20-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'
18.01.2005
‘‘క్షణములో దేహభానము నుండి ముక్తులై జీవన్ముక్త
స్థితిని అనుభవము చెయ్యండి మరియు మాస్టర్ ముక్తి-జీవన్ముక్తి
దాతలుగా అవ్వండి’’
ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న లక్కీ మరియు లవ్లీ (అదృష్టవంతులైన
మరియు ప్రియమైన) పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ
స్నేహములో ఇమిడి ఉన్నారు. ఈ పరమాత్మ స్నేహము అలౌకిక స్నేహము. ఈ
స్నేహమే పిల్లలను బాబాకు చెందినవారిగా చేసింది. స్నేహమే సహజముగా
విజయులుగా చేసింది. ఈ రోజు అమృతవేళ నుండి నలువైపులా ఉన్న ప్రతి
బిడ్డ తమ స్నేహమనే మాలను బాబాకు ధరింపజేసారు ఎందుకంటే ఈ
పరమాత్మ స్నేహము ఎలా ఉన్నవారి నుండి ఎలా తయారుచేస్తుంది అనేది
ప్రతి బిడ్డకు తెలుసు. స్నేహము యొక్క అనుభూతి పరమాత్మ యొక్క
అనేక ఖజానాలకు యజమానులుగా తయారుచేసేటటువంటిది మరియు పరమాత్మ
యొక్క సర్వ ఖజానాలకు బంగారు తాళం చెవిని బాబా పిల్లలందరికీ
ఇచ్చారు. తెలుసు కదా! ఆ బంగారు తాళంచెవి ఏమిటి? ఆ బంగారు
తాళంచెవి ఏమిటంటే - ‘‘మేరా బాబా’’ (నా బాబా). నా బాబా అని
అన్నారు మరియు సర్వ ఖజానాలకు అధికారులుగా అయిపోయారు, సర్వ
ప్రాప్తుల అధికారముతో సంపన్నులుగా అయిపోయారు, సర్వ శక్తులతో
సమర్థులుగా అయిపోయారు, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలుగా
అయిపోయారు. ఇటువంటి సంపన్న ఆత్మల హృదయము నుండి ఏ పాట
వెలువడుతుంది? బ్రాహ్మణులైన మా ఖజానాలో అప్రాప్తి అనే వస్తువేదీ
లేదు.
నేటి ఈ రోజును స్మృతి దివసము అని అంటారు, ఈ రోజు
పిల్లలందరికీ విశేషముగా ఆదిదేవ్ అయిన బ్రహ్మాబాబా ఎక్కువగా
స్మృతిలోకి వస్తున్నారు. బ్రహ్మాబాబా బ్రాహ్మణ పిల్లలైన
మిమ్మల్ని చూసి హర్షిస్తున్నారు, ఎందుకు? ప్రతి బ్రాహ్మణ బిడ్డ
కోట్లలో ఏ ఒక్కరో అయిన భాగ్యశాలి బిడ్డ. మీ భాగ్యము గురించి
తెలుసు కదా! బాప్ దాదా ప్రతి బిడ్డ యొక్క మస్తకములో
మెరుస్తున్న భాగ్య సితారను చూసి హర్షిస్తున్నారు. నేటి ఈ స్మృతి
దివసమున విశేషముగా బాప్ దాదా విశ్వ సేవ యొక్క బాధ్యతా
కిరీటాన్ని పిల్లలకు అర్పించారు. కావున ఈ స్మృతి దివసము
పిల్లలైన మీకు రాజ్య తిలకాన్ని దిద్దిన దివసము. పిల్లలకు
విశేషముగా సాకార స్వరూపములో విల్ పవర్స్ ను విల్ (వీలునామా)
చేసిన రోజు. కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తాడు అన్న
నానుడిని సాకారము చేసిన రోజు. పిల్లలు నిమిత్తముగా అయి
చేస్తున్న నిస్వార్థ విశ్వ సేవను చూసి బాప్ దాదా
సంతోషిస్తున్నారు. బాప్ దాదా కరావన్ హార్ (చేయించేవారు) గా అయి
కరన్ హార్ (చేసేవారు) పిల్లల యొక్క ప్రతి అడుగును చూసి
సంతోషిస్తున్నారు ఎందుకంటే సేవలో సఫలతకు విశేష ఆధారమే - కరావన్
హార్ (చేయించే) బాబా కరన్ హార్ (చేసే) ఆత్మనైన నా ద్వారా
చేయిస్తున్నారు. ఆత్మనైన నేను నిమిత్తము ఎందుకంటే నిమిత్త భావము
