‘‘జన్మదినము రోజున ఫాస్ట్ సో ఫస్ట్ డివిజన్ లోకి
వచ్చే కానుకను తీసుకోవడానికి ప్రతి శ్వాస, సంకల్పము సమర్థముగా
ఉండాలి, హృదయము విశాలముగా మరియు సత్యముగా ఉండాలి, అప్పుడు ప్రతి
అవసరము పూర్తవుతుంది’’
ఈ రోజు జీరో అయిన తండ్రి తమ హీరో పిల్లలను కలుసుకునేందుకు
వచ్చారు. ఈ రోజున మీరందరూ బాబా జన్మదినాన్ని మరియు మీ
జన్మదినాన్ని కూడా జరుపుకోవడానికి వచ్చారు. బాప్ దాదా
పిల్లలందరికీ, సమ్ముఖములో కూర్చున్నవారికైనా లేక దూరముగా
కూర్చుని హృదయానికి సమీపముగా కూర్చున్నవారికైనా, నలువైపులా
ఉన్న పిల్లలకు సర్వ సంబంధాలతో అభినందనలను తెలియజేస్తున్నారు.
అందులోనూ విశేషముగా మూడు అభినందనలు - తండ్రి, శిక్షకుడు మరియు
సద్గురువు రూపాలలో పాలన, చదువు మరియు వరదానాలతో నలువైపులా ఉన్న
పిల్లలకు మూడు అభినందనలను విశేషముగా ఇస్తున్నారు. పిల్లలందరికీ
అభినందనలు, అభినందనలు, అభినందనలు.
ఈ రోజు ఈ విశేష జన్మను భక్తులు కూడా జరుపుకుంటారు. కానీ ఈ
జన్మదినము తండ్రి మరియు పిల్లల యొక్క అవినాశీ స్నేహముతో కూడిన
జన్మదినము అని పిల్లలైన మీకు తెలుసు. ఆది నుండి మొదలుకుని
తండ్రి మరియు పిల్లలు కలిసి ఉన్నారు. అలాగే విశ్వ పరివర్తనా
కార్యములో కూడా బాబా పిల్లలతో పాటు ఉన్నారు, ఎందుకంటే తండ్రికి
మరియు పిల్లలకు మధ్యన చాలా-చాలా స్నేహము ఉంది. ఇప్పుడు కూడా
కలిసి ఉన్నాము మరియు మన ఇంటికి వెళ్ళాలన్నా కూడా కలిసే వెళ్ళాలి.
బాబా తమ పిల్లలు లేకుండా వెళ్ళలేరు మరియు పిల్లలు బాబా లేకుండా
వెళ్ళలేరు ఎందుకంటే హృదయపూర్వక స్నేహము తోడుగా ఉంది. ఇంటికి
వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే రాజ్యములోకి వస్తారో, అప్పుడు కూడా
బ్రహ్మాబాబాతో పాటు కలిసి-కలిసి రాజ్యము చేస్తారు. అన్ని
జన్మలలో కల్లా ఈ జన్మ అన్నింటికంటే ప్రియమైనది మరియు అతీతమైనది.
ఈ జన్మకు ఏదైతే విలువ ఉందో, అది పూర్తి కల్పములో 84 జన్మలలోనూ
లేదు. ఇటువంటి స్నేహపూర్వకమైన మరియు కలిసి ఉండే విశేషమైన వజ్ర
సమానమైన జన్మ ఇది. మరి మీరందరూ మీ జన్మదినాన్ని జరుపుకోవడానికి
వచ్చారా లేక బాబా జన్మదినాన్ని జరపడానికి వచ్చారా! లేక బాబా తన
పిల్లలది జరపడానికి మరియు పిల్లలు బాబాది జరపడానికి వచ్చారా?
