18-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అవగుణాలను తొలగించే పూర్తి పురుషార్థము చేయండి, ఏ గుణంలో లోపము ఉందో, దాని లెక్కాపత్రాన్ని పెట్టుకోండి, గుణాలను దానం చేసినట్లయితే గుణవంతులుగా అవుతారు’’

ప్రశ్న:-
గుణవంతులుగా అవ్వడానికి మొట్టమొదటి శ్రీమతము ఏమి లభించింది?

జవాబు:-
మధురమైన పిల్లలూ - గుణవంతులుగా అవ్వాలంటే - 1. ఎవ్వరి దేహాన్ని చూడకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఒక్క తండ్రి నుండే వినండి, ఒక్క తండ్రినే చూడండి. మనుష్య మతాన్ని చూడకండి. 2. దేహాభిమానానికి వశమై తండ్రి పేరు లేక బ్రాహ్మణ కులము యొక్క పేరు అప్రతిష్టపాలు అయ్యే లాంటి కర్మలు జరగకూడదు. తప్పుడు నడవడిక కలవారు గుణవంతులుగా అవ్వలేరు. వారిని కుల కళంకితులు అని అంటారు.

ఓంశాంతి
(బాప్ దాదా చేతిలో మల్లెపూలు ఉన్నాయి). ఈ విధంగా సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి అని బాబా సాక్షాత్కారం చేయిస్తారు. మేము తప్పకుండా ఒకప్పుడు పుష్పాలుగా అయ్యాము అని పిల్లలకు తెలుసు. గులాబీ పూలుగా, మల్లెపూలుగా కూడా అయ్యారు, అలాగే వజ్రాలుగా కూడా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నారు. ఇప్పుడు సత్యముగా ఉన్నారు, ఇంతకుముందు అసత్యముగా ఉండేవారు. అంతా అసత్యమే అసత్యము అన్నట్లు ఉండేది, ఇసుమంత కూడా సత్యము ఉండేది కాదు. ఇప్పుడు మీరు సత్యముగా అవుతారు, మరి సత్యమైనవారిలో అన్ని గుణాలు కూడా ఉండాలి. ఎవరిలో ఎన్ని గుణాలు ఉంటాయో అంతగా వారు ఇతరులకు కూడా దానమిచ్చి తమ సమానముగా తయారుచేయగలుగుతారు, అందుకే తండ్రి పిల్లలకు చెప్తూ ఉంటారు - పిల్లలూ, మీ గుణాల యొక్క లెక్కాపత్రము పెట్టుకోండి. నాలో ఏ అవగుణమూ లేదు కదా? దైవీ గుణాలలో ఏ లోపము ఉంది? రాత్రివేళ ప్రతిరోజు మీ లెక్కాపత్రాన్ని వ్రాయండి. ప్రపంచంలోని మనుష్యుల విషయమే వేరు. మీరు ఇప్పుడు మనుష్యులైతే కారు కదా. మీరు బ్రాహ్మణులు. మనుష్యులంతా మనుష్యులుగానే ఉన్నా కానీ ప్రతి ఒక్కరి గుణాలలోనూ, నడవడికలోనూ తేడా ఉంటుంది. మాయ రాజ్యములో కూడా కొందరు మనుష్యులు చాలా మంచి గుణవంతులుగా ఉంటారు, కానీ వారికి తండ్రి గురించి తెలియదు. చాలా ధార్మిక మనస్కులు, మెత్తిని మనసు కలవారు ఉంటారు. ప్రపంచంలోనైతే మనుష్యుల గుణాలు రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైతే దేవతలుగా అవుతారో, అప్పుడు అందరిలోనూ దైవీ గుణాలు ఉంటాయి. కాకపోతే చదువును బట్టి పదవులు తగ్గిపోతాయి. ఒకటేమో చదవాలి, ఇంకొకటి