16-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - డ్రామా యొక్క యథార్థ జ్ఞానం ద్వారానే మీరు అచలముగా, స్థిరముగా మరియు ఏకరసముగా ఉండగలుగుతారు, మాయ తుఫానులు మిమ్మల్ని కదిలించలేవు’’

ప్రశ్న:-
ేవతలలోని ముఖ్యమైన ఏ గుణము పిల్లలైన మీలో సదా కనిపిస్తూ ఉండాలి?

జవాబు:-
హర్షితముగా ఉండడం. దేవతలను సదా చిరునవ్వుతో హర్షితముగా చూపిస్తారు. అలా పిల్లలైన మీరు కూడా సదా హర్షితముగా ఉండాలి. ఏమి జరిగినా కానీ హర్షితముగానే ఉండండి. ఎప్పుడూ కూడా ఉదాసీనత లేక కోపము రాకూడదు. ఏ విధంగా తండ్రి మీకు మంచి-చెడుల జ్ఞానాన్ని ఇస్తారు కానీ ఎప్పుడూ కోపగించుకోరు, ఉదాసీనులుగా అవ్వరు, అలాగే పిల్లలైన మీరు కూడా ఉదాసీనులుగా అవ్వకూడదు.

ఓంశాంతి
అనంతమైన పిల్లలకు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు. లౌకిక తండ్రి అయితే ఈ విధంగా అనరు. వారికి ఎక్కువలో ఎక్కువ 5-7 మంది పిల్లలు ఉండవచ్చు. ఇక్కడైతే ఆత్మలంతా ఎవరైతే ఉన్నారో, వారు పరస్పరం సోదరులు. వారందరికీ తప్పకుండా తండ్రి ఉంటారు. మనమందరమూ పరస్పరం సోదరులము అని అంటారు కూడా. ఇది అందరి కోసమూ అంటారు. ఎవరెవరైతే వస్తారో వారందరి కోసము, మేము పరస్పరం సోదరులము అని అంటారు. డ్రామాలో అందరూ బంధింపబడి ఉన్నారు, కానీ దాని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది తెలియకపోవడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. దీనిని తండ్రే వచ్చి వినిపిస్తారు. కథలు మొదలైనవి ఎప్పుడైతే కూర్చొని వినిపిస్తారో అప్పుడు, పరమపిత పరమాత్మాయ నమః అని అంటారు. ఇంతకీ వారు ఎవరు? అది తెలియదు. బ్రహ్మా దేవత, విష్ణు దేవత, శంకర దేవత అని అంటారు కానీ అర్థం తెలుసుకొని అలా అనరు. బ్రహ్మాను వాస్తవానికి దేవత అని అనరు. దేవత అని విష్ణువునే అంటారు. బ్రహ్మాను గురించి ఎవ్వరికీ తెలియదు. విష్ణు దేవత అని అనడం సరైనదే, శంకరుని పాత్ర అయితే ఏమీ లేదు. అతని జీవిత చరిత్ర లేదు, శివబాబాకైతే జీవిత చరిత్ర ఉంది. వారు పతితులను పావనులుగా తయారుచేయడానికి, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికే వస్తారు. ఇప్పుడు ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపన మరియు అన్ని ధర్మాల యొక్క వినాశనం జరుగుతుంది. అందరూ ఎక్కడికి వెళ్తారు? శాంతిధామానికి. శరీరాలైతే అందరివీ వినాశనమవ్వనున్నాయి. కొత్త ప్రపంచములో కేవలం మీరే ఉంటారు. ముఖ్య ధర్మాలేవైతే ఉన్నాయో, వాటి గురించి మీకు తెలుసు. అన్నింటి పేర్లు అయితే తీసుకోలేము. చిన్న-చిన్న శాఖోపశాఖలైతే ఎన్నో ఉన్నాయి. మొట్టమొదట దైవీ ధర్మము ఉంది, ఆ తర్వాత ఇస్లాం ధర్మము. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. ఇప్పుడు ఆ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోయింది, అందుకే మర్రి వృక్షము ఉదాహరణను ఇస్తారు. మొత్తం వృక్షమంతా నిలబడి ఉంది. దాని కాండము లేదు. అన్నింటికన్నా ఎక్కువ ఆయువు ఈ మర్రి వృక్షానికే ఉంటుంది. ఇందులో అన్నింటికన్నా ఎక్కువ ఆయువు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికే ఉంది. అది ఎప్పుడైతే కనుమరుగైపోతుందో, అప్పుడే తండ్రి వచ్చి, ఇప్పుడు ఏక ధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం జరుగనున్నది అని చెప్తారు, అందుకే త్రిమూర్తులను కూడా తయారుచేసారు. కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడని, ఆ తర్వాత బ్రహ్మా, విష్ణు, శంకరులని, మళ్ళీ సృష్టిలోకి వచ్చినప్పుడు దేవీ-దేవతా ధర్మం తప్ప ఇంకే ధర్మమూ లేదని పిల్లలైన మీకు తెలుసు. భక్తి మార్గము కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మొదట శివుని భక్తిని చేస్తారు, ఆ తర్వాత దేవతల భక్తిని చేస్తారు. ఇది భారత్ విషయమే. మిగిలినవారికి తమ ధర్మము, మతము లేక మార్గము ఎప్పుడు స్థాపించబడతాయి అనేది తెలుసు. ఉదాహరణకు ఆర్యులు, మేము అందరికన్నా పాతవారము అని అంటారు. వాస్తవానికి అందరికన్నా పాతవారు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము వారే. మీరు ఎప్పుడైతే వృక్షము చిత్రముపై అర్థం చేయిస్తారో, అప్పుడు వారు మా ధర్మము ఫలానా సమయంలో వస్తుంది అని స్వయమూ అర్థం చేసుకుంటారు. అందరికీ అనాది, అవినాశీ పాత్ర ఏదైతే లభించిందో దానిని అభినయించాలి, ఇందులో ఎవరి దోషము లేక తప్పు ఉంది అని అనలేము. కేవలం పాపాత్ములుగా ఎందుకు అయ్యారు అన్నది అర్థం చేయించడం జరుగుతుంది. మనమందరమూ అనంతమైన తండ్రికి పిల్లలము కదా, మరి సోదరులందరూ సత్యయుగములో ఎందుకు లేరు అని మనుష్యులు అడుగుతారు. కానీ డ్రామాలో ఆ పాత్రయే లేదు. ఈ అనాది డ్రామా తయారుచేయబడి ఉంది, దీనిపై నిశ్చయం పెట్టుకోండి, ఇంకే విషయాన్నీ మాట్లాడకండి. ఇది ఎలా తిరుగుతుంది అంటూ చక్రాన్ని కూడా చూపించారు. కల్పవృక్షము యొక్క చిత్రము కూడా ఉంది. కానీ దీని ఆయువు ఎంత అనేది ఎవ్వరికీ తెలియదు. తండ్రి ఎవ్వరి నిందనూ చేయరు. మీరు ఎంతో పావనంగా ఉండేవారని, ఇప్పుడు పతితంగా అయ్యారని, అందుకే ఓ పతిత పావనా రండి అని పిలుస్తూ ఉంటారని అర్థం చేయించడం జరుగుతుంది, ఇది మీకు కూడా అర్థం చేయిస్తారు. మొదటైతే మీరందరూ పావనంగా అవ్వాలి. ఆ తర్వాత నంబరువారుగా పాత్రను అభినయించడానికి రావాలి. ఆత్మలన్నీ పైన ఉంటాయి. తండ్రి కూడా పైన ఉంటారు, వారిని రమ్మని పిలుస్తారు. కానీ వారు అలా పిలిచినంత మాత్రాన వచ్చేయరు. తండ్రి అంటారు, నాకు కూడా డ్రామాలో పాత్ర నిశ్చితమై ఉంది. ఏ విధముగా హద్దులోని డ్రామాలో కూడా పెద్ద-పెద్ద ముఖ్య నటుల పాత్ర ఉంటుందో, అలా ఇది అనంతమైన డ్రామా. అందరూ డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నారు, దీని అర్థం అందరూ ఆ దారములో బంధింపబడి ఉన్నారని కాదు, అలా కాదు. ఇది తండ్రి అర్థం చేయిస్తారు. అది జడమైన వృక్షము. ఒకవేళ బీజము చైతన్యమైనట్లయితే, వృక్షము ఏ విధంగా పెద్దదై ఫలాలను ఇస్తుంది అనేది ఆ వృక్షానికి తెలుస్తుంది కదా. ఇక్కడ వీరు ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి చైతన్య బీజము, దీనిని తల్లక్రిందుల వృక్షము అని అంటారు. తండ్రి నాలెడ్జ్ ఫుల్, వారిలో మొత్తం వృక్షము యొక్క జ్ఞానం ఉంది. ఇది అదే గీతా జ్ఞానము. ఇది కొత్త విషయమేమీ కాదు. ఇక్కడ బాబా శ్లోకాలు మొదలైనవేవీ ఉచ్చరించరు. వారైతే గ్రంథ్ ను చదివి, దాని అర్థాన్ని వివరిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది చదువు, ఇందులో శ్లోకాలు మొదలైనవాటి అవసరం లేదు. ఆ శాస్త్రాల చదువులో ఎటువంటి లక్ష్యము-ఉద్దేశ్యము లేదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని కూడా అంటారు. ఈ పాత ప్రపంచము వినాశనమవుతుంది. సన్యాసులది హద్దులోని వైరాగ్యము, మీది అనంతమైన వైరాగ్యము. శంకరాచార్యుడు వచ్చినప్పుడు తాను గృహస్థం నుండి వైరాగ్యాన్ని నేర్పిస్తారు. అతను కూడా మొదట్లో శాస్త్రాలు మొదలైనవి నేర్పించరు. ఎప్పుడైతే చాలా వృద్ధి జరుగుతుందో అప్పుడు శాస్త్రాలను రచించడం ప్రారంభిస్తారు. మొట్టమొదటైతే ధర్మ స్థాపన చేసే ఆత్మ ఒక్కరే ఉంటారు, ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి చెందుతారు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. సృష్టిలో మొట్టమొదట ఏ ధర్మముండేది? ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. ఆది సనాతన దేవి-దేవతా ధర్మముండేది, దానిని స్వర్గము, హెవెన్ అని అంటారు. పిల్లలైన మీరు రచయిత మరియు రచనను తెలుసుకోవడం ద్వారా ఆస్తికులుగా అవుతారు. నాస్తికత్వంలో ఎంత దుఃఖం ఉంటుంది, అనాథలుగా అయిపోతారు, పరస్పరం కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. మీరు పరస్పరం కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉన్నారు, మీకు నాథుడు ఎవ్వరూ లేరా? అని అంటారు కదా. ఈ సమయంలో అందరూ అనాథలుగా అయిపోతారు. కొత్త ప్రపంచములో పవిత్రత, సుఖ-శాంతులు అన్నీ ఉండేవి, అపారమైన సుఖాలు ఉండేవి. ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయి. అవి సత్యయుగానివి, ఇవి కలియుగానివి. ఇప్పుడు మీది పురుషోత్తమ సంగమయుగము. ఈ పురుషోత్తమ సంగమయుగము ఒక్కటే ఉంటుంది. సత్య, త్రేతా యుగాల సంగమాన్ని పురుషోత్తమమైనది అని అనరు. ఇక్కడ అసురులు ఉన్నారు, అక్కడ దేవతలు ఉంటారు. ఇది రావణ రాజ్యమని మీకు తెలుసు. రావణుని తలపై గాడిద తలను చూపిస్తారు. గాడిదను ఎంతగా శుభ్రం చేసి దానిపై బట్టలు వేసినా అది మళ్ళీ మట్టిలో పడుకొని ఆ బట్టలను పాడు చేసేస్తుంది. తండ్రి మీ బట్టలను శుభ్రం చేసి పుష్పాల వలె తయారుచేస్తారు, మళ్ళీ ఈ రావణ రాజ్యంలో దొర్లి అపవిత్రులుగా అయిపోతారు. ఆత్మ మరియు శరీరము రెండూ అపవిత్రముగా అయిపోతాయి. మీరు మొత్తం అలంకరణనంతటినీ పోగొట్టేసారు అని తండ్రి అంటారు. తండ్రిని పతిత-పావనుడు అని అంటారు. మీరు నిండు సభలో ఇలా చెప్పవచ్చు - మేము స్వర్ణయుగములో ఎంతో అలంకరింపబడి ఉండేవారము, ఎంతో ఫస్ట్ క్లాస్ రాజ్యభాగ్యము ఉండేది, మళ్ళీ మాయా రూపీ ధూళిలో దొర్లి మురికిగా అయిపోయాము అని.