నలువైపులా భక్తులు కూడా శివ జయంతిని లేక శివరాత్రిని
జరుపుకుంటారు, ఎంతో ప్రేమతో జరుపుకుంటారు. బాప్ దాదా భక్తులను
చూసి భక్తులకు కూడా భక్తి ఫలితాన్ని ఇస్తున్నారు. కానీ మీరు
జరుపుకోవడానికి మరియు భక్తులు జరుపుకోవడానికి తేడా ఉంది. వారు
రాత్రివేళ జరుపుకుంటారు మరియు మీరు అమృతవేళ జరుపుకుంటారు.
అమృతవేళ శ్రేష్ఠమైన వేళ. అమృతవేళలోనే బాప్ దాదా ప్రతి బిడ్డ
యొక్క జోలెను వరదానాలతో నింపుతారు. అందరి జోలె వరదానాలతో నిండి
ఉంది కదా! ప్రతిరోజూ వరదాత అయిన తండ్రి నుండి వరదానము లభిస్తూనే
ఉంటుంది. ఎన్నెన్ని వరదానాలు ప్రతి బిడ్డకు బాప్ దాదా ద్వారా
లభించాయి. ఆ వరదానాలతో జోలె నిండి ఉంది కదా! అందరూ ఎంతో
ఉల్లాస-ఉత్సాహాలతో చేరుకున్నారు. బాప్ దాదా కూడా పిల్లలను చూసి
చాలా-చాలా సంతోషిస్తున్నారు మరియు వాహ్ పిల్లలు వాహ్ అంటూ పాట
పాడుతూ ఉంటారు. పిల్లలు - వాహ్ బాబా వాహ్ అని అంటారు మరియు బాబా
- వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. ఎందుకంటే ఎవరెవరైతే బాబా
పిల్లలుగా అయ్యారో, వారంతా కోట్లలో కొద్దిమంది అయిన ఆత్మలు.
విశ్వములో ఎన్ని కోట్లమంది ఆత్మలు ఉన్నారు కానీ వారందరిలోనూ
పిల్లలైన మిమ్మల్ని బాబా లక్కీ మరియు లవ్లీ పిల్లలు అని అంటారు.
ఆ కోట్లాదిమందిలో మీరు కొద్దిమంది పిల్లలు. ప్రతి కల్పము
కోట్లలో కొద్దిమంది అయిన పిల్లలము మేమే అన్న నషా ఉందా. వర్తమాన
సమయములో కూడా పెద్ద-పెద్ద పదవులు కలవారు ఉన్నారు కానీ బాబాను
గుర్తించి బాబా జన్మదినాన్ని జరుపుకునేవారు, నలువైపులా బాబాను
గుర్తించిన పిల్లలు కోట్లలో కొద్దిమందే ఉన్నారు. కనుక మేము
కోట్లలో కూడా కొద్దిమంది పిల్లలమే అన్న సంతోషము ఉందా! నషా ఉందా!
చేతులెత్తండి. అవినాశీ నషా ఉంది కదా! నషా అప్పుడప్పుడూ ఉండటము
కాదు కదా? సదా ఉంది మరియు సదా ఉంటుంది. మాయ పరీక్షనైతే
తీసుకుంటుంది, అనుభవము ఉంది కదా! మాయకు కూడా పరమాత్ముని
పిల్లలపై ఎక్కువ ప్రేమ ఉంది. మాయకు పరమాత్ముని పిల్లలతో ఆది
నుండి ఇప్పటివరకు సంబంధం ఉంది అని పిల్లలకు తెలుసు. మాయకు మరియు
పరమాత్ముని పిల్లలకు, ఇద్దరికీ పరస్పరములో సంబంధము ఉంది, కానీ
మాయ పని రావడము మరియు పిల్లలైన మీ పని ఏమిటి? మాయను దూరము నుండే
పారద్రోలడము. మాయను రానివ్వకండి లేక రానిస్తూ ఉంటారు కూడానా?
వద్దు. దూరము నుండే పారద్రోలండి. దానిని రానిస్తే దానికి రావడము
అలవాటైపోతుంది. రానిస్తున్నారు కదా, వెళ్దాములే అని అది కూడా
అనుకుంటుంది. కానీ బాబా ఏమి చూసారంటే, కొంతమంది పిల్లలు మాయను
రానిస్తారు, అంతేకాక దానికి ఆతిథ్యము కూడా చేస్తారు. మంచినీరు,
టీ ఇస్తారు, ఎటువంటి ఆతిథ్యాన్ని ఇస్తారో తెలుసా? మాయ
ప్రభావములోకి వచ్చి ఎలా ఆలోచిస్తారంటే - ఇప్పుడైతే ఇంకా టూ లేట్
బోర్డు పెట్టలేదు కదా, ఇప్పుడింకా సమయము ఉంది, పురుషార్థము
చేస్తున్నాము కదా, చేరుకుంటాములే అని ఆలోచిస్తారు. అప్పుడు మాయ
కూడా ఏమనుకుంటుందంటే, ఒకటేమో నన్ను రానిచ్చారు, అంతేకాక వీరు
నాకు సహాయము చేస్తున్నారు, ఆతిథ్యాన్ని ఇస్తున్నారు అని
అనుకుంటుంది. కొంతమంది పిల్లలు మాయను గుర్తిస్తారు, కానీ
కొంతమంది పిల్లలు మాయను గుర్తించడములో కూడా పొరపాటు చేస్తుంటారు.
అది మాయ మతమా లేక బాబా మతమా అని గుర్తించలేని కారణముగా మాయ
ప్రభావములోకి వచ్చేస్తుంటారు. కానీ బాప్ దాదా తమ లక్కీ, మహావీర
మరియు విజయీ పిల్లలకు చెప్తున్నారు - మాయను రానివ్వకండి, అది
రావడము మరియు దానిని పారద్రోలడము, అందులో సమయాన్ని కేటాయించకండి
ఎందుకంటే సమయము తక్కువగా ఉంది మరియు మీరేదైతే ప్రతిజ్ఞ చేసారో
- విశ్వ పరివర్తకులుగా అయి, విశ్వ సేవకులుగా అయి విశ్వాత్మలకు
బాబా పరిచయాన్ని ఇచ్చి ముక్తి వారసత్వాన్ని ఇప్పిస్తాము అని, ఆ
కార్యము ఇప్పుడింకా పూర్తి అవ్వలేదు. ఆ కార్యాన్ని సమాప్తము
చెయ్యడానికి సమయాన్ని కేటాయించండి, ఒకవేళ మాయను పారద్రోలడములో
సమయాన్ని కేటాయిస్తే విశ్వ పరివర్తకులము అన్న ప్రతిజ్ఞను ఎలా
పూర్తి చేస్తారు! మీరు బాబాకు సహచరులు కదా. ఇప్పుడు కూడా తోడుగా
ఉంటాము, తోడుగా నడుస్తాము... అని జన్మించగానే ప్రతిజ్ఞ చేసారు.
కావున ఇప్పుడు బాబా నుండి ఏ శక్తులైతే లభించాయో, ఆ శక్తుల
ఆధారముగా మాయను దూరము నుండే పారద్రోలండి. ఇందులో సమయాన్ని
వెచ్చించకండి. చూడండి, 70 సంవత్సరాలు బట్టి పురుషార్థము చేస్తూ
ఉన్నారు, ఇప్పుడు మాయ రావడము మరియు దానిని పారద్రోలడము, ఇప్పుడు
అంత సమయము లేదు ఎందుకంటే మీకు తెలుసు కూడా, మీరు నాలెడ్జ్ ఫుల్
కదా! మొత్తము డ్రామా యొక్క జ్ఞానము ఉంది. అందుకే నాలెడ్జ్ ఫుల్
పిల్లలూ - ఇప్పుడు సమయాన్ని ఎందులో వెచ్చించాలి? రెండు ఖజానాలను
చాలా జమ చేసుకోవాలి. ఏ రెండు ఖజానాలను? ఒకటి సంకల్పాలు మరియు
రెండు సమయము. రెండు ఖజానాలూ గొప్పవే మరియు ఇది మీ అందరికీ
తెలుసు ఎందుకంటే మీరు నాలెడ్జ్ ఫుల్ తండ్రి యొక్క నాలెడ్జ్ ఫుల్
పిల్లలు. మీరు మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ కదా! మీరు నాలెడ్జ్ ఫుల్
(జ్ఞాన సంపన్నమైన ఆత్మ), నాలెడ్జబుల్ (జ్ఞానవంతమైన ఆత్మ) కాదు.
