15-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని ఇవ్వడానికి అమరుడైన బాబా వచ్చారు, ఇప్పుడు మీకు మూడు కాలాలు మరియు మూడు లోకాల గురించి తెలుసు’’

ప్రశ్న:-
ఆత్మిక తండ్రి ఆత్మలకు వారసత్వాన్ని దేని ఆధారముగా ఇస్తారు?

జవాబు:-
చదువు ఆధారముగా. ఏ పిల్లలైతే మంచి రీతిలో చదువుకుంటారో, దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా ఉండే పురుషార్థము చేస్తారో, వారికే తండ్రి వారసత్వము లభిస్తుంది. లౌకిక తండ్రి కేవలం కొడుకులకు వారసత్వాన్ని ఇస్తారు కానీ పారలౌకిక తండ్రి సంబంధము ఆత్మలతో ఉంటుంది, అందుకే వారు ఆత్మలకు వారసత్వాన్ని ఇస్తారు.

పాట:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు...

ఓంశాంతి
ఆత్మిక పిల్లలు, ఈ మృత్యులోకము నుండి అమరలోకములోకి వెళ్ళేందుకు ఆత్మిక తండ్రి నుండి అమరకథను వింటున్నారు. నిర్వాణధామాన్ని అమరలోకమని అనరు. అమరలోకము అంటే అక్కడ మీరు అకాల మృత్యువును పొందరు, అందుకే దానిని అమరలోకమని అంటారు. ఆత్మిక తండ్రిని అమరనాథుడని అంటారు. వారు అమరలోకానికి తీసుకువెళ్ళేందుకు తప్పకుండా మృత్యులోకములో కథను వినిపిస్తారు. మూడు కథలు భారత్ లోనే ప్రసిద్ధి చెందాయి - అమరకథ, సత్యనారాయణుని కథ, మూడవ నేత్రము కథ. భక్తి మార్గములోనైతే ఎవరికీ మూడవ నేత్రము కథ యొక్క అర్థం తెలియదు. జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని జ్ఞాన సాగరుడు, అమరుడైన బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇక్కడివారు కూడా అసత్య కథలను వినిపిస్తారు. మాకు ఇప్పుడు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభిస్తుందని మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు, ఆ మూడవ నేత్రముతో మీరు మూడు కాలాల గురించి, మూడు లోకాల గురించి తెలుసుకున్నారు. మీరు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము యొక్క ఆదిమధ్యాంతాలను కూడా తెలుసుకున్నారు, అందుకే పిల్లలు తమను తాము త్రికాలదర్శులుగా కూడా భావిస్తారు. మధురాతి మధురమైన పిల్లలైన మీరు తప్ప సృష్టిలో ఇంకెవరూ త్రికాలదర్శులుగా ఉండరు. ఇంకెవరికీ మూడు కాలాలు అనగా సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము గురించైతే చాలామందికి తెలుసు. కానీ మూడు కాలాల ఆదిమధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ద్వారా వింటున్నారు. మనము వారి పిల్లలుగా అయ్యాము. ఆత్మిక పిల్లలైన మీకు ఆత్మిక తండ్రి ఒక్కసారి మాత్రమే లభించారు. వారు ఆత్మలను చదివిస్తారు. మిగిలినవారంతా దేహాభిమానులుగా ఉన్న కారణముగా - నేను ఇది చదువుతున్నాను, నేను ఇది చేస్తున్నాను అని అంటారు. దేహాభిమానము వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సంగమములో ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు - మీరు మంచి రీతిలో చదువుకోండి అని చెప్తున్నారు. తండ్రి నుండి ప్రతి బిడ్డ వారసత్వాన్ని తీసుకునేందుకు హక్కుదారుడే, ఎందుకంటే అందరూ ఆత్మిక పిల్లలే కదా. లౌకిక సంబంధములో కేవలం కొడుకులు మాత్రమే వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. ఈ పారలౌకిక సంబంధములో పిల్లలందరికీ అనగా ఆత్మలందరికీ వారసత్వము లభిస్తుంది. అమరనాథుని కథను కూడా వినిపిస్తారు. పార్వతికి పర్వతముపై ఉన్న గుహలలో కథ వినిపించారని అంటారు. ఇది తప్పు కదా. ఇప్పుడు అసత్యమేమిటి, సత్యమేమిటి అనేది పిల్లలైన మీకు తెలుసు. సత్యాన్ని తప్పకుండా సత్యమైన బాబాయే వినిపిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే సత్యాన్ని వినిపించి సత్యఖండానికి యజమానులుగా తయారుచేస్తారు. ఈ అసత్య ఖండానికి నిప్పు అంటుకోనున్నదని మీకు తెలుసు. ఇప్పుడు ఈ కంటికి ఏదైతే కనిపిస్తుందో, ఇదేదీ మిగలదు. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఎలాగైతే లౌకిక సంబంధములో కూడా తండ్రి యజ్ఞాన్ని రచిస్తారో, అలా ఇది శివబాబా జ్ఞాన యజ్ఞము. కొందరు రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు, కొందరు గీతా యజ్ఞాన్ని రచిస్తారు, కొందరు రామాయణ యజ్ఞాన్ని రచిస్తారు. ఇది శివబాబా జ్ఞాన యజ్ఞము లేదా రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇది అంతిమ యజ్ఞము.

