15-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మీకు దైవీ ధర్మాన్ని మరియు శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తారు, అందుకే మీ ద్వారా ఎటువంటి ఆసురీ కర్మలు జరగకూడదు, బుద్ధి చాలా శుద్ధముగా ఉండాలి’’

ప్రశ్న:-
దేహాభిమానములోకి రావడం వలన మొదటి పాపము ఏమి జరుగుతుంది?

జవాబు:-
ఒకవేళ దేహాభిమానము ఉన్నట్లయితే తండ్రి స్మృతికి బదులుగా దేహధారుల స్మృతి వస్తుంది, చెడు దృష్టి వెళ్తూ ఉంటుంది, చెడు ఆలోచనలు వస్తాయి. ఇది చాలా పెద్ద పాపము. మాయ దాడి చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. వెంటనే అప్రమత్తం అయిపోవాలి.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి ఎక్కడి నుండి వచ్చారు? ఆత్మిక ప్రపంచము నుండి. దానిని నిర్వాణధామము లేదా శాంతిధామము అని కూడా అంటారు. ఇది గీతకు సంబంధించిన విషయము. ఈ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది అని మిమ్మల్ని అడుగుతారు. మీరు చెప్పండి, ఇది ఆ గీతా జ్ఞానమే. గీత యొక్క పాత్ర నడుస్తూ ఉంది మరియు తండ్రి చదివిస్తున్నారు. భగవానువాచ కదా మరియు భగవంతుడైతే ఒక్కరే. వారు శాంతి సాగరుడు. వారు ఉండేది కూడా శాంతిధామములోనే, అక్కడే మనము కూడా ఉంటాము. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది పతిత ప్రపంచము, పాపాత్ముల తమోప్రధాన ప్రపంచము. తప్పకుండా ఆత్మలమైన మనము ఈ సమయములో తమోప్రధానముగా ఉన్నామని మీకు కూడా తెలుసు. 84 జన్మల చక్రములో తిరిగి సతోప్రధానము నుండి ఇప్పుడు తమోప్రధానములోకి వచ్చారు. ఇది పురాతనమైన మరియు కలియుగీ ప్రపంచము కదా. ఈ పేర్లు అన్నీ ఈ సమయానివే. పాత ప్రపంచము తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచము ఉంటుంది. ఎప్పుడైతే ప్రపంచము మారేది ఉందో మహాభారత యుద్ధము కూడా అప్పుడే జరిగింది మరియు అప్పుడే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారు అని కూడా భారతవాసులకు తెలుసు. కేవలం పొరపాటు ఏమి జరిగింది? ఒకటేమో కల్పము ఆయువును మర్చిపోయారు మరియు గీతా భగవంతుడిని కూడా మర్చిపోయారు. శ్రీకృష్ణుడినైతే గాడ్ ఫాదర్ అని అనలేరు. ఆత్మ గాడ్ ఫాదర్ అని అంటుంది, కావున వారు నిరాకారుడు అయినట్లు. నిరాకారుడైన తండ్రి ఆత్మలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. నేనే పతిత-పావనుడను, నన్ను - ఓ పతిత-పావనా అని పిలుస్తారు కూడా. శ్రీకృష్ణుడైతే దేహధారి కదా. నాకైతే ఏ శరీరమూ లేదు. నేను నిరాకారుడిని, మనుష్యుల తండ్రిని కాను, ఆత్మల తండ్రిని. ఇది పక్కా చేసుకోవాలి. ఘడియ-ఘడియ ఆత్మలమైన మనము ఈ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి, తండ్రి వచ్చారు. బాబా, బాబా అనే అంటూ ఉండాలి. బాబాను చాలా స్మృతి చేయాలి. పూర్తి కల్పమంతా దైహిక తండ్రిని గుర్తు చేసారు. ఇప్పుడు తండ్రి వచ్చారు మరియు మనుష్య సృష్టి నుండి ఆత్మలందరినీ తిరిగి తీసుకువెళ్తారు ఎందుకంటే రావణ రాజ్యములో మనుష్యుల దుర్గతి జరిగింది, అందుకే ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడు ఇది రావణ రాజ్యము అని కూడా మనుష్యులెవ్వరూ అర్థం చేసుకోరు. రావణుడి యొక్క అర్థాన్నే అర్థం చేసుకోరు. కేవలం దసరా పండుగను జరుపుకోవడమనేది ఒక ఆచారము అయిపోయింది. మీకు దాని అర్థమేమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఇతరులకు అర్థం చేయించేందుకు మీకు ఆ జ్ఞానము లభించింది. ఒకవేళ ఇతరులకు అర్థం చేయించలేకపోతున్నారు అంటే స్వయమూ కూడా అర్థం చేసకోలేదన్నట్లే. తండ్రిలో సృష్టి చక్రము యొక్క జ్ఞానము ఉంది. మనము వారి పిల్లలము కావున పిల్లల్లో కూడా ఈ జ్ఞానము ఉండాలి.

