15-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మాయాజీతులుగా అయ్యేందుకు పొరపాట్లు చేయడం విడిచిపెట్టండి, దుఃఖము ఇవ్వడము మరియు దుఃఖము తీసుకోవడము - ఇది చాలా పెద్ద పొరపాటు, దీనిని పిల్లలైన మీరు చేయకూడదు’’

ప్రశ్న:-
తండ్రికి పిల్లలైన మనందరిపైన ఏ ఒక్క ఆశ ఉంది?

జవాబు:-
తండ్రి యొక్క ఆశ ఏమిటంటే - నా పిల్లలందరూ నా సమానంగా ఎవర్ ప్యూర్ గా (సదా పవిత్రముగా) అవ్వాలి. తండ్రి సదా తెల్లగా ఉంటారు, వారు పిల్లలను నల్లనివారి నుండి తెల్లనివారిగా తయారుచేయడానికి వచ్చారు. మాయ నల్లగా తయారుచేస్తుంది, తండ్రి తెల్లగా తయారుచేస్తారు. లక్ష్మీ-నారాయణులు తెల్లగా ఉంటారు, అందుకే నల్లని పతిత మనుష్యులు వెళ్ళి వారి మహిమను గానం చేస్తారు, స్వయాన్ని నీచులుగా భావిస్తారు. తండ్రి యొక్క శ్రీమతం ఇప్పుడు లభిస్తుంది - మధురమైన పిల్లలూ, ఇప్పుడు తెల్లగా, సతోప్రధానముగా అయ్యే పురుషార్థము చేయండి.

