17-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - స్మృతి మరియు చదువు ద్వారానే డబుల్ కిరీటము లభిస్తుంది, అందుకే మీ లక్ష్యాన్ని-ఉద్దేశ్యాన్ని ఎదురుగా ఉంచుకొని దైవీ గుణాలను ధారణ చేయండి’’

ప్రశ్న:-
విశ్వ రచయిత అయిన తండ్రి పిల్లలైన మీకు ఏ సేవను చేస్తారు?

జవాబు:-
1. పిల్లలకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చి సుఖవంతులుగా తయారుచేయడము, ఇది వారు చేసే సేవ. తండ్రి వంటి నిష్కామ సేవను ఇంకెవ్వరూ చేయలేరు. 2. అనంతమైన తండ్రి సింహాసనాన్ని అద్దెకు తీసుకొని మిమ్మల్ని విశ్వానికి సింహాసనాధికారులుగా తయారుచేస్తారు. వారు స్వయం ఆ నెమలి సింహాసనముపై కూర్చోరు, కానీ పిల్లలను నెమలి సింహాసనంపై కూర్చోబెడతారు. తండ్రికి అయితే జడమైన మందిరాలను తయారుచేస్తారు, వాటిలో వారికేమి రుచి కలుగుతుంది. ఆనందము అనేది స్వర్గ రాజ్యభాగ్యాన్ని తీసుకునే పిల్లలకు ఉంటుంది.

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఓం శాంతి యొక్క అర్థాన్ని అయితే పిల్లలకు వివరించడం జరిగింది. ఓం శాంతి అని తండ్రి కూడా అంటారు, అలాగే పిల్లలు కూడా అంటారు ఎందుకంటే ఆత్మ యొక్క స్వధర్మము శాంతి. మనము శాంతిధామము నుండి ఇక్కడ మొట్టమొదట సుఖధామములోకి వస్తామని, ఆ తర్వాత 84 పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ దుఃఖధామములోకి వస్తామని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇదైతే గుర్తుంది కదా. పిల్లలు 84 జన్మలు తీసుకుంటారు, జీవాత్మలుగా అవుతారు. తండ్రి జీవాత్మగా అవ్వరు. నేను తాత్కాలికంగా వీరి ఆధారాన్ని తీసుకుంటాను అని వారు అంటారు. లేకపోతే వారు ఎలా చదివించగలరు? పిల్లలకు పదే, పదే - మన్మనాభవ అని, మీ రాజధానిని స్మృతి చేయండి అని ఎలా చెప్పగలరు? దీనినే క్షణములో విశ్వరాజ్యాన్ని పొందడము అని అంటారు. వీరు అనంతమైన తండ్రి కదా, కావున తప్పకుండా అనంతమైన సంతోషాన్ని, అనంతమైన వారసత్వాన్నే ఇస్తారు. బాబా చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. వారంటారు - ఇప్పుడిక ఈ దుఃఖధామాన్ని బుద్ధి నుండి తొలగించివేయండి. నేను