(నాలెడ్జబుల్ ఆత్మ, జ్ఞానవంతమైన ఆత్మ అనగా అపారమైన జ్ఞానాన్ని
పొందినవారు; నాలెడ్జ్ ఫుల్ ఆత్మ, జ్ఞానసంపన్న ఆత్మ అనగా ఆ
జ్ఞానాన్ని జీవితములో ఆచరణలోకి తీసుకువచ్చి ఆ జ్ఞానము యొక్క
సాకార స్వరూపముగా మారినవారు). కొందరు నాలెడ్జబుల్ గా ఉన్నారు,
నాలెడ్జ్ ఫుల్ గా లేరు . మీరు ఎవరు? నాలెడ్జ్ ఫుల్ కదా.
చేతులెత్తండి. నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారా లేక నాలెడ్జబుల్ గా
ఉన్నారా? అందరూ నాలెడ్జ్ ఫుల్ గానే ఉన్నారా? చేతులెత్తారు.
మంచిది. వాహ్! ఫుల్ నాలెడ్జ్ వచ్చేసిందా! మాయను పారద్రోలే
నాలెడ్జ్ ఉందా? వెనుక కూర్చున్నవారికి ఉందా? అచ్ఛా. జెండాలైతే
ఊపుతున్నారు. మాతలకు ఉందా? మాతలు నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారా?
డబుల్ విదేశీయులు! డబుల్ విదేశీయులు కూడా జెండాలు ఊపుతున్నారు.
అచ్ఛా, చూడండి, ఎంత మంచి దృశ్యము! జెండాలైతే మంచిగా
అనిపిస్తున్నాయి. మరి నాలెడ్జ్ ఫుల్ అనగా మాయను దూరము నుండే
పారద్రోలేవారు. మరి అలా ఉన్నారా? ఎందుకంటే బాప్ దాదా ముందుగానే
చెప్పి ఉన్నారు - ఖజానాలను జమ చేసుకునే బ్యాంక్ కేవలం ఈ సమయములో,
సంగమయుగములోనే ఉంది, ఆ తర్వాత పూర్తి కల్పములో జమ చేసుకునే
బ్యాంక్ లభించదు. ఇప్పుడు ఏదైతే జమ చేసుకున్నారో, అది కార్యములో
ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ జమ చేసుకునే బ్యాంక్ ఇప్పుడు
సంగమయుగములో తెరుచుకుంటుంది, అందుకే మీరేమంటారు! అందరికీ
సందేశములో వినిపిస్తారు కదా - ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు.
మరి మీ అందరికీ గుర్తుంది కదా! ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు.
ఇది సదా గుర్తుంటుందా? ఎందుకంటే సంగమయుగ జన్మ అన్నింటికంటే
చిన్ననిది కానీ ఇది అమూల్యమైన జన్మ. ఈ జన్మకు ఉన్న విలువ పూర్తి
కల్పమంతా నడుస్తుంది. మరి మా జమ ఖాతా ఎంత ఉందని చెక్
చేసుకుంటున్నారా? ఎంత కోరుకుంటున్నారో అంత జమ అవుతుందా?
