ఓంశాంతి
ఇలా ఎవరు అన్నారు? అనంతమైన తండ్రి - ఓ ఆత్మలారా అని అన్నారు. ప్రాణి అనగా ఆత్మ అని
అర్థము. ఆత్మ వెళ్ళిపోయింది అని అంటారు కదా అనగా ప్రాణము వెళ్ళిపోయింది అని అర్థము.
ఇప్పుడు తండ్రి సమ్ముఖముగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఓ ఆత్మలారా, నన్ను
స్మృతి చేయండి. కేవలం ఈ జన్మను మాత్రమే చూడకూడదు, ఎప్పటినుండైతే మీరు తమోప్రధానముగా
అయ్యారో, అప్పటినుండి మెట్లు దిగుతూ పతితముగా అయ్యారు. కావున తప్పకుండా పాపాలు చేసి
ఉంటారు. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవలసిన విషయము. ఎన్ని జన్మ-జన్మాంతరాల పాపము తలపై
ఉంది, అది ఎలా తెలుస్తుంది? స్వయాన్ని చూసుకోవాలి - నా యోగము ఎంత కుదురుతుంది!
తండ్రితో ఎంత ఎక్కువగా యోగము కుదురుతుందో అంతగా వికర్మలు వినాశనమవుతాయి. బాబా
అంటున్నారు, నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీ వికర్మలు వినాశనమవుతాయి అన్నది
గ్యారంటీ. ప్రతి ఒక్కరూ తమ మనస్సులో చూసుకోవాలి - తండ్రితో నాకు ఎంత యోగము
కుదురుతుంది? ఎంతగా మనము యోగము జోడిస్తామో, పవిత్రముగా అవుతామో, అంతగా పాపాలు కట్
అవుతూ ఉంటాయి, యోగము పెరుగుతూ ఉంటుంది. పవిత్రముగా అవ్వకపోతే యోగము కూడా కుదరదు.
మొత్తము రోజంతటిలో 15 నిమిషాలు కూడా స్మృతిలో ఉండనివారు ఎంతోమంది ఉన్నారు. స్వయాన్ని
ప్రశ్నించుకోవాలి - నా మనస్సు శివబాబాపై ఉందా లేక దేహధారులపై ఉందా? కర్మ-సంబంధీకులు
మొదలైనవారిపై ఉందా? మాయ పిల్లలనే తుఫానులలోకి తీసుకువస్తుంది కదా! నా అవస్థ ఎలా ఉంది
అనేది స్వయం కూడా అర్థం చేసుకోగలరు. శివబాబాపై మనస్సు లగ్నమవుతుందా లేక ఎవరైనా
దేహధారులపైనా? కర్మ సంబంధీకులు మొదలైనవారితో మనస్సు లగ్నమైనట్లయితే - నావి చాలా
వికర్మలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి, వాటి వలన మాయ గొయ్యిలో పడేస్తుంది.
విద్యార్థులు - మేము పాస్ అవుతామా లేదా, బాగా చదువుతున్నామా లేదా అని లోలోపల అర్థం
చేసుకోగలరు. నంబరువారుగా అయితే ఉంటారు కదా. ఆత్మ తన కళ్యాణము తాను చేసుకోవాలి.
తండ్రి డైరెక్షన్ ఇస్తున్నారు - ఒకవేళ నీవు పుణ్య ఆత్మగా అయి ఉన్నత పదవిని
పొందాలనుకుంటే, అందులో పవిత్రత ముఖ్యమైనది. వచ్చేటప్పుడు కూడా పవిత్రముగా వచ్చారు,
మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా పవిత్రముగా అయి వెళ్ళాలి. పతితులు ఎప్పుడూ ఉన్నత పదవిని
పొందలేరు. సదా మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి - నేను తండ్రిని ఎంత స్మృతి
చేస్తున్నాను, నేను ఏమి చేస్తున్నాను? వెనుక కూర్చొన్న విద్యార్థుల మనస్సు తప్పకుండా
తింటూ ఉండవచ్చు. ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము చేస్తారు. కానీ నడవడిక కూడా
అలా ఉండాలి కదా. తండ్రిని స్మృతి చేస్తూ మీ తలపై నుండి పాపాల భారాన్ని దింపుకోవాలి.
