ఓంశాంతి
ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారా? మేము ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నామా మరియు
తండ్రిని స్మృతిని చేస్తున్నామా అంటూ ప్రతి ఒక్క విషయము గురించి మిమ్మల్ని మీరు
ప్రశ్నించుకోవలసి ఉంటుంది. శివశక్తి పాండవ సైన్యము అన్న గాయనము కూడా ఉంది. ఇక్కడ
శివబాబా సైన్యము కూర్చుని ఉన్నారు కదా. ఆ దైహికమైన సైన్యములో కేవలం యువత మాత్రమే
ఉంటారు, వృద్ధులు మరియు పిల్లలు మొదలైనవారు ఉండరు. ఈ సైన్యములోనైతే వృద్ధులు,
పిల్లలు, యువత మొదలైనవారంతా కూర్చున్నారు. ఇది మాయపై విజయాన్ని పొందేందుకు ఉన్న
సైన్యము. ప్రతి ఒక్కరూ మాయపై విజయాన్ని పొంది తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని
తీసుకోవాలి. మాయ చాలా ప్రబలమైనదని పిల్లలకు తెలుసు. కర్మేంద్రియాలే అన్నింటికన్నా
ఎక్కువగా మోసగిస్తాయి. ఈ రోజు ఏ కర్మేంద్రియము మోసం చేసింది అన్నది కూడా చార్టు లో
వ్రాయండి. ఈ రోజు ఫలానా ఆమెను చూశాను, ఆమెను ముట్టుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి
అని మనసు కలిగింది. కళ్ళు చాలా నష్టపరుస్తాయి. ప్రతి ఒక్క కర్మేంద్రియాన్ని చూడండి,
ఏ కర్మేంద్రియము అన్నింటికన్నా ఎక్కువగా మోసగిస్తుంది? ఈ విషయములో సూరదాసుని
ఉదాహరణను కూడా ఇస్తారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. కళ్ళు చాలా మోసగిస్తాయి.
మంచి-మంచి పిల్లలను కూడా మాయ మోసగించేస్తుంది. సేవ బాగా చేస్తారు కానీ కళ్ళు మోసం
చేస్తాయి. వీటిపై ఎంతగానో గమనిక పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఇవి శత్రువులు కదా. అవి
మన పదవిని భ్రష్టం చేసేస్తాయి. వివేకవంతులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు మంచి
రీతిలో నోట్ చేసుకోవాలి, డైరీ జేబులో ఎప్పుడూ ఉండాలి. ఏ విధంగా భక్తి మార్గములో
బుద్ధి ఇతరవైపులకు పరిగెడుతూ ఉంటే తమను తాము గిచ్చుకుంటారో, అలాగే మీరు కూడా
స్వయానికి శిక్ష విధించుకోవాలి. కర్మేంద్రియాలు మోసగించడం లేదు కదా! అని చాలా
అప్రమత్తముగా ఉండాలి. అక్కడి నుండి పక్కకు తప్పుకోవాలి. అలాగే నిలబడి చూడకూడదు కూడా.
