20-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ వద్ద అవినాశీ జ్ఞాన రత్నాల అపారమైన ఖజానా ఉంది, మీరు వాటిని దానము చేయండి, మీ ద్వారము నుండి ఎవరూ తిరిగి వెళ్ళకూడదు’’

ప్రశ్న:-
సర్వ సంబంధాల సాక్కిరిన్ అయిన తండ్రి తన పిల్లలకు ఏ శ్రీమతాన్ని ఇస్తారు?

జవాబు:-
మధురమైన పిల్లలూ - మీ బుద్ధియోగాన్ని అన్ని వైపుల నుండి తొలగించి నన్నొక్కరినే స్మృతి చేస్తూ ఉండండి. ప్రపంచానికి సంబంధించిన వస్తువులు, మిత్ర-సంబంధీకులు మొదలైనవేవీ గుర్తుకు రాకూడదు ఎందుకంటే ఈ సమయములో అందరూ దుఃఖాన్ని ఇచ్చేవారు. విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే తప్పకుండా 63 జన్మల లెక్కాచారాలను సమాప్తము చేసుకునే శ్రమ చేయవలసి ఉంటుంది. అన్నీ మరచి అశరీరులుగా అవ్వండి, అప్పుడు లెక్కాచారాలు సమాప్తమవుతాయి. నేను సర్వ సంబంధాల సాక్కిరిన్ ను.

