ఓంశాంతి
ఓ ప్రభూ, ఈశ్వరా, పరమాత్మా అని అనడములో మరియు తండ్రి అని అనడములో ఎంత తేడా ఉంది. ఓ
ఈశ్వరా, ఓ ప్రభూ అని అనడములో ఎంత గౌరవం ఉంటుంది. అంతేకాక వారిని తండ్రి అని కూడా
అంటారు, తండ్రి అన్న పదము చాలా సాధారణమైనది. తండ్రులైతే అనేకానేకమంది ఉన్నారు.
ప్రార్థనలో కూడా - ఓ ప్రభూ, ఓ ఈశ్వరా అని అంటారు. బాబా అని ఎందుకు అనరు? వాస్తవానికి
వారు పరమపిత కదా. కానీ బాబా అన్న పదము అణిగిపోతుంది, పరమాత్మ అన్న పదము ఉన్నతముగా
అవుతుంది. ఓ ప్రభూ, నయనహీనునికి దారి చూపించండి అని పిలుస్తారు. బాబా, మాకు ముక్తి,
జీవన్ముక్తుల మార్గాన్ని చూపించండి అని ఆత్మలు అంటారు. ప్రభూ అన్న పదము ఎంత గొప్పగా
ఉంది. తండ్రి అనే పదము సాధారణమైనది. ఇక్కడ తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు అని
మీకు తెలుసు. లౌకిక రీతిలోనైతే తండ్రులు ఎంతోమంది ఉన్నారు. నీవే తల్లివి, తండ్రివి...
అని పిలుస్తారు కూడా. ఇవి ఎంత సాధారణమైన పదాలు. ఈశ్వరా లేక ప్రభువు అని అనడముతో వారు
చేయలేనిది ఏముంది అని భావిస్తారు. తండ్రి వచ్చి ఉన్నారని ఇప్పుడు పిల్లలైన మీకు
తెలుసు. తండ్రి చాలా ఉన్నతమైన సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి అంటారు - నా
పిల్లలూ, మీరు రావణుని మతముపై కామ చితి పైకి ఎక్కి భస్మమైపోయారు. ఇప్పుడు నేను
మిమ్మల్ని పావనముగా తయారుచేసి ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. తండ్రిని పిలవడము
కూడా, మీరు వచ్చి పతితము నుండి పావనముగా తయారుచేయండి అనే పిలుస్తారు. తండ్రి అంటారు,
నేను మీ సేవలోనే వచ్చాను. పిల్లలైన మీరందరూ కూడా భారత్ యొక్క అలౌకిక సేవలో ఉన్నారు.
ఈ సేవను మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. మీరు భారత్ కోసమే చేస్తారు, శ్రీమతముపై
పవిత్రముగా తయారై భారత్ ను కూడా అలా తయారుచేస్తారు. రామ రాజ్యము రావాలని బాపూ
గాంధీకి కూడా ఆశ ఉండేది. ఇప్పుడు మనుష్యులెవ్వరూ రామ రాజ్యాన్ని తయారుచేయలేరు. అలా
కాకపోతే మరి ప్రభువును పతిత-పావనా అని ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు పిల్లలైన మీకు
భారత్ పట్ల ఎంత ప్రేమ ఉంది. సత్యమైన సేవనైతే మీరే చేస్తారు, ప్రత్యేకముగా భారత్ కు
మరియు మిగిలిన ప్రపంచమంతటికీ కూడా. బాపూజీ కోరుకున్నట్లుగా ఈ భారత్ ను మళ్ళీ రామ
రాజ్యముగా చేస్తున్నారని మీకు తెలుసు. వారు హద్దులోని బాపూజీ, వీరు అనంతమైన బాపూజీ.
వీరు అనంతమైన సేవ చేస్తారు. ఇది పిల్లలైన మీకే తెలుసు. మీలో కూడా, మేము రామ
రాజ్యాన్ని తయారుచేస్తాము అనే నషా నంబరువారుగా ఉంది. మీరు గవర్నమెంటుకు సేవకులు.
మీరు దైవీ గవర్నమెంటును తయారుచేస్తారు. మీకు భారత్ విషయములో నషా ఉంది. సత్యయుగములో
ఇది పావన భూమిగా ఉండేదని, ఇప్పుడైతే పతితముగా ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మనము
తండ్రి ద్వారా మళ్ళీ పావన భూమిని లేక సుఖధామాన్ని తయారుచేస్తున్నాము, అది కూడా
గుప్తముగా తయారుచేస్తున్నాము అని మీకు తెలుసు. శ్రీమతము కూడా గుప్తముగా లభిస్తుంది.
