19-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ అనంతమైన నాటకములో ఆత్మలైన మీకు మీ-మీ పాత్రలు లభించి ఉన్నాయి, ఇప్పుడు మీరు ఈ శరీరము రూపీ వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త రాజ్యములోకి రావాలి’’

ప్రశ్న:-
తండ్రి ఏ కార్యాన్ని కూడా ప్రేరణ ద్వారా చేయరు, వారి అవతరణ జరుగుతుంది, ఇది ఏ విషయము ద్వారా నిరూపించబడుతుంది?

జవాబు:-
తండ్రిని చేసేవారు-చేయించేవారు అని అంటారు. ప్రేరణ అనగా అర్థము - ఆలోచన. ప్రేరణ ద్వారా కొత్త ప్రపంచ స్థాపనేమీ జరగదు. తండ్రి పిల్లల ద్వారా స్థాపన చేయిస్తారు. కర్మేంద్రియాలు లేకుండానైతే ఏమీ చేయించలేరు, అందుకే వారు శరీరాన్ని ఆధారముగా తీసుకోవలసి ఉంటుంది.

ఓంశాంతి
ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ఎదురుగా కూర్చొని ఉన్నారు అనగా ఆత్మలు తమ తండ్రి సమ్ముఖములో కూర్చొని ఉన్నారు. ఆత్మ తప్పకుండా శరీరముతో పాటే కూర్చుంటుంది. తండ్రి కూడా శరీరాన్ని తీసుకున్నప్పుడే సమ్ముఖముగా ఉంటారు, దీనినే ఆత్మ-పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు... అని అంటారు. ఉన్నతోన్నతమైన తండ్రికే ఈశ్వరుడు, ప్రభు, పరమాత్మ అని రకరకాల పేర్లు పెట్టారని, లౌకిక తండ్రిని ఎప్పుడూ పరమపిత అని అనరని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. కేవలం పరమపిత అని వ్రాసినా ఫర్వాలేదు. పరమపిత అనగా వారు అందరికీ తండ్రి, వారు ఒక్కరే అని అర్థము. మనము పరమపితతో పాటు కూర్చున్నామని పిల్లలకు తెలుసు. పరమపిత పరమాత్మ మరియు ఆత్మలమైన మనము శాంతిధామములో నివసిస్తాము. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము, సత్యయుగము నుండి మొదలుకొని కలియుగాంతము వరకు పాత్రను అభినయించాము, ఇది కొత్త రచన. పిల్లలైన మీరు ఈ విధముగా పాత్రను అభినయించారని రచయిత అయిన తండ్రి అర్థం చేయించారు. మనము 84 జన్మల చక్రములో తిరిగామని ఇంతకుముందు తెలియదు. 84 జన్మల చక్రములో తిరిగిన పిల్లలైన మీతోనే తండ్రి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అందరూ అయితే 84 జన్మలు తీసుకోలేరు. 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుందో అర్థం చేయించాలి. అంతేకానీ లక్షల సంవత్సరాల విషయమేమీ కాదు. పిల్లలకు తెలుసు - మనము ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత పాత్రను అభినయించేందుకు వస్తాము. మనము పాత్రధారులము. ఉన్నతోన్నతమైన భగవంతుడిది కూడా విచిత్రమైన పాత్ర. బ్రహ్మా మరియు విష్ణువులది విచిత్రమైన పాత్ర అని అనరు. ఇరువురూ 84 జన్మల చక్రములో తిరుగుతారు. ఇకపోతే శంకరుని పాత్ర ఈ ప్రపంచములోనైతే ఉండదు. త్రిమూర్తి చిత్రములో - స్థాపన, వినాశనము, పాలనను చూపిస్తారు. చిత్రాలపై అర్థము చేయించవలసి ఉంటుంది. ఏ చిత్రాలనైతే చూపిస్తారో, వాటిపై అర్థం చేయించాలి. సంగమయుగములో పాత ప్రపంచ వినాశనము జరగాల్సిందే. ప్రేరకులు అన్న పదము కూడా తప్పు. ఈ రోజు నాకు బయటకు వెళ్ళాలన్న ప్రేరణ లేదు అని కొందరు అంటారు కదా, ప్రేరణ అంటే ఆలోచన. ప్రేరణకు వేరే అర్థమేదీ లేదు. పరమాత్మ ఏమీ ప్రేరణతో పని చెయ్యరు. అలాగే ప్రేరణతో జ్ఞానము లభించదు. ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్రను అభినయించేందుకు తండ్రి వస్తారు. వారు చేసేవారు, చేయించేవారు కదా. వారు పిల్లలతో చేయిస్తారు. శరీరము లేకుండానైతే చేయలేరు. ఈ విషయాలను గురించి ఎవరికీ తెలియదు. అలాగే తండ్రి అయిన ఈశ్వరుని గురించి కూడా తెలియదు. మాకు ఈశ్వరుడి గురించి తెలియదు అని ఋషులు-మునులు మొదలైనవారు అనేవారు. ఆత్మ గురించి గాని, పరమాత్మ గురించి గాని, ఎవ్వరిలోనూ జ్ఞానము లేదు. తండ్రి ముఖ్యమైన క్రియేటర్ (రచయిత), డైరెక్టర్, వారు డైరెక్షన్లు కూడా ఇస్తారు, శ్రీమతాన్ని ఇస్తారు. మనుష్యుల బుద్ధిలోనైతే సర్వవ్యాపి యొక్క జ్ఞానముంది. బాబా మాకు తండ్రి అని మీరు భావిస్తారు, వారు సర్వవ్యాపి అని అంటారు కావున వారు బాబాను తండ్రిగా భావించలేరు. ఇది అనంతమైన తండ్రి యొక్క పరివారము అని మీరు భావిస్తారు. సర్వవ్యాపి అనడంతో పరివారము యొక్క సుగంధము రాదు. వారిని నిరాకారీ శివబాబా అని అంటారు. వారు నిరాకారీ ఆత్మలకు తండ్రి. శరీరమున్నప్పుడే ఆత్మ, ‘బాబా’ అని అంటుంది. శరీరము లేకపోతే ఆత్మ మాట్లాడలేదు. భక్తి మార్గములో వారిని పిలుస్తూ వచ్చారు. ఆ బాబా దుఃఖహర్త, సుఖకర్త అని భావిస్తారు. సుఖము సుఖధామములో లభిస్తుంది. శాంతి శాంతిధామములో లభిస్తుంది. ఇక్కడ ఉన్నది దుఃఖము. పాత ప్రపంచానికి మరియు కొత్త ప్రపంచానికి మధ్యనున్న సంగమయుగములోనే మీకు ఈ జ్ఞానము లభిస్తుంది. కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనము జరగవలసి ఉన్నప్పుడే తండ్రి వస్తారు. ఎల్లప్పుడూ మొదటగా కొత్త ప్రపంచ స్థాపన అని చెప్పాలి. పాత ప్రపంచము వినాశనము అని మొదట చెప్పడం తప్పు అవుతుంది. ఇప్పుడు మీకు అనంతమైన నాటకము యొక్క జ్ఞానము లభిస్తుంది. ఆ నాటకములోకి పాత్రధారులు వచ్చినప్పుడు, ఇంటి నుండి సాధారణమైన వస్త్రాలను ధరించి వస్తారు, ఆ తర్వాత నాటకము సమయములో వస్త్రాలు మార్చుకుంటారు, మళ్ళీ నాటకము పూర్తయినప్పుడు ఆ వస్త్రాలను మార్చుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడికి ఆత్మలైన మీరు ఇంటి నుండి అశరీరిగా రావలసి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఈ శరీరమనే వస్త్రాన్ని ధరిస్తారు. ప్రతి ఒక్కరికీ తమ-తమ పాత్ర లభించి ఉంది. ఇది అనంతమైన నాటకము. ఇప్పుడు ఈ అనంతమైన ప్రపంచమంతా పాతదిగా ఉంది, మళ్ళీ కొత్త ప్రపంచముగా అవుతుంది. ఆ కొత్త ప్రపంచము చాలా చిన్నది, అక్కడ ఒకే ధర్మము ఉంటుంది. పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచము నుండి బయటకు వచ్చి మళ్ళీ హద్దు ప్రపంచములోకి, కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ ఒకే ధర్మము ఉంటుంది. అనేక ధర్మాలు, అనేకమంది మనుష్యులు ఉండడముతో అనంతమైపోతుంది. అక్కడైతే ఒకే ధర్మము, కొద్దిమంది మనుష్యులే ఉంటారు. ఏక ధర్మ స్థాపన చేసేందుకు రావలసి వస్తుంది. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అని పిల్లలైన మీరు ఈ అనంతమైన నాటకము యొక్క రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. ఈ సమయములో ఏదైతే ప్రాక్టికల్ గా జరుగుతుందో, దీనికి సంబంధించే మళ్ళీ భక్తి మార్గములో పండుగలు జరుపుకుంటారు. నంబరువారుగా ఏయే పండుగలు జరుగుతాయి అనేది కూడా పిల్లలైన మీకు తెలుసు. భగవంతుడైన శివబాబా యొక్క జయంతి ఉన్నతోన్నతమైనది అని అంటారు. వారు వచ్చిన తర్వాతనే మిగిలిన పండుగలు వస్తాయి. శివబాబా వచ్చి మొట్టమొదట గీతను వినిపిస్తారు అనగా వారు ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. యోగము కూడా నేర్పిస్తారు. దానితో పాటు మిమ్మల్ని చదివిస్తారు కూడా. మొట్టమొదట తండ్రి వచ్చారు, శివజయంతి జరిగింది, ఆ తర్వాత గీతా జయంతి అని అంటారు. ఆత్మలకు జ్ఞానము వినిపిస్తారు అంటే గీతా జయంతి జరిగినట్లు. పిల్లలైన మీరు ఆలోచించి పండుగలను నంబరువారుగా వ్రాయండి. ఈ విషయాలను కూడా మన ధర్మము వారు మాత్రమే అర్థము చేసుకుంటారు. ప్రతి ఒక్కరికీ తమ ధర్మము ప్రియమనిపిస్తుంది. ఇతర ధర్మాలవారి విషయమేమీ ఉండదు. ఎవరికైనా వేరే ధర్మము ప్రియమనిపించినా కానీ అందులోకి వెళ్ళలేరు. స్వర్గములోకి ఇతర ధర్మాల వారు రాగలరా ఏమిటి. వృక్షము చిత్రములో ఇది చాలా స్పష్టముగా ఉంది. ఏయే ధర్మాలు ఏయే సమయాలలో వస్తాయో, మళ్ళీ అదే సమయములో వస్తాయి. మొదట తండ్రి వస్తారు, వారే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు, అందుకే శివజయంతి, తర్వాత గీతా జయంతి, తర్వాత నారాయణ జయంతి అని అంటారు. అది సత్యయుగము అవుతుంది. ఇది కూడా నంబరువారుగా వ్రాయాలి. ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. శివజయంతి ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. వారు వినిపించిన జ్ఞానాన్ని గీత అని అంటారు, ఆ తర్వాత వినాశనము కూడా జరుగుతుంది. జగదంబ మొదలైనవారి జయంతికి సెలవు ఏమీ ఉండదు. మనుష్యులకు అసలు ఎవరి తిథి-తారీఖులు మొదలైనవి తెలియదు. లక్ష్మీ-నారాయణుల రాజ్యము, సీతా-రాముల రాజ్యము గురించే తెలియదు. ఈ 2500 సంవత్సరాలలో ఎవరైతే వచ్చారో, వారి గురించి తెలుసు కానీ అంతకుముందు ఉన్న ఆది సనాతన దేవీ-దేవతల గురించి, వారు ఎంత సమయం క్రితం ఉన్నారు అన్నది ఏమీ తెలియదు. కల్పము 5000 సంవత్సరాల కన్నా పెద్దదేమీ ఉండదు. అర్ధకల్పములోనైతే చాలామంది జనాభా వచ్చేసారు, మిగిలిన అర్ధకల్పములో వీరి రాజ్యముంటుంది. మరి కల్పము ఎక్కువ సంవత్సరాలు ఎలా ఉంటుంది. 