ఓంశాంతి
శాంతిగా కూర్చోబెట్టినప్పుడు, దానికి నేష్ఠ అన్న పదాన్ని ఉపయోగిస్తారు, ఆ సమయములో ఈ
డ్రిల్ చేయించడం జరుగుతుంది అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఇప్పుడు తండ్రి
కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఎవరైతే జీవిస్తూ మరణించారో, వారు
మేము జీవిస్తూ మరణించాము అని అంటారు కదా, అయితే మనిషి మరణించినప్పుడు అంతా
మర్చిపోతాడు, కేవలం సంస్కారాలు మాత్రమే మిగిలి ఉంటాయి, అలా ఇప్పుడు మీరు కూడా
తండ్రికి చెందినవారిగా అయ్యి ప్రపంచము నుండి మరణించారు. తండ్రి అంటారు, మీలో
ఇంతకుముందు భక్తి సంస్కారాలు ఉండేవి, ఇప్పుడు ఆ సంస్కారాలు మారుతున్నాయి, అంటే
జీవిస్తూ మీరు మరణిస్తారు కదా. మరణించడముతో మనిషి తాను చదివినదంతా మర్చిపోతాడు,
మళ్ళీ మరుసటి జన్మలో కొత్తగా అంతా చదవవలసి ఉంటుంది. తండ్రి కూడా అంటారు, మీరు
ఇంతవరకూ ఏదైతే చదివి ఉన్నారో, దానిని మర్చిపోండి. మీరు తండ్రికి చెందినవారిగా
అయ్యారు కదా. నేను మీకు కొత్త విషయాన్ని వినిపిస్తాను. కావున ఇప్పుడు వేదాలు,
శాస్త్రాలు, గ్రంథాలు, జపతపాదులు మొదలైన విషయాలన్నింటినీ మర్చిపోండి, అందుకే - చెడు
వినవద్దు, చెడు చూడవద్దు అని అన్నారు. ఇది పిల్లలైన మీ కోసమే. కొందరు శాస్త్రాలు
మొదలైనవి ఎన్నో చదివి ఉంటే, పూర్తిగా మరణించకపోతే, వారు వ్యర్థముగా వాదిస్తూ ఉంటారు.
మరణించినట్లయితే ఇక ఎప్పుడూ వాదించరు. అటువంటివారు - తండ్రి ఏదైతే వినిపించారో అదే
సత్యము, మిగిలిన విషయాల గురించి అసలు ఎందుకు మాట్లాడాలి! అని అంటారు. తండ్రి అంటారు,
వాటి గురించి అసలు మాట్లాడను కూడా మాట్లాడకండి. చెడు వినవద్దు. అసలు ఏమీ వినవద్దు
అని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు కదా. మీరు ఇలా చెప్పండి - ఇప్పుడు మేము జ్ఞానసాగరునికి
పిల్లలుగా అయ్యాము కనుక భక్తిని ఎందుకు తలచుకోవాలి, మేము ఒక్క భగవంతుడినే స్మృతి
చేస్తాము. తండ్రి చెప్పారు, భక్తి మార్గాన్ని మర్చిపోండి. నేను మీకు సహజమైన
విషయాన్ని తెలియజేస్తున్నాను, అదేమిటంటే, బీజమునైన నన్ను స్మృతి చేసినట్లయితే
మొత్తము వృక్షమంతా బుద్ధిలోకి తప్పకుండా వచ్చేస్తుంది. మీకు ముఖ్యమైనది గీత. గీతలోనే
భగవంతుడు అర్థం చేయించినది ఉంది. ఇప్పుడు ఇవి కొత్త విషయాలు. కొత్త విషయముపై
ఎల్లప్పుడూ ఎక్కువ శ్రద్ధ చూపించడం జరుగుతుంది. వాస్తవానికి ఇది చాలా సహజమైన విషయము.