మనము అమరపురిలోకి ఇప్పుడు వెళ్తున్నామని మీకు తెలుసు. ఇంకా కొన్ని నిమిషాల మార్గమే మిగిలి ఉంది. ఇది మనుష్యులెవరికీ తెలియదు. వారేమంటారంటే - మృత్యులోకము నుండి అమరలోకానికి వెళ్ళడానికి ఇంకా 40 వేల సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. అమరలోకమని సత్యయుగాన్ని అంటారు. పిల్లలైన మీకు ఇప్పుడు బాబా సమ్ముఖముగా కూర్చుని అమరకథను, మూడవ నేత్రము కథను, సత్యనారాయణుడి కథను వినిపిస్తున్నారు. భక్తి మార్గములో ఏమేమి జరుగుతుంది అనేది మీరు చూసారు. భక్తి మార్గము యొక్క విస్తారము ఎంత ఉంది. ఎలాగైతే వృక్షము యొక్క విస్తారము పెద్దదిగా ఉంటుందో, అలాగే భక్తి కూడా పెద్ద కర్మ కాండల వృక్షము వంటిది. యజ్ఞాలు, వ్రతాలు, నోములు, జప-తపాదులు మొదలైనవి ఎన్ని చేస్తారు. ఈ జన్మలోని భక్తులే చాలా మంది ఉన్నారు. మనుష్యుల సంఖ్య వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు భక్తి మార్గములోకి వచ్చినప్పటి నుండి వేరే ధర్మాలు స్థాపనయ్యాయి. ప్రతి ఒక్కరికీ తమ ధర్మముతో కనెక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆచార-పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి. భారత్ అమరపురిగా ఉండేది, భారత్ ఇప్పుడు మృత్యులోకములా ఉంది. మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము వారిగా ఉండేవారు. కానీ ఇప్పుడు పతితముగా అయిన కారణముగా మీరు స్వయాన్ని దేవతలుగా చెప్పుకోలేరు. మేమే దేవతలుగా ఉండేవారము అన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. క్రైస్టు మా ధర్మాన్ని స్థాపన చేసారు కావున క్రిస్టియన్లు కొనసాగుతూ వచ్చారు - అని వారు అంటారు. అంతేకానీ వారు యూరోపియన్ ధర్మానికి చెందినవారని కాదు. వాస్తవానికి హిందుస్థాన్ లో నివసించేవారు అనగా భారత్ లో నివసించే మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. కానీ తమను తాము దేవతలుగా చెప్పుకోలేరు. మేమైతే పాపులము, నీచులము, నిరుపేదలము, వికారులము అని స్వయాన్ని భావిస్తారు. భక్తి మార్గములో మనుష్యులు దుఃఖితులుగా అయినప్పుడు తండ్రినే పిలుస్తారు. ఏ తండ్రినైతే పిలుస్తూ వచ్చామో, ఆ తండ్రి మనకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు అమరకథను వినిపిస్తున్నారని కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనము అమరపురికి యజమానులుగా అవ్వబోతున్నాము. అమరపురిని స్వర్గమని అంటారు. మేము స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నామని మీరంటారు. కలియుగములో మనుష్యులు మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు. కానీ వాస్తవానికి వారు స్వర్గములోకి వెళ్ళేందుకు పురుషార్థమేమీ చేయలేదు. మీరైతే అమరపురికి, వైకుంఠములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. పురుషార్థము చేయించేవారు ఎవరు? అమరుడైన బాబా. వారిని అమరనాథుడు అని కూడా అంటారు. ఈ యజ్ఞాన్ని పాఠశాల అని కూడా అనడము జరుగుతుంది. వేరే ఏ పాఠశాలలనూ యజ్ఞము అని అనడము జరగదు. యజ్ఞాలను వేరుగా రచిస్తారు, అక్కడ బ్రాహ్మణులు కూర్చుని మంత్రాలు జపిస్తూ ఉంటారు. తండ్రి అంటారు - ఇది మీ కాలేజీ కూడా, యజ్ఞము కూడా, రెండూ కలిసి ఉన్నాయి. ఈ జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యిందని మీకు తెలుసు, ఇందులో మొత్తము ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. తర్వాత కొత్త ప్రపంచము తయారవ్వనున్నది, దీని పేరే మహాభారీ మహాభారత యుద్ధము. ఇలాంటి యుద్ధము ఇంకేదీ ఉండదు. యుద్ధములో మిసైల్స్ ద్వారా యుద్ధము జరిగిందని అంటారు. యుద్ధము మీతో ఏమీ జరగదు. దీనిని మహాభారత యుద్ధమని ఎందుకు అంటారు? భారత్ లోనైతే ఒక్క ధర్మమే ఉంటుంది కదా. మృత్యువైతే బయట జరుగుతుంది. ఇక్కడ యుద్ధము యొక్క విషయమైతే ఏమీ లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీ కోసం కొత్త ప్రపంచము కావాలి కావున తప్పకుండా పాత ప్రపంచము వినాశనమవుతుంది.

