18-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'


‘‘పితాశ్రీగారి పుణ్య స్మృతి దివసము నాడు ఉదయము క్లాసులో వినిపించేందుకు బాప్ దాదా యొక్క మధురమైన అమూల్యమైన మహావాక్యాలు’’

ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఇప్పుడు పిల్లలైన మీతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, శిక్షణను ఇస్తున్నారు. టీచర్ పని శిక్షణను ఇవ్వటము మరియు గురువు పని గమ్యాన్ని తెలియజేయటము. గమ్యము ముక్తి-జీవన్ముక్తి. ముక్తి కొరకు స్మృతి యాత్ర చాలా తప్పనిసరి మరియు జీవన్ముక్తి కొరకు రచన యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకోవటము తప్పనిసరి. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తవుతుంది, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. స్వయముతో ఇలా మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే చాలా సంతోషము కలుగుతుంది మరియు ఇతరులను కూడా సంతోషములోకి తీసుకువస్తారు. ఇతరులపై కూడా దారిని తెలియజేసే, తమోప్రధానుల నుండి సతోప్రధానులు తయారుచేసే దయ చూపించాలి. బాబా పిల్లలైన మీకు పుణ్యము మరియు పాపము యొక్క లోతైన గతిని కూడా అర్థం చేయించారు. పుణ్యము అంటే ఏమిటి మరియు పాపము అంటే ఏమిటి! అన్నింటికన్నా పెద్ద పుణ్యము - తండ్రిని స్మృతి చెయ్యటము మరియు ఇతరులకు కూడా స్మృతిని కలిగించటము. సెంటరు తెరవటము, తనువు-మనసు-ధనములను ఇతరుల సేవలో వినియోగించడము, ఇది పుణ్యము. సాంగత్య దోషములోకి వచ్చి వ్యర్థ చింతనలో, పరచింతనలో తమ సమయాన్ని పాడు చేసుకోవటము, ఇది పాపము. ఒకవేళ ఎవరైనా పుణ్యము చేస్తూ-చేస్తూ పాపము చేసినట్లయితే చేసుకున్న సంపాదన అంతా అంతమైపోతుంది. ఏదైతే పుణ్యము చేసుకున్నారో, అదంతా సమాప్తమైపోతుంది. అప్పుడు జమకు బదులు నష్టము జరుగుతుంది. జ్ఞాన స్వరూప ఆత్మలైన పిల్లలకు పాప కర్మల శిక్ష కూడా 100 రెట్లు ఉంటుంది ఎందుకంటే సద్గురువు యొక్క నిందకులుగా అవుతారు, అందుకే తండ్రి శిక్షణను ఇస్తారు - మధురమైన పిల్లలూ, ఎప్పుడూ కూడా పాప కర్మలు చెయ్యకండి. వికారాల దెబ్బ తినకుండా రక్షించబడి ఉండండి.

తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంది, అలాగే దయ కూడా కలుగుతుంది. తండ్రి అనుభవాన్ని వినిపిస్తారు, ఏకాంతములో కూర్చున్నప్పుడు ముందుగా అనన్యులైన పిల్లలు గుర్తుకొస్తారు. వారు విదేశములో ఉన్నా, మరెక్కడ ఉన్నా సరే గుర్తుకొస్తారు. మంచి సేవాయోగ్యులైన పిల్లలెవరైనా శరీరాన్ని వదిలి వెళ్తే వారి ఆత్మను కూడా గుర్తు చేసుకుని సెర్చ్ లైట్ ఇస్తారు. ఇక్కడ రెండు దీపాలు ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు, రెండు లైట్లు కలిసి ఉన్నారు. వీరిరువురూ శక్తివంతమైన లైట్లు. ఉదయము సమయము మంచిది, స్నానము చేసి ఏకాంతములోకి వెళ్ళిపోవాలి. లోపల సంతోషము కూడా చాలా ఉండాలి.

అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు ఇలా అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను మరియు మీ ఇంటిని స్మృతి చెయ్యండి. పిల్లలూ, ఈ స్మృతి యాత్రను ఎప్పుడూ మర్చిపోకండి. స్మృతితోనే మీరు పావనముగా అవుతారు. పావనముగా అవ్వకుండా మీరు తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ముఖ్యమైనవి జ్ఞానము మరియు యోగము. తండ్రి వద్ద ఈ అతి పెద్ద ఖజానాయే ఉంది, ఇది పిల్లలకు ఇస్తారు, ఇందులో యోగము అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. పిల్లలు మంచిగా స్మృతి చేస్తే తండ్రి స్మృతి కూడా పిల్లల స్మృతితో కలుస్తుంది. స్మృతి ద్వారా పిల్లలు తండ్రిని ఆకర్షిస్తారు. చివరిలో రాబోయే పిల్లలెవరైతే ఉన్నత పదవిని పొందుతారో, దానికి ఆధారము కూడా స్మృతియే. వారు ఆకర్షిస్తారు. బాబా, దయ చూపించండి, కృప చూపించండి అని అంటారు కదా, ఇందులో కూడా ముఖ్యముగా కావాల్సింది స్మృతి. స్మృతి ద్వారానే కరెంట్ లభిస్తూ ఉంటుంది, దీని ద్వారా ఆత్మ ఆరోగ్యముగా అవుతుంది, నిండుగా అవుతుంది. ఎప్పుడైనా తండ్రి ఏ పిల్లలకైనా కరెంటు ఇవ్వాల్సి ఉంటే అప్పుడు బాబాకు నిద్ర కూడా తేలిపోతుంది. ఫలానావారికి కరెంటు ఇవ్వాలి అన్న చింతే ఉంటా ఉంటుంది. కరెంట్ లభించటము ద్వారా ఆయువు పెరుగుతుందని, సదా ఆరోగ్యవంతులుగా అవుతారని మీకు తెలుసు. ఒక చోట కూర్చునే స్మృతి చేయాలని కూడా కాదు. తండ్రి అర్థం చేయిస్తారు - నడుస్తూ, తిరుగుతూ, భోజనం చేస్తూ, కార్యాలు చేస్తూ కూడా తండ్రిని స్మృతి చెయ్యండి. ఇతరులకు కరెంటు ఇచ్చేది ఉంటే రాత్రి కూడా మేల్కోండి. ఉదయాన్నే లేచి ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఆకర్షణ కలుగుతుంది అని పిల్లలకు అర్థం చేయించారు. తండ్రి కూడా సెర్చ్ లైట్ ఇస్తారు. ఆత్మను గుర్తు చెయ్యటము అనగా సెర్చ్ లైట్ ఇవ్వటము, ఇక దానిని కృప అనండి, ఆశీర్వాదము అనైనా అనండి.

ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా అని పిల్లలైన మీకు తెలుసు. ఇది గెలుపు-ఓటముల ఆట. ఏదైతే జరుగుతుందో అది సరైనదే. క్రియేటర్ కు డ్రామా తప్పకుండా ఇష్టమనిపిస్తుంది కదా. మరి క్రియేటర్ పిల్లలకు కూడా అది ఇష్టమనిపిస్తుంది. ఈ డ్రామాలో తండ్రి ఒకే ఒక్క సారి పిల్లల వద్దకు హృదయపూర్వకముగా, ప్రాణప్రదముగా, ఎంతో ప్రేమతో సేవ చేయడానికి వస్తారు. తండ్రికైతే పిల్లలందరూ ప్రియమైనవారే. సత్యయుగములో కూడా అందరూ ఒకరినొకరు చాలా ప్రేమిస్తారు అని మీకు తెలుసు. జంతువులలో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమగా ఉండని జంతువు ఒక్కటి కూడా ఉండదు. కావున పిల్లలైన మీరు ఇక్కడ మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఇక్కడ తయారైనట్లయితే ఆ సంస్కారము అవినాశీగా అయిపోతుంది. తండ్రి అంటారు, కల్పపూర్వములానే, సరిగ్గా అలాగే మళ్ళీ ప్రియమైనవారిగా తయారుచేయడానికి వచ్చాను. ఎప్పుడైనా ఏ పిల్లలదైనా కోపము చేస్తున్న శబ్దము వింటే తండ్రి ఈ విధంగా శిక్షణ ఇస్తారు - పిల్లలూ, కోపము చేయటము మంచిది కాదు, దాని వలన మీరు కూడా దుఃఖితులవుతారు, ఇతరులను కూడా దుఃఖితులుగా చేస్తారు. తండ్రి సదా కాలము కొరకు సుఖాన్ని ఇస్తారు, కనుక పిల్లలు కూడా తండ్రి సమానముగా అవ్వాలి. ఒకరికొకరు ఎప్పుడూ దుఃఖాన్ని ఇచ్చుకోకూడదు. చాలా చాలా లవ్లీగా (ప్రియమైనవారిగా) అవ్వాలి. ప్రియమైన బాబాను చాలా ప్రేమగా స్మృతి చేసినట్లయితే తమ కళ్యాణాన్ని కూడా మరియు ఇతరుల కళ్యాణాన్ని కూడా చేస్తారు.

