16-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మీకు ఆత్మిక కళను నేర్పించేందుకు వచ్చారు, ఈ కళ ద్వారా మీరు సూర్యచంద్రాదుల కన్నా కూడా దూరంగా శాంతిధామానికి వెళ్తారు’’

ప్రశ్న:-
సైన్స్ గర్వానికి మరియు సైలెన్స్ గర్వానికి మధ్యన ఏమి తేడా ఉంది?

జవాబు:-
సైన్స్ గర్వము కలవారు చంద్రుడు, నక్షత్రాల వద్దకు వెళ్ళేందుకు ఎంతగా ఖర్చు చేస్తారు. శరీరాన్ని ఫణంగా పెట్టి వెళ్తారు. వారికి - రాకెట్ ఎక్కడైనా ఫెయిల్ అయిపోతుందేమో అన్న భయం ఉంటుంది. సైలెన్స్ గర్వము కల పిల్లలైన మీరు పైసా ఖర్చు లేకుండా సూర్యచంద్రాదుల కన్నా కూడా దూరంగా ఉన్న మూలవతనములోకి వెళ్ళిపోతారు. మీకు ఎటువంటి భయమూ లేదు ఎందుకంటే మీరు శరీరాన్ని ఇక్కడే వదిలి వెళ్తారు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. వైజ్ఞానికులు చంద్రుని పైకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనైతే పిల్లలైన మీరు వింటూ ఉంటారు. కానీ వారైతే కేవలం చంద్రుని వరకే వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు, దాని కోసం ఎంత ఖర్చు చేస్తారు. పైకి వెళ్ళడములో ఎంతో భయం ఉంటుంది. ఇప్పుడు మీరు మీ విషయములో ఆలోచించండి - మీరు ఎక్కడి నివాసులు? వారైతే చంద్రుని వైపుకు వెళ్తారు. మీరైతే సూర్యచంద్రాదుల కన్నా కూడా దూరంగా వెళ్తారు, పూర్తిగా మూలవతనములోకి వెళ్ళిపోతారు. వారు పైకి వెళ్తే వారికెంతో ధనము లభిస్తుంది. వారు పైకి వెళ్ళి అంతా చుట్టి వస్తే వారికి లక్షల కానుకలు లభిస్తాయి. శరీరము పరంగా రిస్క్ తీసుకుని వెళ్తారు. వారు సైన్స్ గర్వము కలవారు. మీ వద్ద సైలెన్స్ గర్వము ఉంది. ఆత్మ అయిన మనం మన శాంతిధామమైన బ్రహ్మాండములోకి వెళ్తామని మీకు తెలుసు. ఆత్మయే అన్నీ చేస్తుంది. వారి ఆత్మ కూడా శరీరముతో పాటు పైకి వెళ్తుంది. అది చాలా ప్రమాదకరమైనది. పై నుండి పడిపోతే ఇక ప్రాణం అంతమైపోతుంది అని భయపడుతారు కూడా. అవన్నీ భౌతికమైన కళలు. మీకు తండ్రి ఆత్మిక కళను నేర్పిస్తారు. ఈ కళను నేర్చుకోవడం ద్వారా మీకు ఎంత పెద్ద ప్రైజ్ లభిస్తుంది. 21 జన్మల ప్రైజ్ లభిస్తుంది, నంబరువారు పురుషార్థానుసారముగా లభిస్తుంది. ఈ రోజుల్లో ప్రభుత్వము లాటరీలు కూడా ప్రవేశపెడుతూ ఉంటుంది కదా. ఇక్కడ తండ్రి మీకు ప్రైజ్ ను ఇస్తారు మరియు ఇంకేమి నేర్పిస్తారు? మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకువెళ్తారు, అక్కడ మీ ఇల్లు ఉంది. ఇప్పుడు మీకు గుర్తుకొస్తుంది కదా - మా ఇల్లు ఎక్కడ ఉంది మరియు ఏ రాజధానినైతే పోగొట్టుకున్నామో అది ఎక్కడ ఉంది అని. దానిని రావణుడు దోచుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం మన యథార్థమైన ఇంటికి కూడా వెళ్తాము మరియు రాజ్యాన్ని కూడా పొందుతాము. ముక్తిధామము మన ఇల్లు - ఇది ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు నేర్పించేందుకు తండ్రి ఎక్కడి నుండి వస్తారో చూడండి, వారు ఎంత దూరం నుండి వస్తారు. ఆత్మ కూడా ఒక