17-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 30.11.2002


‘‘రిటర్న్ అనే పదము యొక్క స్మృతితో సమానముగా అవ్వండి మరియు రిటర్న్ జర్నీ యొక్క స్మృతి స్వరూపులుగా అవ్వండి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ హృదయ సింహాసనాధికారులు, భృకుటి సింహాసనాధికారులు, విశ్వరాజ్య సింహాసనాధికారులు, స్వరాజ్య అధికారులైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు. పరమాత్ముని హృదయ సింహాసనము మొత్తము కల్పములో ఇప్పుడు చాలా కాలం దూరమై తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలైన మీకే ప్రాప్తిస్తుంది. భృకుటి సింహాసనమైతే ఆత్మలందరికీ ఉంది కానీ పరమాత్మ హృదయ సింహాసనము బ్రాహ్మణ ఆత్మలకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించలేదు. ఈ హృదయ సింహాసనమే విశ్వ సింహాసనాన్ని ఇప్పిస్తుంది. వర్తమాన సమయములో స్వరాజ్య అధికారులుగా అయ్యారు, ప్రతి బ్రాహ్మణ ఆత్మకు స్వరాజ్యమనేది కంఠ హారము. స్వరాజ్యము మీ జన్మ అధికారము. ఇలా స్వయాన్ని ఇటువంటి స్వరాజ్య అధికారులుగా అనుభవం చేస్తున్నారా? మా ఈ జన్మ సిద్ధ అధికారాన్ని ఎవ్వరూ లాక్కోలేరు అని హృదయములో ఈ దృఢ సంకల్పము ఉంది. దీనితో పాటుగా, మేము పరమాత్ముని హృదయ సింహాసనాధికారులము కూడా అన్న ఈ ఆత్మిక నషా కూడా ఉంది. మానవ జీవితములో, తనువులో కూడా విశేషంగా హృదయమే (గుండె) గొప్పగా మహిమ చేయబడుతుంది. గుండె ఆగిపోతే జీవితము సమాప్తమైపోతుంది. అలాగే ఆధ్యాత్మిక జీవితములో కూడా హృదయ సింహాసనానికి చాలా మహత్వము ఉంది. ఎవరైతే హృదయ సింహాసనాధికారులో, ఆ ఆత్మలే విశ్వములో విశేష ఆత్మలుగా గాయనము చేయబడతారు. ఆ ఆత్మలే భక్తుల ద్వారా మాలలోని మణుల రూపములో స్మరించబడతారు. ఆ ఆత్మలే కోట్లలో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కొద్దిమందిగా మహిమ చేయబడతారు. మరి వారు ఎవరు? మీరేనా? పాండవులు కూడానా? మాతలు కూడానా? (చేతులు ఊపుతున్నారు). మరి బాబా అంటున్నారు - ఓ నా ప్రియమైన పిల్లలూ, అప్పుడప్పుడు హృదయ సింహాసనాన్ని వదిలి దేహము రూపీ మట్టిపై ఎందుకు మనసు పెట్టుకుంటారు? దేహము మట్టి. ప్రియమైన పిల్లలు ఎప్పుడూ మట్టిలో కాళ్ళు పెట్టరు, సదా సింహాసనముపై, ఒడిలో లేక అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతుంటారు. మీ కోసం బాప్ దాదా రకరకాల ఊయలలను ఇచ్చారు, ఒక్కోసారి సుఖపు ఊయలలో ఊగండి, ఒక్కోసారి సంతోషపు ఊయలలో ఊగండి, ఒక్కోసారి ఆనందమయమైన ఊయలలో ఊగండి.

