19-09-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ పని ఏమిటంటే మీతో మీరు మాట్లాడుకుంటూ పావనంగా తయారవ్వడము, ఇతర ఆత్మల యొక్క చింతనలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి’’

ప్రశ్న:-
ఏ విషయం బుద్ధిలోకి వచ్చినట్లయితే పాత అలవాట్లన్నీ దూరమైపోతాయి?

జవాబు:-
మేము అనంతమైన తండ్రికి సంతానము కావున మేము విశ్వాధిపతులము, మేము దేవతలుగా అవ్వాలి - ఈ విషయం బుద్ధిలోకి వచ్చినట్లయితే పాత అలవాట్లన్నీ దూరమైపోతాయి. మీరు చెప్పినా, చెప్పకపోయినా తమంతట తామే వదిలేస్తారు. అశుద్ధమైన ఆహార-పానీయాలు, మద్యము మొదలైనవి తమంతట తామే వదిలేస్తారు. మీరంటారు - వాహ్! మేమైతే ఈ లక్ష్మీ-నారాయణుల వలె తయారవ్వాలి, 21 జన్మల రాజ్య భాగ్యము లభిస్తుందంటే మరి పవిత్రముగా ఎందుకు ఉండము!

ఓంశాంతి
తండ్రి ఘడియ-ఘడియ పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తూ ఉంటారు - మీరు తండ్రి స్మృతిలో కూర్చున్నారా? బుద్ధి ఇంకెవరి వైపుకూ పరిగెత్తడం లేదు కదా? తండ్రిని పిలవడమే ఎందుకు పిలుస్తారంటే - బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని. పావనులుగానైతే తప్పకుండా అవ్వాలి మరియు జ్ఞానాన్ని అయితే మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, ఇది మీరు ఎవరికి అర్థం చేయించినా వెంటనే అర్థం చేసుకుంటారు. పవిత్రముగా లేకపోయినా సరే జ్ఞానాన్ని అయితే ఎలాగోలా చదివేస్తారు. ఇదేమంత పెద్ద విషయం కాదు. 84 జన్మల చక్రము గురించి మరియు ప్రతి యుగానికి ఇంతటి ఆయువు ఉంటుందని, ఇన్ని జన్మలు ఉంటాయని చదువుతారు, ఇది ఎంత సహజము. దీనికి స్మృతితో సంబంధం లేదు, ఇది చదువు. తండ్రి అయితే యథార్థమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. ఇక మిగిలింది సతోప్రధానముగా అవ్వవలసిన విషయము. అలా స్మృతి ద్వారానే తయారవుతారు. ఒకవేళ స్మృతి చేయకపోతే చాలా చిన్న పదవిని పొందుతారు, అంతటి ఉన్నత పదవిని పొందలేరు, అందుకే అటెన్షన్ అని చెప్పడం జరుగుతుంది. బుద్ధి యోగము తండ్రితో జోడింపబడి ఉండాలి. దీనినే ప్రాచీన యోగము అని అంటారు. టీచర్ తోనైతే ప్రతి ఒక్కరికీ యోగము ఉంటుంది. ముఖ్యమైన విషయము స్మృతికి సంబంధించినది. స్మృతియాత్ర ద్వారానే సతోప్రధానముగా అవ్వాలి మరియు సతోప్రధానముగా అయి తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇకపోతే చదువైతే చాలా సహజమైనది. ఎవరైనా చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. మాయ యుద్ధము ఈ స్మృతిలోనే జరుగుతుంది. మీరు తండ్రిని స్మృతి చేస్తారు మరియు మాయ మళ్ళీ తన వైపుకు ఆకర్షించి మరపింపజేస్తుంది. నాలో శివబాబా కూర్చున్నారని, నేనే శివుడిని అని ఇలా అయితే అనరు. నేను