15-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందుకే దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను మరచి ఒక్క తండ్రిని స్మృతి చేయండి, ఇదే సత్యమైన గీతా సారము’’

ప్రశ్న:-
పిల్లలైన మీ యొక్క సహజ పురుషార్థము ఏమిటి?

జవాబు:-
తండ్రి అంటారు, మీరు పూర్తిగా మౌనముగా ఉండండి, మౌనముగా ఉండడము ద్వారానే తండ్రి ఇచ్చే వారసత్వాన్ని తీసుకోగలుగుతారు. తండ్రిని స్మృతి చేయాలి, సృష్టి చక్రాన్ని తిప్పాలి. తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి, ఆయుష్షు పెరుగుతుంది మరియు చక్రమును తెలుసుకోవడము ద్వారా చక్రవర్తీ రాజులుగా అవుతారు - ఇదే సహజ పురుషార్థము.

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మళ్ళీ అర్థం చేయిస్తున్నారు. ప్రతిరోజు అర్థం చేయిస్తారు. మనము తప్పకుండా కల్ప పూర్వము వలె గీతా జ్ఞానాన్ని చదువుకుంటున్నాము అని పిల్లలైతే అర్థం చేసుకుంటారు. కానీ అది శ్రీకృష్ణుడు చదివించరు, పరమపిత పరమాత్మ మనల్ని చదివిస్తున్నారు, వారే మనకు మళ్ళీ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మీరు ఇప్పుడు డైరెక్టుగా భగవంతుడి నుండి వింటున్నారు. భారతవాసులకు మొత్తం ఆధారమంతా గీత పైనే ఉంది. ఆ గీతలో కూడా రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు అని వ్రాయబడి ఉంది. ఇది యజ్ఞము కూడా, అలాగే పాఠశాల కూడా. తండ్రి ఎప్పుడైతే వచ్చి సత్యమైన గీతను వినిపిస్తారో అప్పుడు మనము సద్గతిని పొందుతాము. మనుష్యులు ఇది అర్థం చేసుకోరు. సర్వుల సద్గతిదాత అయిన తండ్రి ఎవరైతే ఉన్నారో, వారినే స్మృతి చేయాలి. గీతను చదువుతూ వచ్చారు కానీ రచయిత మరియు రచన గురించి తెలియని కారణముగా తెలియదు, తెలియదు అని అంటూ వచ్చారు. సత్యమైన గీతనైతే సత్యమైన తండ్రియే వచ్చి వినిపిస్తారు, ఇవి విచార సాగర మంథనము చేయవలసిన విషయాలు. ఎవరైతే సేవలో ఉంటారో వారికి చాలా బాగా అటెన్షన్ వెళ్తుంది. బాబా చెప్పారు, ప్రతి చిత్రములోనూ తప్పకుండా ఇలా వ్రాసి ఉండాలి - జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, గీతా జ్ఞానదాత పరమప్రియ పరమపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు అయిన శివ భగవానువాచ. ఈ పదాలనైతే తప్పకుండా వ్రాయండి, తద్వారా మనుష్యులు - త్రిమూర్తి శివ పరమాత్మయే గీతా భగవానుడు, శ్రీకృష్ణుడు కాదు అని అర్థం చేసుకోగలుగుతారు. ఒపీనియన్లు (అభిప్రాయాలు) కూడా ఈ విషయము గురించే వ్రాయిస్తారు. మనకు ముఖ్యమైనది గీత. తండ్రి రోజురోజుకు కొత్త-కొత్త పాయింట్లను కూడా ఇస్తూ ఉంటారు. బాబా ఈ విషయాలను ముందే ఎందుకు చెప్పలేదు అన్నది రాకూడదు. డ్రామాలో లేదు. బాబా మురళి నుండి కొత్త-కొత్త పాయింట్లు తీస్తూ ఉండాలి. రైజ్ అండ్ ఫాల్ అని వ్రాస్తారు కూడా. దీనిని హిందీలో భారత్ యొక్క ఉన్నతి మరియు పతనము అని అంటారు. రైజ్ అనగా అర్థము దైవీ వంశావళి యొక్క స్థాపన, 100 శాతము పవిత్రత, శాంతి, సంపద యొక్క స్థాపన జరుగుతుంది, మళ్ళీ అర్ధకల్పము తర్వాత పతనము జరుగుతుంది, ఆసురీ వంశావళి యొక్క పతనము జరుగుతుంది. ఉన్నతి మరియు స్థాపన అనేది దైవీ వంశానిది జరుగుతుంది. పతనముతో పాటు వినాశనము అని కూడా వ్రాయాలి.