ఏదైతే కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నానో, దానికి యజమానులుగా అవ్వడానికి నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీ పాపాలు తొలగిపోతాయి, మీరు మళ్ళీ సతోప్రధానముగా అవుతారు, దీనినే సహజ స్మృతి అని అంటారు. పిల్లలు తమ లౌకిక తండ్రిని ఎంత సహజంగా గుర్తు చేస్తారు, అదే విధంగా పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. తండ్రియే దుఃఖము నుండి బయటకు తీసి సుఖధామములోకి తీసుకువెళ్తారు. అక్కడ దుఃఖము యొక్క నామ-రూపాలే ఉండవు. వారు చాలా సహజమైన విషయాన్ని చెప్తారు - మీ శాంతిధామాన్ని స్మృతి చేయండి, తండ్రి ఇల్లు ఏదైతే ఉందో అదే మీ ఇల్లు కూడా, అలాగే కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేయండి, అది మీ రాజధాని. తండ్రి పిల్లలైన మీకు ఎంతటి నిష్కామ సేవను చేస్తారు. పిల్లలైన మిమ్మల్ని సుఖవంతులుగా చేసి మళ్ళీ వానప్రస్థములో, పరంధామములో కూర్చుండిపోతారు. మీరు కూడా పరంధామవాసులే. దానిని నిర్వాణధామము, వానప్రస్థము అని కూడా అంటారు. తండ్రి వచ్చేదే పిల్లల సేవ చేయడానికి అనగా వారికి వారసత్వాన్ని ఇవ్వడానికి. వీరు స్వయం కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. శివబాబా అయితే ఉన్నతోన్నతమైన భగవంతుడు, శివుని మందిరాలు కూడా ఉన్నాయి. వారికి తండ్రి లేక టీచర్ అంటూ ఎవ్వరూ లేరు. మొత్తం సృష్టి అంతటి ఆదిమధ్యాంతాల జ్ఞానము వారి వద్ద ఉంది. వారికి ఆ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది? వేద-శాస్త్రాలు మొదలైనవి ఏమైనా చదివారా? లేదు. తండ్రి అయితే జ్ఞానసాగరుడు, సుఖ-శాంతుల సాగరుడు. తండ్రి మహిమకు మరియు దైవీ గుణాల కల మనుష్యుల మహిమకు తేడా ఉంది. మీరు దైవీ గుణాలను ధారణ చేసి ఈ విధంగా దేవతలుగా అవుతారు. మొదట అసురీ గుణాలు ఉండేవి. అసురుల నుండి దేవతలుగా తయారుచేయడము, ఇదైతే తండ్రి పనే. లక్ష్యము-ఉద్దేశ్యము కూడా మీ ఎదురుగా ఉంది. తప్పకుండా వారు ఇటువంటి శ్రేష్ఠ కర్మలను చేసి ఉంటారు. కర్మ-అకర్మ-వికర్మల గతులను అనగా ప్రతి విషయాన్ని అర్థం చేయించడానికి ఒక్క క్షణము పడుతుంది.