ద్వారా నిర్మాన స్థితి స్వతహాగా ఏర్పడుతుంది. మైపన్ (నేను అనే
భావము) ఏదైతే దేహభానములోకి తీసుకువస్తుందో, అది స్వతహాగానే
నిర్మాన భావముతో సమాప్తమైపోతుంది. ఈ బ్రాహ్మణ జీవితములో
అన్నిటికంటే ఎక్కువగా విఘ్న రూపముగా అయ్యేది దేహభానము యొక్క
మైపన్ (నేను అనే భావము). చేయించేవారు చేయిస్తున్నారు, నేను
నిమిత్తముగా చేసేవానిగా అయి చేస్తున్నాను, అప్పుడు సహజముగానే
దేహాభిమానము నుండి విముక్తులవుతారు మరియు జీవన్ముక్తి యొక్క
ఆనందాన్ని అనుభవము చేస్తారు. భవిష్యత్తులో జీవన్ముక్తి అయితే
ప్రాప్తి అయ్యేదే ఉంది, కానీ ఇప్పుడు సంగమయుగములోని జీవన్ముక్తి
యొక్క అలౌకిక ఆనందము మరింత అలౌకికమైనది. ఏ విధంగా బ్రహ్మాబాబాను
చూసారు కదా - కర్మ చేస్తూ కూడా కర్మ యొక్క బంధనము నుండి
అతీతముగా ఉండేవారు. జీవితములో ఉంటూనే కమల పుష్ప సమానముగా
అతీతముగా మరియు ప్రియముగా ఉండేవారు. ఇంత పెద్ద పరివారము యొక్క
బాధ్యత, జీవితము యొక్క బాధ్యత, యోగీలుగా తయారుచేసే బాధ్యత,
ఫరిశ్తాల నుండి దేవతలుగా తయారుచేసే బాధ్యత, ఇవన్నీ ఉన్నా కూడా
వారు నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు. దీనినే జీవన్ముక్త స్థితి
అని అంటారు, అందుకే భక్తి మార్గములో కూడా బ్రహ్మా యొక్క ఆసనముగా
కమల పుష్పాన్ని చూపిస్తారు. వారిని కమల ఆసనధారిగా చూపిస్తారు.
కావున పిల్లలైన మీ అందరూ కూడా సంగమములోనే జీవన్ముక్తిని అనుభవము
చెయ్యాలి. బాప్ దాదా నుండి ముక్తి-జీవన్ముక్తుల వారసత్వము ఈ
సమయములోనే ప్రాప్తిస్తుంది. ఈ సమయములోనే మాస్టర్
ముక్తి-జీవన్ముక్తి దాతలుగా అవ్వాలి. తయారయ్యారు మరియు
తయారవ్వాలి. ముక్తి-జీవన్ముక్తి యొక్క మాస్టర్ దాతలుగా
అయ్యేందుకు విధి ఏమిటంటే - క్షణములో దేహభానము నుండి ముక్తులుగా
అవ్వాలి. ఈ అభ్యాసము ఇప్పుడు అవసరము. మనసుపై ఎటువంటి
కంట్రోలింగ్ పవర్ ఉండాలంటే, ఏ విధంగా ఈ స్థూల కర్మేంద్రియాలైన
చేతులతో, కాళ్ళతో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా
చేయగలరు, దానికి సమయము ఏమైనా పడుతుందా! చేతిని పైకి ఎత్తాలి అని
ఇప్పుడు ఆలోచించారనుకోండి, దానికి సమయము పడుతుందా? చెయ్యగలరు
కదా! ఇప్పుడు బాప్ దాదా చేతిని పైకి ఎత్తండి అని చెప్తే
ఎత్తుతారు కదా! ఇప్పుడు చెయ్యమని కాదు, మీరు చెయ్యగలరు. అలా
మనసుపై ఎంత కంట్రోల్ ఉండాలంటే, దానిని ఎక్కడ ఏకాగ్రము
చెయ్యాలనుకుంటే అక్కడ ఏకాగ్రమైపోవాలి. మనసు చేతులు కన్నా,
కాళ్ళ కన్నా సూక్ష్మమైనది కానీ ఎంతైనా అది మీదే కదా! నా మనసు
అని అంటారు కదా, నీ మనసు అని అనరు కదా! కావున ఏ విధంగా స్థూల
కర్మేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయో, అదే విధంగా
మనసు-బుద్ధి-సంస్కారాలు కంట్రోల్లో ఉండాలి, అప్పుడు నంబరు వన్
విజయులు అని అంటారు. సైన్స్ వారైతే రాకెట్ ద్వారా లేక తమ