భారత్ ప్రభుత్వము కోసమే మీరు చేస్తున్నారు. శ్రీమతముపై మీరు భారత్ యొక్క
ఉన్నతోన్నతమైన సేవను మీ తనువు, మనసు, ధనములతో చేస్తున్నారు. కాంగ్రెస్ వారు ఎంతగా
జైళ్ళకు వెళ్ళారు. మీకైతే జైలుకు వెళ్ళవలసిన అవసరము లేదు. మీది ఆత్మికమైన విషయము.
మీ యుద్ధము కూడా పంచ వికారాల రూపీ రావణుడితో జరుగుతుంది. ఈ రావణుడి రాజ్యము మొత్తం
పృథ్విపై ఉంది. ఇది మీ సైన్యము. లంక అనేది ఒక చిన్న ద్వీపము. ఈ సృష్టి అనంతమైన
ద్వీపము. మీరు అనంతమైన తండ్రి శ్రీమతము ఆధారముగా అందరినీ రావణుని జైలు నుండి
విడిపిస్తారు. ఈ పతిత ప్రపంచపు వినాశనమైతే జరిగి తీరవలసిందే అని మీకు తెలుసు. మీరు
శివ శక్తులు. ఈ గోపులు కూడా శివ శక్తులే. మీరు గుప్త రీతిలో భారత్ కు చాలా పెద్ద
సేవ చేస్తున్నారు. మున్ముందు అందరికీ తెలుస్తుంది. మీది శ్రీమతము ఆధారముగా చేసే
ఆత్మిక సేవ. మీరు గుప్తముగా ఉన్నారు. ఈ బి.కె.లు తమ తనువు, మనసు, ధనములతో భారత్ ను
శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన సత్యఖండముగా తయారుచేస్తున్నారు అన్నది ఈ ప్రభుత్వానికి
తెలియనే తెలియదు. భారత్ సత్యఖండముగా ఉండేది, ఇపుడు అసత్యఖండముగా ఉంది. ఒక్క తండ్రే
సత్యమైనవారు. గాడ్ ఈజ్ ట్రూత్ (భగవంతుడు సత్యము) అని అంటారు కూడా. మీకు నరుని నుండి
నారాయణునిగా తయారయ్యే సత్యమైన శిక్షణను ఇస్తున్నారు. తండ్రి అంటారు, కల్పపూర్వము
కూడా మిమ్మల్ని నరుని నుండి నారాయణునిగా తయారుచేసాను. రామాయణములోనైతే ఏమేమి కథలు
కూర్చుని వ్రాసేసారు. రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నారని అంటారు. మీరు ఇంతకుముందు
వానరుల వలె ఉండేవారు. ఇది ఒక్క సీత విషయము కాదు. ఎలా ఈ రావణ రాజ్యాన్ని వినాశనము
చేయించి రామ రాజ్యాన్ని స్థాపన చేస్తారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు, ఇందులో
కష్టతరమైన విషయమేదీ లేదు. వారైతే ఎంత ఖర్చు పెడతారు. రావణుడి బొమ్మను తయారుచేసి
దానిని కాలుస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. పెద్ద-పెద్ద వాళ్ళందరూ వెళ్తారు,
విదేశీయులకు కూడా చూపిస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు తండ్రి అర్థం
చేయిస్తుంటే పిల్లలైన మీకు మనసులో ఉల్లాసము ఉంది - మేము భారత్ యొక్క సత్యమైన ఆత్మిక
సేవ చేస్తున్నాము అని. మిగిలిన ప్రపంచమంతా రావణుని మతముపై ఉంది, మీరు రాముని
శ్రీమతముపై ఉన్నారు. రామ అనండి, శివ అనండి, పేర్లు అయితే చాలా పెట్టేసారు.
పిల్లలైన మీరు భారత్ కు శ్రీమతముపై ఉన్న అతి విలువైన సేవకులు. ఓ పతిత-పావనా, మీరు
వచ్చి పావనముగా చేయండి అని అంటారు కూడా. సత్యయుగములో మనకు ఎంత సుఖము లభిస్తుంది
అనేది మీకు తెలుసు. అపారమైన ఖజానా లభిస్తుంది. అక్కడ సగటున ఆయువు కూడా ఎంత ఎక్కువగా
ఉంటుంది. వారు యోగీ, ఇక్కడ ఉన్నవారందరూ భోగీ. వారు పావనులు, వీరు పతితులు. ఎంతగా
రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. శ్రీకృష్ణుడిని కూడా యోగి అని అంటారు, మహాత్మ అని
కూడా అంటారు. కానీ వాస్తవానికి అతనే సత్యమైన మహాత్మ. అతడిని సర్వ గుణ సంపన్నుడు...