మీ ఆధారమంతా గీత పైనే ఉంది. తండ్రియే వచ్చి సత్యమైన గీతను వినిపిస్తారు. బాబా ప్రతిరోజు ఈ విషయముపైనే అర్థం చేయిస్తారు. పిల్లలైతే ఎలాగూ ఆత్మలే. తండ్రి అంటారు, ఈ దేహానికి సంబంధించిన పూర్తి విస్తారమంతటినీ మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ శరీరము నుండి వేరైపోతే ఇక అన్ని సంబంధాలను మర్చిపోతుంది. కావున తండ్రి కూడా అంటారు, దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి కదా! అర్ధకల్పము తిరిగి వెళ్ళేందుకే ఇంతగా భక్తి మొదలైనవి చేసారు. సత్యయుగములోనైతే ఎవరూ తిరిగి వెళ్ళేందుకు పురుషార్థము చేయరు. అక్కడైతే సుఖమే సుఖము ఉంది. దుఃఖములో అందరూ స్మరిస్తారు, సుఖములో ఎవరూ స్మరించరు అని గానము కూడా చేస్తారు. కానీ సుఖము ఎప్పుడు ఉంది, దుఃఖము ఎప్పుడు ఉంది - ఇది అర్థం చేసుకోరు. మన విషయాలన్నీ గుప్తమైనవి. మనము కూడా ఆత్మిక మిలట్రీ కదా. మనము శివబాబా యొక్క శక్తి సైన్యము. దీని అర్థము కూడా ఎవరూ అర్థం చేసుకోరు. దేవీలు మొదలైనవారికి ఎంతో పూజ జరుగుతుంది కానీ ఎవరి జీవిత చరిత్రను గురించి తెలియదు. ఎవరినైతే పూజిస్తామో, వారి జీవిత చరిత్రను గురించి తెలుసుకోవాలి కదా. ఉన్నతోన్నతుడైన శివునికి పూజ జరుగుతుంది, ఆ తర్వాత బ్రహ్మా-విష్ణు-శంకరులకు, తర్వాత లక్ష్మీ-నారాయణులకు, రాధ-కృష్ణులకు మందిరాలు ఉన్నాయి. ఇంకెవ్వరూ లేరు. ఒక్క శివబాబా విషయములోనే ఎన్ని భిన్న-భిన్నమైన పేర్లు పెట్టి మందిరాలను తయారుచేసారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తము చక్రమంతా ఉంది. డ్రామాలో ముఖ్యమైన పాత్రధారులు కూడా ఉంటారు కదా. అవి హద్దులోని డ్రామాలు. ఇది అనంతమైన డ్రామా. ఇందులో ముఖ్యమైనవారు ఎవరెవరు అనేది మీకు తెలుసు. ఓ రామా, ఈ ప్రపంచము తయారవ్వనే లేదు అని మనుష్యులు అంటారు. దీనిపై కూడా ఒక శాస్త్రాన్ని తయారుచేసారు. దాని అర్థాన్ని ఏమీ అర్థం చేసుకోరు.

