18-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేసేందుకు - మేము ఎవరి పిల్లలము అన్న స్మృతిలోనే సదా ఉండండి, ఒకవేళ తండ్రిని మర్చిపోయినట్లయితే సుఖము మాయమైపోతుంది’’

ప్రశ్న:-
తండ్రి లభించారు అన్న స్థిరమైన సంతోషము ఏ పిల్లలకు ఉంటుంది?

జవాబు:-
ఏ పిల్లలైతే ఒక్కరితోనే తమ సర్వ సంబంధాలను జోడించారో, ఎవరైతే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండేందుకు కృషి చేస్తారో, ఏ దేహధారినీ స్మృతి చేయరో, వారికే స్థిరమైన సంతోషము ఉంటుంది. ఒకవేళ దేహధారుల స్మృతి ఉన్నట్లయితే చాలా ఏడవాల్సి ఉంటుంది. విశ్వానికి యజమానులుగా అయ్యేవారు ఎప్పుడూ ఏడవరు.

పాట:-
బాల్యపు రోజులను మర్చిపోకండి...

ఓంశాంతి
తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, మేము అనంతమైన తండ్రి పిల్లలము అనే విషయాన్ని మర్చిపోకండి. ఇది మర్చిపోయారంటే మిమ్మల్ని మీరు ఏడిపించుకుంటారు, ఛీ-ఛీ ప్రపంచములోకి బుద్ధి వెళ్ళిపోతుంది. తండ్రి స్మృతి ఉన్నట్లయితే అతీంద్రియ సుఖము అనుభవమవుతుంది. తండ్రిని మర్చిపోతే ఆ సుఖము మాయమైపోతుంది. మేము బాబా పిల్లలము అన్నది ప్రతి క్షణము గుర్తుండాలి, లేదంటే మిమ్మల్ని మీరు ఏడిపించుకుంటారు. అందరూ భగవంతుని పిల్లలే. ఓ బాబా, ఓ పరమపిత పరమాత్మ, రక్షించండి అని అందరూ అంటారు. కానీ తండ్రి నుండి రక్షణ ఎప్పుడు లభిస్తుంది - ఇది ఎవరికీ తెలియదు. తండ్రి నుండి మనకు ముక్తి-జీవన్ముక్తి ఎప్పుడు లభించనున్నది అనేది సాధు-సత్పురుషులు మొదలైనవారెవరికీ తెలియదు, ఎందుకంటే భగవంతుడిని కణ-కణములో ఉన్నారని అనేసారు. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. వారు అత్యంత ప్రియమైన తండ్రి, వారికన్నా ప్రియమైన వస్తువు ఇంకేదీ ఉండదు. అటువంటి తండ్రిని తెలుసుకోకపోవడమనేది చాలా పెద్ద తప్పు. శివ జయంతిని ఎందుకు జరుపుకుంటారు, వారెవరు? ఇది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు - మీరు ఎంత తెలివిహీనులుగా అయిపోయారు, మాయా రావణుడు మిమ్మల్ని ఎలా తయారుచేసేసాడు. ఇది నా జన్మభూమి అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తాను. వారేమో, 40 వేల సంవత్సరాల తర్వాత ఈ కలియుగము పూర్తి అయినప్పుడు వస్తానని చెప్తారు. త్రిమూర్తి చిత్రాన్ని కూడా చూపించడము జరుగుతుంది. త్రిమూర్తి మార్గము అనే పేరు కూడా పెట్టారు కానీ త్రిమూర్తులైన బ్రహ్మా-విష్ణు-శంకరులను గురించి ఎవరికీ తెలియదు. బ్రహ్మా ఏమి చేసి వెళ్ళారు, విష్ణు మరియు శంకరులు ఏమి చేస్తారు, ఎక్కడ ఉంటారు అనేది ఏమీ తెలియదు. పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. తండ్రి రచయిత, వారిది ఎంత పెద్ద రచన. ఇది అనంతమైన నాటకము. ఇందులో లెక్కలేనంతమంది మనుష్యులు ఉంటారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం సత్యయుగము ఉన్నప్పుడు, భారత్ లో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు, ఇంకే రాజ్యము ఉండేది కాదు. భగవతి అని శ్రీలక్ష్మిని, భగవాన్ అని శ్రీనారాయణుడిని అంటారు. సీతా-రాములను కూడా భగవాన్ రామ, భగవతి సీత అని అంటారు. ఇప్పుడు ఈ భగవాన్ నారాయణ, భగవతి లక్ష్మి ఎక్కడ నుండి వచ్చారు? వారు రాజ్యము చేసి వెళ్ళారు. కానీ వారి జీవిత కథ గురించైతే ఒక్కరికి కూడా తెలియదు. భగవంతుడు దుఃఖహర్త-సుఖకర్త అని కేవలం పాడుతూ ఉంటారు కానీ వారు దుఃఖహర్త-సుఖకర్తగా ఎలా అయ్యారు అనేది ఎవరి బుద్ధిలోకి రాదు. వారు అందరికీ ఏ సుఖాన్ని ఇచ్చారు మరియు అందరి దుఃఖాలను ఎప్పుడు హరించారు అనేది ఏమీ తెలియదు.