అని మహిమ చేస్తారు. ఆత్మ మరియు శరీరము, రెండూ పవిత్రమైనవి. సన్యాసులైతే గృహస్థుల
వద్ద వికారాలతో జన్మించి మళ్ళీ సన్యాసులుగా అవుతారు. ఈ విషయాలను ఇప్పుడు మీకు తండ్రి
అర్థం చేయిస్తారు. ఈ సమయములో మనుష్యులు అధర్మయుక్తముగా, బాధగా ఉన్నారు. సత్యయుగములో
ఎలా ఉండేవారు? ధార్మికముగా, ధర్మయుక్తముగా ఉండేవారు. 100 శాతం సంపన్నులుగా ఉండేవారు.
సదా సంతోషములో ఉండేవారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇది ఏక్యురేట్ గా మీకే
తెలుసు. భారత్ స్వర్గము నుండి నరకముగా ఎలా తయారైంది అనేది ఎవరికీ తెలియదు.
లక్ష్మీ-నారాయణులను పూజ చేస్తారు, వారి మందిరాలు తయారుచేస్తారు, కానీ ఏమీ అర్థం
చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - ఈ లక్ష్మీ-నారాయణులు ఈ పదవిని ఎలా పొందారు,
వీరు ఏం చేశారని వీరి మందిరాలను తయారుచేశారు అనే విషయాలను మంచి-మంచి పొజిషన్లలో
ఉండేవారికి, బిర్లా వంటివారికి కూడా అర్థం చేయించవచ్చు. వారి కర్తవ్యము గురించి
తెలియకుండా పూజ చేయడము అంటే అది రాతి పూజ లేక బొమ్మల పూజ అయినట్లు. ఇతర ధర్మాల
వారికైతే క్రైస్టు ఫలానా సమయములో వచ్చారని, మళ్ళీ వస్తారని తెలుసు.
పిల్లలైన మీకు ఎంత గుప్తమైన ఆత్మిక నషా ఉండాలి. ఆత్మకు సంతోషము కలగాలి.
అర్ధకల్పము దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటారు - అశరీరిగా అవ్వండి,
స్వయాన్ని ఆత్మగా భావించండి. మన ఆత్మ తండ్రి నుండి వింటోంది. ఇతర సత్సంగాలలో ఎప్పుడూ
ఇలా భావించరు. ఈ ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు.
ఆత్మయే అన్నీ వింటుంది కదా. నేను ప్రధానమంత్రిని, నేను ఫలానాను అని ఆత్మయే అంటుంది.
ఆత్మ ఈ శరీరము ద్వారా నేను ప్రధానమంత్రిని అని అంటుంది. ఇప్పుడు మీరు అంటారు -
ఆత్మయైన నేను పురుషార్థము చేసి స్వర్గములోని దేవీ-దేవతగా తయారవుతున్నాను. నేను
ఆత్మను, ఇది నా శరీరము. దేహీ-అభిమానిగా అవ్వడములోనే చాలా కష్టపడవలసి ఉంటుంది.
ఘడియ-ఘడియ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు
వినాశనమవుతాయి. మీరు అత్యంత విధేయులైన సేవకులు. గుప్త రీతిలో కర్తవ్యాన్ని చేస్తారు.