అన్నింటికంటే పెద్ద విషయము - స్మృతి చేయడము. ఘడియ-ఘడియ మన్మనాభవ అని చెప్పవలసి
వస్తుంది. తండ్రిని స్మృతి చేయండి, ఇవే అన్నింటికంటే గుహ్యమైన విషయాలు, ఇందులోనే
విఘ్నాలు కలుగుతాయి. రోజంతటిలో రెండు నిమిషాలు కూడా స్మృతి చేయని పిల్లలు చాలామంది
ఉన్నారు. తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత కూడా మంచి కర్మలు చేయకపోతే స్మృతి కూడా
చేయరు, వికర్మలు చేస్తూ ఉంటారు. బుద్ధిలో కూర్చోనే కూర్చోకపోతే, అది తండ్రి ఆజ్ఞను
అగౌరవపరిచినట్లు అవుతుంది, ఇక చదవలేకపోతారు, ఆ శక్తి లభించదు. దైహికమైన చదువు ద్వారా
కూడా బలము లభిస్తుంది కదా. చదువు సంపాదనకు ఆధారము. చదువు ద్వారా శరీర నిర్వహణ
జరుగుతుంది, అది కూడా అల్పకాలము కొరకు. ఎవరైనా చదువుకుంటూ, చదువుకుంటూ మరణిస్తే ఆ
చదువును తమతోపాటు తీసుకువెళ్ళలేరు కదా. మరో జన్మ తీసుకుని మళ్ళీ కొత్తగా చదవవలసి
ఉంటుంది. ఇక్కడైతే మీరు ఎంతగా చదువుతారో, అంతగా దానిని మీతో పాటు తీసుకువెళ్తారు
ఎందుకంటే మీరు ప్రారబ్ధాన్ని మరుసటి జన్మలో పొందుతారు. మిగిలిన అదంతా భక్తి మార్గము.
ఏమేమి విషయాలు ఉన్నాయి అనేది ఎవ్వరికీ తెలియదు. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మలైన మీకు
జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి అయిన పరమాత్మ ఒకేసారి వచ్చి ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తారు,
దానితో విశ్వానికి యజమానులుగా అవుతారు. భక్తి మార్గములో స్వర్గము ఉండదు కదా. ఇప్పుడు
మీరు నాథుడికి చెందినవారిగా అయ్యారు. మాయ ఎన్నో సార్లు పిల్లలను కూడా అనాథలుగా
చేసేస్తుంది, చిన్న-చిన్న విషయాలలో పరస్పరం కొట్లాడుకుంటారు. తండ్రి స్మృతిలో
ఉండకపోతే అనాథలుగా అయినట్లే కదా. అనాథలుగా అయ్యారంటే తప్పకుండా ఏదో ఒక పాప కర్మ
చేసేస్తారు. తండ్రి అంటారు, నాకు చెందినవారిగా అయి నా పేరును అప్రతిష్ఠపాలు చేయకండి.
ఒకరితో ఒకరు చాలా ప్రేమగా నడుచుకోండి, తప్పుడు మాటలు మాట్లాడకండి.
తండ్రి ఇటువంటి అహల్యలను, గూని స్త్రీలను, ఆదివాసి స్త్రీలను కూడా ఉద్ధరించవలసి
ఉంటుంది. ఆదివాసి స్త్రీ ఇచ్చిన రేగి పళ్ళను తిన్నట్లుగా చూపించారు. ఇప్పుడు
అటువంటివారు ఇచ్చినదానిని ఊరికే అలా తినలేరు కదా. ఆదివాసి స్త్రీ నుండి ఎప్పుడైతే
బ్రాహ్మణిగా అవుతుందో, అప్పుడిక ఎందుకు తినరు! అందుకే బ్రహ్మా భోజనానికి మహిమ ఉంది.
శివబాబా అయితే తినరు. వారు అభోక్త. ఈ రథమైతే తింటారు కదా. పిల్లలైన మీరు ఎవరితోనూ
వాదించవలసిన అవసరము లేదు. ఎప్పుడూ మిమ్మల్ని మీరు సేఫ్ సైడ్ (సురక్షితముగా)
ఉంచుకోవాలి. రెండే మాటలు చెప్పండి - శివబాబా చెప్తున్నారు. శివబాబానే రుద్రుడు అని
అంటారు. రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల వెలువడింది కావున రుద్రుడు భగవంతుడు
అయినట్లు కదా. శ్రీకృష్ణుడినైతే రుద్రుడు అని అనరు. వినాశనాన్ని కూడా శ్రీకృష్ణుడేమీ
చేయించరు. తండ్రియే స్థాపన, వినాశనము, పాలన చేయిస్తారు. స్వయమేమీ చేయరు, లేదంటే దోషం
మోపబడుతుంది. వారు చేసేవారు, చేయించేవారు. తండ్రి అంటారు, నేనేమీ వినాశనము చేయండి
అని చెప్పను. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. శంకరుడేమైనా చేస్తారా ఏమిటి? ఏమీ చేయరు.
