18-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీపై మీరు దయ చూపించుకోండి, తండ్రి ఏ మతాన్ని అయితే ఇస్తారో దానిపై నడుచుకున్నట్లయితే అపారమైన సంతోషము ఉంటుంది, మాయ శాపము నుండి రక్షించబడి ఉంటారు’’

ప్రశ్న:-
మాయ శాపము ఎందుకు తగులుతుంది? శ్రాపించబడిన ఆత్మ యొక్క గతి ఏమవుతుంది?

జవాబు:-
1. తండ్రిని మరియు చదువును (జ్ఞాన రత్నాలను) అగౌరవపరచడము ద్వారా, తమ స్వంత మతముపై నడుచుకోవడము ద్వారా మాయ శాపము తగులుతుంది, 2. ఆసురీ నడవడిక ఉన్నట్లయితే, దైవీ గుణాలను ధారణ చేయనట్లయితే స్వయముపై నిర్దయులుగా ఉన్నట్లు. ఇక బుద్ధికి తాళము పడిపోతుంది. వారు తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు.

ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు - మేము ఆత్మాభిమానులుగా అవ్వాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి అన్న నిశ్చయమైతే ఇప్పుడు ఉంది. మాయా రూపీ రావణుడు శ్రాపితులుగా, దుఃఖితులుగా చేస్తాడు. శాపము అన్న పదమే దుఃఖానికి సంబంధించినది, వారసత్వము అన్న పదము సుఖానికి సంబంధించినది. ఏ పిల్లలైతే విశ్వాసపాత్రులుగా, ఆజ్ఞాకారులుగా ఉంటారో, వారికి బాగా తెలుసు. ఎవరైతే ఆజ్ఞాకారులుగా ఉండరో, వారు అసలు పిల్లలే కారు. వారు స్వయాన్ని ఏమనుకున్నా కానీ తండ్రి హృదయాన్ని మాత్రము అధిరోహించలేరు, వారసత్వాన్ని పొందలేరు. ఎవరైతే మాయ చెప్పినట్లు నడుచుకుంటారో మరియు తండ్రిని స్మృతి కూడా చేయరో, వారు ఎవరికీ అర్థం చేయించలేరు అనగా వారు తమను తామే శ్రాపితులుగా చేసుకుంటారు. మాయ చాలా శక్తివంతమైనదని అని పిల్లలకు తెలుసు. ఒకవేళ అనంతమైన తండ్రి చెప్పింది కూడా వినడం లేదంటే ఇక వారు మాయది వింటున్నట్లు. మాయకు వశమైపోతారు. ప్రభువు ఆజ్ఞను శిరస్సుపై పెట్టుకోవాలి - అన్న నానుడి ఉంది కదా. కావున తండ్రి అంటారు - పిల్లలూ, పురుషార్థము చేసి తండ్రిని స్మృతి చేసినట్లయితే మాయ ఒడిలో నుండి బయటకు వచ్చి ప్రభువు ఒడిలోకి వచ్చేస్తారు. తండ్రి అయితే వివేకవంతులకే వివేకవంతుడు. తండ్రి చెప్పినట్లుగా వినకపోతే బుద్ధికి తాళము పడిపోతుంది. తాళాన్ని తెరిచేవారు ఒక్క తండ్రియే. శ్రీమతముపై నడవకపోతే వారి పరిస్థితి ఏమవుతుంది. మాయ మతముపై ఏ పదవినీ పొందలేరు. వారు విన్నా కానీ ధారణ చేయలేకపోతే మరియు చేయించలేకపోతే ఇక వారి పరిస్థితి ఏమవుతుంది! తండ్రి అయితే పేదల పాలిటి పెన్నిధి. మనుష్యులు పేదవారికి దానము చేస్తారు. తండ్రి కూడా వచ్చి ఎంతటి అనంతమైన దానము చేస్తారు. ఒకవేళ శ్రీమతముపై నడవకపోతే బుద్ధికి పూర్తిగా తాళము పడిపోతుంది. ఇకప్పుడు వారు ఏ ప్రాప్తిని పొందుతారు! శ్రీమతముపై నడిచేవారే తండ్రి పిల్లలు. తండ్రి అయితే దయార్ద్ర హృదయులు. బయటికి వెళ్ళడముతోనే మాయ ఒక్కసారిగా అంతము చేసేస్తుందని అర్థం చేసుకుంటారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వారు స్వయాన్ని సర్వనాశనము చేసుకున్నట్లు. తండ్రి అయితే అర్థం చేయిస్తూ ఉంటారు - మీపై మీరు దయ చూపించుకోండి, శ్రీమతముపై నడవండి, మీ స్వంత మతముపై నడవకండి. శ్రీమతముపై నడవడము ద్వారా సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కుతుంది. లక్ష్మీ-నారాయణుల ముఖము చూడండి, వారు ఎంత సంతోషముగా ఉంటారు. కావున పురుషార్థము చేసి ఇటువంటి ఉన్నత పదవిని పొందాలి కదా. తండ్రి అవినాశీ జ్ఞాన రత్నాలను ఇస్తున్నప్పుడు మరి వాటిని ఎందుకు అగౌరవపరచాలి. రత్నాలతో జోలెను నింపుకోవాలి. వినడమైతే వింటారు కానీ జోలెను నింపుకోరు ఎందుకంటే తండ్రిని స్మృతి చేయరు. ఆసురీ నడవడిక నడుచుకుంటారు. తండ్రి పదే-పదే అర్థం చేయిస్తూ ఉంటారు - స్వయంపై దయ చూపించుకోండి, దైవీ గుణాలను ధారణ చేయండి. అక్కడ ఉన్నదే ఆసురీ సాంప్రదాయము. దానిని తండ్రి వచ్చి పరిస్తాన్ గా తయారుచేస్తారు. పరిస్తాన్ అని స్వర్గాన్ని అంటారు. మనుష్యులు ఎన్ని ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. సన్యాసులు మొదలైనవారి వద్దకు వెళ్తారు, మనసుకు శాంతి లభిస్తుందని భావిస్తారు. వాస్తవానికి ఆ మాటే తప్పు, దానికి అర్థమేమీ లేదు. శాంతి అనేది ఆత్మకు కావాలి కదా. ఆత్మ స్వయం శాంతి స్వరూపము. ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది అని కూడా వారు అనరు. మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు. ఇప్పుడు మనసు అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఏమీ తెలియదు. ఏదైతే చెప్తారో లేక చేస్తారో అదంతా భక్తి మార్గము. భక్తి మార్గమువారు మెట్లు కిందకు దిగుతూ-దిగుతూ తమోప్రధానముగా అవుతూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా చాలా ధనము, సంపద మొదలైనవి ఉన్నా కానీ వారు ఉన్నదైతే ఎంతైనా రావణ రాజ్యములోనే కదా.