ఓంశాంతి
మీరు ఎవరి స్మృతిలో కూర్చున్నారు అని బాప్ దాదా పిల్లలను అడుగుతున్నారు. (శివబాబా స్మృతిలో). శివబాబా స్మృతిలో కూర్చున్నామని గట్టిగా చెప్పాలి. పిల్లలైన మీ కనెక్షన్ అనగా ఆత్మల కనెక్షన్ శివబాబాతో ఉంది. మీరు వీరి (బ్రహ్మా) ద్వారా శివబాబాకు చెందినవారిగా అవుతారు ఎందుకంటే శివబాబా వీరి ద్వారానే కలుస్తారు. వీరిని మధ్యవర్తి అని కూడా అంటారు. మీకు మధ్యవర్తితో ఎటువంటి కనెక్షన్ లేదు. మీరు వీరి ద్వారా వారిని కలుస్తారు. అందరి ఇచ్చి పుచ్చుకునే లెక్కలు తండ్రితో ఉండాలి, వీరితో కాదు. వీరి ఇచ్చి పుచ్చుకోవడాలు కూడా తండ్రితోనే ఉంటుంది. వీరు కూడా ఆ తండ్రితో - బాబా, నాదంతా మీదే అని అంటారు. మీకు కూడా - ఒకటేమో, మేము ఆత్మలము అన్న నిశ్చయము ఉంది మరియు రెండవది - ఇప్పుడు ఆత్మలమైన మేము పరమపిత పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అన్న నిశ్చయము కూడా ఉంది. మనసా-వాచా-కర్మణా, తనువు-మనసు-ధనములతో మనము శివబాబాకు సహాయకులుగా అవుతాము. ఇవన్నీ శివబాబాకు అర్పణ చేయడము జరిగింది. అప్పుడు శివబాబా, ఇది ఇలా-ఇలా చేయండి అని డైరెక్షన్లు ఇస్తారు. దీనినే శ్రీమతము అని అంటారు. తండ్రి స్వయంగా అంటున్నారు - నేను ఈ పాత తనువులో ప్రవేశిస్తాను. వీరు కూడా పతితము నుండి పావనముగా అవుతున్నారు. ఇలా ఎవరన్నారు? శివబాబా. వీరు (బ్రహ్మా) కూడా పావనముగా అవుతున్నారు. వీరికి కూడా నాతోనే లెక్క ఉంది. వీరితో ఎవరికీ ఏ లెక్క లేదు. శివబాబా, కేర్ ఆఫ్ బ్రహ్మా అని మీరు ఉత్తరము వ్రాస్తారు. కానీ మాయ ఎటువంటిదంటే, అది నిరంతరం స్మృతి చేయనివ్వదు. బుద్ధి యోగాన్ని పదే-పదే తెంచి వేస్తుంది. ఒకవేళ ఈ పురుషార్థాన్ని పక్కాగా చేసినట్లయితే, ఇక మిగిలినదంతా మర్చిపోతారు. శరీరాన్ని కూడా మర్చిపోతారు. శరీరమనేది ఉండటము ఉంటుంది కానీ ఆత్మకు వీటన్నింటి పట్ల అయిష్టము కలుగుతుంది. ఇటువంటి అవస్థను తయారుచేసుకునే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అంతిమములో మనకు మన శరీరము కూడా గుర్తుకు రాకూడదు. తండ్రి అంటారు, స్వయాన్ని అశరీరిగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. నేను సదా అశరీరిని, మీరు కూడా అశరీరిగా ఉండేవారు, తర్వాత మీరు పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ మీరు పాత్రను అభినయించాలి, ఇదే శ్రమతో కూడినది. విశ్వానికి యజమానులుగా అవ్వడమనేది ఏమైనా చిన్న విషయమా. మనుష్యులే విశ్వానికి యజమానులుగా అవ్వగలరు. ఈ దేవతలు కూడా మనుష్యులే కానీ వారిని దైవీ గుణాలు కలిగిన దేవతలని అంటారు. లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, వారికి తమ పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు వారిని తల్లిదండ్రులుగా భావిస్తారు. కానీ ఈ రోజుల్లో మనుష్యులు అంధవిశ్వాసము కారణముగా, ఈ లక్ష్మీ-నారాయణులను - త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ... అని అంటారు. వాస్తవానికి ఈ మహిమ శివబాబాది. మీరు సర్వగుణ సంపన్నులు... అని దేవతల మహిమను పాడుతారు కానీ వారిని ఎందుకు పూజిస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు - నీవే తల్లివి-తండ్రివి... అని ఇటువంటి మహిమను పాడరు. అయితే ఆ శివబాబా నిరాకార పరమపిత పరమాత్మ అని మీకు తెలుసు. వారి నుండే అపారమైన సుఖము లభిస్తుంది. మిగిలిన సంబంధీకులు మొదలైనవారి నుండి దుఃఖమే లభిస్తుంది. బాబా సాక్కిరిన్ వంటివారు, వారి ద్వారా సర్వ సంబంధాల మాధుర్యము అనుభవమవుతుంది. అందుకే తండ్రి అంటారు, మామయ్య, పెదనాన్న, చిన్నాన్న మొదలైనవారందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించి నన్నొక్కరినే స్మృతి చేయండి. దుఃఖహర్త-సుఖకర్త... అని మీరు పాడుతారు కూడా. సర్వుల సద్గతిదాత ఒక్కరే, వారే మనకు సర్వస్వము. లౌకిక తండ్రి నుండి కూడా దుఃఖము లభిస్తుంది. ఇకపోతే టీచరు అయితే ఎవరికీ దుఃఖము ఇవ్వరు. టీచరు వద్దకు వెళ్ళి చదువుకోవడముతో, మీరు శరీర నిర్వహణార్థం సంపాదిస్తారు. నైపుణ్యము నేర్పించేవారు కూడా ఉంటారు. వారంతా అల్పకాలం కోసం మాత్రమే నేర్పిస్తారు. భక్తిలో కూడా ఒక్క రామునికి లేక పరమపిత పరమాత్మకు మాత్రమే మహిమ చేస్తారు, వారినే స్మృతి చేస్తారు. వాస్తవానికి భక్తి కూడా ఒక్కరికే చేయాలి. వారొక్కరే మిమ్మల్ని పూజ్యులుగా చేస్తారు. మీరు మొట్టమొదట ఒక్క శివబాబానే పూజిస్తారు. దానిని సతోప్రధాన భక్తి అని అంటారు. తర్వాత ఆత్మ కూడా సతోప్రధానము నుండి సతో, రజో, తమోగా అవుతుంది. మనము పూజారులుగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు. మీరు ముందు ఒక్క శివునికే పూజ చేస్తారు, ఆ తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. భక్తి కూడా సతోప్రధానము నుండి సతో, రజో, తమోగా అయిపోతుంది. డ్రామా అంతా మీపైనే తయారుచేయబడింది. మీరే పూజ్యులు, మీరే పూజారులు. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో, ఈ కథ వారిదే. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారు అనేది తండ్రి కూర్చుని మీకే తెలియజేస్తారు, ఈ లెక్క అంతా మీదే. ఎవరైతే మొట్టమొదట పూజ్య దేవీ-దేవతలుగా అవుతారో, వారే పూజారులుగా అవుతారు.