ఓంశాంతి
తండ్రి ఏం చేస్తున్నారు మరియు పిల్లలు ఏం చేస్తున్నారు? మన ఆత్మ ఏదైతే తమోప్రధానముగా అయిపోయిందో, దానిని సతోప్రధానముగా తయారుచేయాలని పిల్లలకు కూడా తెలుసు మరియు తండ్రికి కూడా తెలుసు. దానిని స్వర్ణిమ యుగానికి చెందినది అని అంటారు. తండ్రి ఆత్మలను చూస్తారు. నా ఆత్మ నల్లగా అయిపోయింది అన్న ఆలోచన ఆత్మకే కలుగుతుంది. ఆత్మ కారణంగానే శరీరము కూడా నల్లగా అయిపోయింది. లక్ష్మీ-నారాయణుల మందిరములోకి వెళ్తారు, ఇంతకుముందైతే ఏ మాత్రమూ జ్ఞానం లేదు. వీరైతే సర్వగుణ సంపన్నులుగా, తెల్లగా ఉన్నారు, మేమైతే నల్లగా, భూతాల వలె ఉన్నాము అని భావించేవారు. కానీ జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు లక్ష్మీ-నారాయణుల మందిరములోకి వెళ్లినట్లయితే, మేమైతే మొదట ఈ విధంగా సర్వగుణ సంపన్నులుగా ఉండేవారము, ఇప్పుడు నల్లగా, పతితులుగా అయ్యామని భావిస్తారు. వారి ఎదురుగా వెళ్ళి - మేము నల్లనివారము, వికారులము, పాపులము అని అంటారు. వివాహం చేసాక మొదట లక్ష్మీ-నారాయణుల మందిరంలోకి తీసుకువెళ్తారు. ఇరువురూ మొదట నిర్వికారులుగా ఉంటారు, ఆ తర్వాత వికారులుగా అవుతారు. అందుకే నిర్వికారీ దేవతల ఎదురుగా వెళ్ళి స్వయాన్ని వికారులము, పతితులము అని అంటారు. వివాహం జరగక ముందు ఈ విధంగా అనరు. వికారాలలోకి వెళ్ళడంతోనే మళ్ళీ మందిరాలకు వెళ్ళి వారి మహిమను చేస్తారు. ఈ రోజుల్లోనైతే లక్ష్మీ-నారాయణుల మందిరాలలో, శివుని మందిరాలలో వివాహాలు జరుగుతున్నాయి. పతితులుగా అవ్వడానికి కంకణం కట్టుకుంటారు. ఇప్పుడు మీరు తెల్లగా అవ్వడానికి కంకణం కట్టుకుంటారు, అందుకే తెల్లగా తయారుచేసే శివబాబాను స్మృతి చేస్తారు. ఈ రథములో భృకుటి మధ్యలో శివబాబా ఉన్నారని మీకు తెలుసు, వారు సదా పావనులు. పిల్లలు కూడా పవిత్రముగా, తెల్లగా అవ్వాలి, నన్నొక్కరినే స్మృతి చేసి ప్యూర్ గా (పవిత్రముగా) అవ్వాలి అన్న ఆశ మాత్రమే వారికి ఉంటుంది. ఆత్మ తండ్రినే స్మృతి చేయాలి. తండ్రి కూడా పిల్లలను చూస్తూ-చూస్తూ హర్షిస్తారు. పిల్లలైన మీరు కూడా తండ్రిని చూస్తూ-చూస్తూ, పవిత్రముగా అవ్వాలి అని భావిస్తారు, అప్పుడు మనం ఈ విధంగా లక్ష్మీ-నారాయణుల వలె తయారవుతాము. ఈ లక్ష్యము-ఉద్దేశ్యము పిల్లలు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. తండ్రి వద్దకు వచ్చేసాము కదా, సరిపోతుంది అని కాదు, మళ్ళీ అక్కడకు వెళ్ళడంతోనే తమ వ్యాపారాలు మొదలైనవాటిలో నిమగ్నమైపోతారు, అందుకే ఇక్కడ తండ్రి సమ్ముఖముగా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. భృకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. అకాలమూర్తి అయిన ఆత్మ యొక్క సింహాసనము ఇది, నా పిల్లలైన ఆత్మలెవరైతే ఉన్నారో, వారు ఈ సింహాసనముపై కూర్చుని ఉన్నారు. ఆత్మ స్వయం తమోప్రధానముగా ఉంది కావున సింహాసనం కూడా తమోప్రధానముగా ఉంది. ఇవి మంచి రీతిలో అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ విధంగా లక్ష్మీ-నారాయణుల వలె అవ్వడం సులువైన విషయమేమీ కాదు. మేము వీరి వలె తయారవుతున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మ పవిత్రముగా అయ్యే వెళ్తుంది. ఆ తర్వాత దేవీ-దేవతలుగా పిలువబడతారు. మనం ఇటువంటి స్వర్గానికి యజమానులుగా అవుతాము. కానీ మాయ ఎటువంటిదంటే, అది మరపింపజేస్తుంది. కొందరు ఇక్కడి నుండి విని బయటకు వెళ్తారు, ఆ తర్వాత మర్చిపోతారు, అందుకే బాబా మంచి రీతిలో పక్కా చేయిస్తారు - ఎంతగానైతే ఈ దేవతలలో గుణాలు ఉన్నాయో వాటిని మేము శ్రీమతముపై నడిచి ధారణ చేసామా అని స్వయాన్ని చూసుకోవాలి. చిత్రాలు కూడా ఎదురుగానే ఉన్నాయి. మనము ఈ విధంగా తయారవ్వాలని మీకు తెలుసు. ఆ విధంగా తండ్రే తయారుచేస్తారు. ఇంకెవ్వరూ మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయలేరు. ఒక్క తండ్రే అలా తయారుచేస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా... అన్న గాయనము కూడా ఉంది. మీకు కూడా నంబరువారుగానే తెలుసు. ఈ విషయాల గురించి భక్తులకు తెలియదు. ఎప్పటివరకైతే భగవంతుని శ్రీమతాన్ని తీసుకోరో, అప్పటివరకూ ఏమీ అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీరు ఇప్పుడు శ్రీమతాన్ని తీసుకుంటున్నారు. మేము శివబాబా మతముపై బాబాను స్మృతి చేస్తూ-చేస్తూ ఈ విధంగా తయారవుతున్నాము అన్న విషయాన్ని మంచి రీతిలో బుద్ధిలో పెట్టుకోండి. స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి, ఇంకే ఉపాయమూ లేదు.