పిల్లలైన మీరు చిత్రాలపై అర్థం చేయించేందుకు కూడా చాలా బాగా అభ్యాసము చేయాలి. తండ్రి అన్ని సెంటర్ల పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు, నంబరువారుగానైతే ఉన్నారు కదా. కొంతమంది పిల్లలు రాజ్యపదవిని పొందే పురుషార్థము చేయకపోతే ఇక ప్రజల్లోకి వెళ్ళి ఏం పదవిని పొందుతారు! సేవ చేయరు, నేను ఏం పదవి పొందుతాను అని తమపై తమకు దయ కలగదు. ఇక అప్పుడు డ్రామాలో వీరి పాత్ర ఇంతే అని భావించడం జరుగుతుంది. తమ కళ్యాణము చేసుకునేందుకు జ్ఞానముతో పాటుగా యోగము కూడా ఉండాలి. యోగములో ఉండకపోతే ఏ కళ్యాణమూ జరగదు. యోగము లేకుండా పావనముగా అవ్వలేరు. జ్ఞానమైతే చాలా సహజము కానీ తమ కళ్యాణము కూడా చేసుకోవాలి. యోగములో ఉండకపోతే ఏ కళ్యాణమూ జరగదు. యోగము లేకుండా పావనముగా ఎలా అవుతారు? జ్ఞానము వేరు, యోగము వేరు. యోగములో చాలా అపరిపక్వముగా ఉన్నారు. స్మృతి చేయాలి అనే తెలివి కూడా ఉండదు. మరి స్మృతి లేకుండా వికర్మలు ఎలా వినాశనమవుతాయి. అప్పుడిక శిక్షలు ఎంతగానో అనుభవించవలసి ఉంటుంది, ఎంతో పశ్చాత్తాప పడవలసి ఉంటుంది. ఆ స్థూల సంపాదన చేసుకోనంత మాత్రాన ఏ శిక్షలు అనుభవించరు, ఇక్కడైతే పాపాల భారము తలపై ఉంది, వాటికి ఎన్నో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పిల్లలుగా అయి అమర్యాదపూర్వకముగా ఉన్నట్లయితే ఎన్నో శిక్షలు లభిస్తాయి. తండ్రి అయితే అంటారు - మీపై మీరు దయ చూపించుకోండి, యోగములో ఉండండి. లేకపోతే అనవసరముగా మిమ్మల్ని మీరు హతమార్చుకుంటారు. ఉదాహరణకు ఎవరైనా పై నుండి క్రిందకు పడితే, వారు మరణించకపోతే, హాస్పిటల్ లో పడి ఉంటారు, ఆర్తనాదము చేస్తూ ఉంటారు. అనవసరముగా స్వయాన్ని గాయపరుచుకున్నారు, మరణించలేదు, ఇక వారు దేనికి పనికివస్తారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. ఎక్కడమైతే చాలా పైకి ఎక్కాలి. కానీ శ్రీమతముపై నడవకపోతే కింద పడిపోతారు. మన్ముందు ప్రతి ఒక్కరూ - మేము ఎలా అవ్వబోతున్నాము అంటూ తమ పదవిని చూసుకుంటారు. ఎవరైతే సేవాధారులుగా, ఆజ్ఞాకారులుగా ఉంటారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. లేదంటే వెళ్ళి దాస-దాసీలుగా అవుతారు. అప్పుడు వారికి శిక్షలు కూడా చాలా కఠినమైనవి లభిస్తాయి. ఆ సమయములో ఇరువురూ ధర్మరాజు రూపాన్ని ధరిస్తారు. కానీ పిల్లలు అర్థం చేసుకోరు, పొరపాట్లు చేస్తూనే ఉంటారు. శిక్షలైతే ఇక్కడే అనుభవించవలసి ఉంటుంది కదా. ఎవరు ఎంత సేవ చేస్తే అంత మంచిగా ఉంటారు. లేకపోతే ఎందుకూ పనికిరారు. తండ్రి అంటారు, ఇతరుల కళ్యాణము చేయలేకపోతే కనీసము మీ కళ్యాణమునైనా చేసుకోండి. బంధనములో ఉన్నవారు కూడా తమ కళ్యాణము చేసుకుంటూ ఉంటారు. అయినా తండ్రి పిల్లలకు - జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ అంటారు. నామ-రూపాలలో చిక్కుకోవడం వలన మాయ ఎంతో మోసం