స్త్రీ-పురుషుల మధ్య చాలా అలజడి ఉంటుంది. చూడడముతోనే కామ వికారపు దృష్టి వెళ్తుంది,
అందుకే సన్యాసులు కళ్ళు మూసుకుని కూర్చుంటారు. కొందరు సన్యాసులైతే స్త్రీలకు వెను
తిరిగి కూర్చుంటారు. ఆ సన్యాసులు మొదలైనవారికి ఏమి లభిస్తుంది? మహా అయితే 10-20
లక్షలు, కోట్లు జమ చేసుకుంటారు. కానీ మరణిస్తే అదంతా సమాప్తము. మళ్ళీ మరుసటి జన్మలో
జమ చేసుకోవలసి ఉంటుంది. పిల్లలైన మీకు ఏదైతే లభిస్తుందో అది అవినాశీ వారసత్వముగా
అయిపోతుంది. అక్కడ ధనము యొక్క లోభమే ఉండదు. దేని గురించైనా కష్టపడేందుకు అక్కడ
ఎటువంటి అప్రాప్తి ఉండనే ఉండదు. కలియుగ అంతిమానికి మరియు సత్యయుగ ఆదికి రాత్రికి
పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. అక్కడైతే అపారమైన సుఖము ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు. బాబా
ఎల్లప్పుడూ చెప్తుంటారు, సంగమము అన్న పదముతోపాటు పురుషోత్తమ అన్న పదమును తప్పకుండా
వ్రాయండి. పదాలు స్పష్టముగా చెప్పాలి. అర్థం చేయించడానికి సహజమవుతుంది. మనుష్యుల
నుండి దేవతలుగా తయారుచేసేందుకు భగవంతునికి ఎంతో సమయము పట్టదు అని అంటారు, మరి
దేవతలుగా తయారుచేసేందుకు, నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేసేందుకు తప్పకుండా
సంగమయుగములోనే వస్తారు కదా. మనుష్యులైతే ఘోర అంధకారములో ఉన్నారు. స్వర్గము అంటే
ఏమిటి అనేది తెలియనే తెలియదు. ఇతర ధర్మాలవారైతే స్వర్గాన్ని చూడను కూడా చూడలేరు,
అందుకే బాబా అంటారు, మీ ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేది. దానిని స్వర్గము అని అంటారు.
కానీ మేము కూడా స్వర్గములోకి వెళ్ళవచ్చు అని భావించరు. ఈ విషయము ఎవ్వరికీ తెలియదు.
భారతవాసులు ఈ విషయాన్ని మర్చిపోయారు. స్వర్గానికి లక్షల సంవత్సరాలు అని అనేస్తారు.
3,000 సంవత్సరాల క్రితం స్వర్గము ఉండేదని క్రిస్టియన్లు స్వయం అంటారు.
లక్ష్మీ-నారాయణులను భగవాన్-భగవతీ అని అంటారు. తప్పకుండా భగవంతుడే భగవాన్-భగవతీగా
తయారుచేస్తారు. కావున శ్రమ చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు మీ లెక్కాపత్రాన్ని
చూసుకోవాలి. ఏ కర్మేంద్రియము మోసగించింది అని చూసుకోవాలి. నాలుక కూడా తక్కువైనదేమీ
కాదు. ఏదైనా మంచి పదార్థాన్ని చూసారంటే దాచుకుని తినేస్తారు. అది కూడా పాపమేనని
భావించరు! అది కూడా దొంగతనమే అయినట్లు కదా! అందులోనూ శివబాబా యజ్ఞము నుండి దొంగతనం
చేయడం చాలా తప్పు. ఒక్క పైసా తీసినా, లక్ష రూపాయలు తీసినా దొంగతనము దొంగతనమే
అవుతుంది. చాలామందికి మాయ ముక్కు పట్టుకుంటూ ఉంటుంది. ఈ చెడు అలవాట్లన్నింటినీ
తొలగించివేయాలి. మీకు మీరే చీవాట్లు పెట్టుకోవాలి. ఎప్పటివరకైతే చెడు అలవాట్లు
ఉంటాయో అప్పటివరకు ఉన్నత పదవిని పొందలేరు. స్వర్గములోకి వెళ్ళడమనేది గొప్ప విషయమేమీ
కాదు. కానీ రాజు రాణులెక్కడ, ప్రజలెక్కడ! తండ్రి అంటారు, కర్మేంద్రియాలను చాలా చెక్
చేసుకోవాలి. ఏ కర్మేంద్రియము మోసగిస్తోంది అని చూసుకోవాలి. లెక్కాపత్రము చూసుకోవాలి.