లక్ష్మీ-నారాయణులైతే తెల్లనివారు కదా. మందిరాలలో మరి నల్లగా తయారుచేసేసారు. రఘునాథుని మందిరములో రాముడిని ఎందుకు నల్లగా తయారుచేసారు? ఇది ఎవ్వరికీ తెలియదు. ఇది ఎంత చిన్న విషయము. బాబా అర్థం చేయిస్తారు - ప్రారంభంలో వీరు సతోప్రధానముగా, సుందరముగా ఉండేవారు. ప్రజలు కూడా సతోప్రధానముగా అవుతారు, కానీ శిక్షలు అనుభవించి అలా అవుతారు. ఎంత ఎక్కువగా శిక్షలు ఉంటాయో, అంతగా పదవి కూడా తగ్గిపోతుంది. శ్రమ చేయకపోతే పాపాలు తొలగవు. పదవి తగ్గిపోతుంది. తండ్రి అయితే స్పష్టం చేసి అర్థం చేయిస్తారు. మీరు తెల్లగా అయ్యేందుకు ఇక్కడ కూర్చున్నారు. కానీ మాయ పెద్ద శత్రువు, అది నల్లగా చేసేసింది. ఇప్పుడు తెల్లగా తయారుచేసేవారు వచ్చారని మాయ చూస్తుంది, కావున అది ఎదుర్కోవడానికి వస్తుంది. తండ్రి అంటారు - డ్రామానుసారంగా వారు అర్ధకల్పం ఈ విధంగా పాత్రను అభినయించాలి. మాయ ఘడియ-ఘడియ ముఖాన్ని తిప్పి ఇంకొక వైపుకు తీసుకువెళ్తుంది. బాబా, మమ్మల్ని మాయ ఎంతగానో విసిగిస్తుంది అని వ్రాస్తారు. బాబా అంటారు - ఇదే యుద్ధము. మీరు తెల్లనివారు నుండి నల్లనివారిగా, మళ్ళీ నల్లనివారి నుండి తెల్లనివారిగా అవుతారు, ఇది ఒక ఆట. ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారో, వారికే అర్థం చేయిస్తారు. వారి పాదాలు భారత్ లోకే వస్తాయి. అలాగని భారత్ లో అందరూ 84 జన్మలు తీసుకుంటారని కాదు.