అవగుణాలను తొలగించుకోవాలి. మనం మొత్తం ప్రపంచమంతటి కంటే అతీతమైనవారమని పిల్లలకు తెలుసు. ఇక్కడ కేవలం ఒక్క బ్రాహ్మణ కులమే కూర్చుని ఉన్నట్లు ఉంది. శూద్రకులములో ఉన్నది మనుష్య మతము, బ్రాహ్మణ కులములో ఉన్నది ఈశ్వరీయ మతము. మొట్టమొదట మీరు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఫలానావారు వాదిస్తున్నారు అని మీరు చెప్తారు. బాబా అర్థం చేయించారు - మీరు ఇలా వ్రాయండి, బ్రాహ్మణులమైన మేము అనగా బి.కె.లమైన మేము ఈశ్వరీయ మతముపై నడుస్తున్నాము, ఇలా వ్రాస్తే అప్పుడు వారు, వీరికన్నా ఉన్నతమైనవారైతే ఇంకెవ్వరూ లేరు అని అర్థం చేసుకుంటారు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, వారి పిల్లలమైన మేము కూడా వారి మతముపై నడుస్తున్నాము, మేము మనుష్యమతముపై నడవడము, మేము ఈశ్వరీయ మతముపై నడుస్తూ దేవతలుగా అవుతాము, మనుష్యమతాన్ని పూర్తిగా వదిలేసాము అని చెప్పండి, అప్పుడు మీతో ఎవ్వరూ వాదించలేరు. ఇది ఎక్కడి నుండి విన్నారు? ఇది ఎవరు నేర్పించారు? అని ఎవరైనా అంటే, మీరు అంటారు - మేము ఈశ్వరీయ మతముపై నడుస్తున్నాము. ప్రేరణ విషయమేమీ లేదు. అనంతమైన తండ్రియైన ఈశ్వరుడి నుండి మేము అర్థం చేసుకున్నాము. మీరు ఇలా చెప్పండి - భక్తి మార్గపు శాస్త్రాల మతముపైనైతే మేము ఎంతోకాలం నడిచాము, ఇప్పుడు మాకు ఈశ్వరీయ మతము లభించింది. పిల్లలైన మీరు తండ్రి మహిమనే చేయాలి. మొట్టమొదట, మేము ఈశ్వరీయ మతముపై నడుస్తున్నాము అన్న ఈ విషయాన్ని వారి బుద్ధిలో కూర్చోబెట్టాలి. మేము మనుష్య మతముపై నడవము, అది వినము. ఈశ్వరుడు చెప్పారు - చెడు వినకండి, చెడు చూడకండి... అది మనుష్య మతము. ఆత్మను చూడండి, శరీరాన్ని చూడకండి. ఇది పతిత శరీరము, దీనిని చూసేదేముంది, ఈ కనులతో దీనిని చూడకండి. పతితమైనవారి యొక్క ఈ శరీరము పతితముగానే ఉంది. ఇక్కడి ఈ శరీరాలైతే బాగుపడేది లేదు, ఇవి ఇంకా పాతబడనున్నాయి. ఆత్మయే రోజురోజుకు బాగుపడుతుంది, ఆత్మయే అవినాశీ. అందుకే తండ్రి అంటారు, చెడు చూడకండి. శరీరాన్ని కూడా చూడకూడదు. దేహ సహితముగా దేహ సంబంధాలేవైతే ఉన్నాయో, వాటన్నింటినీ మర్చిపోవాలి. ఆత్మనే చూడండి, ఒక్క పరమాత్మ అయిన తండ్రి నుండే వినండి, ఇందులోనే శ్రమ ఉంది. ఇది పెద్ద సబ్జెక్ట్ అని మీకు అనుభవమవుతుంది. తెలివైనవారు ఎవరైతే ఉంటారో, వారికి పదవి కూడా అంత ఉన్నతమైనది లభిస్తుంది. క్షణములో జీవన్ముక్తి లభించగలదు. కానీ ఒకవేళ పూర్తి పురుషార్థం చేయకపోతే ఇక శిక్షలు కూడా ఎంతో అనుభవించవలసి వస్తుంది.

