16-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సర్వులకూ సద్గతిని ఇచ్చే జీవన్ముక్తి దాత మీకు తండ్రిగా అయ్యారు, మీరు వారి సంతానము, కావున మీకు ఎంతటి నషా ఉండాలి’’

ప్రశ్న:-
ఏ పిల్లల బుద్ధిలో బాబా స్మృతి నిరంతరం నిలవలేదు?

జవాబు:-
ఎవరికైతే పూర్తి నిశ్చయము లేదో వారి బుద్ధిలో స్మృతి నిలవలేదు. తమను ఎవరు చదివిస్తున్నారు అన్నది తెలియకపోతే ఇక ఎవరిని స్మృతి చేస్తారు. ఎవరైతే యథార్థముగా గుర్తించి స్మృతి చేస్తారో వారి వికర్మలే వినాశనమవుతాయి. తండ్రి స్వయమే వచ్చి తమ మరియు తమ ఇంటి యొక్క యథార్థ పరిచయాన్ని ఇస్తారు.

ఓంశాంతి
ఇప్పుడు ఓం శాంతి అన్న పదము యొక్క అర్థమైతే పిల్లలకు సదా గుర్తుంటుంది. మనం ఒక ఆత్మ, మన ఇల్లు నిర్వాణధామము లేక మూలవతనము. ఇకపోతే భక్తి మార్గములో మనుష్యులు ఎవరైతే పురుషార్థము చేస్తున్నారో వారికి తాము ఎక్కడికి వెళ్ళాలి అన్నది తెలియదు. అలాగే సుఖము ఎందులో ఉంది, దుఃఖము ఎందులో ఉంది అన్నది కూడా ఏమీ తెలియదు. యజ్ఞ, తప, దాన, పుణ్య తీర్థాదులు చేస్తూ మెట్లు కిందకు దిగుతూనే వస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది కావున భక్తి సమాప్తమైపోతుంది. గంటలు మొదలైనవాటి వాతావరణమంతా సమాప్తమవుతుంది. క్రొత్త ప్రపంచానికి మరియు పాత ప్రపంచానికి తేడా అయితే ఉంది కదా. క్రొత్త ప్రపంచము పావన ప్రపంచము. పిల్లలైన మీ బుద్ధిలో సుఖధామము ఉంది. సుఖధామాన్ని స్వర్గమని, దుఃఖధామాన్ని నరకమని అంటారు. మనుష్యులు శాంతిని కోరుకుంటారు, కానీ అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేరు. తండ్రి అంటారు, నేను ఎప్పటివరకైతే ఇక్కడకు భారత్ లోకి రానో, అప్పటివరకు నేను లేకుండా పిల్లలైన మీరు వెళ్ళలేరు. భారత్ లోనే శివజయంతి మహిమ చేయబడుతుంది. నిరాకారుడు తప్పకుండా సాకారములోకి వస్తారు కదా. శరీరము లేకుండా ఆత్మ ఏమైనా చేయగలదా? శరీరము లేకుండానైతే ఆత్మ భ్రమిస్తూ ఉంటుంది, వేరొక తనువులోకి కూడా ప్రవేశించేస్తుంది. కొన్ని ఆత్మలు మంచిగా ఉంటాయి, కొన్ని చంచలముగా ఉంటాయి, పూర్తిగా పిచ్చివారిలా చేసేస్తాయి. ఆత్మకు శరీరము తప్పకుండా కావాలి. అలాగే పరమపిత పరమాత్మకు కూడా శరీరము లేకపోతే వారు భారత్ లోకి వచ్చి ఏమి చేస్తారు! భారత్ యే అవినాశీ ఖండము. సత్యయుగములో ఒక్క భారత ఖండమే ఉంటుంది. మిగిలిన ఖండాలన్నీ వినాశనమైపోతాయి. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేది అని గానం చేస్తారు. వారు దానికి ఆది సనాతన హిందూ ధర్మము అని అనేస్తారు. వాస్తవానికి ప్రారంభములో హిందువులు ఎవరూ లేరు, దేవీ-దేవతలే ఉండేవారు. యూరోప్ లో నివసించేవారు తమను తాము క్రిస్టియన్లుగా పిలుచుకుంటారు, అంతేకానీ యూరోపియన్ ధర్మము అని అనరు కదా. ఈ హిందుస్థాన్ లో ఉండేవారు హిందూ ధర్మము అని అంటారు. ఏ దైవీ ధర్మమైతే శ్రేష్ఠముగా ఉండేదో, ఆ ధర్మమువారే 84 జన్మలలోకి వస్తూ ధర్మభ్రష్టులుగా అయిపోయారు. దేవతా ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారే ఇక్కడకు వస్తారు. ఒకవేళ నిశ్చయము లేకపోతే వారు ఈ ధర్మానికి చెందినవారు కాదు అని అర్థం చేసుకోండి. వారు ఇక్కడ కూర్చుని ఉన్నా కానీ వారికి అర్థం కాదు. అక్కడ కొందరు ప్రజలలో తక్కువ పదవిని పొందేవారు ఉంటారు. అందరూ సుఖ-శాంతులనే కోరుకుంటూ ఉంటారు, అది సత్యయుగములోనే ఉంటుంది. అందరూ అయితే సుఖధామములోకి వెళ్ళలేరు. అన్ని ధర్మాలు తమ-తమ సమయానుసారముగా వస్తాయి. అనేక ధర్మాలు ఉన్నాయి. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. ముఖ్యమైన కాండము దేవీ-దేవతా ధర్మము. ఆ తర్వాత మూడు శాఖలు ఉంటాయి. స్వర్గములో అవి ఉండవు. ద్వాపరము నుండి మొదలుకొని కొత్త ధర్మాలు వెలువడతాయి, దీనిని వెరైటీ మనుష్య వృక్షము అని అంటారు. విరాట రూపము వేరు. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. రకరకాల మనుష్యులు ఉన్నారు. ఎన్ని ధర్మాలు ఉన్నాయి అనేది మీకు తెలుసు. సత్యయుగ ఆదిలో ఒకే ధర్మము ఉండేది, కొత్త ప్రపంచము ఉండేది. భారత్ యే ప్రాచీనమైన స్వర్గముగా ఉండేదని విదేశాలలోనివారికి కూడా తెలుసు. భారత్ ఎంతో షావుకారుగా ఉండేది, అందుకే భారత్ కు ఎంతో గౌరవము లభిస్తుంది. ఎవరైనా షావుకారుగా ఉన్నవారు పేదవానిగా అయితే వారిపై దయ కలుగుతుంది. అలాగే పాపం భారత్ ఎలా అయిపోయింది! ఇది కూడా డ్రామాలోని పాత్ర. అందరికన్నా ఎక్కువ దయార్ద్ర హృదయుడు ఈశ్వరుడే అని కూడా అంటారు మరియు వారు రావడము కూడా భారత్ లోకే వస్తారు. పేదవారిపై తప్పకుండా షావుకార్లే దయ చూపిస్తారు కదా. తండ్రి అనంతమైన షావుకారు, వారు ఉన్నతోన్నతముగా తయారుచేస్తారు. మీరు ఎవరి పిల్లలుగా అయ్యారో ఆ నషా కూడా ఉండాలి. పరమపిత పరమాత్మ అయిన శివునికి మనం సంతానము, వారినే జీవన్ముక్తిదాత, సద్గతిదాత అని అంటారు. జీవన్ముక్తి మొట్టమొదట సత్యయుగములో ఉంటుంది. ఇక్కడైతే జీవనబంధనము ఉంది. భక్తి మార్గములో - బాబా, బంధనము నుండి విడిపించండి అని పిలుస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు మీరు అలా పిలువరు.