ఇప్పుడు విశ్వాధిపతి మీ వద్దకు అతిథిగా అయ్యి వచ్చారు. పిల్లలైన మీ సహయోగము ద్వారానే విశ్వ కళ్యాణము జరగనున్నది. ఏ విధముగానైతే ఆత్మిక పిల్లలైన మీకు తండ్రి అతి ప్రియమైనవారిగా అనిపిస్తారో, అలాగే తండ్రికి కూడా ఆత్మిక పిల్లలైన మీరు చాలా ప్రియమనిపిస్తారు ఎందుకంటే మీరే శ్రీమతము ద్వారా మొత్తము విశ్వానికి కళ్యాణము చేసేవారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఈశ్వరీయ పరివారములో కూర్చున్నారు. తండ్రి సమ్ముఖముగా కూర్చుని ఉన్నారు. నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను... మీకు తెలుసు, శివబాబా వీరిలోకి ప్రవేశించి ఇలా చెప్తారు - మధురమైన పిల్లలూ, దేహ సహితముగా దేహము యొక్క అన్ని సంబంధాలను మర్చిపోయి నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇది అంతిమ జన్మ, ఈ పాత ప్రపంచము, పాత దేహము అంతమైపోనున్నాయి. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచము మరణించినట్లే అన్న నానుడి కూడా ఉంది. పురుషార్థము కొరకు కాస్తంత సంగమ సమయము ఉంది. పిల్లలు అడుగుతారు - బాబా, ఈ చదువు ఎంతవరకు ఉంటుంది! ఎప్పటివరకైతే దైవీ రాజధాని స్థాపన అవుతుందో, అప్పటివరకు వినిపిస్తూ ఉంటాము. ఆ తర్వాత కొత్త ప్రపంచములోకి ట్రాన్స్ఫర్ అవుతారు. బాబా ఎంత నిరహంకారముతో పిల్లలైన మీ సేవ చేస్తారు, మరి పిల్లలైన మీరు కూడా ఇంత సేవ చెయ్యాలి. శ్రీమతముపై నడవాలి. ఎక్కడైనా మీ మతమును చూపించినట్లయితే అదృష్టానికి అడ్డు గీత పడిపోతుంది. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము. మీరు బ్రహ్మా సంతానమైన సోదరీ-సోదరులు, ఈశ్వరీయ మనవలు, మనవరాళ్లు, వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఎంతగా పురుషార్థము చేస్తారో అంతగా పదవిని పొందుతారు. ఇందులో సాక్షీగా ఉండేందుకు కూడా చాలా అభ్యాసము కావాలి. తండ్రి యొక్క మొదటి ఆజ్ఞ - అశరీరీ భవ, దేహీ-అభిమానీ భవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి, అప్పుడే ఆత్మలో మలినాలు ఏవైతే చేరాయో అవి తొలగిపోతాయి, సత్యమైన బంగారముగా అయిపోతారు. పిల్లలైన మీరు అధికారముతో ఇలా అనగలరు - బాబా, ఓ మధురమైన బాబా, మీరు నన్ను మీ వారిగా చేసుకుని అంతా వారసత్వముగా ఇచ్చేసారు. ఈ వారసత్వాన్ని ఎవ్వరూ లాక్కోలేరు, పిల్లలైన మీకు ఇంతగా నషా ఉండాలి. మీరే అందరికీ ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేసే లైట్ హౌస్ లు, లేస్తూ-కూర్చుంటూ, నడుస్తూ-తిరుగుతూ మీరు లైట్ హౌస్ గా అయ్యి ఉండండి.

తండ్రి అంటారు, పిల్లలూ, ఇప్పుడు సమయము చాలా తక్కువగా ఉంది. ఇలా అంటూ ఉంటారు కూడా - ఒక్క ఘడియ, అర్ధ ఘడియ... ఎంత వీలైతే అంత ఒక్క తండ్రినే స్మృతి చెయ్యటములో నిమగ్నమైపోండి మరియు చార్టును పెంచుకుంటూ ఉండండి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే, లక్కీ మరియు లవ్లీ జ్ఞాన సితారలకు మాతా-పిత బాప్ దాదా యొక్క హృదయపూర్వకమైన, ప్రాణప్రదమైన, ప్రేమతో కూడిన ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