పిల్లలైన మీరు తండ్రి పరిచయాన్ని ఇవ్వడానికి అంధులకు చేతికర్రగా అవుతారు. ఆత్మను చూడడం జరుగదు, తెలుసుకోవడం జరుగుతుంది. ఆత్మ ఎంత చిన్ననిది. ఈ ఆకాశ తత్వములో మనుష్యులు ఎంత స్థానాన్ని తీసుకుంటారో చూడండి. మనుష్యులైతే వస్తూ, వెళ్తూ ఉంటారు కదా. ఆత్మ ఏమైనా వచ్చి, వెళ్తూ ఉంటుందా? ఆత్మకు ఎంత చిన్నని స్థానము ఉంటుంది! ఇది ఆలోచించవలసిన విషయము. ఆత్మల గుంపు ఉంటుంది. శరీరముతో పోల్చి చూస్తే ఆత్మ ఎంత చిన్ననిది, ఆత్మలు ఎంత తక్కువ స్థానాన్ని తీసుకుంటాయి. మీకైతే ఉండేందుకు ఎంతో స్థానం కావాలి. ఇప్పుడు పిల్లలైన మీరు విశాలబుద్ధి కలవారిగా అయ్యారు. తండ్రి కొత్త ప్రపంచం కొరకు కొత్త విషయాలను అర్థం చేయిస్తారు మరియు ఇవి తెలియజేసేవారు కూడా కొత్తవారే. మనుష్యులైతే అందరి నుండి దయను కోరుకుంటూ ఉంటారు. తమపై తాము దయ చూపించుకునే శక్తి లేదు. మీకు శక్తి లభిస్తుంది. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు. ఇంకెవ్వరినీ దయార్ద్ర హృదయులు అని అనడం జరుగదు. మనుష్యులను ఎప్పుడూ దేవతలు అని అనలేరు. దయార్ద్ర హృదయుడు ఒక్క తండ్రియే, వారు మనుష్యులను దేవతలుగా తయారుచేస్తారు. అందుకే ఏమంటారంటే, పరమపిత పరమాత్ముని మహిమ అపారమైనది, దానికి అవధులు లేవు. ఇప్పుడు మీకు అది తెలుసు, వారి దయకు అవధులు లేవు. బాబా కొత్త ప్రపంచాన్ని ఏదైతే తయారుచేస్తారో, అందులో అంతా కొత్తగానే ఉంటుంది. మనుష్యులు, పశుపక్ష్యాదులు అన్నీ సతోప్రధానముగా ఉంటాయి. తండ్రి అర్థం చేయించారు, మీరు ఉన్నతముగా అవుతారు కావున మీ ఫర్నీచర్ కూడా అంత ఉన్నతోన్నతముగా గాయనం చేయబడ్డది. తండ్రిని కూడా ఉన్నతోన్నతమైనవారు అని అంటారు, వారి ద్వారా విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది. నేను అరచేతిపై వైకుంఠాన్ని తీసుకువస్తాను అని తండ్రి స్పష్టంగా చెప్తారు. వాళ్ళు, అరచేతి నుండి కుంకుమపూవ్వు మొదలైనవి తీస్తూ ఉంటారు. ఇక్కడైతే ఇది చదువు విషయము. ఇది సత్యమైన చదువు. మనం చదువుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. పాఠశాలలోకి వచ్చాము. మీరు ఎన్నో పాఠశాలలను తెరిచినట్లయితే మీ నడవడిక గమనించడం జరుగుతుంది. కొందరు తప్పుడు నడవడిక నడుచుకున్నట్లయితే ఇక పేరును అప్రతిష్టపాలు చేస్తారు. దేహాభిమానం కలవారి నడవడికయే వేరుగా ఉంటుంది. వారి నడవడిక అలా ఉంది అని గమనిస్తే, ఇక అందరికీ కళంకం వస్తుంది. వీరి నడవడికలో ఎటువంటి మార్పూ లేదు అని వాళ్ళు గమనించినట్లయితే మరి తండ్రిని నిందింపజేసినట్లే కదా. సమయం పడుతుంది. దోషమంతా వారి పైకి వచ్చేస్తుంది. మ్యానర్స్ చాలా మంచిగా ఉండాలి. మీ క్యారెక్టర్స్ మారేందుకు ఎంత సమయం