రాకెట్టే. వారు పైకి వెళ్ళి చంద్రుడిలో ఏముందో, నక్షత్రాలలో ఏముందో చూడాలని ప్రయత్నిస్తారు. ఇవన్నీ ఈ రంగస్థలపు దీపాలేనని పిల్లలైన మీకు తెలుసు. ఏ విధముగా రంగస్థలముపై విద్యుత్ దీపాలు పెడతారు, మ్యూజియంలలో కూడా మీరు విద్యుత్ దీపాల మాలను పెడతారు కదా. అలాగే ఇది అనంతమైన ప్రపంచము. ఇందులో ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశాన్ని ఇచ్చే దీపాలు. మనుష్యులేమో సూర్యచంద్రులు దేవతలని భావిస్తారు. కానీ అవి దేవతలైతే కావు. తండ్రి ఏ విధముగా వచ్చి మనల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వీరు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు మరియు జ్ఞాన లక్కీ సితారలు. జ్ఞానము ద్వారానే పిల్లలైన మీ సద్గతి జరుగుతోంది. మీరు ఎంత దూరం వెళ్తారు. తండ్రే ఇంటికి వెళ్ళే దారిని తెలియజేస్తారు. తండ్రి లేకుండా ఎవరూ తిరిగి తమ ఇంటికి వెళ్ళలేరు. తండ్రి ఎప్పుడైతే వచ్చి శిక్షణను ఇస్తారో అప్పుడు మీరు తెలుసుకుంటారు. ఆత్మ అయిన మనం పవిత్రముగా అవుతాము, అప్పుడే మన ఇంటికి వెళ్ళగలుగుతాము అని కూడా మీరు అర్థం చేసుకుంటారు. యోగబలముతోనైనా లేక శిక్షల బలముతోనైనా పావనముగా అవ్వాలి. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు, ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా మీరు పావనముగా అవుతారు. స్మృతి చేయకపోతే పతితులుగానే ఉండిపోతారు, ఇక ఎన్నో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది. తండ్రి స్వయంగా కూర్చుని - మీరు ఇలా ఇలా ఇంటికి వెళ్ళవచ్చు అని మీకు అర్థం చేయిస్తారు. బ్రహ్మాండము ఏమిటి, సూక్ష్మవతనము ఏమిటి, ఏమీ తెలియదు. విద్యార్థులకు మొదట ఏమీ తెలియదు, ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తారో అప్పుడు నాలెడ్జ్ లభిస్తుంది. నాలెడ్జ్ కూడా కొన్ని చిన్నగా, కొన్ని పెద్దగా ఉంటాయి. ఐ.సి.యస్ పరీక్షను వ్రాసినట్లయితే వారిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. దాని కన్నా ఉన్నతమైన జ్ఞానము ఇంకేదీ ఉండదు. ఇప్పుడు మీరు కూడా ఎంతటి ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకుంటారు. తండ్రి మీకు పవిత్రముగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు, అదేమిటంటే - పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. వాస్తవానికి ఆత్మలైన మీరు పావనులుగా ఉండేవారు. పైన మీ ఇంట్లో ఉండేవారు. మీరు సత్యయుగములో జీవన్ముక్తిలో ఉన్నప్పుడు మిగిలినవారంతా ముక్తిధామములో ఉండేవారు. ముక్తి మరియు జీవన్ముక్తి, రెండింటినీ మనం శివాలయము అని అనవచ్చు. ముక్తిలో శివబాబా కూడా ఉంటారు, అలాగే పిల్లలమైన మనము (ఆత్మలము) కూడా ఉంటాము. ఇది ఆత్మిక ఉన్నతోన్నతమైన జ్ఞానము. వారు, మేము చంద్రుని పైకి వెళ్ళి ఉంటాము అని అంటారు. ఎంతగా కష్టపడుతూ ఉంటారు. సాహసాన్ని చూపిస్తారు. ఎన్నో లక్షల మైళ్లు పైకి వెళ్తారు, కానీ వారి ఆశ పూర్తి అవ్వదు మరియు మీ ఆశ పూర్తవుతుంది. వారిది