ఈ రోజు బాప్ దాదా ఇటువంటి శ్రేష్ఠమైన పిల్లలు ఊయలలో నషాతో ఎలా ఊగుతున్నారు అనేది చూస్తున్నారు. ఊగుతూ ఉంటారా? ఊగుతారా? మట్టిలోకైతే వెళ్ళరు కదా! అప్పుడప్పుడు మట్టిలో కాళ్ళు పెట్టాలని ఏమైనా మనసుకు అనిపిస్తుందా? ఎందుకంటే 63 జన్మలు మట్టిలోనే కాళ్ళు పెడతారు, మట్టిలోనే ఆడుకుంటారు. మరి ఇప్పుడైతే మట్టితో ఆడుకోరు కదా? అప్పుడప్పుడు ఏమైనా మట్టిలోకి కాళ్ళు వెళ్తాయా లేక వెళ్ళవా? అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటాయి. దేహ భానము కూడా మట్టిలో కాళ్ళు పెట్టడం వంటిది. దేహాభిమానము అనేది చాలా లోతైన మట్టిలో కాళ్ళు పెట్టడము వంటిది. కానీ దేహ భానము అనగా బాడీ కాన్షస్నెస్ అనేది కూడా మట్టే. ఎంతగా సంగమ సమయములో ఎక్కువలో ఎక్కువ సింహాసనాధికారులుగా ఉంటారో, అంతగా అర్ధకల్పము సూర్యవంశ రాజధానిలో ఉంటారు మరియు చంద్రవంశములో కూడా సూర్యవంశీయుల రాజ్యవంశములో ఉంటారు. ఒకవేళ ఇప్పుడు సంగమములో సింహాసనాధికారులుగా అప్పుడప్పుడు మాత్రమే ఉంటే సూర్యవంశానికి చెందిన రాయల్ కుటుంబములో కూడా అంతగానే కొద్ది సమయమే ఉంటారు. సింహాసనాధికారులుగా అయితే ఒకరి తర్వాత ఒకరు అవుతారు కానీ రాయల్ కుటుంబములో, రాజ్యవంశానికి చెందిన ఆత్మల యొక్క సంబంధములో సదా ఉంటారు. కనుక చెక్ చేసుకోండి - సంగమయుగము యొక్క ఆది సమయము నుండి ఇప్పటివరకు, అది 10 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, 66 సంవత్సరాలైనా కానీ ఎప్పటినుండైతే బ్రాహ్మణులుగా అయ్యారో, ఆ ఆది నుండి ఇప్పటివరకు ఎంత సమయము హృదయ సింహాసనాధికారులుగా, స్వరాజ్య సింహాసనాధికారులుగా ఉన్నారు? చాలాకాలము ఉన్నారా, నిరంతరము ఉన్నారా లేక అప్పుడప్పుడు ఉన్నారా. ఎవరైతే పరమాత్మ హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో, వారి గుర్తు ఏమిటంటే - ప్రత్యక్ష నడవడిక మరియు ముఖము ద్వారా సదా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు. వారి మనసులో, స్థూల భారమైతే తలపై ఉంటుంది కానీ సూక్ష్మ భారము మనసులో ఉంటుంది. అటువంటివారికి మనసులో ఎటువంటి భారము ఉండదు. చింత అనేది భారము, నిశ్చింత అంటే డబుల్ లైట్. ఏ విధమైన భారము ఉండదు అనగా సేవకు సంబంధించైనా, సంబంధ-సంపర్కాలకు సంబంధించైనా, స్థూల సేవ గురించైనా, ఆత్మిక సేవ గురించైనా భారము ఉండదు, ఏమవుతుంది, ఎలా అవుతుంది... సఫలత లభిస్తుందా, లభించదా అన్న భారము కూడా ఉండదు! ఆలోచించటము, ప్లాన్ తయారు చెయ్యటమన్నది వేరే విషయము, భారము ఉండటము వేరే విషయము. భారము ఉన్నవారి గుర్తు ఏమిటంటే - వారి ముఖముపై సదా, చాలా లేక కొద్దిగానైనా అలసట గుర్తులు ఉంటాయి. అలసట కలగడము వేరే విషయము, అలసటకు చెందిన గుర్తులు కొద్దిగా ఉన్నా సరే, ఇది కూడా భారానికి గుర్తు. అలాగే నిశ్చింత చక్రవర్తులుగా ఉండటమంటే నిర్లక్ష్యులుగా ఉండటమని కాదు, ఉన్నదేమో నిర్లక్ష్యులుగా కానీ మేమైతే నిశ్చింతగా ఉన్నాము అని అనటం కాదు. నిర్లక్ష్యమనేది చాలా మోసగిస్తుంది. తీవ్ర పురుషార్థానికి కూడా పదాలు అవే మరియు నిర్లక్ష్యానికి కూడా పదాలు అవే. తీవ్ర పురుషార్థులు సదా దృఢ నిశ్చయము ఉన్న కారణంగా ఎలా ఆలోచిస్తారంటే - ప్రతి కార్యములో ధైర్యము మరియు బాబా సహాయముతో సఫలత లభించే ఉంది. అలాగే నిర్లక్ష్యానికి కూడా ఇవే పదాలు - అయిపోతుంది, అయిపోతుంది, అయ్యే ఉంది, ఏ కార్యమైనా ఉండిపోయిందా ఏమిటి, అన్నీ అయిపోతాయి. కావున పదాలు ఒకటే కానీ రూపము వేర్వేరు.

