19-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అన్నింటికంటే ముఖ్యమైన సేవ తండ్రి స్మృతిలో ఉండడము మరియు ఇతరులకు స్మృతిని కలిగించడము, మీరు ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇచ్చి వారి కళ్యాణాన్ని చేయవచ్చు’’

ప్రశ్న:-
ఏ ఒక్క చిన్న అలవాటు కూడా ఎంతో పెద్ద ఆజ్ఞా ఉల్లంఘనను చేయిస్తుంది? దాని నుండి రక్షించుకునేందుకు యుక్తి ఏమిటి?

జవాబు:-
ఒకవేళ ఎవరిలోనైనా ఏదైనా దాచే అలవాటు లేక దొంగతనం చేసే అలవాటు ఉన్నట్లయితే, దాని ద్వారా కూడా చాలా పెద్ద ఆజ్ఞా ఉల్లంఘన జరుగుతుంది. చిన్న దొంగైనా లక్షల దొంగగా అవుతారు అని అంటారు. లోభానికి వశమై ఆకలి వేస్తే దాచిపెట్టి అడగకుండా తినేయడం, దొంగతనం చేయడం - ఇది చాలా చెడ్డ అలవాటు. ఈ అలవాటు నుండి రక్షించుకునేందుకు బ్రహ్మాబాబా సమానముగా ట్రస్టీగా అవ్వండి. ఇలాంటి అలవాట్లు ఏవేవైతే ఉన్నాయో, వాటిని తండ్రికి సత్యాతి-సత్యంగా వినిపించండి.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. మనము అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చున్నామని, మనము ఈశ్వరీయ పరివారానికి చెందినవారము అని పిల్లలకు తెలుసు. ఈశ్వరుడు నిరాకారుడు. మీరు ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారు అని కూడా తెలుసు. ఇప్పుడు ఇందులో విజ్ఞాన గర్వము లేక హఠయోగము మొదలైనవి చేయవలసిన విషయమేమీ లేదు. ఇది బుద్ధి యొక్క పని. ఈ శరీరానికి సంబంధించిన పని ఏమీ లేదు. హఠయోగములో శరీరముతో పని ఉంటుంది. ఇక్కడ పిల్లలుగా భావిస్తూ తండ్రి ఎదురుగా మనం కూర్చున్నాము. తండ్రి మనల్ని చదివిస్తున్నారని మనకు తెలుసు. ఒకటేమో - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే, మధురమైన పిల్లలూ, మీ పాపాలన్నీ అంతమైపోతాయి అని తండ్రి చెప్తారు. ఇంకొకటి, చక్రాన్ని తిప్పండి, ఇతరుల సేవను చేసి మీ సమానముగా తయారుచేయండి. తండ్రి కూర్చొని ఒక్కొకరిని చూస్తారు - వీరు ఏం సేవ చేస్తున్నారు? స్థూల సేవ చేస్తున్నారా, సూక్ష్మ సేవ చేస్తున్నారా లేక మూల సేవను చేస్తున్నారా? ఒక్కొక్కరిని తండ్రి చూస్తారు. వీరు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తారా? ముఖ్యమైన విషయము ఇదే. ప్రతి బిడ్డకు తండ్రి పరిచయాన్ని ఇస్తున్నారా? నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మజన్మాంతరాల పాపాలు అంతమైపోతాయి అని తండ్రి చెప్తున్నారు అని ఇతరులకు అర్థం చేయిస్తున్నారా? ఎంతవరకు ఈ సేవలో ఉంటున్నారు? బాబా స్వయం తనతో పోల్చుకుంటారు - అందరికన్నా ఎక్కువ సేవను ఎవరు చేస్తున్నారు? అని చూస్తారు. నేను వీరి కంటే ఎక్కువ సేవను ఎందుకు చేయకూడదు! అని అనుకుంటారు. బ్రహ్మాబాబా కంటే ఎక్కువగా స్మృతియాత్రలో పరుగు తీయగలరా, లేదా? అని తండ్రి చూస్తారు. ప్రతి ఒక్కరినీ బాబా చూస్తారు. బాబా ప్రతి ఒక్కరినీ సమాచారము అడుగుతారు - ఏయే సేవలను చేస్తున్నారు? ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇచ్చి వారి కళ్యాణాన్ని చేస్తున్నారా? సమయమునైతే వృధా చేయడం లేదు కదా? ముఖ్యమైన విషయము ఇదే. ఈ సమయంలో అందరూ అనాథలుగా ఉన్నారు. అనంతమైన తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి నుండి వారసత్వమైతే తప్పకుండా లభిస్తుంది. పిల్లలైన మీకు ముక్తి మరియు జీవన్ముక్తి ధామాలు, ఈ రెండూ బుద్ధిలో ఉన్నాయి. మనము ఇప్పుడు చదువుతున్నామని, మళ్ళీ స్వర్గములోకి వచ్చి జీవన్ముక్తి యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకుంటామని కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి. మిగిలిన లెక్కలేనంతమంది ఇతర ధర్మాల ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారెవ్వరూ ఉండరు. కేవలం మనమే భారత్ లో ఉంటాము. బుద్ధిలో ఏమేమి ఉండాలి అనేది తండ్రి కూర్చొని పిల్లలకు నేర్పిస్తారు! ఇక్కడ మీరు సంగమయుగములో కూర్చున్నారు కావున అన్నపానాదులు కూడా తప్పకుండా శుద్ధముగా మరియు పవిత్రముగా ఉండాలి. మనము భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా అవుతాము అని కూడా మీకు తెలుసు. ఈ మహిమ శరీరధారీ ఆత్మలది, కేవలం ఆత్మ మహిమ మాత్రమే ఉండదు కదా. ప్రతి ఒక్క ఆత్మ పాత్ర ఎవరిది వారిది ఉంటుంది, దానిని ఇక్కడకు వచ్చి అభినయిస్తారు. మీ బుద్ధిలో - మేము వీరి వలె అవ్వాలి అన్న లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. పిల్లలూ, పవిత్రంగా అవ్వండి అన్నది తండ్రి ఆజ్ఞ. పవిత్రంగా ఎలా ఉండాలి అని అడుగుతారు. ఎందుకంటే మాయ తుఫానులు ఎన్నో వస్తాయి. బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. వాటిని ఎలా వదలాలి? పిల్లల బుద్ధి అయితే నడుస్తుంది కదా. ఇంకెవ్వరి బుద్ధి ఇలా నడవదు. తండ్రి, టీచర్, గురువు కూడా మీకు లభించారు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడని, వారు తండ్రి, టీచర్ మరియు జ్ఞానసాగరుడు కూడా అని మీకు తెలుసు. ఆత్మలైన మనల్ని తమతోపాటు తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. సత్యయుగములో చాలా కొద్దిమంది దేవీ-దేవతలు ఉంటారు. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. వినాశనం తర్వాత మనం కొద్దిమంది మాత్రమే ఉంటామని మీ బుద్ధిలో ఉంది. మిగిలిన ఇన్ని ధర్మాలు, ఖండాలు మొదలైనవేవీ ఉండవు. మనమే విశ్వాధిపతులుగా ఉంటాము. మన రాజ్యమొక్కటే ఉంటుంది. ఎంతో సుఖమయమైన రాజ్యం ఉంటుంది. ఇకపోతే అందులో వెరైటీ పదవుల వారు ఉంటారు. మాకు ఏ పదవి ఉంటుంది? మేము ఎంత ఆత్మిక సేవ చేస్తున్నాము? ఇలా తండ్రి కూడా అడుగుతారు. తండ్రి అంతర్యామి అని కాదు. తాము ఏమి చేస్తున్నారు అనేది పిల్లలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. సేవను మొదటి నెంబరులోనైతే ఈ దాదాయే శ్రీమతమనుసారముగా చేస్తున్నారు అని తప్పకుండా అర్థం చేసుకుంటూ ఉండవచ్చు. మధురాతి మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహాభిమానాన్ని వదలండి అని ఘడియ, ఘడియ తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మ అని ఎంత సమయం భావిస్తున్నారు? నేను ఒక ఆత్మను, తండ్రిని స్మృతి చేయాలి అన్నది పక్కా చేసుకోవాలి. దీని ద్వారానే నావ తీరాన్ని చేరుకుంటుంది. స్మృతి