ఇది మీ గీతా పాఠశాల. ఇక్కడ లక్ష్యము ఏమిటి? ఈ లక్ష్మీ-నారాయణులుగా తయారవ్వడము. ఇది రాజయోగము కదా. నరుడి నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యేటువంటి జ్ఞానము ఇది. వారు కూర్చుని కథలు వినిపిస్తారు. ఇక్కడైతే మనము చదువుకుంటాము, మనకు తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది కల్పము యొక్క సంగమయుగములోనే నేర్పిస్తారు. తండ్రి అంటారు, నేను పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని తయారుచేయడానికి వచ్చాను. కొత్త ప్రపంచములో వీరి రాజ్యము ఉండేది, పాత ప్రపంచములో అది లేదు, మళ్ళీ తప్పకుండా ఉండాలి. చక్రమునైతే తెలుసుకున్నారు. ముఖ్యమైన ధర్మాలు నాలుగు. ఇప్పుడు దేవతా ధర్మము లేదు. దైవీ ధర్మ భ్రష్టులుగా మరియు దైవీ కర్మ భ్రష్టులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీకు దైవీ ధర్మ శ్రేష్ఠులుగా మరియు కర్మ శ్రేష్ఠులుగా అవ్వడము నేర్పిస్తున్నారు. కావున స్వయంపై శ్రద్ధ పెట్టాలి, మా ద్వారా ఎటువంటి ఆసురీ కర్మలైతే జరగడం లేదు కదా? మాయ కారణముగా ఎటువంటి చెడు ఆలోచనలైతే బుద్ధిలోకి రావడం లేదు కదా? చెడు దృష్టి అయితే ఉండటం లేదు కదా? వీరికి చెడు దృష్టి వెళ్తుంది అని గమనిస్తే అనగా చెడు ఆలోచనలు వస్తే అప్పుడు వారిని వెంటనే అప్రమత్తం చేయాలి. వారితో కలిసిపోకూడదు. మీలో మాయ ప్రవేశించిన కారణముగా ఇటువంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి అని వారిని అప్రమత్తం చేయాలి. యోగములో కూర్చున్నప్పుడు తండ్రి స్మృతికి బదులుగా ఎవరి దేహము వైపుకైనా ఆలోచనలు వెళ్తున్నాయి అంటే - మాయ దాడి జరుగుతుందని, నేను పాపము చేస్తున్నానని అర్థం చేసుకోవాలి. ఇందులోనైతే బుద్ధి చాలా శుద్ధముగా ఉండాలి. పరిహాసమాడటం వలన కూడా చాలా నష్టము జరుగుతుంది, అందుకే మీ నోటి నుండి సదా శుద్ధమైన మాటలే వెలువడాలి, చెడు మాటలు కాదు. పరిహాసమాడటం మొదలైనవి కూడా చేయకూడదు. మేము సరదాగా అలా అన్నాము అని అనడం కాదు... అది కూడా నష్టదాయకమవుతుంది. పరిహాసము కూడా అందులో వికారాల వాయువు ఉండే విధంగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసు, వివస్త్రగా ఉండే సన్యాసులు ఉంటారు, వారి ఆలోచనలు వికారాల వైపు వెళ్ళవు. వారు ఉండడం కూడా వేరుగా ఉంటారు. కానీ కర్మేంద్రియాల చంచలత్వము కేవలం యోగము ద్వారా తప్ప ఇంకే విధంగానూ తొలగదు. కామమనే శత్రువు ఎటువంటిదంటే, దాని వలన ఎవరినైనా చూసినప్పుడు, యోగములో పూర్తిగా లేకపోతే తప్పకుండా చంచలత్వము ఉత్పన్నమవుతుంది. స్వయాన్ని పరీక్షించుకోవలసి ఉంటుంది. తండ్రి స్మృతిలోనే ఉన్నట్లయితే ఈ రకమైన రోగాలేవీ ఉండవు. యోగములో ఉన్నట్లయితే ఇలా జరగదు. సత్యయుగములోనైతే ఏ రకమైన చెత్త ఉండదు. అక్కడ చంచలత్వము ఉత్పన్నమవ్వడానికి రావణుడి యొక్క చంచలత్వమే ఉండదు. అక్కడైతే యోగీ జీవితము ఉంటుంది. ఇక్కడ కూడా అవస్థ చాలా పక్కాగా ఉండాలి. యోగబలముతో ఈ రోగాలన్నీ సమాప్తమైపోతాయి. ఇందులో చాలా శ్రమ ఉంది. రాజ్యము తీసుకోవడమనేది అంత సులువైన విషయమేమీ కాదు. పురుషార్థమైతే చేయాలి కదా. భాగ్యములో ఏదుంటే అదే లభిస్తుంది అని కాదు. ధారణయే చేయకపోతే పైసా అంత విలువ చేసే పదవి పొందేందుకు యోగ్యులవుతారు. సబ్జెక్టులు అయితే చాలా ఉంటాయి కదా. కొందరు చిత్రలేఖనములో, కొందరు ఆటలలో మార్కులు తీసుకుంటారు. అవి సాధారణమైన సబ్జెక్టులు. అదే విధంగా ఇక్కడ కూడా సబ్జెక్టులు ఉన్నాయి. ఏదో ఒకటైతే లభిస్తుంది. కానీ రాజ్యాధికారము లభించదు. సేవ చేస్తే అప్పుడే రాజ్యాధికారము లభిస్తుంది. దాని కోసం చాలా కృషి చేయాలి. చాలామంది బుద్ధిలో కూర్చొనే కూర్చోదు. ఆహారము జీర్ణమవ్వటం లేదన్నట్లుగా ఉంటుంది. ఉన్నత పదవిని పొందే ధైర్యము లేకపోతే, దీనిని కూడా అనారోగ్యమనే అంటారు కదా. మీరు ఏ విషయాన్ని అయినా చూస్తూ కూడా చూడకండి. ఆత్మిక తండ్రి యొక్క స్మృతిలో ఉంటూ ఇతరులకు మార్గాన్ని తెలియజేయాలి, అంధులకు చేతికర్రగా అవ్వాలి. మీకైతే మార్గము తెలుసు. మహారథులు ఎవరెవరైతే ఉన్నారో, వారి బుద్ధిలో రచయిత మరియు రచన, ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క జ్ఞానము తిరుగుతూ ఉంటుంది. పిల్లల అవస్థలో కూడా రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. కొందరు చాలా ధనవంతులుగా అవుతారు, కొందరు పూర్తిగా నిరుపేదలుగా అవుతారు. రాజ్య పదవిలోనైతే వ్యత్యాసము ఉంటుంది కదా. ఇకపోతే అక్కడ రావణుడు లేని కారణముగా దుఃఖము ఉండదు. కానీ సంపదలోనైతే తేడా ఉంటుంది. సంపదతో సుఖము ఉంటుంది.

