19-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు డబుల్ కిరీటధారులైన రాజులుగా అవ్వాలంటే చాలా సేవ చేయండి, ప్రజలను తయారుచేయండి, సంగమములో మీరు సేవే చేయాలి, ఇందులోనే కళ్యాణము ఉంది’’

ప్రశ్న:-
పాత ప్రపంచ వినాశనానికి ముందే ప్రతి ఒక్కరూ ఏ అలంకరణను చేసుకోవాలి?

జవాబు:-
పిల్లలైన మీరు యోగబలముతో మీ అలంకరణను చేసుకోండి, ఈ యోగబలము ద్వారానే మొత్తం విశ్వమంతా పావనముగా అవుతుంది. మీరు ఇప్పుడు వానప్రస్థములోకి వెళ్ళాలి, అందుకే ఈ శరీరాన్ని అలంకరించుకోవలసిన అవసరం లేదు. ఇది పైసకు కొరగానిది, దీని నుండి మమకారాన్ని తొలగించివేయండి. వినాశనానికి ముందే తండ్రి సమానంగా దయార్ద్ర హృదయులుగా అయి స్వయం మరియు ఇతరుల యొక్క అలంకరణను చేయండి. అంధులకు చేతికర్రగా అవ్వండి.

ఓంశాంతి
తండ్రి పావనంగా అయ్యే దారిని చూపించడానికి వస్తారనైతే ఇప్పుడు పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారుచేయండి అని వారిని ఈ ఒక్క విషయము కోసమే పిలవడం జరుగుతుంది ఎందుకంటే పావన ప్రపంచము గతించిపోయింది, ఇప్పుడు పతిత ప్రపంచము ఉంది. పావన ప్రపంచము ఎప్పుడు గతించింది, అది గతించి ఎంత సమయం అయ్యింది అన్నది ఎవ్వరికీ తెలియదు. తండ్రి మళ్ళీ ఈ తనువులోకి వచ్చారన్నది పిల్లలైన మీకు తెలుసు. బాబా, మీరు వచ్చి పతితులైన మాకు - మేము పావనంగా ఎలా అవ్వాలి అనే దారిని చూపించండి అని మీరే నన్ను పిలిచారు. మనం పావన ప్రపంచములో ఉండేవారమని, ఇప్పుడు పతిత ప్రపంచములో ఉన్నామని మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచము మారుతోంది. కొత్త ప్రపంచ ఆయువు ఎంత, పాత ప్రపంచ ఆయువు ఎంత? అన్నది ఎవ్వరికీ తెలియదు. పక్కా ఇంటిని నిర్మిస్తే దీని ఆయువు ఇన్ని సంవత్సరాలు ఉంటుంది అని అంటారు, కచ్చా ఇంటిని నిర్మిస్తే దీని ఆయువు ఇన్ని సంవత్సరాలు ఉంటుంది అని అంటారు. అది ఎన్ని సంవత్సరాల వరకూ ఉండగలదో అర్థం చేసుకోగలరు. ఈ మొత్తం ప్రపంచమంతా ఏదైతే ఉందో, దాని ఆయువు ఎంత అనేది మనుష్యులకు తెలియదు. కావున తప్పకుండా తండ్రే వచ్చి తెలియజేయవలసి ఉంటుంది. తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు ఈ పాత పతిత ప్రపంచము పూర్తవ్వనున్నది. కొత్త పావన ప్రపంచము స్థాపన అవుతోంది. కొత్త ప్రపంచములో చాలా కొద్దిమంది మనుష్యులే ఉండేవారు. కొత్త ప్రపంచము సత్యయుగము, దానిని సుఖధామము అని అంటారు. ఇప్పుడు ఇది దుఃఖధామము, దీని అంతం తప్పకుండా రానున్నది, మళ్ళీ సుఖధామము యొక్క చరిత్ర రిపీట్ అవ్వనున్నది. ఇది అందరికీ అర్థం చేయించాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఆ తర్వాత ఇతరులకు కూడా ఈ దారిని తెలియజేయండి అని తండ్రి డైరెక్షన్ ఇస్తారు. లౌకిక తండ్రి గురించైతే అందరికీ తెలుసు, పారలౌకిక తండ్రి గురించైతే ఎవ్వరికీ తెలియదు. వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. వారిని కూర్మ-మత్స్య అవతారాలలోకి లేక 84 లక్షల యోనులలోకి తీసుకువెళ్ళారు. ప్రపంచములో ఎవ్వరికీ తండ్రి గురించి తెలియదు. ఎప్పుడైతే తండ్రి గురించి తెలుసుకుంటారో అప్పుడు అర్థం చేసుకుంటారు. ఒకవేళ వారు రాయి-రప్పల్లో ఉన్నట్లయితే వారసత్వము అన్న విషయమే ఉండదు. దేవతలను కూడా పూజిస్తారు, కానీ ఎవరి చరిత్ర గురించి తెలియదు. పూర్తిగా ఈ విషయాలలో అజ్ఞానులుగా ఉన్నారు. కావున మొట్టమొదటి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. కేవలం చిత్రాల ద్వారా ఎవరూ అర్థం చేసుకోలేరు. మనుష్యులకు పాపం తండ్రి గురించి తెలియదు, అలాగే మొదటి నుండీ ఈ రచన ఎలా రచింపబడింది అంటూ రచన గురించి కూడా తెలియదు. ఎవరినైతే పూజిస్తారో, ఆ దేవతల రాజ్యము ఎప్పుడు ఉండేదో దాని గురించి ఏమీ తెలియదు. లక్షల సంవత్సరాలు సూర్యవంశీయుల రాజధాని నడిచిందని, ఆ తర్వాత చంద్రవంశీయులది లక్షల సంవత్సరాలు నడిచిందని అంటారు, దీనిని అజ్ఞానం అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు, మీరు అది మళ్ళీ రిపీట్ చేస్తారు. తండ్రి కూడా రిపీట్ చేస్తారు కదా. ఈ విధంగా అర్థం చేయించండి, సందేశాన్ని ఇవ్వండి, లేకపోతే రాజధాని ఎలా స్థాపన అవుతుంది. ఇక్కడ కూర్చుండిపోతే అది జరుగదు. ఇంట్లో ఉండేవారు కూడా కావాలి. వారు డ్రామానుసారంగా అక్కడ కూర్చున్నారు. యజ్ఞాన్ని సంభాళించేవారు కూడా కావాలి. తండ్రిని కలుసుకునేందుకు తండ్రి వద్దకు ఎంతమంది పిల్లలు వస్తారు ఎందుకంటే శివబాబా నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. లౌకిక తండ్రికి కొడుకు పుడితే, అతను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని భావిస్తాడు. కూతురైతే వెళ్ళి ఇంకొకరి అర్ధ భాగస్వామిగా అవుతుంది. సత్యయుగములో ఎప్పుడూ ఆస్తిపాస్తులు మొదలైన విషయాలలో గొడవలు జరగనే జరగవు. ఇక్కడ కామ వికారము విషయములో గొడవ జరుగుతుంది. అక్కడైతే ఈ ఐదు భూతాలూ ఉండవు, కావున దుఃఖము యొక్క నామ-రూపాలు ఉండవు. అందరూ నష్టోమోహులుగా ఉంటారు. స్వర్గము ఉండేదని, అది గతించిపోయిందని భావిస్తారు. చిత్రాలు కూడా ఉన్నాయి కానీ ఈ ఆలోచనలు పిల్లలైన మీకు ఇప్పుడే వస్తాయి. ఈ చక్రము ప్రతి 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని మీకు తెలుసు. సూర్యవంశీయుల మరియు చంద్రవంశీయుల రాజ్యవంశము 2500 సంవత్సరాలు కొనసాగిందని శాస్త్రాలలో ఎవ్వరూ వ్రాయలేదు. బడౌదా రాజభవనములో రామాయణమును వింటున్నారు అని వార్తాపత్రికల్లో వచ్చింది. ఏవైనా ఆపదలు వస్తే మనుష్యులు భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం భక్తిలో నిమగ్నమైపోతారు. భగవంతుడు అలా ఏమీ ప్రసన్నం అవ్వరు. అది డ్రామాలో నిశ్చితమై ఉంది. భక్తితో భగవంతుడు ఎప్పుడూ ప్రసన్నం అవ్వరు. అర్ధకల్పం భక్తి జరుగుతుందని, వారు స్వయమే దుఃఖాన్ని పొందుతూ ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. భక్తి చేస్తూ-చేస్తూ ధనమంతటినీ పోగొట్టుకుంటారు. ఈ విషయాలను ఎక్కడో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు. ఏ పిల్లలైతే సేవలో ఉంటారో వారు సమాచారాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ పరివారము అని అర్థం చేయించడం జరుగుతుంది. ఈశ్వరుడు దాత, వారు తీసుకునేవారు కారు. వారికి ఎవ్వరూ ఇవ్వరు, ఇంకా అందరూ నష్టపరుస్తూనే ఉంటారు.

