20-09-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు తండ్రి సమానంగా ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వాలి, సంగమములో తండ్రి పిల్లలైన మీ సేవను చేయడానికి వస్తారు’’

ప్రశ్న:-
ఈ పురుషోత్తమ సంగమయుగమే అన్నింటికంటే మనోహరమైనది మరియు కళ్యాణకారి అయినది - ఎలా?

జవాబు:-
ఈ సమయములోనే పిల్లలైన మీరు, స్త్రీ-పురుషులిరువురూ ఉత్తములుగా అవుతారు. ఈ సంగమయుగము ఉన్నదే కలియుగాంతము మరియు సత్యయుగ ఆదికి మధ్యన ఉన్న సమయము. ఈ సమయములోనే తండ్రి పిల్లలైన మీ కొరకు ఈశ్వరీయ యూనివర్శిటీని తెరుస్తారు, అక్కడ మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఇటువంటి యూనివర్శిటీ మొత్తం కల్పమంతటిలో ఇంకెప్పుడూ ఉండదు. ఈ సమయములోనే అందరి సద్గతి జరుగుతుంది.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇక్కడ కూర్చుంటూ, కూర్చుంటూ ఒకటేమో మీరు తండ్రిని స్మృతి చేస్తారు ఎందుకంటే వారు పతిత-పావనుడు, వారిని స్మృతి చేయడం ద్వారానే పావనులుగా, సతోప్రధానులుగా అవ్వాలి అన్నది మీ లక్ష్యము, సతో వరకూ అవ్వాలి అన్నది లక్ష్యము కాదు, సతోప్రధానులుగా అవ్వాలి, అందుకే తండ్రిని కూడా తప్పకుండా స్మృతి చేయాలి, అంతేకాక మధురమైన ఇంటిని కూడా స్మృతి చేయాలి ఎందుకంటే అక్కడకు వెళ్ళాలి, అంతేకాక ఆస్తిపాస్తులు కూడా కావాలి కావున మన స్వర్గధామాన్ని కూడా స్మృతి చేయాలి ఎందుకంటే ఈ ప్రాప్తి లభిస్తుంది. పిల్లలకు తెలుసు - మేము తండ్రికి పిల్లలుగా అయ్యాము, తప్పకుండా తండ్రి నుండి శిక్షణను తీసుకుని మేము నంబరువారు పురుషార్థానుసారముగా స్వర్గములోకి వెళ్తాము. మిగిలిన జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వారు శాంతిధామములోకి వెళ్ళిపోతారు. ఇంటికైతే తప్పకుండా వెళ్ళాలి. పిల్లలకు ఇది కూడా తెలుసు - ఇప్పుడు ఇది రావణ రాజ్యము, దీనితో పోల్చి సత్యయుగానికి రామ రాజ్యము అన్న పేరును ఇవ్వడం జరుగుతుంది. రెండు కళలు తగ్గిపోతాయి. వారిని సూర్యవంశీయులు అని, ఆ తర్వాతవారిని చంద్రవంశీయులు అని అంటారు. ఏ విధముగా క్రిస్టియన్ల రాజ్యవంశము ఒక్కటే నడుస్తుందో, అలాగే ఇది కూడా ఒకటే రాజ్యవంశము, కానీ అందులో సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ఉన్నారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, దానినే జ్ఞానము లేక నాలెడ్జ్ అని అంటారు. స్వర్గ స్థాపన జరిగిన తర్వాత ఇక జ్ఞానము యొక్క అవసరం ఉండదు. ఈ జ్ఞానము పిల్లలకు పురుషోత్తమ సంగమయుగములోనే నేర్పించడం జరుగుతుంది. మీ సెంటర్లలో లేక మ్యూజియంలలో చాలా పెద్ద-పెద్ద అక్షరాలతో తప్పకుండా ఇలా వ్రాయబడి ఉండాలి -‘సోదరీ, సోదరులారా, ఇది పురుషోత్తమ సంగమయుగము, ఇది ఒకేసారి వస్తుంది’. పురుషోత్తమ సంగమయుగము యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు కావున ఇలా కూడా వ్రాయాలి - కలియుగాంతము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమము అని. కావున సంగమయుగము అన్నింటికంటే శోభాయమానమైనదిగా, కళ్యాణకారిగా అవుతుంది. తండ్రి కూడా అంటారు, నేను పురుషోత్తమ సంగమయుగములోనే వస్తాను. కావున సంగమయుగము యొక్క అర్థాన్ని కూడా వివరించారు. వేశ్యాలయము యొక్క అంతిమము, శివాలయము యొక్క ఆది - దీనిని పురుషోత్తమ సంగమయుగము అని అంటారు. ఇక్కడ అందరూ వికారులుగా ఉన్నారు, అక్కడ అంతా నిర్వికారులుగా ఉంటారు. తప్పకుండా ఉత్తములు అని నిర్వికారులనే అంటారు కదా. పురుషులు మరియు స్త్రీలు, ఇరువురూ ఉత్తములుగా అవుతారు, అందుకే దీనికి పురుషోత్తమ అన్న పేరు ఉంది. ఈ విషయాల గురించి, ఇది సంగమయుగమని తండ్రి మరియు పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియనే తెలియదు. పురుషోత్తమ సంగమయుగము ఎప్పుడు ఉంటుంది అన్న ఆలోచన ఎవరికీ రాదు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, వారు మనుష్య సృష్టికి