ఇది వ్యాపారము కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నాతో వ్యాపారము చేయాలంటే, ఉన్నత
పదవిని పొందాలంటే శ్రీమతముపై నడవండి. తండ్రి డైరెక్షన్ ఇస్తారు, అందులో కూడా మాయ
విఘ్నాలను కలిగిస్తుంది, ఆ డైరెక్షన్ ను పాటించనివ్వదు. తండ్రి అంటారు, మర్చిపోకండి,
పొరపాట్లు చేసినట్లయితే ఎంతో పశ్చాత్తాపపడతారు, ఎప్పటికీ ఉన్నత పదవిని పొందలేరు.
ఇప్పుడైతే - మేము నరుని నుండి నారాయణునిగా అవుతాము అని సంతోషముగా అంటారు. కానీ
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండండి, కర్మేంద్రియాలు ఎక్కడా మోసగించడం లేదు కదా?
మీ ఉన్నతిని పొందాలంటే తండ్రి ఏ డైరెక్షన్ ను అయితే ఇస్తారో, దానిని అమలులోకి
తీసుకురండి. మొత్తం రోజంతటి లెక్కాపత్రాన్ని చూసుకోండి. పొరపాట్లు అయితే ఎన్నో
జరుగుతూ ఉంటాయి. కళ్ళు ఎంతగానో మోసగిస్తూ ఉంటాయి. వీరికి తినిపించాలి, కానుకను
ఇవ్వాలి అని దయ కలుగుతూ ఉంటుంది. తమ సమయాన్ని ఎంతగానో వ్యర్థం చేసుకుంటారు. మాలలోని
మణులుగా అవ్వడములో ఎంతో శ్రమ ఉంది. 8 రత్నాలు ముఖ్యమైనవి. నవ రత్నాలు అని అంటారు.
అందులో ఒకరు బాబా, మిగిలినవారు ఎనిమిదిమంది, బాబా స్మృతిచిహ్నము కూడా మధ్యలో కావాలి
కదా. ఏదైనా గ్రహచారము పట్టుకుంటే నవ రత్నాల ఉంగరము మొదలైనవి ధరింపజేస్తారు.
పురుషార్థము చేసే ఎంతోమందిలో నుండి ఎనిమిది మంది పాస్ విత్ ఆనర్లుగా వెలువడుతారు. 8
రత్నాల మహిమ ఎంతగానో ఉంది. దేహాభిమానములోకి రావడముతో కర్మేంద్రియాలు ఎంతగానో
మోసగిస్తాయి. శిరస్సుపై పాపాలు ఎంతగానో ఉన్నాయి అని భక్తిలో కూడా చింత ఉంటుంది కదా,
దానపుణ్యాదులు చేస్తే ఆ పాపాలు తొలగిపోతాయి అని భావిస్తారు. సత్యయుగములో చింత యొక్క
విషయమేదీ ఉండదు, ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు. అక్కడ కూడా ఇటువంటి విషయాలు
ఉన్నట్లయితే ఇక నరకానికి మరియు స్వర్గానికి తేడా ఏమీ ఉండదు. మీరు ఇంత ఉన్నత పదవిని
పొందేందుకు భగవంతుడు కూర్చుని చదివిస్తున్నారు. తండ్రి గుర్తుకు రాకపోతే కనీసం
చదివించే టీచర్ అయినా గుర్తుకు రావాలి. అచ్ఛా, పోనీ మా తండ్రియే సద్గురువు అన్న
విషయమైనా స్మృతి చేయండి. మనుష్యులు ఆసురీ మతముపై తండ్రిని ఎంతగా తిరస్కరించారు.
తండ్రి ఇప్పుడు అందరికీ ఉపకారము చేస్తారు. పిల్లలైన మీరు కూడా ఉపకారము చేయాలి.
ఎవరికీ అపకారము చేయకూడదు, చెడు దృష్టి కూడా ఉండకూడదు. దాని వల్ల తమను తామే
నష్టపర్చుకుంటారు. ఆ వైబ్రేషన్ల ప్రభావము ఇక ఇతరులపై కూడా పడుతుంది. తండ్రి అంటారు,
ఇది చాలా పెద్ద లక్ష్యము. రోజూ మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి - ఎటువంటి వికర్మలనూ
తయారుచేసుకోలేదు కదా? ఈ ప్రపంచమే వికర్మల ప్రపంచము, వికర్మల కాలము. వికర్మాజీతులైన
దేవతల కాలము గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వికర్మాజీతుల
కాలము గడిచి 5,000 సంవత్సరాలైంది, ఆ తర్వాత మళ్ళీ వికర్మల కాలము ప్రారంభమవుతుంది.