పిల్లలైన మీ బుద్ధిలో విరాట రూపానికి సంబంధించిన జ్ఞానమంతా కూడా ఉంది. ఎవరైతే కల్పక్రితం వచ్చారో, వారే దేవతలుగా అయ్యేందుకు మళ్ళీ వస్తారని కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇదంతా బుద్ధితో అర్థం చేసుకోవలసినది. మనము ఎంతమంది అయితే బ్రాహ్మణులుగా అయ్యామో, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము. ప్రజాపిత బ్రహ్మాను కూడా మహిమ చేసారు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు, అందుకే బ్రహ్మాను ప్రజాపిత అని అంటారు. కానీ వారు ఎలా రచిస్తారు, ఎప్పుడు రచిస్తారు, ఇది ఎవరికీ తెలియదు. వారు రచించాల్సిన అవసరము రావడానికి ప్రారంభములో మనుష్యులు ఎవరూ లేరా? పతిత-పావనా రండి, అని పిలుస్తారు కూడా. కావున మనుష్యులు పతితులుగా అయినప్పుడే తండ్రి వస్తారు. ప్రపంచము పరివర్తన అవ్వాల్సి ఉంటుంది. మిమ్మల్ని తండ్రి కొత్త ప్రపంచానికి యోగ్యులుగా తయారుచేస్తారు. ఇప్పుడు అందరూ తమోప్రధాన పాత ప్రపంచములో ఉన్నారు, మళ్ళీ సతోప్రధానముగా తయారవ్వాలి. తండ్రి అర్థం చేయించారు - ప్రతి మనిషి, ప్రతి వస్తువు సతో-రజో-తమోలలోకి రావాల్సి ఉంటుంది. ప్రపంచము తప్పకుండా పాతది నుండి కొత్తదిగా అవుతుంది. వస్త్రాలు కూడా కొత్తవి ధరిస్తారు, అవి తర్వాత పాతబడతాయి. మీకు జ్ఞానము లభించింది. సత్యమైన సత్యనారాయణుని కథను ఇప్పుడు మీరు వింటున్నారు. గీత సర్వశాస్త్రమయి శిరోమణి. మిగిలినవన్నీ గీతకు పిల్లలు. ఎలా అయితే బ్రహ్మా వంశావళి ముఖ్యమైనదో, అలా గీత కూడా ముఖ్యమైనది. ఉన్నతోన్నతమైనవారు తల్లి-తండ్రి, మిగిలినవారంతా పిల్లలు. ఇప్పుడు తల్లి-తండ్రి నుండి వారసత్వము లభించగలదు. మిగిలిన శాస్త్రాలు ఎన్ని చదివినా, ఏమి చేసినా సరే, వారసత్వము లభించదు. మహా అయితే, శాస్త్రాలు చదివేవారికి చాలా సంపాదన ఉంటుంది. కానీ అది అల్పకాలికమైనది. ఇక్కడ పిల్లలైన మీరు వింటున్నారంటే, ఎంత సంపాదిస్తారు - 21 జన్మల కోసం సంపాదిస్తారు, ఆలోచించండి. అక్కడ ఒకరు వినిపిస్తారు, అందరూ వారికి డబ్బులు ఇస్తారు. ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి వినిపిస్తారు - మీరు 21 జన్మల కొరకు ఎంత షావుకారులుగా అవుతారు. అక్కడ వినిపించేవారి జేబులు నిండిపోతాయి. భక్తి మొదలైనవి చేయడము ప్రవృత్తి మార్గము వారి పని. మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. స్వర్గ లోకములో మీరు పూజ్యులుగా ఉండేవారని మీకు తెలుసు. లేదంటే 84 జన్మల లెక్క ఎక్కడ నుండి వస్తుంది? ఇది ఆత్మిక జ్ఞానము, ఇది జ్ఞాన సాగరుడైన పరమ ఆత్మ ద్వారా లభిస్తుంది. పతిత-పావనుడైన తండ్రి మాత్రమే సర్వుల సద్గతిదాత. వారు పిల్లలైన మనకు అమరకథను వినిపిస్తున్నారు. మీరు జన్మ-జన్మలుగా అసత్య కథలను వింటూ వచ్చారు. ఇప్పుడు సత్యమైన కథను విని మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. చంద్రుడిని 16 కళల సంపూర్ణుడని అంటారు, సూర్యుని కోసం అలా అనరు.