ఎంతగా యోగములో ఉంటారో అంతగా ఆరోగ్యము చాలా బాగుంటుంది. కృషి చేయాలి. చాలామంది నడవడిక అజ్ఞానీ మనుష్యుల నడవడిక వలె ఉంటుంది. వారు ఎవరి కళ్యాణమును చేయలేరు. పరీక్ష జరిగినప్పుడు ఎవరు ఎన్ని మార్కులతో పాస్ అవుతారు అనేది తెలిసిపోతుంది, అప్పుడు ఆ సమయములో అయ్యో-అయ్యో అని అనవలసి వస్తుంది. బాప్ దాదా ఇరువురూ ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి వచ్చిందే కళ్యాణము చేసేందుకు. స్వయం యొక్క కళ్యాణము కూడా చేసుకోవాలి, అలాగే ఇతరుల కళ్యాణము కూడా చేయాలి. మీరు వచ్చి పతితులైన మాకు పావనముగా అయ్యే మార్గాన్ని తెలియజేయండి అనే తండ్రిని పిలిచారు. కావున తండ్రి శ్రీమతము ఇస్తున్నారు - మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహాభిమానాన్ని వదిలి నన్ను స్మృతి చేయండి. ఇది ఎంతటి సహజమైన ఔషధము. మీరు చెప్పండి, మేము కేవలం ఒక్క భగవంతుడైన తండ్రిని మాత్రమే నమ్ముతాము. వారు అంటారు - మీరు వచ్చి పతితులను పావనముగా చేయండి అని నన్ను పిలుస్తారు కావున నేను రావలసి ఉంటుంది. బ్రహ్మా నుండి మీకు ఏమీ లభించేది లేదు. వారు పెద్ద అన్నయ్య, వారు తండ్రి కూడా కాదు. తండ్రి నుండైతే వారసత్వము లభిస్తుంది. బ్రహ్మా నుండి వారసత్వము లభించదు. నిరాకారుడైన తండ్రి వీరి ద్వారా దత్తత తీసుకుని ఆత్మలైన మనల్ని చదివిస్తారు. వీరిని కూడా చదివిస్తారు. బ్రహ్మా నుండైతే ఏమీ లభించేది లేదు. వారసత్వము తండ్రి నుండే లభిస్తుంది, వీరి ద్వారా లభిస్తుంది. ఇచ్చేవారు ఒక్కరే. వారికే మహిమ ఉంది. వారే సర్వుల సద్గతిదాత. వీరైతే పూజ్యుడి నుండి మళ్ళీ పూజారిగా అవుతారు. సత్యయుగములో ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు అనుభవించి ఇప్పుడు పతితముగా అయ్యారు, మళ్ళీ పూజ్యునిగా, పావనముగా అవుతున్నారు. మనము తండ్రి నుండి వింటాము. మనుష్యులెవ్వరి నుండి వినడం లేదు. మనుష్యులది భక్తి మార్గము. ఇది ఆత్మిక జ్ఞాన మార్గము. జ్ఞానము కేవలం ఒక్క జ్ఞాన సాగరుడి వద్ద మాత్రమే ఉంది. మిగిలిన ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. శాస్త్రాలు మొదలైనవి చదవడము - ఇదంతా భక్తి మార్గము. జ్ఞాన సాగరుడైతే ఒక్క తండ్రి మాత్రమే, జ్ఞాన నదులైన మనము జ్ఞాన సాగరుడి నుండి వెలువడ్డాము. మిగిలిన అవన్నీ నీటి సాగరము మరియు నదులు. పిల్లలకు ఈ విషయాలన్నింటి పట్ల ధ్యాస ఉండాలి. అంతర్ముఖులై బుద్ధిని నడిపించవలసి ఉంటుంది. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు అంతర్ముఖులై స్వయాన్ని చెక్ చేసుకోండి. ఒకవేళ నోటి నుండి ఏవైనా చెడు మాటలు వెలువడినా లేదా చెడు దృష్టి వెళ్ళినా మీకు మీరు చివాట్లు పెట్టుకోండి - నా నోటి నుండి చెడు మాటలు ఎందుకు వెలువడ్డాయి, నాకు చెడు దృష్టి ఎందుకు వెళ్ళింది? స్వయానికి చెంపదెబ్బ కూడా వేసుకోవాలి, ఘడియ-ఘడియ అప్రమత్తం చేసుకోవాలి, అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు. నోటి నుండి కఠినమైన మాటలు రాకూడదు. తండ్రి అయితే అన్ని రకాల శిక్షణలను ఇవ్వవలసి ఉంటుంది. ఎవరినైనా పిచ్చివాడు అని అనడం, ఇది కూడా చెడు మాటే.