చేస్తూ, చేస్తూ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే ఉంది. తర్వాత మనం మన సుఖధామంలోకి వెళ్ళిపోతాము. ముఖ్యమైన ఆత్మిక సేవ - అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడము, ఇది అన్నింటికన్నా సహజమైన విషయము. స్థూల సేవను చేయడంలో, భోజనం తయారుచేయడంలో, భోజనం తినడంలో కూడా శ్రమించవలసి ఉంటుంది. కానీ, ఇందులోనైతే శ్రమించే విషయమేమీ లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ. ఆత్మయే మొత్తం పాత్రనంతటినీ అభినయిస్తుంది. ఈ శిక్షణను వినాశన సమయం వచ్చినప్పుడు తండ్రి వచ్చి ఒకేసారి ఇస్తారు. దేవీ-దేవతలదే కొత్త ప్రపంచము. అందులోకి తప్పకుండా వెళ్ళాలి. మిగిలిన ప్రపంచమంతా శాంతిధామానికి వెళ్ళాలి, ఈ పాత ప్రపంచము ఇక ఉండదు. మీరు కొత్త ప్రపంచములో ఉన్నప్పుడు పాత ప్రపంచపు స్మృతి ఉంటుందా? ఏమాత్రమూ ఉండదు. మీరు స్వర్గములోనే ఉంటారు, రాజ్యం చేస్తూ ఉంటారు. ఇది బుద్ధిలో ఉండడం ద్వారా సంతోషము కలుగుతుంది. స్వర్గానికి ఎన్నో పేర్లు పెట్టడం జరుగుతుంది. నరకానికి కూడా అనేక పేర్లను పెట్టారు - పాపాత్ముల ప్రపంచము, హెల్, దుఃఖధామము అని అంటారు. అనంతమైన తండ్రి ఒక్కరేనని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మనం వారికి చాలాకాలం దూరమై తర్వాత కలుసుకున్న పిల్లలము, కావున ఇటువంటి తండ్రిపై ప్రేమ కూడా ఎంతో ఉండాలి. ఏ పిల్లలైతే ఎంతో సేవను చేస్తారో, ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారో, ఆ పిల్లలపై తండ్రికి కూడా ఎంతో ప్రేమ ఉంది. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి కదా. తండ్రి స్వయం అలా అవ్వరు, మనల్ని అలా తయారుచేయడానికి వచ్చారు. కావున లోలోపల ఎంతో సంతోషము ఉండాలి. స్వర్గములో మనం ఏ పదవిని పొందుతాము? మనం ఏం సేవ చేస్తున్నాము? ఇంట్లో పనివారు ఎవరైతే ఉంటారో, వారికి కూడా పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరైతే స్వయం సంబంధములోకి వస్తారో, వారికి శిక్షణను ఇవ్వాలి. అబలలు, పేదలు, ఆటవికులు మొదలైన వారందరి సేవను చేయాలి కదా. పేదవారైతే చాలామంది ఉన్నారు, వారు బాగవుతారు, ఎటువంటి పాపాలు మొదలైనవి చేయరు. లేకపోతే పాప కర్మలు చేస్తూ ఉంటారు. అబద్దాలు, దొంగతనాలు కూడా ఎంతగా ఉన్నాయో మీరు చూస్తారు. పనివారు కూడా దొంగతనం చేస్తూ ఉంటారు. లేదంటే నిజానికి ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, మరి తాళాలు ఎందుకు వేయాలి? కానీ ఈ రోజుల్లోని పిల్లలు కూడా దొంగలుగా అయిపోతారు. ఏదో ఒకటి దాచిపెట్టి ఎత్తుకుపోతారు. ఎవరికైనా ఆకలి వేస్తే, అత్యాశ కారణముగా తినేస్తూ ఉంటారు. లోభం ఉన్నవారు తప్పకుండా ఏదో ఒకటి దొంగతనం చేసి తింటూ ఉండవచ్చు. ఇదైతే శివబాబా భండారా, ఇందులో ఒక్క పైసా కూడా దొంగతనం చేయకూడదు. బ్రహ్మా అయితే ట్రస్టీ. అనంతమైన తండ్రి అయిన భగవంతుడు మీ వద్దకు వచ్చారు. భగవంతుని ఇంట్లో ఎప్పుడైనా, ఎవరైనా దొంగతనం చేస్తారా? స్వప్నములో కూడా చేయరు. ఉన్నతోన్నతమైనవారు శివ భగవానుడేనని మీకు తెలుసు. మనం వారి పిల్లలము. కావున మనం దైవీ కర్మలను చేయాలి.