వర్తమాన సమయములో మాయ యొక్క విశేషమైన రెండు రూపాలు పిల్లల పరీక్షను తీసుకుంటున్నాయి. ఒకటేమో వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు కాదు, వ్యర్థ సంకల్పాలు. రెండవది - ‘‘నేనే రైట్’’. నేను ఏదైతే చేసానో, ఏదైతే చెప్పానో, ఏదైతే ఆలోచించానో... నేనేమి తక్కువ కాదు, నేను రైట్. బాప్ దాదా సమయము అనుసారంగా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారు, ఒక్క మాటను సదా స్మృతిలో ఉంచుకోండి - బాబా ద్వారా లభించిన సర్వ ప్రాప్తులకు, స్నేహానికి, సహయోగానికి రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇవ్వడము అనగా సమానముగా అవ్వడము. రెండవది - ఇప్పుడు మనది రిటర్న్ జర్నీ (తిరుగు ప్రయాణము). రిటర్న్ అన్న ఒక్క పదమే సదా గుర్తుండాలి. దీని కొరకు చాలా సహజ సాధనమేమిటంటే - ప్రతి సంకల్పాన్ని, మాటను మరియు కర్మను బ్రహ్మాబాబాతో ట్యాలీ చేసుకోండి (సరిపోల్చుకోండి). బాబా సంకల్పాలు ఎలా ఉండేవి? బాబా మాటలు ఎలా ఉండేవి? బాబా కర్మలు ఎలా ఉండేవి? దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు. ఫాలో చేయటమైతే సహజమవుతుంది కదా! కొత్తగా ఆలోచించటము, కొత్తగా చెయ్యటము అనేవాటి అవసరమే లేదు, బాబా ఏదైతే చేసారో, ఫాలో ఫాదర్ చెయ్యండి. సహజమే కదా!

టీచర్లు చేతులెత్తండి. ఫాలో చెయ్యటము సహజమా లేక కష్టమా? సహజమే కదా! ఫాలో ఫాదర్ చెయ్యండి, అంతే. ముందు చెక్ చేసుకోండి. సామెత ఉంది కదా - ముందు ఆలోచించండి, ఆ తర్వాత చెయ్యండి, ముందు ఆలోచించండి, ఆ తర్వాత మాట్లాడండి. మరి టీచర్లు అందరూ ఈ సంవత్సరములో, ఇప్పుడు ఇది ఈ సంవత్సరములోని చివరి నెల, పాత సంవత్సరము వెళ్ళిపోతుంది, కొత్తది వస్తుంది. కొత్తది వచ్చే కంటే ముందు ఏం చెయ్యాలి అన్నదాని ఏర్పాట్లు చేసుకోండి. ఈ సంకల్పము చెయ్యండి - బాబా అడుగులో అడుగు వెయ్యటము తప్ప మరే ఇతర అడుగు వెయ్యము అని. కేవలం అడుగుజాడలు, అంతే. అడుగులో అడుగు వెయ్యటమైతే సులభము కదా! కనుక కొత్త సంవత్సరము కోసం ఇప్పటినుండే సంకల్పములో ప్లాన్ తయారుచెయ్యండి, ఏ విధంగా బ్రహ్మాబాబా సదా నిమిత్తంగా మరియు నిర్మానచిత్తులుగా ఉన్నారో, అలా నిమిత్త భావము మరియు నిర్మాన భావము ఉండాలి. కేవలము నిమిత్త భావమే కాదు, నిమిత్త భావముతో పాటు నిర్మాన భావము, ఈ రెండూ అవసరము ఎందుకంటే టీచర్లు అయితే నిమిత్తముగా ఉన్నారు కదా! కానీ సంకల్పాలలో కూడా, మాటలలో కూడా మరియు ఎవరి సంబంధములోనైనా, సంపర్కములోనైనా, కర్మలలోనూ, ప్రతి మాటలోనూ నిర్మానము. ఎవరైతే నిర్మానచిత్తులుగా ఉంటారో, వారే నిమిత్త భావములో ఉన్నట్లు. ఎవరైతే నిర్మానచిత్తులుగా ఉండరో, వారిలో కొద్దోగొప్పో సూక్ష్మంగానైనా, పెద్ద రూపములోనైనా అభిమానం లేకపోయినా సరే అధికార దర్పమైతే ఉంటుంది. ఈ అధికార దర్పము, ఇది కూడా అభిమానము యొక్క అంశమే. మరియు మాటలలో సదా నిర్మల భాషులు, మధుర భాషులుగా ఉంటారు. సంబంధ-సంపర్కాలలో ఆత్మిక రూపపు స్మృతి ఉంటే సదా నిరాకారిగా మరియు నిరహంకారిగా ఉంటారు. బ్రహ్మాబాబా యొక్క చివరి మూడు మాటలు గుర్తుంటాయా? ఎవరైతే నిరాకారులో, నిరహంకారులో, వారే నిర్వికారులు. అచ్ఛా, ఫాలో ఫాదర్. ఇది పక్కాయే కదా!

రాబోయే సంవత్సరము యొక్క ముఖ్య లక్ష్య స్వరూపపు స్మృతి ఏమిటంటే - నిరాకారి, నిరహంకారి, నిర్వికారి అనే ఈ మూడు పదాలు. అంశము కూడా ఉండకూడదు. పెద్ద రూపములోనూ, స్థూల రూపములోనూ బాగైపోయాయి కానీ అంశము కూడా ఉండకూడదు ఎందుకంటే అంశమే మోసం చేస్తుంది. ఫాలో ఫాదర్ అంటే అర్థమే ఈ మూడు పదాలను సదా స్మృతిలో ఉంచుకోవాలి. సరేనా? అచ్ఛా!