మనుష్యులైతే ఎవరి గురించి ఏది తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు. మేము ఎవరి మహిమను గానం చేస్తున్నాము అనేది ఏమీ తెలియదు. మహిమ అయితే ఒక్క పతిత-పావనుడైన తండ్రినే చేయాలి. ఇంకెవ్వరూ లేనే లేరు. బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా పతిత-పావనా అని అనరు. వీళ్ళు ఎవ్వరినీ పావనముగా తయారుచేయరు. పతితము నుండి పావనముగా తయారుచేసేవారు ఒక్క తండ్రియే. పావన సృష్టి అనేది కొత్త ప్రపంచములోనే ఉంది. అది ఇప్పుడు లేదు. పవిత్రత ఉన్నదే స్వర్గములో. వారు పవిత్రతా సాగరుడు కూడా. ఇది ఉన్నదే రావణ రాజ్యము. పిల్లలు ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా కృషి చేయవలసి ఉంటుంది. నోటి నుండి ఎటువంటి రాయి లాంటి మాటలు లేదా చెడు మాటలు వెలువడకూడదు. చాలా ప్రేమగా నడుచుకోవాలి. చెడు దృష్టి కూడా చాలా నష్టము కలిగిస్తుంది. చాలా కృషి చేయాలి. ఆత్మాభిమానమే అవినాశీ అభిమానము. దేహమైతే వినాశీ అయినది. ఆత్మ గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మకు కూడా తండ్రి అనేవారు ఎవరో ఉంటారు కదా. అందరూ పరస్పరం సోదరులేనని అంటారు కూడా. మరి అందరిలోనూ పరమాత్ముడైన తండ్రి ఎలా విరాజమానమై ఉంటారు? అందరూ తండ్రులు ఎలా అవుతారు? ఈ మాత్రము తెలివి కూడా లేదు! అందరి తండ్రి అయితే ఒక్కరే, వారి నుండే వారసత్వము లభిస్తుంది. వారి పేరు శివ. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. రుద్ర రాత్రి లేక శ్రీకృష్ణ రాత్రి అని అనరు. మనుష్యులైతే ఏమీ అర్థం చేసుకోరు, ఇవన్నీ వారి రూపాలే, వారి లీలలే అని అంటారు.