ఎందుకంటే బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నారు - ఇప్పుడు
నడిచే సమయము సమాప్తమయ్యింది, ఇది ఎగిరే సమయము. పురుషార్థము చేసే
సమయము పూర్తయింది, ఇప్పుడు ఇది తీవ్ర పురుషార్థము చేసే సమయము,
అది కూడా కొద్దిగానే ఉంది. అందుకే బాప్ దాదా డబుల్ విదేశీయులకు
డబుల్ తీవ్ర పురుషార్థులు అన్న టైటిల్ ను ఇచ్చారు. మరి చెప్పండి,
డబుల్ తీవ్ర పురుషార్థులేనా! చేతులెత్తండి. డబుల్ తీవ్ర
పురుషార్థులా, పక్కానా! అచ్ఛా. బాప్ దాదా జన్మదిన శుభాకాంక్షలతో
పాటు మీకు అభినందనలను కూడా అందిస్తున్నారు. పదమాల పదమాల రెట్లు
అభినందనలు, అభినందనలు, అభినందనలు.
బాప్ దాదా చూసారు - ఓ.కే. గురించి బాప్ దాదా ఏదైతే హోమ్
వర్క్ ఇచ్చారో, దాని పట్ల కొంతమంది పిల్లలు అటెన్షన్ పెట్టారు
కానీ 100 మార్కులు చాలా కొద్దిమందికి మాత్రమే వచ్చాయి. 50 శాతము
వారు ఎక్కువగా ఉన్నారు. కానీ బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే,
ఏమి కోరుకుంటున్నారో వినిపించమంటారా? బాప్ దాదాకు ఆశా దీపాలైన
ప్రతి ఒక్కరి పట్ల, ఆశలను సంపన్నము చేసే మహావీరులైన పిల్లల
పట్ల బాబాకు ఇదే ఆశ ఉంది, ఏమిటంటే, సమయమనుసారముగా ఒకవేళ
ఇప్పటినుండే బహుకాలపు తీవ్ర పురుషార్థము యొక్క చార్టును జమ
చేసుకోకపోతే మరి ఇంకెప్పుడు చేసుకుంటారు! బాప్ దాదా
ఎప్పటికప్పుడు మూడు పదాలను గుర్తు తెప్పిస్తున్నారు - ఒకటి
అకస్మాత్తు, రెండవది ఎవర్రెడీ మరియు మూడవది బహుకాలముగా ఖాతాను
జమ చేసుకోవడము, ఎందుకంటే బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే,
పిల్లలు తమ రాజ్యములో మొదటి జన్మ నుండి 21 జన్మల అంతిమము వరకు
పూర్తి రాజ్యభాగ్యానికి అధికారులుగా అవ్వాలి. మా రాజ్యము ఇక
వచ్చేసినట్లే అని ఇప్పుడైతే ఈ సంతోషము ఉంది కదా. బాబా వచ్చారు
అని ఇప్పుడు ఏ విధముగా సందేశాన్ని ఇస్తున్నారో, అదే విధముగా తమ
దైవీ రాజ్యము, సుఖశాంతిమయ రాజ్యము వచ్చేసినట్లే అని అందరికీ ఈ
శుభవార్తను కూడా ఇస్తారు. మరి అందరికీ ఈ సందేశము ఇస్తున్నప్పుడు,
మీ పురుషార్థము కూడా తీవ్రముగా, బహుకాలము నుండి జమ చేసుకునేదిగా
ఉండాలి. ఈ లెక్కను బహుకాలము స్మృతిలో ఉంచుకోండి ఎందుకంటే కొత్త
ఇంటిలోనే మజా ఉంటుంది. ఒకవేళ రెండు, మూడు జన్మల తర్వాత వస్తే,
రెండు మూడు నెలల ఇంటిని ఏమనంటారు! కొత్తదనా లేక 3 నెలలదంటారా?