తండ్రి పిల్లలైన మీకు చాలా సహజ పురుషార్థాన్ని నేర్పించారు. అన్నింటికన్నా సహజ పురుషార్థము - మీరు పూర్తిగా మౌనముగా ఉండండి. మౌనముగా ఉండడము ద్వారానే తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేయాలి. సృష్టి చక్రాన్ని స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి, మీరు నిరోగిగా అవుతారు, ఆయుష్షు పెరుగుతుంది. చక్రమును తెలుసుకోవడం ద్వారా చక్రవర్తీ రాజులుగా అవుతారు. ఇప్పుడు నరకానికి యజమానులుగా ఉన్నారు, ఆ తర్వాత స్వర్గానికి యజమానులుగా అవుతారు. స్వర్గానికి యజమానులుగానైతే అందరూ అవుతారు కానీ అందులో పదవులు కూడా ఉన్నాయి. ఎంతగా తమ సమానముగా తయారుచేస్తారో అంతటి ఉన్నత పదవి లభిస్తుంది. అవినాశీ జ్ఞాన రత్నాల దానమునే చేయకపోతే రిటర్నులో ఏమి లభిస్తుంది. ఎవరైనా షావుకారులుగా అయితే - వీరు పూర్వ జన్మలో దాన-పుణ్యాలు బాగా చేసారు అని అంటారు. ఇప్పుడు పిల్లలకు తెలుసు - రావణ రాజ్యములోనైతే అందరూ పాపాలే చేస్తారు, అందరికన్నా పుణ్యాత్ములు శ్రీ లక్ష్మీ-నారాయణులు. అయితే, బ్రాహ్మణులను కూడా ఉన్నతమైనవారిగా చూపిస్తారు ఎందుకంటే వారు అందరినీ ఉన్నతమైనవారిగా తయారుచేస్తారు. అది ప్రారబ్ధము. ఈ బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణ కుల భూషణులు శ్రీమతముపై ఈ శ్రేష్ఠమైన కర్తవ్యాన్ని చేస్తారు. బ్రహ్మా పేరు ముఖ్యమైనది. త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు కదా. ఇప్పుడైతే మీరు ప్రతి విషయములోనూ త్రిమూర్తి శివ అని అనవలసి ఉంటుంది. బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుడి ద్వారా వినాశనము అన్న గాయనమైతే ఉంది కదా. విరాట రూపాన్ని కూడా తయారుచేస్తారు, కానీ అందులో శివుడినీ చూపించరు, అలాగే బ్రాహ్మణులను చూపించరు. ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. మీలో కూడా అతి కష్టము మీద కొందరి బుద్ధిలో యథార్థ రీతిలో కూర్చుంటుంది. అనేక పాయింట్లు ఉన్నాయి కదా, వాటిని టాపిక్స్ (అంశాలు) అని కూడా అంటారు. ఎన్ని టాపిక్ లు లభిస్తాయి. ‘సత్యమైన గీతను భగవంతుడి నుండి వినడము ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా, విశ్వానికి యజమానులుగా అవుతారు.’ ఈ టాపిక్ ఎంత బాగుంది. కానీ అర్థం చేయించేందుకు కూడా తెలివి కావాలి కదా. ఈ విషయాన్ని స్పష్టముగా వ్రాయాలి, తద్వారా మనుష్యులు అర్థం చేసుకుంటారు మరియు అడుగుతారు. ఇది ఎంత సహజము. జ్ఞానానికి సంబంధించిన పాయింట్లు ఒక్కొక్కటీ లక్షలు-కోట్లు విలువ చేసేవి, వాటి ద్వారా మీరు ఎలా ఉన్నవారు ఎలా తయారవుతారు! మీ అడుగడుగులో పదమాలు ఉన్నాయి, అందుకే దేవతలకు కూడా కమల పుష్పాన్ని చూపిస్తారు. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులైన మీ పేరునే మాయం చేసేసారు. ఆ బ్రాహ్మణులు తమ చేతిలోకి గీతను తీసుకుంటారు. ఇప్పుడు మీరు సత్యమైన బ్రాహ్మణులు, మీ చేతిలో (బుద్ధిలో) సత్యము ఉంది. వారి చేతిలో గ్రంథము ఉంది. కావున మీకు నషా ఎక్కాలి - మేమైతే శ్రీమతముపై స్వర్గాన్ని తయారుచేస్తున్నాము, తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మీ వద్ద ఏ పుస్తకమూ లేదు. కానీ ఈ సాధారణమైన బ్యాడ్జీయే మీ కొరకు సత్యమైన గీత, ఇందులో త్రిమూర్తి చిత్రము కూడా ఉంది. కావున మొత్తం గీత అంతా ఇందులో వచ్చేస్తుంది. ఒక్క క్షణములో మొత్తము గీత అంతా అర్థం చేయించడము జరుగుతుంది. ఈ బ్యాడ్జీ ద్వారా మీరు క్షణములో ఎవరికైనా అర్థం చేయించగలరు. వీరు మీ తండ్రి, వీరిని స్మృతి చేయడము ద్వారా మీ పాపాలు వినాశనమవుతాయి. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు, నడుస్తూ-తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరినైనా కలిస్తే, మీరు వారికి బాగా అర్థం చేయించండి. కృష్ణపురిలోకైతే అందరూ వెళ్ళాలని కోరుకుంటారు కదా. ఈ చదువు ద్వారా ఆ విధంగా తయారవ్వవచ్చు. చదువు ద్వారా రాజ్యము స్థాపన అవుతుంది. ఇతర ధర్మస్థాపకులెవ్వరూ రాజ్యాన్ని స్థాపించరు. మనము భవిష్య 21 జన్మల కొరకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము అని మీకు తెలుసు. ఇది ఎంత మంచి చదువు. కేవలము రోజుకు ఒక గంట చదవండి, అంతే. ఆ చదువైతే 4-5 గంటలు వరకు ఉంటుంది. ఇక్కడ ఒక గంట చదివినా చాలు. అది కూడా ఉదయము సమయము ఎలా ఉంటుందంటే అందరికీ ఖాళీ ఉంటుంది. ఇకపోతే బంధనములో ఉన్నవారెవరైనా ఉదయము రాలేకపోతే వేరే సమయము పెట్టాము. బ్యాడ్జీ పెట్టుకుని ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సందేశాన్ని ఇస్తూ వెళ్ళండి. వార్తాపత్రికలలోనైతే బ్యాడ్జీను ముద్రించలేరు, ఒకవైపును ముద్రించగలరు. అయినా, అర్థం చేయించకుండా మనుష్యులు అది అర్థం చేసుకోలేరు. వాస్తవానికి ఇది చాలా సహజము. ఈ వ్యాపారాన్ని అయితే ఎవరైనా చేయగలరు. అచ్ఛా, ఒకవేళ స్వయం స్మృతి చేయకపోయినా కానీ, ఇతరులకు స్మృతిని ఇప్పించండి. అది కూడా మంచిదే. ఇతరులకు దేహీ-అభిమానులుగా అవ్వండి అని చెప్పి, స్వయం దేహాభిమానులుగా ఉన్నట్లయితే ఏదో ఒక వికర్మ జరుగుతూనే ఉంటుంది. మొట్టమొదట తుఫానులు మనసాలో వస్తాయి, ఆ తర్వాత కర్మణాలోకి వస్తాయి. మనసాలో ఎన్నో వస్తాయి, అక్కడ బుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది, చెడు పనులు ఎప్పుడూ చేయకూడదు. మంచి కర్మలే చేయాలి. సంకల్పాలు మంచివి కూడా ఉంటాయి, అలాగే చెడు సంకల్పాలు కూడా వస్తాయి. చెడు సంకల్పాలను ఆపు చేయవలసి ఉంటుంది. ఈ బుద్ధిని తండ్రియే ఇచ్చారు. ఈ విషయాలను ఇతరులెవరూ అర్థం చేసుకోలేరు. వారైతే రాంగ్ పనులే చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు రైట్ పనులే చేయాలి. మంచి పురుషార్థము ద్వారా రైట్ పనులే జరుగుతాయి. తండ్రి అయితే ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ ఒక్కొక్క అవినాశీ జ్ఞాన రత్నాలు లక్షలు-కోట్లు విలువ చేసేవి, వీటిని దానము చేసి అడుగడుగులోనూ పదమాల సంపాదనను జమ చేసుకోవాలి. తమ సమానముగా తయారుచేసి ఉన్నత పదవిని పొందాలి.

