17-09-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ రహస్యాన్ని అందరికీ వినిపించండి, ఆబూ అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము, స్వయంగా భగవంతుడే ఇక్కడ నుండి అందరి సద్గతిని చేసారు’’

ప్రశ్న:-
ఏ ఒక్క విషయాన్ని మనుష్యులు అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడకు గుంపులు, గుంపులుగా వచ్చేస్తారు?

జవాబు:-
ముఖ్యమైన ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే, తండ్రి ఏ రాజయోగాన్ని అయితే నేర్పించారో దానిని ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తున్నారు, వారు సర్వవ్యాపి కారు. తండ్రి ఈ సమయంలో ఆబూలోకి వచ్చి విశ్వములో శాంతి స్థాపనను చేస్తున్నారు, దాని జడ స్మృతిచిహ్నముగా దిల్వాడా మందిరము కూడా ఉంది. ఆదిదేవ్ ఇక్కడ చైతన్యములో కూర్చున్నారు, ఇది చైతన్యమైన దిల్వాడా మందిరము - ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఆబూ మహిమ జరుగుతుంది మరియు ఇక్కడకు గుంపులు, గుంపులుగా వచ్చేస్తారు. ఆబూ పేరు ప్రఖ్యాతమైతే ఇక్కడకు చాలామంది వస్తారు.

ఓంశాంతి
పిల్లలకు యోగాన్ని నేర్పించారు. ఇతర స్థానాలలో అందరూ తమకు తామే నేర్చుకుంటారు, అక్కడ నేర్పించే తండ్రి ఉండరు. పరస్పరం ఒకరికొకరు నేర్పించుకుంటారు. ఇక్కడైతే పిల్లలకు తండ్రి కూర్చొని నేర్పిస్తారు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. అక్కడైతే ఎంతోమంది మిత్ర-సంబంధీకులు మొదలైనవారు గుర్తుకువస్తూ ఉంటారు, ఇంతగా స్మృతి చేయలేరు, అందుకే దేహీ-అభిమానులుగా చాలా కష్టం మీద అవుతారు. ఇక్కడైతే మీరు చాలా త్వరగా దేహీ-అభిమానులుగా అవ్వాలి, కానీ ఏమీ తెలియనివారు ఎంతోమంది ఉన్నారు. శివబాబా మన సేవను చేస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని మనకు చెప్తున్నారు. ఏ తండ్రి అయితే వీరిలో విరాజమానమై ఉన్నారో, ఇక్కడ విరాజమానమై ఉన్నారో, వారిని స్మృతి చేయవలసి ఉంటుంది. శివబాబా బ్రహ్మా తనువు ద్వారా మనకు నేర్పిస్తున్నారు అన్న నిశ్చయమే లేని పిల్లలు కూడా ఎందరో ఉన్నారు. మేము ఎలా నిశ్చయం చేసుకోవాలి అని ఏ విధంగా ఇతరులు అంటారో అలా ఇక్కడ కూడా ఉన్నారు. ఒకవేళ పూర్తి నిశ్చయం ఉన్నట్లయితే ఎంతో ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తూ, చేస్తూ తమలో శక్తిని నింపుకుంటారు, ఎంతో సేవను చేస్తారు ఎందుకంటే మొత్తం విశ్వమంతటినీ పావనంగా తయారుచేయాలి కదా. యోగము చేయడంలో కూడా లోపము ఉంది, అలాగే జ్ఞానంలో కూడా లోపము ఉంది. వింటారు కానీ ధారణ జరగదు. ఒకవేళ ధారణ జరిగినట్లయితే ఇతరులకు కూడా ధారణ చేయిస్తారు. బాబా అర్థం చేయించారు - వారు కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తూ ఉంటారు, విశ్వములో శాంతిని కోరుకుంటారు, కానీ విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేది, అది ఏ విధంగా ఏర్పడింది, అదేమీ తెలియదు. ఏ విధమైన శాంతి ఉండేదో, అదే కావాలి కదా. విశ్వములో సుఖ-శాంతుల స్థాపన ఇప్పుడు జరుగుతోంది అని పిల్లలైన మీకే తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. ఈ దిల్వాడా మందిరము ఎలా ఉందో చూడండి, ఆదిదేవ్ కూడా ఉన్నారు మరియు పైన విశ్వములోని శాంతి యొక్క దృశ్యము కూడా ఉంది. ఎక్కడైనా కాన్ఫరెన్సులు మొదలైనవాటికి మిమ్మల్ని పిలుస్తే మీరు వారిని ఇలా అడగండి - విశ్వములో ఏ రకమైన శాంతి కావాలి? ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యములో విశ్వములో శాంతి ఉండేది. దిల్వాడా మందిరములో ఆ పూర్తి స్మృతిచిహ్నము ఉంది. విశ్వములోని శాంతి యొక్క శ్యాంపుల్ అయితే కావాలి కదా. లక్ష్మీ-నారాయణుల చిత్రము ద్వారా కూడా అర్థం చేసుకోరు. రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు కదా. కావున వారికి ఇలా చెప్పాలి - విశ్వములో శాంతి యొక్క శ్యాంపుల్ ను మేము చెప్పగలము, ఒకటేమో ఈ లక్ష్మీ-నారాయణులు, అంతేకాక వీరి రాజధానిని కూడా చూడాలనుకుంటే దిల్వాడా మందిరములోకి వెళ్ళి చూడండి. మోడల్ నే చూపించడం జరుగుతుంది కదా, దానిని ఆబూకి వెళ్ళి చూడండి. స్వయం మందిరాన్ని తయారుచేసినవారికే తెలియదు, వారే కూర్చుని ఈ స్మృతిచిహ్నాన్ని తయారుచేసారు, దానికి దిల్వాడా మందిరము అన్న పేరును పెట్టారు. ఆదిదేవ్ ను కూడా కూర్చోబెట్టారు, పైన స్వర్గాన్ని కూడా చూపించారు. ఏ విధంగా ఆ స్మృతిచిహ్నము జడమైనదో, అలా మీరు చైతన్యమైనవారు. దీనికి చైతన్య దిల్వాడా మందిరము అన్న పేరును పెట్టవచ్చు. కానీ అలా చేస్తే ఎంతమంది గుంపులు, గుంపులుగా వచ్చేస్తారో తెలియదు. ఇది ఏమిటి అని మనుష్యులు తికమకపడిపోతారు. అర్థం చేయించడానికి ఎంతో కష్టపడవలసి ఉంటుంది. చాలామంది పిల్లలు కూడా అర్థం చేసుకోరు. భగవంతుని ద్వారం వద్ద కూర్చున్నా, దగ్గరగానే కూర్చున్నా కానీ ఏమీ అర్థం చేసుకోరు. ప్రదర్శనీలకు అనేక రకాల మనుష్యులు వెళ్తారు. ఎన్నో మఠాలు మొదలైనవి ఉన్నాయి, వైష్ణవ ధర్మం వారు కూడా ఉన్నారు. వైష్ణవ ధర్మము యొక్క అర్థాన్నే అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుని రాజ్యాధికారము ఎక్కడ ఉంది అన్నది తెలియనే తెలియదు. శ్రీకృష్ణుని రాజ్యాన్ని కూడా స్వర్గము, వైకుంఠము అని అంటారు.