డబుల్ విదేశీయులు లేచి నిలబడండి - మంచి గ్రూపు వచ్చింది. బాప్ దాదాకు డబుల్ విదేశీయులకు చెందిన ఒక విషయములో సంతోషముగా ఉంది, అది ఏమిటో తెలుసా? చూడండి, ఎంత దూరదేశము నుండి వస్తారు, ఈ టర్నులో కూడా రావాలి అన్న డైరెక్షన్ లభించేటప్పటికి చేరుకున్నారు కదా. ఏదో ఒక విధంగా పురుషార్థం చేసి పెద్ద గ్రూపే చేరుకున్నారు. దాదీ డైరెక్షన్ ను బాగా గౌరవించారు కదా! అందుకు అభినందనలు. బాప్ దాదా ఒక్కొక్కరినీ చూస్తున్నారు, దృష్టి ఇస్తున్నారు. స్టేజిపై మాత్రమే దృష్టి లభిస్తుంది అని కాదు, దూరం నుండి ఇంకా బాగా కనిపిస్తుంది. డబుల్ విదేశీయులు హాజీ అన్న పాఠాన్ని చాలా బాగా చదివారు. బాప్ దాదాకు డబుల్ విదేశీయులపై ప్రేమ అయితే ఉండనే ఉంది కానీ వారిని చూస్తే గర్వంగా కూడా ఉంటుంది ఎందుకంటే విశ్వములోని మూలమూలలోకి సందేశాన్ని చేర్చేందుకు డబుల్ విదేశీయులే నిమిత్తులుగా అయ్యారు. విదేశాలలో ఇప్పుడు ఏదైనా విశేష స్థానము మిగిలిపోయి ఉందా? చిన్న-చిన్న ఊర్లు మిగిలిపోయాయా లేక విశేష స్థానము మిగిలిపోయి ఉందా? గ్రామాలు, మూలమూలలో ఉన్న చిన్న స్థానాలు మిగిలిపోయాయా లేక విశేష స్థానము మిగిలిపోయి ఉందా? ఏ స్థానము మిగిలిపోయి ఉంది? (మిడిల్ ఈస్ట్ లోని కొన్ని దేశాలు మిగిలి ఉన్నాయి). అయినా కూడా చూడండి, ఈ గ్రూపు ఏదైతే వచ్చిందో, ఇది కూడా ఎన్ని దేశాల నుండి వచ్చిన గ్రూపు? అయినా కూడా బాప్ దాదాకు తెలుసు - విశ్వములోని అనేక రకరకాల దేశాలలో ఆత్మలైన మీరు నిమిత్తులుగా అయ్యారు. బాప్ దాదా ఎప్పుడూ ఏమంటూ ఉంటారంటే - బాబా యొక్క విశ్వ కళ్యాణకారి అన్న టైటిల్ ను డబుల్ విదేశీయులే ప్రత్యక్షము చేసారు. మంచిది. ప్రతి ఒక్కరూ తమ-తమ స్థానాలలో తమ పురుషార్థములో మరియు సేవలో స్వయం ముందుకు వెళ్తున్నారు మరియు సదా ముందుకు వెళ్తూ ఉంటారు. సఫలతా సితారలుగా ఉండనే ఉన్నారు. చాలా మంచిది.