అనంతమైన తండ్రి నుండైతే అనంతమైన వారసత్వము లభిస్తుంది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కావున ఆ తండ్రి యొక్క శ్రీమతముపై నడవాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. కూలి పని చేసేవారికి కూడా శిక్షణను ఇవ్వాలి, తద్వారా వారి కళ్యాణము కూడా జరుగుతుంది. కానీ స్వయమే స్మృతి చేయలేకపోతే ఇక ఇతరులకు ఏం స్మృతిని ఇప్పిస్తారు. రావణుడు పూర్తిగా పతితముగా చేసేస్తాడు. మళ్ళీ తండ్రి వచ్చి స్వర్గవాసులుగా తయారుచేస్తారు. ఇది అద్భుతము కదా. ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. ఈ లక్ష్మీ-నారాయణులు ఎంతటి ఉన్నతమైన స్వర్గవాసుల నుండి ఎంతటి పతితులుగా అయిపోతారు, అందుకే బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి అని అంటూ ఉంటారు. శివుని మందిరాలలో మీరు ఎంతో సేవ చేయవచ్చు. తండ్రి అంటారు, మీరు నన్ను స్మృతి చేయండి. ప్రతి ముంగిట భ్రమించడము ఆపు చేయండి. ఈ జ్ఞానము శాంతికి సంబంధించినది. తండ్రిని స్మృతి చేయడము ద్వారా మీరు సతోప్రధానముగా అయిపోతారు. కేవలం ఈ మంత్రాన్నే ఇస్తూ ఉండండి. పక్కా అవ్వనంత వరకు ఎవరి నుండి ధనము తీసుకోకూడదు. వారికి ఇలా చెప్పండి - మేము పవిత్రముగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేయండి, అప్పుడు మేము మీ చేతితో తయారుచేసినది తినవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. భారత్ లో మందిరాలైతే చాలా ఎక్కువ ఉన్నాయి. విదేశీయులు మొదలైనవారు ఎవరు వచ్చినా కూడా వారికి మీరు - తండ్రిని స్మృతి చేయండి అన్ని ఈ సందేశాన్ని ఇవ్వవచ్చు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎప్పుడూ కూడా వికారాల వాయువు ఉండేలా పరిహాసమాడకూడదు. స్వయాన్ని చాలా అప్రమత్తముగా ఉంచుకోవాలి, నోటి నుండి కఠినమైన మాటలు రానివ్వకూడదు.

