16-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 05.03.2004


‘‘బలహీన సంస్కారాల యొక్క అంతిమ సంస్కారము చేసి సత్యమైన హోలీని జరుపుకోండి, అప్పుడు ప్రపంచము పరివర్తన అవుతుంది’’

ఈ రోజు బాప్ దాదా తమ నలువైపులా ఉన్న అత్యంత ప్రియమైన రాకుమారుల వంటి పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్ముని అనురాగము కోట్లలో కొందరైన శ్రేష్ఠ ఆత్మలైన మీకే ప్రాప్తించింది. ప్రతి బిడ్డ యొక్క మూడు రాజ్య సింహాసనాలను చూస్తున్నారు. ఈ మూడు సింహాసనాలు మొత్తము కల్పములో ఈ సంగమయుగములోనే పిల్లలైన మీకు ప్రాప్తిస్తాయి. ఆ మూడు సింహాసనాలు కనిపిస్తున్నాయా? ఒకటి - ఈ భృకుటి రూపీ సింహాసనము, దానిపై ఆత్మ మెరుస్తూ ఉంది. రెండవ సింహాసనము - పరమాత్ముని హృదయ సింహాసనము. హృదయ సింహాసనాధికారులు కదా! మరియు మూడవది - భవిష్య విశ్వ సింహాసనము. హృదయ సింహాసనాధికారులుగా అయినందు వలన అందరికంటే భాగ్యవంతులుగా అయ్యారు. ఈ పరమాత్మ హృదయ సింహాసనము అదృష్టవంతులైన పిల్లలైన మీకే ప్రాప్తించింది. భవిష్య విశ్వ రాజ్య సింహాసనమైతే ఎలాగూ ప్రాప్తించేదే ఉంది. కానీ అధికారిగా ఎవరు అవుతారు? ఎవరైతే ఈ సమయములో స్వరాజ్య అధికారిగా అవుతారో వారు. స్వరాజ్యము లేకపోతే విశ్వ రాజ్యము కూడా ఉండదు ఎందుకంటే ఈ సమయములోని స్వరాజ్య అధికారము ద్వారానే విశ్వ రాజ్యము ప్రాప్తిస్తుంది. విశ్వ రాజ్యానికి చెందిన అన్ని సంస్కారాలు ఈ సమయములోనే తయారవుతాయి. మరి ప్రతి ఒక్కరు స్వయాన్ని సదా స్వరాజ్య అధికారిగా అనుభవము చేస్తున్నారా? భవిష్య రాజ్యము యొక్క గాయనమేదైతే ఉందో, అది తెలుసు కదా! ఒకే ధర్మము, ఒకే రాజ్యము, లా అండ్ ఆర్డర్, సుఖ-శాంతులు, సంపదలతో నిండుగా ఉన్న రాజ్యము, ఎన్ని సార్లు ఈ స్వరాజ్యాన్ని మరియు విశ్వ రాజ్యాన్ని పాలించారో గుర్తుకొస్తుందా? ఎన్ని సార్లు పాలించారో గుర్తుందా? స్పష్టముగా గుర్తుకొస్తుందా? లేక గుర్తు తెచ్చుకుంటే గుర్తుకొస్తుందా? నిన్నే రాజ్యము చేసాము మరియు రేపు రాజ్యము చెయ్యాలి అనేంత స్పష్టమైన స్మృతి ఉందా? ఈ స్పష్టమైన స్మృతి ఎవరికి ఉంటుందంటే ఎవరైతే ఇప్పుడు సదా స్వరాజ్య అధికారిగా ఉంటారో వారికి. మరి స్వరాజ్య అధికారులేనా? సదానా లేక అప్పుడప్పుడూనా? ఏమంటారు? సదా స్వరాజ్య అధికారులేనా? డబల్ విదేశీయుల టర్న్ కదా. మరి స్వరాజ్య అధికారులుగా సదా ఉంటున్నారా? పాండవులు, సదా ఉంటున్నారా? సదానా అన్నదానిని అడుగుతున్నారు? ఎందుకు? ఈ ఒక్క జన్మలో, ఇది చిన్న జన్మ కదా, మరి ఈ చిన్న జన్మలో ఒకవేళ సదా స్వరాజ్య అధికారిగా లేనట్లయితే ఇక 21 జన్మల కొరకు సదా స్వరాజ్యము ఎలా ప్రాప్తిస్తుంది! 