మీరు దొంగతనం చేసేవారికి కూడా జైళ్ళకు వెళ్ళి జ్ఞానాన్ని ఇస్తారు. ఇక్కడేమి దొంగతనం చేస్తారు? ఎప్పుడైనా మామిడిపండు తీసుకోవడం లేక ఏదైనా వస్తువును తీసుకొని తినడం, ఇది కూడా దొంగతనమే కదా. ఏ వస్తువునైనా సరే, అడగకుండా తీసుకోకూడదు, చేయి కూడా వేయకూడదు. శివబాబా మన తండ్రి, వారు వింటారు, చూస్తారు. పిల్లలలో ఏ అవగుణమూ లేదు కదా? అని అడుగుతారు. ఒకవేళ ఏదైనా అవగుణము ఉన్నట్లయితే వినిపించండి, అది దానముగా ఇచ్చేయండి. దానముగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా ఆజ్ఞను ఉల్లంఘన చేసినట్లయితే ఎన్నో శిక్షలను పొందుతారు. దొంగతనము యొక్క అలవాటు చాలా చెడ్డది. ఎవరైనా సైకిల్ ఎత్తుకుపోయారనుకోండి, వారు పట్టుబడిపోతారు. ఏదైనా దుకాణములోకి వెళ్ళి బిస్కట్ డబ్బాను లేక ఏవైనా చిన్న-చిన్న వస్తువులను దాచివేస్తారు. దుకాణము వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఇది కూడా చాలా పెద్ద గవర్నమెంట్, పాండవ గవర్నమెంట్ తన దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తోంది. తండ్రి అంటారు, నేనైతే రాజ్యం చేయను, పాండవులైన మీరే రాజ్యం చేస్తారు. కానీ వారేమో పాండవపతి అని శ్రీకృష్ణుడిని అనేసారు. పాండవ పిత ఎవరు? అది మీకు తెలుసు, వారు ఎదురుగా కూర్చొని ఉన్నారు. తాము బాబాకు ఏ సేవ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ లోలోపల అర్థం చేసుకోగలరు. బాబా మనకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇచ్చి వారు స్వయం వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. వారు ఎంతటి నిష్కామ సేవను చేస్తారు. అందరూ సుఖవంతులుగా మరియు శాంతివంతంగా అయిపోతారు. వాళ్ళు అయితే విశ్వములో శాంతి ఉండాలి అని కేవలం నామమాత్రంగా అంటారు. శాంతి పురస్కారాలను ఇస్తూ ఉంటారు. మనకైతే చాలా భారీ ప్రైజ్ లభిస్తుందని ఇక్కడ పిల్లలైన మీకు తెలుసు. ఎవరైతే మంచి సేవను చేస్తారో, వారికి పెద్ద ప్రైజ్ లభిస్తుంది. తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన సేవ, దీనిని ఎవ్వరైనా చేయవచ్చు. పిల్లలు ఈ విధంగా (దేవతలుగా) అవ్వాలనుకుంటే సేవ కూడా చేయాలి కదా. వీరిని చూడండి, వీరు కూడా లౌకిక పరివారం కలవారే కదా, వీరి ద్వారా బాబా చేయించారు. వీరిలోకి ప్రవేశించి వీరికి కూడా చెప్తారు, అలాగే ఈ విధంగా చేయండి అని మీకు కూడా చెప్తారు. నాకు ఎలా చెప్తారు? నాలోకి ప్రవేశించి చేయిస్తారు. వారు చేసేవారు మరియు చేయించేవారు కదా. నాలో కూర్చొని ఈ విధంగా చెప్పారు - ఇక దీనిని వదులు, ఇది ఛీ-ఛీ ప్రపంచము, ఇక వైకుంఠానికి పద, ఇప్పుడిక వైకుంఠానికి అధిపతిగా అవ్వాలి. అంతే, ఇక వైరాగ్యము వచ్చేసింది. ఇతనికి ఏమైంది అని అందరూ అనుకునేవారు. ఇతను ఇంత లాభదాయకమైన చక్కటి వ్యాపారి, ఇతనేమి చేస్తున్నారు అని అనుకున్నారు! ఇతను