చేస్తుంది. బాబా, ఫలానా ఆమెను చూస్తే నాకు చెడు సంకల్పాలు నడుస్తున్నాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - కర్మేంద్రియాలతో ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేయకూడదు. నడవడిక బాగాలేని చెడ్డ వ్యక్తి ఎవరైనా ఉంటే, అతడిని సెంటరుకు రానివ్వకూడదు. స్కూల్లో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే ఎన్నో దెబ్బలు తింటాడు. టీచరు అందరిముందు చెప్తారు - ఇతడు ఈ విధంగా తప్పుగా ప్రవర్తించాడు, అందుకే ఇతడిని స్కూల్ నుండి తీసివేయడము జరుగుతోంది అని. మీ సెంటర్లకు కూడా ఇలాంటి చెడు దృష్టి కలిగినవారు వస్తే వారిని పారద్రోలాలి. తండ్రి అంటారు, ఎప్పుడూ చెడు దృష్టి ఉండకూడదు. సేవ చేయటం లేదు, తండ్రిని స్మృతి చేయటం లేదు అంటే తప్పకుండా ఏదో ఒక మాలిన్యము ఉన్నట్లు. ఎవరైతే సేవ చేస్తారో వారి పేరు కూడా ప్రఖ్యాతమవుతుంది. కొద్దిగా సంకల్పాలు నడిచినా, చెడు దృష్టి కలిగినా, మాయ దాడి జరుగుతోంది అని అర్థం చేసుకోవాలి, వెంటనే దానిని వదిలేయాలి, లేకపోతే అది వృద్ధి చెంది నష్టపోతారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే రక్షింపబడుతూ ఉంటారు. బాబా పిల్లలందరినీ అప్రమత్తము చేస్తున్నారు - జాగ్రత్తగా ఉండండి, ఎక్కడా మీ కులాన్ని అప్రతిష్ఠపాలు చేయకండి. కొందరు గాంధర్వ వివాహము చేసుకుని కలిసి పవిత్రముగా ఉంటూ పేరును ఎంతో ప్రసిద్ధము చేస్తారు, కానీ కొందరు అశుద్ధము అయిపోతారు. ఇక్కడకు మీరు మీ సద్గతిని చేసుకునేందుకు వచ్చారు, అంతేకానీ దుర్గతిని పొందేందుకు కాదు. అన్నింటికంటే చెడ్డది కామము, ఆ తర్వాత క్రోధము. వచ్చేదేమో తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు, కానీ మాయ దాడి చేసి శాపము ఇస్తుంది, అప్పుడు ఇక ఒక్కసారిగా పడిపోతారు. వారు తమకు తాము శాపము ఇచ్చుకున్నట్లు అవుతుంది. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాంటివారు ఎవరైనా వస్తే వారిని వెంటనే పంపించేయాలి. అమృతము త్రాగేందుకు వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి అసురులుగా అయి అశుద్ధమైన పనులు చేసినట్లుగా చూపిస్తారు కూడా కదా. అటువంటివారు ఇక ఈ జ్ఞానాన్ని వినిపించలేరు. తాళము మూసుకుపోతుంది. తండ్రి అంటారు, మీ సేవలోనే తత్పరులై ఉండాలి. తండ్రి స్మృతిలో ఉంటూ-ఉంటూ చివరికి ఇంటికి వెళ్ళిపోవాలి. రాత్రి ప్రయాణీకుడా అలిసిపోకు... అని ఒక పాట కూడా ఉంది కదా. ఆత్మ ఇంటికి వెళ్ళాలి. ఆత్మయే ప్రయాణీకుడు. ఆత్మకు ప్రతిరోజూ అర్థం చేయించడం జరుగుతుంది - ఇప్పుడు నీవు శాంతిధామానికి వెళ్ళే ప్రయాణీకుడివి, కావున ఇప్పుడు తండ్రిని, ఇంటిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండు. స్వయాన్ని చూసుకోవాలి - మాయ ఎక్కడా మోసమైతే చేయడం లేదు కదా? నేను నా తండ్రిని స్మృతి చేస్తున్నానా?