84 లక్షల జన్మలు కూడా ఉండవు. వారు కలియుగం ఆయుష్షు లక్షల సంవత్సరాలని భావిస్తారు. మనుష్యులను అంధకారములో పడేసారు. 5000 సంవత్సరాలున్న మొత్తం డ్రామా ఎక్కడ, కేవలం కలియుగమే ఇంకా 40 వేల సంవత్సరాలుంది అని అనడం ఎక్కడ. యుద్ధము మొదలైనప్పుడు భగవంతుడు రావాలని భావిస్తారు కానీ భగవంతుడైతే సంగమయుగములోనే రావాలి. మహాభారత యుద్ధము సంగమయుగములోనే జరుగుతుంది. తండ్రి అంటారు, నేను కూడా కల్ప-కల్పము సంగమయుగములోనే వస్తాను. కొత్త ప్రపంచము యొక్క స్థాపన, పాత ప్రపంచము యొక్క వినాశనము చేయించేందుకు తండ్రి వస్తారు. కొత్త ప్రపంచ స్థాపన జరిగినప్పుడు పాత ప్రపంచ వినాశనము తప్పకుండా జరుగుతుంది, అందుకే ఈ యుద్ధము జరుగుతుంది. ఇందులో శంకరుని ప్రేరణ మొదలైన విషయాలేవీ లేవు. పాత ప్రపంచము సమాప్తమైపోతుందని అర్థమవుతుంది. భూకంపాలలో ఇళ్ళు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి ఎందుకంటే కొత్త ప్రపంచము కావాలి. కొత్త ప్రపంచము తప్పకుండా ఉండేది. ఢిల్లీ పరిస్తాన్ గా ఉండేది, యమునా నది తీరములో ఉండేది. లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. చిత్రాలు కూడా ఉన్నాయి. లక్ష్మీ-నారాయణులను స్వర్గవాసులనే అంటారు. స్వయంవరం ఎలా జరుగుతుంది అనేది కూడా పిల్లలైన మీరు సాక్షాత్కారములో చూసారు. ఈ పాయింట్లన్నింటినీ బాబా రివైజ్ చేయిస్తారు. అచ్ఛా, పాయింట్లు గుర్తు రాకపోతే బాబాను స్మృతి చేయండి. తండ్రిని మర్చిపోతే టీచరును స్మృతి చేయండి. టీచరు నేర్పించేది కూడా తప్పకుండా గుర్తొస్తుంది కదా. టీచరు కూడా గుర్తుంటారు, జ్ఞానము కూడా గుర్తుంటుంది. ఉద్దేశ్యము కూడా బుద్ధిలో ఉంది. ఇది గుర్తుంచుకోవాల్సిందే, ఎందుకంటే మీది విద్యార్థి జీవితము కదా. ఎవరైతే మనల్ని చదివిస్తున్నారో, వారు మన తండ్రి కూడా అని మీకు తెలుసు. అలాగని లౌకిక తండ్రి ఏమీ మాయమవ్వరు. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి మరియు వీరు అలౌకిక తండ్రి. వీరిని ఎవరూ స్మృతి చెయ్యరు. లౌకిక తండ్రి నుండి అయితే వారసత్వము లభిస్తుంది. వారు చివరి వరకు గుర్తుంటారు. శరీరము వదిలితే మరొక తండ్రి లభిస్తారు. ప్రతి జన్మలోనూ లౌకిక తండ్రి లభిస్తారు. పారలౌకిక తండ్రిని కూడా సుఖ-దుఃఖాలలో స్మృతి చేస్తారు. ఒకవేళ బిడ్డ జన్మిస్తే ఈశ్వరుడు బిడ్డనిచ్చారు అని అంటారు. ఇకపోతే, ప్రజాపిత బ్రహ్మాను ఎందుకు స్మృతి చేస్తారు, వీరి ద్వారా ఏమీ లభించదు. వీరిని అలౌకిక తండ్రి అని అంటారు.