ఇది అంధకార నగరమని తండ్రి అంటారు. భగవంతుడిని సర్వవ్యాపి అని అనేసారు. ఏదైతే జరిగిందో, అది అచ్చంగా అదే విధంగా రిపీట్ అవుతుంది, ఇందులో తికమకపడే అవసరమేమీ లేదు. 5000 సంవత్సరాలలో ఎన్ని నిముషాలు, గంటలు, క్షణాలు ఉన్నాయని ఒక బిడ్డ అన్ని ధర్మాల లెక్కను లెక్క వేసి పంపించారు, ఇందులో కూడా బుద్ధిని వ్యర్థం చేసి ఉంటారు. బాబా అయితే ప్రపంచం ఎలా నడుస్తుంది అంటూ మామూలుగా అర్థం చేయిస్తారు.

ప్రజాపిత బ్రహ్మా గ్రేట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. వారి వృత్తిని గురించి ఎవ్వరికీ తెలియదు. విరాట రూపాన్ని తయారుచేసారు, అందులో ప్రజాపిత బ్రహ్మాను కూడా తీసేసారు. తండ్రి మరియు బ్రాహ్మణుల గురించి యథార్థ రీతిగా తెలియదు. వారిని ఆదిదేవ్ అని కూడా అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను ఈ వృక్షానికి చైతన్య బీజరూపుడను, ఇది తల్లక్రిందుల వృక్షము. సత్యము, చైతన్యము, జ్ఞాన సాగరుడు అని ఆ తండ్రి మహిమనే చేయడం జరుగుతుంది. ఆత్మ లేకపోతే అటూ, ఇటూ తిరగలేరు కూడా. గర్భములో కూడా 5-6 నెలల తర్వాత ఆత్మ ప్రవేశిస్తుంది. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. మళ్ళీ ఆత్మ వెళ్ళిపోతే అది అంతమైపోతుంది. ఆత్మ అవినాశీ, తాను పాత్రను అభినయిస్తుంది, దీనిని తండ్రి వచ్చి రియలైజ్ చేయిస్తారు. ఆత్మ ఎంత చిన్నని బిందువు, అందులో అవినాశీ పాత్ర నిండి ఉంది. పరమపిత కూడా ఆత్మయే, వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. వారే ఆత్మ రియలైజేషన్ ను చేయిస్తారు. వారైతే కేవలం పరమాత్మ సర్వశక్తివంతుడని, వేలాది సూర్యుల కన్నా తేజోమయుడని అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, ఇదంతా భక్తి మార్గములో వర్ణన చేయబడింది మరియు దానిని శాస్త్రాలలో వ్రాసేసారు. అర్జునుడికి సాక్షాత్కారం జరిగినప్పుడు, నేను ఇంతటి తీవ్ర ప్రకాశాన్ని సహించలేను అని అన్నాడు, కావున ఆ విషయం మనుష్యుల బుద్ధిలో కూర్చుండిపోయింది. అంతటి తేజోమయ రూపము ఎవరిలోకైనా ప్రవేశించినట్లయితే అతను పేలిపోతారు. వారికి జ్ఞానమైతే లేదు కదా, అందుకే పరమాత్మ వేలాది సూర్యుల కన్నా తేజోమయుడు అని భావిస్తారు, మాకు వారి సాక్షాత్కారం కావాలి అని కోరుకుంటారు. భక్తి యొక్క భావన కూర్చుని ఉంది కావున వారికి ఆ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. మొదట్లో మీ వద్ద కూడా ఇలా ఎంతోమంది సాక్షాత్కారాలు పొందేవారు. వారి కళ్ళు ఎర్రగా అయిపోయేవి. సాక్షాత్కారాలు పొందారు కానీ ఈ రోజు వారెక్కడ ఉన్నారు. అవన్నీ భక్తి మార్గపు విషయాలు. కావున ఇవన్నీ తండ్రి అర్థం చేయిస్తారు, ఇందులో గ్లాని విషయమేదీ లేదు. పిల్లలు సదా హర్షితముగా ఉండాలి. ఇది డ్రామాగా తయారుచేయబడి ఉంది. నన్ను ఎంతగా నిందిస్తూ ఉంటారు, మరి నేను ఏమి చేస్తాను? నాకేమైనా కోపం వస్తుందా? డ్రామా అనుసారంగా వారందరూ భక్తి మార్గంలో చిక్కుకొని ఉన్నారు అని అర్థం చేసుకుంటాను. ఇందులో కోప్పడే విషయమేదీ లేదు. డ్రామా ఈ విధంగా రచింపబడి ఉంది. ప్రేమగా అర్థం చేయించవలసి ఉంటుంది. పాపం వారు అజ్ఞానాంధకారములో పడి ఉన్నారు, అర్థం చేసుకోకపోతే వారిపై దయ కూడా కలుగుతుంది. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. పాపం వారు స్వర్గ ద్వారము వద్దకు రాలేరు, వారంతా శాంతిధామములోకి వెళ్ళేవారే. అందరూ కోరుకునేది కూడా శాంతినే కోరుకుంటారు. కావున తండ్రే యథార్థ విషయాన్ని అర్థం చేయిస్తారు. ఈ ఆట రచింపబడి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. డ్రామాలో ప్రతి ఒక్కరికీ పాత్ర లభించి ఉంది. ఇందులో చాలా అచలమైన, స్థిరమైన బుద్ధి కావాలి. ఎప్పటివరకైతే అచలమైన, స్థిరమైన ఏకరస అవస్థ ఉండదో అప్పటివరకు పురుషార్థం ఎలా చేయగలరు? ఏమైనా కానీ, తుఫానులు వచ్చినా కానీ స్థిరంగా ఉండాలి. మాయ తుఫానులైతే లెక్కలేనన్ని వస్తాయి మరియు చివరి వరకూ అవి వస్తూనే ఉంటాయి. అవస్థ దృఢంగా ఉండాలి. ఇది గుప్తమైన కృషి. చాలామంది పిల్లలు పురుషార్థము చేసి తుఫానులను పారద్రోలుతారు. ఎవరు ఎంతగా పాస్ అవుతారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు. రాజధానిలో పదవులైతే ఎన్నో ఉన్నాయి కదా.