బాబా అన్నారు, మీకు ఎక్కడికి ఆహ్వానం లభిస్తే మీరు అక్కడికి వెళ్ళి ఇలా అర్థం చేయించండి - విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేది? ఈ ఆబూ అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన తీర్థ స్థానము ఎందుకంటే ఇక్కడ తండ్రి విశ్వానికి సద్గతిని ఇస్తున్నారు, ఆబూ పర్వతముపై ఆ శ్యాంపుల్ ను చూడాలనుకుంటే వెళ్ళి దిల్వాడా మందిరాన్ని చూడండి. విశ్వములో శాంతిని ఎలా స్థాపించారు అన్న శ్యాంపుల్ అక్కడ ఉంది. ఇది విని వారు ఎంతో సంతోషిస్తారు. జైన ధర్మమువారు కూడా సంతోషిస్తారు. మీరు అంటారు, ఈ ప్రజాపిత బ్రహ్మా మా తండ్రి, ఆదిదేవ్. మీరు అర్థం చేయిస్తారు, అయినా కూడా అర్థం చేసుకోరు. ఈ బ్రహ్మాకుమారీలు ఏం చెప్తున్నారో ఏమిటో అని అంటారు. కావున ఇప్పుడు పిల్లలైన మీరు ఆబూను ఎంతో ఉన్నతంగా మహిమ చేసి అర్థం చేయించాలి. ఆబూ అతి పెద్ద తీర్థ స్థానము. ఆబూ పర్వతము అతి పెద్ద తీర్థ స్థానము ఎందుకంటే పరమపిత పరమాత్మ ఆబూలోకి వచ్చి స్వర్గ స్థాపనను చేసారు అని మీరు బాంబేలో కూడా అర్థం చేయించవచ్చు. వారు ఏ విధంగా స్వర్గాన్ని రచించారు - ఆ స్వర్గము మరియు ఆదిదేవ్ యొక్క మోడల్ మొదలైనవన్నీ ఆబూలో ఉన్నాయి, దానిని మనుష్యులు ఎవరూ అర్థం చేసుకోరు. మాకు ఇప్పుడు తెలుసు, మీకు తెలియదు, కావుననే మేము మీకు అర్థం చేయిస్తాము. ముందైతే మీరు వారిని ఇలా అడగండి - విశ్వములో ఎటువంటి శాంతిని కోరుకుంటున్నారు, దానిని ఎప్పుడైనా చూసారా? విశ్వములో శాంతి అయితే ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యములో ఉండేది. ఒకే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం ఉండేది, వీరి వంశము యొక్క రాజ్యం ఉండేది. మీరు వచ్చినట్లయితే వీరి రాజధాని యొక్క మోడల్ ను ఆబూలో మీకు చూపిస్తాము. ఇది ఉన్నదే పాత పతిత ప్రపంచము. దీనిని కొత్త ప్రపంచము అని అయితే అనము కదా. కొత్త ప్రపంచము యొక్క మోడల్ అయితే ఇక్కడ ఉంది, కొత్త ప్రపంచము ఇప్పుడు స్థాపన అవుతోంది. మీకు తెలుసు కావుననే మీరు తెలియజేస్తున్నారు. ఇది అందరికీ తెలియదు, కావున తెలియజేయరు కూడా, అలాగే అర్థమవ్వదు కూడా. వాస్తవానికి విషయము చాలా సహజమైనది. పైన స్వర్గ రాజధాని ఉంది, కింద ఆదిదేవ్ కూర్చున్నారు, వారిని ఆడమ్ అని కూడా అంటారు. వారు గ్రేట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఈ విధంగా మీరు మహిమను వినిపించినట్లయితే విని సంతోషిస్తారు. వాస్తవానికి ఈ మహిమ ఏక్యురేట్ అయినది కూడా. మీరు ఇలా చెప్పండి - మీరు శ్రీకృష్ణుని మహిమను చేస్తున్నారు కానీ మీకు ఏమీ తెలియదు. శ్రీకృష్ణుడు వైకుంఠానికి మహారాజుగా, విశ్వాధిపతిగా ఉండేవారు. ఆ మోడల్ ను మీరు చూడాలనుకుంటే ఆబూకు పదండి, మీకు వైకుంఠము యొక్క మోడల్ ను చూపిస్తాము. ఏ విధముగా పురుషోత్తమ సంగమయుగములో