తండ్రి పిల్లలైన మిమ్మల్ని అడుగుతున్నారు, మీకు ఎంతటి అపారమైన ధనాన్ని ఇచ్చాను, మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారుచేసాను, అదంతా ఏమయింది? ఇంతటి నిరుపేదలుగా ఎలా అయ్యారు? ఇప్పుడు నేను మళ్ళీ వచ్చాను, మీరు ఎంత పదమాపదమ భాగ్యవంతులుగా అవుతున్నారు. మనుష్యులకైతే ఈ విషయాల గురించి ఏమాత్రమూ తెలియదు. మీకు తెలుసు, ఇప్పుడు ఈ పాత ప్రపంచములో ఇక్కడ ఉండేది లేదు, ఇది ఇక అంతమైపోనున్నది. మనుష్యుల వద్ద అపారమైన ధనమేదైతే ఉందో అది ఎవ్వరికీ ఉపయోగపడదు. వినాశనమైతే అందరూ అంతమైపోతారు. ఎన్నో మైళ్ళ దూరం వరకూ పెద్ద-పెద్ద ఇళ్ళు మొదలైనవి నిర్మింపబడి ఉన్నాయి. లెక్కలేనంత ఆస్తి ఉంది, అంతా అంతమైపోతుంది ఎందుకంటే మన రాజ్యం ఉన్నప్పుడు ఇంకెవ్వరూ లేనే లేరని మీకు తెలుసు. అక్కడ అపారమైన ధనం ఉండేది. మీరు ఏమేమి జరుగుతుందో మున్ముందు చూస్తూ ఉంటారు. వారి వద్ద ఎంత బంగారము, ఎంత వెండి, ఎన్ని నోట్లు మొదలైనవి ఉన్నాయో అదంతా బడ్జెట్ లో వెలువడుతుంది, ఇంత బడ్జెట్ ఉంది మరియు ఇంత ఖర్చు ఉంది అని అనౌన్స్ చేస్తారు. ఆయుధాలపై ఎంత ఖర్చు ఉందో చెప్తారు. ఇప్పుడు ఆయుధాలపై ఎంతో ఖర్చు చేస్తారు. దాని వల్ల సంపాదనైతే ఏమీ ఉండదు. అవి అలా ఉంచుకునే వస్తువులైతే కావు కదా. ఉంచుకునే వస్తువులు బంగారమువి లేక వెండివి. ప్రపంచము స్వర్ణయుగముగా ఉన్నప్పుడు బంగారు నాణాలు ఉంటాయి. వెండియుగములో వెండి ఉంటుంది. అక్కడైతే అపారమైన ధనముంటుంది, అది తగ్గిపోతూ, తగ్గిపోతూ ఇప్పుడు ఏమి వెలువడ్డాయో చూడండి! కాగితపు నోట్లు. విదేశాల్లో కూడా కాగితపు నోట్లే ఉన్నాయి. కాగితము పనికివచ్చే వస్తువేమీ కాదు. ఇంకేమి మిగులుతాయి? ఈ పెద్ద-పెద్ద బిల్డింగులు మొదలైనవన్నీ అంతమైపోతాయి, కావుననే తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, మీరు ఏవైతే చూస్తున్నారో అవేవీ లేవనే భావించండి. ఇవన్నీ అంతమైపోనున్నాయి. ఎవరు ఎంత సుందరముగా ఉన్నా శరీరము కూడా పాతదిగా, పైసకు కొరగానిదిగా ఉంది. ఈ ప్రపంచము ఇంకా కొద్ది సమయమే ఉంటుంది. దీనిపై నమ్మకమేమీ లేదు. మనుష్యులకు ఉన్నట్లుండి ఏమైపోతూ ఉంటుంది, హార్ట్ ఫెయిల్ అయిపోతారు. మనుష్యులపై నమ్మకమేమీ లేదు. సత్యయుగములో అలా జరగదు. అక్కడి శరీరము యోగబలముతో కల్పతరువు సమానముగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు, వారు అంటున్నారు - ఇప్పుడిక మీరు ఈ ప్రపంచములో ఉండేది లేదు, ఇది అశుద్ధమైన ప్రపంచము, ఇప్పుడిక యోగబలముతో మీ అలంకరణను చేసుకోవాలి. అక్కడ పిల్లలు కూడా యోగబలము ద్వారానే జన్మిస్తారు. అక్కడ వికారాల విషయమే ఉండదు. యోగబలముతో మీరు మొత్తం విశ్వమంతటినీ పావనంగా తయారుచేస్తారు అన్నప్పుడు యోగబలముతో పిల్లలు జన్మిచడమనేది ఏమంత పెద్ద విషయము. ఈ విషయాలను కూడా మన వంశానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. మిగిలినవారంతా శాంతిధామములోకి వెళ్ళాలి, అది మన ఇల్లు. కానీ మనుష్యులు దానిని ఇంటిగా కూడా భావించరు. ఒక ఆత్మ వెళ్తుంది, ఇంకొకటి వస్తూ ఉంటుంది అని వారు అంటారు. సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది. రచయిత మరియు రచనను గురించి మీకు తెలుసు, కావున ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకొని బాబాకు విద్యార్థులుగా అయిపోవాలి, అంతా తెలుసుకోవాలి, సంతోషములోకి వచ్చేయాలి అన్న ఉద్దేశ్యముతో మీరు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మనమైతే ఇప్పుడు అమరలోకములోకి వెళ్తాము. అర్ధకల్పమైతే అసత్యమైన కథలను విన్నారు. మనం అమరలోకములోకి వెళ్తాము అని ఇప్పుడైతే ఎంతో సంతోషము కలగాలి. ఇప్పుడు ఇది ఈ మృత్యులోకము యొక్క అంతిమము. మనం సంతోషము యొక్క ఖజానాను ఇక్కడి నుండే నింపుకొని వెళ్తాము. కావున ఈ సంపాదనను చేసుకోవడములో, జోలెను నింపుకోవడంలో బాగా నిమగ్నమైపోవాలి. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. ఇప్పుడిక మనం ఇతరుల సేవను చేయాలి, జోలెను నింపాలి, అంతే. దయార్ద్ర హృదయులుగా ఎలా అవ్వాలో తండ్రి నేర్పిస్తారు. అంధులకు చేతికర్రగా అవ్వండి. ఈ ప్రశ్నను సన్యాసులు, విద్వాంసులు మొదలైనవారు ఎవ్వరూ అడగలేరు. స్వర్గము ఎక్కడ ఉంటుంది, నరకము ఎక్కడ ఉంటుంది అనేది వారికేమి తెలుసు. ఎంత గొప్ప-గొప్ప పొజిషన్ లోని వారైనా సరే, విమానాల కమాండర్-ఇన్-చీఫ్ అయినా, యుద్ధాలు, స్టీమర్లు యొక్క కమాండర్-ఇన్-చీఫ్ అయినా వారంతా మీ ముందు ఎంతటివారు! ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉందని మీకు తెలుసు. స్వర్గము గురించైతే ఎవ్వరికీ తెలియనే తెలియదు. ఈ సమయములోనైతే అన్ని వైపులా గొడవలు జరుగుతున్నాయి. ఇక తర్వాత వారికి విమానాలు లేక సైన్యం మొదలైనవాటి అవసరమే ఉండదు. అవన్నీ అంతమైపోతాయి. ఇంకా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. ఈ లైట్లు, విమానాలు మొదలైనవన్నీ ఉంటాయి కానీ ప్రపంచము ఎంత చిన్నగా ఉంటుంది, భారత్ యే ఉంటుంది. మోడల్ చిన్నగానే తయారుచేస్తారు కదా. మృత్యువు చివరిలో ఎలా రానున్నదో ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. మేము ఇక్కడ కూర్చొనే బాంబులను వదులుతాము, అవి ఎక్కడ పడితే అక్కడ అందరూ అంతమైపోతారు అని వారు అంటారు. సైన్యము మొదలైనవాటి అవసరమేమీ ఉండదు. ఒక్కొక్క విమానానికి కూడా కోట్లాది రూపాయల ఖర్చు అవుతుంది. అందరి వద్దా ఎంత బంగారము ఉంటుంది. టన్నుల కొద్దీ బంగారము ఉంది, అదంతా సముద్రములోకి వెళ్ళిపోతుంది.

