15-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ స్వభావాన్ని తండ్రి సమానముగా ఈజీగా చేసుకోండి, మీలో ఏ విధమైన అహంకారము ఉండకూడదు, జ్ఞానయుక్తమైన బుద్ధి ఉండాలి, అభిమానము ఉండకూడదు’’

ప్రశ్న:-
సేవ చేస్తూ కూడా కొంతమంది పిల్లలు పసి పిల్లల కన్నా పసి పిల్లలుగా ఉన్నారు - ఎలా?

జవాబు:-
కొంతమంది పిల్లలు సేవ చేస్తూ ఉంటారు, ఇతరులకు జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు, కానీ తండ్రిని స్మృతి చేయరు. బాబా, మీ స్మృతిని మర్చిపోతున్నాము అని అంటారు. అప్పుడు బాబా వారిని పసి పిల్లల కన్నా పసి పిల్లలు అని అంటారు, ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ తండ్రిని మర్చిపోరు, ఏ తండ్రి అయితే మిమ్మల్ని రాకుమారులు-రాకుమారీలుగా తయారుచేస్తారో, వారిని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఒకవేళ మర్చిపోతే వారసత్వము ఎలా లభిస్తుంది. మీరు చేతులతో పని చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయాలి.

ఓంశాంతి
చదువు యొక్క లక్ష్యము-ఉద్దేశ్యము పిల్లల ఎదురుగా ఉంది. తండ్రి సాధారణమైన తనువులో ఉన్నారని, అది కూడా వృద్ధ తనువులో ఉన్నారని పిల్లలకు ఇది కూడా తెలుసు. స్వర్గములో అయితే వృద్ధాప్యానికి చేరుకున్నా కూడా, మేము మళ్ళీ పిల్లలుగా అవుతాము అని వారికి సంతోషము ఉంటుంది. ఈ విషయము ఇతనికి కూడా తెలుసు, నేను ఈ విధముగా తయారవ్వనున్నాను అని ఇతనికి ఆ సంతోషము ఉంది. కావున ఇతని నడవడిక చిన్నపిల్లలలా మారిపోతుంది, చిన్న పిల్లల వలె తేలికగా ఉంటారు. ఇతనిలో అహంకారము మొదలైనవేవీ లేవు. జ్ఞానయుక్తమైన బుద్ధి ఉంది. ఇతనికి ఏ విధముగా ఉందో, అలాగే పిల్లలైన మీకు కూడా ఉండాలి. బాబా మనల్ని చదివించడానికి వచ్చారు, మనం ఈ విధంగా తయారవుతాము. కావున పిల్లలైన మీకు - మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి ఈ విధంగా అవుతాము అనే సంతోషము లోలోపల ఉండాలి కదా. రాజయోగము నేర్చుకుంటున్నాము. చిన్న పిల్లలు మరియు పెద్దలు, అందరూ శరీరాలు వదులుతారు. అందరి కొరకు చదువు ఒక్కటే. ఇతను కూడా అంటారు - నేను రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను, తద్వారా నేను వెళ్ళి యువరాజుగా అవుతాను. అలాగే మీరు కూడా అంటారు - మేమూ యువరాజులుగా, యువరాణులుగా అవుతాము అని. మీరు యువరాజులు, యువరాణులుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. అంతిమ సమయములోని స్మృతి బట్టి మరుసటి జన్మ జరుగుతుంది. మనము బికారుల నుండి యువరాజులుగా అవ్వనున్నాము అని బుద్ధిలో ఈ నిశ్చయము ఉంది. ఈ బికారీ ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నది. పిల్లలకు చాలా సంతోషము ఉండాలి. బాబా పిల్లలను కూడా తన సమానముగా తయారుచేస్తారు. శివబాబా అంటారు, నేనైతే యువరాజుగా, యువరాణిగా అవ్వను. కానీ ఈ బాబా అంటారు, నేనైతే అలా తయారవ్వాలి కదా, అలా తయారయ్యేందుకే నేను చదువుకుంటున్నాను. ఇది రాజయోగము కదా. పిల్లలు కూడా - మేము యువరాజులుగా, యువరాణులుగా అవుతాము అని అంటారు. తండ్రి అంటారు, ఇది తప్పకుండా వాస్తవమే, మీ నోటిలో గులాబ్. అసలు ఈ పరీక్ష కూడా యువరాజులు, యువరాణులుగా అయ్యేందుకు పరీక్ష. జ్ఞానమైతే చాలా సహజము. తండ్రిని స్మృతి చేయాలి మరియు భవిష్య వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఈ విధంగా స్మృతి చేయడములోనే శ్రమ ఉంది. ఈ స్మృతిలో ఉంటే అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ జరుగుతుంది. సన్యాసులు ఒక ఉదాహరణను ఇస్తారు - ఒకతను నేను ఎద్దును అని అంటూ ఉన్నాడు, కొంత సమయము తర్వాత నిజంగానే తనను తాను ఎద్దుగా భావించడం మొదలుపెట్టాడు. అవన్నీ వ్యర్థమైన విషయాలు. ఇక్కడ ఇది ధర్మానికి సంబంధించిన విషయము. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - జ్ఞానమైతే చాలా సహజమైనది, స్మృతిలోనే శ్రమించవలసి ఉంటుంది. బాబా చాలా వరకు - మీరు పసి పిల్లలు అని అంటూ ఉంటారు. మేము పసి పిల్లలమా అని పిల్లలు ఫిర్యాదు చేసినట్లు అడుగుతుంటారు. బాబా అంటారు - అవును, మీరు పసి పిల్లలే, మీలో జ్ఞానము చాలా బాగా ఉండి ఉండవచ్చు, ప్రదర్శనీలో సేవ కూడా చాలా బాగా చేస్తారు, రాత్రింబవళ్ళూ సేవలో నిమగ్నులై ఉంటారు, అయినా మిమ్మల్ని పసి పిల్లలు అనే అంటాను. తండ్రి అంటారు, ఈ బ్రహ్మా కూడా పసి పిల్లవాడే. ఈ బాబా అంటారు, మీరు నా కన్నా గొప్పవారు. ఇతనిపై అయితే ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఎవరిపైనైతే బాధ్యత ఉంటుందో వారికి నిద్ర ఎలా పడుతుంది. అన్ని ఆలోచనలూ నడుస్తూ ఉంటాయి. బాబా వద్దకు ఎన్ని సమాచారాలు వస్తుంటాయి. అందుకే, ఇక ఉదయమే లేచి స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు. వారసత్వమైతే వారి నుండే పొందాలి, కావున తండ్రిని స్మృతి చేయాలి. పిల్లలందరికీ రోజూ అర్థం చేయిస్తాను - మధురమైన పిల్లలూ, మీరు స్మృతియాత్రలో చాలా బలహీనముగా ఉన్నారు. జ్ఞానములో బాగానే ఉన్నారు కానీ ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - నేను బాబా స్మృతిలో ఎంత ఉంటున్నాను? అచ్ఛా, రోజంతటిలో ఎన్నో పనులలో బిజీగా ఉంటారు, కానీ వాస్తవానికి పనులు చేసుకుంటూ కూడా స్మృతిలో ఉండవచ్చు. చేతులు పనివైపు, హృదయము ప్రియుడి వైపు... అన్న నానుడి కూడా ఉంది (చేతులతో పని చేస్తున్నప్పటికీ బుద్ధి అటువైపు జోడించబడి ఉండాలి. భక్తి మార్గములో పూజలు చేస్తూ ఉంటారు కానీ బుద్ధి అటు ఇటూ, వ్యాపార వ్యవహారాలు మొదలైనవాటి వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ ఒక స్త్రీ యొక్క పతి విదేశాలలో ఉన్నట్లయితే ఆమె బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే అతనితో ఎక్కువ కనెక్షన్ ఉంది. సేవ బాగా చేస్తున్నప్పటికీ బాబా పిల్లలను పసి పిల్లల బుద్ధి కలవారు అని అంటారు. మేము బాబా స్మృతిని మర్చిపోతున్నాము అని చాలామంది పిల్లలు వ్రాస్తుంటారు. అరే, చిన్న పిల్లలు కూడా తమ తండ్రిని మర్చిపోరు, మరి మీరు మర్చిపోతున్నారంటే మీరు పసి పిల్లల కన్నా పసి పిల్లల వంటి వారు. ఏ తండ్రి ద్వారానైతే మీరు యువరాజులుగా, యువరాణులుగా అవుతారో, వారు మీకు తండ్రి, టీచరు, గురువుగా ఉన్నారు, మీరు వారిని మర్చిపోతున్నారా!