సాధనాల ద్వారా ఈ లోకము వరకే చేరుకోగలరు, ఎక్కువలో ఎక్కువ అయితే
గ్రహాల వరకు చేరుకుంటారు. కానీ బ్రాహ్మణాత్మలైన మీరు మూడు
లోకాల వరకు చేరుకోగలరు. క్షణములో సూక్ష్మ లోకము, నిరాకారీ లోకము
మరియు స్థూలములో ఉన్న మధుబన్ వరకు అయితే చేరుకోగలరు కదా! ఒకవేళ
మనసుకు మధుబన్ కు చేరుకోవాలి అని ఆర్డర్ చేసినట్లయితే క్షణములో
చేరుకోగలరా? తనువుతో కాదు, మనసుతో. సూక్ష్మవతనానికి వెళ్ళాలి,
నిరాకారీ వతనానికి వెళ్ళాలి అని ఆర్డర్ చేయండి, అలా మూడు
లోకాలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనసును చేర్చగలరా? ఆ అభ్యాసము
ఉందా? ఇప్పుడు ఈ అభ్యాసము యొక్క అవసరము చాలా ఉంది. బాప్ దాదా
చూసారు, అభ్యాసమైతే చేస్తారు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు,
ఎంత సమయము కావాలంటే అంత సమయము ఏకాగ్రమవ్వాలి, అచలంగా అవ్వాలి,
అలజడిలోకి రాకూడదు, దీని పట్ల ఇంకా అటెన్షన్ పెట్టాలి. మనసును
జయించినవారు జగత్తును జయిస్తారు అని గాయనము ఉంది, కానీ
ప్రస్తుతం మనసు అప్పుడప్పుడు మోసము కూడా చేస్తూ ఉంటుంది.
బాప్ దాదా నేటి ఈ సమర్థ దివసమున ఈ సమర్థత పట్ల విశేషముగా
అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఓ స్వరాజ్యాధికారీ పిల్లలూ, ఇప్పుడు
ఈ విశేష అభ్యాసాన్ని నడుస్తూ-తిరుగుతూ చెక్ చేసుకోండి ఎందుకంటే
సమయమనుసారముగా ఇప్పుడు ‘అకస్మాత్తు’ యొక్క ఆటను చాలా చూస్తారు.
దీని కొరకు ఏకాగ్రతా శక్తి అవసరము. ఏకాగ్రతా శక్తి ద్వారా దృఢతా
శక్తి కూడా సహజముగా వచ్చేస్తుంది మరియు దృఢత సఫలతను స్వతహాగానే
ప్రాప్తింపజేయిస్తుంది. కావున విశేషముగా సమర్థ దివసమున
సమర్థులుగా అయ్యే ఈ అభ్యాసముపై విశేషముగా అటెన్షన్ పెట్టండి,
అందుకే భక్తి మార్గములో కూడా అంటారు - మనసుతో ఓడిపోయినవారు
ఓడిపోయినట్లు, మనసును గెలిచినవారు గెలిచినట్లు. మరి నా మనసు అని
అన్నప్పుడు, నాది అన్నదానికి యజమానిగా అయ్యి శక్తులు అనే
కళ్ళెంతో విజయాన్ని ప్రాప్తి చేసుకోండి. ఈ కొత్త సంవత్సరములో ఈ
హోంవర్క్ పై విశేష అటెన్షన్ పెట్టండి! యోగీగా అయితే ఉన్నారు
కానీ ఇప్పుడు ప్రయోగిగా అవ్వండి అని దీనినే అంటారు.
ఇకపోతే ఈ రోజు చేసే స్నేహముతో కూడిన ఆత్మిక సంభాషణ,
స్నేహములో చేసే ఫిర్యాదులు మరియు సమానముగా అవ్వాలనే
ఉల్లాస-ఉత్సాహాలు, ఈ మూడు రకాల ఆత్మిక సంభాషణలు బాప్ దాదా
వద్దకు చేరుకున్నాయి. నలువైపులా ఉన్న పిల్లల యొక్క స్నేహ
భరితమైన స్మృతులు, స్నేహ భరితమైన ప్రేమ బాప్ దాదా వద్దకు
చేరుకున్నాయి. ఉత్తరాలు కూడా చేరుకున్నాయి, ఆత్మిక సంభాషణ కూడా
చేరుకుంది, సందేశాలు కూడా చేరుకున్నాయి, బాప్ దాదా పిల్లల
యొక్క స్నేహాన్ని స్వీకరించారు. రిటర్నులో హృదయపూర్వకమైన
ప్రియస్మృతులను కూడా ఇచ్చారు. హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను కూడా
ఇచ్చారు. ఒక్కొక్కరి పేరునైతే తీసుకోలేరు కదా. చాలామంది ఉన్నారు.