రాజయోగాన్ని నేర్చుకుంటారో, దేని ఆధారంగా మళ్ళీ విశ్వాధిపతిగా అయ్యారో, ఆ మోడల్ ను కూడా చూపించండి. సంగమయుగపు తపస్యను కూడా చూపించండి. ప్రాక్టికల్ గా ఏదైతే జరిగిందో దాని స్మృతిచిహ్నాన్ని చూపించండి. ఏ శివబాబా అయితే లక్ష్మీ-నారాయణుల రాజ్యాన్ని స్థాపన చేసారో వారి చిత్రము కూడా ఉంది, అలాగే అంబ మందిరము కూడా ఉంది. అంబకు 10-20 భుజాలు ఏమీ లేవు. భుజాలు రెండే ఉంటాయి. మీరు వస్తే మేము మీకు చూపిస్తాము. వైకుంఠాన్ని కూడా ఆబూలో చూపించండి. ఆబూలోకే తండ్రి వచ్చి మొత్తం విశ్వమంతటినీ స్వర్గముగా తయారుచేసారు, సద్గతిని ఇచ్చారు. ఆబూ అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము, అన్ని ధర్మాలవారి సద్గతిని చేసేవారు ఒక్క తండ్రే, మీరు వచ్చినట్లయితే వారి స్మృతిచిహ్నాన్ని ఆబూలో చూపిస్తాము. ఆబూను మీరు ఎంతగానో మహిమ చేయవచ్చు. మీకు అన్ని స్మృతిచిహ్నాలను చూపిస్తాము. క్రిస్టియన్లు కూడా ప్రాచీన భారత్ యొక్క రాజయోగాన్ని ఎవరు నేర్పించారు, అసలు అది ఏమిటి? అని తెలుసుకోవాలనుకుంటారు. మీరు చెప్పండి - పదండి, మేము ఆబూలో చూపిస్తాము. కప్పు పైన వైకుంఠాన్ని కూడా పూర్తిగా ఏక్యురేట్ గా తయారుచేసారు. మీరు అలా తయారుచేయలేరు. కావున దీనిని బాగా తెలియజేయాలి. టూరిస్టులు అటూ, ఇటూ తిరుగుతూ ఉంటారు, వారు కూడా వచ్చి అర్థం చేసుకోవాలి. మీ ఆబూ పేరు ప్రఖ్యాతమైపోతే ఎంతోమంది వస్తారు. ఆబూ ఎంతగానో ప్రసిద్ధమైపోతుంది. విశ్వములో శాంతి ఎలా ఏర్పడగలదు అని ఎవరైనా అడిగితే, సమ్మేళనాలు మొదలైనవాటికి ఆహ్వానాన్ని ఇస్తే, మీరు ఇలా అడగాలి - విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేదో అది మీకు తెలుసా? విశ్వములో శాంతి ఎలా ఉండేది - పదండి, మేము మీకు అర్థం చేయిస్తాము, మోడల్స్ మొదలైనవన్నీ చూపిస్తాము. ఇటువంటి మోడల్ ఇంకెక్కడా లేదు. ఆబూయే అన్నింటికన్నా అతి పెద్ద ఉన్నతోన్నతమైన తీర్థ స్థానము, అందులోకే తండ్రి వచ్చి విశ్వములో శాంతిని స్థాపించారు, సర్వుల సద్గతిని చేసారు. ఈ విషయాల గురించి ఇంకెవరికీ తెలియదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. గొప్ప మహారథులు, మ్యూజియంలు మొదలైనవాటిని సంభాళించేవారు ఉన్నారు, కానీ సరైన రీతిలో ఎవరికైనా అర్థం చేయిస్తున్నారా, లేదా? అన్నది బాబా చూస్తారు కదా. బాబాకు అన్నీ అర్థమవుతాయి, ఎవరు ఎక్కడ ఉన్నా వారి గురించి అర్థమవుతుంది. ఎవరెవరు పురుషార్థం చేస్తున్నారో, ఏ పదవిని పొందుతారో తెలుసు. ఈ సమయంలో ఒకవేళ మరణించినట్లయితే ఏ పదవినీ పొందలేరు అని కూడా తెలుసు. స్మృతియాత్ర కొరకు కావాల్సిన పురుషార్థము గురించి వారు అర్థం చేసుకోలేరు. తండ్రి ప్రతీ రోజూ కొత్త విషయాలను అర్థం చేయిస్తారు. ఇలా, ఇలా అర్థం చేయించి వారిని తీసుకురండి. ఇక్కడైతే ఈ స్మృతిచిహ్నము నిలిచే ఉంటుంది.