అసత్యమైన భౌతికమైన గర్వము, మీది ఆత్మిక గర్వము. వారు మాయ సాహసాన్ని ఎంతగా చూపిస్తారు. మనుష్యులు ఎన్ని చప్పట్లు కొడతారు, అభినందనలు తెలియజేస్తారు. వారికి ఎంతో లభిస్తుంది కూడా. మహా అయితే 5-10 కోట్లు లభిస్తుంది. పిల్లలైన మీకు ఈ జ్ఞానము ఉంది - వారికి ఈ ధనమేదైతే లభిస్తుందో, అదంతా అంతమైపోతుంది అని. ఇంకా కొద్ది రోజులే అనుకోండి. ఈ రోజు ఎలా ఉంది, రేపు ఎలా అవుతుంది! ఈ రోజు మీరు నరకవాసులుగా ఉన్నారు, రేపు స్వర్గవాసులుగా అవుతారు. ఎక్కువ సమయమేమీ పట్టదు, వారిది దైహికమైన శక్తి మరియు మీది ఆత్మిక శక్తి. అది కేవలం మీకు మాత్రమే తెలుసు. వారు దైహికమైన శక్తితో ఎక్కడి వరకూ చేరుకుంటారు. చంద్రుడు, నక్షత్రాల వరకూ చేరుకుంటారు మరియు యుద్ధము ప్రారంభమైపోతుంది. తర్వాత ఇవన్నీ అంతమైపోతాయి. వారి ఈ కళ ఇక్కడికే అంతమైపోతుంది. అది భౌతికమైన ఉనతోన్నతమైన కళ, మీది ఆత్మికమైన ఉన్నతోన్నతమైన కళ. మీరు శాంతిధామానికి వెళ్తారు. దాని పేరే స్వీట్ హోమ్. వారు ఎంతగా పైకి వెళ్తారు మరియు మీరు మీ లెక్కను చూడండి, మీరు ఎన్ని మైళ్ళు పైకి వెళ్తారు. మీరు ఎవరు? ఆత్మలు. తండ్రి అంటారు, నేను ఎన్ని మైళ్ళు పైన ఉంటానో లెక్కపెట్టగలరా! వారి వద్ద అయితే లెక్క ఉంది, ఇన్ని మైళ్ళు పైకి వెళ్ళారు మరియు తిరిగి వచ్చారు అని చెప్తారు. చాలా జాగ్రత్తగా ఉంటారు, అక్కడ ఇలా దిగుతాము, ఇది చేస్తాము, అది చేస్తాము... అంటారు. వారు ఎంతో శబ్దము చేస్తారు. మీ వద్ద శబ్దమేముంటుంది. మీరు ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ ఎలా వస్తారు అన్నది వారికి ఏమీ తెలియదు. మీకు ఏ ప్రైజ్ లభిస్తుంది అనేది కూడా మీకే తెలుసు. ఇది అద్భుతము. ఇది బాబా అద్భుతము, ఇది ఎవరికీ తెలియదు. ఇది కొత్త విషయమేమీ కాదు అని మీరు అంటారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వారు తమ ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉంటారు. మీకు ఈ సృష్టి రూపీ డ్రామా ఆదిమధ్యాంతాల గురించి, కాల వ్యవధి మొదలైనవాటి గురించి బాగా తెలుసు. కావున మీకు లోలోపల నషా ఉండాలి - బాబా మాకు ఏమేమి నేర్పిస్తున్నారు! చాలా ఉన్నతమైన పురుషార్థము చేస్తారు, ఇంకా చేస్తూ ఉంటారు. ఈ విషయాలన్నింటి గురించి ఇంకెవరికీ తెలియదు. తండ్రి గుప్తమైనవారు. మీకు రోజూ ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీకు ఎంతటి జ్ఞానాన్ని ఇస్తారు. వారు హద్దు వరకు వెళ్తారు. మీరు అనంతములోకి వెళ్తారు. వారు చంద్రుని వరకూ వెళ్తారు, ఇప్పుడు అవైతే పెద్ద-పెద్ద దీపాలు, అంతే తప్ప ఇంకేమీ కావు. వారికి భూమి చాలా చిన్నగా కనిపిస్తుంది. వారి యొక్క భౌతికమైన జ్ఞానానికి మరియు మీ జ్ఞానానికి ఎంత తేడా ఉంది. మీ ఆత్మ ఎంత చిన్ననిది. కానీ ఇది చాలా వేగవంతమైన రాకెట్. ఆత్మలు పైన ఉంటాయి, మళ్ళీ పాత్రను అభినయించేందుకు వస్తాయి. వారు కూడా సుప్రీమ్ ఆత్మ. కానీ వారి పూజ ఎలా జరుగుతుంది. భక్తి కూడా తప్పకుండా జరగవలసిందే.