కానీ మూలమూలల్లో, పల్లె-పల్లెలో, అన్ని పట్టణాలలో అన్ని వైపులా
ఉన్న పిల్లల యొక్క, బంధనములో ఉన్నవారి యొక్క, విలపిస్తున్నవారి
యొక్క, అందరి ప్రియస్మృతులు చేరుకున్నాయి. ఇప్పుడు బాప్ దాదా
ఇదే చెప్తున్నారు - స్నేహానికి రిటర్నులో ఇప్పుడు మిమ్మల్ని
మీరు టర్న్ చేసుకోండి, పరివర్తన చేసుకోండి. ఇప్పుడు స్టేజ్ పై
మీ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షము చెయ్యండి. మీ సంపన్నత ద్వారా
దుఃఖము మరియు అశాంతి సమాప్తమవ్వనున్నాయి. ఇప్పుడు ఇక మీ
సోదరీ-సోదరులను ఎక్కువ దుఃఖాన్ని చూడనివ్వకండి. ఈ దుఃఖము,
అశాంతి నుండి ముక్తిని ఇప్పించండి. చాలా భయభీతులుగా ఉన్నారు.
ఏం చెయ్యాలి, ఏం జరుగుతుందో..., అన్న ఈ అంధకారములో భ్రమిస్తూ
ఉన్నారు. ఇప్పుడు ఆత్మలకు ప్రకాశముతో కూడిన మార్గాన్ని
చూపించండి. ఉల్లాసము కలుగుతుందా? దయ కలుగుతుందా? ఇప్పుడు
అనంతమును చూడండి. అనంతముపై దృష్టి పెట్టండి. అచ్ఛా. హోంవర్క్
అయితే గుర్తుంటుంది కదా! మర్చిపోవద్దు. ప్రైజ్ ఇస్తాము. ఎవరైతే
ఒక్క నెలలో మనసును పూర్తిగా కంట్రోలింగ్ పవర్ ద్వారా పూర్తి
నెల అంతా ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు
ఏకాగ్రము చెయ్యగలరో, ఈ చార్టు యొక్క రిజల్టును చూసి బహుమతిని
ఇస్తాము. సరేనా? ఎవరు బహుమతి తీసుకుంటారు? పాండవులు, ముందు
పాండవులు. పాండవులకు అభినందనలు. మరి శక్తులు? ఏ వన్. పాండవులు
నంబరు వన్ అయితే శక్తులు ఏ వన్. శక్తులు ఏ వన్ గా అవ్వకపోతే
పాండవులు ఏ వన్ అవుతారు. ఇప్పుడు కొద్దిగా వేగాన్ని తీవ్రము
చెయ్యండి. విశ్రాంతితో కూడిన వేగము కాదు. తీవ్రగతి ద్వారానే
ఆత్మల యొక్క దుఃఖము, బాధ సమాప్తమవుతాయి. దయ అనే ఛత్రఛాయను
ఆత్మలపై పరచండి. అచ్ఛా!
డబుల్ విదేశీ సోదరీ-సోదరులతో :-
డబుల్ విదేశీయులు, బాప్ దాదా అంటారు - డబుల్ విదేశీయులు అనగా
డబుల్ పురుషార్థములో ముందుకు వెళ్ళేవారు. డబుల్ విదేశీయులు
అన్న టైటిల్ ఉంది కదా, అది మీ గుర్తు కదా. అలాగే డబుల్
విదేశీయులు నంబరువన్ తీసుకోవడములో కూడా డబుల్ వేగముతో ముందుకు
వెళ్ళేవారు. మంచిది, ప్రతి గ్రూపులో బాప్ దాదా డబుల్
విదేశీయులను చూసి సంతోషిస్తారు ఎందుకంటే భారతవాసులు
మిమ్మల్నందరినీ చూసి సంతోషిస్తారు. బాప్ దాదా కూడా
విశ్వకళ్యాణకారులు అన్న టైటిల్ ను చూసి సంతోషిస్తారు. ఇప్పుడు
డబుల్ విదేశీయులు ఏ ప్లాన్ ను తయారు చేస్తున్నారు? ఆఫ్రికా వారు
తీవ్ర పురుషార్థము చేస్తున్నందుకు బాప్ దాదాకు సంతోషము కలిగింది.