మీకు తెలుసు, జ్ఞానసాగరుడైన తండ్రియే ప్రపంచ చరిత్ర-భౌగోళికముల సారాంశమును అర్థం చేయిస్తున్నారు. వారు నాలెడ్జ్ ఫుల్. నేను భగవంతుడిని కాను అని ఇతను స్వయం అంటారు. మీరైతే దేహము నుండి అతీతముగా దేహీ-అభిమానులుగా అవ్వాలి. మొత్తం ప్రపంచాన్ని మరియు మీ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. ఇతను భగవంతుడు కారు. వీరిని బాప్ దాదా అని అంటారు. తండ్రి ఉన్నతోన్నతమైనవారు. ఇది పతిత పాత తనువు. మహిమ కేవలం ఒక్కరిదే. వారితోనే యోగము జోడించాలి, అప్పుడే పావనముగా అవుతారు, లేకపోతే ఎప్పుడూ పావనముగా అవ్వలేరు మరియు చివరిలో లెక్కాచారాలను తీర్చుకుని శిక్షలు అనుభవించి వెళ్తారు. భక్తి మార్గములో హంసో సోహం అనే మంత్రాన్ని వింటూ వచ్చారు. ఆత్మయైన మనమే పరమపిత పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అయిన మనము అని అంటారు - ఈ తప్పుడు మంత్రమే పరమాత్మ నుండి విముఖులుగా చేస్తుంది. తండ్రి అంటారు - పిల్లలూ, పరమాత్మయే ఆత్మ అయిన మనము అని అనడం పూర్తిగా తప్పు. ఇప్పుడు పిల్లలైన మీకు వర్ణాల రహస్యము కూడా అర్థం చేయించడం జరిగింది. మనమే బ్రాహ్మణులము, మళ్ళీ మనమే దేవతలుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తాము, మళ్ళీ మనమే దేవతలుగా అయి క్షత్రియ వర్ణములోకి వస్తాము. మనం ఏ విధంగా 84 జన్మలను తీసుకుంటాము, ఏ కులములలో తీసుకుంటాము అనేది ఇంకెవ్వరికీ తెలియదు. మనం బ్రాహ్మణులమని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బాబా అయితే బ్రాహ్మణుడు కారు. మీరే ఈ వర్ణాలలోకి వస్తారు. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మములోకి దత్తత తీసుకున్నారు. శివబాబా ద్వారా ప్రజాపిత బ్రహ్మాకు సంతానముగా అయ్యారు. నిరాకారీ ఆత్మలు నిజానికి ఈశ్వరీయ కులానికి చెందినవారని కూడా మీకు తెలుసు. మీరు నిరాకారీ ప్రపంచములో ఉంటారు, ఆ తర్వాత సాకారీ ప్రపంచములోకి వస్తారు. పాత్రను అభినయించేందుకు రావలసి ఉంటుంది. అక్కడి నుండి వచ్చి మళ్ళీ మనం దేవతా కులములో ఎనిమిది జన్మలు తీసుకున్నాము, ఆ తర్వాత మనం క్షత్రియ కులములోకి, వైశ్య కులములోకి వెళ్తాము. మీరు ఇన్ని జన్మలు దైవీ కులములో తీసుకున్నారని, మళ్ళీ ఇన్ని జన్మలు క్షత్రియ కులములో తీసుకున్నారని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది 84 జన్మల చక్రము. మీకు తప్ప ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ లభించదు. ఈ ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారే ఇక్కడకు వస్తారు. రాజధాని స్థాపన అవుతోంది. కొందరు రాజా-రాణులుగా, కొందరు ప్రజలుగా అవుతారు. సూర్యవంశీ లక్ష్మీ-నారాయణ ది ఫస్ట్, సెకండ్, థర్డ్... ఇలా 8 తరాలు కొనసాగుతాయి, ఆ తర్వాత క్షత్రియ ధర్మములో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్... ఇలా కొనసాగుతాయి. ఈ విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తున్నారు. జ్ఞానసాగరుడు ఎప్పుడైతే వస్తారో, అప్పుడు భక్తి అంతమైపోతుంది. రాత్రి సమాప్తమై పగలు వస్తుంది. అక్కడ ఏ రకమైన కష్టాలూ ఉండవు, అంతా ప్రశాంతతే ప్రశాంతత, ఎటువంటి గొడవలు ఉండవు. ఇది కూడా డ్రామాగా నిశ్చితమై ఉంది. భక్తి మార్గములోనే తండ్రి వస్తారు. అందరూ తప్పకుండా తిరిగి వెళ్ళాలి, మళ్ళీ నంబరువారుగా దిగుతారు. క్రైస్ట్ వస్తే ఇక అతని ధర్మమువారు కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారో చూడండి. క్రైస్ట్ క్రిస్టియన్ ధర్మము యొక్క బీజము. ఈ దేవీ-దేవతా ధర్మము యొక్క బీజము పరమపిత పరమాత్మ అయిన శివుడే. మీ ధర్మ స్థాపనను పరమపిత పరమాత్మయే చేస్తారు. మిమ్మల్ని బ్రాహ్మణ ధర్మములోకి ఎవరు తీసుకువచ్చారు? తండ్రి దత్తత తీసుకున్నారు కావున వారి ద్వారా చిన్న బ్రాహ్మణ ధర్మము ఏర్పడింది. బ్రాహ్మణుల పిలక మహిమ చేయబడుతుంది. ఇది పిలకకు గుర్తు, ఆ తర్వాత కిందకు వస్తే శరీరము పెరుగుతూ ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. కళ్యాణకారి అయిన తండ్రియే వచ్చి భారత్ యొక్క కళ్యాణము చేస్తారు. అందరికన్నా ఎక్కువగా అయితే పిల్లలైన మీ కళ్యాణమునే చేస్తారు. మీరు ఎలా ఉన్నవారు ఎలా అవుతారు! మీరు అమరలోకానికి అధిపతులుగా అవుతారు. ఇప్పుడే మీరు కామముపై విజయాన్ని పొందుతారు. అక్కడ అకాల మృత్యువు ఉండదు. మరణించడమనే విషయము ఉండదు. కానీ శరీరాన్ని అయితే మారుస్తారు కదా. ఏ విధంగా సర్పము ఒక కుబుసాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుందో, అలా ఇక్కడ కూడా మీరు ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త ప్రపంచములో కొత్త శరీరాన్ని తీసుకుంటారు. సత్యయుగాన్ని పూలతోట అని అంటారు. అక్కడ ఎప్పుడూ ఎటువంటి చెడు వచనాలు వెలువడవు. ఇక్కడ ఉండేది చెడు సాంగత్యమే. మాయ సాంగత్యము ఉంది కదా, అందుకే దీని పేరే రౌరవ నరకము. స్థానము పాతబడితే మునిసిపాలిటీవారు ముందుగానే ఖాళీ చేయించేస్తారు. తండ్రి కూడా అంటారు, ఎప్పుడైతే ప్రపంచము పాతబడుతుందో అప్పుడు నేను వస్తాను.

జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. రాజయోగము నేర్పించడం జరుగుతుంది. భక్తిలో అయితే ఏమీ లేదు. దానపుణ్యాదులు చేస్తే అల్పకాలికముగా సుఖము లభిస్తుంది. ఇది కాకిరెట్టతో సమానమైన సుఖము అని చెప్తూ రాజులకు కూడా సన్యాసులు వైరాగ్యాన్ని కలిగిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన వైరాగ్యము నేర్పించడం జరుగుతుంది. ఇది పాత ప్రపంచము, ఇప్పుడిక సుఖధామాన్ని స్మృతి చేయండి, ఆ తర్వాత వయా శాంతిధామము అక్కడకు వెళ్ళాలి. దిల్వాడా మందిరములో యథావిధిగా ఈ సమయములోని మీ స్మృతిచిహ్నము ఉంది. కింద తపస్యలో కూర్చున్నారు, పైన స్వర్గము ఉంది. లేకపోతే మరి స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి. మనుష్యులు మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. స్వర్గము పైన ఉంది అని భావిస్తారు కానీ పైన ఏమీ లేదు. భారత్ యే స్వర్గముగా, భారత్ యే నరకముగా అవుతుంది. ఈ మందిరము పూర్తి స్మృతిచిహ్నము. ఈ మందిరాలు మొదలైనవన్నీ తర్వాత తయారవుతాయి. స్వర్గములో భక్తి ఉండదు. అక్కడ అంతా సుఖమే సుఖము. తండ్రి వచ్చి అన్ని రహస్యాలనూ అర్థం చేయిస్తారు. ఇతర ఆత్మలందరి పేర్లు మారుతాయి కానీ శివుని పేరు మారదు. వారికి తమదంటూ శరీరము లేదు. శరీరము లేకుండా ఎలా చదివిస్తారు! ఇందులో ప్రేరణ యొక్క విషయమేదీ లేదు. ప్రేరణ అంటే అర్థము ఆలోచన. పై నుండి ప్రేరణ ఇస్తే అది చేరుకుంటుందని కాదు, ఇందులో ప్రేరణ యొక్క విషయమేదీ లేదు. ఏ పిల్లలకైతే తండ్రి గురించిన పూర్తి పరిచయము లేదో, పూర్తి నిశ్చయము లేదో, వారి బుద్ధిలో స్మృతి కూడా నిలవదు. తమకు ఎవరు నేర్పిస్తున్నారు అన్నది తెలియకపోతే ఇక ఎవరిని స్మృతి చేస్తారు? తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి. జన్మ-జన్మాంతరాలుగా ఏ లింగమునైతే స్మృతి చేస్తూ వచ్చారో, దేనినైతే పరమాత్మ అని భావించారో, అది వీరి చిహ్నము. వారు నిరాకారుడు, సాకారుడు కాదు. తండ్రి అంటారు, నేను కూడా ప్రకృతి ఆధారాన్ని తీసుకోవలసి ఉంటుంది, లేకపోతే మీకు సృష్టిచక్రపు రహస్యాన్ని ఎలా వివరించగలను. ఇది ఆత్మిక జ్ఞానము. ఆత్మలకే ఈ జ్ఞానము లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రియే ఇవ్వగలరు. పునర్జన్మలనైతే తీసుకోవలసిందే. నటులందరికీ పాత్ర లభించింది. నిర్వాణములోకి ఎవరూ వెళ్ళలేరు. మోక్షము పొందలేరు. ఎవరైతే నంబర్ వన్ విశ్వాధిపతులుగా అవుతారో, వారే 84 జన్మలలోకి వస్తారు. చక్రము తప్పకుండా చుట్టి రావాలి. మనుష్యులు మోక్షము లభిస్తుంది అని భావిస్తారు. ఎన్ని రకాల అభిప్రాయాలు మరియు ఆలోచనలు ఉన్నాయి. వృద్ధి అయితే జరుగుతూనే ఉంటుంది. ఎవరూ తిరిగి వెళ్ళలేరు. తండ్రియే 84 జన్మల కథను తెలియజేస్తారు. పిల్లలైన మీరు చదువుకుని మళ్ళీ చదివించాలి కూడా. ఈ ఆత్మిక జ్ఞానాన్ని మీరు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. శూద్రులూ ఇవ్వలేరు, దేవతలూ ఇవ్వలేరు. సత్యయుగములో జ్ఞానము లభించేందుకు అసలు అక్కడ దుర్గతి అనేదే ఉండదు. ఈ జ్ఞానము లభించేదే సద్గతి కొరకు. సద్గతిదాత, ముక్తిప్రదాత, మార్గదర్శకుడు ఒక్కరే. స్మృతియాత్ర లేకుండా ఎవరూ పవిత్రముగా అవ్వలేరు. శిక్షలు తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా భ్రష్టమైపోతుంది. అందరి లెక్కాచారాలు తీరవలసి ఉంటుంది కదా. మీకు మీ విషయాన్నే అర్థం చేయిస్తారు. ఇతర ధర్మాలలోకి వెళ్ళవలసిన అవసరమేముంది. భారతవాసులకే ఈ జ్ఞానము లభిస్తుంది. తండ్రి కూడా భారత్ లోకే వచ్చి మూడు ధర్మాలను స్థాపన చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని శూద్ర ధర్మము నుండి బయటకు తీసి ఉన్నత కులములోకి తీసుకువెళ్తారు. అది నీచమైన పతిత