ఇప్పుడు పిల్లలైన మీ ఈ సమయము చాలా విలువైనది. మేము ఈ విధంగా తయారవ్వాలి అని పూర్తిగా పురుషార్థం చేయాలి. తండ్రి తప్పకుండా చెప్పారు - కేవలం నన్ను స్మృతి చేయండి మరియు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు ఇటువంటి పొరపాట్లు చేయకండి. బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించండి. మేము మీపై బలిహారమవుతాము అని మీరు ప్రతిజ్ఞ చేసారు. జన్మ-జన్మాంతరాలూ ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు - బాబా, మీరు వచ్చినట్లయితే మేము మీ మతముపైనే నడుస్తాము, పావనంగా అయి దేవతలుగా అవుతాము. ఒకవేళ యుగళ్ మీకు తోడును ఇవ్వకపోతే మీరు మీ పురుషార్థాన్ని చేయండి. యుగళ్ తోడును నిర్వర్తించకపోతే జోడీ తయారవ్వదు. ఎవరు ఎంతగా స్మృతి చేసి ఉంటారో, దైవీ గుణాలను ధారణ చేసి ఉంటారో, వారి జోడీయే తయారవుతుంది. చూడండి, బ్రహ్మా-సరస్వతులు చాలా మంచి పురుషార్థం చేసారు కావున జోడీ తయారయ్యింది. వీరు చాలా బాగా సేవ చేస్తారు, స్మృతిలో ఉంటారు, ఇది కూడా గుణమే కదా. గోపులు (అన్నయ్యల) లో కూడా మంచి-మంచి పిల్లలు ఎందరో ఉన్నారు. కొందరు తమకు తామే ఈ విధంగా అర్థం చేసుకుంటారు - మాయ యొక్క ఆకర్షణ కలుగుతుంది, ఈ సంకెళ్ళు తెగడం లేదు. మాయ ఘడియ-ఘడియ నామ-రూపాలలో చిక్కుకునేలా చేస్తుంది. తండ్రి అంటారు - నామ-రూపాలలో చిక్కుకోకండి, నాలో చిక్కుకోండి కదా. ఎలాగైతే మీరు నిరాకారులో, అలాగే నేను కూడా నిరాకారుడిని. మిమ్మల్ని నా సమానముగా తయారుచేస్తాను. టీచర్ తమ సమానముగా తయారుచేస్తారు కదా. సర్జన్, సర్జన్ వలె తయారుచేస్తారు. వీరైతే అనంతమైన తండ్రి, వారి పేరు ఎంతో ప్రసిద్ధమైనది. ఓ పతిత-పావనా రండి అని కూడా పిలుస్తారు. బాబా వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని ఆత్మ శరీరము ద్వారా పిలుస్తుంది. మనల్ని పావనంగా ఎలా తయారుచేస్తున్నారు అన్నది మీకు తెలుసు. ఏ విధంగా వజ్రాలు ఉంటాయి, వాటిలో కూడా కొన్ని నల్లని మచ్చలతో ఉంటాయి. ఇప్పుడు ఆత్మలో మాలిన్యం చేరుకుంది, దానిని తొలగించి మళ్ళీ స్వచ్ఛమైన బంగారముగా తయారవుతారు. ఆత్మ ఎంతో పవిత్రముగా అవ్వాలి. మీ లక్ష్యము-ఉద్దేశ్యము స్పష్టంగా ఉంది. ఇతర సత్సంగాలలో ఈ విధంగా ఎప్పుడూ చెప్పరు.