2. ఆత్మాభిమానులుగా అయ్యే ప్రాక్టీస్ చాలా-చాలా చేయాలి. అందరితో ప్రేమగా నడుచుకోవాలి. చెడు దృష్టి పెట్టుకోకూడదు. చెడు దృష్టి వెళ్లినట్లయితే తమను తామే శిక్షించుకోవాలి.

వరదానము:-
నిరంతర స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బాల్యపు చేష్టలను సమాప్తము చేసే వానప్రస్థీ భవ

చిన్న-చిన్న విషయాలలో సంగమము యొక్క అమూల్య సమయాన్ని పోగొట్టుకోవడమనేది బాల్యపు చేష్టల వంటిది. ఇప్పుడు ఈ బాల్యపు చేష్టలు శోభించవు, వానప్రస్థములో కేవలం ఒకటే కార్యము ఉంటుంది - తండ్రి స్మృతి మరియు సేవ. ఇది తప్ప ఇంకెవ్వరూ కూడా గుర్తు రాకూడదు, లేచినా కూడా స్మృతి మరియు సేవ, నిద్రించినా కూడా స్మృతి మరియు సేవ - నిరంతరము ఈ బ్యాలెన్స్ ఉండాలి. త్రికాలదర్శులుగా అయి బాల్యపు విషయాలు మరియు బాల్యపు సంస్కారాల యొక్క సమాప్తి సమారోహాన్ని జరుపుకోండి, అప్పుడు వానప్రస్థీ అని అంటారు.

స్లోగన్:-
సర్వ ప్రాప్తులతో సంపన్నమైన ఆత్మకు గుర్తు సంతుష్టత, సంతుష్టముగా ఉండండి మరియు సంతుష్టము చేయండి.

అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

ఏకాంతము అనేది ఒకటి స్థూలమైనది ఉంటుంది, ఇంకొకటి సూక్ష్మమైనది కూడా ఉంటుంది. ఏకాంతములోని ఆనందము యొక్క అనుభవీలుగా అవ్వండి, అప్పుడు బాహ్యముఖత మంచిగా అనిపించదు. అవ్యక్త స్థితిని పెంచుకోవడానికి ఏకాంతము పట్ల అభిరుచి ఉంచుకోవాలి. ఏకతతో పాటు ఏకాంతప్రియులుగా అవ్వాలి.