తండ్రి అంటారు - నేను కల్ప-కల్పము వచ్చి మిమ్మల్ని చదివిస్తాను మరియు దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను, రాజయోగాన్ని నేర్పిస్తాను. భగవంతుడైతే ఒక్కరే ఉంటారు, వాళ్ళు రాయి-రప్పల్లో, కణ కణములో పరమాత్మ ఉన్నారని అంటారు. కానీ అలా ఉండరు. భగవంతుని మహిమ అపారమైనది. ఓ బాబా, మీరు ఇచ్చే గతి, మీరు చూపే మార్గము అతీతమైనవి అని అంటారు అనగా మీరు ఏ శ్రీమతము అయితే ఇస్తున్నారో, అది అన్నింటికన్నా అతీతమైనది. తండ్రినే గతి, సద్గతిదాత, పరమపిత పరమాత్మ అని అంటారు, అప్పుడు బుద్ధి పైకి వెళ్తుంది. దుఃఖము సమయములో వారే గుర్తుకు వస్తారు. ఒకవేళ సీతా-రాములు బుద్ధిలో ఉంటే, ఇక రామాయణము అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరైతే ఆ ఒక్క తండ్రినే పిలుస్తారు. ఒక్క తండ్రితో తప్ప ఏ సాకారీ మనిషితో గాని, ఆకారీ దేవతతో గాని బుద్ధిని జోడించకూడదు. పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. ఏ సత్సంగానికి వెళ్ళినా సరే, పతిత-పావన సీతా-రామ అని పాడుతారు కానీ అర్థమేమీ తెలియదు. ఇదంతా భక్తి మార్గపు గాయనము. అందరూ రావణుడి జైలులో ఉన్నారు. భక్తి మార్గములో చాలా భ్రమిస్తారు. ఇక్కడ భ్రమించే విషయమేమీ లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలు పాయింట్లను బుద్ధిలో మంచి రీతిలో ధారణ చేయాలి, చదువును రెగ్యులర్ గా చదువుకోవాలి. ఒకవేళ ఏ కారణముగానైనా ఉదయము రాలేకపోతే మధ్యాహ్నము రావాలి. అలాగని ఎవరినీ విసిగించకూడదు. రోజంతా ఉంది కదా, ఏదో ఒక సమయములో వెళ్ళి చదువుకోవాలి. ఈ కుమార్తెలు (అక్కయ్యలు) ఉదయము నుండి మొదలుకుని సాయంత్రము వరకు సేవలో ఉంటారు. రోజంతా సర్వీస్ స్టేషన్లు తెరిచి ఉంటాయి. ఎవరైనా వస్తే, వారికి మార్గాన్ని తెలియజేయాలి. మొట్టమొదట ఏం తెలియజేయాలి అంటే - మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఈ విషయము గురించి ఆలోచించండి. దుఃఖములో పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కదా. ఇప్పుడు శివబాబా చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. మృత్యువు అయితే ఎదురుగా నిలబడి ఉంది. ఇది అదే మహాభారత యుద్ధము. పెద్ద పదమపతులు, కోటీశ్వరులు, పెద్ద-పెద్ద భవనాలు మొదలైనవి నిర్మిస్తారు కానీ అవి మిగలవు, అవన్నీ కూలిపోనున్నాయి. వారు కలియుగము ఆయువు లక్షల సంవత్సరాలని భావిస్తారు. దీనినే ఘోర అంధకారమని అంటారు. ఎవరి వద్దనైనా ధనముంటే, ఇల్లు కట్టుకోవచ్చా అని అడుగుతారు. బాబా అంటారు, ధనముంటే, కట్టుకుంటే కట్టుకోండి. ధనము కూడా మట్టిలో కలిసిపోనున్నది. అవన్నీ తాత్కాలికమే. ఎలాగూ ఈ ధనమంతా కూడా సమాప్తమైపోతుంది, ఏమీ మిగలదు, కావున కట్టుకుంటే కట్టుకోండి. అయితే, ఆ ఇంటిలో గీతా పాఠశాలను ఏర్పాటు చేయండి. మీ ద్వారము వద్దకు ఎవరు వచ్చినా సరే, వారికి ఎటువంటి భిక్ష ఇవ్వండి అంటే, దానితో వారిని ఒక్కసారిగా విశ్వానికి యజమానులుగా తయారుచేయండి. మీ వద్ద అపారమైన జ్ఞాన ధనముంది, ఇంత జ్ఞానము ఎవరి వద్దా లేదు. మీలో ఎవరికైతే అనేక జ్ఞాన రత్నాలు బుద్ధిలో నిండి ఉన్నాయో, వారే అందరికన్నా షావుకారులు. ఎవరు వచ్చినా సరే, మీరు వారి జోలిని నింపండి. మీ వద్ద అంతటి ఖజానా ఉంది. కేవలం ఈ బోర్డు పెట్టండి - రండి, మేము మీకు సదా సుఖమయముగా ఉండే స్వర్గ వారసత్వాన్ని పొందే మార్గాన్ని తెలియజేస్తాము. కానీ పిల్లల్లో ఆ నషా ఉండటము లేదు. ఇక్కడ నషా ఎక్కుతుంది, బయటకు వెళ్ళడముతో మర్చిపోతారు. అభిరుచి ఉండాలి. ఎవరు వచ్చినా సరే, వారి నావను తీరానికి చేర్చే మార్గాన్ని తెలియజేయాలి. మీ వద్ద చాలా గొప్ప ధనముంది. మీ వద్దకు ఏ బికారి వచ్చినా లేక లక్షాధికారి వచ్చినా, మీరు వారికి కూడా అనేక రత్నాలను ఇవ్వవచ్చు. ఇక్కడ బాబా నషా ఎక్కిస్తారు, మళ్ళీ సోడా వాటర్ వలె అయిపోతారు. బాబా మీ జోలిని అవినాశీ జ్ఞాన రత్నాలతో నింపుతారు. కానీ నంబరువారుగా ఉన్నారు. ఎవరి భాగ్యములో ఉంటే, వారు పూర్తిగా ధారణ చేస్తారు. బాబా అంటారు - ప్రయత్నము చేసి మీరు నిరంతర స్మృతిలో ఉండండి. సెంటరుకు వెళ్ళి ఒక చోట కూర్చోవాలని కాదు. నడుస్తూ-తిరుగుతూ సమయము లభించినప్పుడల్లా తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. చేతులు పని వైపు, హృదయము అనగా బుద్ధి యోగము తండ్రితో పాటు ఉండాలి. తండ్రి స్మృతితో మీకు చాలా కళ్యాణము జరుగుతుంది. 21 జన్మలకు మీరు షావుకారులుగా అవుతారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. భారత్ స్వర్గముగా ఉండేది. ఇప్పుడు నరకముగా ఉంది.