21 జన్మల కొరకు రాజ్య అధికారిగా అవ్వాలా లేక అప్పుడప్పుడూ అవ్వాలా? మీకు ఏది సమ్మతము? సదా అవ్వాలా? సదానా? తల అయితే ఊపండి. అచ్ఛా, 21 జన్మలూ రాజ్య అధికారిగా అవ్వాలా? రాజ్య అధికారి అనగా రాయల్ ఫ్యామిలీలో కూడా రాజ్య అధికారి. సింహాసనముపైనైతే కొద్దిమందే కూర్చుంటారు కదా, కానీ అక్కడ సింహాసనాధికారులకు ఎంతటి స్వమానము ఉంటుందో అంతగానే రాయల్ ఫ్యామిలీ వారికి కూడా ఉంటుంది. వారిని కూడా రాజ్య అధికారులు అనే అంటారు. కానీ లెక్క ఇప్పటి కనెక్షన్ తో ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ అప్పుడప్పుడు అయితే అక్కడ కూడా అప్పుడప్పుడూనే. ఇప్పుడు సదా అయితే అక్కడ కూడా సదా. కనుక బాప్ దాదా నుండి సంపూర్ణ అధికారాన్ని తీసుకోవటము అనగా వర్తమానము మరియు భవిష్యత్తులో పూర్తిగా 21 జన్మల కొరకు రాజ్య అధికారిగా అవ్వటము. మరి డబుల్ విదేశీయులు పూర్తి అధికారాన్ని తీసుకునేవారా లేక సగమా లేక కొద్దిగానా? ఏమంటారు? పూర్తి అధికారము తీసుకోవాలా? పూర్తిగా. ఒక్క జన్మ కూడా తక్కువవ్వకూడదు. మరి ఏం చెయ్యాల్సి ఉంటుంది?

బాప్ దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరినీ సంపూర్ణ అధికారులుగా తయారుచేస్తారు. తయారయ్యారు కదా? పక్కానా? లేదా అవుతామో, అవ్వమో అన్న ప్రశ్న ఉందా? అవుతామో లేదో తెలియదు అన్న ప్రశ్న అప్పుడప్పుడు ఉత్పన్నమవుతుందా? తయారవ్వాల్సిందే. పక్కానా? తయారవ్వాల్సిందే అనుకునేవారు చేతులెత్తండి. తయారవ్వాల్సిందేనా? అచ్ఛా, వీరంతా ఏ మాలలోని మణులుగా అవుతారు? 108 మాలలోని మణులుగా అవుతారా? ఇక్కడికి ఎంతమంది వచ్చి ఉన్నారు? అందరూ 108 మాలలోకి వచ్చేది ఉందా? ఇక్కడైతే 1800 మంది ఉన్నారు. మరి 108 మాలను పెంచమంటారా? అచ్ఛా. 16000 అయితే మంచిగా అనిపించదు. 16000 లోకి వెళ్తారా ఏమిటి? వెళ్ళరు కదా! ఈ నిశ్చయముంది మరియు ఇది నిశ్చితము అన్న అనుభవము ఉండాలి. మేము అవ్వకపోతే ఇంకెవరు అవుతారు? ఉందా నషా? మీరు తయారవ్వకపోతే మరెవ్వరూ తయారవ్వరు కదా. మీరే అలా తయారయ్యేవారు కదా! చెప్పండి, మీరే కదా! పాండవులూ, మీరే అలా తయారయ్యేవారా? అచ్ఛా. మీ దర్పణములో స్వయాన్ని సాక్షాత్కారము చేసుకున్నారా? బాప్ దాదా అయితే పిల్లల ప్రతి ఒక్కరి నిశ్చయాన్ని చూసి బలిహారమైపోతారు. వాహ్! వాహ్! పిల్లలు ప్రతి ఒక్కరూ వాహ్! వాహ్ వాహ్ వారే కదా! వాహ్ వాహ్ అంటారా లేక వై వై అంటారా? వై (ఎందుకు) అని అనరు కదా? అప్పుడప్పుడు ఎందుకు అన్నది వస్తుందా? కనుక అయితే వై(ఎందుకు) అనేది ఉంటుంది మరియు హాయ్ (అయ్యో) అనేది ఉంటుంది మరియు మూడవది క్రై (ఏడవటము). కానీ మీరైతే వాహ్! వాహ్! వారు కదా!