కులము, ఇప్పుడు పావనముగా తయారుచేసేందుకు బ్రాహ్మణులైన మీరు నిమిత్తంగా అవుతారు. దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞము అని అంటారు. రుద్రుడైన శివబాబా యజ్ఞాన్ని రచించారు, ఈ అనంతమైన యజ్ఞములో మొత్తం పాత ప్రపంచమంతటి ఆహుతి పడనున్నది. ఆ తర్వాత క్రొత్త ప్రపంచము స్థాపన అవుతుంది. పాత ప్రపంచము అంతమవ్వనున్నది. క్రొత్త ప్రపంచము కొరకే మీరు ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు. దేవతల నీడ కూడా పాత ప్రపంచములో పడదు. కల్పపూర్వము ఎవరైతే వచ్చి ఉంటారో వారే వచ్చి ఈ జ్ఞానాన్ని తీసుకుంటారని పిల్లలైన మీకు తెలుసు. నంబరువారు పురుషార్థానుసారముగా ఈ చదువును చదువుతారు. మనుష్యులు ఇక్కడే శాంతిని కోరుకుంటారు. వాస్తవానికి ఆత్మ శాంతిధామ నివాసి, అంతేకానీ ఇక్కడ శాంతి ఎలా లభించగలదు. ఈ సమయములోనైతే ప్రతి ఇంట్లోనూ అశాంతి ఉంది. ఇది రావణ రాజ్యము కదా. సత్యయుగములో పూర్తిగా శాంతి రాజ్యము ఉంటుంది. ఒకే ధర్మము, ఒకే భాష ఉంటుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగులుగా అయి మీ దేహాన్ని కూడా మరచి, శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. నిశ్చయబుద్ధి కలవారిగా అయి స్మృతియాత్రలో ఉండాలి.

2. హంసో సోహం అనే మంత్రాన్ని యథార్థముగా అర్థం చేసుకుని ఇప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే పురుషార్థము చేయాలి. అందరికీ దీని యథార్థమైన అర్థాన్ని అర్థం చేయించాలి.

వరదానము:-
అంతర్ముఖత యొక్క అభ్యాసము ద్వారా అలౌకిక భాషను అర్థం చేసుకునే సదా సఫలతా సంపన్న భవ

ఎంతెంతగా పిల్లలైన మీరు అంతర్ముఖీ స్వీట్ సైలెన్స్ స్వరూపములో స్థితులవుతూ ఉంటారో, అంతగా నయనాల భాషను, భావనల భాషను మరియు సంకల్పాల భాషను సహజముగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ మూడు రకాల భాషలు ఆత్మిక యోగీ జీవితము యొక్క భాషలు. ఈ అలౌకిక భాషలు చాలా శక్తిశాలి అయినవి. సమయమనుసారముగా ఈ మూడు భాషల ద్వారానే సహజ సఫలత ప్రాప్తిస్తుంది. అందుకే ఇప్పుడు ఆత్మిక భాష యొక్క అభ్యాసకులుగా కండి.

స్లోగన్:-
మీరు ఎంత తేలికగా అయిపోండంటే తండ్రి మిమ్మల్ని తన కనురెప్పలపై కూర్చోబెట్టుకుని తనతోపాటు తీసుకువెళ్ళగలగాలి.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి

వర్తమాన సమయములో విశ్వ కళ్యాణము చేసేందుకు సహజమైన సాధనము - మీ శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత. దీని ద్వారానే సర్వాత్మల భ్రమిస్తున్న బుద్ధిని ఏకాగ్రము చెయ్యగలరు. విశ్వములోని సర్వాత్మలు విశేషముగా ఏం కోరుకుంటున్నారంటే - భ్రమిస్తున్న బుద్ధి ఏకాగ్రమవ్వాలి మరియు మనసు చంచలత్వము నుండి ఏకాగ్రమవ్వాలి అని. దీని కొరకు ఏకాగ్రత అనగా సదా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఈ స్మృతి ద్వారా ఏకరస స్థితిలో స్థితులయ్యే విశేషమైన అభ్యాసాన్ని చెయ్యండి.