ఏ పిల్లలైతే తమ పూర్తి లెక్కాపత్రాన్ని బాబాకు పంపిస్తారో, బాబా వారికే తమ సలహా ఇస్తారు. మేము బాబాను ఏ విధంగా స్మృతి చేస్తున్నాము, ఎప్పుడు స్మృతి చేస్తున్నాము అనేది పిల్లలు చెప్పాలి. అప్పుడు బాబా సలహా ఇస్తారు. ఇతను ఈ ఉద్యోగము చేస్తున్నారు, దీని అనుసారముగా ఇతనికి ఎంత ఖాళీ ఉండవచ్చు అనేది బాబా అర్థం చేసుకుంటారు. ప్రభుత్వోద్యోగులకు ఖాళీ ఎక్కువ ఉంటుంది. పని కాస్త తగ్గగానే తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. నడుస్తూ, తిరుగుతూ కూడా తండ్రి స్మృతి ఉండాలి. బాబా సమయము కూడా చెప్తారు. అచ్ఛా, రాత్రి 9 గంటలకు పడుకోండి, మళ్ళీ 2 లేక 3 గంటలకు లేచి స్మృతి చేయండి. ఇక్కడికి వచ్చి కూర్చుండిపోండి. కానీ అలాగని బాబా ఒక చోట కూర్చుని స్మృతి చేసే అలవాటు కూడా చేయించరు. స్మృతి అనేది నడుస్తూ, తిరుగుతూ కూడా చేయవచ్చు. ఇక్కడైతే పిల్లలకు చాలా తీరిక ఉంటుంది. పూర్వము మీరు ఏకాంతములో పర్వతాలపైకి వెళ్ళి కూర్చునేవారు. తండ్రిని స్మృతి అయితే తప్పకుండా చేయాలి. లేదంటే వికర్మలు ఎలా వినాశనమవుతాయి. తండ్రిని స్మృతి చేయలేకపోతున్నారంటే వారు పసి పిల్లల కంటే కూడా పసి పిల్లల వంటివారు కదా. మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. జ్ఞానమైతే చాలా సహజము. ఎవరైతే కల్పపూర్వము వచ్చి ఉంటారో, వారే ఇప్పుడు కూడా వచ్చి అర్థం చేసుకుంటారని కూడా మీకు తెలుసు. పిల్లలకు డైరెక్షన్లు లభిస్తూ ఉంటాయి. మేము తమోప్రధానము నుండి సతోప్రధానముగా ఎలా అవ్వాలి అన్న ప్రయత్నమే చేస్తూ ఉండాలి. కేవలం తండ్రి స్మృతి తప్ప ఇంకే ఉపాయమూ లేదు. బాబా, ఈ వ్యాపారము ఉన్న కారణముగా లేక ఈ కార్యము ఉన్న కారణముగా నేను స్మృతి చేయలేకపోతున్నాను అని బాబాకు చెప్పవచ్చు. అప్పుడు బాబా వెంటనే - ఇలా చేయకండి, ఇలా చేయండి అని సలహా ఇస్తారు. మీ ఆధారమంతా స్మృతిపైనే ఉంది. మంచి-మంచి పిల్లలు జ్ఞానమునైతే చాలా బాగా ఇస్తుంటారు, ఇతరులను సంతోషపెడుతూ ఉంటారు, కానీ యోగము లేదు. తండ్రిని స్మృతి చేయాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ కూడా మళ్ళీ మర్చిపోతారు. ఇందులోనే శ్రమ ఉంది. అలవాటైపోతే ఇక విమానములో లేక ట్రైన్ లో కూర్చున్నా కూడా వారు తమ ఆ ధ్యాసలోనే నిమగ్నులై ఉంటారు. మేము బాబా ద్వారా భవిష్యత్తులో యువరాజులుగా, యువరాణులుగా అవుతున్నాము అని లోలోపల సంతోషము ఉంటుంది. ఉదయమే లేచి ఇటువంటి తండ్రి స్మృతిలో కూర్చోండి. ఒకవేళ అలిసిపోతే, సరే, నడుము వాల్చి స్మృతి చేయండి. తండ్రి యుక్తులు తెలియజేస్తారు. నడుస్తూ-తిరుగుతూ స్మృతి చేయలేకపోతే బాబా