అవ్యక్త మహావాక్యాలు - నిరంతర యోగీగా అవ్వండి

ఏ విధముగా ఒక్క సెకండులో స్విచ్ ను ఆన్ మరియు ఆఫ్ చెయ్యటము జరుగుతుందో, అదే విధముగా ఒక్క సెకండులో శరీరము యొక్క ఆధారాన్ని తీసుకున్నారు మరియు మళ్ళీ ఒక్క సెకండులో శరీరము నుండి అతీతముగా అశరీరీ స్థితిలో స్థితులైపోండి. ఇప్పుడిప్పుడే శరీరములోకి రావడము, మళ్ళీ ఇప్పుడిప్పుడే అశరీరిగా అవ్వడము, ఈ అభ్యాసము చెయ్యాలి, దీనినే కర్మాతీత అవస్థ అని అనడం జరుగుతుంది. ఎలా అయితే ఏదైనా వస్త్రాన్ని ధరించటము లేక ధరించకపోవటము అనేది మన చేతుల్లో ఉంటుంది, అవసరమైనప్పుడు ధరిస్తాము, అవసరము లేనప్పుడు తీసేస్తాము, అటువంటి అనుభవమే ఈ శరీరము రూపీ వస్త్రాన్ని ధరించటము మరియు తీసెయ్యటములో ఉండాలి. కర్మ చేస్తూ కూడా ఎటువంటి అనుభవము ఉండాలంటే - వస్త్రాన్ని ధరించి కార్యము చేస్తున్నాము, కార్యము పూర్తయిపోయిన తర్వాత వస్త్రము నుండి అతీతముగా అయిపోయాము. శరీరము మరియు ఆత్మ, ఈ రెండింటి యొక్క అతీతత్వము నడుస్తూ-తిరుగుతూ కూడా అనుభవమవ్వాలి. ఎలాగైతే ఏదైనా అభ్యాసమైపోతుంది కదా, అలా అన్నమాట. కానీ ఈ అభ్యాసము ఎవరికి అవ్వగలదు? ఎవరైతే శరీరము నుండి మరియు శరీరానికి సంబంధించి ఏ విషయాలైతే ఉంటాయో వాటి నుండి, శారీరక ప్రపంచము, సంబంధాలు మరియు అనేక వస్తువులేవైతే ఉన్నాయో వాటి నుండి పూర్తిగా డిటాచ్ గా ఉంటారో, కొద్దిగా కూడా ఆకర్షణ ఉండదో, వారు అతీతముగా అవ్వగలరు. ఒకవేళ సూక్ష్మముగా సంకల్పములోనైనా తేలికతనము లేకపోతే, డిటాచ్ అవ్వలేకపోతే, అతీతత్వాన్ని అనుభవము చేయలేరు. మరి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ అభ్యాసము చెయ్యాలి, పూర్తిగా అతీతత్వము అనుభవమవ్వాలి. ఈ స్థితిలో ఉండటము ద్వారా ఇతర ఆత్మలకు కూడా మీ ద్వారా అతీతత్వము అనుభవము అవుతుంది, వారు కూడా అనుభూతి చెందుతారు. ఉదాహరణకు యోగములో కూర్చున్న సమయములో - ఈ డ్రిల్ చేయిస్తున్నవారు అతీతమైన అవస్థలో ఉన్నారు అని చాలామంది ఆత్మలకు అనుభవమవుతుంది కదా, అలా నడుస్తూ-తిరుగుతూ ఫరిశ్తా స్థితి యొక్క సాక్షాత్కారము కలుగుతుంది. ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా అనేక ఆత్మలకు, ఎవరైతే మీ సత్యయుగ కుటుంబములో సమీపముగా వచ్చేవారు ఉంటారో, వారికి మీ ఫరిశ్తా రూపము మరియు భవిష్య రాజ్య పదవి రూపము, రెండూ కలిసి సాక్షాత్కారమవుతాయి. ఎలా అయితే ప్రారంభములో బ్రహ్మాలో సంపూర్ణ స్వరూపము మరియు శ్రీకృష్ణని స్వరూపము, రెండూ కలిపి సాక్షాత్కారమయ్యేవో, అలా ఇప్పుడు వారికి మీ డబుల్ రూపము యొక్క సాక్షాత్కారము కలుగుతుంది. నంబరువారుగా ఈ అతీతమైన స్థితికి చేరుకునే కొద్దీ, మీది కూడా ఈ డబుల్ సాక్షాత్కారము కలుగుతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా అభ్యాసమైపోతే ఇక్కడ నుండి, అక్కడ నుండి ఇక ఈ సమాచారమే రావటము మొదలవుతుంది. ఎలా అయితే ప్రారంభములో ఇంట్లో కూర్చుని ఉన్నా కూడా సమీపముగా వచ్చే అనేక ఆత్మలకు సాక్షాత్కారము కలిగింది కదా, అలాగే ఇప్పుడు కూడా సాక్షాత్కారమవుతుంది. ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా అనంతములో మీ సూక్ష్మ స్వరూపము సేవ చేస్తుంది. ఇప్పుడు ఈ సేవయే మిగిలి ఉంది. సాకారములోనైతే అందరూ ఉదాహరణను చూసారు. అన్ని విషయాలు నంబరువారుగా డ్రామానుసారముగా జరిగేది ఉంది. ఎంతెంతగా స్వయం ఆకారీ ఫరిశ్తా స్వరూపములో ఉంటారో, అంతగానే మీ ఫరిశ్తా రూపము సేవ చేస్తుంది. ఆత్మకు మొత్తము విశ్వాన్ని తిరగటానికి ఎంత సమయము పడుతుంది? కావున ఇప్పుడు మీ సూక్ష్మ స్వరూపము కూడా సేవ చేస్తుంది, కానీ ఎవరైతే ఈ అతీతమైన స్థితిలో ఉంటారో వారి విషయములో. స్వయం ఫరిశ్తా రూపములో స్థితులవుతారు. ప్రారంభములో అన్ని సాక్షాత్కారాలు కలిగాయి. ఫరిశ్తా రూపములో సంపూర్ణ స్థితి మరియు పురుషార్థీ స్థితి, రెండూ వేరువేరుగా సాక్షాత్కారమయ్యేవి. ఎలా అయితే సాకార బ్రహ్మా మరియు సంపూర్ణ బ్రహ్మా యొక్క సాక్షాత్కారము వేరువేరుగా జరిగేదో, అలా అనన్యులైన పిల్లల సాక్షాత్కారము కూడా కలుగుతుంది. హంగామా జరిగినప్పుడు సాకార శరీరము ద్వారానైతే ఏమీ చేయలేరు మరియు ప్రభావము కూడా ఈ సేవ ద్వారా పడుతుంది. ఏ విధముగా ప్రారంభములో కూడా సాక్షాత్కారము ద్వారానే ప్రభావము పడింది కదా. పరోక్ష అపరోక్ష అనుభవమనేది ప్రభావము చూపింది. అలాగే అంతిమములో కూడా ఈ సేవే జరిగేది ఉంది. మీ సంపూర్ణ స్వరూపము యొక్క సాక్షాత్కారము మీది మీకు కలుగుతుందా? ఇప్పుడు శక్తులను పిలవటము మొదలైపోయింది. ఇప్పుడు పరమాత్మను తక్కువగా పిలుస్తారు, శక్తులను పిలవటము తీవ్ర వేగముతో మొదలైపోయింది. కనుక ఇటువంటి అభ్యాసాన్ని మధ్యమధ్యలో చెయ్యాలి. అలవాటైపోతే చాలా ఆనందము అనుభవమవుతుంది. ఒక్క సెకండులో ఆత్మ శరీరము నుండి అతీతమైపోతుంది, అభ్యాసమైపోతుంది. ఇప్పుడు ఈ పురుషార్థమే చెయ్యాలి.