కుమారులతో:- మధుబన్ కుమారులు కూడా ఉన్నారు. కుమారుల సంఖ్య ఎంత ఉందో చూడండి? సగం క్లాస్ అయితే కుమారులదే. కుమారులు ఇప్పుడు సాధారణ కుమారులు కారు. మీరు ఎటువంటి కుమారులు? బ్రహ్మాకుమారులుగా అయితే ఉండనే ఉన్నారు. కానీ బ్రహ్మాకుమారుల విశేషత ఏమిటి? కుమారుల విశేషత ఏమిటంటే - వారు సదా ఎక్కడ అశాంతి ఉన్నా అక్కడ శాంతిని వ్యాపింపచేసే శాంతిదూతలుగా ఉంటారు. మనసులోని అశాంతి ఉండదు, బయటి అశాంతి ఉండదు. కుమారుల పనే కష్టమైన పనులు చెయ్యటము, వారు హార్డ్ వర్కర్ గా (కష్టపడేవారిగా) ఉంటారు కదా! మరి ఈ రోజుల్లో అన్నింటికంటే అత్యంత కష్టతరమైన పని - అశాంతిని తొలగించి శాంతిదూతగా అయ్యి శాంతిని వ్యాపింపజేయటము. అటువంటి కుమారులే కదా? విశ్వములోనూ, అలాగే మీ సంబంధ-సంపర్కములోనూ అశాంతి యొక్క నామ-రూపాలు కూడా ఉండకూడదు. అటువంటి శాంతిదూతలేనా? ఏ విధంగా అగ్నిమాపకదళం వారు ఎక్కడ నిప్పు అంటుకున్నా, ఆ నిప్పును ఆర్పుతారు కదా. అలాగే శాంతిదూతల కార్యమే అశాంతిని శాంతిలోకి మార్చటము. మరి శాంతిదూతలేనా! పక్కా! పక్కానా? పక్కానా? చాలా బాగా అనిపిస్తుంది. బాప్ దాదా ఇంతమంది కుమారులను చూసి సంతోషిస్తున్నారు. ఇంతకుముందు కూడా బాప్ దాదా ప్లాన్ ఇచ్చారు - ఢిల్లీలో ఎక్కువలో ఎక్కువ కుమారులు ఉన్నారు. గవర్నమెంట్ వారు కుమారులను (యూత్ ను) గొడవ చేసేవారిగా భావిస్తారు, కుమారులకు భయపడతారు. అలా భయపడే గవర్నమెంట్, ప్రతి బ్రహ్మాకుమారునికి శాంతిదూత అన్న టైటిల్ ను ఇచ్చి స్వాగతము పలకాలి, అప్పుడే కుమారుల అద్భుతము ఉంటుంది. బ్రహ్మాకుమారులు శాంతిదూతలు అన్నది మొత్తం ప్రపంచమంతా వ్యాపించాలి. వీలవుతుంది కదా? ఢిల్లీలో చెయ్యాలి. చెయ్యాలి కదా - దాదీలు చేస్తారా? ఒక్క గ్రూపులోనే ఇంతమంది కుమారులు ఉంటే ఇక అన్ని గ్రూపులలో ఎంతమంది ఉండవచ్చు? విశ్వములో ఎంతమంది ఉండవచ్చు? (సుమారుగా ఒక లక్షమంది), మరి కుమారులు అద్భుతము చెయ్యండి. గవర్నమెంట్ వారిలో కుమారుల (యువకుల) పట్ల ఏదైతే చెడు అభిప్రాయము నిండి ఉందో దానిని సదభిప్రాయముగా చెయ్యండి. మనసులో కూడా అశాంతి ఉండకూడదు, సహచరులలో కూడా అశాంతి ఉండకూడదు మరియు మీ స్థానములో కూడా అశాంతి ఉండకూడదు, మీ పట్టణములో కూడా అశాంతి ఉండకూడదు. కుమారుల ముఖముపై బోర్డు తగిలించే అవసరము లేదు కానీ మస్తకముపై - వీరు శాంతిదూత అని ఆటోమేటిక్ గా వ్రాయబడి ఉన్నట్లు అనుభవమవ్వాలి. సరేనా!