బాబా అర్థం చేయించారు, అర్ధకల్పము జ్ఞానము పగలు, అర్ధకల్పము భక్తి రాత్రి. ఇప్పుడు సంగమయుగములో మీరు జ్ఞానాన్ని తీసుకుంటారు. సత్యయుగములోనైతే జ్ఞానము ఉండదు, అందుకే దీనిని పురుషోత్తమ సంగమయుగము అని అంటారు. అందరినీ పురుషోత్తములుగా తయారుచేస్తారు. మీ ఆత్మ ఎంత దూరదూరాల వరకూ వెళ్తుంది, మీకు సంతోషము ఉంది కదా. వారు తమ కళను చూపిస్తే వారికెంతో ధనము లభిస్తుంది. కానీ వారికి ఎంత లభించినా సరే అదేమీ వారితోపాటు వెళ్ళదని మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడిక అందరూ మరణించనున్నారు. అందరూ అంతమైపోనున్నారు. ఇప్పుడు మీకు ఎన్ని విలువైన రత్నాలు లభిస్తాయి, వీటి విలువను లెక్కించలేము. ఒక్కొక్క వాక్యము లక్షల రూపాయలు విలువ చేస్తుంది. ఎంత కాలంగా మీరు వింటూ వస్తారు. గీతలో ఎంత విలువైన జ్ఞానము ఉంది. ఈ ఒక్క గీతనే మోస్ట్ వాల్యుబల్ (అత్యంత విలువైనది) అని అంటారు. సర్వశాస్త్రమయి శిరోమణి శ్రీమద్భగవద్గీతయే. వారు చదువుతూ ఉంటారు కానీ అర్థమేమీ తెలుసుకోరు. గీతను చదవడం ద్వారా ఏమవుతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు. వారు గీతను చదువుతారు కానీ ఒక్కరికి కూడా తండ్రితో యోగము లేదు. తండ్రినే సర్వవ్యాపి అని అనేస్తారు. పావనముగా కూడా అవ్వలేరు. ఇప్పుడు ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాలు మీ ఎదురుగా ఉన్నాయి. వీరిని దేవతలు అని అంటారు ఎందుకంటే వీరిలో దైవీ గుణాలు ఉన్నాయి. ఆత్మలైన మీరు పవిత్రముగా అయి అందరూ తమ ఇంటికి వెళ్ళాలి. కొత్త ప్రపంచములోనైతే ఇంతమంది మనుష్యులు ఉండరు. మిగిలిన ఆత్మలందరూ తమ ఇంటికి వెళ్ళాలి. మీకు తండ్రి కూడా అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తారు, దాని ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా, చాలా ఉన్నతమైనవారిగా అవుతారు. కావున ఇటువంటి చదువుపై అటెన్షన్ కూడా అంతకంతా ఉండాలి. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు, ఏ విధముగా ఎవరెవరు కల్పపూర్వము అటెన్షన్ పెట్టారో, అలాగే పెడుతూ ఉంటారు. అంతా తెలిసిపోతూ ఉంటుంది. తండ్రి సేవా సమాచారాన్ని విని సంతోషిస్తూ ఉంటారు కూడా. తండ్రికి ఎప్పుడూ ఉత్తరమే వ్రాయకపోతే - వీరి బుద్ధియోగము ఎక్కడో రాయి, రప్పల వైపుకు వెళ్ళిపోయింది అని భావిస్తారు. దేహాభిమానము వచ్చింది, తండ్రిని మర్చిపోయారు. లేకపోతే ఆలోచించండి, ప్రేమ వివాహాలు జరిగితే వారికి పరస్పరం ఎంత ప్రేమ ఉంటుంది. అయితే, కొంతమంది ఆలోచనలు మారిపోతే వారు పత్నిని కూడా హతమార్చేస్తారు. ఇక్కడ మీది వారితో (పరమాత్మతో) ప్రేమ వివాహము. తండ్రి వచ్చి మీకు తమ పరిచయాన్ని ఇస్తారు. మీకు మీరుగా పరిచయాన్ని పొందరు. తండ్రి రావలసి ఉంటుంది. ఎప్పుడైతే ప్రపంచము పాతబడుతుందో అప్పుడు తండ్రి వస్తారు. పాతదానిని కొత్తగా తయారుచేయడానికి తప్పకుండా సంగమములోనే వస్తారు. తండ్రి కర్తవ్యము కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడము. వారు మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారుచేస్తారు, మరి ఇటువంటి తండ్రిపై