మనము బ్రహ్మా ద్వారా శివబాబా నుండి వారసత్వము తీసుకుంటున్నామని మీకు తెలుసు. మనం ఏ విధంగా చదువుకుంటున్నామో, అలాగే ఈ రథము కూడా నిమిత్తముగా ఉన్నారు. అనేక జన్మల అంతిమములో వీరి శరీరమే రథముగా అయింది. రథానికి పేరు అయితే పెట్టవలసి ఉంటుంది కదా. ఇది అనంతమైన సన్యాసము. రథముగా ఉన్నవారు నిలిచి ఉంటారు, మిగిలినవారు స్థిరముగా ఉండరు. నడుస్తూ-నడుస్తూ మళ్ళీ పారిపోతారు. డ్రామానుసారముగా ఈ రథము అయితే నిశ్చితమై ఉంది, వీరిని భాగ్యశాలి రథము అని అంటారు. మిమ్మల్నందరినీ భాగ్యశాలి రథము అని అనరు. ఎవరిలోనైతే తండ్రి వచ్చి జ్ఞానమిస్తారో, ఎవరి ద్వారానైతే స్థాపనా కార్యాన్ని చేయిస్తారో, వారొక్కరినే భాగ్యశాలి రథముగా భావిస్తారు. మీరు భాగ్యశాలి రథము కాదు. మీ ఆత్మ ఈ రథములో కూర్చొని చదువుకుంటుంది, దానితో ఆత్మ పవిత్రముగా అయిపోతుంది, అందుకే ఏ శరీరములోనైతే కూర్చొని చదివిస్తున్నారో, గొప్పతనమంతా ఆ శరీరానిదే. ఈ అంతిమ జన్మ చాలా విలువైనది, తర్వాత శరీరము మారి మనము దేవతగా అవుతాము. ఈ పాత శరీరము ద్వారానే మీరు శిక్షణ పొందుతారు, శివబాబాకు చెందివారిగా అవుతారు. మన గత జీవితము పైసకు కొరగానిదిగా ఉండేదని మీకు తెలుసు. ఇప్పుడు విలువైనదిగా అవుతుంది. ఎంతగా చదువుకుంటారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి అర్థం చేయించారు - స్మృతి యాత్ర ముఖ్యమైనది. దీనినే భారత్ యొక్క ప్రాచీన యోగమని అంటారు, దీని ద్వారా మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. స్వర్గవాసులుగా అయితే అందరూ అవుతారు, ఇక మిగిలినది చదువుపై ఆధారపడి ఉంటుంది. మీరు అనంతమైన స్కూలులో కూర్చొని ఉన్నారు. మీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఉన్నత పదవిని ఎవరు పొందగలరు, వారికి ఏయే యోగ్యతలుండాలి అనేది మీరు అర్థం చేసుకోగలరు. ఇంతకుముందు మనలో కూడా యోగ్యతలు లేవు. ఆసురీ మతాన్ని అనుసరించేవారము. ఇప్పుడు ఈశ్వరీయ మతము లభిస్తుంది. ఆసురీ మతము ద్వారా మనము దిగే కళలోకి వెళ్తాము. ఈశ్వరీయ మతము ద్వారా ఎక్కే కళలోకి వెళ్తాము. ఈశ్వరీయ మతాన్ని ఇచ్చేవారు ఒక్కరు మాత్రమే, ఆసురీ మతాన్ని ఇచ్చేవారు అనేకమంది ఉన్నారు. తల్లి-తండ్రులు, సోదరీ-సోదరులు, టీచరు-గురువు, ఇలా ఎంతమంది మతాలు (డైరెక్షన్లు) లభిస్తాయి. ఇప్పుడు మీకు 21 జన్మలకు ఉపయోగపడేలా ఒకే మతము లభిస్తుంది. మరి ఇటువంటి శ్రీమతముపై నడవాలి కదా. ఎంతగా నడుస్తారో, అంతటి శ్రేష్ఠ పదవిని పొందుతారు. తక్కువగా నడిస్తే తక్కువ పదవిని పొందుతారు. శ్రీమతము భగవంతునిది. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడే, వారు శ్రీకృష్ణుడిని ఉన్నతోన్నతముగా తయారుచేశారు, మళ్ళీ రావణుడు నీచాతి నీచముగా తయారుచేశాడు. తండ్రి తెల్లగా చేస్తారు, మళ్ళీ రావణుడు నల్లగా చేస్తాడు. తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. వారు ఉన్నదే నిర్వికారీ. సర్వగుణ సంపన్నులు... అని దేవతల మహిమను పాడుతారు. సత్యయుగములో ఆత్మ మరియు శరీరము, రెండూ పవిత్రముగా ఉంటాయి. దేవతల గురించి అందరికీ తెలుసు, వారు సంపూర్ణ నిర్వికారులుగా ఉన్న కారణముగా సంపూర్ణ విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు అలా లేరు, మళ్ళీ తయారవుతున్నారు. తండ్రి కూడా సంగమయుగములోనే వస్తారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులుగా అవుతారు. మీరందరూ బ్రహ్మా సంతానము. వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ప్రజాపిత బ్రహ్మా పేరు వినలేదా అని అడగండి. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారానే సృష్టిని రచిస్తారు కదా. ఇది బ్రాహ్మణ కులము. బ్రహ్మా ముఖవంశావళి, సోదరీ-సోదరులుగా అయ్యారు. ఇక్కడ రాజా-రాణి యొక్క విషయము లేదు. ఈ బ్రాహ్మణ కులము అయితే సంగమయుగములో కొద్ది సమయమే ఉంటుంది. రాజ్యము పాండవులకూ లేదు, కౌరవులకూ లేదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. 21 జన్మలు శ్రేష్ఠ పదవికి అధికారులుగా అయ్యేందుకు ఆసురీ మతాలన్నింటినీ వదిలి ఒక్క ఈశ్వరీయ మతముపై నడవాలి. సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి.

2. ఈ పాత శరీరములో కూర్చుని, తండ్రి శిక్షణలను ధారణ చేసి దేవతలుగా తయారవ్వాలి. ఇది చాలా విలువైన జీవితము, ఇందులో ఎంతో విలువైనవారిగా తయారవ్వాలి.

వరదానము:-
సర్వ ఆత్మలకు యథార్థమైన అవినాశీ ఆధారాన్ని ఇచ్చే ఆధార, ఉద్ధారమూర్త భవ

వర్తమాన సమయములో విశ్వములో నలువైపులా ఏదో ఒక అలజడి ఉంది, ఒక్కోచోట మనసు యొక్క అనేక టెన్షన్ ల అలజడి, ఒక్కో చోట ప్రకృతి యొక్క తమోప్రధాన వాయుమండలము కారణముగా అలజడి, అల్పకాలికమైన సాధనాలు సర్వులను చింత రూపీ చితిపైకి తీసుకువెళ్తున్నాయి, అందుకే ఈ అల్పకాలిక ఆధారాలతో, ప్రాప్తులతో, విధులతో అలిసిపోయి వాస్తవికమైన ఆధారాన్ని వెదుకుతున్నారు. కావున ఆధారమూర్త, ఉద్ధారమూర్త ఆత్మలైన మీరు వారికి శ్రేష్ఠమైన అవినాశీ ప్రాప్తుల యొక్క యథార్థమైన, వాస్తవికమైన, అవినాశీ ఆధారాన్ని అనుభూతి చేయించండి.

స్లోగన్:-
సమయము అమూల్యమైన ఖజానా - అందుకే దీనిని వృధా చేసేందుకు బదులుగా వెంటనే నిర్ణయము తీసుకుని సఫలము చేసుకోండి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

ఏ విధంగా సూర్యుని కిరణాలు వ్యాపిస్తాయో, అదే విధంగా మాస్టర్సర్వశక్తివాన్అనే స్థితిలో శక్తులు మరియు విశేషతల రూపీ కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవం చేయాలి, దీని కొరకు ‘‘నేను మాస్టర్సర్వశక్తివంతుడిని, విఘ్న-వినాశక ఆత్మను’’, అన్న ఈ స్వమానము యొక్క స్మృతి అనే సీటుపై స్థితియై కార్యము చేయండి, అప్పుడు విఘ్నాలు కనీసం ఎదురుగా కూడా రావు.