కావున బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే - బాప్ దాదా యొక్క
ఒక్కొక్క ప్రియమైన బిడ్డ, వాహ్ వాహ్ బిడ్డ, హృదయ సింహాసనాధికారి
బిడ్డ, మొదటి జన్మలో బ్రహ్మాబాబాకు సహవాసిగా అయి రావాలి.
ఇష్టమేనా! ఇష్టమేనా? ఇష్టమైనా? అచ్ఛా. మరి ఏమి చెయ్యవలసి
ఉంటుంది? ఏదో అయితే చెయ్యవలసే ఉంటుంది కదా. ఇష్టమే కదా, బాబాకు
కూడా ఇష్టమే, కానీ ఏమి చెయ్యవలసి ఉంటుంది? ఇప్పటినుండి, పోనీ
అయిపోయిందేదో అయిపోయింది, బాప్ దాదా క్షమించేస్తున్నారు,
అయిపోయిందిలే. ఇప్పటినుండి జన్మదిన కానుకగా బాబాకు ఏమి ఇస్తారు?
బాబాకు ఏదో ఒక కానుకనైతే ఇస్తారు కదా. బాబా జన్మదినాన్ని
జరపడానికి వచ్చారు, మరి బాబాకు ఏ కానుకను ఇస్తారు? బాబాకు
పిల్లలందరి పట్ల ఉన్న ఆశ ఏమిటంటే, ఇప్పుడు ఈ లాస్ట్ సమయములో
కూడా ఫాస్ట్ గా వెళ్ళవచ్చు అని. మొదటిసారి వచ్చినవారు
చేతులెత్తండి. అచ్ఛా.
బాప్ దాదా లాస్ట్ లో వచ్చే పిల్లలకు, మొదటిసారి వచ్చినందుకు
అభినందనలను తెలియజేస్తున్నారు. కానీ ఒక భాగ్యము గురించి కూడా
చెప్తున్నారు. మీకు భాగ్యము తయారుచేసుకోవడానికి అవకాశము ఇంకా
ఉంది ఎందుకంటే టూ లేట్ బోర్డు ఇంకా పెట్టలేదు. ఒకవేళ ఎవరైనా
లాస్ట్ లో ఫాస్ట్ పురుషార్థము చేసినట్లయితే లాస్ట్ సో ఫాస్ట్
మరియు ఫాస్ట్ సో ఫస్ట్ డివిజన్ లోకి రాగలరు. ఫస్ట్ నంబరైతే కాదు,
వారైతే ప్రసిద్ధమైపోయారు, కానీ ఫస్ట్ డివిజన్ లోకి రాగలరు.
ఇష్టమేనా? కొత్తగా వచ్చిన పిల్లలకు ఇష్టమేనా? అవకాశము ఉంది.
బాప్ దాదా సీట్ ఇచ్చేస్తారు కానీ ఏదో అయితే చెయ్యవలసి ఉంటుంది
కూడా. ఒక్కొక్క శ్వాస, ఒక్కొక్క సంకల్పము పట్ల అటెన్షన్, ప్రతి
శ్వాస, ప్రతి సంకల్పము సమర్థముగా ఉండాలి, వ్యర్థమవ్వకూడదు,
ఎందుకంటే మీ అందరి టైటిల్, మొదటిసారి వచ్చినవారిదైనా, పూర్వము
వచ్చినవారిదైనా, మీ అందరి టైటిల్ ఏమిటి? సమర్థ పిల్లలు.