ఈ విధంగా తయారవ్వడమే మీ ఉద్దేశ్యము అని తండ్రి అర్థం చేయిస్తారు. మీకు తెలుసు - డ్రామానుసారంగా మనం అర్ధకల్పం రావణుని సాంగత్యములో వికారులుగా అయ్యాము. ఇప్పుడు ఈ విధంగా తయారవ్వాలి. మీ వద్ద బ్యాడ్జి కూడా ఉంది. దీనిపై అర్థం చేయించడం చాలా సహజము. ఇది త్రిమూర్తి చిత్రము. బ్రహ్మా ద్వారా స్థాపన అని అంటారు కానీ బ్రహ్మా అయితే స్థాపన చేయరు. వారైతే పతితము నుండి పావనముగా అవుతారు. ఈ పతితులే మళ్ళీ పావనులుగా అవుతారు అన్నది మనుష్యులకు తెలియదు. చదువు యొక్క గమ్యం చాలా ఉన్నతమైనదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. చదివించడానికి తండ్రి వస్తారు. బాబాలోనే జ్ఞానం ఉంది, వారు ఎవరి నుండి చదువుకోలేదు. డ్రామా ప్లాన్ అనుసారంగా వారిలో జ్ఞానం ఉంది. వీరిలోకి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని ఈ విధంగా అనరు. అలా కాదు. వారు ఉన్నదే నాలెడ్జ్ ఫుల్. వారే మిమ్మల్ని పతితుల నుండి పావనలుగా తయారుచేస్తారు. మనుష్యులైతే పావనముగా అవ్వడానికి గంగ మొదలైనవాటిలో స్నానాలు చేస్తూనే ఉంటారు. సముద్రంలో కూడా స్నానాలు చేస్తారు. ఇంకా పూజలు కూడా చేస్తారు, సాగరుడిని దేవతగా భావిస్తారు. వాస్తవానికి నదులు ఏవైతే ప్రవహిస్తాయో, అవి ఉండనే ఉన్నాయి. అవి ఎప్పటికీ వినాశనమవ్వవు. ఇకపోతే ఇంతకుముందు అవి క్రమబద్ధంగా ఉండేవి. వరదలు మొదలైనవాటి మాటే ఉండేది కాదు. మనుష్యులు ఎప్పుడూ మునిగిపోయేవారు కాదు. అక్కడ మనుష్యులు కొద్దిమంది ఉండేవారు, ఆ తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు. కలియుగ అంతిమానికి ఎంతమంది మనుష్యులు అయిపోతారు. అక్కడైతే ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత తక్కువమంది మనుష్యులు ఉంటారు. మళ్ళీ 2500 సంవత్సరాలలో ఎంత వృద్ధి జరుగుతుంది. వృక్షము ఎంతగా విస్తరిస్తుంది. మొట్టమొదట భారత్ లో కేవలం మా రాజ్యమే ఉండేదని మీరు అంటారు. మేము మా రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అన్నది గుర్తుండేవారు కూడా మీలో కొందరే ఉన్నారు. మేము ఆత్మిక యోధులము, యోగబలం కలవారము అన్నది కూడా మర్చిపోతారు. మనం మాయతో యుద్ధం చేసేవారము. ఇప్పుడు ఈ రాజధాని స్థాపన జరుగుతుంది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా విజయులుగా అవుతారు. ఈ విధంగా అవ్వాలి అన్న లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. వీరి ద్వారా బాబా మనల్ని ఈ విధంగా దేవతలుగా తయారుచేస్తారు. మరి ఏమి చేయాలి? తండ్రిని స్మృతి చేయాలి. వీరు మధ్యవర్తి. ఎప్పుడైతే సద్గురువు మధ్యవర్తి రూపములో లభించారో... అన్న గాయనము కూడా ఉంది. బాబా ఈ శరీరాన్ని తీసుకుంటారు, అంటే వీరు మధ్యవర్తిగా అయినట్లు కదా. శివబాబాతో మీ యోగాన్ని జోడింపజేస్తారు. అంతేకానీ నిశ్చితార్థము మొదలైనవాటి గురించి ప్రస్తావించకండి. శివబాబా వీరి ద్వారా మన ఆత్మను పవిత్రముగా తయారుచేస్తారు. వారంటారు - ఓ పిల్లలూ, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. మీరైతే - తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని ఇలా అనరు. బాబా ఈ విధంగా చెప్తున్నారని మీరు తండ్రి యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారు. ఈ విషయాన్ని కూడా తండ్రి మంచి రీతిలో అర్థం చేయిస్తారు. మున్ముందు చాలా మందికి సాక్షాత్కారమవుతుంది, అప్పుడు మనసు లోలోపల తింటూ ఉంటుంది. తండ్రి అంటారు - ఇప్పుడు చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఈ కళ్ళతో మీరు వినాశనాన్ని చూస్తారు. ఎప్పుడైతే రిహార్సల్ జరుగుతుందో, అప్పుడు ఈ విధంగా వినాశనమవుతుంది అని మీరు చూస్తారు. ఈ కళ్ళతో కూడా ఎంతో చూస్తారు, చాలామందికి వైకుంఠం యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఇవన్నీ త్వరత్వరగా జరుగుతూ ఉంటాయి. జ్ఞాన మార్గంలో అన్నీ రియల్ గా ఉంటాయి, భక్తిలో అంతా ఇమిటేషన్ ఉంటుంది. కేవలం సాక్షాత్కారము జరుగుతుంది, ఆ విధంగా ఏమీ తయారవ్వరు. మీరైతే ఆ విధంగా తయారవుతారు. ఏదైతే సాక్షాత్కారం జరిగిందో, దానిని మళ్ళీ ఈ కళ్ళతో చూస్తారు. వినాశనాన్ని చూడడం సులువైన విషయమేమీ కాదు, ఇక అడగకండి. ఒకరినొకరు ఎదురుగా హతమార్చుకుంటారు. రెండు చేతులతో చప్పట్లు మ్రోగుతాయి కదా. పరస్పరం కూర్చొని గొడవపడండి అని ఇరువురి సోదరులనూ వేరు చేసేస్తారు. ఇది కూడా డ్రామా తయారై ఉంది. ఈ రహస్యాన్ని వారు అర్థం చేసుకోరు. ఇద్దరినీ వేర్వేరు చేయడంతో కోట్లాడుకుంటూ ఉంటారు. తద్వారా వారి ఆయుధాలు అమ్ముడుపోతూ ఉంటాయి. అది సంపాదనే కదా. కానీ చివరిలో వాటితో పని జరగదు. ఇంట్లో కూర్చునే బాంబులను వేస్తారు, ఇక అంతమైపోతుంది. అందులో మనుష్యుల అవసరము కానీ ఆయుధాల అవసరము కానీ ఉండదు. కావున తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలు, స్థాపనైతే తప్పకుండా జరగాల్సిందే. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో, అంతటి ఉన్నత పదవిని పొందుతారు. అర్థం చేయించడమైతే ఎంతగానో అర్థం చేయిస్తారు. భగవంతుడు చెప్తారు - ఈ కామ ఖడ్గాన్ని ఉపయోగించకండి. కామాన్ని జయిస్తే జగత్తును జయిస్తారు. చివరిలో ఎవరో ఒకరికి తప్పకుండా బాణం తగులుతుంది. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ సమయం ఎంతో విలువైనది, ఇప్పుడే పురుషార్థం చేసి తండ్రిపై పూర్తిగా బలిహారమవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఏ రకమైన పొరపాట్లూ చేయకూడదు. ఒక్క తండ్రి మతముపైనే నడవాలి.

