19-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - శివబాబా మీ పుష్పాలు మొదలైనవాటిని స్వీకరించలేరు ఎందుకంటే వారు పూజ్యునిగా లేక పూజారిగా అవ్వరు, మీరు కూడా సంగమములో పుష్పాల హారాలను ధరించకూడదు’’

ప్రశ్న:-
భవిష్య రాజ్య సింహాసనానికి అధికారులుగా ఎవరు అవుతారు?

జవాబు:-
ఎవరైతే ఇప్పుడు తల్లి-తండ్రి యొక్క హృదయసింహాసనాన్ని గెలుచుకుంటారో, వారే భవిష్య సింహాసనాధికారులుగా అవుతారు. విచిత్రమేమిటంటే - పిల్లలు, తల్లి-తండ్రిపై కూడా విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కృషి చేసి తల్లి-తండ్రి కన్నా కూడా ముందుకు వెళ్తారు.

పాట:-
ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి...

ఓంశాంతి
మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు పాట విన్నారు. ఈ పాటతో సర్వవ్యాపి జ్ఞానము తొలగిపోతుంది. ఇప్పుడు భారత్ చాలా దుఃఖములో ఉంది, అందుకే స్మృతి చేస్తారు. డ్రామానుసారముగా ఈ పాటలన్నీ తయారయ్యాయి. ఈ విషయము ప్రపంచములోని వారికి తెలియదు. తండ్రి, పతితులను పావనముగా తయారుచేయడానికి మరియు దుఃఖితులను దుఃఖము నుండి విముక్తులుగా చేసి సుఖాన్ని ఇవ్వడానికి వస్తారు. ఆ తండ్రియే వచ్చి ఉన్నారని పిల్లలు తెలుసుకున్నారు. పిల్లలకు వారి పరిచయము లభించింది. వారు స్వయంగా కూర్చుని తెలియజేస్తున్నారు - నేను సాధారణ తనువులో ప్రవేశించి మొత్తము సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తాను. సృష్టి ఒక్కటే, కేవలం కొత్తదిగా మరియు పాతదిగా అవుతుంది. ఏ విధముగా శరీరము బాల్యములో కొత్తదిగా ఉంటుంది, ఆ తర్వాత పాతదిగా అవుతుంది. కొత్త శరీరము, పాత శరీరము అని రెండు శరీరాలుగా చెప్పరు. శరీరము ఒక్కటే, కేవలం కొత్తది నుండి పాతదిగా అవుతుంది. అలాగే ప్రపంచము కూడా ఒక్కటే. కొత్తది నుండి ఇప్పుడు పాతదిగా అవుతుంది. కొత్తదిగా ఎప్పుడు ఉండేది? ఇది ఎవరూ చెప్పలేరు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, కొత్త ప్రపంచము ఉన్నప్పుడు భారత్ కొత్తదిగా ఉండేది. దానిని సత్యయుగము అని అనేవారు. అదే భారత్ ఇప్పుడు పాతదిగా అయ్యింది. దీనిని పురాతన, పాత ప్రపంచమని అంటారు. కొత్త ప్రపంచము నుండి మళ్ళీ పాతదిగా అయ్యింది, మళ్ళీ అది కొత్తదిగా తప్పకుండా తయారవ్వాలి. పిల్లలకు కొత్త ప్రపంచము యొక్క సాక్షాత్కారము కలిగింది. అచ్ఛా, ఆ కొత్త ప్రపంచానికి యజమానులుగా ఎవరు ఉండేవారు? తప్పకుండా ఈ లక్ష్మీ-నారాయణులే ఉండేవారు. ఆది సనాతన దేవీ-దేవతలు ఆ ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు. ఈ విషయము తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి అంటారు - ఇప్పుడు నిరంతరము ఈ విషయాన్నే గుర్తు చేసుకోండి. తండ్రి పరంధామము నుండి మనల్ని చదివించడానికి, రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చి ఉన్నారు. మహిమంతా ఆ ఒక్కరిదే, వీరికి (బ్రహ్మాకు) ఏ మహిమ లేదు. ఈ సమయములో అందరూ తుచ్ఛ బుద్ధి కలవారిగా ఉన్నారు, ఏమీ అర్థం చేసుకోరు. అందుకే నేను వస్తాను, అందుకే ఈ పాటలు కూడా తయారుచేయబడ్డాయి. ఈ పాట ద్వారా సర్వవ్యాపి జ్ఞానము తొలగిపోతుంది. ప్రతి ఒక్కరికీ తమ-తమ పాత్ర ఉంటుంది.

తండ్రి పదే-పదే చెప్తున్నారు - దేహాభిమానాన్ని వదిలి మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి మరియు కర్మేంద్రియాల ద్వారా శిక్షణలను ధారణ చేయండి. ఈ బాబాను నడుస్తూ-తిరుగుతూ ఉండగా చూసినా కానీ స్మృతి శివబాబానే చేయండి. శివబాబాయే అంతా చేస్తున్నారు, బ్రహ్మా లేరు అని అనుకోండి. ఈ కనులకు వీరి రూపము కనిపిస్తున్నా సరే మీ బుద్ధి శివబాబా వైపుకు వెళ్ళాలి. శివబాబా లేకపోతే వీరి ఆత్మ, వీరి శరీరము దేనికీ ఉపయోగపడవు. ఎల్లప్పుడూ ఎలా భావించండి అంటే - వీరిలో శివబాబా ఉన్నారు, వారు వీరి ద్వారా చదివిస్తున్నారు. వీరు (బ్రహ్మా) మీకు టీచరు కాదు. సుప్రీమ్ టీచరు వారు (శివబాబా). స్మృతి వారిని చేయాలి. ఎప్పుడూ కూడా దేహాన్ని స్మృతి చేయకూడదు. బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి. మీరు మళ్ళీ వచ్చి జ్ఞాన-యోగాలను నేర్పించండి అని పిల్లలు స్మృతి చేస్తారు. పరమపిత పరమాత్మ తప్ప ఎవరూ రాజయోగాన్ని నేర్పించలేరు. వారే కూర్చుని గీతా జ్ఞానాన్ని వినిపిస్తారని పిల్లల బుద్ధిలో ఉంది, తర్వాత ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. అక్కడ (సత్యయుగములో) అవసరమే లేదు, అప్పటికల్లా రాజధాని స్థాపన అయిపోతుంది, సద్గతి జరిగిపోతుంది. దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్ళేందుకని జ్ఞానము ఇవ్వడము జరుగుతుంది. మిగిలినవన్నీ భక్తి మార్గపు విషయాలు. మనుష్యులు జప-తపాదులు, దాన-పుణ్యాలు మొదలైనవి ఏవైతే చేస్తారో, అవన్నీ భక్తి మార్గపు విషయాలు, వాటి ద్వారా నన్ను ఎవరూ కలుసుకోలేరు. ఆత్మ రెక్కలు తెగిపోయి ఉన్నాయి. రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. రాతి వలె ఉన్నవారిని మళ్ళీ పారసముగా తయారుచేయడానికి నేను రావాల్సి ఉంటుంది. తండ్రి అంటారు - ఇప్పుడు ఎంతమంది మనుష్యులు ఉన్నారు. ఆవగింజల వలె ప్రపంచమంతా నిండి ఉన్నారు. ఇప్పుడు అందరూ సమాప్తమవ్వనున్నారు. సత్యయుగములోనైతే ఇంతమంది మనుష్యులు ఉండరు. కొత్త ప్రపంచములో వైభవాలు ఎక్కువగా మరియు మనుష్యులు తక్కువగా ఉంటారు. ఇక్కడైతే ఎంతమంది మనుష్యులు ఉన్నారంటే తినడానికి కూడా లభించదు. ఇది పాత బంజరు భూమిలా ఉంది, మళ్ళీ కొత్తగా అయిపోతుంది. అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి. పేరే ఎంత మధురముగా ఉంది - హెవెన్, బహిష్త్, దేవతల కొత్త ప్రపంచము అని. పాతదానిని పడగొట్టి, కొత్తదానిలో కూర్చోవాలని మనసు కలుగుతుంది కదా. ఇప్పుడిది కొత్త ప్రపంచమైన స్వర్గములోకి వెళ్ళే విషయము. ఇందులో పాత శరీరానికి ఎటువంటి విలువ లేదు. శివబాబాకైతే తమదంటూ శరీరము లేదు.