బాప్ దాదాకు డబుల్ విదేశీయులపై విశేషమైన శుద్ధ గర్వము ఉంది. ఎందుకని? భారతవాసులైతే బాబాను భారత్ లోకి పిలిచేసారు. కానీ డబుల్ విదేశీయులపై ఎందుకని శుద్ధ గర్వము ఉందంటే, డబుల్ విదేశీయులు బాప్ దాదాను తమ సత్యమైన ప్రేమ యొక్క బంధనములో బంధించారు. వారు మెజారిటీ సత్యమైనవారు. కొందరు దాచిపెడతారు కూడా కానీ మెజారిటీ తమలోని బలహీనతలను సత్యతతో బాబా ముందు పెడతారు. బాబాకు అన్నింటికంటే గొప్ప విషయముగా ఏమనిపిస్తుందంటే - సత్యత. అందుకే భక్తిలో కూడా గాడ్ ఈజ్ ట్రూత్ (భగవంతుడు సత్యము) అని అంటారు. అన్నింటికంటే ప్రియమైనది సత్యత ఎందుకంటే ఎవరిలోనైతే సత్యత ఉంటుందో వారిలో స్వచ్ఛత ఉంటుంది. క్లీన్ మరియు క్లియర్ గా (స్వచ్ఛముగా మరియు స్పష్టముగా) ఉంటారు, అందుకే బాప్ దాదాను డబుల్ విదేశీయుల యొక్క సత్యతో కూడిన ప్రేమ అనే తాడు లాగుతుంది. ఎవరో కొందరు కొద్దో-గొప్పో మిక్స్ చేస్తారు. కానీ డబుల్ విదేశీయులు, మీ ఈ సత్యత అనే విశేషతను ఎప్పుడూ వదలకండి. సత్యతా శక్తి ఒక లిఫ్ట్ వలె పని చేస్తుంది. అందరికీ సత్యత మంచిగా అనిపిస్తుంది కదా! పాండవులూ, మంచిగా అనిపిస్తుందా? ఆ మాటకొస్తే మధుబన్ వారికి కూడా ఇష్టమనిపిస్తుంది. నలువైపుల నుండి వచ్చిన మధుబన్ వారు చేతులెత్తండి. దాదీ మిమ్మల్ని భుజాలు అని అంటారు కదా. కనుక మధుబన్ వారు, శాంతివన్ వారు, అందరూ చేతులెత్తండి. చేతులు పైకి ఎత్తండి. మధుబన్ వారికి సత్యత మంచిగా అనిపిస్తుందా? ఎవరిలోనైతే సత్యత ఉంటుందో, వారికి బాబాను గుర్తు చెయ్యటము చాలా సహజమవుతుంది. ఎందుకని? బాబా కూడా సత్యము కదా! కనుక ఎవరైతే సత్యముగా ఉంటారో వారికి సత్యమైన తండ్రి యొక్క స్మృతి త్వరగా కలుగుతుంది. కష్టపడాల్సిన అవసరము ఉండదు. ఒకవేళ ఇప్పుడు కూడా స్మృతిలో కష్టమనిపిస్తుందంటే అర్థం చేసుకోండి - సూక్ష్మముగా సంకల్పమాత్రముగానైనా, స్వప్నమాత్రముగానైనా ఎక్కడో సత్యత తక్కువగా ఉంది. ఎక్కడైతే సత్యత ఉంటుందో, అక్కడ - ‘బాబా’ అని సంకల్పము చేయగానే, హజూర్ హాజరైపోతారు, అందుకే బాప్ దాదాకు సత్యత చాలా ప్రియమనిపిస్తుంది.