శంకరుడి ద్వారా వినాశనము అని కేవలం గాయనము మాత్రమే ఉంది. ఇకపోతే వినాశనమైతే వారు
తమంతట తామే చేస్తున్నారు. ఇది ఆనాదిగా తయారుచేయబడిన డ్రామా, ఇది అర్థం చేయించడం
జరుగుతుంది. రచయిత అయిన తండ్రినే అందరూ మర్చిపోయారు. గాడ్ ఫాదరే రచయిత అని అంటారు
కానీ వారి గురించి తెలియనే తెలియదు. వారు ప్రపంచాన్ని సృష్టిస్తారు అని భావిస్తారు.
తండ్రి అంటారు, నేను సృష్టించను, నేను పరివర్తన చేస్తాను. కలియుగాన్ని సత్యయుగముగా
తయారుచేస్తాను. నేను సంగమములో వస్తాను, దీనినే సుప్రీమ్ ఆస్పీషియస్ (సర్వ
శ్రేష్ఠమైన కళ్యాణకారీ) యుగము అని అంటారు. భగవంతుడు కళ్యాణకారి, వారు అందరి
కళ్యాణాన్ని చేస్తారు, కానీ ఎలా మరియు ఏమి కళ్యాణం చేస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు.
ఇంగ్లీష్ లో లిబరేటర్, గైడ్ (ముక్తిప్రదాత, మార్గదర్శకుడు) అని అంటారు కానీ దాని
అర్థాన్ని అర్థం చేసుకోరు. భక్తి తర్వాత భగవంతుడు లభిస్తారని, సద్గతి లభిస్తుందని
అంటారు. సర్వుల సద్గతిని అయితే మనుష్యులెవ్వరూ చేయలేరు. లేదంటే పరమాత్మను పతిత-పావనా,
సర్వుల సద్గతిదాత అని ఎందుకు అంటారు? తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు, అనాథలుగా
ఉన్నారు. తండ్రి పట్ల ప్రీతి బుద్ధి లేనివారిగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఏం చేయగలరు.
తండ్రి అయితే స్వయం యజమాని. వారి శివ జయంతిని కూడా భారత్ లో జరుపుకుంటారు. తండ్రి
అంటారు, నేను భక్తులకు ఫలాన్ని ఇవ్వడానికి వస్తాను. రావడము కూడా భారత్ లోనే వస్తాను.
మరి రావడము కోసం నాకు శరీరమైతే తప్పకుండా కావాలి కదా. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు కదా.
వీరిలోకి ప్రవేశించి, వీరి నోటి ద్వారా మీకు జ్ఞానాన్ని ఇస్తాను. ఇది గోముఖానికి
సంబంధించిన విషయము కాదు. ఇది వీరి నోటికి సంబంధించిన విషయము. నోరు అంటే మనుష్యుల
నోరు కావాలి, అంతేకానీ జంతువులది కాదు. ఈ మాత్రము కూడా బుద్ధి పని చేయదు. ఇంకొకవైపు
భగీరథుడిని కూడా చూపిస్తారు, అతను ఎప్పుడు వస్తారు మరియు ఎలా వస్తారు అనేది కొద్దిగా
కూడా ఎవరికీ తెలియదు. కావున తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు, మీరు
మరణించారు కావున భక్తి మార్గాన్ని పూర్తిగా మర్చిపోండి. శివ భగవానువాచ, నన్ను స్మృతి
చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి. నేనే పతిత-పావనుడను. మీరు పవిత్రముగా అయిపోతే,
ఇక అందరినీ తీసుకువెళ్తాను. ఇంటింటికీ సందేశాన్ని అందించండి. తండ్రి అంటారు, నన్ను
స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మీరు పవిత్రముగా అయిపోతారు. వినాశనము
ఎదురుగా నిలబడి ఉంది. ఓ పతిత-పావనా రండి, పతితులను పావనముగా చేయండి, రామ రాజ్యాన్ని
స్థాపన చేయండి, రావణ రాజ్యము నుండి ముక్తులుగా చేయండి అని మీరు పిలుస్తారు కూడా.