కావున మీరందరూ కూడా మీ చుట్టుప్రక్కల మీ సోదరీ-సోదరులు ఎవరైతే
మిగిలిపోయి ఉన్నారో, వారికి సందేశాన్ని ఇవ్వాలి అన్న
ఉల్లాస-ఉత్సాహాలను ఉంచుకోండి. ఫిర్యాదులు ఉండకూడదు. వృద్ధి
జరుగుతూ ఉంది మరియు జరుగుతూనే ఉంటుంది కూడా, కానీ ఇప్పుడు
ఫిర్యాదులను సమాప్తము చెయ్యాలి. డబుల్ విదేశీయుల గురించి ఒక
విశేషతను వినిపిస్తూ ఉంటారు, అదేమిటంటే - భోళా బాబాను
సంతోషపెట్టేందుకు సాధనమేమిటంటే - సత్యమైన హృదయముపై స్వామి
సంతోషిస్తారు, ఇది డబుల్ విదేశీయుల విశేషత. బాబాను చాలా
తెలివిగా సంతోషపెట్టడము వారికి వస్తుంది. సత్యమైన హృదయము బాబాకు
ఎందుకు ప్రియమనిపిస్తుంది? ఎందుకంటే బాబాను సత్యము అనే అంటారు.
గాడ్ ఈజ్ ట్రూత్ (భగవంతుడు సత్యము) అని అంటారు కదా! కావున బాప్
దాదాకు స్వచ్ఛమైన హృదయము, సత్యమైన హృదయము కలవారంటే చాలా ప్రియము.
అలాగే ఉన్నారు కదా! స్వచ్ఛమైన హృదయము ఉంది, సత్యమైన హృదయము ఉంది.
సత్యతయే బ్రాహ్మణ జీవితపు మహానత. అందుకే డబుల్ విదేశీయులను బాప్
దాదా సదా గుర్తు చేస్తారు. భిన్న-భిన్న దేశాలలో ఆత్మలకు
సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్తులుగా అయ్యారు. చూడండి, ఎన్ని
దేశాలవారు వస్తారు? అంటే ఈ అన్ని దేశాల యొక్క కళ్యాణమైతే
జరిగింది కదా! ఇక్కడికైతే నిమిత్తులైన మీరు వచ్చారు కానీ
నలువైపులా ఉన్న డబుల్ విదేశీ పిల్లలకు, నిమిత్తము అయిన పిల్లలకు
బాప్ దాదా శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు, అభినందనలు
తెలియజేస్తున్నారు, ఎగురుతూ ఉండండి మరియు ఎగిరేలా చేస్తూ ఉండండి.
ఎగిరే కళతో సర్వులకు మేలు జరిగేదే ఉంది. అందరూ రిఫ్రెష్
అవుతున్నారా? రిఫ్రెష్ అయ్యారా? సదా అమరముగా ఉంటుందా లేక మధుబన్
లోనే సగం వదిలేసి వెళ్తారా? అది తోడుగా ఉంటుందా, సదా ఉంటుందా?
అమర భవ అన్న వరదానము ఉంది కదా! కనుక ఎవరైతే పరివర్తన
చేసుకున్నారో వారు సదా ముందుకు వెళ్తూ ఉంటారు. అమరులుగా ఉంటారు.
అచ్ఛా. బాప్ దాదా సంతోషముగా ఉన్నారు మరియు మీరు కూడా సంతోషముగా
ఉన్నారు, ఇతరులకు కూడా సంతోషాన్ని ఇవ్వండి. అచ్ఛా.
జ్ఞాన సరోవర్ నిర్మించి 10 సంవత్సరాలు అయ్యింది:-
అచ్ఛా! మంచిది, జ్ఞాన సరోవర్ ఒక విశేషతను ప్రారంభించింది,
ఎప్పటి నుండైతే జ్ఞాన సరోవర్ ప్రారంభమైందో, అప్పటి నుండి
వి.ఐ.పి.లు, ఐ.పి.లకు విశేషముగా, విధిపూర్వకముగా ప్రోగ్రాములు
ప్రారంభమయ్యాయి. ప్రతి వర్గానికి సంబంధించిన ప్రోగ్రాములు
ఒకదాని తర్వాత మరొకటి జరుగుతూనే ఉంటాయి. అంతేకాక జ్ఞాన సరోవర్
కు వచ్చే ఆత్మల యొక్క స్థూల సేవను మరియు అలౌకిక సేవను చాలా మంచి
ఇష్టముతో చేస్తారు అన్నది గమనించటం జరిగింది, అందుకే జ్ఞాన
సరోవర్ వారిని బాప్ దాదా విశేషముగా అభినందిస్తున్నారు, ఏమనంటే
- సేవా ఫలితముగా అందరూ చాలా సంతోషపడి వెళ్తారు మరియు చాలా-చాలా
సంతోషముగా తమ సహచరులను మళ్ళీ తమతో పాటు తీసుకుని వస్తారు.