రాజులు కూడా వికర్మలే చేస్తూ ఉంటారు. తండ్రి అంటారు, కర్మ-అకర్మ-వికర్మల గతులను నేను
మీకు అర్థం చేయిస్తాను. రావణ రాజ్యములో మీ కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యయుగములో
కర్మలు అకర్మలుగా ఉంటాయి, వికర్మలుగా అవ్వవు. అక్కడ వికారాలు అన్న మాటే ఉండదు.
జ్ఞానమనే ఈ మూడవ నేత్రము ఇప్పుడు మీకు లభించింది. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి
ద్వారా త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా అయ్యారు. మనుష్యులు ఎవ్వరూ అలా
తయారుచేయలేరు. మిమ్మల్ని తయారుచేసేవారు తండ్రియే. మొదట ఆస్తికులుగా అయినప్పుడే
త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా అవుతారు. మొత్తం డ్రామా రహస్యమంతా బుద్ధిలో ఉంది.
మూలవతనము, సూక్ష్మవతనము, 84 జన్మల చక్రము అంతా బుద్ధిలో ఉంది. ఆ తర్వాత ఇతర ధర్మాలు
వస్తాయి, వృద్ధి చెందుతూ ఉంటారు. ఆ ధర్మ స్థాపకులను గురువులు అని అనరు. సర్వులకూ
సద్గతిని ఇచ్చే సద్గురువు ఒక్కరే, మిగిలినవారు ఎవ్వరూ సద్గతిని ఇవ్వడానికి రారు.
వారు ధర్మ స్థాపకులు. క్రైస్టును స్మృతి చేయడం ద్వారా సద్గతి ఏమీ లభించదు. వికర్మలు
వినాశనమవ్వవు. అదేమీ అవ్వదు. వారందరినీ భక్తి యొక్క లైన్ లో ఉన్నారు అనే అంటారు.
జ్ఞానము యొక్క లైన్ లో కేవలం మీరే ఉన్నారు. మీరు మార్గదర్శకులు. అందరికీ శాంతిధామము,
సుఖధామము యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి కూడా ముక్తిప్రదాత, మార్గదర్శకుడు.
ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి.
ఇప్పుడు పిల్లలైన మీరు మీ వికర్మలను వినాశనము చేసుకునేందుకు పురుషార్థము
చేస్తున్నారు కావున మీకు అటెన్షన్ ఉండాలి - ఒకవైపు పురుషార్థము చేస్తూ ఇంకొక వైపు
వికర్మలు జరుగుతూ ఉండకూడదు. పురుషార్థముతోపాటు వికర్మలు కూడా చేసినట్లయితే అవి 100
రెట్లు అయిపోతాయి. ఎంత వీలైతే అంత వికర్మలు చేయకండి, లేకపోతే అవి ఇంకా పెరుగుతాయి.