ఆత్మలమైన మనము భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా అవుతామని మీకు తెలుసు. మళ్ళీ అర్ధకల్పము తర్వాత ఆత్మలలో మాలిన్యము చేరుతుంది. మనము మళ్ళీ సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపన్నులుగా... అనగా దేవతలుగా మళ్ళీ తయారవుతున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మలమైన మనము ముందు మన ఇంటికి వెళ్తాము, ఆ తర్వాత మనము శరీరాన్ని ధరించి దేవతలుగా అవుతాము, ఆ తర్వాత చంద్రవంశములోకి వస్తాము. 84 జన్మల లెక్క ఉండాలి. ఏ యుగములో ఎన్ని జన్మలు తీసుకున్నామని తండ్రి మనకు 84 జన్మల సత్యాతి-సత్యమైన కథను ఇప్పుడు వినిపించారు. భారతవాసులైన మీరు 84 జన్మలు తీసుకుంటారని పిల్లలైన మీకు ఇప్పుడు చెప్తారు. ముందు స్వయాన్ని బ్రాహ్మణులమని భావించాలి. మమ్మా-బాబా అని అంటారు కదా. వారసత్వాన్ని శివబాబా నుండి తీసుకుంటారు, బ్రహ్మాబాబా ద్వారా. బ్రహ్మా కూడా శివబాబాకు చెందినవారిగా అయ్యారు. బ్రహ్మా నుండి వారసత్వము లభించదు. వీరు కూడా సోదరుడు అయినట్లు. వీరు శరీరధారి కదా. పిల్లలైన మీరంతా వారసత్వాన్ని శివబాబా నుండి తీసుకుంటారు. వీరి నుండి (బ్రహ్మా నుండి) కాదు. ఎవరి నుండి అయితే వారసత్వాన్ని పొందమో, వారిని స్మృతి చేయకూడదు. ఒక్క శివబాబానే స్మృతి చేయాలి. మీరే తల్లి-తండ్రి, మేము మీ పిల్లలమని వారినే అంటారు. మీరు వీరి వద్దకు వెళ్ళినప్పుడు, శివబాబా వద్దకు వెళ్తున్నామని బుద్ధిలో ఉంటుంది. ఒక్క శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి. ఆత్మ బిందువు, ఆత్మలో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది. క్షణములో ఎగిరిపోతుంది. ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను. భృకుటి మధ్యలోకి వెళ్ళి విరాజమానమవుతాను. నా ఆత్మ ఈ విధముగా ఉంది అని బుద్ధిలో వివేకము ఉంది. సత్యయుగములోనైతే ఇటువంటి వస్తువును (ఆత్మను) చూడాలనే ఆశ ఉండదు. ఆత్మను దివ్యదృష్టి ద్వారా చూడగలరు. ఈ కళ్ళతో చూసే విషయమేమీ కాదు. భక్తి మార్గములోనే సాక్షాత్కారాలు కలుగుతాయి. రామకృష్ణుని శిష్యుడు వివేకానందుడు. అతను - నేను రామకృష్ణుని ఎదురుగా కూర్చున్నప్పుడు వారి ఆత్మ బయటకు వచ్చి నాలో ప్రవేశించింది - అని చెప్పారు. కానీ అలాగేమీ జరగదు. ఆత్మ ఏ విధముగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరములోకి ప్రవేశిస్తుంది అనే విషయాలన్నింటినీ పిల్లలైన మీకు అర్థం చేయించడము జరుగుతుంది. మనము అమరలోకములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నామని, అమరలోకములో మనము జన్మ తీసుకుంటామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అక్కడ మనము గర్భ మహల్ లో ఉంటాము. ఇక్కడైతే గర్భ జైలులో చాలా దుఃఖపడుతూ రక్షించమని వేడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని అర్ధకల్పము కోసం అన్ని దుఃఖాల నుండి విడిపిస్తారు. కావున ఇటువంటి తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మిక తండ్రి నుండి చదువుకుని పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. సత్యఖండానికి యజమానులుగా అయ్యేందుకు సత్యమైన కథను వినాలి మరియు వినిపించాలి.

2. ఏ తండ్రి నుండైతే అనంతమైన వారసత్వము లభిస్తుందో, వారినే స్మృతి చేయాలి. ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. ఈ పాత ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది, అందుకే దీనిని చూస్తూ కూడా చూడకూడదు.

వరదానము:-
సైలెన్స్ శక్తి ద్వారా తమ రిజిస్టరును శుభ్రము చేసుకునే లోక ప్రియ, ప్రభు ప్రియ భవ

ఎలాగైతే సైన్స్ ఎటువంటి ఆవిష్కరణ చేసిందంటే, దాని ఆధారముగా వ్రాసి ఉన్నదంతా చెరిగిపోతుంది, తెలియనే తెలియదు. అలా మీరు సైలెన్స్ శక్తితో మీ రిజిస్టరును రోజు శుభ్రము చేసుకోండి, అప్పుడు ప్రభు ప్రియులుగా మరియు దైవీ లోక ప్రియులుగా అవుతారు. సత్యతను, స్వచ్ఛతను అందరూ ఇష్టపడతారు, అందుకే ఒక రోజు చేసిన వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ కర్మల యొక్క రేఖ కూడా రెండవ రోజు ఉండకూడదు, గతించినదేదో గతించిపోయింది అని ఫుల్ స్టాప్ పెట్టినట్లయితే రిజిస్టరు శుభ్రముగా ఉంటుంది మరియు యజమాని సంతుష్టమవుతారు.

స్లోగన్:-
వ్యర్థ సంకల్పాలు చేయడము మరియు ఇతరులకు వ్యర్థ సంకల్పాలు నడిపించడానికి నిమిత్తులుగా అవ్వడము - ఇది కూడా అపవిత్రతయే.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు తమ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

మనసు, వాణి, కర్మలలో సరళత మరియు సహనశీలత - ఈ రెండూ అవసరము. ఒకవేళ సరళత ఉంది, సహనశీలత లేదు అంటే కూడా, శ్రేష్ఠత లేనట్లే. సరళతతోపాటు సహనశీలత ఉన్నట్లయితే శక్తి స్వరూపులు అని అంటారు. శక్తుల చిత్రాలలో సరళత మరియు సహనశీలత, రెండు గుణాలను చూపిస్తారు. ఇప్పటి రిజల్టు ప్రకారం ఒక్కో చోట సహనశీలత ఎక్కువగా ఉంది, ఒక్కో చోట సరళత ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ రెండింటినీ సమానము చేయండి.