బాప్ దాదా పిల్లలందరికీ ఇదే సూచనను ఇస్తున్నారు - 21 జన్మల యొక్క పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే ఇప్పుడు స్వరాజ్యాన్ని చెక్ చేసుకోండి. ఇప్పటి స్వరాజ్య అధికారిగా అవ్వండి. ఎవరు ఎంతగా అవుతారో అంతగానే అధికారము ప్రాప్తిస్తుంది. కనుక చెక్ చేసుకోండి - ఒకే రాజ్యము... అన్న గాయనము ఉంది కదా, అలా ఒకే రాజ్యము ఉంటుంది, రెండు ఉండవు. మరి వర్తమాన స్వరాజ్య స్థితిలో సదా ఒకే రాజ్యము ఉందా? స్వ రాజ్యము ఉందా లేక అప్పుడప్పుడు పర రాజ్యముగా కూడా అయిపోతుందా? అప్పుడప్పుడు ఒకవేళ మాయ రాజ్యము ఉన్నట్లయితే దానిని పర రాజ్యము అని అంటారా లేక స్వ రాజ్యము అని అంటారా? కనుక సదా ఒకే రాజ్యము ఉంటుందా, పరాధీనులుగా అయితే అవ్వటము లేదు కదా? ఒక్కోసారి మాయా రాజ్యము, ఒక్కోసారి స్వ రాజ్యము ఉంటుందా? మరి దీని ద్వారా అర్థం చేసుకోండి - సంపూర్ణ వారసత్వము ఇప్పుడింకా ప్రాప్తిస్తూ ఉంది, అది ఇంకా ప్రాప్తించలేదు, ప్రాప్తిస్తూ ఉంది. కనుక చెక్ చేసుకోండి - సదా ఒకే రాజ్యము ఉందా? అలాగే ఒకే ధర్మము - ధర్మము అనగా ధారణ. మరి విశేష ధారణ ఏమిటి? పవిత్రత. మరి ఒకే ధర్మము ఉందా అనగా సంకల్పము, స్వప్నములో కూడా పవిత్రత ఉందా? సంకల్పములోనైనా లేక స్వప్నములోనైనా కూడా ఒకవేళ అపవిత్రత యొక్క నీడ ఉన్నట్లయితే దానిని ఏమంటారు? ఒకే ధర్మము ఉన్నట్లా? పవిత్రత సంపూర్ణముగా ఉన్నట్లా? కనుక చెక్ చేసుకోండి, ఎందుకు? సమయము వేగముగా వెళ్తూ ఉంది. మరి సమయము వేగము వెళ్తూ ఉన్నప్పుడు స్వయం ఒకవేళ మెల్లగా వెళ్తున్నట్లయితే సమయానికి గమ్యాన్ని చేరుకోలేరు కదా! అందుకే పదే-పదే చెక్ చేసుకోండి - ఒకే రాజ్యము ఉందా? ఒకే ధర్మము ఉందా? లా అండ్ ఆర్డర్ ఉన్నాయా? లేదా మాయ తన ఆర్డర్ ను నడిపిస్తుందా? పరమాత్మ పిల్లలు శ్రీమతము యొక్క లా అండ్ ఆర్డర్ పై నడిచేవారు, అంతేకానీ మాయ యొక్క లా అండ్ ఆర్డర్ పై కాదు. కనుక చెక్ చేసుకోండి - అందరి భవిష్య సంస్కారాలు ఇప్పుడే కనిపించాలి ఎందుకంటే సంస్కారాలను ఇప్పుడే నింపుకోవాలి. అక్కడ నింపుకోవటము కాదు, ఇక్కడే నింపుకోవాలి. సుఖము ఉందా? శాంతి ఉందా? సంపత్తివంతులుగా ఉన్నారా? సుఖము ఇప్పుడు సాధనాల ఆధారముపైనైతే లేదు కదా? అతీంద్రియ సుఖము ఉందా? సాధనాలు, ఇంద్రియాలకు ఆధారము. అతీంద్రియ సుఖము సాధనాల ఆధారముపై ఉండదు. అఖండ శాంతి ఉందా? ఖండితమైతే