బాబాకు హారము వేస్తామని పిల్లలంటారు. కానీ వీరికి హారము వేసినట్లయితే, మీ బుద్ధియోగము వీరి వైపుకు వెళ్ళిపోతుంది. శివబాబా అంటారు - హారము అవసరం లేదు. మీరే పూజ్యులుగా అవుతారు, పూజారులుగా కూడా మీరే అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. కావున మీ చిత్రాలను మీరే పూజించడము మొదలుపెడతారు. బాబా అంటారు - నేను పూజ్యునిగానూ అవ్వను, నాకు పుష్పాలు మొదలైనవాటిని అర్పించే అవసరం కూడా లేదు. నేను వీటిని ఎందుకు ధరించాలి, అందుకే ఎప్పుడూ పుష్పాల మాలలు మొదలైనవాటిని తీసుకోరు. మీరు పూజ్యులుగా అవుతారు, అప్పుడు ఎన్ని కావాలనుకుంటే అన్ని పుష్పాలు ధరించండి. నేనైతే పిల్లలైన మీకు అత్యంత ప్రియమైన, విధేయుడినైన ఫాదర్ ను కూడా, టీచరును కూడా, సేవకుడిని కూడా. గొప్ప-గొప్ప రాయల్ వ్యక్తులు కింద సంతకం చేసేటప్పుడు, మింటో, కర్జన్... అని వారి పేర్లు వ్రాసేవారు (ఆ నాటి గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ పేర్లు). వారు సంతకము చేసేటప్పుడు పేరు ముందు లార్డ్ అని ఎప్పుడూ వ్రాసుకునేవారు కాదు. ఇక్కడైతే శ్రీ లక్ష్మీ-నారాయణ, శ్రీ ఫలానా... అని వ్రాసుకుంటారు. నేరుగా శ్రీ అనే పదాన్ని వ్రాసుకుంటారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు ఈ శరీరాన్ని గుర్తు చేయకండి, స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచములో ఆత్మ మరియు శరీరము, రెండూ పతితముగా ఉన్నాయి. బంగారము 9 క్యారట్లది ఉంటే, ఆభరణము కూడా 9 క్యారట్లదే తయారవుతుంది. బంగారములోనే మాలిన్యము చేరుతుంది. ఆత్మను ఎప్పుడూ నిర్లేపి అని అనుకోకూడదు. ఈ జ్ఞానము మీకు ఇప్పుడు మాత్రమే ఉంది. మీరు అర్ధకల్పము 21 జన్మల కోసం ప్రారబ్ధము పొందుతారు కావున ఎంత పురుషార్థము చేయాలి! కానీ పిల్లలు పదే-పదే మర్చిపోతారు. శివబాబా, బ్రహ్మా ద్వారా మనకు శిక్షణను ఇస్తున్నారు. బ్రహ్మా ఆత్మ కూడా వారిని స్మృతి చేస్తుంది. బ్రహ్మా, విష్ణు, శంకరులు సూక్ష్మవతనవాసులు. తండ్రి, ముందు సూక్ష్మ సృష్టిని రచిస్తారు. నిర్వాణధామము ఉన్నతోన్నతమైన ధామము. ఆత్మల నిర్వాణధామము అన్నింటికన్నా ఉన్నతమైనది. ఒక్క భగవంతుడినే భక్తులందరూ స్మృతి చేస్తారు. కానీ తమోప్రధానముగా అయిపోయారు కావున తండ్రిని మరచి, రాళ్ళు-రప్పలు అన్నింటినీ పూజిస్తూ ఉంటారు. ఏది జరుగుతున్నా సరే, అది డ్రామాలో షూటింగ్ అవుతూ ఉందని మనకు తెలుసు. డ్రామాలో ఏ షూటింగ్ అయితే ఒక్కసారి జరుగుతుందో, ఉదాహరణకు, పక్షి ఏదైనా మధ్యలో ఎగిరిందనుకోండి, అది పదే-పదే రిపీట్ అవుతూ ఉంటుంది. గాలిపటం ఎగురుతున్నట్లు షూటింగ్ అయితే, అది పదే-పదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా డ్రామాలోని ప్రతి సెకండు రిపీట్ అవుతూ ఉంటుంది, షూటింగ్ అవుతూ ఉంటుంది. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. మీరు పాత్రధారులు, మొత్తం డ్రామాను సాక్షీగా అయి చూస్తారు. ఒక్కొక్క సెకండు డ్రామానుసారముగా గడుస్తూ ఉంటుంది. ఆకు కదిలింది అంటే డ్రామా గడిచింది. అలాగని ప్రతి ఆకు భగవంతుని ఆజ్ఞతో కదులుతుందని కాదు. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. దీనిని మంచి రీతిలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు మరియు డ్రామా జ్ఞానాన్ని ఇస్తారు. చిత్రాలు కూడా ఎంత మంచివి తయారై ఉన్నాయి. గడియారపు ముల్లు కూడా సంగమయుగాన్ని సూచిస్తుంది. ఇది కలియుగాంతము మరియు సత్యయుగము ఆది యొక్క సంగమము. ఇప్పుడు పాత ప్రపంచములో అనేక ధర్మాలు ఉన్నాయి. కొత్త ప్రపంచములో మళ్ళీ ఇవి ఉండవు. పిల్లలైన మీరు సదా - మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారని, మేము ఈశ్వరీయ విద్యార్థులమని భావించండి. భగవానువాచ - నేను మిమ్మల్ని రాజులకే రాజుగా చేస్తాను. రాజులు కూడా లక్ష్మీ-నారాయణులను పూజిస్తారు. వారిని పూజ్యులుగా చేసేవాడిని నేను. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారు ఇప్పుడు పూజారులుగా అయిపోయారు. మేమే పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ మేమే పూజారులుగా అయ్యామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బాబా అయితే అలా అవ్వరు. తండ్రి అంటారు - నేను పూజారిగానూ అవ్వను, పూజ్యునిగానూ అవ్వను, అందుకే నేను హారాన్ని వేసుకోను, అలాగే ఇతరులు కూడా నాకు వేయాల్సిన అవసరం లేదు. కావున నేనెందుకు పుష్పాలను స్వీకరించాలి. మీరు కూడా స్వీకరించకూడదు. నియమానుసారముగా దేవతలకే ఆ హక్కు ఉంది ఎందుకంటే వారి ఆత్మ మరియు శరీరము పవిత్రముగా ఉన్నాయి. వారే పుష్పాలకు హక్కుదారులు. అక్కడ స్వర్గములోనైతే సుగంధ భరితమైన పుష్పాలు ఉంటాయి. పుష్పాలనేవి సుగంధము కోసమూ ఉంటాయి, అలాగే ధరించేందుకు కూడా ఉంటాయి. తండ్రి అంటారు - ఇప్పుడు పిల్లలైన మీరు విష్ణు కంఠహారముగా అవుతారు. నంబరువారుగా మీరు సింహాసనముపై కూర్చోనున్నారు. కల్పక్రితం ఎవరు ఎంత పురుషార్థము చేసారో, ఇప్పుడూ చేస్తారు మరియు చేస్తూ ఉంటారు, నంబరువారుగా అయితే ఉంటారు. ఫలానా బిడ్డ చాలా సర్వీసబుల్ అని బుద్ధి చెప్తుంది. ఎలాగైతే దుకాణములో సేఠ్ ఉంటారు, పార్టనర్ ఉంటారు, మేనేజర్ ఉంటారు. వారి కింద వారికి కూడా లిఫ్ట్ (ప్రమోషన్) లభిస్తుంది. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. పిల్లలైన మీరు కూడా తల్లి-తండ్రిపై విజయము పొందాలి. తల్లి-తండ్రి కన్నా ముందుకు ఎలా వెళ్ళగలమని మీకు ఆశ్చర్యమనిపిస్తుంది. తండ్రి అయితే కష్టపడి పిల్లలను సింహాసనాధికారులుగా తయారుచేయడానికి యోగ్యులుగా చేస్తారు, అందుకే తండ్రి అంటారు - ఇప్పుడు నా హృదయము రూపీ సింహాసనాన్ని జయించినట్లయితే, భవిష్య సింహాసనాధికారులుగా అవుతారు. పురుషార్థము ఎంత చెయ్యండి అంటే నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. ముఖ్యమైన లక్ష్యము-ఉద్దేశ్యము ఒక్కటే, ఇకపోతే రాజధాని స్థాపన అవుతూ ఉంది కనుక అందులో వెరైటీ పదవులు ఉంటాయి.