కుమారీలతో:- కుమారీలు కూడా చాలా మంది ఉన్నారు. ఈ కుమారీలందరి లక్ష్యము ఏమిటి? ఉద్యోగం చెయ్యాలా లేక విశ్వ సేవ చెయ్యాలా? తలపై కిరీటము పెట్టుకోవాలా లేక తట్టను పెట్టుకోవాలా? ఏం పెట్టుకోవాలి? చూడండి, కుమారీలందరూ దయార్ద్ర హృదయులుగా అవ్వాలి. విశ్వాత్మల కళ్యాణము జరగాలి. 21 కులాలను ఉద్ధరించేవారు అని కుమారీల గురించి గాయనము ఉంది, మరి అర్ధకల్పము అంటే 21 కులాలు అయిపోతుంది. మరి అటువంటి కుమారీలేనా? ఎవరైతే 21 కులాల కళ్యాణము చేస్తారో వారు చేతులెత్తండి. ఒక్క పరివారముది కాదు, 21 పరివారాల కళ్యాణము. చేస్తారా? చూడండి, మీ పేరు నోట్ అవుతుంది మరియు వీరు దయార్ద్ర హృదయులా లేక ఏదైనా లెక్కాచారము ఉందా అన్నదానిని తరువాత చూడటం జరుగుతుంది. సమయము కంటే ముందే తయారైపోండి అని ఇప్పుడు సమయము సూచిస్తుంది. సమయాన్ని చూస్తూ ఉన్నట్లయితే సమయము గడిచిపోతుంది, అందుకే లక్ష్యము పెట్టుకోండి - మేమందరమూ విశ్వ కళ్యాణి, దయార్ద్ర హృదయులైన బాబా పిల్లలము, దయార్ద్ర హృదయులము. సరేనా? దయార్ద్ర హృదయులే కదా! ఇంకా దయార్ద్ర హృదయులుగా అవ్వండి. ఇంకాస్త తీవ్రగతితో అవ్వండి. కుమారీలకైతే బాబా యొక్క సింహాసనము చాలా సహజముగా లభిస్తుంది. కొత్త సంవత్సరములో ఏ అద్భుతాన్ని చేసి చూపిస్తారో చూస్తాము. అచ్ఛా!

మీడియాకు చెందిన 108 మంది రత్నాలు వచ్చారు:- మంచిది, బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాల్సిందే అని అందరి బుద్ధిలోకి రావాలి, మీడియా వారు ఈ అద్భుతాన్ని చేసి చూపించాలి. ఎవ్వరూ వంచితులుగా ఉండిపోకూడదు. మీడియావారి పనే శబ్దాన్ని వ్యాపింపజేయటము. కనుక బాబా నుండి వారసత్వాన్ని తీసుకోండి అన్న ఈ శబ్దాన్ని వ్యాపింపజేయండి. ఎవ్వరూ వంచితులుగా ఉండిపోకూడదు. ఇప్పుడు విదేశాలలో కూడా మీడియా ప్రోగ్రాములు జరుగుతూ ఉంటాయి కదా! మంచిది. రకరకాల రూపాలలో ప్రోగ్రాములు పెట్టినట్లయితే మంచి ఇంటరెస్ట్ కలుగుతుంది. బాగా చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు మరియు సఫలత అయితే ఉండనే ఉంది. అన్ని వర్గాల వారు ఏయే సేవలనైతే చేస్తున్నారో ఆ సమాచారమంతా బాప్ దాదా వద్దకు వస్తుంటుంది. ప్రతి వర్గము వారికీ తమ-తమ సేవా సాధనాలు మరియు సేవ యొక్క రూపురేఖలు ఉన్నాయి కానీ వేరు-వేరు వర్గాలైన కారణముగా ప్రతి వర్గము వారూ ఒకరితో ఒకరు రేస్ కూడా చేస్తుంటారు, మంచిది. ఈర్ష్య పడకండి, రేస్ చేస్తే చెయ్యండి. ప్రతి వర్గము వారి రిజల్టులో, వర్గ సేవ తరువాత ఐ.పి.లు మరియు వి.ఐ.పి.లు సంపర్కములోకి చాలామంది వచ్చారు, ఇప్పుడు మైక్ లను తీసుకురాలేదు కానీ సంబంధ-సంపర్కములోకి వచ్చారు. అచ్ఛా.

బాప్ దాదా యొక్క ఎక్సర్సైజ్ గుర్తుందా? ఇప్పుడిప్పుడే నిరాకారీ, ఇప్పుడిప్పుడే ఫరిశ్తా... ఇదే నడుస్తూ-తిరుగుతూ చేసినట్లయితే బాప్ మరియు దాదాల ప్రేమకు రిటర్న్ ఇచ్చినట్లు. మరి ఇప్పుడిప్పుడే ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ ను చెయ్యండి. క్షణములో నిరాకారీ, క్షణములో ఫరిశ్తా. (బాప్ దాదా డ్రిల్ చేయించారు) అచ్ఛా - నడుస్తూ-తిరుగుతూ చేసే ఈ ఎక్సర్సైజ్ మొత్తము రోజంతటిలో బాబా స్మృతిని సహజంగా కలిగిస్తుంది.