అవ్వటము లేదు కదా? ఎందుకంటే సత్యయుగ రాజ్యము యొక్క మహిమ ఏమిటి? అఖండ శాంతి, స్థిరమైన శాంతి. సంపన్నత ఉందా? సంపద ఉంటే ఏమవుతుంది? సంపన్నత ఉంటుంది. సర్వ సంపదలు ఉన్నాయా? గుణాలు, శక్తులు, జ్ఞానము, ఇవి సంపదలు. దానికి గుర్తు ఏమిటి? ఒకవేళ నేను సంపదలో సంపన్నముగా ఉన్నట్లయితే దానికి గుర్తు ఏమిటి? సంతుష్టత. సర్వ ప్రాప్తులకు ఆధారము సంతుష్టత, అసంతుష్టత అప్రాప్తికి సాధనము. కనుక చెక్ చేసుకోండి - ఒక్క విశేషత కూడా లోపించకూడదు. మరి ఇంతగా చెక్ చేసుకుంటున్నారా? మొత్తము ప్రపంచాన్ని మీరు ఇప్పటి సంస్కారాల ద్వారానే తయారుచేయబోతున్నారు. ఇప్పటి సంస్కారాల అనుసారముగా భవిష్య ప్రపంచము తయారవుతుంది. మరి మీరందరూ ఏమంటారు? మీరు ఎవరు? విశ్వ పరివర్తకులు కదా! విశ్వ పరివర్తకులేనా? మరి విశ్వ పరివర్తకులు అన్నదానికి ముందు స్వ పరివర్తకులు అన్నది ఉండాలి. కనుక ఈ అన్ని సంస్కారాలు మీలో ఉన్నాయా అని చెక్ చేసుకోండి. దీని ద్వారా నేను 108 మాలలో ఉన్నానా లేక వెనక-ముందు ఉన్నానా అన్నది అర్థం చేసుకోండి. ఈ చెకింగ్ అనేది ఒక దర్పణము వంటిది, ఈ దర్పణములో మీ వర్తమానమును మరియు భవిష్యత్తును చూసుకోండి. చూసుకోగలరా?

ఇప్పుడైతే హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా! హోలీని జరుపుకునేందుకు వచ్చారు, మంచిది. హోలీ యొక్క అర్థాన్ని వర్ణన చేసాము కదా! మరి బాప్ దాదా ఈ రోజు విశేషముగా డబుల్ విదేశీయులకు చెప్తున్నారు, మధుబన్ వారు తోడుగా ఉన్నారు, ఇది చాలా బాగుంది. మధుబన్ వారికి కూడా కలిపి చెప్తున్నాము. ఎవరు వచ్చినా సరే, బొంబాయి నుండి వచ్చినా లేక ఢిల్లీ నుండి వచ్చినా, ఈ సమయములోనైతే మధుబన్ నివాసులు. డబుల్ విదేశీయులు కూడా ఈ సమయములో ఎక్కడివారు? మధుబన్ నివాసులు కదా! మధుబన్ నివాసులుగా అవ్వటము మంచిది కదా! కనుక పిల్లలందరికీ, ఇక్కడ ఎదురుగా కూర్చుని ఉన్నా లేక నలువైపులా తమ-తమ స్థానాలలో కూర్చుని ఉన్నా, బాప్ దాదా అందరిలోనూ ఒక పరివర్తనను కోరుకుంటున్నారు - ఒకవేళ ధైర్యము ఉంటే బాప్ దాదా చెప్తారు. ధైర్యము ఉందా? ధైర్యము ఉందా? ధైర్యము ఉందా? చెయ్యాల్సి ఉంటుంది. చేతులెత్తాము కదా, అయిపోయిందిలే అని అనుకోవటము కాదు, అలా కాదు. చేతులెత్తటమైతే చాలా మంచిది కానీ మనసు యొక్క చేతిని ఎత్తండి. ఈ రోజు కేవలము ఈ చేతిని ఎత్తటము కాదు, మనసు యొక్క చేతిని ఎత్తండి.

డబుల్ విదేశీయులు దగ్గరగా కూర్చున్నారు కదా, దగ్గరివారికి మనసులోని విషయాలను వినిపించటము జరుగుతుంది. చాలావరకు ఏం కనిపిస్తుందంటే - అందరికీ బాప్ దాదాపై, సేవపై చాలా మంచి ప్రేమ ఉంది. బాబా ప్రేమ లేకుండా కూడా ఉండలేరు మరియు సేవ లేకుండా కూడా ఉండలేరు. మెజారిటీ విషయములో ఈ సర్టిఫికేట్ బాగుంది. బాప్ దాదా నలువైపులా చూస్తుంటారు, కానీ... కానీ అనేది వచ్చేసింది. మెజారిటీ నుండి ఇదే మాట వినిపిస్తుంది - ఏదో ఒక సంస్కారము, పాత సంస్కారము, దానిని వద్దనుకుంటున్నా సరే ఆ పాత సంస్కారము ఇప్పటికీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. మరి హోలీని జరుపుకోవటానికి వచ్చారు, హోలీ అంటే అర్థము గడిచిపోయిందేదో గడిచిపోయింది. అయిపోయింది, జరిగిపోయింది. కనుక కొద్దిగానైనా ఏ సంస్కారమైనా 5 శాతము ఉన్నా, 10 శాతము ఉన్నా, 50 శాతము ఉన్నా, ఎంతైనా ఉండనివ్వండి, తక్కువలో తక్కువ 5 శాతము ఉన్నా సరే ఈ రోజు సంస్కారాల హోలీని కాల్చండి. ఏ సంస్కారమునైతే అందరూ - ఫలానా సంస్కారము నన్ను మధ్యమధ్యలో డిస్టర్బ్ చేస్తుంది అని భావిస్తున్నారో, ప్రతి ఒక్కరూ అలా భావిస్తారు, భావిస్తున్నారు కదా? హోలీ అంటే ఒకటి కాల్చటము ఉంటుంది, రెండు రంగులు చల్లుకోవటము ఉంటుంది. రెండు రకాల హోలీ ఉంటుంది మరియు హోలీ అంటే అర్థము కూడా జరిగిపోయినదేదో జరిగిపోయింది అని. కనుక బాప్ దాదా ఏం కోరుకుంటున్నారంటే - అటువంటి సంస్కారము ఏదైనా మిగిలి ఉంటే, దాని కారణముగా ప్రపంచ పరివర్తన అవ్వటము లేదు అంటే, ఈ రోజు ఆ బలహీన సంస్కారాన్ని కాల్చివేయండి అనగా అంతిమ సంస్కారము చేయండి. కాల్చడాన్ని కూడా అంతిమ సంస్కారము అని అంటారు కదా. మనుష్యులు చనిపోయినప్పుడు అంతిమ సంస్కారము చెయ్యాలి అని అంటారు అనగా సదా కొరకు అంతము చెయ్యటము. మరి ఈ రోజు సంస్కారానికి కూడా అంతిమ సంస్కారము చెయ్యగలరా? ఆ సంస్కారము రావాలి అని మేము కోరుకోవటము లేదు కానీ అది వచ్చేస్తుంది, ఏం చేయాలి అని మీరు అంటారు. ఇలా అనుకుంటారా? అచ్ఛా. పొరపాటున వస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఇచ్చేసిన వస్తువు పొరపాటున మీ వద్దకు వస్తే ఏం చేస్తారు? జాగ్రత్తగా అలమారులో పెట్టుకుంటారా? పెట్టుకుంటారా? కావున ఒకవేళ అది వచ్చినా కానీ మనసులో పెట్టుకోకండి ఎందుకంటే మనసులో బాబా కూర్చుని ఉన్నారు కదా! మరి బాబాతోపాటు ఒకవేళ ఆ సంస్కారాన్ని కూడా మనసులో పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుందా? అనిపించదు కదా! అందుకే ఒకవేళ పొరపాటున వచ్చేసినా కానీ మనస్ఫూర్తిగా బాబా, బాబా, బాబా... అని అనండి, అంతే, సమాప్తమైపోతుంది. బిందువు పడిపోతుంది. బాబా