తండ్రి అంటారు - ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ సతోప్రధానముగా అయిపోతుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే నషా ఎక్కుతుంది. మన అంతటి ధనవంతులు సృష్టిలో ఎవరూ లేరు. తండ్రియే గుర్తు ఉండకపోతే ఇక ధనము ఎక్కడ నుండి వస్తుంది. స్వర్గములోనైతే పిల్లలైన మీకు అపారమైన సుఖము లభిస్తుంది. శాస్త్రాలలోనైతే ఎన్ని కల్పితమైన కథలను వ్రాసేసారు. రాముని రాజ్యములో ప్రజలు కూడా షావుకారులే మరియు ఆ నగరములో అందరూ దాతలు కావున ధర్మానికి సదా ఉపకారము జరుగుతుంది అని పాడుతారు కూడా. మరో వైపు రాముని సీత అపహరించబడినారు అని, వానర సైన్యాన్ని తీసుకున్నారు అని... చెప్తారు. ఇంతకుముందు మీరు కూడా ఇవన్నీ చదివేవారు, కానీ ఏమీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఎంత బాగా అర్థమవుతున్నాయి. ఎంత విచిత్రమైన విషయాలను వ్రాశారు. తండ్రి అంటారు - నేను ప్రకృతిని ఆధారముగా తీసుకోవాల్సి ఉంటుంది. త్రిమూర్తి చిత్రములో కూడా బ్రహ్మా, విష్ణు, శంకరులను చూపిస్తారు. కానీ విష్ణువు ఎవరు, ఎక్కడ ఉంటారు అనేది కూడా అర్థం చేసుకోరు. విష్ణు మందిరాన్ని నర-నారాయణుని మందిరమని అంటారు. కానీ అర్థమేమీ తెలుసుకోరు. విష్ణువు యొక్క రెండు రూపాలు ఈ లక్ష్మీ-నారాయణులు, వారు సత్యయుగములో రాజ్యము చేసేవారు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఎవరు వచ్చినా సరే, మనము బ్రహ్మాకుమార-కుమారీలము కనుక ప్రజాపిత బ్రహ్మా అందరికీ తండ్రి అవుతారని చెప్పండి. వారికి అనేకమంది ప్రజలు ఉన్నారు. వారి పేరునైతే విన్నారు కదా. భగవంతుడు బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచించారు. తండ్రి తప్పకుండా పిల్లలకు వారసత్వాన్ని అయితే ఇచ్చి ఉంటారు కదా. పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. మీరు శివబాబా నుండి వారసత్వాన్ని పొందుతారు. ఒకరేమో లౌకిక తండ్రి, రెండవవారు పారలౌకిక తండ్రి. ఇప్పుడు మీకు ఈ అలౌకిక తండ్రి లభించారు, ఇతను వజ్రాల వ్యాపారిగా ఉండేవారు. ఇంతకుముందు ఇతనికి కూడా ఏమీ తెలియదు. అందుకే, ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమములో, ఇతనిలో ప్రవేశిస్తానని అంటారు. వానప్రస్థులుగా అయ్యే ఆచారము కూడా భారత్ లో ఉంది. 60 సంవత్సరాల తర్వాత గురువు వద్దకు వెళ్ళిపోతారు. తండ్రి వీరిలో ప్రవేశించి, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నారు. ముక్తిని అందరూ కోరుకుంటారు కానీ ముక్తి గురించి ఎవరికీ తెలియదు. బ్రహ్మతత్వములోనైతే ఎవరూ లీనమవ్వలేరు. ఈ సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది, అందరూ పాత్రను అభినయించాల్సిందే. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయని అంటారు. ఈ అనాది డ్రామా తయారుచేయబడి ఉంది. 84 జన్మల పాత్రను మీరు అభినయించాల్సిందే. ఇక్కడ జ్ఞాన డ్యాన్స్ జరుగుతుంది. వారేమో ఢమరుకాన్ని చూపిస్తారు. ఇప్పుడు సూక్ష్మవతనవాసి అయిన శంకరుడు ఢమరుకాన్ని ఎలా మోగిస్తారు.