నలువైపులా ఉన్న పిల్లల స్మృతి అన్ని వైపుల నుండి బాప్ దాదాకు చేరుకుంది. మా స్మృతిని ఇవ్వండి, మా స్మృతిని ఇవ్వండి అని పిల్లలు ప్రతి ఒక్కరూ భావిస్తారు. కొందరు ఉత్తరాల ద్వారా పంపిస్తారు, కొందరు కార్డుల ద్వారా, కొందరు నోటి ద్వారా చెప్తారు కానీ బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరినీ నయనాలలో ఇముడ్చుకుంటూ స్మృతికి రెస్పాన్స్ లో పదమాల రెట్ల ప్రియస్మృతులను ఇస్తున్నారు. బాప్ దాదా చూస్తున్నారు, ఇప్పుడు గడియారములో సమయము ఏదైనా కానీ అందరి మనసులో మధుబన్ మరియు మధుబన్ యొక్క బాప్ దాదా ఉన్నారు. అచ్ఛా!

నలువైపులా ఉన్న మూడు సింహాసనాల అధికారులకు, స్వరాజ్య అధికారీ పిల్లలకు, సదా బాప్ దాదాకు రిటర్న్ లో బాబా సమానముగా అయ్యే పిల్లలకు, సదా రిటర్న్ జర్నీ యొక్క స్మృతి స్వరూపులైన పిల్లలకు, సదా సంకల్పాలు, వాణి మరియు కర్మలలో ఫాలో ఫాదర్ చేసే పిల్లలు ప్రతి ఒక్కరికీ బాప్ దాదా యొక్క చాలా, చాలా, చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-
సర్వాత్మలలో తమ శుభ భావన యొక్క బీజాన్ని నాటే మాస్టర్ దాత భవ

ఫలము కోసం ఎదురుచూడకుండా మీరు మీ శుభ భావన యొక్క బీజాన్ని ప్రతి ఆత్మలో నాటుతూ వెళ్ళండి. సమయానికి సర్వాత్మలూ మేల్కొనేదే ఉంది. ఎవరైనా అపోజిషన్ చేసినా కానీ మీరు దయా భావనను వదలకూడదు, ఈ అపోజిషన్, అవమానాలు, నిందలు ఇవన్నీ ఎరువులా పని చేస్తాయి మరియు మంచి ఫలము వెలువడుతుంది. ఎంతగా నిందిస్తారో అంతగా గుణగానం చేస్తారు, అందుకే ప్రతి ఆత్మకు మీ వృత్తి ద్వారా, వైబ్రేషన్ ద్వారా, వాణి ద్వారా మాస్టర్ దాతగా అయ్యి ఇస్తూ వెళ్ళండి.

స్లోగన్:-
సదా ప్రేమ, సుఖము, శాంతి మరియు ఆనంద సాగరములో ఇమిడి ఉండే పిల్లలే సత్యమైన తపస్వీలు.

సూచన:- ఈ రోజు నెలలోని మూడవ ఆదివారం, అంతర్జాతీయ యోగ దివసం. బ్రహ్మా వత్సలలందరూ సంగఠిత రూపంలో సాయంత్రం 6.30 నుండి 7.30 గం. వరకు విశేషంగా వరదాత భాగ్యవిధాత అయిన బాప్ దాదాతో కంబైండ్ స్వరూపంలో స్థితులై అవ్యక్త వతనం నుండి సర్వాత్మలకు సుఖశాంతుల వరదానాన్ని ఇచ్చే సేవ చేయండి.