వారంతా ఎవరి కోసం వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ తండ్రి అంటారు, నేను వచ్చి
అందరికీ ముక్తిని ఇస్తాను. అందరూ పంచ వికారాల రూపీ రావణుడి జైలులో పడి ఉన్నారు, నేను
సర్వుల సద్గతిని చేస్తాను. నన్ను దుఃఖహర్త, సుఖకర్త అని కూడా అంటారు. రామ రాజ్యమనేది
తప్పకుండా కొత్త ప్రపంచములో ఉంటుంది.
పాండవులైన మీది ఇప్పుడు ప్రీతి బుద్ధి. కొందరిదైతే వెంటనే ప్రీతి బుద్ధిగా
తయారవుతుంది. కొందరికేమో మెల్లమెల్లగా ప్రీతి జోడించబడుతుంది. కొందరు, మేము
సర్వస్వాన్ని తండ్రికి సమర్పిస్తాము అని అంటారు. ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేనే లేరు.
అందరికీ ఆధారము ఒక్క భగవంతుడే. ఇది ఎంత సహజాతి సహజమైన విషయము. తండ్రిని స్మృతి
చేయండి మరియు చక్రాన్ని స్మృతి చేయండి, తద్వారా చక్రవర్తి రాజు-రాణులుగా అవుతారు. ఈ
స్కూల్ ఉన్నదే విశ్వానికి యజమానులుగా తయారయ్యేందుకు, అందుకే చక్రవర్తి రాజు అన్న
పేరు ఏర్పడింది. చక్రాన్ని తెలుసుకోవడము ద్వారా చక్రవర్తిగా అవుతారు. ఇది తండ్రియే
అర్థం చేయిస్తారు. ఇకపోతే ఏమీ వాదించకూడదు. భక్తి మార్గపు విషయాలన్నింటినీ వదిలేయండి
అని చెప్పండి. తండ్రి అంటారు, కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇదే ముఖ్యమైన
విషయము. తీవ్ర పురుషార్థులు ఎవరైతే ఉంటారో, వారు చాలా తీవ్రముగా చదువులో
నిమగ్నమైపోతారు. ఎవరికైతే చదువు పట్ల అభిరుచి ఉంటుందో, వారు ఉదయాన్నే లేచి
చదువుకుంటారు. భక్తి చేసేవారు కూడా ఉదయాన్నే లేస్తారు. నవవిధ భక్తి ఎంతగా చేస్తారు.
తల నరుక్కునేందుకు సిద్ధమైనప్పుడు సాక్షాత్కారము కలుగుతుంది. కానీ ఇక్కడైతే ఈ
సాక్షాత్కారాలు కూడా నష్టదాయకమని తండ్రి అంటారు. సాక్షాత్కారాలలోకి వెళ్ళినట్లయితే
చదువు మరియు యోగము, రెండూ ఆగిపోతాయి. సమయము వృధా అవుతుంది. అందుకే ధ్యానము
మొదలైనవాటి పట్ల అభిరుచిని అసలు ఉంచుకోకూడదు. ఇది కూడా పెద్ద జబ్బు, దీని ద్వారా
మాయ ప్రవేశిస్తుంది. యుద్ధాలు జరిగే సమయములో సమాచారము వినిపించేటప్పుడు దానిని
ఎవ్వరూ వినలేకుండా మధ్యలో తరంగాలను డిస్టర్బ్ చేసేస్తారు. అలాగే మాయ కూడా ఎంతోమందికి
విఘ్నాలను కలిగిస్తుంది. తండ్రిని స్మృతి చేయనివ్వదు. ఇతని భాగ్యములో విఘ్నాలే
ఉన్నాయని భావించడం జరుగుతుంది. మాయ ఏమీ ప్రవేశించలేదు కదా, నియమవిరుద్ధముగా అయితే
ఏమీ చెప్పటము లేదు కదా అని చూడడం జరుగుతుంది, అలా జరిగితే బాబా సాక్షాత్కారము నుండి
క్రిందికి దింపేస్తారు. చాలామంది మనుష్యులేమంటారంటే - కేవలం మాకు సాక్షాత్కారము
జరిగితే ఇంతటి ధనము, సంపద మొదలైనవన్నీ మేము మీకు ఇచ్చేస్తాము. బాబా అంటారు, అది మీరు
మీ వద్దనే ఉంచుకోండి. భగవంతుడికి మీ ధనము యొక్క అవసరమేముంది. ఈ పాత ప్రపంచములో ఏదైతే
ఉందో అదంతా భస్మమైపోతుందని తండ్రికి తెలుసు. బాబా ఏం చేసుకుంటారు? బాబా వద్దనైతే
బిందువు, బిందువు చేరుకుని సరోవరముగా తయారవుతుంది. తండ్రి డైరెక్షన్లపై నడవండి,
హాస్పిటల్ మరియు యూనివర్శిటీ తెరవండి, అక్కడకు ఎవరైనా వచ్చి విశ్వానికి యజమానులుగా
అవ్వగలగాలి. 3 అడుగుల భూమిపై కూర్చుని మీరు మనుష్యులను నరుడి నుండి నారాయణుడిగా
తయారుచేయాలి. కానీ 3 అడుగుల భూమి కూడా లభించదు. తండ్రి అంటారు, నేను మీకు సర్వ
వేద-శాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి.