పాపాల భారాన్ని స్మృతితో తప్ప మనము దింపుకోలేము. మరి ఎంతగా తండ్రితో యోగము ఉండాలి.
ఉన్నతోన్నతుడైన తండ్రి వచ్చి చెప్తున్నారు - తండ్రినైన నన్ను స్మృతి చేయండి, అప్పుడు
వికర్మలు వినాశనమవుతాయి. సమయము దగ్గరకు వస్తూ ఉంటుంది. శరీరముపై నమ్మకము లేదు.
అకస్మాత్తుగా ఎలాంటి, ఎలాంటి యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అకాల మృత్యువులది ఇది ఫుల్
సీజన్. కావున ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకుని తమ కళ్యాణమును చేసుకోవాలి. యోగము
మరియు నడవడికకు సంబంధించి మొత్తము రోజంతటి చార్టును చూసుకోవాలి. నేను రోజంతటిలో
ఎన్ని పాపాలు చేశాను? ముందు మనసాలోకి, వాచాలోకి వస్తాయి, ఆ తర్వాత కర్మణాలోకి
వస్తాయి. ఇప్పుడు పిల్లలకు - నేను మంచి కర్మలు చేయాలి అనే ధర్మయుక్తమైన బుద్ధి
లభించింది. నేను ఎవరినీ మోసగించలేదు కదా? ఎక్కడా అనవసరముగా అబద్ధాలు చెప్పలేదు కదా?
డిస్సర్వీస్ అయితే చేయలేదు కదా? ఎవరైనా ఎవరి నామ-రూపాలలోనైనా చిక్కుకుంటే యజ్ఞపితకు
నింద తీసుకువస్తారు.
తండ్రి అంటారు, ఎవరికీ దుఃఖము ఇవ్వకండి. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి. ఇది మీకు
లభించిన చాలా గొప్ప చింత. ఒకవేళ మనము స్మృతిలో ఉండలేకపోతే మనకేమి గతి పడుతుంది! ఈ
సమయములో నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే అంతిమములో చాలా పశ్చాత్తాపపడవలసి ఉంటుంది.
తక్కువ పదవిని పొందేవారు ఎవరైతే ఉంటారో, వారు తక్కువ పదవినే పొందుతారు అని కూడా మీకు
తెలుసు. నేను ఏమి చేయవలసి ఉంటుంది అనేది బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. అందరికీ -
తండ్రిని స్మృతి చేయండి అనే మంత్రాన్నే ఇవ్వండి. లక్ష్యమైతే పిల్లలకు లభించింది. ఈ
విషయాలను ప్రపంచములోని వారు అర్థం చేసుకోలేరు. మొట్టమొదటి ముఖ్యమైన విషయమే -
తండ్రిని స్మృతి చేయడము. రచయిత మరియు రచన యొక్క జ్ఞానమైతే లభించింది. ప్రతిరోజూ
అర్థం చేయించేందుకని మీకు కొత్త-కొత్త పాయింట్లు ఇవ్వడము జరుగుతుంది. ఉదాహరణకు
విరాట రూపము చిత్రము ఉంది - దానిపై కూడా మీరు అర్థం చేయించవచ్చు. వర్ణాలలోకి ఏ
విధంగా వస్తారు అనేది ఆ చిత్రములో ఉంది, ఇది మెట్ల వరస చిత్రము పక్కన పెట్టాల్సిన
చిత్రము. రోజంతా బుద్ధిలో ఇదే చింతన ఉండాలి - ఎవరెవరికి ఎలా అర్థం చేయించాలి? సేవ
చేయడము ద్వారా కూడా తండ్రి స్మృతి ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు
వినాశనమవుతాయి. తమ కళ్యాణము కూడా చేసుకోవాలి. తండ్రి అర్థం చేయించారు - మీపై 63
జన్మల పాపము ఉంది. పాపము చేస్తూ-చేస్తూ సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయిపోయారు.