వర్తమాన సమయములో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వ శక్తులను నింపే అవసరము ఉంది, అప్పుడు మగ్న అవస్థ ఉంటుంది మరియు విఘ్నాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే ఆత్మికత వైపు ఫోర్సు తగ్గుతుందో, అప్పుడు విఘ్నాల అల వస్తుంది. కనుక వర్తమాన సమయములో శివరాత్రి సేవకంటే ముందు స్వయములో శక్తిని నింపుకునే ఫోర్సు కావాలి. యోగము యొక్క ప్రోగ్రాములను పెడతారు కానీ యోగము ద్వారా శక్తులను అనుభవము చెయ్యటము, చేయించటము, ఇప్పుడు ఈ క్లాసుల అవసరము ఉంది. ప్రాక్టికల్ గా మీ బలము ఆధారముగా ఇతరులకు బలాన్ని ఇవ్వాలి. కేవలము బయటి సేవల ప్లాన్ల గురించే ఆలోచించటము కాదు, కానీ అన్ని వైపులా పూర్తి దృష్టి ఉండాలి. నిమిత్తముగా ఉన్నవారికి - మా పూలతోట ఏ విషయములో బలహీనముగా ఉంది అన్న ఆలోచన రావాలి. ఏ విధముగానైనా సరే తమ పూలతోట యొక్క బలహీనతపై కఠినమైన దృష్టిని పెట్టాలి. సమయాన్ని కేటాయించి మరీ బలహీనతలను అంతము చేయాలి.