మీరు మాయను జయించేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. పిల్లలు మొదలైనవారిని కూడా ప్రేమగా నడిపించండి కానీ ట్రస్టీగా అయి ఉండండి. భక్తి మార్గములో - ప్రభూ, ఇదంతా మీరు ఇచ్చినదే, మీరు ఇచ్చిన తాకట్టును మీరే తీసేసుకున్నారు అని అంటారు కదా. అచ్ఛా, మరి ఇక ఏడ్చే విషయమే లేదు కానీ ఇది ఉన్నదే ఏడ్చేటువంటి ప్రపంచము. మనుష్యులు కథలు చాలా వినిపిస్తారు. మోహజీత్ రాజు కథను కూడా వినిపిస్తారు. అతనికి ఎటువంటి దుఃఖము అనుభవమవ్వలేదు. ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి, మరొకటి తీసుకున్నారు. అక్కడ ఎప్పుడూ ఎటువంటి వ్యాధులు మొదలైనవేవీ ఉండవు. 21 జన్మల కోసం సదా ఆరోగ్యవంతమైన, నిరోగీ శరీరము ఉంటుంది. పిల్లలకు అంతా సాక్షాత్కారము అవుతుంది. అక్కడి ఆచార-పద్ధతులు ఎలా ఉంటాయి, ఎలాంటి వస్త్రాలను ధరిస్తారు, స్వయంవరము మొదలైనవి ఎలా జరుగుతాయి - ఇవన్నీ పిల్లలకు సాక్షాత్కారము అయ్యాయి. ఆ పాత్రంతా గతించిపోయింది. ఆ సమయములో ఇంత జ్ఞానముండేది కాదు. ఇప్పుడు రోజురోజుకు పిల్లలైన మీలో చాలా శక్తి వస్తూ ఉంటుంది. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. అద్భుతము కదా. పరమపిత పరమాత్మునిది కూడా ఎంత భారీ పాత్ర ఉంది. స్వయంగా వారే కూర్చుని అర్థం చేయిస్తున్నారు - భక్తి మార్గములో కూడా నేను పైన కూర్చుని ఎంత పని చేస్తాను, కిందకైతే కల్పములో ఒక్కసారి మాత్రమే వస్తాను. నిరాకారుని పూజారులు కూడా చాలామంది ఉంటారు కానీ నిరాకార పరమాత్మ ఎలా వచ్చి చదివిస్తారు అనే విషయాన్ని మాయము చేసేసారు. గీతలో కూడా శ్రీకృష్ణుని పేరు వేసేసారు కనుక నిరాకారునితో ప్రీతియే తెగిపోయింది. ఇక్కడ పరమాత్మయే వచ్చి సహజయోగాన్ని నేర్పించారు మరియు ప్రపంచాన్ని మార్చారు. ప్రపంచము మారుతూ ఉంటుంది, యుగాలు మారుతూ ఉంటాయి. ఈ డ్రామా చక్రాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనుష్యులకేమీ తెలియదు. సత్యయుగపు దేవీ-దేవతల గురించి కూడా తెలియదు. కేవలం దేవీ-దేవతల గుర్తులు మాత్రం మిగిలి ఉన్నాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎల్లప్పుడూ మేము శివబాబాకు చెందినవారమని, శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని భావించండి. శివబాబా ఈ బ్రహ్మా ద్వారా సదా శిక్షణను ఇస్తారు. అప్పుడు శివబాబా స్మృతిలో చాలా ఆనందము కలుగుతూ ఉంటుంది. ఇటువంటి గాడ్ ఫాదర్ ఎవరైనా ఉంటారా? వారు ఫాదర్ కూడా, టీచరు కూడా, సద్గురువు కూడా. చాలామంది తండ్రులు తమ పిల్లలను చదివిస్తారు కూడా, అప్పుడు వారి పిల్లలు, మా ఫాదర్ యే టీచరు అని తప్పకుండా అంటారు. కానీ ఆ ఫాదర్ గురువుగా కూడా అవ్వడమనేది జరగదు. టీచరుగా అవ్వవచ్చు. ఫాదర్ ను గురువు అని ఎప్పుడూ అనరు. వీరి (బాబా) ఫాదర్ టీచరుగా కూడా ఉండేవారు, వారు చదివించేవారు. వారు హద్దు ఫాదర్ మరియు టీచరు. వీరు అనంతమైన ఫాదర్ మరియు టీచరు. మీరు స్వయాన్ని ఈశ్వరీయ విద్యార్థులుగా భావించినా కూడా అహో సౌభాగ్యము. గాడ్ ఫాదర్ చదివిస్తున్నారు, ఎంత క్లియర్ గా ఉంది. మరి వీరు ఎంత మధురమైన బాబా, మధురమైనవారిని స్మృతి చేయడము జరుగుతుంది. ఉదాహరణకు ప్రేయసీ-ప్రియుల మధ్య ప్రేమ ఉంటుంది. వారి ప్రేమ వికారాల కోసం ఉండదు, కేవలం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆత్మలైన మీది తండ్రి అయిన పరమాత్మతో యోగము. బాబా ఎంతటి జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు అని ఆత్మ అంటుంది. ఈ పతిత ప్రపంచములోకి, పతిత శరీరములోకి వచ్చి మనల్ని ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతుడికి ఎంతో సమయము పట్టదు అని గాయనము కూడా ఉంది. సెకండులో వైకుంఠానికి వెళ్తారు. సెకండులో మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. ఇదే లక్ష్యము-ఉద్దేశ్యము, దీని కోసం చదువుకోవాలి. గురునానక్ కూడా, మురికిపట్టిన వస్త్రాలను శుభ్రము చేసారని... అన్నారు కదా. లక్ష్యము అనే సబ్బు ఉంది కదా. బాబా అంటారు - నేను ఎంత మంచి చాకలివాడిని. మీ వస్త్రాలను, మీ ఆత్మను మరియు శరీరాన్ని ఎంత శుద్ధముగా తయారుచేస్తాను. ఈ దాదాను ఎప్పుడూ స్మృతి చేయకూడదు. ఈ కార్యమంతా శివబాబాది, వారినే స్మృతి చేయండి. వీరికన్నా మధురమైనవారు శివబాబా. ఈ కళ్ళకు మీకు ఈ బ్రహ్మా రథము కనిపిస్తూ ఉండవచ్చు కానీ మీరు స్మృతి శివబాబానే చేయండి, శివబాబా వీరి ద్వారా మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానముగా తయారుచేస్తున్నారు అని ఆత్మకు చెప్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి హృదయము రూపీ సింహాసనాన్ని గెలుచుకునే పురుషార్థము చేయాలి. పరివారములో ట్రస్టీగా ఉంటూ అందరినీ ప్రేమగా నడిపించాలి. మోహజీతులుగా అవ్వాలి.