పిల్లలైన మీరు ఇప్పుడు భగవతి లక్ష్మిగా, భగవాన్ నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. భగవతి సీతగా, భగవాన్ రామునిగా కూడా అవ్వనున్నారని మీకు తెలుసు. సత్యయుగములో 8 జన్మలు పూర్తి చేసుకుని సీతా-రాముల రాజ్యములోకి వెళ్తారు. ఇక్కడ మీరు 21 జన్మల కోసం అనంతమైన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మీరు భగవతి-భగవానులుగా, స్వర్గానికి యజమానులుగా అవుతున్నారు. స్వర్గమనేది ఆకాశములో ఏమీ లేదు, ఈ విషయము కూడా ఎవరికీ తెలియదు. పూర్తిగా తుచ్ఛ బుద్ధి కలవారిగా ఉన్నారు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. అచ్ఛా, క్రిస్టియన్లు, బౌద్ధులు మొదలైనవారందరూ స్వర్గములోకి వెళ్తారా? వారంతా తర్వాత వచ్చి తమ ధర్మ స్థాపన చేస్తారు. కావున వారు స్వర్గములోకి ఎలా రాగలరు? స్వర్గమని దేనినంటారు, ఇది కూడా వారికి తెలియదు. సన్యాసులు జ్యోతిలో జ్యోతి కలిసిపోయిందని అంటారు. మరికొందరు నిర్వాణధామానికి వెళ్ళారని అంటారు. నిర్వాణధామము కూడా లోకము కదా. అది నివసించే స్థానము. జ్యోతి జ్యోతిలో లీనమయ్యే విషయమేమీ లేదు. జ్యోతిలో కలిసిపోతే, ఇక ఆత్మే సమాప్తమైపోతుంది. ఆటే సమాప్తమైపోతుంది. ఈ డ్రామా నుండి ఏ ఆత్మ విడుదల అవ్వలేదు, ఎవరూ మోక్షాన్ని పొందలేరు. పాట అర్థాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోరు. జీవన్ముక్తి అర్థాన్నీ తెలుసుకోరు, అలాగే ఆత్మ-పరమాత్మల అర్థాన్నీ తెలుసుకోరు. తండ్రి అంటారు - మీ ముఖాలు మనుష్యులవి, ఈ దేవతల ముఖాలు కూడా ఇలాగే ఉంటాయి. సత్యయుగము ఆదిలో దేవతలు ఉండేవారు. వారి రాజ్యము 2500 సంవత్సరాలు నడిచింది, ఇక మిగిలినది 2500 సంవత్సరాలు, అందులో అన్ని ధర్మాలు వచ్చేస్తాయి. మనుష్యులు కల్పవృక్ష ఆయువును 5 వేల సంవత్సరాలకు బదులుగా లక్షల సంవత్సరాలని అంటారు. అలాగని, మీరు చెప్పే విషయాలను అర్థం చేసుకోవడానికి కూడా రారు. అయితే, ఎవరైతే కల్పక్రితం వచ్చి అర్థం చేసుకుని ఉంటారో వారే వస్తారు. ఒకటేమో హద్దు సన్యాసము, సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవులలో ఉంటారని ముందు అర్థం చేయించాలి. మొదటిలో వారు సతోప్రధానముగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ తమోప్రధానముగా అయిపోయారు, అందుకే అడవుల నుండి తిరిగి వచ్చి పెద్ద-పెద్ద మహళ్ళను తయారుచేసుకున్నారు. ఈ సన్యాసులు కూడా తప్పకుండా పవిత్రత ఆధారముగా భారత్ ను నిలబెట్టారు, భారత్ యొక్క సేవను చేసారు. ఈ సన్యాస ధర్మమే లేకపోయుంటే, భారత్ పూర్తిగా వికారాలలో కాలిపోయుండేది, పతితముగా అయిపోయుండేది. డ్రామా ఈ విధముగా తయారుచేయబడి ఉంది. మొదటిలో వారిలో పవిత్రతా శక్తి ఉండేది, దానితో భారత్ ను నిలబెట్టారు. ఈ దేవతల రాజ్యము ఉన్నప్పుడు భారత్ ఎంత షావుకారుగా ఉండేది. వారికి ఎంతో పెద్ద-పెద్ద వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. అవన్నీ ఏమైపోయాయి? అన్నీ కిందకు వెళ్ళిపోయాయి. లంక మరియు ద్వారకలు గురించి - అవి సముద్రం కిందకు వెళ్ళిపోయాయి, ఇప్పుడవి లేవు అని అంటారు. పూర్వము బంగారు మహళ్ళు మొదలైనవన్నీ ఉండేవి కదా. మందిరాలు మొదలైనవాటిలోనే వజ్ర-వైఢూర్యాలను అమర్చగలిగినప్పుడు, ఇక స్వర్గములో లేనిదంటూ ఏముంటుంది! పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. బాబా మళ్ళీ వచ్చి ఉన్నారు. తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. స్మృతి ఒక్కరినే చేయాలి, దానితో వికర్మలు వినాశనమవుతాయి. కానీ ఈ విషయాన్ని మర్చిపోతారు మరియు దేహధారుల స్మృతి వచ్చేస్తుంది. దేహధారుల స్మృతితో లాభమేమీ ఉండదు. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి, ఏ దేహధారినీ స్మృతి చేయకండి. తల్లి మరణించినా హల్వా తినండి... అని అంటారు, ఒక్క తండ్రి స్మృతితోనే సంపాదన జరుగుతుంది. మనము శివబాబా పిల్లలము, వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఈ సమయములో తండ్రిని స్మృతి చేయకపోతే తర్వాత చాలా పశ్చాత్తాపపడవలసి ఉంటుంది, ఏడవాల్సి ఉంటుంది. విశ్వానికి యజమానులుగా అయ్యేవారికి ఏడవాల్సిన అవసరమేముంది. మీరు తండ్రిని మర్చిపోతారు, అప్పుడే మాయ చెంపదెబ్బ వేస్తుంది. అందుకే బాబా పదే-పదే అర్థం చేయిస్తున్నారు, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. అమరపురిలో అమరనాథుడు ఒక్క పార్వతికి మాత్రమే అమరకథను వినిపించి ఉండరు. తప్పకుండా చాలామంది ఉండి ఉంటారు. ఇప్పుడు పతితముగా అవ్వకండి, ఈ అంతిమ జన్మ పవిత్రముగా అవ్వండి అని మనుష్యమాత్రులందరికీ తండ్రి అర్థం చేయిస్తున్నారు. అక్కడ స్వర్గములో వికారాలేవీ ఉండవు. ఒకవేళ అక్కడ కూడా వికారాలు ఉన్నట్లయితే, ఇక స్వర్గానికి మరియు నరకానికి తేడా ఏముంటుంది? సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు... అని దేవీ-దేవతల మహిమను పాడుతారు. భగవంతుడు వచ్చి భగవాన్ భగవతీలుగానే తయారుచేస్తారు. భగవంతుడు తప్ప అలా ఇంకెవరూ తయారుచేయలేరు. భగవంతుడు అయితే ఒక్కరే. భగవాన్-భగవతీల రాజధాని అని గాయనము కూడా చేయడము జరుగుతుంది. యథా రాజా-రాణి, తథా ప్రజలు ఉంటారు. కానీ భగవాన్ భగవతి అని వారు పిలవబడరు, అందుకే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అని అంటారు. ఈ విషయము ఎవరికీ తెలియదు. వీరి (బ్రహ్మా) ఆత్మకు కూడా తండ్రి అర్థం చేయిస్తారు. ఒకటి తండ్రిది, మరొకటి దాదాది - రెండు ఆత్మలు ఉన్నాయి కదా. ఒక ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది, మరొక ఆత్మ పునర్జన్మల రహితమైనది. తండ్రి ఎప్పుడూ పునర్జన్మలు తీసుకోరు. ఒక్కసారి మాత్రమే వచ్చి, విశ్వమంతటినీ పవిత్రముగా తయారుచేయడానికి మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు - నేను వీరిలో ప్రవేశించాను, వీరు 84 జన్మలను అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు వీరిది అనేక జన్మల అంతిమ జన్మ. నేను నిరాకారుడిని, మరి నేను వచ్చి పిల్లలకు రాజయోగాన్ని ఎలా నేర్పించాలి? ప్రేరణతోనైతే ఏమీ జరగదు. శ్రీకృష్ణ భగవానువాచ అయితే కాదు. అతను ఎలా రాగలరు? అతను సత్యయుగ రాకుమారుడు, 16 కళల సంపూర్ణుడు... తర్వాత త్రేతాలో 14 కళల సంపూర్ణులు ఉంటారు. మరి శ్రీకృష్ణుడిని ద్వాపరములోకి ఎందుకు తీసుకువెళ్ళారు? అతనైతే ముందే రావాల్సి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ముందు తండ్రిని స్మృతి చేయండి, లేదంటే మాయ గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది. ముట్టుకుంటే ముడుచుకుపోయే మొక్క ఒకటి ఉంటుంది. చేతితో ముట్టుకోగానే ముడుచుకుపోతుంది. మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, తండ్రిని స్మృతి చేయకపోతే అంతా సమాప్తము. బాల్యపు రోజులను మర్చిపోవద్దు అని పాటలో కూడా విన్నారు. తండ్రిని మర్చిపోతే ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది. తండ్రి అంటారు - మీరు నా పిల్లలు కదా. ఈ శరీరమైతే విషముతో జన్మించినది. అలా జన్మనిచ్చినవారు లౌకిక తల్లిదండ్రులు. వీరు పారలౌకిక తండ్రి మరియు వీరిని (బ్రహ్మా) అలౌకిక తండ్రి అని అంటారు. వీరు (బ్రహ్మా) హద్దు తండ్రిగా ఉండేవారు, తర్వాత అనంతమైన తండ్రిగా అయ్యారు. వీరి లౌకిక కుమార్తె (నిర్మలశాంత దాదీ) కూర్చున్నారు చూడండి. ఈమె లౌకిక కుమార్తె కూడా, అలౌకిక కుమార్తె కూడా, పారలౌకిక కుమార్తె కూడా. ఇకపోతే శివబాబాకు సోదరీ-సోదరులు లేరు. లౌకికముగా గాని, అలౌకికముగా గాని, పారలౌకికముగా గాని లేరు. ఎంత తేడా ఉంది. ఒక్క తండ్రికి చెందినవారిగా అవ్వడమనేది పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువేమీ కాదు. ఇటువంటి తండ్రితో సంబంధాన్ని జోడించాలి, దానికి సమయము పడుతుంది. శివబాబా స్మృతిలో ఉండటము చాలా శ్రమతో కూడినది. 50 సంవత్సరాల నుండి ఉన్నవారిలో కూడా ఎంతోమంది రోజంతటిలో శివబాబాను కనీసం స్మృతి కూడా చేయరు. అటువంటివారు కూడా ఉన్నారు. మిగిలినవారందరినీ మరచి ఒక్కరినే స్మృతి చేయడమనేది చాలా-చాలా శ్రమతో కూడినది. కొంతమంది ఒక శాతం స్మృతి చేస్తారు, కొంతమంది రెండు శాతం, కొంతమంది 1/2 శాతం కూడా కష్టం మీద స్మృతి చేస్తారు. ఇది చాలా పెద్ద భారీ గమ్యము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - బాల్యాన్ని మర్చిపోవద్దు. తండ్రి నుండి స్వర్గ వారసత్వము లభిస్తుంది. మనము కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు జీవిస్తూనే మరణించి తండ్రికి చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు. కనుక మీకు స్థిరమైన సంతోషము ఉండాలి. ఓహో! మేము డబల్ కిరీటధారులుగా అవుతాము! సత్యయుగములో ఈ దేవతలను 16 కళల సంపూర్ణులు మరియు 14 కళల సంపూర్ణులు అని ఎందుకు అంటారు అనేది మనుష్యులకు తెలియదు. ఏమీ తెలియదు. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవి మళ్ళీ తయారవుతాయి. ఈ హఠయోగాలు, తీర్థయాత్రలు మొదలైనవన్నీ మళ్ళీ ఉంటాయి. కానీ వీటి వల్ల ఏమి జరుగుతుంది? స్వర్గానికి వెళ్తారా? లేదు. రిద్ధి-సిద్ధులను ఉపయోగించి చాలా పనులు చేస్తారు. రిద్ధి-సిద్ధులు ఉన్నవారు చాలామంది ఉన్నారు. వేలాదిమంది మనుష్యులు వారి వెంట పడుతూ ఉంటారు. రిద్ధి-సిద్ధితో గడియారాలు మొదలైన అనేక వస్తువులను బయటకు తీస్తూ ఉంటారు. ఇవన్నీ అల్పకాలికమైనవని అర్థం చేసుకోరు. ఇందులో చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. ఈ రిద్ధి-సిద్ధులు మొదలైనవి నేర్చుకునేందుకు కూడా పుస్తకాలు ఉంటాయి. ఎన్ని లక్షలమంది మనుష్యులు వారి వెంట పడుతూ ఉంటారు. మనకు తండ్రి నుండి స్వర్గ వారసత్వము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఈ కళ్ళతో ఏదైతే చూస్తారో అది ఉండదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు అశరీరిగా వచ్చారు, తర్వాత శరీరముతో పాత్రను అభినయించారు. ఒకవేళ 84 లక్షల జన్మల లెక్కను చెప్పాలంటే 12 నెలలు పట్టేస్తుంది, అది అసంభవము. 84 జన్మల లెక్కను చెప్పడమైతే చాలా సహజము. మీరు 84 జన్మల చక్రములో తిరుగుతూ ఉంటారు. సూర్యవంశీయులు ఉన్నప్పుడు చంద్రవంశీయులు ఉండరు. సూర్యవంశము సమాప్తమైన తర్వాత చంద్రవంశీయులుగా... అవుతారు.

మనము బ్రాహ్మణ వంశీయులమని, తర్వాత దేవతా వంశీయులుగా అవ్వనున్నామని ఇప్పుడు మీకు తెలుసు. అందుకే మనము చదువు చదువుకుంటున్నాము. తర్వాత మెట్లు దిగుతూ-దిగుతూ వైశ్య, శూద్ర వంశీయులుగా అవుతాము. ఇప్పుడు మీ 84 జన్మల స్మృతి కలిగింది. ఈ చక్రాన్ని కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు, పాపాలు తొలగిపోతాయి. చక్రాన్ని తెలుసుకోవడముతో చక్రవర్తిగా అవుతారు. ఈ పాత ప్రపంచము శ్మశానవాటికగా అవ్వనున్నదని మీకు తెలుసు. ఏమీ మిగలదు, అంతా సమాప్తమైపోతుంది. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు, వారి పరివారములోని వారందరూ కూడా వెళ్ళిపోయారు అని అంటూ ఉంటారు (ఇక్కడ ఎవ్వరూ శాశ్వతము కాదు అని అర్థం). సత్యయుగములో రాముని పరివారము ఎంత చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు రావణుడిది ఎంత పెద్ద పరివారము. ఈ రాజధాని స్థాపనవుతోందని పిల్లలకు తెలుసు. ప్రతి విషయములోనూ పురుషార్థము ఫస్ట్. పిల్లలూ, నన్ను స్మృతి చేయండి అని తండ్రి పురుషార్థము చేయిస్తున్నారు. ఏ తండ్రి నుండైతే అపారమైన స్వర్గ రాజ్యాధికారము లభిస్తుందో, వారిని స్మృతి చేయరా? మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని తండ్రి స్మృతిని ఇప్పిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థము చేసి స్వర్గానికి యజమానులుగా అవ్వండి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎప్పుడూ ఏ విషయములోనూ ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిలా అవ్వకూడదు. ఈశ్వరీయ బాల్యాన్ని మరచి వాడిపోకూడదు. ఈ కనుల ద్వారా ఏదైతే కనిపిస్తుందో, దానిని చూస్తూ కూడా చూడకూడదు.