తండ్రి అంటారు, నేను కూడా ఇక్కడ ఉన్నాను, ఆదిదేవ్ కూడా ఇక్కడ ఉన్నారు, అలాగే వైకుంఠము కూడా ఇక్కడ ఉంది. ఆబూ మహిమ ఎంతో ఉన్నతముగా అయిపోతుంది. ఆబూ ఎలా అయిపోతుందో తెలియదు! ఉదాహరణకు చూడండి, కురుక్షేత్రాన్ని బాగు చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఎంతమంది మనుష్యులు అక్కడకు వెళ్ళి గుమికూడతారు, అక్కడ ఎంత దుర్గంధము, మురికి తయారవుతుందో ఇక చెప్పడానికి వీల్లేదు. ఎంత పెద్ద గుంపు ఏర్పడుతుంది. భజన మండలివారి బస్సు ఒకటి మునిగిపోయింది అన్న సమాచారము వచ్చింది. ఇవన్నీ దుఃఖాలే కదా. అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి. అక్కడైతే ఇటువంటి విషయాలేవీ ఉండవు. ఈ విషయాలన్నింటినీ మీరు అర్థం చేయించవచ్చు. మాట్లాడేవారు చాలా వివేకవంతులై ఉండాలి. తండ్రి జ్ఞానాన్ని పంప్ చేస్తున్నారు, బుద్ధిలో కూర్చోబెడుతున్నారు. ప్రపంచం ఈ విషయాలను అర్థం చేసుకోదు. కొత్త ప్రపంచములో విహరించడానికి వెళ్తున్నాము అని వారు భావిస్తారు. తండ్రి అంటారు, ఈ ప్రపంచం ఇప్పుడు పాతబడిపోయింది, ఇది ఇక వెళ్ళిపోనున్నది. వారైతే ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నాయి అని అంటారు. మీరు అంటారు, మొత్తం కల్పమే 5000 సంవత్సరాలు ఉంటుంది. పాత ప్రపంచపు మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది. దీనిని ఘోర అంధకారము అని అంటారు. కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. కుంభకర్ణుడు అర్ధకల్పం నిద్రపోయేవాడు, అర్ధకల్పం మేల్కొని ఉండేవాడు. మీరు కుంభకర్ణులుగా ఉండేవారు. ఈ ఆట చాలా అద్భుతమైనది. ఈ విషయాలను అందరూ అర్థం చేసుకోలేరు. కొందరైతే ఏదో భావనలోకి వచ్చేస్తారు. వీరందరూ వెళ్తున్నారు అని విని వారూ బయలుదేరుతారు. వారికి ఏం చెప్తారంటే - మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము, శివబాబా స్వర్గ స్థాపనను చేస్తున్నారు, ఆ అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది. అంతే, అది విని వారు కూడా - శివబాబా, మేము మీ పిల్లలము, మీ నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము అని అనేస్తారు, అంతే, ఇక దానితో వారి నావ తీరానికి చేరుకుంటుంది. భావనకు ఎంతటి ఫలము లభిస్తుందో చూడండి. భక్తి మార్గములో అల్పకాలికమైన సుఖము ఉంది. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుందని ఇక్కడ పిల్లలైన మీకు తెలుసు. అక్కడైతే కేవలం భావనకు అల్పకాలికమైన సుఖము ఫలముగా లభిస్తుంది. ఇక్కడైతే మీకు 21 జన్మల కొరకు భావనకు ఫలము లభిస్తుంది. ఇకపోతే ఈ సాక్షాత్కారాలు మొదలైనవాటిలో ఏమీ లేదు. కొందరు మాకు సాక్షాత్కారము కలగాలి అని అంటారు, అప్పుడు వీరేమీ అర్థం చేసుకోలేదని బాబాకు అర్థమైపోతుంది. సాక్షాత్కారము కావాలనుకుంటే వెళ్ళి నవ విధ భక్తిని చేయండి, దాని వల్ల ఏమీ లభించదు. మహా అయితే మరుసటి జన్మలో మంచిగా అవుతారు. మంచి భక్తులై ఉన్నట్లయితే మంచి జన్మ లభిస్తుంది. ఇక్కడైతే విషయమే అతీతమైనది. ఈ పాత ప్రపంచం మారుతోంది. తండ్రి ఉన్నదే ప్రపంచాన్ని మార్చేవారిగా. స్మృతిచిహ్నం ఉంది కదా. ఇది చాలా పాత మందిరము. ఏవైనా విరిగిపోతే వాటికి మరమ్మతులు చేయిస్తూ ఉంటారు. కానీ ఆ శోభ అయితే తక్కువైపోతుంది. ఇవన్నీ వినాశీ వస్తువులు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఒకటేమో మీ కళ్యాణము కొరకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. ఇది చదువుకు సంబంధించిన విషయము. ఇకపోతే మథురాలో మధుబన్, కుంజ్ గలీ (మథురా నగరములోని స్థానాలు) మొదలైనవాటికి సంబంధించి ఏవైతే కథలు తయారుచేసారో, వాస్తవానికి అవేవీ లేవు. అలాగే గోప-గోపికల ఆట కూడా లేదు. ఇది అర్థం చేయించడానికి ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ ను కూర్చుని బాగా అర్థం చేయించండి. కాన్ఫరెన్సులు మొదలైనవాటిలో కూడా యోగము కలవారు కావాలి. ఖడ్గములో పదును లేకపోతే ఎవరికీ బాణం తగలదు. అందుకే తండ్రి కూడా అంటారు, ఇప్పుడింకా ఆలస్యము ఉంది. పరమాత్మ సర్వవ్యాపి కాదు అని ఇప్పుడే అంగీకరించినట్లయితే ఎంతోమంది గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. కానీ ఇప్పుడు ఇంకా సమయం కాలేదు. ఒక విషయాన్ని ముఖ్యంగా అర్థం చేసుకోవాలి - రాజయోగాన్ని ఇంతకుముందు తండ్రి నేర్పించారు, దానిని ఈ సమయంలో నేర్పిస్తున్నారు. వారి పేరుకు బదులుగా ఈ సమయంలో నల్లగా అయిపోయినవారి పేరును వేసేశారు. ఇది ఎంత పెద్ద పొరపాటు. దీని వలనే మీ నావ మునిగిపోయింది.

ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ చదువు సంపాదనకు ఆధారము, స్వయంగా తండ్రి మనుష్యులను దేవతలుగా తయారుచేయడానికి చదివించేందుకు వస్తారు, ఇందులో పవిత్రముగా కూడా తప్పకుండా అవ్వాలి, దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు. సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నంబరువారుగా ఉన్నాయి. ఈ రాజధాని అంతా స్థాపన అవుతోంది. ఇది సామాన్యమైన విషయమేమీ కాదు. మీరు ఇలా చెప్పండి - స్వర్గము అని సత్యయుగాన్ని అంటారు, కానీ అక్కడి రాజ్యం ఎలా నడుస్తుందో, ఆ దేవతల గుంపును చూడాలనుకుంటే ఆబూకు పదండి. ఇంకెక్కడా ఈ విధంగా పై కప్పుపై రాజ్యాన్ని చూపించే స్థానం లేదు. అజ్మీరులో స్వర్గము యొక్క మోడల్ ఉన్నా కానీ అది వేరు. ఇక్కడైతే ఆదిదేవ్ కూడా ఉన్నారు కదా. సత్యయుగాన్ని ఎవరు మరియు ఎలా స్థాపించారు అన్నదానికి ఏక్యురేట్ స్మృతిచిహ్నము. ప్రస్తుతం మనం చైతన్య దిల్వాడా మందిరము అన్న పేరును ఇక్కడ వ్రాయలేము. ఎప్పుడైతే మనుష్యులు స్వయంగా అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు అలా వ్రాయండి అని వారంతట వారే అంటారు. ఇప్పుడు అలా వ్రాయలేరు. ఇప్పుడు చూడండి, చిన్న విషయములోనే ఏమేమి చేసేస్తారు. చాలా క్రోధితులు అవుతారు, దేహాభిమానం ఉంది కదా. దేహీ-అభిమానులుగా పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ అవ్వలేరు. పురుషార్థము చేయాలి. భాగ్యములో ఏది ఉంటే అదే అని భావించడం కాదు, పురుషార్థులు అలా అనరు, వారు పురుషార్థము చేస్తూ ఉంటారు, ఒకవేళ ఫెయిల్ అయితే అప్పుడు భాగ్యములో ఏది ఉంటే అది పొందాము అని అంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు పూర్తి-పూర్తి పురుషార్థము చేయాలి. భాగ్యములో ఏది ఉంటే అదే జరుగుతుంది అని ఎప్పుడూ భావించకూడదు. వివేకవంతులుగా అవ్వాలి.