ఎవరు? బిందువు. కనుక బిందువు పడిపోతుంది. మనస్ఫూర్తిగా అంటేనే. అలా కాకుండా ఏదో పని ఉంది కాబట్టి - బాబా తీసేసుకోండి కదా, తీసేసుకోండి కదా అంటూ గుర్తు చేసినట్లయితే... పెట్టుకునేదేమో మీ వద్ద, కానీ తీసేసుకోండి కదా, తీసేసుకోండి అని అంటారు. మరి ఎలా తీసుకుంటారు? మీ వస్తువును ఎలా తీసుకుంటారు? ముందు మీరు అది మీ వస్తువు కాదు అని అనుకోండి, అప్పుడు తీసుకుంటారు. ఎవరైనా ఊరికే అలా ఇతరుల వస్తువును తీసేసుకుంటారా. మరి ఏం చేస్తారు? హోలీ జరుపుకుంటారా? అయిపోయింది, అయిపోయింది. అచ్ఛా, ఎవరైతే దృఢ సంకల్పము చేస్తున్నాము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. మీరు ఘడియ, ఘడియ దానిని తీసేస్తూ ఉంటే అది పోతుంది. లోపల ఉంచుకోకండి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అది పోవటం లేదు అని అనుకోకండి. తీసేసెయ్యాల్సిందే. మరి దృఢ సంకల్పము చేస్తారా? ఎవరైతే చేస్తారో వారు మనస్ఫూర్తిగా చేతులెత్తండి, బాహ్యముగా ఎత్తటము కాదు. మనసుతో ఎత్తండి. (కొందరు ఎత్తటము లేదు) వీరు ఎత్తటము లేదు. (అందరూ చేతులెత్తారు). చాలా మంచిది, అభినందనలు, అభినందనలు. ఏమవుతుందంటే, ఒకవైపేమో అడ్వాన్స్ పార్టీవారు బాప్ దాదాను పదే-పదే అడుగుతున్నారు - ఎప్పటి వరకు, ఎప్పటి వరకు, ఎప్పటి వరకు అని. మరోవైపు ప్రకృతి కూడా బాబా ముందు అర్జీ పెడుతుంది - ఇప్పుడు పరివర్తన చెయ్యండి అని. బ్రహ్మా బాబా కూడా అడుగుతున్నారు - ఇప్పుడిక ఎప్పుడు పరంధామము యొక్క ద్వారాన్ని తెరుస్తారు అని. తోడుగా వెళ్ళాలి కదా, ఇక్కడే ఉండిపోకూడదు కదా! తోడుగా వస్తారు కదా! కలిసే గేటు తెరుస్తారు! తాళముచెవిని బ్రహ్మాబాబా పెట్టినా కానీ తోడుగా అయితే ఉంటారు కదా! కనుక ఇప్పుడు ఈ పరివర్తన చెయ్యండి. ఇక దానిని తీసుకురానే తీసుకురావద్దు. అది నా వస్తువే కాదు, అది ఇతరులది, రావణుని వస్తువును ఎందుకు పెట్టుకున్నారు! ఇతరుల వస్తువును పెట్టుకుంటారా ఏమిటి? మరి ఇది ఎవరిది? రావణునిది కదా? అతని వస్తువును మీరు ఎందుకు పెట్టుకున్నారు? పెట్టుకోవాలా? పెట్టుకోవద్దు కదా, పక్కానా? అచ్ఛా. కనుక రంగుల హోలీని జరుపుకుంటే జరుపుకోండి కానీ ముందుగా ఈ హోలీని జరుపుకోండి. మీరు చూస్తున్నారు కదా, దయా స్వరూపులు అని మీ మహిమ ఉంది. మీరు దయా స్వరూప దేవీలు మరియు దేవతలు కదా! మరి దయ కలగదా? మీ సోదరీ-సోదరులు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు, వారి దుఃఖాన్ని చూస్తుంటే దయ కలగటం లేదా? దయ కలుగుతుందా? కనుక సంస్కారాలను మార్చుకోండి, అప్పుడు ప్రపంచము మారిపోతుంది. ఎప్పటివరకైతే సంస్కారాలను మార్చుకోరో అప్పటివరకు ప్రపంచము మారలేదు. మరి ఏం చేస్తారు?