అంటారు, అచ్ఛా, రాత్రివేళ యోగములో కూర్చోండి, అప్పుడు ఎంతో కొంత మీకు జమ అవుతుంది. కానీ బలవంతముగా ఒక చోట కూర్చోవడమంటే అది హఠయోగము అవుతుంది. మీది సహజ మార్గము. రోటీ తింటున్నప్పుడు కూడా బాబాను స్మృతి చేయండి. మనము బాబా ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతున్నాము. నేను ఈ చదువు ద్వారా ఈ విధముగా తయారవుతాను అని మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. చదువుపై పూర్తి అటెన్షన్ పెట్టాలి. మీకు సబ్జెక్టులు కూడా కొన్నే ఉన్నాయి. బాబా ఎంత కొద్దిగా అర్థం చేయిస్తారు. ఒకవేళ ఏ విషయమైనా అర్థం కాకపోతే బాబాను అడగండి. స్వయాన్ని ఆత్మగా భావించాలి, ఈ శరీరమైతే పంచ భూతాలతో తయారైనది. నేను శరీరాన్ని, ఇలా భావించడం అనగా స్వయాన్ని భూతముగా భావించడమే. ఇది ఉన్నదే ఆసురీ ప్రపంచము, అది దైవీ ప్రపంచము. ఇక్కడ అందరూ దేహాభిమానులే. తమ ఆత్మను గురించి ఎవ్వరికీ తెలియదు. రైట్ మరియు రాంగ్ అనేవి అయితే ఉంటాయి కదా. ఆత్మనైన నేను అవినాశీ - ఇలా భావించడం రైట్. స్వయాన్ని వినాశీ శరీరముగా భావించడం రాంగ్ అవుతుంది. దేహ అహంకారము చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తండ్రి అంటారు - దేహాన్ని మర్చిపోండి, ఆత్మాభిమానులుగా అవ్వండి. ఇందులోనే శ్రమ ఉంది. 84 జన్మలు తీసుకుంటారు, ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి. మీకే ఈజీ అనిపిస్తుంది, మీకే 84 జన్మలు ఉన్నాయి. సూర్యవంశీ దేవతా ధర్మము వారికి 84 జన్మలు ఉంటాయి, ఈ విధంగా కరెక్టు చేసి వ్రాయాలి. పిల్లలు చదువుకుంటూ ఉంటారు, కరెక్షన్లు అవుతూ ఉంటాయి. ఆ చదువులో కూడా నంబరువారుగా ఉంటారు కదా. తక్కువగా చదివితే జీతం కూడా తక్కువే లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు - నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు సత్యాతి సత్యమైన అమరకథను వినడానికి బాబా వద్దకు వచ్చారు. ఈ మృత్యులోకము ఇప్పుడు అంతము కానున్నది. మనము అమరలోకానికి వెళ్ళాలి. మేము తమోప్రధానము నుండి సతోప్రధానముగా, పతితము నుండి పావనముగా అవ్వాలి అన్న చింత ఇప్పుడు పిల్లలైన మీకు కలగాలి. పతిత-పావనుడైన తండ్రి పిల్లలందరికీ ఒకే ఒక్క యుక్తిని తెలియజేస్తున్నారు - వారు ఏమంటున్నారంటే, కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేయండి, అలాగే చార్టు పెట్టండి, తద్వారా మీకు ఎంతో సంతోషము కలుగుతుంది. ఇప్పుడు మీకు జ్ఞానము ఉంది, కానీ ప్రపంచము ఘోర అంధకారములో ఉంది. మీకు ఇప్పుడు ప్రకాశము లభిస్తోంది. మీరు త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా అవుతూ ఉన్నారు. జ్ఞానమైతే అన్ని చోట్లా లభిస్తుంది, ఇది కొత్త విషయమేమీ కాదు అని ఇలా అనే మనుష్యులు కూడా ఎంతోమంది ఉన్నారు. అరే, ఈ జ్ఞానము ఎవరికీ లభించనే లభించదు. ఒకవేళ అక్కడ జ్ఞానము లభించినా కూడా, ఏమీ పాటించడం లేదు కాదు. వారెవరైనా నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారా? ఏమీ చేయడం లేదు. తండ్రి పిల్లలకు చెప్తున్నారు - ఉదయము సమయము చాలా మంచిది. ఆ సమయములో చాలా ఆనందముగా కలుగుతుంది, శాంతిగా అయిపోతారు, వాయుమండలము బాగుంటుంది. అన్నిటికంటే అశుద్ధమైన వాయుమండలము రాత్రి 10 నుండి 12 గంటల వరకు ఉంటుంది, అందుకే ఉదయము సమయము చాలా మంచిది. రాత్రి త్వరగా పడుకోండి, మళ్ళీ 2-3 గంటలకు లేవండి. ప్రశాంతముగా కూర్చోండి. బాబాతో మాట్లాడండి. ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికమును స్మృతి చేయండి. శివబాబా అంటారు - నాలో రచయిత మరియు రచన యొక్క జ్ఞానము ఉంది కదా. నేను మీకు టీచరుగా అయి చదివిస్తాను. ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. భారత్ యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. ఈ యోగము ఎవరితో? ఈ విషయము కూడా వ్రాయాలి. ఆత్మకు పరమాత్మతో యోగము అనగా స్మృతి ఉంది. మనము ఆల్రౌండర్లమని, పూర్తి 84 జన్మలు తీసుకుంటామని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఇక్కడికి బ్రాహ్మణ కులమువారే వస్తారు. మనము బ్రాహ్మణులము. ఇప్పుడు మనము దేవతలుగా అవ్వనున్నాము. సరస్వతి కూడా కూతురే కదా. నేను వృద్ధుడిని, ఇప్పుడు నేను శరీరాన్ని వదిలి వెళ్ళి రాజు కుటుంబములో జన్మ తీసుకుంటాను అని ఎంతో సంతోషము కలుగుతుంది. ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, ఆ తర్వాత నోటిలో బంగారు చెంచా ఉంటుంది. మీ అందరి లక్ష్యము-ఉద్దేశ్యము ఇదే. మరి సంతోషము ఎందుకు ఉండకూడదు. మనుష్యులు ఏమన్నా సరే, మీ సంతోషము ఎందుకు మాయమవ్వాలి. తండ్రిని స్మృతియే చేయకపోతే మరి నరుడి నుండి నారాయణుడిగా ఎలా అవుతారు. ఉన్నతముగా తయారవ్వాలి కదా. ఇటువంటి పురుషార్థము చేసి చూపించండి, ఎందుకు తికమకపడతారు? అందరూ రాజులుగా అవ్వలేరు కదా అంటూ ఎందుకు నిరాశ పడతారు! ఈ ఆలోచన వచ్చిందంటే ఫెయిల్ అయినట్లు. స్కూల్లో బ్యారిస్టరీ, ఇంజినియరింగ్ మొదలైన చదువులు చదువుతారు, మరి అప్పుడు, అందరూ బ్యారిస్టర్లుగా అవ్వలేరు కదా అని అంటారా ఏమిటి. చదవకపోతే ఫెయిల్ అయిపోతారు. మొత్తం మాల 16108 మణులది. మొట్టమొదట ఎవరు వస్తారు? ఎవరు ఎంత పురుషార్థము చేస్తే అంత. ఒకరికన్నా ఒకరు తీవ్ర పురుషార్థము