తండ్రి అర్థం చేయించారు - మీరు కోతుల వలె ఉండేవారు. వానర సైన్యమైన మిమ్మల్ని తీసుకున్నారు. మీ ఎదురుగా బాబా జ్ఞానమనే ఢమరుకాన్ని మోగిస్తున్నారు. మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీ ముఖాన్ని మరియు గుణాన్ని, రెండింటినీ పరివర్తన చేస్తున్నారు. కామ చితిపై కూర్చుని మీరు నల్లగా అయిపోయారు. బాబా మిమ్మల్ని మళ్ళీ జ్ఞాన చితిపై కూర్చోబెట్టి ముఖాన్ని మరియు గుణాన్ని, రెండింటినీ పరివర్తన చేసి, నల్లగా ఉన్నవారి నుండి తెల్లగా చేస్తున్నారు. ఇక్కడ బాబా ఎంతటి నషాను ఎక్కిస్తారు, మరి ఆ నషా ఎందుకు మాయమైపోవాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఏదైతే అపారమైన జ్ఞాన ధనాన్ని ఇచ్చారో, దానిని ధారణ చేసి స్వయము కూడా షావుకార్లుగా అవ్వాలి మరియు అందరికీ దానము కూడా చేయాలి. ఎవరు వచ్చినా, వారి జోలెను నింపాలి.