అన్నింటికన్నా మంచి చిత్రాలు త్రిమూర్తి, సృష్టి చక్రము మరియు వృక్షము. ఇవి మొదట్లో తయారుచేయబడినవి. విదేశాలలోని సేవ కొరకు కూడా ఈ రెండు చిత్రాలనూ తీసుకువెళ్ళాలి. వీటి ద్వారా వారు బాగా అర్థం చేసుకోగలుగుతారు. మెల్లమెల్లగా బాబా కోరుకుంటున్నట్లుగా ఈ చిత్రాలు వస్త్రముపై కూడా ముద్రించబడతాయి. ఈ స్థాపన ఎలా జరుగుతుంది అనేది మీరు అర్థం చేయిస్తారు. మీరు వారికి ఇలా చెప్పవచ్చు - మీరు కూడా దీనిని అర్థం చేసుకున్నట్లయితే మీ ధర్మములో ఉన్నత పదవిని పొందుతారు, క్రిస్టియన్ ధర్మములో మీరు ఉన్నత పదవిని పొందాలనుకుంటే దీనిని బాగా అర్థం చేసుకోండి అని వారికి చెప్పవచ్చు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పురుషోత్తమ సంగమయుగములో పవిత్రముగా అయి స్వయాన్ని అలంకరించుకోవాలి. ఎప్పుడూ కూడా మాయ ధూళిలో దొర్లి మీ అలంకారణను పాడు చేసుకోకూడదు.

2. ఈ డ్రామాను యథార్థ రీతిగా అర్థం చేసుకొని మీ అవస్థను అచలముగా, స్థిరముగా తయారుచేసుకోవాలి. ఎప్పుడూ తికమకపడకూడదు, ఎల్లప్పుడూ హర్షితముగా ఉండాలి.

వరదానము:-

ఆలోచించి-అర్థం చేసుకుని ప్రతి కర్మనూ చేసి పశ్చాత్తాపము నుండి ముక్తులయ్యే జ్ఞానీ ఆత్మా భవ

ప్రపంచములో కూడా - మొదట ఆలోచించండి, ఆ తర్వాత చెయ్యండి అని అంటారు. ఎవరైతే ఆలోచించి చేయరో, చేసిన తర్వాత ఆలోచిస్తారో, వారిది పశ్చాత్తాప రూపముగా అవుతుంది. తర్వాత ఆలోచించటము, ఇది పశ్చాత్తాప రూపము మరియు మొదటే ఆలోచించటము - ఇది జ్ఞానీ ఆత్మల గుణము. ద్వాపర-కలియుగాలలోనైతే అనేక రకాల పశ్చాత్తాపాలనే పడుతూ వచ్చారు, కానీ ఇప్పుడు సంగమములో ఏ విధంగా ఆలోచించి-అర్థం చేసుకుని సంకల్పాన్ని మరియు కర్మను చెయ్యండంటే ఇక ఎప్పుడూ మనసులో కూడా, ఒక్క క్షణము కూడా పశ్చాత్తాపము ఉండకూడదు, అప్పుడే జ్ఞానీ ఆత్మ అని అంటారు.

స్లోగన్:-

దయార్దృ హృదయులుగా అయ్యి సర్వ గుణాలు మరియు శక్తుల దానమును ఇచ్చేవారే మాస్టర్ దాత.