2. వికర్మల నుండి రక్షించుకునేందుకు దేహీ-అభిమానులుగా ఉండే పురుషార్థము చేయాలి. మనసాలో ఎప్పుడైనా చెడు సంకల్పాలు వస్తే వాటిని ఆపు చేయాలి. మంచి సంకల్పాలను నడిపించాలి. కర్మేంద్రియాల ద్వారా ఎప్పుడూ ఎటువంటి తప్పుడు కర్మలు చేయకూడదు.

వరదానము:-
ఆత్మికత యొక్క ప్రభావము ద్వారా ఫరిశ్తాతనపు మేకప్ ను వేసుకునే సర్వుల స్నేహీ భవ

ఏ పిల్లలైతే సదా బాప్ దాదా యొక్క సాంగత్యములో ఉంటారో - వారికి సాంగత్యపు రంగు ఏ విధంగా అంటుకుంటుందంటే ఇక ప్రతి ఒక్కరి ముఖముపై ఆత్మికత యొక్క ప్రభావము కనిపిస్తుంది. ఆ ఆత్మికతలో ఉండడము ద్వారా ఫరిశ్తా స్వరూపపు మేకప్ స్వతహాగా జరిగిపోతుంది. ఏ విధంగా మేకప్ చేసుకున్న తర్వాత ఎవరు ఎలా ఉన్నా కానీ మారిపోతారు, మేకప్ చేసుకోవడముతో సుందరముగా కనిపిస్తారు. ఇక్కడ కూడా ఫరిశ్తాతనపు మేకప్ ద్వారా ప్రకాశించడం మొదలుపెడతారు మరియు ఈ ఆత్మిక మేకప్ సర్వులకు స్నేహీగా చేస్తుంది.

స్లోగన్:-
బ్రహ్మచర్యము, యోగము మరియు దివ్య గుణాల ధారణయే వాస్తవిక పురుషార్థము.