వెళ్ళి ఏమి చేయబోతున్నారు అన్నది వారికేమి తెలుసు? వదిలేయడం అనేది పెద్ద విషయమేమీ కాదు. వెంటనే అన్నింటినీ త్యజించేసారు, అంతే. అలాగే అందరిచేతా కూడా త్యాగం చేయించారు. కూతురు చేత కూడా త్యాగం చేయించారు. ఇప్పుడిక ఆ ఆత్మిక సేవను చేయాలి, అందరినీ పవిత్రముగా తయారుచేయాలి. మేము జ్ఞానామృతాన్ని తాగడానికి వెళ్తాము అని అందరూ అనేవారు. పేరు మాతది తీసుకునేవారు, జ్ఞానామృతాన్ని త్రాగడానికి ఓం రాధే వద్దకు వెళ్తాము అని అనేవారు. ఈ యుక్తిని ఎవరు రచించారు? శివబాబా వీరిలోకి ప్రవేశించి ఎంత చక్కటి యుక్తిని రచించారు. ఎవరు వచ్చినా, వారు జ్ఞానామృతాన్ని తాగుతారు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి? అన్న గాయనము కూడా ఉంది. విషాన్ని వదిలి జ్ఞానామృతాన్ని తాగి పావన దేవతలుగా అవ్వాలి. ప్రారంభములో ఈ విషయం ఉండేది. ఎవరు వచ్చినా వారికి ఈ విధంగా చెప్పేవారు - పావనంగా అవ్వండి, అమృతాన్ని తాగాలంటే విషాన్ని వదిలేయాలి, పావన వైకుంఠానికి యజమానులుగా అవ్వాలంటే ఒక్కరినే స్మృతి చేయాలి అని. ఇలా చెప్తే అప్పుడు తప్పకుండా గొడవ జరుగుతుంది కదా. మొదట్లో జరిగిన గొడవ ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చింది. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎంతగా పక్కా అవుతూ ఉంటారో, అంతగా పవిత్రత మంచిది అని అర్థం చేసుకుంటారు. బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని దాని కొరకే పిలుస్తారు. ఇంతకుముందు మీ క్యారెక్టర్ కూడా ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా తయారవుతున్నారు? ఇంతకుముందైతే దేవతల ముందుకు వెళ్ళి - మేము పాపులము అని అనేవారు. ఇప్పుడు ఆ విధంగా అనరు ఎందుకంటే ఇప్పుడు మనం ఆ విధంగా అవుతున్నామని మీకు తెలుసు.

మేము ఎంతవరకు సేవ చేస్తున్నాము అని పిల్లలు తమను తాము ప్రశ్నించుకోవాలి. భండారీ (భోళీ దాదీ) మీ కొరకు ఎంత సేవను చేస్తున్నారు! వారికి ఎంత పుణ్యం తయారవుతుంది! వారు అనేకమంది సేవను చేస్తారు కావున వారికి అందరి ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. ఎంతోమంది వారి మహిమను వ్రాస్తారు. భోళీ దాదీ చేస్తున్నది అద్భుతము, వారు ఎన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇది స్థూల సేవ. సూక్ష్మ సేవను కూడా చేయాలి. పిల్లలు అంటారు - బాబా, ఈ ఐదు భూతాలు చాలా తీవ్రముగా ఉన్నాయి, ఇవి స్మృతిలో ఉండనివ్వడం లేదు. బాబా అంటారు - పిల్లలూ, శివబాబాను స్మృతి చేస్తూ భోజనం తయారుచేయండి. ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. వారే సహాయం చేస్తారు. నేను నీ శరణు కోరి వచ్చాను... అన్న గాయనం కూడా ఉంది కదా. సత్యయుగములో ఇలా అనరు. ఇప్పుడు మీరు శరణులోకి వచ్చారు. ఎవరినైనా భూతాలు పట్టుకుంటే అవి ఎంతో పీడిస్తాయి. వారిలోకి ఆశుద్ధమైన ఆత్మ వస్తుంది. మిమ్మల్ని ఎన్ని భూతాలు పట్టుకున్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము... ఈ భూతాలు మిమ్మల్ని ఎంతగానో పీడిస్తాయి. ఆ అశుద్ధ ఆత్మలైతే ఏ కొందరినో విసిగిస్తాయి. ఈ ఐదు భూతాలైతే 2,500 సంవత్సరాల నుండి వెంటాడుతున్నాయని మీకు తెలుసు. మీరు ఎంతగా విసిగిపోయారు. ఈ 5 భూతాలు మిమ్మల్ని నిరుపేదలుగా చేసేసాయి. దేహాభిమానపు భూతము మొట్టమొదటిది. కామము యొక్క భూతము కూడా పెద్దదే. అవి మిమ్మల్ని ఎంతగా విసిగించాయనేది కూడా తండ్రి తెలియజేశారు. కల్ప-కల్పమూ మిమ్మల్ని ఈ భూతాలు పట్టుకుంటాయి. యథా రాజా రాణి తథా ప్రజా, అందరినీ ఈ భూతాలు పట్టుకున్నాయి. కావున దీనిని భూతాల ప్రపంచము అని అంటారు. రావణ రాజ్యం అనగా అసురీ రాజ్యం. సత్య, త్రేతా యుగాలలో భూతాలు ఉండవు. ఒక్క భూతము కూడా ఎంతగా విసిగించేస్తుంది. వీటి గురించి ఎవ్వరికీ తెలియదు. పంచ వికారాల రూపీ రావణుని భూతాలు ఉన్నాయి, వీటి నుండి తండ్రి వచ్చి విడిపిస్తారు. మీలో కూడా కొందరు తెలివైనవారు ఉన్నారు, వారి బుద్ధిలో ఇవి కూర్చుంటాయి. ఈ జన్మలో ఇటువంటి పనులేవీ చేయకూడదు. దొంగతనం చేస్తే, దేహాభిమానం వస్తే రిజల్టు ఎలా ఉంటుంది? పదవీ భ్రష్టులుగా అయిపోతారు. ఏదో ఒకటి ఎత్తుకుపోతారు, చిన్న దొంగైనా లక్షల దొంగగా అవుతారు అని అంటారు. యజ్ఞములోనైతే ఇటువంటి పని ఎప్పుడూ చేయకూడదు. ఇది అలవాటైపోతే ఇక ఎప్పటికీ వదలదు, ఎంతగా కష్టపడుతూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్థూల సేవతోపాటుగా సూక్ష్మమైన మరియు ముఖ్యమైన సేవను కూడా చేయాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడము, ఆత్మల కళ్యాణము చేయడము, స్మృతియాత్రలో ఉండడము, ఇదే సత్యమైన సేవ. ఈ సేవలోనే బిజీగా ఉండాలి, తమ సమయాన్ని వృధా చేసుకోకూడదు.

2. వివేకవంతులుగా అయి పంచ వికారాల రూపీ భూతాలపై విజయాన్ని పొందాలి. దొంగతనం లేక అబద్ధము చెప్పే అలవాటును తొలగించి వేయాలి. దానముగా ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోకూడదు.

వరదానము:-

శారీరక వ్యాధుల యొక్క చింతన నుండి ముక్తులై, జ్ఞాన చింతనను మరియు స్వచింతనను చేసే శుభచింతక భవ

ఒకటేమో శారీరక వ్యాధి రావటము, మరొకటి ఆ వ్యాధి వచ్చినప్పుడు కదిలిపోవటము. వ్యాధి రావటము అన్నదైతే వ్రాసిపెట్టి ఉంటుంది కానీ శ్రేష్ఠ స్థితి నుండి కదిలిపోవటము - ఇది బంధనయుక్తులుగా ఉన్నారు అన్నదానికి గుర్తు. ఎవరైతే శారీరక వ్యాధి యొక్క చింతన నుండి ముక్తులుగా ఉంటూ స్వచింతనను, జ్ఞాన చింతనను చేస్తారో, వారే శుభచింతకులు. ప్రకృతి (శరీరము) యొక్క చింతనను ఎక్కువగా చేయడం వలన చింతా రూపము తయారవుతుంది. ఈ బంధనము నుండి ముక్తులుగా అవ్వటము, దీనినే కర్మాతీత స్థితి అని అంటారు.

స్లోగన్:-

స్నేహము యొక్క శక్తి సమస్య రూపీ పర్వతాన్ని నీరు వలె తేలికగా చేస్తుంది.