2. తండ్రి స్మృతితోనే కళ్యాణము జరగనున్నది, అందుకే ఎంత వీలైతే అంత నడుస్తూ-తిరుగుతూ తండ్రి స్మృతిలో ఉండాలి. సర్వ సంబంధాల మాధుర్యాన్ని ఒక్క తండ్రి నుండి అనుభవం చేయాలి.

వరదానము:-
సదా బిజీగా ఉండే విధి ద్వారా వ్యర్థ సంకల్పాల ఫిర్యాదును సమాప్తము చేసే సంపూర్ణ కర్మాతీత భవ

సంపూర్ణ కర్మాతీతముగా అవ్వడములో వ్యర్థ సంకల్పాల తుఫానులే విఘ్నాలు కలిగిస్తాయి. ఈ వ్యర్థ సంకల్పాల ఫిర్యాదును సమాప్తము చేసేందుకు మీ మనసును నిరంతరం బిజీగా పెట్టుకోండి, సమయాన్ని బుకింగ్ చేసుకునే విధానాన్ని నేర్చుకోండి. మొత్తం రోజంతటిలో మనసును ఎక్కడెక్కడ బిజీ పెట్టుకోవాలి అన్న ప్రోగ్రామ్ ను తయారుచేసుకోండి. ప్రతిరోజు మీ మనసును 4 విషయాలలో బిజీ పెట్టుకోండి: 1. మిలనము (ఆత్మిక సంభాషణ) 2. వర్ణన (సేవ) 3. మగ్నము 4. లగనము (తపనతో కూడిన ప్రేమ). దీనితో సమయము సఫలమవుతుంది మరియు వ్యర్థము యొక్క ఫిర్యాదు సమాప్తమైపోతుంది.

స్లోగన్:-
సఫలతను పరమాత్మ ఇచ్చిన జన్మ సిద్ధ అధికారముగా భావించేవారే సదా ప్రసన్నచిత్తులుగా ఉండగలరు.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

సరళతను తీసుకువచ్చేందుకు కేవలం ఒక్క విషయము పట్ల తప్పకుండా శ్రద్ధ వహించాలి. మీ స్థితి ప్రశంస ఆధారముగా ఉండకూడదు. కొంతమంది పిల్లలు కర్తవ్యము యొక్క ఫలం పట్ల ఎక్కువగా కోరికను పెట్టుకుంటారు, అందుకే ఒకవేళ ప్రశంస జరగకపోతే స్థితి అలజడిలోకి వచ్చేస్తుంది. నింద జరిగితే అనాథలలా అయిపోతారు. తమ స్థితిని వదిలి నాథుడిని కూడా మర్చిపోతారు. అందుకే ప్రశంస ఆధారముగా స్థితిని ఉంచుకోకూడదు.