మాతేశ్వరిగారి అమూల్య మహావాక్యాలు

‘‘కర్మ బంధనాలను తెంచుకునే పురుషార్థము’’

చాలామంది మనుష్యులు ఏమని ప్రశ్నిస్తారంటే - మేము ఏం చెయ్యాలి, ఎలా మా కర్మ బంధనాలను తెంచుకోవాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరి జన్మపత్రి గురించైతే తండ్రికి తెలుసు. పిల్లలు చేయవలసిన పనేమిటంటే - ఒక్కసారి హృదయపూర్వకముగా తండ్రికి సమర్పితమైపోవాలి, తమ బాధ్యతను వారి చేతుల్లో అప్పగించాలి. అప్పుడు వారు ప్రతి ఒక్కరినీ చూసి - నీవు ఏం చేయాలి అని సలహాను ఇస్తారు. కానీ ఆధారము కూడా ప్రాక్టికల్ గా తీసుకోవాలి, కేవలము వింటూ ఉంటారు కానీ తమ సొంత మతముపైనే నడుస్తూ ఉంటారు అన్నట్లు ఉండకూడదు. తండ్రి సాకారములో ఉన్నారు కావున పిల్లలు కూడా స్థూల రూపములో ఆ తండ్రి, గురువు, టీచర్ యొక్క ఆధారాన్ని తీసుకోవాలి. మళ్ళీ ఆజ్ఞ లభించిన తర్వాత దానిని పాటించలేకపోతే మరింత అకళ్యాణము జరుగుతుంది. కావున ఆజ్ఞను పాటించడానికి కూడా ధైర్యము కావాలి. నడిపించేవారైతే చతురత కలవారు, ఎవరి కళ్యాణము ఎందులో ఉంది అనేది వారికి తెలుసు, కావున ఏ విధంగా కర్మ బంధనాలను తెంచుకోవాలి అన్నదాని గురించి వారు డైరెక్షన్లు ఇస్తారు. మరి అలాగైతే మా పిల్లలు మొదలైనవారి పరిస్థితి ఏమవుతుంది అని ఎవరికీ ఇటువంటి ఆలోచన రాకూడదు. ఇందులో ఇళ్ళు-వాకిళ్ళను వదిలే విషయమేమీ లేదు. ఈ డ్రామాలో కొద్దిమంది పిల్లలకు మాత్రమే బంధనాలను వదిలి వచ్చే పాత్ర ఉంది. ఒకవేళ ఆ పాత్ర లేకుంటే మీ సేవ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానిని మరి ఎవరు చేస్తారు? ఇప్పుడైతే వదిలే విషయమేమీ లేదు కానీ పరమాత్మకు చెందినవారిగా అయిపోవాలి, ఇందులో భయపడకండి, ధైర్యము ఉంచండి. ఇకపోతే ఎవరైతే భయపడతారో వారు స్వయమూ సంతోషముగా ఉండరు, అలాగే తండ్రికి సహాయకులుగానూ అవ్వరు. ఇక్కడైతే ఆ తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి, ఎప్పుడైతే జీవిస్తూ మరణిస్తారో అప్పుడే సహాయకులుగా అవ్వగలుగుతారు. ఎక్కడైనా చిక్కుకుని ఆగిపోతే వారు సహాయము అందించి దాటించేస్తారు. కావున బాబాకు మనసా-వాచ-కర్మణా సహాయకులుగా అవ్వాలి, ఇందులో కొంచెమైనా మోహము ఉన్నట్లయితే అది కింద పడేస్తుంది. కావున ధైర్యాన్ని ఉంచండి, ముందుకు వెళ్ళండి. ధైర్యములో ఎక్కడైనా బలహీనులుగా అయినట్లయితే తికమకపడతారు, అందుకే మీ బుద్ధిని పూర్తిగా పవిత్రముగా తయారుచేసుకోవాలి, వికారాల అంశము కొద్దిగా కూడా ఉండకూడదు, గమ్యమేమైనా దూరముగా ఉందా ఏమిటి! కాకపోతే ఎక్కే మార్గము కాస్త మెలికలు తిరిగి ఉంది. కానీ సమర్థుడి సహాయము తీసుకున్నట్లయితే భయమూ ఉండదు, అలసట ఉండదు. అచ్ఛా! ఓం శాంతి.

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

మీ మాటలు మరియు స్వరూపము, రెండు కలిసి-కలిసి ఉండాలి - మాటలు స్పష్టముగా కూడా ఉండాలి, అందులో స్నేహము కూడా ఉండాలి, నమ్రత, మధురత మరియు సత్యత కూడా ఉండాలి కానీ స్వరూపములో నమ్రత కూడా ఉండాలి, ఈ రూపముతో తండ్రిని ప్రత్యక్షము చెయ్యగలరు. నిర్భయులుగా ఉండాలి కానీ మాటలు మర్యాద పూర్వకముగా ఉండాలి, అప్పుడు మీ మాటలు కటువుగా అనిపించవు, మధురముగా అనిపిస్తాయి.