ఇప్పుడు నా వారిగా అయిన తర్వాత ఇక ఏ పాపకర్మనూ చేయకండి. అబద్ధాలు చెప్పడము, అల్లరి
చేయడము, ఇంటిలో గొడవలు సృష్టించడము, చెప్పుడు మాటలను విశ్వసించడము - ఇలా మనసులు పాడు
చేయడానికి తప్పుడు మాటలు చెప్పడమనేది చాలా నష్టదాయకము. ఇది తండ్రితో ఉన్న యోగాన్నే
తెంచేస్తుంది, మరి దాని వల్ల ఎంత పాపము అవుతుంది. గవర్నమెంటుకు కూడా దూతలు ఉంటారు.
వారు గవర్నమెంటు విషయాలను శత్రువులకు వినిపించి ఎంతో నష్టము కలిగిస్తారు.
అటువంటివారికి చాలా కఠినమైన శిక్షలు పడతాయి. కావున పిల్లల నోటి నుండి సదా జ్ఞాన
రత్నాలే వెలువడాలి. తప్పుడు సమాచారము కూడా ఒకరినొకరు అడగకూడదు. జ్ఞాన విషయాలనే
మాట్లాడుకోవాలి. మీరు తండ్రితో యోగము ఎలా జోడిస్తారు? ఇతరులకు ఎలా అర్థం చేయిస్తారు?
రోజంతా ఇవే ఆలోచనలు ఉండాలి. చిత్రాల ముందుకు వెళ్ళి కూర్చుండిపోవాలి. మీ బుద్ధిలో
జ్ఞానమైతే ఉంది కదా. భక్తి మార్గములోనైతే అనేక రకాల చిత్రాలను పూజిస్తూ ఉంటారు. కానీ
ఏమీ తెలియదు. అంధవిశ్వాసము, విగ్రహారాధన, ఈ విషయాలలో భారత్ ప్రసిద్ధమైనది. ఇప్పుడు
మీరు ఈ విషయాలను అర్థం చేయించేందుకు ఎంత కష్టపడుతూ ఉంటారు. ప్రదర్శనీని చూసేందుకు
ఎంతమంది వస్తూ ఉంటారు. భిన్న-భిన్న రకాలవారు ఉంటారు. కొందరు - ఇవి, చూడవలసిన, అర్థం
చేసుకోవలసిన విషయాలు అని భావిస్తారు. అలా వచ్చి చూస్తారు కానీ మళ్ళీ సెంటరుకు
ఎప్పుడూ రారు. రోజురోజుకు ప్రపంచ పరిస్థితి కూడా పాడైపోతూ ఉంటుంది. ఎన్నో గొడవలు
జరుగుతూ ఉన్నాయి, విదేశాలలో ఏమేమి జరుగుతుంటుంది అనేది ఇక అడగకండి. ఎంతమంది
మనుష్యులు చనిపోతారు. తమోప్రధాన ప్రపంచము కదా. బాంబులు తయారుచేయకూడదు అని అంటూ
ఉంటారు కానీ వాళ్ళేమంటారంటే - మీ వద్ద ఎన్నో పెట్టుకున్నప్పుడు మరి మేమెందుకు
తయారుచేయకూడదు, మా వద్ద లేకపోతే మీకు దాసులుగా అయి ఉండవలసి వస్తుంది. ఏ డైరెక్షన్
వెలువడినా వినాశనము కొరకే. వినాశనమైతే జరగవలసిందే. శంకరుడిని ప్రేరకుడు అని అంటారు
కానీ ఇందులో ప్రేరణ మొదలైన విషయమేదీ లేదు. మనమైతే డ్రామాపై నిలబడి ఉన్నాము. మాయ చాలా
తీవ్రముగా ఉంది. నా పిల్లలను కూడా వికారాలలోకి పడేస్తూ ఉంటుంది. దేహముపై ప్రీతిని
పెట్టుకోకండి, నామ-రూపాలలో చిక్కుకోకండి అని ఎంతగా అర్థం చేయించడం జరుగుతుంది. కానీ
మాయ కూడా ఎంత తమోప్రధానముగా ఉందంటే, అది దేహములో చిక్కుకునేలా చేసేస్తుంది. పూర్తిగా
ముక్కు పట్టుకుంటుంది. అసలు తెలియను కూడా తెలియదు. శ్రీమతముపై నడవండి అని తండ్రి
ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు, కానీ నడవరు. రావణుడి మతము వెంటనే బుద్ధిలోకి
వచ్చేస్తుంది. రావణుడు జైలు నుండి విడుదల చేయడు.
తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు ఇక
మనము వెళ్ళిపోబోతున్నాము, అర్ధకల్పపు రోగము నుండి మనము విముక్తులుగా అవుతాము. అక్కడ
ఉండేదే నిరోగి శరీరము. ఇక్కడ ఎంత రోగగ్రస్థముగా ఉన్నారు. ఇది రౌరవ నరకము కదా. వాళ్ళు
గరుడ పురాణము చదువుతారు కానీ చదివేవారికి, వినేవారికి అర్థమేమీ తెలియదు. బాబా
స్వయంగా చెప్తున్నారు, ఇదివరకు భక్తి నషా ఎంత ఉండేది. భక్తి ద్వారా భగవంతుడు
లభిస్తారు అని విని ఎంతో సంతోషించి భక్తి చేస్తూ ఉండేవారు. పతితముగా అవుతారు, అందుకే
- ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు. భక్తి చేస్తున్నారు, అది మంచిదే, మరి
భగవంతుడిని రమ్మని ఎందుకు తలుచుకుంటున్నారు! భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారు
అని భావిస్తారు. కానీ ఏం ఫలము ఇస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. తండ్రి అంటారు, గీత
చదివేవారికి కూడా అర్థం చేయించాలి, వారే మన ధర్మానికి చెందినవారు. గీతలో ఉన్న
మొట్టమొదటి ముఖ్యమైన విషయము భగవానువాచ. అసలు గీతా భగవానుడు ఎవరు? భగవంతుని పరిచయమైతే
కావాలి కదా. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు అనేది మీకు ఇప్పుడు తెలిసిపోయింది.
మనుష్యులు జ్ఞాన విషయాలకు ఎంతగా భయపడతారు. వారికి భక్తి ఎంత బాగా అనిపిస్తుంది.
జ్ఞానము అని అంటేనే మూడు కోసుల (6 మైళ్ళు) దూరము పరిగెడతారు. అరే, పావనముగా అవ్వడము
మంచిదే కదా, ఇప్పుడు పావన ప్రపంచ స్థాపన, పతిత ప్రపంచ వినాశనము జరుగనున్నది. కానీ
అసలు ఏ మాత్రమూ వినరు. తండ్రి డైరెక్షన్ ఏమిటంటే - చెడు వినకండి. మాయ ఏమంటుందంటే -
బాబా చెప్పే మాటలను వినకండి. మాయ ఇచ్చే డైరెక్షన్ ఏమిటంటే - శివబాబా జ్ఞానాన్ని
వినవద్దు. మాయ ఎంత గట్టిగా చెంపదెబ్బ వేస్తుందంటే, ఇక అసలు బుద్ధిలో జ్ఞానమే నిలవదు,
ఇక తండ్రిని స్మృతే చేయలేకపోతారు, మిత్ర-సంబంధీకులు, దేహధారులు గుర్తొస్తూ ఉంటారు.
బాబా ఆజ్ఞను పాటించరు. తండ్రి - నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు, కానీ వారు
తండ్రికి ఆజ్ఞాకారులుగా అవ్వకుండా - నాకు ఫలానా వ్యక్తి గుర్తుకొస్తున్నారు అని అంటూ
ఉంటారు. అలా ఇతరుల స్మృతి కలిగితే పడిపోతారు. అసలు ఈ విషయాల పట్లనైతే అయిష్టము
కలగాలి. ఇది పూర్తిగా ఛీ-ఛీ ప్రపంచము. మన కొరకైతే నూతన స్వర్గము స్థాపన అవుతోంది.