ఈ రావణ రాజ్యమంతా ఒక ద్వీపము వంటిది. ఇక్కడ లెక్కలేనంతమంది మనుష్యులు ఉన్నారు. మీరంతా మీ రాజ్య స్థాపనను చేసుకుంటున్నారు. కావున సేవలో బిజీగా ఉండాలి. ఎక్కడైనా వరదలు మొదలైనవి వస్తే వారు ఎలా బిజీ అయిపోతారో చూడండి. అందరికీ భోజనము మొదలైనవి చేర్చే సేవలో నిమగ్నమైపోతారు. నీరు వస్తే ముందు నుండే పరిగెత్తడం మొదలుపెడతారు. మరి అంతా ఎలా అంతమైపోతారో ఆలోచించండి. సృష్టి చుట్టూ సముద్రము ఉంది. వినాశనమైతే అంతా జలమయమైపోతుంది, అంతా నీరే నీరు. మన రాజ్యమున్నప్పుడు ఈ బాంబే, కరాచీ మొదలైనవేవీ లేవని బుద్ధిలో ఉంటుంది. భారత్ ఎంత చిన్నగా ఉంటుంది, అది కూడా తీయని నదీ తీరాలపై ఉంటుంది. అక్కడ బావులు మొదలైనవాటి అవసరం ఉండదు. నీరు చాలా స్వచ్ఛముగా, తాగే విధముగా ఉంటుంది. నదుల వద్ద ఆటపాటలు జరుగుతాయి. అశుద్ధత యొక్క విషయమేదీ ఉండదు. దాని పేరే స్వర్గము, అమరలోకము. ఆ పేరు వినగానే త్వరత్వరగా తండ్రి నుండి పూర్తిగా చదువుకుని వారసత్వాన్ని తీసుకోవాలి అని మనస్సు కలుగుతుంది. చదువుకుని మళ్ళీ ఇతరులను చదివించాలి. అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. కల్పపూర్వము ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో వారు మళ్ళీ తీసుకుంటారు. పురుషార్థము చేస్తూ ఉంటారు ఎందుకంటే పాపం వారికి తండ్రి గురించి తెలియదు. తండ్రి పవిత్రముగా అవ్వండి అని అంటారు, ఎవరికైతే అరచేతిలో స్వర్గము లభిస్తుందో వారు పవిత్రముగా ఎందుకు ఉండరు. మాకు విశ్వరాజ్యాధికారము లభిస్తున్నప్పుడు మరి మేము ఒక్క జన్మ ఎందుకు పవిత్రముగా అవ్వము అని చెప్పండి. భగవానువాచ - మీరు ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి 21 జన్మల వరకూ యజమానులుగా అవుతారు. కేవలం ఈ ఒక్క జన్మ నా శ్రీమతముపై నడవండి. రక్షాబంధనము కూడా దీనికే గుర్తు. మరి మనం పవిత్రముగా ఎందుకు ఉండలేము. అనంతమైన తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. తండ్రి భారత్ కు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చారు, దానిని సుఖధామము అని అంటారు. అక్కడ అపారమైన సుఖాలు ఉండేవి, ఇప్పుడు ఇది దుఃఖధామము. ఎవరైనా పెద్దవారికి మీరు ఇలా అర్థం చేయిస్తూ ఉన్నట్లయితే అందరూ వింటూ ఉంటారు. యోగములో ఉంటూ మీరు తెలియజేసినట్లయితే అందరూ సమయాన్ని కూడా మర్చిపోతారు, ఎవ్వరూ ఏమీ అనలేరు. 15-20 నిముషాలకు బదులుగా గంట కూడా వింటూ ఉండిపోతారు. కానీ అటువంటి శక్తి కావాలి. దేహాభిమానం ఉండకూడదు. ఇక్కడైతే సేవే చేస్తూ ఉండాలి, అప్పుడే కళ్యాణమవుతుంది. రాజుగా అవ్వాలంటే ప్రజలను ఎక్కడ తయారుచేసుకున్నారు. తండ్రి ఊరికే తలపై కిరీటం పెట్టరు కదా. ప్రజలు ద్వికిరీటధారులుగా అవుతారా ఏమిటి? ద్వికిరీటధారులుగా అవ్వడమే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. తండ్రి అయితే పిల్లలకు ఉత్సాహాన్ని ఇప్పిస్తారు. జన్మజన్మాంతరాల పాపాలు శిరస్సుపై ఉన్నాయి, అవి యోగబలము ద్వారానే అంతమవ్వగలవు. ఈ జన్మలో ఏమేమి చేసారు అనేది మీరు అర్థం చేసుకోగలరు కదా. పాపాలను అంతం చేసుకునేందుకు యోగము మొదలైనవి నేర్పించడం జరుగుతుంది. ఇది ఈ ఒక్క జన్మ విషయమేమీ కాదు. తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అయ్యే యుక్తిని తండ్రి కూర్చొని తెలియజేస్తారు, ఇకపోతే కృప మొదలైనవి కావాలంటే సాధువుల వద్దకు వెళ్ళి అడగండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అమరలోకములోకి వెళ్ళేందుకు సంగమములో సంతోషము యొక్క ఖజానాను నింపుకోవాలి. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. తమ జోలెను నింపుకొని దయార్ద్ర హృదయులుగా అయి అంధులకు చేతికర్రగా అవ్వాలి.

2. అరచేతిలో స్వర్గాన్ని తీసుకునేందుకు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. స్వయాన్ని సతోప్రధానముగా తయారుచేసుకునే యుక్తులను రచించి తమపై తామే కృప చూపించుకోవాలి. యోగబలాన్ని జమ చేసుకోవాలి.

వరదానము:-

ప్రభువును సదా తోడుగా ఉంచుకుంటూ కంబైండ్ స్వరూపాన్ని అనుభవం చేసే విశేష పాత్రధారీ భవ

పిల్లలు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ‘బాబా’ అని అంటారో అప్పుడు హృదయాభిరాముడు హాజరవుతారు, అందుకే ప్రభువు హాజరై ఉన్నారు అని అంటారు. మరియు విశేష ఆత్మలైతే కంబైండుగానే ఉంటారు. మనుష్యులు అంటారు - ఎక్కడ చూసినా అక్కడ నీవే నీవు. పిల్లలు అంటారు, మేము ఎక్కడకు వెళ్ళినా, ఏమి చేసినా తండ్రి తోడుగానే ఉన్నారు. చేసేవారు మరియు చేయించేవారు అని అంటారు కదా, అంటే చేసేవారు మరియు చేయించేవారు ఇరువురూ కంబైండ్ అయినట్లు. ఈ స్మృతిలో ఉంటూ పాత్రను అభినయించేవారు విశేష పాత్రధారులుగా అవుతారు.

స్లోగన్:-

స్వయాన్ని ఈ పాత ప్రపంచములో గెస్ట్ గా భావిస్తూ ఉన్నట్లయితే పాత సంస్కారాలను మరియు సంకల్పాలను గెట్ అవుట్ చేయగలరు.