2. లక్ష్యాన్ని-ఉద్దేశ్యాన్ని ఎదురుగా ఉంచుకొని చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆత్మను సతోప్రధానముగా, పవిత్రముగా తయారుచేసుకునేందుకు కృషి చేయాలి. లోపల ఏవైతే మచ్చలు ఉన్నాయో, వాటిని పరిశీలించి తొలగించుకోవాలి.

వరదానము:-

బ్రాహ్మణ జీవితములో ప్రతి క్షణము సుఖమయ స్థితిని అనుభవము చేసుకునే సంపూర్ణ పవిత్ర ఆత్మా భవ

పవిత్రతయే సుఖ-శాంతులకు జనని అని అంటారు. ఏ రకమైన అపవిత్రత అయినా దుఃఖము, అశాంతిని అనుభవము చేయిస్తుంది. బ్రాహ్మణ జీవితము అనగా ప్రతి క్షణము సుఖమయ స్థితిలో ఉండేవారు. దుఃఖపు దృశ్యమైనా కానీ, ఎక్కడైతే పవిత్రతా శక్తి ఉంటుందో, అక్కడ దుఃఖము యొక్క అనుభవము కలగదు. పవిత్ర ఆత్మలు మాస్టర్ సుఖకర్తలుగా అయ్యి దుఃఖాన్ని ఆత్మిక సుఖమయ వాయుమండలముగా పరివర్తన చేస్తారు.

స్లోగన్:-

సాధనాలను ఉపయోగిస్తూ సాధనను పెంచడమే అనంతమైన వైరాగ్య వృత్తి.