ఆత్మను, నేను శివబాబాను స్మృతి చేయాలి. అంతేకానీ నాలో శివుడు ప్రవేశించారు అని భావించడం కాదు, అలా జరుగదు. తండ్రి అంటారు, నేను ఎవరిలోకీ వెళ్ళను. నేను ఈ రథముపై స్వారీ చేసి పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. ఒకవేళ ఎవరైనా మందబుద్ధి గల పిల్లలు ఉంటే మరియు ఎవరైనా మంచి జిజ్ఞాసువు వస్తే, తన సేవార్థము నేను ప్రవేశించి దృష్టిని ఇవ్వగలను, అంతేకానీ సదా కోసం కూర్చుండిపోను. బహురూపాలను ధారణ చేసి ఎవరి కళ్యాణమునైనా వారు చేయవచ్చు, అంతేకానీ నాలోకి శివబాబా ప్రవేశించారు, నాకు శివబాబా ఇలా చెప్పున్నారు అని ఎవ్వరూ అనలేరు. అలా జరగదు. శివబాబా అయితే పిల్లలకే అర్థం చేయిస్తారు. ముఖ్యమైనది పవిత్రముగా తయారయ్యే విషయము, తద్వారా పావన ప్రపంచములోకి వెళ్ళగలుగుతారు. 84 జన్మల చక్రాన్ని అయితే చాలా సహజముగా అర్థం చేయిస్తారు. చిత్రాలు ఎదురుగా ఉన్నాయి. తండ్రి తప్ప ఇంతటి జ్ఞానాన్ని అయితే ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మకే జ్ఞానము లభిస్తుంది, దానినే జ్ఞానము యొక్క మూడవ నేత్రము అని అంటారు. ఆత్మకే సుఖ-దుఃఖాలు కలుగుతాయి, ఆత్మకు ఈ శరీరము ఉంది కదా. ఆత్మయే దేవతగా అవుతుంది. బ్యారిస్టరుగా లేక వ్యాపారిగా ఆత్మయే అవుతుంది. కావున ఇప్పుడు ఆత్మలతో తండ్రి కూర్చుని మాట్లాడుతారు, తమ పరిచయాన్ని ఇస్తారు. మీరు దేవతలుగా ఉన్నప్పుడు కూడా మనుష్యులుగానే ఉండేవారు కానీ పవిత్ర ఆత్మలుగా ఉండేవారు. ఇప్పుడు మీరు పవిత్రముగా లేరు, అందుకే మిమ్మల్ని దేవతలు అని అనలేరు. ఇప్పుడు దేవతలుగా అయ్యేందుకు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. దాని కోసం బాబాను స్మృతి చేయాలి. చాలా వరకు ఏమంటారంటే - బాబా, నేను దేహాభిమానములోకి వచ్చేసాను, అందుకే నా ద్వారా ఈ పొరపాటు జరిగింది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్ధం చేయిస్తారు, పావనముగా తప్పకుండా అవ్వాలి. ఎటువంటి వికర్మనూ చేయకండి. మీరు సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే అవ్వాలి. పావనముగా అవ్వడం ద్వారా ముక్తిధామములోకి వెళ్ళిపోతారు. ఇంకే ప్రశ్నా అడగవలసిన అవసరమే లేదు. మీరు మీతో మీరు మాట్లాడుకోండి, ఇతర ఆత్మల గురించి చింతన చేయకండి. ఏమంటారంటే - యుద్ధములో రెండు కోట్లమంది మరణించారు, మరి ఇంతమంది ఆత్మలు ఎక్కడికి వెళ్ళారు? అరే, వారు ఎక్కడికి వెళ్ళినా, అందులో మీదేమి పోతుంది, మీరు ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, ఇంకే విషయమూ అడగవలసిన అవసరం లేదు. మీ పని పావనముగా అయి పావన ప్రపంచానికి అధిపతులుగా అవ్వడము. ఇతర విషయాలలోకి వెళ్ళడం వలన తికమకపడిపోతారు. ఎవరికైనా పూర్తి జవాబు లభించకపోతే తికమకపడిపోతారు.