సాకార రూపములో చూసారు, ఏదైనా అటువంటి అల వచ్చిన సమయములో, రాత్రింబవళ్ళు సకాష్ ను ఇచ్చే విశేష సేవ, విశేష ప్లాన్లు జరిగేవి. నిర్బల ఆత్మలలో బలాన్ని నింపే విశేష అటెన్షన్ ఉండేది, దీని ద్వారా అనేక ఆత్మలకు అనుభవము కూడా కలుగుతుండేది. రాత్రికి రాత్రి కూడా సమయాన్ని కేటాయించి ఆత్మలలో సకాష్ ను నింపే సేవ జరిగేది. కనుక ఇప్పుడు విశేష సకాష్ ను ఇచ్చే సేవ చేయాలి. లైట్ హౌస్, మైట్ హౌస్ గా అయ్యి ఈ సేవను ప్రత్యేకముగా చేయాలి, అప్పుడు నలువైపులా లైట్, మైట్ ప్రభావము వ్యాపిస్తుంది. ఇప్పుడు ఇదే అవసరము. ఎలాగైతే ఎవరైనా షావుకారు ఉంటే తన సమీప సంబంధీకులకు సహాయాన్ని అందించి వారిని పైకి లేపుతారో, అలా వర్తమాన సమయములో బలహీన ఆత్మలు ఎవరైతే సంపర్క, సంబంధములో ఉన్నారో, వారికి విశేష సకాష్ ను ఇవ్వాలి. అచ్ఛా!

వరదానము:-
వేయి భుజాల కల బ్రహ్మాబాబా యొక్క తోడును నిరంతరము అనుభవము చేసే సత్యమైన స్నేహీ భవ

వర్తమాన సమయములో వేయి భుజాల కల బ్రహ్మాబాబా రూపము యొక్క పాత్ర నడుస్తుంది. ఏ విధముగా ఆత్మ లేకుండా భుజాలు ఏమీ చెయ్యలేవో, అలాగే బాప్ దాదా లేకుండా భుజాల రూపీ పిల్లలు ఏమీ చెయ్యలేరు. ప్రతి కార్యములో మొదట తండ్రి సహయోగము ఉంది. ఎప్పటివరకైతే స్థాపన యొక్క పాత్ర ఉంటుందో, అప్పటివరకు బాప్ దాదా పిల్లల ప్రతి సంకల్పములో మరియు ప్రతి క్షణములో తోడు-తోడుగా ఉంటారు, అందుకే ఎప్పుడూ వియోగమనే పరదాను వేసి వియోగులుగా అవ్వకండి. ప్రేమసాగరుని అలల్లో తేలియాడండి, గుణగానము చెయ్యండి, అంతేకానీ దెబ్బ తినకండి. తండ్రి పట్ల ఉన్న స్నేహానికి ప్రత్యక్ష స్వరూపముగా సేవ పట్ల స్నేహీగా అవ్వండి.

స్లోగన్:-
అశరీరీ స్థితి యొక్క అనుభవము మరియు అభ్యాసమే ముందు నంబరులోకి వచ్చేందుకు ఆధారము.

మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ను ఇచ్చే సేవ చేయండి

నిత్యం, ప్రతి ఆత్మ పట్ల మనసు అనేది స్వతహాగానే శుభభావన మరియు శుభకామనలతో కూడిన శుద్ధమైన వైబ్రేషన్లు కలదిగా స్వయానికి మరియు ఇతరులకు అనుభవమవ్వాలి. మనసు నుండి నిత్యం సర్వాత్మల పట్ల ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. మనసు సదా ఈ సేవలోనే బిజీగా ఉండాలి. ఏ విధంగా వాచా సేవలో బిజీగా ఉండటములో అనుభవజ్ఞులుగా అయిపోయారు, ఒకవేళ సేవ లభించకపోతే స్వయాన్ని ఖాళీగా ఉన్నట్లు అనుభవం చేస్తారు, అలా నిత్యం వాణితో పాటు మనసా సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి.