18-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సేవా సమాచారాన్ని వినాలి, చదవాలి అని కూడా మీకు అభిరుచి ఉండాలి, ఎందుకంటే దీని ద్వారా ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతాయి, సేవ చేయాలి అనే సంకల్పము ఉత్పన్నమవుతుంది’’

ప్రశ్న:-
సంగమయుగములో తండ్రి మీకు సుఖాన్ని ఇవ్వరు, కానీ సుఖపు మార్గాన్ని తెలియజేస్తారు, ఎందుకు?

జవాబు:-
ఎందుకంటే తండ్రికి అందరూ పిల్లలే. ఒకవేళ పిల్లల్లో ఒకరికే సుఖాన్ని ఇస్తే, అది కూడా సరి కాదు. లౌకిక తండ్రి నుండి పిల్లలకు సమాన వాటా లభిస్తుంది, అనంతమైన తండ్రి వాటాలు పంచరు, వారు సుఖము యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. ఎవరైతే ఆ మార్గములో నడుస్తారో, పురుషార్థము చేస్తారో, వారికి ఉన్నత పదవి లభిస్తుంది. పిల్లలు పురుషార్థం చేయాలి, మొత్తం ఆధారమంతా పురుషార్థముపై ఉంది.

ఓంశాంతి
తండ్రి మురళిని వినిపిస్తారని పిల్లలకు తెలుసు. మురళి అందరి వద్దకు వెళ్తుంది మరియు ఎవరైతే మురళిని చదివి సేవ చేస్తారో వారి సమాచారము మ్యాగజీన్ లో వస్తుంది. ఇప్పుడు ఏ పిల్లలైతే మ్యాగజీన్ చదువుతారో వారికి సెంటర్లలోని సేవా సమాచారము తెలుస్తుంది, ఫలానా-ఫలానా స్థానములో ఇటువంటి సేవ జరుగుతోంది అని తెలుస్తుంది. ఎవరైతే చదవనే చదవరో వారికి ఏ సమాచారము గురించి తెలియదు మరియు పురుషార్థము కూడా చేయరు. సేవా సమాచారాన్ని విని - నేను కూడా ఇటువంటి సేవను చేయాలి అని మనసులో అనిపిస్తుంది. మన సోదరీ-సోదరులు ఎంతటి సేవను చేస్తున్నారు అనేది మ్యాగజీన్ ద్వారా తెలుస్తుంది. ఎంతగా సేవ చేస్తారో అంతగా ఉన్నత పదవి లభిస్తుంది అనైతే పిల్లలు అర్థం చేసుకున్నారు. కావున సేవ కోసం మ్యాగజీన్ కూడా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అదేమీ వ్యర్థముగా తయారవ్వడం లేదు. ఎవరైతే స్వయం చదవరో వారు దానిని వ్యర్థమని భావిస్తారు. కొందరు మాకు చదవడం రాదు అని అంటారు. అరే, రామాయణం, భాగవతం, గీత మొదలైనవి వినేందుకు వెళ్తారు కదా, అలాగే ఇది కూడా వినాలి, లేకపోతే సేవ చేసే ఉత్సాహం పెరగదు. ఫలానా స్థానములో ఈ సేవ జరిగింది, అభిరుచి ఉన్నట్లయితే ఎవరినైనా చదివి వినిపించమని అడగండి. మ్యాగజీన్ ను చదవనివారు కూడా ఎన్నో సెంటర్లలో ఉంటారు. సేవ యొక్క నామ-రూపాలు కూడా లేనివారు ఎందరో ఉన్నారు. వారు పదవిని కూడా అలాగే పొందుతారు. ఇక్కడైతే రాజధాని స్థాపన అవుతోందని భావిస్తారు, ఇందులో ఎవరు ఎంతగా కష్టపడతారో అంతటి పదవిని పొందుతారు. చదువులో అటెన్షన్ పెట్టకపోతే ఫెయిల్ అయిపోతారు. మొత్తం ఆధారమంతా ఈ సమయములోని చదువుపై ఉంది. ఎంతగా చదువుతారో మరియు చదివిస్తారో అంతగా స్వయానికే లాభము ఉంటుంది. మ్యాగజీన్ ను చదవాలి అన్న ఆలోచన కూడా రాని పిల్లలు ఎందరో ఉన్నారు, వారు పైసకు కొరగాని పదవిని పొందుతారు. ఆ ప్రపంచములో - ఫలానావారు ఈ పురుషార్థాన్ని చేసారు కాబట్టే ఇటువంటి పదవి లభించింది అన్న ఆలోచన కూడా ఉండదు. కర్మ-వికర్మల విషయాలన్నీ ఇక్కడే బుద్ధిలో ఉన్నాయి.

కల్పము యొక్క సంగమయుగములోనే తండ్రి అర్థం చేయిస్తారు, ఎవరైతే అర్థం చేసుకోరో వారు రాతిబుద్ధి వంటివారు. మేము తుచ్ఛబుద్ధి కలవారిగా ఉండేవారము అని మీరు కూడా భావిస్తారు, అందులో కూడా పర్సెంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇది కలియుగమని, ఇందులో అపారమైన దుఃఖాలు ఉంటాయని, ఈ-ఈ దుఃఖాలు ఉన్నాయని బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. వివేకవంతులు ఎవరైతే ఉంటారో వారు - వీరు చెప్పేది నిజమేనని వెంటనే అర్థం చేసుకుంటారు. నిన్న మనం ఎంత దుఃఖితులుగా ఉండేవారమో మీకు కూడా తెలుసు. అపారమైన దుఃఖాల మధ్యలో ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ అపారమైన సుఖాల మధ్యలోకి వెళ్తున్నాము. ఇది రావణరాజ్యము, కలియుగము - ఇది కూడా మీకు తెలుసు. ఎవరైతే తెలుసుకుంటారో కానీ ఇతరులకు అర్థం చేయించరో వారికి ఏమీ తెలియదు అనే బాబా అంటారు. ఎప్పుడైతే సేవ చేస్తారో, సమాచారము మ్యాగజీన్ లో వస్తుందో అప్పుడే వారికి తెలుసు అని అంటారు. రోజురోజుకు బాబా చాలా సహజమైన పాయింట్లను కూడా వినిపిస్తూ ఉంటారు. కలియుగము ఇంకా బాల్యములోనే ఉంది అని వారు భావిస్తారు. ఎప్పుడైతే సంగమయుగమని అర్థం చేసుకుంటారో అప్పుడే సత్యయుగానికి మరియు కలియుగానికి ఉన్న తేడాను పోల్చగలుగుతారు. కలియుగములో అపారమైన దుఃఖము ఉంది, సత్యయుగములో అపారమైన సుఖము ఉంటుంది. అపారమైన సుఖాన్ని పిల్లలైన మాకు తండ్రి ఇస్తున్నారు, దానినే మేము వర్ణన చేస్తున్నాము అని చెప్పండి. ఇంకెవ్వరూ ఈ విధంగా అర్థం చేయించలేరు. మీరు కొత్త విషయాలను వినిపిస్తారు. మీరు స్వర్గవాసులా లేక నరకవాసులా అని ఈ విధంగా ఇంకెవ్వరూ ప్రశ్నించలేరు. పిల్లలైన మీలో కూడా నంబరువారుగా ఉన్నారు, ఇన్ని పాయింట్లను గుర్తుంచుకోలేరు. అర్థం చేయించేటప్పుడు దేహాభిమానం వచ్చేస్తుంది. ఆత్మయే వింటుంది లేక ధారణ చేస్తుంది. కానీ మంచి-మంచి మహారథులు కూడా దీనిని మర్చిపోతారు. దేహాభిమానములోకి వచ్చి మాట్లాడడం మొదలుపెడతారు, ఇలా అందరికీ జరుగుతుంది. అందరూ పురుషార్థులేనని తండ్రి అంటారు. ఆత్మగా భావిస్తూ మాట్లాడుతారని కాదు. తండ్రి ఆత్మగా భావిస్తూ జ్ఞానాన్ని ఇస్తారు. ఇకపోతే సోదరులెవరైతే ఉన్నారో వారంతా అటువంటి అవస్థలో నిలిచేందుకు పురుషార్థము చేస్తున్నారు. పిల్లలు కూడా అర్థం చేయించాలి - కలియుగములో అపారమైన దుఃఖము ఉంది, సత్యయుగములో అపారమైన సుఖము ఉంది, ఇప్పుడు సంగమయుగము నడుస్తోంది. తండ్రి దారిని తెలియజేస్తున్నారు. తండ్రి సుఖాన్ని ఇస్తున్నారని కాదు, వారు సుఖము యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. రావణుడు కూడా దుఃఖాన్ని ఇవ్వడు, దుఃఖాన్ని కలిగించే తప్పుడు మార్గాన్ని తెలియజేస్తాడు. తండ్రి దుఃఖమునూ ఇవ్వరు, సుఖమునూ ఇవ్వరు, సుఖము యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. ఆపై ఎవరు ఎంతగా పురుషార్థము చేస్తారో, అంతగా సుఖము లభిస్తుంది. వారు సుఖాన్ని ఇవ్వరు. తండ్రి శ్రీమతముపై నడవడం ద్వారా సుఖాన్ని పొందుతారు. తండ్రి కేవలం మార్గాన్ని తెలియజేస్తారు. రావణుడి ద్వారా దుఃఖము యొక్క మార్గము లభిస్తుంది. ఒకవేళ తండ్రి ఇస్తున్నట్లయితే అందరికీ ఒకే విధమైన వారసత్వము లభించాలి. లౌకిక తండ్రి కూడా వారసత్వాన్ని పంచుతారు కదా. ఇక్కడైతే ఎవరు ఎలా పురుషార్థం చేస్తే అలా పొందుతారు. తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. ఇలా, ఇలా చేస్తే ఇంతటి ఉన్నత పదవిని పొందుతారు అని చెప్తారు. మేము అందరికన్నా ఎక్కువ పదవిని పొందాలి, చదువుకోవాలి అని పిల్లలు పురుషార్థం చేయవలసి ఉంటుంది. వీరు ఉన్నత పదవిని పొందితే పొందారు, నేనైతే కూర్చొని ఉంటాను అని భావించకూడదు. అలా ఉండకూడదు. పురుషార్థమే ఫస్ట్. డ్రామానుసారంగా పురుషార్థము తప్పకుండా చేయవలసి ఉంటుంది. కొందరు తీవ్ర పురుషార్థం చేస్తారు, కొందరు డల్ గా చేస్తారు. మొత్తమంతా పురుషార్థముపైనే ఆధారపడి ఉంది. నన్ను స్మృతి చేయండి అని తండ్రి అయితే మార్గాన్ని తెలియజేసారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనమవుతాయి. డ్రామాపై వదిలివేయకూడదు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము.

ప్రపంచ చరిత్ర-భౌగోళము రిపీట్ అవుతుంది. కావున తప్పకుండా ఏ పాత్రనైతే అభినయించారో దానినే మళ్ళీ అభినయించవలసి ఉంటుంది. అన్ని ధర్మాలూ మళ్ళీ తమ సమయానుసారముగా వస్తాయి. క్రిస్టియన్లు ఇప్పుడు 100 కోట్లమంది ఉన్నట్లయితే మళ్ళీ అంతమందే పాత్రను అభినయించడానికి వస్తారు. ఆత్మా వినాశనమవ్వదు, అలాగే ఆత్మలోని పాత్ర కూడా ఎప్పుడూ వినాశనమవ్వదు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తప్పకుండా అర్థం చేయిస్తారు కూడా. ధనము ఇచ్చినా అది తరగదు. ధారణ జరుగుతూ ఉంటుంది, ఇతరులను కూడా షావుకార్లుగా తయారుచేస్తూ ఉంటారు. కానీ భాగ్యములో లేకపోతే స్వయాన్ని వివశులుగా భావిస్తారు. టీచర్ ఏమంటారంటే - మీరు చెప్పలేకపోతే మీ భాగ్యములో పైసకు కొరగాని పదవి ఉన్నట్లు. భాగ్యములోనే లేకపోతే పురుషార్థము ఏమి చేయగలరు. ఇది అనంతమైన పాఠశాల. ప్రతి టీచర్ యొక్క సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది. తండ్రి చదివించే విధానము తండ్రికే తెలుస్తుంది మరియు పిల్లలైన మీకు తెలుస్తుంది, దీనిని ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. పిల్లలైన మీరు ఎంత ప్రయత్నిస్తారు, అయినా కానీ ఎవరైనా అర్థం చేసుకోవాలి కదా. బుద్ధిలో కూర్చోనే కూర్చోదు. ఎంతగా సమీపముగా వస్తూ ఉంటారో అంతగా చురుకైనవారిగా అవుతూ ఉంటారని గమనించడం జరిగింది. ఇప్పుడు మ్యూజియం, ఆత్మిక కాలేజీ మొదలైనవాటిని కూడా తెరుస్తారు. మీ పేరే అతీతమైనది - ఆత్మిక యూనివర్శిటీ. గవర్నమెంట్ కూడా చూస్తుంది. మీది దైహికమైన యూనివర్శిటీ, ఇది ఆత్మికమైనది అని చెప్పండి. ఇక్కడ ఆత్మ చదువుతుంది. మొత్తం 84 జన్మల చక్రములో ఒకేసారి ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలను చదివిస్తారు. డ్రామా (సినిమా) చూసినప్పుడు మళ్ళీ మూడు గంటల తర్వాత ఖచ్చితముగా అదే రిపీట్ అవుతుంది అని మీరు చూస్తారు. అలాగే ఈ 5000 సంవత్సరాల చక్రము కూడా ఖచ్చితముగా అదే విధంగా రిపీట్ అవుతుంది. ఇది పిల్లలైన మీకు తెలుసు. వారు కేవలం భక్తిలోని శాస్త్రాలనే యథార్థమైనవిగా భావిస్తారు. మీకైతే ఏ శాస్త్రాలూ లేవు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రి ఏమైనా శాస్త్రాలను చదివారా? వారు గీతను చదివి వినిపిస్తారు. తల్లి కడుపు నుండే చదువుకున్నవారైతే రారు కదా. అనంతమైన తండ్రి పాత్ర చదివించే పాత్ర. వారు తమ పరిచయాన్ని ఇస్తారు. ఇది ప్రపంచానికి తెలియనే తెలియదు. తండ్రిని జ్ఞానసాగరుడు అని కూడా మహిమ చేస్తారు. శ్రీకృష్ణుడి గురించి జ్ఞానసాగరుడు అని అనరు. ఈ లక్ష్మీ-నారాయణులు ఏమైనా జ్ఞానసాగరులా? కాదు. ఇదే అద్భుతము. బ్రాహ్మణులమైన మనమే శ్రీమతముపై ఈ జ్ఞానాన్ని వినిపిస్తాము. ఈ లెక్కలో బ్రాహ్మణులమైన మనమే ప్రజాపిత బ్రహ్మా సంతానము అని మీరు అర్థం చేసుకుంటారు. ఇలా అనేక సార్లు అయ్యాము, మళ్ళీ అవుతాము. ఇది మనుష్యులకెప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు అంగీకరిస్తారు. కల్ప-కల్పమూ మనం ప్రజాపిత బ్రహ్మాకు సంతానముగా, దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అవుతామని మీకు తెలుసు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు నిశ్చయబుద్ధి కలవారిగా కూడా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవుతారు. ప్రతి ఒక్కరి బుద్ధిపై ఆధారపడి ఉంది. స్కూల్లో కొందరు స్కాలర్షిప్ తీసుకుంటారు, కొందరు ఫెయిల్ అయిపోతారు. మళ్ళీ కొత్తగా చదవవలసి ఉంటుంది. తండ్రి అంటారు, వికారాల్లో పడిపోతే చేసుకున్న సంపాదన అంతా పోగొట్టుకుంటారు, ఇక తర్వాత బుద్ధిలో కూర్చోదు, లోలోపల తింటూ ఉంటుంది.

ఈ జన్మలో ఏ పాపాలనైతే చేసారో వాటి గురించైతే అందరికీ తెలుసు. అంతకుముందు జన్మల్లో ఏమి చేసారో అవైతే గుర్తుండవు కానీ పాపాలు తప్పకుండా చేసారు. ఎవరైతే పుణ్యాత్ములుగా ఉండేవారో, వారే మళ్ళీ పాపాత్ములుగా అవుతారు. లెక్కచారాలను తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు. చాలామంది పిల్లలు ఉన్నారు, వారు మర్చిపోతారు, చదువుకోరు. ఒకవేళ చదువుకున్నట్లయితే తప్పకుండా చదివిస్తారు కూడా. మందబుద్ధి కలవారు కొందరు చురుకైన బుద్ధి కలవారిగా అయిపోతారు, ఇది ఎంత పెద్ద చదువు. ఈ తండ్రి చెప్పే చదువు ద్వారానే సూర్యవంశ, చంద్రవంశ రాజ్యవంశాలు తయారవ్వనున్నాయి. వారు ఈ జన్మలోనే చదువుకొని పదవిని పొందుతారు. ఈ చదువు ద్వారా పొందే పదవి కొత్త ప్రపంచములో లభించనున్నదని మీకు తెలుసు. అదేమీ దూరముగా లేదు. ఏ విధంగా బట్టలు మార్చడం జరుగుతుందో, అలాగే పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచానికి చెందినవారిగా అవుతున్నారు. ఇక ఈ పాత వస్త్రాన్ని వదిలి వెళ్ళాలి. నంబరువారుగా రాజధాని స్థాపన అవుతోంది. ఎవరైతే బాగా చదువుకుంటారో, వారే మొదట స్వర్గములోకి వస్తారు, మిగిలినవారు వెనుక వస్తారు, వారు స్వర్గములోకి రాలేరు. స్వర్గములో దాస-దాసీలు ఎవరైతే ఉంటారో వారు కూడా హృదయం పైకి ఎక్కే ఉంటారు. అందరూ వస్తారని కాదు. ఇప్పుడు ఆత్మిక కాలేజీలు మొదలైనవి తెరుస్తూ ఉంటారు, అందరూ వచ్చి పురుషార్థము చేస్తారు. ఎవరైతే చదువులో ఉన్నతముగా, చురుకుగా ముందుకు వెళ్తారో, వారు ఉన్నత పదవిని పొందుతారు. మందబుద్ధి కలవారు తక్కువ పదవిని పొందుతారు. మున్ముందు మందబుద్ధి కలవారు కూడా మంచి పురుషార్థము చేయడం మొదలుపెట్టే అవకాశము ఉంది, అలాగే తెలివైన బుద్ధి కలవారు కొందరు కిందకు కూడా వెళ్ళిపోతారు. పురుషార్థము ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా డ్రామాగా నడుస్తోంది. ఆత్మ శరీరాన్ని ధారణ చేసి ఇక్కడ పాత్రను అభినయిస్తుంది, కొత్త వస్త్రాన్ని ధారణ చేసి కొత్త పాత్రను అభినయిస్తుంది. ఒక్కోసారి ఒక్కోలా అవుతుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. జ్ఞానము బయట ఎవరి వద్దా కొద్దిగా కూడా ఉండదు. ఎప్పుడైతే తండ్రి వచ్చి చదివిస్తారో అప్పుడే జ్ఞానం లభిస్తుంది. టీచరే లేకపోతే జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది. అది భక్తి. భక్తిలో అపారమైన దుఃఖము ఉంది. మీరాకు ఎన్నో సాక్షాత్కారాలు జరిగినా సుఖము అయితే లేదు కదా. ఆమె ఎప్పుడూ రోగగ్రస్థముగా అయి ఉండరా? స్వర్గములోనైతే ఎటువంటి దుఃఖము విషయమూ ఉండదు. ఇక్కడ అపారమైన దుఃఖము ఉంది, అక్కడ అపారమైన సుఖము ఉంటుంది. ఇక్కడ అందరూ దుఃఖితులుగా అవుతారు. రాజులకు కూడా దుఃఖము ఉంటుంది కదా, దీని పేరే దుఃఖధామము, అది సుఖధామము. సంపూర్ణ దుఃఖము మరియు సంపూర్ణ సుఖము యొక్క సంగమయుగము ఇది. సత్యయుగములో సంపూర్ణ సుఖము ఉంటుంది, కలియుగములో సంపూర్ణ దుఃఖము ఉంటుంది. దుఃఖపు వెరైటీ ఏదైతే ఉంటుందో అదంతా వృద్ధి చెందుతూ ఉంటుంది. మున్ముందు ఎంత దుఃఖము కలుగుతూ ఉంటుంది. అపారమైన దుఃఖపు పర్వతాలు పడతాయి.

వారైతే మీకు మాట్లాడేందుకు చాలా తక్కువ సమయాన్ని ఇస్తారు. రెండు నిమిషాలు ఇచ్చినా ఇలా అర్థం చేయించండి - సత్యయుగములో అపారమైన సుఖము ఉండేది, దానిని తండ్రి ఇచ్చారు. రావణుడి ద్వారా అపారమైన దుఃఖాలు లభిస్తాయి. కామముపై విజయాన్ని పొందినట్లయితే జగత్తును జయించినవారిగా అవుతారు అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఈ జ్ఞానము వినాశనమవ్వదు. కొద్దిగా విన్నా సరే స్వర్గములోకి వస్తారు. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు. రాజు ఎక్కడ, ప్రజలు ఎక్కడ. ప్రతి ఒక్కరి బుద్ధి ఎవరిది వారిదే. ఎవరైతే అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయిస్తారో, వారే మంచి పదవిని పొందుతారు. ఈ స్కూలు కూడా ఎంతో అసాధారణమైనది. భగవంతుడు వచ్చి చదివిస్తారు. శ్రీకృష్ణుడు ఎంతైనా దైవీ గుణాలు కలిగిన దేవత. తండ్రి అంటారు, నేను దైవీ గుణాలకు మరియు అసురీ గుణాలకు అతీతమైనవాడిని. మీ తండ్రినైన నేను చదివించేందుకు వస్తాను. ఆత్మిక జ్ఞానాన్ని పరమ ఆత్మయే ఇస్తారు. గీతా జ్ఞానాన్ని దేహధారీ మనుష్యులు లేక దేవతలు ఇవ్వలేదు. విష్ణు దేవతాయ నమః అని అంటారు, మరి శ్రీకృష్ణుడు ఎవరు? దేవత అయిన కృష్ణుడే విష్ణువు - ఇది ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా కొందరు మర్చిపోతారు. స్వయం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు. సేవ చేసి ఋజువును తీసుకువచ్చినట్లయితే వారు సేవ చేసారు అని అర్థం చేసుకోవచ్చు. అందుకే తండ్రి అంటున్నారు, ఎక్కువ సమాచారాన్ని వ్రాయకండి, ఫలానావారు రాబోతున్నారు, వీరు వస్తానని చెప్పి వెళ్ళారు... ఇలా వ్రాయవలసిన అవసరం లేదు, తక్కువ వ్రాయాలి. వారు వచ్చాక నిలుస్తున్నారో లేదో చూడండి, వారు అర్థం చేసుకొని సేవ చేయడం మొదలుపెడితే అప్పుడు సమాచారం వ్రాయండి. కొందరు తమ షోను బాగా చేసుకుంటారు. బాబాకు ప్రతి విషయములో రిజల్టు కావాలి. బాబా వద్దకు ఇలా ఎంతోమంది వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దాని వల్ల లాభమేముంది? వారిని బాబా ఏమి చేసుకుంటారు? వారికీ లాభం లేదు, మీకూ లాభం లేదు. మీ మిషన్ యొక్క వృద్ధి అయితే జరగలేదు కదా. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ విషయములోనూ వివశులుగా అవ్వకూడదు. స్వయములో జ్ఞానాన్ని ధారణ చేసి దానం చేయాలి. ఇతరుల భాగ్యాన్ని కూడా మేల్కొలపాలి.

2. ఎవరితోనైనా మాట్లాడే సమయములో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి, కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు. తండ్రి ద్వారా ఏ అపారమైన సుఖాలైతే లభించాయో వాటిని ఇతరులకు పంచాలి.

వరదానము:-

దిల్ మరియు దిమాగ్ (మనస్సు మరియు బుద్ధి) యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సదా సఫలతామూర్త భవ

చాలా సార్లు పిల్లలు సేవలో కేవలం బుద్ధిని ఉపయోగిస్తారు కానీ మనస్సు మరియు బుద్ధి, ఈ రెండింటినీ కలిపి సేవ చేసినట్లయితే సేవలో సఫలతామూర్తులుగా అవుతారు. ఎవరైతే కేవలం బుద్ధితో చేస్తారో వారి బుద్ధిలో కొద్ది సమయము కోసమే - అవును, బాబాయే చేయించేవారు అని తండ్రి స్మృతి ఉంటుంది, కానీ కొద్ది సమయము తర్వాత మళ్ళీ అదే నేను అనేది వచ్చేస్తుంది. మరియు ఎవరైతే మనసుతో చేస్తారో, వారి మనసులో బాబా స్మృతి సదా ఉంటుంది. మనసుతో చేసే సేవకే ఫలము లభిస్తుంది మరియు ఒకవేళ రెండింటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత ఉంటుంది.

స్లోగన్:-

అనంతములో ఉన్నట్లయితే హద్దు విషయాలు స్వతహాగనే సమాప్తమైపోతాయి.