పేరును కూడా అప్రతిష్టపాలు చేస్తారు. భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అన్నది
తెలిసినప్పుడు మరి ఇంకే వికర్మలనూ చేయకూడదు. చిన్న దొంగతనమైనా లేక పెద్ద దొంగతనమైనా
పాపమైతే జరుగుతుంది కదా. ఈ కళ్ళు ఎంతగానో మోసగిస్తాయి. తండ్రి పిల్లల నడవడిక ద్వారా
అర్థం చేసుకుంటారు. ఈమె నా పత్ని అని ఎప్పుడూ ఆలోచన కూడా రాకూడదు. మేము
బ్రహ్మాకుమార, కుమారీలము, శివబాబాకు మనవలము అని భావించాలి. మేము బాబాతో ప్రతిజ్ఞ
చేసాము, రాఖీ కట్టుకున్నాము, మరి ఈ కళ్ళు ఎందుకు మోసగిస్తున్నాయి? స్మృతి బలము
ద్వారా ఏ కర్మేంద్రియము యొక్క మోసం నుండైనా విముక్తులవ్వగలరు. ఇందులో ఎంతో శ్రమ
కావాలి. తండ్రి డైరెక్షన్ ను అమలుపరచి చార్టు వ్రాయండి. పతి, పత్ని కూడా పరస్పరం ఇవే
మాటలు మాట్లాడుకోండి - మనం బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుందాము, టీచర్ నుండి
పూర్తిగా చదువుకుందాము అని. అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చే ఇటువంటి టీచర్ ఇంకెప్పుడూ
లభించరు. లక్ష్మీ-నారాయణులకే తెలియనప్పుడు మరి వారి తర్వాత వచ్చేవారు ఎలా
తెలుసుకోగలరు. తండ్రి అంటారు, ఈ సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము గురించి
సంగమయుగములో కేవలం మీకు మాత్రమే తెలుసు. ఇది చేయండి, ఇలా చేయండి అంటూ బాబా ఎంతగానో
అర్థం చేయిస్తూ ఉంటారు, కానీ ఇక్కడి నుండి లేవగానే అంతా సమాప్తమైపోతుంది. శివబాబా
నాకు చెప్తున్నారు అని భావించరు. ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారు అని భావించండి,
ఇతని ఫోటోను కూడా పెట్టుకోకండి. ఈ రథాన్ని అయితే అద్దెకు తీసుకున్నారు. ఇతను కూడా
పురుషార్థియే. నేను బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను అని ఇతను కూడా అంటారు.
మీలా ఇతను కూడా విద్యార్థి జీవితములోనే ఉన్నారు. మున్ముందు మీ మహిమ జరుగుతుంది.
ఇప్పుడైతే మీరు పూజ్య దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. మళ్ళీ సత్యయుగములో మీరు
దేవతలుగా అవుతారు. ఈ విషయాలన్నింటినీ ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు.
భాగ్యములో లేకపోతే - శివబాబా వచ్చి ఎలా చదివిస్తారు! నేనైతే నమ్మను అన్న సంశయం
ఉత్పన్నమవుతుంది. నమ్మకపోతే మరి శివబాబాను స్మృతి కూడా ఎలా చేయగలరు? వికర్మలు
వినాశనమవ్వవు. ఇక్కడంతా నంబరువారుగా రాజధాని స్థాపన అవుతోంది. దాస-దాసీలు కూడా
కావాలి కదా. రాజులకు దాసీలు కూడా కట్నకానుకలుగా లభిస్తారు. ఇక్కడే ఇంతమంది దాసీలను
పెట్టుకుంటున్నారంటే మరి సత్యయుగములో ఎంతమంది ఉంటారు. దాస-దాసీలుగా అయ్యే విధంగా
అటువంటి ఢీలా పురుషార్థాన్ని చేయకూడదు. బాబా, నేను ఇప్పుడే మరణిస్తే ఏ పదవి
లభిస్తుంది అని బాబాను అడగవచ్చు. బాబా వెంటనే చెప్తారు. మీ లెక్కాపత్రాన్ని మీరే
చూసుకోండి. అంతిమములో నంబరువారుగా కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. ఇది సత్యమైన సంపాదన.
ఆ సంపాదనలో రాత్రింబవళ్ళు ఎంత బిజీగా ఉంటారు. సట్టా వ్యాపారము చేసేవారు ఒక చేతితో
భోజనము చేస్తూ ఉంటారు, ఇంకొక చేతితో ఫోన్ లో తమ కార్యవ్యవహారాలు నడుపుతూ ఉంటారు.