బాబా ఏమీ నిందించరు. ఈ ఆట తయారై ఉంది కదా. కేవలం అర్థం చేయించేందుకే అలా చెప్పడం
జరుగుతుంది. వాస్తవానికి ఇది ఆటే కదా. ఆటను మనం నిందించలేము. మనము జ్ఞాన సూర్యుడు,
జ్ఞాన చంద్రుడు అని అంటాము, దానికి వారు ఆ చంద్రుడు మొదలైనవాటిలోకి వెళ్ళి
వెతుకుతారు. అక్కడేమైనా రాజ్యము ఉందా? జపాను వారు సూర్యుడిని నమ్ముతారు. మనము
సూర్యవంశీ అని అంటాము, దానికి వారు సూర్యుడిని పూజిస్తారు, సూర్యుడికి నీరు
సమర్పిస్తారు. బాబా పిల్లలకు అర్థం చేయించారు, ఏ విషయములోనూ ఎక్కువగా వాదించకూడదు.
ఒకే విషయము వినిపించండి - తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పావనముగా
అవుతారు. ఇప్పుడు రావణ రాజ్యములో అందరూ పతితులుగా ఉన్నారు. కానీ ఎవ్వరూ తమను తాము
పతితులుగా భావించరు.
పిల్లలూ, మీకు ఒక నేత్రములో శాంతిధామము, ఒక నేత్రములో సుఖధామము ఉండాలి. ఇక ఈ
దుఃఖధామాన్ని మర్చిపోండి. మీరు చైతన్యమైన లైట్ హౌస్ లు. ‘భారత్, ది లైట్ హౌస్’ అని
ప్రదర్శనీలో కూడా పేరు పెట్టారు. కానీ వారేమీ దానిని అర్థం చేసుకోరు. మీరు ఇప్పుడు
లైట్ హౌస్ లు కదా. పోర్టులో లైట్ హౌస్ స్టీమరుకు దారి చూపిస్తుంది. మీరు కూడా
అందరికీ ముక్తి మరియు జీవన్ముక్తిధామాలకు దారిని చూపిస్తారు. ఎవరైనా ప్రదర్శనీకి
వచ్చినప్పుడు ప్రేమగా చెప్పండి - గాడ్ ఫాదర్ అయితే అందరికీ ఒక్కరే కదా. గాడ్ ఫాదర్
లేక పరమపిత - నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు అంటే, మరి తప్పకుండా నోటి
ద్వారానే చెప్తారు కదా. బ్రహ్మా ద్వారా స్థాపన. బ్రాహ్మణ, బ్రాహ్మణీలమైన మనమందరము
బ్రహ్మా ముఖవంశావళి. బ్రాహ్మణులైన మీకు - ‘బ్రాహ్మణ దేవతాయ నమః’ అని ఆ బ్రాహ్మణులు
కూడా మహిమను పాడుతారు. ఉన్నతోన్నతమైనవారు ఆ ఒక్క తండ్రి మాత్రమే. వారు అంటారు, నేను
మీకు ఉన్నతోన్నతమైన రాజయోగాన్ని నేర్పిస్తాను, దాని ద్వారా మీరు పూర్తి విశ్వానికి
యజమానులుగా అవుతారు. ఆ రాజ్యాన్ని మీ నుండి ఎవ్వరూ దోచుకోలేరు. విశ్వముపై భారత్
యొక్క రాజ్యము ఉండేది. భారత్ కు ఎంత మహిమ ఉంది. మనము శ్రీమతముపై ఈ రాజ్యాన్ని
స్థాపన చేస్తున్నాము అని ఇప్పుడు మీకు తెలుసు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.