తండ్రి అంటారు - మధురాతి-మధురమైన పిల్లలు పాత్రను అభినయించాల్సిందే. ఈ పాత్ర మీకు అనాదిగా, అవినాశీగా లభించి ఉంది. మీరు ఎన్ని సార్లు సుఖ-దుఃఖాల ఆటలోకి వచ్చారు. ఎన్ని సార్లు మీరు విశ్వాధిపతులుగా అయ్యారు. తండ్రి ఎంత ఉన్నతంగా తయారుచేస్తారు. సుప్రీమ్ ఆత్మ అయిన పరమాత్మ కూడా అంతే చిన్నగా ఉంటారు. ఆ తండ్రి జ్ఞానసాగరుడు, కావున ఆత్మలను కూడా తమ సమానంగా తయారుచేస్తారు. మీరు ప్రేమసాగరులుగా, సుఖసాగరులుగా అవుతారు. దేవతలకు పరస్పరంలో ఎంతటి ప్రేమ ఉంటుంది. వారి మధ్య ఎప్పుడూ గొడవలు జరగవు. కావున తండ్రి వచ్చి మిమ్మల్ని తమ సమానంగా తయారుచేస్తారు. ఇంకెవ్వరూ ఈ విధంగా తయారుచేయలేరు. ఆట స్థూలవతనములో జరుగుతుంది. మొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉంటుంది, ఆ తర్వాత ఇస్లామీయులు, బౌద్ధులు మొదలైనవారు నంబరువారుగా ఈ రంగస్థలములోకి లేక నాటకశాలలోకి వస్తారు. 84 జన్మలను మీరు తీసుకుంటారు. ఆత్మలు మరియు పరమాత్మ చాలాకాలం వేరుగా ఉన్నారు... అన్న గాయనము కూడా ఉంది. తండ్రి అంటారు - మధురాతి-మధురమైన పిల్లలూ, మొట్టమొదట విశ్వంలో పాత్రను అభినయించడానికి మీరు వచ్చారు. నేనైతే కొద్ది సమయం కోసమే వీరిలోకి ప్రవేశిస్తాను. ఇదైతే పాత చెప్పు. పురుషునికి ఒక స్త్రీ మరణిస్తే - పాత చెప్పు పోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తదానిని తీసుకుంటాను అని అంటారు. ఇది కూడా పాత శరీరము కదా. వీరు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. తతత్వం, నేను వచ్చి ఈ రథాన్ని ఆధారంగా తీసుకుంటాను. పావన ప్రపంచములోకైతే నేను ఎప్పుడూ రాను. మీరు పతితులుగా ఉన్నారు, వచ్చి పావనముగా చేయండి అని నన్ను పిలుస్తారు. చివరికి మీ స్మృతి ఫలిస్తుంది కదా. ఎప్పుడైతే పాత ప్రపంచము సమాప్తమయ్యే సమయం వస్తుందో, అప్పుడు నేను వస్తాను. బ్రహ్మా ద్వారా స్థాపన, బ్రహ్మా ద్వారా అనగా బ్రాహ్మణుల ద్వారా స్థాపన. మొదట పిలక స్థానం బ్రాహ్మణులు, ఆ తర్వాత క్షత్రియులు... అనగా పిల్లిమొగ్గల ఆటను ఆడుతారు. ఇప్పుడు దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వాలి. మీరు 84 జన్మలను తీసుకుంటారు. నేనైతే ఒక్కసారి మాత్రమే ఈ తనువును అప్పుగా తీసుకుంటాను. అద్దెకు తీసుకుంటాను. నేను ఈ ఇంటికి యజమానిని కాదు. వీరినైతే నేను ఎలాగూ వదిలేస్తాను. అద్దె అయితే ఇవ్వవలసే ఉంటుంది కదా. నేను ఇంటికి అద్దె ఇస్తాను అని తండ్రి కూడా అంటారు. అనంతమైన తండ్రి ఎంతో కొంత అద్దెను ఇస్తూ ఉండవచ్చు కదా. మీకు అర్థం చేయించడానికి ఈ సింహాసనాన్ని తీసుకుంటారు. ఎలా అర్థం చేయిస్తారంటే, తద్వారా మీరు కూడా విశ్వానికి సింహాసనాధికారులుగా అవుతారు. కానీ నేను ఆ విధంగా అవ్వను అని స్వయం తండ్రి అంటారు. సింహాసనాధికారులుగా చేస్తారు అనగా నెమలి సింహాసనంపై కూర్చోబెడతారు. శివబాబా స్మృతిలోనే సోమనాథ మందిరాన్ని నిర్మించారు. తండ్రి అంటారు - దీనితో నాకు ఏం రుచి కలుగుతుంది. జడమైన మూర్తిని పెడతారు. ఆనందమైతే పిల్లలైన మీకు స్వర్గములో ఉంటుంది. నేనైతే స్వర్గములోకి రానే రాను. ఆ తర్వాత భక్తి మార్గం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, అప్పుడు ఈ మందిరాలు మొదలైనవాటిని నిర్మించడానికి ఎంత ఖర్చు చేసారు. అయినా కానీ దొంగలు దోచుకుని వెళ్ళిపోయారు. రావణ రాజ్యములో మీ ధన-సంపదలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. ఇప్పుడు ఆ నెమలి సింహాసనము ఉందా? తండ్రి అంటారు - నా మందిరం ఏదైతే నిర్మించబడి ఉందో, దానిని మహమ్మద్ గజినీ వచ్చి దోచుకుపోయాడు.