ఎంతటి ప్రేమ ఉండాలి, మరి అలాంటప్పుడు బాబా, మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము అని ఎందుకు అంటారు. వీరు ఎంత ఉన్నతోన్నతమైన తండ్రి. వీరి కన్నా ఉన్నతమైనవారు ఇంకెవరూ ఉండనే ఉండరు. మనుష్యులు ముక్తి కొరకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు, ఉపాయాలు ఆలోచిస్తూ ఉంటారు. ఎంతగా అసత్యము, మోసము నడుస్తోంది. మహర్షులు మొదలైనవారికి ఎంత పేరు ఉంది. ప్రభుత్వము 10-20 ఎకరాల భూమిని ఇచ్చేస్తుంది. గవర్నమెంట్ ధర్మానికి విరుద్ధమైనదేమీ కాదు, అందులో కొందరు మినిస్టర్లు ధార్మికమైనవారు, కొందరు అధార్మికమైనవారు. కొందరైతే అసలు ధర్మాన్ని అంగీకరించనే అంగీకరించరు. ధర్మములో శక్తి ఉంది అని అంటారు. క్రిస్టియన్లలో శక్తి ఉండేది కదా. మొత్తం భారత్ అంతటినీ ఆక్రమించేశారు. ఇప్పుడు భారత్ లో ఎటువంటి శక్తి లేదు. ఎన్ని కొట్లాటలు, మారణహోమాలు జరుగుతున్నాయి. ఇదే భారత్ ఒకప్పుడు ఎలా ఉండేది. తండ్రి ఎలా వస్తారు, ఎక్కడికి వస్తారు అన్నది ఎవరికీ తెలియదు. మగధదేశములో ఎక్కడైతే మొసళ్ళు ఉంటాయో అక్కడకు వస్తారని మీకు తెలుసు. మనుష్యులు ఎలాంటివారంటే, వారు అన్నింటినీ తినేస్తారు. అందరికన్నా ఎక్కువ వైష్ణవ్ గా భారత్ యే ఉండేది. ఇది వైష్ణవ రాజ్యము కదా. ఆ మహాన్ పవిత్ర దేవతలు ఎక్కడ మరియు ఈ రోజు చూడండి ఏమేమి మింగుతూ ఉంటారు. నరమాంస భక్షకులుగా కూడా అయిపోతారు. భారత్ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. ఇప్పుడు మీకు మొత్తం రహస్యమంతటినీ అర్థం చేయిస్తున్నారు. పై నుండి మొదలుకుని కింద వరకూ మొత్తం జ్ఞానమంతటినీ ఇస్తారు. మొట్టమొదట మీరే ఈ భూమిపై ఉంటారు, ఆ తర్వాత మనుష్యులు వృద్ధి చెందుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకా కొద్ది సమయములో హాహాకారాలు జరుగుతాయి, అప్పుడిక అలమటిస్తూ ఉంటారు. స్వర్గములో ఎంత సుఖము ఉందో చూడండి. ఈ లక్ష్యము-ఉద్దేశ్యము యొక్క గుర్తును చూడండి. ఈ విషయాలన్నింటినీ పిల్లలైన మీరు ధారణ కూడా చేయాలి. ఇది ఎంత గొప్ప చదువు. తండ్రి ఎంత స్పష్టం చేసి అర్థం చేయిస్తారు. మాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. పైన ఉన్న పుష్పము శివబాబా, ఆ తర్వాత జంట పూసలు... ఇది ప్రవృత్తి మార్గము కదా. నివృత్తి మార్గము వారికైతే మాలను స్మరించే అనుమతి లేదు. ఇది ఉన్నదే దేవతల మాల. వారు రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు, మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. నిర్భయంగా ఎవరికైనా అర్థం చేయించేవారు ఏ కొందరో ఉన్నారు - వారు ఏమని అర్థం చేయిస్తారంటే, మీరు వచ్చినట్లయితే మేము మీకు ఎవరూ చెప్పలేనటువంటి విషయాన్ని తెలియజేస్తాము అని అంటారు. శివబాబాకు తప్ప ఇంకెవరికీ తెలియనే తెలియవు. వారికి ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పించారు. ఇలా చాలా రసవత్తరముగా అర్థం చేయించాలి. వీరు 84 జన్మలు ఎలా తీసుకుంటారు, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర... తండ్రి ఎంత సహజమైన జ్ఞానాన్ని తెలియజేస్తారు, అలాగే పవిత్రముగా