అంతేకానీ బలహీన పిల్లలు కాదు. బాప్ దాదా ప్రియస్మృతులు
ఇచ్చినప్పుడు ఏమని అంటారు? ప్రతిరోజూ ఇచ్చే ప్రియస్మృతులలో -
ప్రియమైన పిల్లలు, సికీలధే పిల్లలు, హృదయ సింహాసనాధికారి
పిల్లలు అని అంటారు. అందుకే బాబా ఈ బంగారు అవకాశాన్ని
ఇస్తున్నారు, తీసుకోదల్చుకున్నవారు తీసుకోవచ్చు. బాబా అయితే
ఇస్తారు, వారు బంధింపబడి ఉన్నారు. తీవ్ర పురుషార్థులు ఎవరైనా
ఉన్నారా! అవకాశము ఉంది. టూ లేట్ బోర్డు పడితే ఇక సమాప్తము. కానీ
బాప్ దాదాకు జన్మదిన కానుకగా ఏమి ఇస్తారు? జన్మ ఉత్సవాన్ని
జరుపుకోవడానికి వచ్చారు కదా! బాప్ దాదా అయితే పిల్లలైన మీ
జన్మదినము సందర్భముగా పిల్లలైన మీ అందరికీ విశేషమైన కానుకను
ఇచ్చారు, అదేమిటంటే, ఒకవేళ ఈ రోజు నుండి చివరి వరకు మీ తీవ్ర
పురుషార్థము 90 శాతము ఉంటే, 10 శాతము బాప్ దాదా పెంచి ఇస్తారు.
మీకు ఓ.కే నా! ఇప్పుడిక వ్యర్థము సమాప్తము. చూడండి, సత్యయుగ
దేవతలు వస్తారు కదా, వారికి ఇక్కడ ఏ భాష మాట్లాడుతారో తెలియదు.
పురుషార్థము అన్న మాట వింటే పురుషార్థము అంటే ఏమిటి అని అంటారు,
ఎందుకంటే వారు ప్రారబ్ధము కలవారు కదా. అదే విధముగా తీవ్ర
పురుషార్థులైన మీకు స్వప్నములో లేక సంకల్పాలలో లేక ప్రాక్టికల్
కర్మలలో వ్యర్థము అంటే ఏమిటి అన్నది సమాప్తమైపోవాలి. ఉందా
ధైర్యము? 10 శాతము మార్కులు బాబా గ్రేస్ లో (అదనముగా) ఇస్తారు.
సమ్మతమేనా! చేతులెత్తండి. ఎంత శాతము పక్కా? 100 శాతము కాదు,
101 శాతము, ఎందుకంటే బాప్ దాదాకు పిల్లలు లేకుండా, పిల్లల తోడు
లేకుండా మంచిగా అనిపించదు. నా బాబా అని అన్నప్పుడు మరియు బాబా
కూడా నా పిల్లలు అని అన్నప్పుడు బాబా సమానముగా అవ్వాల్సిందే కదా
అని బాబా భావిస్తారు. ఇప్పుడు దృఢ సంకల్పము యొక్క అవసరము ఉంది.
దృఢ సంకల్పమే సఫలతకు తాళంచెవి అని మీరు ఒక పుస్తకాన్ని
ముద్రించారు కదా. కావున సంకల్పాన్ని సాధారణముగా చెయ్యవద్దు.
మీరు ఎవరు? ఒకవేళ ఇక్కడి ప్రెసిడెంట్ సాధారణ నడవడిక నడుచుకుంటే
బాగుంటుందా, మరి మీరెవరు? మీరైతే మూడు సింహాసనాల నివాసులు.
అన్నిటికన్నా పెద్ద సింహాసనము బాప్ దాదా హృదయ సింహాసనము. మరి
హృదయ సింహాసనము కలవారు మొదటి జన్మలోని సహచరులుగా అయితే అవుతారు
కదా. సింహాసనముపై ఒక్కరే కూర్చున్నప్పటికీ రాయల్ ఫ్యామిలీకి
చెందినవారు రాజ్యాధికారులుగా అయితే అవ్వవచ్చు. కావున తోడుగా
నిలిచేవారు, ఇంటి వరకైతే తోడుగా ఉంటారు కదా. బాప్ దాదా ఎలా
అయినా తీసుకువెళ్తారు. వయాగా తీసుకువెళ్ళినా లేక డైరెక్టుగా
తీసుకువెళ్ళినా, తీసుకువెళ్ళడమైతే తీసుకుని వెళ్తారు. మరి
అప్పుడు ఇంటిలోనే కూర్చుని ఉండిపోతారా. బ్రహ్మాబాబా వెళ్ళిపోయి
మీరు ఉండిపోతే బాగుంటుందా? మీరు రాజయోగులు కదా! స్వయానికి ఏ
టైటిల్ ను ఇచ్చుకుంటారు మరియు ఇతరులకు కూడా ఏమి నేర్పిస్తారు?