భారత్ వంటి సుసంపన్నమైన దేశము ఇంకేదీ లేదు. దీని వంటి తీర్థ స్థానము ఇంకేదీ తయారవ్వలేదు. కానీ నేడు హిందూ ధర్మానికి అనేక తీర్థ స్థానాలు తయారయ్యాయి. వాస్తవానికి సర్వులకు సద్గతినిచ్చే తండ్రి ఎవరైతే ఉన్నారో, వారికి తీర్థ స్థానము ఉండాలి. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. అర్థం చేసుకోవడం చాలా సహజము. కానీ నంబరువారుగానే అర్థం చేసుకుంటారు ఎందుకంటే రాజధాని స్థాపనవుతుంది. స్వర్గానికి యజమానులు ఈ లక్ష్మీ-నారాయణులు. వీరు ఉన్నతోన్నతమైన పురుషులు, వీరినే దేవతలు అని అంటారు. దైవీ గుణాలు కలవారిని దేవతలు అని అంటారు. ఈ ఉన్నతమైన దేవతా ధర్మము వారు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. ఆ సమయంలో మీ యొక్క ప్రవృత్తి మార్గమే ఉంటుంది. తండ్రి మిమ్మల్ని డబుల్ కిరీటధారులుగా తయారుచేసారు. రావణుడు మళ్ళీ రెండు కిరీటాలనూ తొలగించేసాడు. ఇప్పుడైతే ఏ కిరీటమూ లేదు, పవిత్రతా కిరీటమూ లేదు, ధనం యొక్క కిరీటమూ లేదు, రెండింటినీ రావణుడు తొలగించేసాడు. మళ్ళీ తండ్రి వచ్చి ఈ స్మృతి మరియు చదువు ద్వారా మీకు రెండు కిరీటాలనూ ఇస్తారు, అందుకే - ఓ గాడ్ ఫాదర్, మాకు మార్గదర్శకునిగా అవ్వండి, మమ్మల్ని విముక్తులుగా కూడా చేయండి అని గానం చేస్తూ ఉంటారు. అందుకే మీ పేరు కూడా మార్గదర్శకులు అని పెట్టడం జరిగింది. పాండవులు, కౌరవులు, యాదవులు ఏం చేస్తున్నారు. బాబా, మమ్మల్ని దుఃఖపు రాజ్యము నుండి విడిపించి మీతో పాటుగా తీసుకువెళ్ళండి అని అంటారు. తండ్రియే సత్యఖండాన్ని స్థాపన చేస్తారు, దానిని స్వర్గము అని అంటారు. మళ్ళీ రావణుడు అసత్య ఖండాన్ని తయారుచేస్తాడు. వారు శ్రీకృష్ణ భగవానువాచ అని అంటారు. తండ్రి - శివ భగవానువాచ అని అంటారు. భారతవాసులు పేరు మార్చిన కారణంగా మొత్తం ప్రపంచమంతా మార్చేసింది. శ్రీకృష్ణుడైతే దేహధారి, విదేహీ అయితే ఒక్క శివబాబానే. ఇప్పుడు తండ్రి ద్వారా పిల్లలైన మీకు శక్తి లభిస్తుంది. మొత్తం విశ్వానికి మీరు యజమానులుగా అవుతారు. మొత్తం ఆకాశము, భూమి అంతా మీకు లభిస్తుంది. కల్పములో ముప్పావు సమయం వరకూ మీ నుండి దోచుకునే శక్తి ఎవ్వరికీ ఉండదు. ఎప్పుడైతే వారి వృద్ధి జరిగి సుమారుగా కోట్ల సంఖ్యకు చేరుకుంటారో, అప్పుడు సైన్యాన్ని తీసుకువచ్చి మీపై విజయం పొందుతారు. తండ్రి పిల్లలకు ఎంతటి సుఖాన్ని ఇస్తారు. దుఃఖహర్త, సుఖకర్త అని వారికి మహిమ ఉంది. ఈ సమయంలో తండ్రి కూర్చుని మీకు కర్మ-అకర్మ-వికర్మల గతులను అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యయుగములో కర్మలు అకర్మలుగా అవుతాయి. ఇప్పుడు మీకు ఒక్క సద్గురువు లభించారు, వారిని పతులకే పతి అని అంటారు ఎందుకంటే ఆ పతులందరూ కూడా వారినే స్మృతి చేస్తారు. కావున తండ్రి అర్థం చేయిస్తారు - ఇది ఎంత అద్భుతమైన డ్రామా. ఇంత చిన్నని ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది, అది ఎప్పటికీ చెరిగేది కాదు. దీనిని అనాది-అవినాశీ డ్రామా అని అంటారు. గాడ్ ఈజ్ వన్ (భగవంతుడు ఒక్కరే). రచన అనగా మెట్లు మరియు చక్రము, అన్నీ ఒకటే. రచయిత గురించి కానీ, రచన గురించి కానీ ఎవ్వరికీ తెలియదు. ఋషులు-మునులు కూడా - మాకు తెలియదు అని అనేస్తారు. ఇప్పుడు మీరు సంగమములో కూర్చొని ఉన్నారు, మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. అది విడిచిపెట్టదు. పిల్లలు అంటారు - బాబా, మాయ యొక్క దెబ్బ తగిలింది. బాబా అంటారు - పిల్లలూ, చేసుకున్న సంపాదన అంతా పోగొట్టుకున్నారు! మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు కావున మంచి రీతిలో చదువుకోవాలి. ఇటువంటి చదువైతే మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ దుఃఖధామము నుండి బుద్ధియోగాన్ని తొలగించి, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసే తండ్రిని స్మృతి చేయాలి, సతోప్రధానముగా అవ్వాలి.