తండ్రి అంటారు - మన్మనాభవ. దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను వదిలివేయండి, నా వద్దకే మీరు రావాలి. మనుష్యులు మరణించినప్పుడు వారి దేహాన్ని స్మశానములోకి తీసుకువెళ్ళినప్పుడు, ఆ సమయములో ముఖాన్ని ఇటువైపుకు మరియు పాదాలను స్మశానం వైపుకు పెడతారు, మళ్ళీ ఎప్పుడైతే స్మశానం వద్దకు చేరుకుంటారో అప్పుడు పాదాలను ఇటువైపుకు మరియు ముఖాన్ని స్మశానం వైపుకు తిప్పుతారు. మీ ఇల్లు కూడా పైనే ఉంది కదా. పైకి పతితులు ఎవ్వరూ వెళ్ళలేరు. పావనంగా అయ్యేందుకు బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి. తండ్రి వద్దకు, ముక్తిధామములోకి వెళ్ళాలి. పతితులుగా ఉన్నారు, అందుకే పతితులైన మమ్మల్ని మీరు వచ్చి పావనముగా తయారుచేయండి, విముక్తులుగా చేయండి అని పిలుస్తారు. కావున తండ్రి అంటారు, ఇప్పుడు పవిత్రముగా అవ్వండి. తండ్రి ఏ భాషలోనైతే అర్థం చేయిస్తారో, ఆ భాషలోనే కల్ప-కల్పమూ అర్థం చేయిస్తారు. ఇతని భాష ఏదైతే ఉందో, అందులోనే అర్థం చేయిస్తారు కదా. ఈ రోజుల్లో హిందీ ఎంతో ప్రాచుర్యములో ఉంది. వారి భాష మారగలదు అని కాదు, సంస్కృత భాష మొదలైనవైతే దేవతల భాషలు కావు. హిందూ ధర్మము యొక్క భాష సంస్కృతం కాదు, హిందీయే ఉండాలి. మరి సంస్కృతములో ఎందుకు చెప్తారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ కూర్చున్నప్పుడు తండ్రి స్మృతిలోనే కూర్చోవాలి, ఇంకే విషయాలలోకి మీరు వెళ్ళకండి. ఇన్ని దోమలు పుడుతున్నాయి, అవి ఎక్కడికి వెళ్తాయి? భూకంపాలలో లెక్కలేనంతమంది ఒక్కసారిగా చనిపోతారు, ఆ ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? ఇందులో మీదేమిపోతుంది? మీకైతే తండ్రి శ్రీమతాన్ని ఇచ్చారు - మీరు మీ ఉన్నతి కొరకు పురుషార్థం చేయండి, ఇతరుల చింతనలోకి వెళ్ళకండి, అలా అయితే అనేక విషయాల చింతన అయిపోతుంది. కేవలం మీరు నన్ను స్మృతి చేయండి, దేని కోసమైతే పిలిచారో ఆ యుక్తిలోనే నడుచుకోండి. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి, ఇతర విషయాలలోకి వెళ్ళకూడదు. అందుకే బాబా ఘడియ-ఘడియ అటెన్షన్! అని అంటారు. బుద్ధి ఎటువైపుకూ వెళ్ళడం లేదు కదా. భగవంతుని శ్రీమతాన్ని అయితే పాటించాలి కదా. ఇంకే విషయములోనూ లాభం లేదు. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. మన బాబా, తండ్రి కూడా, టీచర్ కూడా మరియు గురువు కూడా అన్నది పక్కాగా గుర్తుంచుకోండి. తప్పకుండా హృదయములో ఇది గుర్తుంచుకోవాలి - తండ్రి తండ్రి కూడా, వారు మనల్ని చదివిస్తారు, యోగాన్ని నేర్పిస్తారు. టీచర్ చదివిస్తారు కావున బుద్ధి యోగము టీచర్ వైపుకు మరియు చదువు వైపుకు కూడా వెళ్తుంది. తండ్రి కూడా ఇదే అంటారు - మీరు తండ్రికి చెందినవారిగా అయితే ఎలాగూ అయిపోయారు, పిల్లలుగానైతే ఎలాగూ ఉన్నారు, అందుకే ఇక్కడ కూర్చున్నారు. టీచర్ ద్వారా చదువుకుంటున్నారు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఆ తండ్రికి చెందినవారే, ఇక చదువుపై అటెన్షన్ ఉంచాలి. శివబాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు సతోప్రధానముగా అయిపోతారు. ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మనుష్యులైతే ఘోర అంధకారములో ఉన్నారు కదా. జ్ఞానములో ఎంతటి శక్తి ఉందో చూడండి. శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? తండ్రి నుండి శక్తి లభిస్తుంది, తద్వారా మీరు పావనముగా అవుతారు. అలాగే చదువు కూడా సరళమైనదే. ఆ చదువులోనైతే ఎన్నో మాసాలు పడతాయి. ఇక్కడైతే ఇది 7 రోజుల కోర్స్. అందులో మీరు అంతా అర్థం చేసుకుంటారు, అయితే అది బుద్ధిపై ఆధారపడి ఉంటుంది. కొందరికి ఎక్కువ సమయం పడుతుంది, కొందరికి తక్కువ సమయం పడుతుంది. కొందరైతే 2-3 రోజులలోనే బాగా అర్థం చేసుకుంటారు. ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడము, పవిత్రముగా అవ్వడము. అందులోనే కష్టమవుతుంది. ఇకపోతే చదువు అయితే అత్యంత సరళమైనది. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఒక్క రోజు కోర్సులో కూడా అంతా అర్థం చేసుకోగలుగుతారు. మనం ఒక ఆత్మ, అనంతమైన తండ్రికి సంతానము, కావున మనం తప్పకుండా విశ్వానికి అధిపతులము. ఇది బుద్ధిలోకి వస్తుంది కదా. దేవతగా అవ్వాలంటే దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి, ఇది ఎవరికైతే బుద్ధిలోకి వచ్చేస్తుందో వారు వెంటనే అన్ని అలవాట్లనూ వదిలివేస్తారు. మీరు చెప్పినా, చెప్పకపోయినా వారు తమంతట తామే వదిలివేస్తారు. అశుద్ధ ఆహార-పానీయాలు, మద్యము మొదలైనవాటిని తమంతట తామే వదిలివేస్తారు. ఏమంటారంటే - ఓహో, మేము ఈ విధంగా అవ్వాలి, 21 జన్మల కొరకు రాజ్యం లభిస్తుంటే పవిత్రముగా ఎందుకు ఉండము. గట్టిగా పట్టుకోవాలి. ముఖ్యమైన విషయము స్మృతియాత్ర. ఇకపోతే 84 జన్మల చక్రము యొక్క జ్ఞానమైతే ఒక్క క్షణములో లభించేస్తుంది. చూడడంతోనే అర్థం చేసేసుకుంటారు. కొత్త వృక్షమైతే తప్పకుండా చిన్నగా ఉంటుంది. ఇప్పుడైతే వృక్షం ఎంత పెద్దగా, తమోప్రధానముగా అయిపోయింది. రేపు మళ్ళీ కొత్తగా, చిన్నగా అయిపోతుంది. ఈ జ్ఞానము ఎప్పుడూ ఎక్కడ నుండీ లభించదు అని మీకు తెలుసు. ఇది చదువు, తండ్రిని స్మృతి చేయండి అని మొట్టమొదటి ముఖ్యమైన శిక్షణ కూడా లభిస్తుంది. తండ్రి చదివిస్తున్నారు, ఈ నిశ్చయము ఏర్పరచుకోండి. భగవానువాచ - నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇంకే మనుష్యులూ ఈ విధంగా అనలేరు. టీచర్ చదివిస్తారు కావున తప్పకుండా టీచరును స్మృతి చేస్తారు కదా. వీరు అనంతమైన తండ్రి కూడా, తండ్రి మనల్ని స్వర్గాధిపతులుగా తయారుచేస్తారు. కానీ ఆత్మ ఏ విధంగా పవిత్రముగా అవుతుంది - ఇది ఎవ్వరూ తెలియజేయలేరు. స్వయాన్ని భగవంతునిగా పిలుచుకన్నా లేక ఇంకే విధముగానైనా పిలుచుకున్నా కానీ వారెవ్వరూ పావనముగా తయారుచేయలేరు. ఈ రోజుల్లో భగవంతులుగా ఎంతోమంది తయారైపోయారు. మనుష్యులు తికమకపడుతున్నారు. అనేక ధర్మాలు వెలువడుతున్నాయి, ఏది సరైనదో మాకు ఏం తెలుసు అని అంటారు. మీ ప్రదర్శనీ లేక మ్యూజియం మొదలైనవాటి ప్రారంభోత్సవం చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. వాస్తవానికి ప్రారంభోత్సవమైతే జరిగిపోయింది. మొదట పునాది వేయడం జరుగుతుంది, ఆ తర్వాత ఎప్పుడైతే ఇల్లు తయారైపోతుందో అప్పుడు ప్రారంభోత్సవం జరుగుతుంది. పునాది రాయిని వేసేందుకు కూడా పిలవడం జరుగుతుంది. దీనిని కూడా తండ్రి స్థాపించేసారు, ఇకపోతే కొత్త ప్రపంచపు ప్రారంభోత్సవమైతే జరిగే తీరుతుంది, అందులో ఎవ్వరూ ప్రారంభోత్సవం చేయవలసిన అవసరం ఉండదు. ప్రారంభోత్సవమైతే స్వతహాగానే జరిగిపోతుంది. ఇక్కడ చదువుకుని మళ్ళీ మనం కొత్త ప్రపంచములోకి వెళ్ళిపోతాము.

ఇప్పుడు మనం స్థాపన చేస్తున్నామని, దాని కోసమే కష్టపడవలసి ఉంటుందని మీరు అర్థం చేసుకున్నారు. వినాశనమవుతుంది, ఆ తర్వాత ఈ ప్రపంచమే మారిపోతుంది. ఆ తర్వాత మీరు కొత్త ప్రపంచములో రాజ్యం చేసేందుకు వచ్చేస్తారు. సత్యయుగ స్థాపనను తండ్రి చేసారు, ఆ తర్వాత మీరు వస్తే స్వర్గము యొక్క రాజధాని లభిస్తుంది. మరి దాని ప్రారంభోత్సవాన్ని ఎవరు చేస్తారు? తండ్రి అయితే స్వర్గములోకి రారు. స్వర్గములో ఏమేమి జరుగుతుందో మున్ముందు చూడాలి. చివరిలో ఏమవుతుంది అనేది మున్ముందు అర్థం చేసుకుంటారు. పవిత్రత లేకుండా గౌరవపూర్వకముగా మనం స్వర్గములోకి వెళ్ళలేము. అంతటి పదవిని కూడా పొందలేరు, అందుకే తండ్రి అంటారు, బాగా పురుషార్థము చేయండి. వ్యాపారాలు మొదలైనవి కూడా చేయండి కానీ ఎక్కువ ధనాన్ని ఏమి చేసుకుంటారు. దానిని తినలేరు కదా. మీ పుత్ర, పౌత్రాదులు కూడా తినలేరు, అంతా మట్టిలో కలిసిపోతుంది, అందుకే యుక్తిగా కొద్దిగా స్టాక్ ఉంచుకోండి, మిగిలినదంతా అటువైపుకు ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందరూ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. పేదవారు త్వరగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. భక్తి మార్గములో కూడా మరుసటి జన్మ కొరకు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కాని అది ఇన్ డైరెక్ట్. ఇక్కడ ఇది డైరెక్ట్. పతిత మనుష్యులకు పతితులతోనే ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి. ఇప్పుడైతే తండ్రి వచ్చారు, మీకు ఇక పతితులతో ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. మీరు బ్రాహ్మణులు, బ్రాహ్మణులకే మీరు సహాయం చేయాలి. ఎవరైతే స్వయం సర్వీస్ చేస్తారో వారికైతే సహాయం యొక్క అవసరం లేదు. ఇక్కడ పేదవారు, షావుకార్లు మొదలైనవారందరూ వస్తారు. ఇకపోతే కోటీశ్వరులైతే కష్టం మీద వస్తారు. తండ్రి అంటారు, నేను పేదల పాలిటి పెన్నిధిని. భారత్ చాలా నిరుపేద ఖండము. తండ్రి అంటారు, నేను రావడం కూడా భారత్ లోకే వస్తాను, అందులోనూ ఈ ఆబూ అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము. ఇక్కడకు తండ్రి వచ్చి మొత్తం విశ్వము యొక్క సద్గతిని చేస్తారు. ఇక్కడ నరకము ఉంది. నరకము మళ్ళీ స్వర్గముగా ఎలా అవుతుందో మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. తండ్రి పావనముగా అయ్యేందుకు ఎటువంటి యుక్తిని తెలియజేస్తారంటే, దాని ద్వారా వారు అందరి కళ్యాణమునూ చేసేస్తారు. సత్యయుగములో అకళ్యాణము యొక్క విషయమేదీ ఉండదు, ఏడవడం, రోదించడం మొదలైనవేవీ ఉండవు. ఇప్పుడు తండ్రి మహిమ ఏదైతే ఉందో - జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు అని, ఇప్పుడు మీకు కూడా ఈ మహిమ ఉంది, తండ్రి మహిమే మీ మహిమ. మీరు కూడా ఆనంద సాగరులుగా అవుతారు, అనేకులకు సుఖాన్ని ఇస్తారు, మళ్ళీ ఎప్పుడైతే మీ ఆత్మ సంస్కారాలను తీసుకుని కొత్త ప్రపంచములోకి వెళ్తుందో, అప్పుడు అక్కడ మళ్ళీ మీ మహిమ మారిపోతుంది, అప్పుడు మిమ్మల్ని సర్వగుణ సంపన్నులు... అని అంటారు. ఇప్పుడు మీరు నరకములో కూర్చున్నారు, దీనిని ముళ్ళ అడవి అని అంటారు. తండ్రినే తోట యజమాని, నావికుడు అని అంటారు. మా నావను తీరానికి చేర్చండి అని పాడుతారు కూడా ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు కావున ఆత్మ పిలుస్తుంది. మహిమను గానం చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఏది తోస్తే అది అనేస్తారు. ఉన్నతోన్నతమైన భగవంతుని నిందను చేస్తూ ఉంటారు. మీరు అంటారు, మేమైతే ఆస్తికులము, సర్వుల సద్గతిదాత అయిన తండ్రిని మేము తెలుసుకున్నాము. తండ్రి స్వయంగా పరిచయాన్ని ఇచ్చారు. మీరు భక్తిని చేయరు కావున వారు ఎంతగా విసిగిస్తారు. వారిది మెజారిటీ, మీది మైనారిటీ. ఎప్పుడైతే మీది మెజారిటీ అవుతుందో, అప్పుడు వారికి కూడా ఆకర్షణ కలుగుతుంది, బుద్ధి తాళం తెరుచుకుంటుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీ ఉన్నతి గురించే చింతన చేయాలి, ఇతర ఏ విషయాలలోకి వెళ్ళకూడదు. చదువు మరియు స్మృతి పట్ల పూర్తి అటెన్షన్ ను ఉంచాలి. బుద్ధిని భ్రమింపజేయకూడదు.