కావున నషా కూడా గుప్తముగా ఉండాలి. మనము గవర్నమెంటుకు ఆత్మిక సేవకులము. భారత్ ను
స్వర్గముగా తయారుచేస్తాము. కొత్త ప్రపంచములో కొత్త భారత్ ఉండాలి, కొత్త ఢిల్లీ
ఉండాలి అని బాపూజీ కూడా కోరుకునేవారు. ఇప్పుడు కొత్త ప్రపంచమైతే లేదు. ఈ పాత ఢిల్లీ
స్మశానముగా అవుతుంది, మళ్ళీ పరిస్తాన్ గా అవ్వనున్నది. ఇప్పుడు దీనిని పరిస్తాన్ అని
అనరు. కొత్త ప్రపంచములో పరిస్తాన్ ను, కొత్త ఢిల్లీని మీరు తయారుచేస్తున్నారు. ఇవి
బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ విషయాలను మర్చిపోకూడదు. భారత్ ను మళ్ళీ
సుఖధామముగా తయారుచేయడము ఎంత ఉన్నతమైన కార్యము. డ్రామా ప్లాన్ అనుసారముగా సృష్టి
పాతగా అవ్వవలసిందే. దుఃఖధామము కదా. దుఃఖహర్త, సుఖకర్త అని ఒక్క తండ్రినే అనడం
జరుగుతుంది. తండ్రి 5000 సంవత్సరాల తర్వాత దుఃఖముగా ఉన్న భారత్ ను సుఖముగా
తయారుచేస్తారని మీకు తెలుసు. సుఖాన్ని కూడా ఇస్తారు, శాంతిని కూడా ఇస్తారు. మనసు
యొక్క శాంతి ఎలా దొరుకుతుంది అని మనుష్యులు అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు శాంతి అనేది
శాంతిధామమైన స్వీట్ హోమ్ లోనే ఉంటుంది. దానిని శాంతిధామము అని అంటారు, అక్కడ శబ్దము
ఉండదు, దుఃఖము ఉండదు. సూర్యుడు, చంద్రుడు మొదలైనవి కూడా ఉండవు. ఇప్పుడు పిల్లలైన
మీకు ఈ జ్ఞానమంతా ఉంది. తండ్రి కూడా వచ్చి విధేయుడైన సేవకునిగా అయ్యారు కదా. కానీ
తండ్రి గురించి అసలు తెలియనే తెలియదు. అందరినీ మహాత్ములు అని అనేస్తారు. కేవలం
స్వర్గములోనివారు తప్ప ఇంకెవరూ మహాత్ములు కారు. అక్కడ ఆత్మలు పవిత్రముగా ఉంటారు.
పవిత్రముగా ఉండేవారు కావున శాంతి, సంపన్నత కూడా ఉండేవి. ఇప్పుడు పవిత్రత లేదు కావున
ఏమీ లేవు. పవిత్రతకే విలువ ఉంది. దేవతలు పవిత్రముగా ఉన్నారు కావున వారి ఎదురుగా తల
వంచి నమస్కరిస్తారు. పవిత్రులను పావనులని, అపవిత్రులను పతితులని అంటారు. వీరు మొత్తం
విశ్వమంతటికీ అనంతమైన బాపూజీ. ఆ మాటకొస్తే మేయర్ ను కూడా సిటీ ఫాదర్ అని అంటారు.
అక్కడ ఇటువంటి విషయాలు ఉండవు. అక్కడైతే రాజ్యము నియమబద్ధముగా నడుస్తుంది. ఓ
పతిత-పావనా రండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు తండ్రి - పవిత్రముగా అవ్వండి అని
చెప్తే, అది ఎలా కుదురుతుంది, మరి పిల్లలు ఎలా పుడతారు, సృష్టి ఎలా వృద్ధి అవుతుంది
అని అంటారు. వారికి తెలియని విషయమేమిటంటే, లక్ష్మీ-నారాయణులు సంపూర్ణ నిర్వికారులు.
పిల్లలైన మీరు ఎంత వ్యతిరేకతను సహించవలసి ఉంటుంది.
డ్రామాలో కల్పపూర్వము ఏదైతే జరిగిందో అది రిపీట్ అవుతుంది. డ్రామాలో ఉంటే
లభిస్తుందిలే అని డ్రామా అనే మాట పట్టుకుని ఆగిపోవడము కాదు. స్కూల్లో అలాగే కూర్చుని
ఉంటే ఎవరైనా పాస్ అవుతారా? ప్రతి ఒక్క వస్తువు కొరకు మనుష్యులది పురుషార్థము
జరుగుతుంది. పురుషార్థము లేకుండా నీరు కూడా లభించదు. క్షణ-క్షణము పురుషార్థము ఏదైతే
నడుస్తుందో, అది ప్రారబ్ధము కోసము. అనంతమైన సుఖము కోసం అనంతమైన పురుషార్థము చేయాలి.
ఇప్పుడు ఉన్నది బ్రహ్మా యొక్క రాత్రి, ఇదే బ్రాహ్మణుల రాత్రి, మళ్ళీ బ్రాహ్మణుల పగలు
వస్తుంది. శాస్త్రాలలో కూడా చదివేవారు కానీ ఏమీ అర్థం చేసుకునేవారు కాదు. ఈ బాబా
స్వయం కూర్చుని రామాయణము, భాగవతము మొదలైనవి వినిపించేవారు, పండితునిలా కూర్చునేవారు.