కూడా అవ్వాలి, అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. మొత్తం విశ్వముపై శాంతిని స్థాపించేవారు మీరే. తండ్రి మీకు రాజ్యభాగ్యాన్ని ఇస్తారు. వారు దాత కదా. వారు ఏమీ తీసుకోరు. ఇది మీ చదువుకు లభించే ప్రైజ్. ఇటువంటి ప్రైజ్ నైతే ఇంకెవరూ ఇవ్వలేరు. కావున ఇటువంటి తండ్రిని ప్రేమగా ఎందుకు స్మృతి చేయరు. లౌకిక తండ్రినైతే ఆజన్మాంతమూ తలచుకుంటారు. మరి పారలౌకిక తండ్రిని ఎందుకు స్మృతి చేయరు. తండ్రి చెప్పారు, ఇది యుద్ధ మైదానము, ఇందులో పావనులుగా అయ్యేందుకు సమయం పడుతుంది. యుద్ధము పూర్తయ్యేంతవరకూ సమయం పడుతుంది. ఎవరైతే ప్రారంభములో వచ్చారో, వారు పూర్తిగా పావనులుగా అవుతారని కాదు. బాబా అంటారు, మాయ యుద్ధము చాలా తీవ్రముగా జరుగుతుంది. మంచి-మంచి వారిపై కూడా మాయ గెలుస్తుంది. అది అంత శక్తివంతమైనది. ఎవరైతే పడిపోతారో వారు ఇక మురళిని కూడా ఎక్కడ నుండి వినగలుగుతారు. అసలు సెంటర్ కే రాకపోతే వారికి ఎలా తెలుస్తుంది. మాయ పూర్తిగా పైసకు కొరగానివారిగా చేసేస్తుంది. ఎప్పుడైతే మురళిని చదువుతారో అప్పుడు సుజాగృతులవుతారు. అశుద్ధమైన పనులలో నిమగ్నమైపోతారు. మీరు మాయ ద్వారా ఎలా ఓడిపోయారు, బాబా మీకు ఏమి వినిపిస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది వాళ్ళకు అర్థం చేయించే తెలివైన పిల్లలు ఎవరైనా ఉండాలి. వీరిని మాయ తినేస్తోంది అని గమనిస్తే వారిని రక్షించేందుకు ప్రయత్నించాలి. మాయ మొత్తం మింగేయకుండా చూడాలి. మళ్ళీ సుజాగృతులైపోవాలి. లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు. సద్గురువును నిందింపజేస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి నుండి సైలెన్స్ యొక్క కళను నేర్చుకుని ఈ హద్దు ప్రపంచము నుండి దూరముగా అనంతములోకి వెళ్ళాలి. తండ్రి మనకు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి ఎంత గొప్ప ప్రైజ్ ను ఇస్తున్నారు అన్న నషా ఉండాలి.

2. నిర్భయముగా ఉంటూ చాలా రసవత్తరమైన రీతిలో సేవ చేయాలి. మాయా యుద్ధములో శక్తివంతులుగా అయి విజయాన్ని పొందాలి. మురళిని విని సుజాగృతులుగా ఉండాలి మరియు అందరినీ సుజాగృతులుగా చేయాలి.

వరదానము:-
పరమపూజ్యులుగా అయ్యి పరమాత్మ ప్రేమ యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకునే సంపూర్ణ స్వచ్ఛ ఆత్మ భవ

సదా ఈ స్మృతిని జీవితములోకి తీసుకురండి - పూజ్య ఆత్మనైన నేను ఈ శరీరము రూపీ మందిరములో విరాజమానమై ఉన్నాను. అటువంటి పూజ్య ఆత్మనే సర్వులకు ప్రియమనిపిస్తుంది. వారి జడ మూర్తి కూడా అందరికీ ప్రియమనిపిస్తుంది. పరస్పరంలో ఎవరైనా కొట్లాడుకున్నా కానీ మూర్తినైతే ప్రేమిస్తారు ఎందుకంటే వారిలో పవిత్రత ఉంది. కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - మనస్సు-బుద్ధి సంపూర్ణ స్వచ్ఛముగా అయ్యాయా, కొద్దిగా కూడా అస్వచ్ఛత మిక్స్ అయితే అవ్వలేదు కదా? ఎవరైతే ఇలా సంపూర్ణ స్వచ్ఛముగా ఉన్నారో వారే పరమాత్మ ప్రేమకు అధికారులు.

స్లోగన్:-
జ్ఞాన ఖజానాను స్వయములో ధారణ చేసి అన్ని వేళలా, ప్రతి కర్మను వివేకముతో చేసేవారే జ్ఞానీ ఆత్మలు.