రాజయోగమా లేక ప్రజాయోగమా? రాయల్ ప్రజలైనా సరే ప్రజాయోగులైతే
కాదు కదా! మీరు రాజయోగులు. మరి బాబా పిల్లలైన మీ అందరికీ
ఇచ్చిన కానుక అందరికీ గుర్తుంటుందా! ఎప్పటివరకు? అంతిమము వరకు.
బాప్ దాదా చూసారు, పురుషార్థము చాలానే చేస్తూ ఉంటారు, పిల్లలు
చాలా శ్రమ పడటాన్ని బాప్ దాదా చూసినప్పుడు, పిల్లల శ్రమ చూసి
బాబాకు మంచిగా అనిపించదు. అందుకే ప్రేమలో ఉన్నట్లయితే శ్రమ
సమాప్తమైపోతుంది. నా బాబా, వేరే నా అన్నవి సమాప్తము. నా బాబా
అన్నప్పుడు అనేక నావి అన్నవి అందులో సమాప్తమైపోతాయి కదా. ఒక
ఆటబొమ్మను తీసుకువస్తారు కదా, అందులో ఒక దాని లోపల మరో బొమ్మ,
అందులో మళ్ళీ మరో బొమ్మ ఉంటాయి. ఒక్కదానిలో 10-12 ఉంటాయి. ఆ
బొమ్మను చూపిస్తారు కదా. అలా ఒక్క నా బాబా, నా బాబా అని అనేవారే
కదా మీరు. నా బాబా కదా! మహారథులు బాబా అయితే కాదు కదా! నా బాబా.
నా బాబా అన్నప్పుడు హద్దు యొక్క ‘‘నావి’’ అన్నవన్నీ ‘‘నీవి’’లోకి
మార్చండి. నాది అనడానికి బదులుగా నీది అని అనండి. నాది మరియు
నీది అనేదానిలో ఎంత తేడా ఉంది. నా మరియు నీ. ఒక్క అక్షరము తేడా.
మరి నా బాబా అన్నది పక్కా కదా. పక్కానా? ఎంత శాతము? 100 శాతం,
100 మరియు ఒకటి. ఇలా ఒక్క వేలును చూపించండి. 101 శాతము అనేవారు
చేతులెత్తండి. బాప్ దాదా చూస్తున్నారు. టి.వి.లో కూడా
చూస్తున్నారు. అచ్ఛా.
నలువైపులా ఉన్న బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారి
పిల్లలకు, నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థీ పిల్లలకు, బాప్ దాదా
ఏదైతే కానుకను ఇచ్చారో, ఆ కానుకను స్వీకరించే నలువైపులా ఉన్న
పిల్లలకు, ఏ పిల్లలైతే సంకల్పము ద్వారా బాప్ దాదాకు కానుకను
ఇచ్చారో, ఆ సంకల్పాన్ని సదా దృఢము చేసుకునే దృఢ పురుషార్థులకు,
ప్రతిజ్ఞ చేసి ప్రత్యక్షతను తీసుకువచ్చే పిల్లలందరికీ బాప్ దాదా
యొక్క చాలా-చాలా హృదయపూర్వక ప్రేమ మరియు హృదయపూర్వకమైన
ప్రియస్మృతులు మరియు పిల్లలందరికీ పదే-పదే అభినందనలు, అభినందనలు,
అభినందనలు.