ఈ రోజు సంతోషకరమైన వార్తను విన్నాము - అందరూ దృష్టి తీసుకోవాలి అని. మంచి విషయము. బాప్ దాదా అయితే పిల్లలకు ఆజ్ఞాకారి కానీ... కానీ అన్న మాటను విని నవ్వుతున్నారు. నవ్వండి, మంచిదే. దృష్టి ద్వారా సృష్టి మారుతుంది అని దృష్టి గురించి అంటారు. కావున నేటి దృష్టి ద్వారా సృష్టి పరివర్తనను చెయ్యాల్సిందే, ఎందుకంటే సంపన్నత మరియు ఏయే ప్రాప్తులు అయితే లభించాయో, వాటి అభ్యాసము చాలా సమయము నుండి ఉండాలి. సమయానికి అయిపోతుందిలే అని అనుకోకండి, అలా అవ్వదు. చాలా సమయము యొక్క రాజ్య భాగ్యము తీసుకోవాలనుకుంటే సంపన్నత కూడా చాలా సమయము నుండి ఉండాలి. మరి సరేనా? డబుల్ విదేశీయులు సంతోషముగా ఉన్నారా? అచ్ఛా!

నలువైపులా ఉన్న మూడు సింహాసనాధికారులైన విశేష ఆత్మలందరికీ, సదా స్వరాజ్య అధికారీ విశేషాత్మలకు, సదా దయాహృదయులుగా అయ్యి ఆత్మలకు సుఖ-శాంతుల అంచలిని ఇచ్చే మహాదానీ ఆత్మలకు, సదా దృఢతను మరియు సఫలతను అనుభవము చేసే బాబా సమానమైన ఆత్మలకు, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-
సంకల్పాలు మరియు మాటలు యొక్క విస్తారాన్ని సారములోకి తీసుకువచ్చే అంతర్ముఖీ భవ

వ్యర్థ సంకల్పాల విస్తారాన్ని సమాప్తము చేసి సార రూపములో స్థితులవ్వడము మరియు నోటి మాటల వ్యర్థాన్ని సమాప్తము చేసి సమర్థములోకి అనగా సార రూపములోకి తీసుకురావడము - ఇదే అంతర్ముఖత. ఇటువంటి అంతర్ముఖులైన పిల్లలే సైలెన్స్ శక్తి ద్వారా భ్రమిస్తున్న ఆత్మలకు సరైన గమ్యాన్ని చూపించగలరు. ఈ సైలెన్స్ శక్తి అనేక ఆత్మిక రంగులను చూపిస్తుంది. సైలెన్స్ శక్తి ద్వారా ప్రతి ఆత్మ యొక్క మనసులోని మాట ఎంత దగ్గరగా వినిపిస్తుందంటే ఎవరో సమ్ముఖముగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.

స్లోగన్:-
స్వభావ-సంస్కారాలు, సంబంధ-సంపర్కాలలో తేలికగా ఉండడము అనగా ఫరిశ్తాగా అవ్వడము.

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

సత్యమైన హృదయము కల సత్యవాదీ పిల్లలు, సత్యత యొక్క మహానత కారణముగా క్షణములో బిందువుగా అయ్యి బిందు స్వరూపుడైన బాబాను స్మృతి చెయ్యగలరు. సత్యమైన హృదయము కలవారు సత్యమైన సాహెబ్ ను రాజీ చేసిన కారణముగా, బాబా యొక్క విశేషమైన ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకున్న కారణముగా సమయమనుసారముగా వారి బుద్ధి కార్యాలను యుక్తియుక్తముగా, యథార్థముగా స్వతహాగా చేస్తుంది ఎందుకంటే బుద్ధివంతుల బుద్ధి అయిన తండ్రిని రాజీ చేసారు.

సూచన:- ఈ రోజు అంతర్జాతీయ యోగ దివసము, మూడవ ఆదివారము, సాయంత్రం 6.30 గం. నుండి 7.30 గం. వరకు సోదర-సోదరీలందరూ సంగఠిత రూపములో ఒకే చోట కలిసి యోగాభ్యాసములో సర్వ ఆత్మల పట్ల ఇదే శుభ భవనను ఉంచాలి - సర్వాత్మల కళ్యాణము జరగాలి, సర్వాత్మలు సత్యమైన మార్గములో నడుస్తూ పరమాత్ముని వారసత్వానికి అధికారాన్ని ప్రాప్తి చేసుకోవాలి. నేను బాబా సమానముగా సర్వాత్మలకు ముక్తి-జీవన్ముక్తుల వరదానాన్ని ఇచ్చే ఆత్మను.