అది భక్తి మార్గము అని ఇప్పుడు అర్థమయ్యింది. భక్తి వేరు, జ్ఞానము వేరు. తండ్రి
అంటారు, మీరు కామ చితిపై కూర్చుని అందరూ నల్లగా అయిపోయారు. శ్రీకృష్ణుడిని కూడా
శ్యామ సుందరుడు అని అంటారు కదా. పూజారులు అంధశ్రద్ధ కలవారు. అది ఎంతటి భూతపూజ.
శరీరాన్ని పూజించడము అంటే పంచ తత్వాలను పూజించినట్లే అవుతుంది. దీనిని వ్యభిచారీ
పూజ అంటారు. భక్తి మొదట అవ్యభిచారిగా ఉండేది, ఒక్క శివుడినే పూజించేవారు. ఇప్పుడు
చూడండి, ఏమేమి పూజలు జరుగుతూ ఉంటాయి. తండ్రి అద్భుతాన్ని కూడా చూపిస్తారు,
జ్ఞానాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తున్నారు.
దానిని పుష్పాల తోట అనే అంటారు. కరాచీలో కాపలా కోసం ఒక పఠాన్ (ముస్లిమ్ లలో ఒక
జాతివారు) ఉండేవారు, అతను కూడా ధ్యానములోకి వెళ్ళేవారు. నేను బహిష్త్ (స్వర్గము)
లోకి వెళ్ళాను, ఖుదా నాకు పుష్పాలను ఇచ్చారు అని అంటుండేవారు. అతనికి చాలా మజా
వచ్చేది. ఇది అద్భుతము కదా. వారు ఏడు అద్భుతాలు అని అంటారు. వాస్తవానికి స్వర్గమే
ప్రపంచములోని అసలైన అద్భుతము, ఇది ఎవ్వరికీ తెలియదు.
మీకు ఎంత ఫస్ట్ క్లాస్ జ్ఞానము లభించింది. మీకు ఎంత సంతోషము కలగాలి. బాప్ దాదా
ఎంత ఉన్నతోన్నతమైనవారు, అయినా ఎంత సింపుల్ గా ఉంటారు. వారు నిరాకారి, నిరహంకారి అని
తండ్రి మహిమనే గానం చేయడం జరుగుతుంది. తండ్రి అయితే వచ్చి పిల్లలకు సేవ చేయాలి కదా.
తండ్రి ఎల్లప్పుడూ పిల్లల సేవ చేసి, వారికి ధన-సంపదలను ఇచ్చి స్వయం వానప్రస్థావస్థను
తీసుకుంటారు. పిల్లలను తమ తలపైకి ఎక్కించుకుంటారు. పిల్లలైన మీరు విశ్వానికి
యజమానులుగా అవుతారు. మధురమైన ఇంటికి వెళ్ళి, మళ్ళీ వచ్చి మధురమైన రాజ్యాన్ని
తీసుకుంటారు. తండ్రి అంటారు, నేనైతే రాజ్యాన్ని తీసుకోను. సత్యమైన నిష్కామ సేవాధారి
అయితే ఒక్క తండ్రియే. కావున పిల్లలకు ఎంత సంతోషము ఉండాలి. కానీ మాయ మరపింపజేస్తుంది.
ఇంత గొప్ప బాప్ దాదాను మర్చిపోకూడదు. తాతగారి ఆస్తిపై ఎంత నషా ఉంటుంది. మీకైతే
శివబాబా లభించారు. ఇది వారి ఆస్తి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు దైవీ
గుణాలను ధారణ చేయండి. ఆసురీ గుణాలను తొలగించివేయాలి. నిర్గుణుడినైన నాలో ఏ గుణాలు
లేవు అని పాడుతారు కూడా. నిర్గుణ సంస్థ కూడా ఉంది. దాని అర్థమైతే ఎవరికీ తెలియదు.
నిర్గుణ అంటే ఏ గుణము లేదు అని అర్థము. కానీ వారు అది అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు
తండ్రి ఒకే విషయాన్ని అర్థం చేయిస్తున్నారు - మీరు చెప్పండి, మేమైతే భారత్ సేవలో
ఉన్నాము, అందరికీ బాపూజీ అయిన తండ్రి శ్రీమతముపై మేము నడుస్తున్నాము. శ్రీమత్
భగవద్గీత అని అంటూ ఉంటారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.