పిల్లలైన మీకు తండ్రి మరియు సృష్టి చక్రపు పరిచయము లభించింది కావున ఇక ఈ చదువులోనే
నిమగ్నులైపోవాలి. తండ్రి అంటారు, మీ లోపల చూసుకోండి. నారదుడి ఉదాహరణ కూడా ఉంది కదా.
అలా తండ్రి కూడా అంటున్నారు - స్వయాన్ని చూసుకోండి, నేను తండ్రిని స్మృతి
చేస్తున్నానా? స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి. ఎటువంటి పరిస్థితిలోనైనా సరే
శివబాబానే స్మృతి చేయాలి, ఇంకెవ్వరి పట్ల ప్రేమను ఉంచుకోకూడదు. అంతిమములో శివబాబా
స్మృతి ఉండగా శరీరము నుండి ప్రాణము వదలాలి. శివబాబా స్మృతి ఉండాలి మరియు స్వదర్శన
చక్రము యొక్క జ్ఞానము ఉండాలి. స్వదర్శన చక్రధారులు ఎవరు, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు.
బ్రాహ్మణులకు కూడా ఈ జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? బ్రాహ్మణులను ఇలా స్వదర్శన
చక్రధారులుగా ఎవరు తయారుచేస్తారు? బిందురూపుడైన పరమపిత పరమాత్మ. మరి వారు కూడా
స్వదర్శన చక్రధారియేనా? అవును, మొట్టమొదట వారే స్వదర్శన చక్రధారి. వారు అలా కాకపోతే
బ్రాహ్మణులైన మనల్ని అలా ఎవరు తయారుచేస్తారు. మొత్తము రచన యొక్క ఆదిమధ్యాంతాల
జ్ఞానము వారిలో ఉంది. మీ ఆత్మ కూడా ఆ విధంగా తయారవుతుంది, వారు కూడా ఒక ఆత్మయే.
భక్తి మార్గములో విష్ణువును చక్రధారిగా చూపించారు. మనము అంటాము - పరమాత్ముడు
త్రికాలదర్శి, త్రిమూర్తి, త్రినేత్రి. వారు మనల్ని స్వదర్శన చక్రధారులుగా
తయారుచేస్తారు. వారు కూడా తప్పకుండా మనుష్య తనువులోకి వచ్చే వినిపిస్తారు. రచన
యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని తప్పకుండా రచయితయే వినిపించగలరు కదా. రచయిత గురించే
ఎవ్వరికీ తెలియకపోతే ఇక రచన యొక్క జ్ఞానము ఎక్కడ నుండి లభిస్తుంది. ఇప్పుడు మీరు
అర్థం చేసుకున్నారు - శివబాబాయే స్వదర్శన చక్రధారి, జ్ఞానసాగరుడు. ఈ 84 జన్మల
చక్రములోకి మనము ఎలా వస్తాము అనేది వారికి తెలుసు. కానీ వారు స్వయం పునర్జన్మలు
తీసుకోరు. వారికి జ్ఞానము ఉంది, దానిని మనకు వినిపిస్తున్నారు. కావున మొట్టమొదటైతే
శివబాబాయే స్వదర్శన చక్రధారి. శివబాబాయే మనల్ని స్వదర్శన చక్రధారులుగా తయారుచేస్తారు,
పావనముగా తయారుచేస్తారు ఎందుకంటే పతిత-పావనుడు వారే. రచయిత కూడా వారే. తండ్రికి
పిల్లల జీవితము గురించి తెలుసు కదా. శివబాబా బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తారు.