2. తండ్రి సమానముగా ప్రేమ సాగరులుగా, శాంతి మరియు సుఖ సాగరులుగా అవ్వాలి. కర్మ, అకర్మ మరియు వికర్మల గతులను తెలుసుకొని సదా శ్రేష్ఠ కర్మలను చేయాలి.

వరదానము:-

సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటూ మనసుతో సంతోషపు పాటలను పాడే అవినాశీ భాగ్యశాలీ భవ

భాగ్యశాలీ పిల్లలైన మీరు అవినాశీ విధి ద్వారా అవినాశీ సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనసు నుండి సదా వాహ్-వాహ్ అనే సంతోషపు పాటలు మ్రోగుతూ ఉంటాయి. వాహ్ బాబా! వాహ్ భాగ్యము! వాహ్ మధురమైన పరివారము! వాహ్ శ్రేష్ఠ సంగమము యొక్క మనోహరమైన సమయము! ప్రతి కర్మ వాహ్-వాహ్ వంటిదే, అందుకే మీరు అవినాశీ భాగ్యవంతులు. మీ మనస్సులో ఎప్పుడూ వై, ఐ (ఎందుకు, నేను) అన్నవి రాలేవు. వై (ఎందుకు) అన్నదానికి బదులుగా వాహ్-వాహ్ మరియు ఐ (నేను) అన్నదానికి బదులుగా బాబా-బాబా అన్న పదాలే వస్తాయి.

స్లోగన్:-

ఏ సంకల్పాలనైతే చేస్తారో, వాటికి అవినాశీ గవర్నమెంటు యొక్క స్టాంపును వేసినట్లయితే, అవి దృఢంగా ఉంటాయి.

మాతేశ్వరిగారి మధుర మహావాక్యాలు - ‘‘జీవితములోని ఆశ పూర్తవ్వడానికి మనోహరమైన సమయము’’

ఆత్మలమైన మనందరికీ చాలా సమయము నుండి - జీవితములో సదా సుఖ-శాంతులు లభించాలి అన్న ఈ ఆశ ఉండేది, ఇప్పుడు అనేక జన్మల ఆశ అనేది ఎప్పుడో ఒకప్పుడైతే పూర్తవుతుంది. ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ, ఈ అంతిమ జన్మలో కూడా ఇది అంతిమము. నేనైతే ఇప్పుడు ఇంకా చిన్నగా ఉన్నాను అని ఈ విధంగా ఎవ్వరూ భావించకండి, చిన్నవారైనా, పెద్దవారైనా సుఖమైతే కావాలి కదా, కానీ దుఃఖము దేని కారణంగా కలుగుతుంది అన్నదాని గురించి కూడా మొదట జ్ఞానము కావాలి. ఇప్పుడు మీకు ఏ జ్ఞానము లభించిందంటే - ఈ పంచ వికారాలలో చిక్కుకున్న కారణంగా ఈ కర్మ బంధనాలు ఏవైతే తయారయ్యాయో, వాటిని పరమాత్మ స్మృతి అనే అగ్నితో భస్మం చెయ్యాలి, ఇది కర్మబంధనాల నుండి విముక్తులుగా అయ్యేందుకు సహజమైన ఉపాయము. ఈ సర్వశక్తివంతుడైన బాబాను నడుస్తూ-తిరుగుతూ, శ్వాస-శ్వాసలోనూ స్మృతి చెయ్యండి. ఇప్పుడు ఈ ఉపాయాన్ని తెలియజేసే సహాయాన్ని స్వయంగా పరమాత్మ వచ్చి అందిస్తారు, కానీ ఇందులో పురుషార్థమైతే ప్రతి ఆత్మ చెయ్యాలి. పరమాత్మ అయితే తండ్రి, టీచర్, గురువు రూపములో వచ్చి మనకు వారసత్వాన్ని ఇస్తారు. కనుక మొదట ఆ తండ్రికి చెందినవారిగా అవ్వాలి, ఆ తర్వాత టీచరు ద్వారా చదువుకోవాలి, ఈ చదువు ద్వారా భవిష్య జన్మ-జన్మాంతరాల కోసం సుఖము యొక్క ప్రారబ్ధము తయారవుతుంది అనగా జీవన్ముక్తి పదవిలో పురుషార్థము అనుసారంగా పదవి లభిస్తుంది. మరియు గురువు రూపంలో పవిత్రంగా తయారుచేసి ముక్తిని ఇస్తారు. ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని ఈ విధంగా పురుషార్థము చెయ్యాలి. పాత ఖాతాను సమాప్తము చేసి కొత్త జీవితాన్ని తయారుచేసుకునే సమయము ఇదే, ఈ సమయములోనే ఎంత పురుషార్థము చేసి తమ ఆత్మను పవిత్రంగా చేసుకుంటారో, అంతగానే శుద్ధమైన రికార్డును నింపుకుంటారు, అది మొత్తం కల్పమంతా నడుస్తుంది, అంటే ఈ సమయములోని సంపాదనపైనే మొత్తం కల్పమంతా ఆధారపడి ఉంది. చూడండి, ఈ సమయములోనే మీకు ఆదిమధ్యాంతాల జ్ఞానం లభిస్తుంది, మనమే మళ్ళీ దేవతలుగా అవ్వాలి మరియు మనది ఇప్పుడు ఎక్కే కళ, ఆ తర్వాత అక్కడకు వెళ్ళి ప్రారబ్ధాన్ని అనుభవిస్తాము. అక్కడ దేవతలకు, వారు పడిపోతారు అని తరువాత విషయం గురించి తెలియదు, ఒకవేళ సుఖాన్ని అనుభవించిన తరువాత మళ్ళీ పడిపోతాము అన్న విషయము వారికి తెలిసిందంటే, పడిపోయే చింతలో సుఖాన్ని కూడా అనుభవించలేకపోతారు. అందుకే ఈ ఈశ్వరీయ నియమము రచింపబడి ఉంది - మనుష్యులు సదా ఎక్కేందుకు పురుషార్థము చేస్తారు అనగా సుఖము కోసం సంపాదన చేస్తారు. కానీ డ్రామాలో సగం-సగం పాత్ర తయారై ఉంది, ఈ రహస్యము గురించి మనకు తెలుసు, కానీ ఏ సమయములోనైతే సుఖము యొక్క వంతు ఉంటుందో, దాని కోసం పురుషార్థము చేసి సుఖాన్ని తీసుకోవాలి, ఇదే పురుషార్థము యొక్క విశేషత. పాత్రధారి పని ఏమిటంటే - పాత్రను అభినయించేటప్పుడు సంపూర్ణ విశేషతతో పాత్రను అభినయించటము, అది చూసేవారు వాహ్-వాహ్ అని అనాలి, అందుకే హీరో-హీరోయిన్ల పాత్ర దేవతలకు లభించింది, వారి స్మృతిచిహ్న చిత్రాలు మహిమ చేయబడతాయి మరియు పూజించబడతాయి. నిర్వికారీ ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్పము వంటి అవస్థను తయారుచేసుకోవటము, ఇదే దేవతల విశేషత. ఈ విశేషతను మర్చిపోవటం వలనే భారత్ కు ఇటువంటి దుర్దశ ఏర్పడింది, ఇప్పుడు మళ్ళీ ఇటువంటి జీవితాన్ని తయారుచేసేవారైన పరమాత్మ స్వయంగా వచ్చారు, ఇప్పుడు వారి చేతిని పట్టుకోవటం ద్వారా జీవిత నావ తీరం చేరుతుంది. అచ్ఛా, ఓం శాంతి.