నలువైపులా శబ్దము వ్యాపింపజేసేందుకు జ్ఞాన సరోవర్ నిమిత్తమైంది.
కనుక అభినందనలు మరియు సదా అభినందనలను తీసుకుంటూ ఉండండి. అచ్ఛా!
ఇప్పుడు ఒక్క క్షణములో మనసును ఏకాగ్రము చెయ్యగలరా? అందరూ ఒక్క
క్షణములో బిందు రూపములో స్థితులవ్వండి. (బాప్ దాదా డ్రిల్
చేయించారు) అచ్ఛా - ఇటువంటి అభ్యాసమును నడుస్తూ-తిరుగుతూ చేస్తూ
ఉండండి.
నలువైపులా ఉన్న స్నేహీ, లవలీన ఆత్మలకు, సదా దయార్ద్ర హృదయులుగా
అయ్యి ప్రతి ఆత్మను దుఃఖము, అశాంతి నుండి విముక్తులుగా చేసే
శ్రేష్ఠ ఆత్మలకు, సదా తమ మనసు-బుద్ధి-సంస్కారాలను కంట్రోలింగ్
పవర్ ద్వారా కంట్రోల్లో పెట్టుకునే మహావీర్ ఆత్మలకు, సదా
సంగమయుగము యొక్క జీవన్ముక్త స్థితిని అనుభవము చేసే బాబా
సమానమైన ఆత్మలకు బాప్ దాదాల పదమాల రెట్ల ప్రియస్మృతులు మరియు
నమస్తే.
వరదానము:-
అందరికీ ఆశ్రయాన్ని ఇచ్చే దయార్ద్ర
హృదయుడైన తండ్రికి పిల్లలైన దయార్ద్ర హృదయ భవ
దయార్ద్ర హృదయుడైన తండ్రి యొక్క
దయార్ద్ర హృదయులైన పిల్లలు ఎవరినైనా బికారీ రూపములో
చూసినట్లయితే వారికి దయ కలుగుతుంది - ఈ ఆత్మకు కూడా ఆశ్రయము
లభించాలి, వీరి కళ్యాణము కూడా జరగాలి అని. వారి సంపర్కములోకి
ఎవరు వచ్చినా, వారికి తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇస్తారు. ఏ
విధంగా ఎవరైనా ఇంటికి వస్తే, ముందుగా వారికి మంచినీరు
అందిస్తారు, వారు అలాగే వెళ్ళిపోతే మంచిగా అనుకోరు, అదే విధంగా
ఎవరు సంపర్కములోకి వచ్చినా, వారికి తండ్రి పరిచయము అనే నీటిని
తప్పకుండా అందించండి అనగా దాత పిల్లలు దాతలుగా అయ్యి ఏదో ఒకటి
ఇవ్వండి, తద్వారా వారికి కూడా ఆశ్రయము లభిస్తుంది.
స్లోగన్:-
యథార్థ వైరాగ్య వృత్తికి సహజ అర్థము ఏమిటంటే - ఎంత అతీతమో అంత
ప్రియము.
అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా
అవ్వండి’’
నేను మరియు నా బాబా - ఈ స్మృతితో కంబైండుగా ఉన్నట్లయితే
మాయాజీతులుగా అయిపోతారు. చేసేవారు, చేయించేవారు - ఈ మాటలో బాబా
మరియు పిల్లలు, ఇరువురూ కంబైండుగా ఉన్నారు. చేతులు పిల్లలవి
మరియు పని బాబాది. చేతిని అందించే బంగారు అవకాశము పిల్లలకే
లభిస్తుంది. కానీ చేయించేవారు చేయిస్తున్నారు అని అనుభవమవుతుంది.
వారు నిమిత్తము చేసి నడిపిస్తున్నారు - ఈ శబ్దమే సదా మనసు నుండి
వెలువడుతుంది.
|
|
|