చేసేవారు, చేయించేవారు కదా. మీరు కూడా నేర్చుకోండి, ఇతరులకు నేర్పించండి. తండ్రి
చదివిస్తారు, అలాగే ఇతరులను కూడా చదివించండి అని అంటారు. కావున శివబాబాయే మిమ్మల్ని
స్వదర్శన చక్రధారులుగా తయారుచేస్తారు. వారు అంటారు, నాలో సృష్టి చక్రము యొక్క
జ్ఞానము ఉంది, కావుననే వినిపించగలుగుతున్నాను. 84 జన్మలు ఎలా తీసుకుంటారు అనే ఈ 84
జన్మల కథ బుద్ధిలో ఉండాలి. బుద్ధిలో ఈ విషయము గుర్తున్నా చక్రవర్తీ రాజులుగా
తయారవ్వగలరు. ఇది జ్ఞానము కానీ యోగము ద్వారానే పాపాలు కట్ అవుతాయి. మొత్తము రోజంతటి
చార్టు చూడండి. స్మృతియే చేయకపోతే ఇక చార్టు కూడా ఏమి పెడతారు? రోజంతటిలో ఏమేమి
చేసారు అన్నదైతే గుర్తుంటుంది కదా. కొందరు మనుష్యులు ఎలా ఉంటారంటే - వారు నేను ఎన్ని
శాస్త్రాలు చదివాను, ఎంత పుణ్యము చేశాను అన్న లెక్కాపత్రము కూడా వ్రాసుకుంటారు. అలా
మీరు అంటారు - ఎంత సమయము స్మృతి చేశాను, ఎంత సంతోషముగా తండ్రి పరిచయాన్ని ఇచ్చాను?
తండ్రి ద్వారా ఏవైతే పాయింట్లు లభించాయో, వాటిని ఘడియ-ఘడియ మంథనము చేయండి. ఏ
జ్ఞానమైతే లభించిందో దానిని బుద్ధిలో గుర్తుంచుకోండి, ప్రతిరోజూ మురళిని చదవండి. అది
కూడా చాలా మంచిది. మురళీలో ఏవైతే పాయింట్లు ఉన్నాయో వాటిని ఘడియ-ఘడియ మంథనము చేయాలి.
ఇక్కడ ఉన్న వారి కంటే కూడా బయట విదేశాలలో ఉన్నవారు ఎక్కువ స్మృతిలో ఉంటారు. ఎంతమంది
బంధనములో ఉన్నవారు ఉన్నారు, వారు బాబాను ఎప్పుడూ చూడను కూడా చూడలేదు, కానీ ఎంతగా
స్మృతి చేస్తారు, వారిలో నషా ఎక్కి ఉంటుంది. ఇంటిలో కూర్చుని ఉండగానే సాక్షాత్కారాలు
జరుగుతాయి మరియు అనాయాసముగా వింటూ-వింటూ నిశ్చయము ఏర్పడిపోతుంది.
తండ్రి అంటారు, లోలోపల స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి - నేను ఎంతటి ఉన్నత
పదవిని పొందుతాను? నా నడవడిక ఎలా ఉంది? ఆహార-పానీయాల పట్ల ఏ విధమైన లోభము లేదు కదా?
ఎలాంటి అలవాటు ఉండకూడదు. ముఖ్యమైన విషయము, అవ్యభిచారీ స్మృతిలో ఉండడము. మీ హృదయాన్ని
ప్రశ్నించుకోండి - నేను ఎవరిని స్మృతి చేస్తున్నాను? ఎంత సమయము ఇతరులను స్మృతి
చేస్తున్నాను? జ్ఞానాన్ని కూడా ధారణ చేయాలి, పాపాలను కూడా కట్ చేసుకోవాలి. కొందరు
ఎలాంటి పాపాలు చేసారంటే ఇక అడగకండి. ఇది చేయండి అని భగవంతుడు చెప్తారు, కానీ పరవశమై
ఉన్నాము అని అంటారు అనగా మాయకు వశమై ఉన్నారు. అచ్ఛా, అలా అయితే ఇక మాయకు వశమయ్యే
ఉండండి. మీరు, అయితే శ్రీమతముపై నడవాలి లేకపోతే మీ మన్మతముపై నడవాలి. ఈ పరిస్థితిలో
నేను ఎంతవరకు పాస్ అవ్వగలను, ఏ పదవిని పొందుతాను అని చూసుకోవాలి. 21 జన్మల కొరకు
నష్టము వాటిల్లుతుంది. ఎప్పుడైతే కర్మాతీత అవస్థకు చేరుకుంటారో, అప్పుడిక
దేహాభిమానము యొక్క మాటే ఉండదు, అందుకే దేహీ-అభిమానులుగా అవ్వండి అని అంటారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.