2. యోగబలముతో ఆత్మను స్వచ్ఛముగా తయారుచేసుకోవాలి. ఈ కనుల ద్వారా అన్నీ చూస్తూ, ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇక్కడ పుష్పాల హారాలను స్వీకరించకుండా సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి.

వరదానము:-
ప్రారబ్ధము పొందాలనే కోరికను త్యజించి మంచి పురుషార్థము చేసే శ్రేష్ఠ పురుషార్థీ భవ

ఎవరైతే పురుషార్థము యొక్క ప్రారబ్ధాన్ని అనుభవించాలనే కోరికను పెట్టుకోరో, వారిని శ్రేష్ఠ పురుషార్థులు అని అంటారు. ఎక్కడైతే కోరిక ఉంటుందో, అక్కడ స్వచ్ఛత సమాప్తమైపోతుంది మరియు ఆలోచించేవారిగా అయిపోతారు. ఎవరైతే ఇక్కడే ప్రారబ్ధాన్ని అనుభవించాలనే కోరికను పెట్టుకుంటారో వారు తమ భవిష్య సంపాదనను జమ చేసుకోవడము తగ్గించుకుంటారు, అందుకే ఇచ్ఛ (కోరిక) కు బదులుగా అచ్ఛా (మంచి) అనే పదాన్ని గుర్తుంచుకోండి. శ్రేష్ఠ పురుషార్థులు సదా మచ్చలేనివారిగా అయ్యే పురుషార్థము చేస్తారు, ఏ విషయములోనూ ఫెయిల్ అవ్వరు.

స్లోగన్:-
కమలపుష్పము వలె అయి సాధనాలను ఉపయోగించండి ఎందుకంటే అవి మీ కర్మయోగానికి ఫలము.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

సర్వస్వ త్యాగీ పిల్లలలో ముఖ్యముగా సరళత మరియు సహనశీలతా గుణాలు తప్పకుండా ఉంటాయి. ఇటువంటి పిల్లలు స్వయం హర్షితముగా ఉంటారు మరియు సర్వులను ఆకర్షితము చేస్తారు. వారు పరస్పరం స్నేహీలుగా అవుతారు. ఒకవేళ సరళత లేకపోతే స్నేహము కూడా ఉండదు. ఏ విధముగా సాకార రూపములో చూసారు, ఎంత నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారో, అంతగానే సరళ స్వభావము ఉంది. వృద్ధులతో వృద్ధునిగా, చిన్నపిల్లలతో చిన్న పిల్లాడిలా ఉన్నారు.