ఇప్పుడు చెప్పండి, అటువంటి వ్యక్తి జ్ఞానములో నడువగలరా? మాకు ఖాళీ ఎక్కడ ఉంది అని
అంటారు. అరే, సత్యమైన రాజ్యము లభిస్తోంది. తండ్రిని కేవలం స్మృతి చేసినట్లయితే
వికర్మలు వినాశనమవుతాయి. అష్ట దేవతలు మొదలైనవారిని కూడా స్మృతి చేస్తారు కదా. వారి
స్మృతి ద్వారానైతే ఏమీ లభించదు. బాబా పదే-పదే ప్రతి ఒక్క విషయముపై అర్థం చేయిస్తూ
ఉంటారు. ఇక తర్వాత ఎవ్వరూ ఫలానా విషయము గురించి అర్థం చేయించలేదు అని అనడానికి లేదు.
పిల్లలైన మీరు సందేశము కూడా అందరికీ ఇవ్వాలి. ఏరోప్లేన్ నుండి కూడా కరపత్రాలను
వేసేందుకు ప్రయత్నించాలి. శివబాబా ఇలా చెప్తున్నారు అని అందులో వ్రాయండి. బ్రహ్మా
కూడా శివబాబాకు సంతానము. వారు ప్రజాపిత, కావున వారూ తండ్రియే, వీరూ తండ్రియే.
శివబాబా అని అనడముతో కూడా చాలామంది పిల్లలకు ప్రేమ అశ్రువులు వస్తాయి. బాబాను వారు
ఎప్పుడూ చూడను కూడా చూడలేదు. బాబా, మేము ఎప్పుడు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాము, బాబా,
బంధనము నుండి విడిపించండి అని వ్రాస్తారు. చాలామందికి బాబా యొక్క మరియు యువరాజు
యొక్క సాక్షాత్కారము కూడా కలుగుతుంది. మున్ముందు ఎంతోమందికి సాక్షాత్కారాలు
కలుగుతాయి, అయినా పురుషార్థమైతే చేయవలసి ఉంటుంది. భగవంతుడిని స్మృతి చేయండి అని
మనుష్యులకు మరణించే సమయములో కూడా చెప్తారు. మీరు కూడా చూస్తారు, చివరి సమయములో
మనుష్యులు చాలా పురుషార్థము చేస్తారు, స్మృతి చేయడం మొదలుపెడతారు.
తండ్రి సలహా ఇస్తున్నారు - పిల్లలూ, ఎంత సమయము దొరికితే అంత సమయము పురుషార్థము
చేసి మేకప్ చేసుకోండి (పోగొట్టుకున్న సమయము యొక్క లోటును భర్తీ చేయండి). తండ్రి
స్మృతిలో ఉంటూ వికర్మలను వినాశనము చేసుకున్నట్లయితే ఆలస్యముగా వచ్చినా కూడా ముందుకు
వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకు ట్రెయిన్ లేట్ అయితే అది ఆ లేట్ అయిన సమయాన్ని త్వరగా
ముందుకు వెళ్ళి కవర్ చేస్తుంది కదా. అలాగే మీరు కూడా ఇక్కడ సమయము లభిస్తుంది కాబట్టి
మేకప్ చేసుకోండి (త్వరగా ముందుకు వెళ్ళి ఆ లోటును భర్తి చేసుకోండి). ఇక్కడకు వచ్చి
సంపాదించుకోవడం మొదలుపెట్టండి. ఇలా, ఇలా చేయండి, మీ కళ్యాణము చేసుకోండి అని బాబా
సలహాను కూడా ఇస్తారు. తండ్రి శ్రీమతముపై నడవండి. విమానాల ద్వారా కరపత్రాలను వేయండి,
తద్వారా వీరు యథార్థమైన సందేశాన్ని ఇస్తున్నారు అని మనుష్యులు అర్థం చేసుకోగలుగుతారు.
భారత్ ఎంత పెద్దది. అందరికీ తెలియాలి, తద్వారా, బాబా మాకు తెలియనే తెలియలేదు అని
ఎవ్వరూ అనకూడదు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.