చేస్తుంటారు కదా. ఇప్పుడు మనము ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ విషయము గుర్తున్నా పురుషార్థము తీవ్రతరమవుతుంది. సర్వుల ముక్తి-జీవన్ముక్తి దాత ఒక్క తండ్రి మాత్రమేనని పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఈ రోజు ప్రపంచములో ఎన్నో కోట్లమంది ఉన్నారు. అక్కడ మీరు తొమ్మిది లక్షల మంది మాత్రమే ఉంటారు. ఇది కూడా సుమారుగా చెప్పడం జరుగుతుంది. సత్యయుగములో మరి ఇంకెంతమంది ఉంటారు. రాజ్యము అన్న తర్వాత మరి కొద్దిమంది అయినా కావాలి కదా. ఇక్కడ రాజ్యము స్థాపన అవుతోంది. సత్యయుగములో చాలా సుందరమైన, చిన్న వృక్షము ఉంటుందని బుద్ధి చెప్తుంది. దాని పేరే స్వర్గము, ప్యారడైజ్. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తము చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. ఈ విషయము సదా బుద్ధిలో తిరుగుతూ ఉన్నా చాలా మంచిది.

దగ్గు మొదలైనవేవైతే వస్తూ ఉంటాయో, అది కర్మభోగము, ఇది పాత చెప్పు కదా. కొత్తది అయితే ఇక్కడ లభించదు. నేనైతే పునర్జన్మ తీసుకోను, అలాగే గర్భములోకి కూడా ప్రవేశించను. నేను ఒక సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను. ఇప్పుడున్నది వానప్రస్థావస్థ, ఇక ఇప్పుడు వాణి నుండి అతీతముగా శాంతిధామానికి వెళ్ళాలి. ఏ విధముగా రాత్రి పగలుగా, పగలు రాత్రిగా తప్పకుండా అయి తీరుతుందో, అలా పాత ప్రపంచము తప్పకుండా వినాశనమవుతుంది. ఈ సంగమయుగము తప్పకుండా పూర్తి అయి మళ్ళీ సత్యయుగము వస్తుంది. పిల్లలు స్మృతియాత్రపై పూర్తి అటెన్షన్ ఉంచాలి, ప్రస్తుతం దీనిపై చాలా తక్కువ అటెన్షన్ ఉంది, అందుకే బాబా పసి పిల్లలు అని అంటారు. పసితనాన్ని చూపిస్తూ ఉంటారు. బాబాను స్మృతి చేయలేకపోతున్నాను అని అంటారు, మరి అది పసితనమే కదా. తండ్రిని మర్చిపోయేందుకు మీరేమైనా పసి పిల్లలా? మధురాతి మధురమైన తండ్రి, టీచరు, గురువు, అర్ధకల్పపు అతి ప్రియమైన ప్రియుడు, వారిని మీరు మర్చిపోతున్నారా! అర్ధకల్పము దుఃఖములో మీరు వారిని - ఓ భగవంతుడా అని తలచుకుంటూ వచ్చారు! ఆత్మ శరీరము ద్వారానే అంటుంది కదా. ఇప్పుడు నేను వచ్చాను, నన్ను బాగా స్మృతి చేయండి. అనేకులకు దారిని తెలియజేయండి. మున్ముందు ఎంతగానో వృద్ధిని పొందుతూ ఉంటారు. ధర్మము యొక్క వృద్ధి అయితే జరుగుతుంది కదా. అరవింద్ ఘోష్ ఉదాహరణ ఉంది కదా. ఈ రోజు వాళ్ళవి ఎన్ని సెంటర్లు ఉన్నాయి. అదంతా భక్తి మార్గమని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తుంది. ఇది పురుషోత్తములుగా తయారయ్యేందుకు జ్ఞానము. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. తండ్రి వచ్చి మురికి పట్టిన వస్త్రాలన్నింటినీ శుభ్రము చేస్తారు. వారికే మహిమ ఉంది. ముఖ్యమైనది స్మృతి. జ్ఞానమైతే చాలా సహజము. మురళిని చదివి వినిపించండి. స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి చేస్తూ-చేస్తూ ఆత్మ పవిత్రముగా అయిపోతుంది. పెట్రోల్ నిండుతూ ఉంటుంది. అప్పుడిక ఆత్మలైన మీరు పరుగెడతారు. వీరిని శివబాబా ఊరేగింపు అని అనండి, లేక పిల్లలు అని అనండి. తండ్రి అంటారు, నేను కామ చితిపై నుండి దించి, మిమ్మల్ని ఇప్పుడు యోగ చితిపై కూర్చోబెట్టేందుకు వచ్చాను. యోగము ద్వారా ఆరోగ్యము, జ్ఞానము ద్వారా సంపద లభిస్తాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లక్ష్యము-ఉద్దేశ్యాన్ని ఎదురుగా ఉంచుకుని సంతోషములో ఉండాలి. ఎప్పుడూ నిరాశపడకూడదు - అందరూ రాజులుగా అవ్వలేరు కదా అన్న ఆలోచన ఎప్పుడూ రాకూడదు. పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందాలి.

2. అతి ప్రియమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి, ఈ విషయములో పసి పిల్లలుగా అవ్వకూడదు. స్మృతి చేసేందుకు ఉదయము సమయము మంచిది. ప్రశాంతముగా శాంతిలో కూర్చుని స్మృతి చేయండి.

వరదానము:-
యజ్ఞ సేవ ద్వారా సర్వ పాప్తుల ప్రసాదాన్ని ప్రాప్తి చేసుకునే ఆల్రౌండ్ సేవాధారీ భవ

సంగమయుగములో ఆల్రౌండ్ సేవ యొక్క అవకాశము లభించడము - ఇది కూడా డ్రామాలో ఒక లిఫ్ట్ వంటిది, ఎవరైతే ప్రేమతో యజ్ఞములో ఆల్రౌండ్ సేవ చేస్తారో, వారికి సర్వ ప్రాప్తుల ప్రసాదము స్వతహాగా ప్రాప్తిస్తుంది. వారు నిర్విఘ్నముగా ఉంటారు. ఒకసారి సేవ చేసినందుకు వేయి సార్లు సేవ యొక్క ఫలము ప్రాప్తిస్తుంది. సదా స్థూలమైన, సూక్ష్మమైన లంగరు వేయబడి ఉండాలి. ఎవరినైనా సంతుష్టపరచడము - ఇది అన్నింటికన్నా గొప్ప సేవ. అతిథి సత్కారము చేయడము, ఇది అన్నింటికన్నా గొప్ప భాగ్యము.

స్లోగన్:-
స్వమానములో స్థితులై ఉన్నట్లయితే అనేక రకాల అభిమానాలు స్వతహాగా సమాప్తమైపోతాయి.

అవ్యక్త సూచనలు - ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

ఏ విధంగా ప్రపంచములోని రాయల్ ఆత్మలు ఎప్పుడూ చిన్న-చిన్న విషయాలలో, చిన్న వస్తువుల కోసము తమ బుద్ధిని, సమయాన్ని కేటాయించరో, చూస్తూ చూడనట్లుగా ఉంటారో, వింటూ విననట్లుగా ఉంటారో, అలాగే ఆత్మిక రాయల్ ఆత్మలైన మీరు ఏ ఆత్మకు సంబంధించిన చిన్న-చిన్న విషయాలకైనా, ఏవైతే రాయల్ విషయాలు కావో, వాటి కోసము మీ బుద్ధిని, సమయాన్ని కేటాయించలేరు. ఆత్మిక రాయల్ ఆత్మల నోటి నుండి ఎప్పుడూ వ్యర్థమైన లేక సాధారణమైన మాటలు కూడా వెలువడలేవు.