2. ఇప్పుడు తండ్రి డైరెక్ట్ గా వచ్చారు కావున మీదంతా యుక్తిగా ట్రాన్స్ఫర్ చేయాలి. పతిత ఆత్మలతో ఇచ్చిపుచ్చుకోవడాలు చేయకూడదు. గౌరవపూర్వకంగా స్వర్గములోకి వెళ్ళేందుకు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి.

వరదానము:-

మనస్సు మరియు బుద్ధిని వ్యర్థం నుండి ముక్తిగా ఉంచుతూ బ్రాహ్మణ సంస్కారాలను తయారుచేసుకునే రూలర్ (పరిపాలించేవారు) భవ

ఏ చిన్న వ్యర్థ విషయము, వ్యర్థ వాతావరణము లేక వ్యర్థ దృశ్యము యొక్క ప్రభావము ముందుగా మనసుపై పడుతుంది, ఆ తర్వాత బుద్ధి దానికి సహయోగాన్ని ఇస్తుంది. మనస్సు మరియు బుద్ధి ఒకవేళ అదే విధంగా నడుస్తూ ఉన్నట్లయితే, అది సంస్కారము అయిపోతుంది. అప్పుడిక భిన్న-భిన్న సంస్కారాలు కనిపిస్తాయి, అవి బ్రాహ్మణ సంస్కారాలు కావు. ఏదైనా వ్యర్థ సంస్కారానికి వశమవ్వటము, తమతో తామే యుద్ధము చేసుకోవటము, ఘడియ-ఘడియ సంతోషము మాయమవ్వటము - ఇవి క్షత్రియత్వపు సంస్కారాలు. బ్రాహ్మణులు అనగా రూలర్ (పరిపాలకులు), వారు వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులుగా ఉంటారు, పరవశమవ్వరు.

స్లోగన్:-

మాస్టర్ సర్వశక్తివంతులు ఎవరంటే, వారు దృఢ ప్రతిజ్ఞ ద్వారా సర్వ సమస్యలను సహజంగానే దాటి వేస్తారు.