పడుతుంది. కొందరి క్యారెక్టర్స్ చాలా బాగా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయని మీరు గమనిస్తారు, అది కనిపిస్తుంది కూడా. వీరిలో తొలగవలసిన లోపాలు ఏమేమి ఉన్నాయి అని బాబా పిల్లలొక్కొక్కరినీ కూర్చిని చూస్తూ ఉంటారు, ఒక్కొక్కరినీ చెక్ చేస్తారు. లోపాలైతే అందరిలోనూ ఉన్నాయి. బాబా అందరినీ చూస్తూ ఉంటారు. రిజల్టు చూస్తూ ఉంటారు. తండ్రికైతే పిల్లలపై ప్రేమ ఉంటుంది కదా. వీరిలో ఈ లోపం ఉంది, ఈ కారణము చేత వీరు అంతటి ఉన్నత పదవిని పొందలేరు అని బాబాకు తెలుసు. ఒకవేళ లోపాలు తొలగకపోతే చాలా కష్టం, చూడడంతోనే తెలిసిపోతుంది. ఇంకా సమయం ఉంది అని వారికి తెలుసు. ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ తండ్రి దృష్టి ఒక్కొక్కరి గుణాల వైపుకు వెళ్తుంది. మీలో ఎటువంటి అవగుణమైతే లేదు కదా అని అడుగుతారు. బాబా ముందైతే నిజం చెప్పేస్తారు. కొందరిలో దేహాభిమానం ఉంటుంది, వారు చెప్పరు. తండ్రి అయితే చెప్తూ ఉంటారు - ఎవరైతే తమంతట తామే చేస్తారో వారు దేవతలు, ఎవరైతే చెప్తే చేస్తారో వారు మనుష్యులు, ఎవరైతే చెప్పినా చేయరో వారు... బాబా చెప్తూ ఉంటారు, ఈ జన్మలోని లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తండ్రి ముందు మీకు మీరే చెప్పేయండి. లోపాలను సర్జన్ కు తెలియజేయాలి అని బాబా అయితే అందరికీ చెప్తూ ఉంటారు. శరీరము యొక్క రోగము కాదు, లోపల ఉన్న రోగము గురించి తెలియజేయాలి. మీ వద్ద లోలోపల ఏయే అసురీ ఆలోచనలు ఉంటున్నాయో చెప్తే వాటిపై బాబా అర్థం చేయిస్తారు. ఈ పరిస్థితిలో అనగా ఎప్పటివరకైతే అవగుణాలు తొలగవో, అప్పటివరకూ మీరు అంతటి ఉన్నత పదవిని పొందలేరు అని చెప్తారు. అవగుణాలు ఎంతగానో నిందింపజేస్తాయి. భగవంతుడు వీరిని చదివిస్తున్నారా! అని మనుష్యులకు అనుమానం కలుగుతుంది. భగవంతుడైతే నామ-రూపాలకు అతీతుడు, సర్వవ్యాపి, వారు వీరిని ఎలా చదివిస్తారు, వీరి నడవడిక ఎలా ఉంది! అని అనుకుంటారు. మీ గుణాలు ఎంత ఫస్ట్ క్లాస్ ఉండాలి అనేది తండ్రికి తెలుసు. అవగుణాలను దాచి పెట్టినట్లయితే ఎవరికీ అంతగా బాణం తగలదు, అందుకే ఎంత వీలైతే అంత మీలో ఏ అవగుణాలైతే ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ వెళ్ళండి. మాలో ఈ-ఈ లోపాలు ఉన్నాయి అని నోట్ చేసుకోండి, అప్పుడు లోలోపల మనస్సు తింటుంది. నష్టం కలిగితే మనస్సు తింటుంది. వ్యాపారులు - ఈ రోజు ఎంత లాభం కలిగింది అని ప్రతిరోజూ తమ ఖాతాను చూసుకుంటారు. ప్రతిరోజూ ఖాతాను చూసుకుంటారు. అలాగే ఈ తండ్రి కూడా, ప్రతిరోజూ మీ నడవడికను చూసుకోండి అని చెప్తున్నారు, లేకపోతే మిమ్మల్ని మీరు నష్టపరచుకుంటారు. తండ్రి పరువును పోగొడతారు.