2. ఒక్క తండ్రి స్మృతిలోనే సంపాదన ఉంది, అందుకే దేహధారులను గుర్తు చేసుకుని ఏడవకూడదు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసి విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి.

వరదానము:-
శ్రేష్ఠ మతము ఆధారముగా మాయావీ సాంగత్య దోషము నుండి అతీతముగా ఉండే శక్తి స్వరూప భవ

పిల్లలకు ఒక్క ఫిర్యాదు ఉంటుంది, అదేమిటంటే - సంబంధీకులు వినరు, సాంగత్యము మంచిగా లేదు, దీని కారణముగా శక్తిశాలిగా అవ్వలేకపోతున్నాము అని. కానీ శ్రేష్ఠ మతము ఆధారముగా జ్ఞాన స్వరూపము, శక్తి స్వరూపము యొక్క వరదానులుగా అయి తమ స్థితిని అచంచలముగా తయారుచేసుకోండి. సాక్షీగా అయి ప్రతి ఒక్కరి పాత్రను చూడండి. తమ సతోగుణీ పాత్రలో స్థితులవ్వండి. సదా తండ్రి సాంగత్యములో ఉన్నట్లయితే తమోగుణీ ఆత్మ యొక్క సాంగత్యపు రంగు యొక్క ప్రభావము పడదు.

స్లోగన్:-
కర్మయోగులు అనగా ఎవరైతే కర్మ అనే కల్పవృక్షము యొక్క కొమ్మపై కూర్చుని కర్మలు చేస్తూ కూడా ఉపరామ స్థితిలో ఉంటారో వారు.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు తమ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

ఏ విధముగా కొందరికి విశేషమైన నేచర్ ఉంటుంది, వద్దు అనుకున్నా కానీ ఆ నేచర్ కు వశమై నడుస్తూ ఉంటారు. ఇలా ఉండాలని నేను కోరుకోవటం లేదు కానీ ఇది నా నేచర్ అని అంటారు. అదే విధముగా పిల్లలైన మీ నేచర్ ఎంత సరళముగా ఉండాలంటే - వీరు సహజ యోగులు, స్వతహా యోగులు అని అందరికీ అనుభవమవ్వాలి. ఏం చెయ్యాలి, ఎలా యోగము జోడించాలి... ఈ విషయాలన్నీ సమాప్తమవ్వాలి. సదా సహయోగులుగా ఉన్నారు అనగా యోగులుగా ఉన్నారు. ఈ ఒక్క విషయాన్ని నేచర్ గా మరియు న్యాచురల్ గా చేసుకున్నట్లయితే అన్ని సబ్జెక్టులలో పర్ఫెక్ట్ అయిపోతారు.