2. జ్ఞానాన్ని విని దానిని స్వరూపములోకి తీసుకురావాలి, స్మృతి అనే పదునును ధారణ చేసి అప్పుడు సేవ చేయాలి. అందరికీ మహా తీర్థమైన ఆబూ మహిమను వినిపించాలి.

వరదానము:-

ఒక్క బాబా అన్న పదము యొక్క స్మృతి ద్వారా స్మృతి మరియు సేవలో ఉండే సత్యమైన యోగీ, సత్యమైన సేవాధారీ భవ

పిల్లలైన మీరు నోటి ద్వారా లేక మనస్సు ద్వారా పదే-పదే ‘బాబా’ అన్న పదాన్ని ఉచ్చరిస్తారు. పిల్లలైనట్లయితే మరి ‘బాబా’ అన్న పదము గుర్తు రావటము లేక ఆలోచించటమే యోగము, అలాగే నోటి ద్వారా, బాబా ఇలా అంటారు, బాబా ఇలా చెప్పారు, అని పదే-పదే అనటము - ఇదే సేవ. కానీ ఈ బాబా అన్న పదాన్ని కొందరు హృదయపూర్వకంగా అంటే కొందరు జ్ఞానము కల బుద్ధితో అంటారు. ఎవరైతే హృదయపూర్వకంగా అంటారో, వారికి హృదయములో ప్రత్యక్ష ప్రాప్తి అయిన సంతోషము మరియు శక్తి లభిస్తాయి. బుద్ధితో అనేవారికి అనే సమయములోనే సంతోషము ఉంటుంది కానీ సదాకాలము ఉండదు.

స్లోగన్:-

పరమాత్మ రూపీ దీపముపై బలిహారమయ్యే వారే సత్యమైన దీపపు పురుగులు.