గురువును నిందింపజేసేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు. దేహాభిమానులు ఉన్నత స్థానాన్ని పొందలేరు. దేహీ-అభిమానులు మంచి ఉన్నత స్థానాన్ని పొందుతారు. దేహీ-అభిమానులుగా అయ్యేందుకే అందరూ పురుషార్థం చేస్తారు. రోజురోజుకు బాగవుతూ ఉంటారు. దేహాభిమానం వల్ల ఏ కర్తవ్యాలైతే జరుగుతాయో, వాటన్నింటినీ ఖండిస్తూ ఉండాలి. దేహాభిమానం వల్ల పాపాలు తప్పకుండా జరుగుతాయి, అందుకే దేహీ-అభిమానులుగా అవుతూ ఉండండి. జన్మించడంతోనే ఎవ్వరూ రాజులుగా అవ్వరని మీరు అర్థం చేసుకోగలరు. దేహీ-అభిమానులుగా అవ్వడంలో సమయమైతే పడుతుంది కదా. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. బాబా వద్దకు పిల్లలు వస్తారు. కొందరు 6 మాసాల తర్వాత వస్తారు, కొందరు 8 మాసాల తర్వాత కూడా వస్తారు. అప్పుడు బాబా చూస్తారు, ఇంత సమయంలో ఏ ఉన్నతి జరిగింది? రోజురోజుకు ఎంతో కొంత బాగుపడుతూ వస్తున్నారా లేక ఎక్కడైనా ఏదైనా తేడా జరుగుతుందా? అని గమనిస్తారు. కొందరు నడుస్తూ, నడుస్తూ చదువును వదిలేస్తారు. బాబా అంటారు, ఇదేమిటి, భగవంతుడు భగవాన్-భగవతీలుగా తయారుచేసేందుకు మిమ్మల్ని చదివిస్తుంటే, ఇటువంటి చదువును మీరు వదిలేస్తారా! అరే! వరల్డ్ గాడ్ ఫాదర్ చదివిస్తూ ఉంటే అందులో ఆబ్సెంట్ అవుతారా? మాయ ఎంత ప్రబలమైనది. ఫస్ట్ క్లాస్ అయిన చదువు నుండి మీ ముఖాన్ని తిప్పేస్తుంది. నడుస్తూ, నడుస్తూ చదువును కాలదన్నేవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మన ముఖం స్వర్గం వైపుకు, కాళ్ళు నరకం వైపుకు ఉన్నాయని మీకు తెలుసు. మీరు సంగమయుగీ బ్రాహ్మణులు. ఇది పాత రావణ ప్రపంచము. మనం వయా శాంతిధామం, సుఖధామం వైపుకు వెళ్తాము. పిల్లలు ఇదే గుర్తుంచుకోవాలి. సమయం చాలా కొద్దిగా ఉంది, రేపైనా శరీరాన్ని వదిలేయచ్చు. తండ్రి స్మృతి లేకపోతే ఇక అంత్యకాలములో... తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తూ ఉంటారు. ఇవన్నీ గుప్తమైన విషయాలు. జ్ఞానము కూడా గుప్తమైనది. కల్పపూర్వము ఎవరు ఎంత పురుషార్థం చేసారో, అదే చేస్తున్నారని కూడా మీకు తెలుసు. డ్రామానుసారముగా తండ్రి కూడా కల్పపూర్వము వలే అర్థం చేయిస్తూ ఉంటారు, ఇందులో ఎటువంటి తేడా రాదు. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. శిక్షలు అనుభవించకూడదు. తండ్రి ముందు కూర్చుని శిక్షలు అనుభవిస్తూ ఉంటే మరి తండ్రి ఏమంటారు? మీరు సాక్షాత్కారములో కూడా చూసారు, ఆ సమయంలో క్షమించలేరు. వీరి ద్వారా తండ్రి చదివిస్తారు కావున వీరి యొక్క సాక్షాత్కారమే జరుగుతుంది. నీవు ఇది-ఇది చేసావు అని వీరి ద్వారా అక్కడ కూడా అర్థం చేయిస్తారు, అప్పుడు ఆ సమయంలో ఎంతగానో ఏడుస్తారు, ఆర్తనాదాలు చేస్తారు, పశ్చాత్తాపపడతారు కూడా. సాక్షాత్కారం చేయించకుండా శిక్షలు ఇవ్వలేరు. నిన్ను అంతగా చదివించాను, అయినా ఇటువంటి పనులు చేసావు... అని అంటారు. రావణుడి మతముపై మేము ఎన్ని పాపాలు చేసాము అంటూ మీరు కూడా అర్థం చేసుకుంటారు. పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు. తండ్రిని సర్వవ్యాపి అని అంటూ వచ్చారు. ఇది నెంబర్ వన్ అవమానము. దీని లెక్కాచారము కూడా చాలా ఉంది. తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు, మీరు స్వయానికి ఎలా చెంపదెబ్బ వేసుకున్నారు. భారతవాసులే ఎంతగా పడిపోయారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు ఎంత వివేకం లభించింది. అది కూడా డ్రామానుసారముగా, నంబరువారుగా అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు కూడా ఈ సమయం వరకూ క్లాస్ రిజల్టు ఇలాగే ఉంది. తండ్రి చెప్పడమైతే చెప్తారు కదా. కావున పిల్లలు తమ ఉన్నతిని చేసుకుంటూ ఉండాలి. మాయ ఎటువంటిదంటే, అది దేహీ-అభిమానులుగా ఉండనివ్వదు. ఇదే పెద్ద సబ్జెక్ట్. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమైపోతాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహాభిమానంలోకి రావడం వలన పాపాలు తప్పకుండా జరుగుతాయి, దేహాభిమానులకు ఉన్నత స్థానము లభించదు, అందుకే దేహీ-అభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఏ కర్మలు కూడా తండ్రిని నిందింపజేసే విధంగా ఉండకూడదు.

