయారవుతుంది - ఈ రహస్యాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ జ్ఞానమైతే శాస్త్రాలలో లేదు. అవన్నీ తత్త్వ జ్ఞానానికి సంబంధించిన శాస్త్రాలు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము, దీనిని ఆత్మిక తండ్రి లేక బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. అంతేకాక బ్రాహ్మణులైన మీకు తప్ప ఈ ఆత్మిక జ్ఞానము ఇంకెవ్వరికీ లభించదు. ఎప్పటివరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో, అప్పటివరకు దేవతలుగా అవ్వలేరు. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు, శ్రీకృష్ణుడు కాదు అని పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాయ ఆర్భాటము ఎంతగానో ఉంది, దాని నుండి మీ ముఖాన్ని తిప్పేసుకోవాలి. మేమైతే ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాము, భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని సదా ఈ సంతోషములోనే రోమాలు నిక్కబొడుచుకోవాలి.

2. విశ్వ రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు కేవలం పవిత్రముగా అవ్వాలి. ఏ విధంగా తండ్రి నిరహంకారులై పతిత ప్రపంచములోకి, పతిత శరీరములోకి వస్తారో, అలాగే తండ్రి సమానముగా నిరహంకారులై సేవ చేయాలి.

వరదానము:-
ఒక్కరితో సర్వ సంబంధాలను నిర్వర్తించే సర్వ ఆధారాల నుండి ముక్తులుగా ఉండే సంపూర్ణ ఫరిశ్తా భవ

ఏదైనా పదార్థాన్ని వండేటప్పుడు అది తయారైపోతే అంచులను వదిలేస్తుంది, అలాగే ఎంతగా సంపన్న స్థితికి సమీపముగా వస్తూ ఉంటారో అంతగా సర్వుల నుండి అతీతముగా అవుతూ ఉంటారు. ఎప్పుడైతే అన్ని బంధనాల నుండి వృత్తి ద్వారా అతీతముగా అయిపోతారో అనగా ఎవరిపైనా ఎప్పుడైతే మోహము ఉండదో అప్పుడు సంపూర్ణ ఫరిశ్తాగా అవుతారు. ఒక్కరితో సర్వ సంబంధాలను నిర్వర్తించడము - ఇదే ఆ గమ్యము, దీని ద్వారానే అంతిమ ఫరిశ్తా జీవితపు గమ్యము సమీపముగా అనుభవం చేసుకుంటారు, బుద్ధి భ్రమించడము ఆగిపోతుంది.

స్లోగన్:-
స్నేహము ఎటువంటి అయస్కాంతమంటే అది గ్లాని చేసేవారిని కూడా సమీపముగా తీసుకువస్తుంది.

మీ శక్తిశాలీ మనసా ద్వారా సకాష్ ను ఇచ్చే సేవ చెయ్యండి

మనసా సేవ కొరకు మనసు-బుద్ధి వ్యర్థము ఆలోచించటం నుండి ముక్తి అవ్వాలి. ‘మన్మనాభవ’ మంత్రము యొక్క సహజ స్వరూపులుగా అవ్వాలి. ఏ శ్రేష్ఠ ఆత్మల యొక్క శ్రేష్ఠ మనసా అనగా సంకల్పాలు శక్తిశాలిగా ఉంటాయో, శుభ భావన, శుభ కామన కలిగి ఉంటాయో వారు మనసా ద్వారా శక్తుల దానాన్ని ఇవ్వగలరు.