ఉన్నతోన్నతుడైన తండ్రి వైపే దృష్టి ఉండాలి - ఇది చాలా ఉన్నతమైన పురుషార్థము. తండ్రి అంటారు - పిల్లలూ, చెడు దృష్టిని వదిలేయండి. దేహాభిమానము అనగా చెడు దృష్టి, దేహీ-అభిమానము అనగా శుద్ధమైన దృష్టి. కావున పిల్లల దృష్టి తండ్రి వైపు ఉండాలి. వారసత్వము చాలా ఉన్నతమైనది - విశ్వ రాజ్యాధికారమంటే అది ఏమైనా తక్కువ విషయమా! చదువు ద్వారా మరియు యోగము ద్వారా విశ్వ రాజ్యాధికారము లభించగలదు అని స్వప్నములో కూడా ఎవరికీ ఉండదు. చదువుకుని ఉన్నత పదవిని పొందినట్లయితే తండ్రి కూడా సంతోషిస్తారు, టీచరు కూడా సంతోషిస్తారు, సద్గురువు కూడా సంతోషిస్తారు. స్మృతి చేస్తూ ఉన్నట్లయితే తండ్రి కూడా ప్రేమ చేస్తూ ఉంటారు. తండ్రి అంటారు - పిల్లలూ, ఈ లోపాలను తొలగించి వేయండి. లేదంటే అనవసరముగా పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు. తండ్రి అయితే విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు, సౌభాగ్యాన్ని తెరుస్తారు. భారతవాసులే 100 శాతం సౌభాగ్యశాలురుగా ఉండేవారు, మళ్ళీ వారే 100 శాతం దుర్భాగ్యశాలురుగా అయ్యారు, మళ్ళీ మిమ్మల్ని సౌభాగ్యశాలురుగా తయారుచేసేందుకు చదివించడం జరుగుతుంది.

బాబా అర్థం చేయించారు, ధర్మానికి చెందిన పెద్ద-పెద్ద వారు ఎవరైతే ఉన్నారో, వారు కూడా మీ వద్దకు వస్తారు. యోగము నేర్చుకుని వెళ్తారు. మ్యూజియంకు యాత్రికులు ఎవరైతే వస్తారో, వారికి కూడా - ఇప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకోనున్నాయి అని మీరు అర్థం చేయించవచ్చు. వృక్షము చిత్రముపై ఈ విధంగా అర్థం చేయించండి - చూడండి, మీరు ఫలానా సమయములో వస్తారు, భారతవాసుల పాత్ర ఫలానా సమయములో ఉంది, మీరు ఈ జ్ఞానాన్ని వింటున్నారు, తర్వాత మీ దేశానికి వెళ్ళి చెప్పండి - తండ్రిని స్మృతి చేసినట్లయితే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు అని. యోగము నేర్చుకోవాలని వారు కోరుకుంటారు. హఠయోగులు, సన్యాసులైతే వారికి యోగము నేర్పించలేరు. మీ మిషన్ కూడా విదేశాలకు వెళ్తుంది. అర్థం చేయించడానికి చాలా యుక్తి కావాలి. ధర్మానికి చెందిన పెద్ద-పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు రావలసే ఉంటుంది. మీలో నుండి ఏ ఒక్కరు మంచి రీతిలో ఈ జ్ఞానాన్ని అక్కడికి తీసుకువెళ్ళినా ఆ ఒక్కరి ద్వారా ఎంతోమంది అర్థం చేసుకోగలరు. ఒక్కరి బుద్ధిలోకి వచ్చినా సరే ఇక వార్తాపత్రికలు మొదలైనవాటిలో కూడా ప్రచురిస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. లేదంటే తండ్రిని స్మృతి చేయడము ఎలా నేర్చుకుంటారు. తండ్రి పరిచయమైతే అందరికీ లభించేది ఉంది. ఎవరో ఒకరు వెలువడుతారు. మ్యూజియంకు చాలా పురాతనమైన వస్తువులను చూడడానికి వెళ్తారు. ఇక్కడేమో మీరు చెప్పే ప్రాచీన జ్ఞానాన్ని వింటారు. ఎంతోమంది వస్తారు. వారిలో కొంతమంది బాగా అర్థం చేసుకుంటారు. ఇక్కడి నుండే దృష్టి లభిస్తుంది లేదా ఈ మిషన్ విదేశాలకు వెళ్తుంది. మీరు అంటారు, తండ్రిని స్మృతి చేసినట్లయితే తమ ధర్మములో ఉన్నత పదవిని పొందుతారు. పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ అందరూ కిందకు వచ్చేసారు. కిందకు దిగడము అనగా తమోప్రధానముగా అవ్వడము. పోప్ మొదలైనవారు - తండ్రిని స్మృతి చేయండి అని ఈ విధంగా చెప్పలేరు. తండ్రి గురించి తెలియనే తెలియదు. మీ వద్ద చాలా మంచి జ్ఞానము ఉంది. చిత్రాలు కూడా సుందరమైనవి తయారవుతూ ఉంటాయి. సుందరమైన వస్తువులు ఉన్నట్లయితే మ్యూజియం ఇంకా సుందరముగా ఉంటుంది. చూడడానికి చాలామంది వస్తారు. ఎంత పెద్ద చిత్రాలు ఉంటాయో అంత బాగా అర్థం చేయించగలుగుతారు. మేము ఈ విధంగా అర్థం చేయించాలి అని అభిరుచి ఉండాలి. సదా మీ బుద్ధిలో ఉండాలి - మేము బ్రాహ్మణులుగా అయ్యాము కావున ఎంత సేవ చేస్తే అంత మంచి గౌరవము ఉంటుంది. ఇక్కడ కూడా గౌరవము ఉంటుంది, అలాగే అక్కడ కూడా గౌరవము ఉంటుంది. మీరు పూజ్యులుగా అవుతారు. ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని ధారణ చేయాలి. తండ్రి అయితే అంటారు, సేవలో పరిగెడుతూ ఉండండి. తండ్రి సేవ కొరకు ఎక్కడికి పంపించినా, అందులో కళ్యాణము ఉంది. రోజంతా బుద్ధిలో సేవ గురించిన ఆలోచనలే నడవాలి. విదేశీయులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అతి ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి, ఏ దేహధారిని కూడా గురువుగా చేసుకోవద్దు. సర్వుల సద్గతిదాత ఆ తండ్రి ఒక్కరే. ఇప్పుడు హోల్ సేల్ మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, హోల్ సేల్ మరియు రిటేల్ వ్యాపారము ఉంటుంది కదా. తండ్రి హోల్ సేల్ అయినవారు, వారసత్వాన్ని కూడా హోల్ సేల్ గా ఇస్తారు. 21 జన్మల కొరకు విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోండి. ముఖ్యమైన చిత్రాలు - త్రిమూర్తి, సృష్టి చక్రము, వృక్షము, మెట్ల వరుస, విరాట రూప చిత్రము మరియు గీతా భగవానుడు ఎవరు. గీతా భగవానుడు ఎవరు అనేది ఫస్ట్ క్లాస్ చిత్రము, ఇందులో తండ్రి మహిమ పూర్తిగా ఉంది. తండ్రియే కృష్ణుడిని ఈ విధంగా తయారుచేసారు, ఈ వారసత్వాన్ని గాడ్ ఫాదర్ ఇచ్చారు. కలియుగములో ఎంతోమంది మనుష్యులు ఉన్నారు, సత్యయుగములో కొద్దిమందే ఉన్నారు, ఈ విధంగా ఎవరు పరివర్తన చేసారు? ఇది కొంచెం కూడా ఎవరికీ తెలియదు. యాత్రికులు చాలావరకు పెద్ద-పెద్ద నగరాలకు వెళ్తారు. వారు కూడా వచ్చి తండ్రి పరిచయాన్ని పొందుతారు. సేవా పాయింట్లు అయితే ఎన్నో లభిస్తూ ఉంటాయి. విదేశాలకు కూడా వెళ్ళాలి. ఒకవైపు మీరు తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉంటారు, మరొకవైపు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. సత్యయుగములో కొద్దిమంది మనుష్యులే ఉంటారంటే మరి తప్పకుండా మిగిలినవారందరి వినాశనము జరుగుతుంది కదా. ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికము రిపీట్ అవుతుంది. ఏదైతే గడిచిపోయిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ ఎవరికైనా అర్థం చేయించేందుకు కూడా తెలివి కావాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా ఒక్క తండ్రిపైనే దృష్టిని ఉంచాలి. దేహీ-అభిమానులుగా అయ్యే పురుషార్థము చేసి మాయ మోసము నుండి రక్షించుకోవాలి. ఎప్పుడూ చెడు దృష్టిని ఉంచుకుని తమ కులము యొక్క పేరును అప్రతిష్ఠపాలు చేయకూడదు.

2. సేవ కొరకు పరుగులు పెడుతూ ఉండాలి. సేవాధారులుగా మరియు ఆజ్ఞాకారులుగా అవ్వాలి. తమ మరియు ఇతరుల కళ్యాణము చేసుకోవాలి. ఎటువంటి చెడు నడవడికను నడవకూడదు.

వరదానము:-
ఫుల్ స్టాప్ యొక్క స్టేజ్ ద్వారా ప్రకృతి అలజడిని స్టాప్ చేసే (ఆపు చేసే) మాస్టర్ ప్రకృతిపతి భవ

వర్తమాన సమయము అలజడి పెరిగే సమయము. ఫైనల్ పేపర్ లో ఒకవైపు ప్రకృతి యొక్క మరియు ఇంకొకవైపు పంచ వికారాల యొక్క భయంకరమైన రూపము ఉంటుంది. తమోగుణీ ఆత్మల దాడి మరియు పాత సంస్కారాలు... అన్నీ చివరి సమయములో తమ అవకాశాన్ని తీసుకుంటాయి. అటువంటి సమయములో సర్దుబాటు శక్తి ద్వారా ఇప్పుడిప్పుడే సాకారీ, ఇప్పుడిప్పుడే ఆకారీ మరియు ఇప్పుడిప్పుడే నిరాకారీ స్థితిలో స్థితులయ్యే అభ్యాసము కావాలి. చూస్తూ చూడకండి, వింటూ వినకండి. ఎప్పుడైతే ఇటువంటి ఫుల్ స్టాప్ యొక్క స్టేజ్ ఉంటుందో, అప్పుడు ప్రకృతిపతిగా అయ్యి ప్రకృతి యొక్క అలజడిని ఆపు చేయగలరు.

స్లోగన్:-
నిర్విఘ్న రాజ్యాధికారులుగా అయ్యేందుకు నిర్విఘ్న సేవాధారులుగా అవ్వండి.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

సదా ఇదే స్మృతి ఉండాలి - ఆత్మనైన నేను ఆ సుప్రీమ్ ఆత్మతో కంబైండుగా ఉన్నాను. సుప్రీమ్ ఆత్మ, ఆత్మనైన నేను లేకుండా ఉండలేరు మరియు నేను కూడా సుప్రీమ్ ఆత్మ లేకుండా వేరవ్వలేను. ఇలా ప్రతి క్షణమూ హజూర్ను హాజరై ఉన్నట్లు అనుభవము చెయ్యటం ద్వారా ఆత్మిక సుగంధములో అవినాశీగా మరియు ఏకరసముగా ఉంటారు.