2. మీ లోపల ఉండేటువంటి రోగాలను తండ్రికి సత్యాతి-సత్యంగా తెలియజేయాలి, అవగుణాలను దాచిపెట్టకూడదు. నాలో ఏయే అవగుణాలు ఉన్నాయి అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. చదువు ద్వారా స్వయాన్ని గుణవంతులుగా చేసుకోవాలి.

వరదానము:-

హద్దు యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులుగా ఉంటూ సేవ చేసే నిస్వార్థ సేవాధారీ భవ

బ్రహ్మాబాబా కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యి, అతీతంగా అయ్యే ఋజువును చూపించారు. సేవ యొక్క స్నేహము తప్ప మరే బంధనము లేదు. సేవలో హద్దు యొక్క రాయల్ కోరికలేవైతే ఉంటాయో, అవి కూడా లెక్కాచారపు బంధనములో బంధిస్తాయి, సత్యమైన సేవాధారులు ఈ లెక్కాచారము నుండి కూడా ముక్తులుగా ఉంటారు. ఏ విధంగా దేహం యొక్క బంధనము, దేహ సంబంధాల బంధనాలు ఉన్నాయో, అలాగే సేవలో స్వార్థము - ఇది కూడా బంధనమే. ఈ బంధనము నుండి మరియు రాయల్ లెక్కాచారము నుండి కూడా ముక్తులుగా అయ్యి, నిస్వార్థ సేవాధారులుగా అవ్వండి.

స్లోగన్:-

ప్రతిజ్ఞలను ఫైల్ లో ఉంచకండి, ఫైనల్ అయ్యి చూపించండి.