బీజరూపుడు. వారికే ఇంతటి మహిమ ఉంది, వారు జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు, పతిత-పావనుడు. జ్ఞానముతో సద్గతి చేస్తారు. భక్తితో సద్గతి అని మీరు ఎప్పుడూ అనరు. జ్ఞానముతో సద్గతి లభిస్తుంది మరియు సద్గతి సత్యయుగములోనే ఉంటుంది. కావున తప్పకుండా కలియుగాంతము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమములోనే వారు వస్తారు. తండ్రి ఎంత స్పష్టము చేసి అర్థం చేయిస్తారు. కొత్తవారు కూడా వస్తారు, ఖచ్చితముగా కల్ప-కల్పమూ ఏ విధముగా వచ్చారో అలాగే వస్తూ ఉంటారు. రాజధాని ఇదే విధముగా స్థాపన అవ్వనున్నది. మనము సత్యాతి-సత్యమైన ఈశ్వరీయ సేవాధారులమని పిల్లలైన మీకు తెలుసు. వారు ఒక్కరినే చదివించరు కదా. ఒకరు చదువుతారు, మళ్ళీ వీరి ద్వారా మీరు చదువుకుని ఇతరులను చదివిస్తారు, అందుకే ఇక్కడ ఈ పెద్ద యూనివర్శిటీని తెరవవలసి వస్తుంది. మొత్తం ప్రపంచమంతటిలో ఇంకే యూనివర్శిటీ లేనే లేదు. అలాగే ఈశ్వరీయ యూనివర్శిటీ అంటూ ఒకటి ఉంటుందని కూడా ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - గీతా భగవానుడైన శివుడు వచ్చి ఈ యూనివర్శిటీని తెరుస్తారు, కొత్త ప్రపంచానికి యజమానులుగా, దేవీ-దేవతలుగా తయారుచేస్తారు. ఈ సమయములో ఏ ఆత్మ అయితే తమోప్రధానముగా అయిపోయిందో, మళ్ళీ ఆ ఆత్మయే సతోప్రధానముగా అవ్వాలి. ఈ సమయములో అందరూ తమోప్రధానులుగా ఉన్నారు కదా. అయితే కొందరు కుమారులు కూడా పవిత్రముగా ఉంటారు, కుమారీలు కూడా పవిత్రముగా ఉంటారు, సన్యాసులు కూడా పవిత్రముగా ఉంటారు కానీ ఈ రోజుల్లో ఆ పవిత్రత లేదు. మొట్టమొదట ఎప్పుడైతే ఆత్మలు వస్తారో, అప్పుడు వారు పవిత్రముగా ఉంటారు, ఆ తర్వాత అపవిత్రముగా అయిపోతారు ఎందుకంటే మీకు తెలుసు, సతోప్రధానము, సతో, రజో, తమోలను అందరూ దాటవలసి ఉంటుంది. అంతిమములో అందరూ తమోప్రధానముగా అయిపోతారు. ఇప్పుడు తండ్రి సమ్ముఖముగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఈ వృక్షము తమోప్రధానమైన శిథిలావస్థను పొందింది, పాతబడిపోయింది, కావున తప్పకుండా దీని వినాశనం జరగాలి. ఇది వెరైటీ ధర్మాల వృక్షము, అందుకే దీనిని విరాట లీల అని అంటారు. ఇది ఎంత పెద్ద అనంతమైన వృక్షము. ఆ వృక్షాలైతే జడముగా ఉంటాయి, ఏ బీజము నాటితే ఆ వృక్షము వెలువడుతుంది. అలాగే ఇది వెరైటీ ధర్మాల వెరైటీ చిత్రము. వాస్తవానికి అందరూ మనుష్యులే, కానీ వారిలో వెరైటీ చాలా ఉంది, అందుకే విరాట లీల అని అంటారు. అన్ని ధర్మాలూ ఏ విధంగా నంబరువారుగా వస్తారు, ఇది కూడా మీకు తెలుసు. అందరూ వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఇది డ్రామాగా తయారుచేయబడి ఉంది. ఇది సహజసిద్ధమైన డ్రామా. ఇంత చిన్నని ఆత్మ లేక పరమాత్మలో ఎంతటి పాత్ర నిండి ఉంది అన్నదే సృష్టి అద్భుతము. పరమ - ఆత్మ, ఈ రెండు పదాలను కలిపి పరమాత్మ అని అంటారు. మీరు వారిని బాబా అని పిలుస్తారు ఎందుకంటే వారు ఆత్మలందరికీ సుప్రీమ్ తండ్రి కదా. ఆత్మయే మొత్తం పాత్రనంతటినీ అభినయిస్తుంది అని పిల్లలకు తెలుసు, మనుష్యులకు ఇది తెలియదు. వారు ఆత్మ నిర్లేపి అని అనేస్తారు. వాస్తవానికి ఈ పదము తప్పు. ఆత్మ నిర్లేపి కాదు అని కూడా పెద్ద-పెద్ద అక్షరాలలో వ్రాయాలి. ఎటువంటి మంచి లేక చెడు కర్మలను చేస్తుందో, ఆ విధంగా ఆత్మయే అటువంటి ఫలాన్ని పొందుతుంది. చెడు సంస్కారాల వల్ల పతితముగా అయిపోతుంది, కావుననే దేవతల ఎదురుగా వెళ్ళి వారి మహిమను గానం చేస్తారు. ఇప్పుడు మీకు 84 జన్మల గురించి తెలిసింది, ఇది ఇతర మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. మీరు వారికి 84 జన్మలను నిరూపించి చెప్తే, మరి శాస్త్రాలన్నీ అసత్యమైనవా? అని వారు అడుగుతారు. ఎందుకంటే వారు మనుష్యులు 84 లక్షల యోనులను తీసుకుంటారు అని విన్నారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, వాస్తవానికి సర్వశాస్త్రమయి శిరోమణి గీతయే. తండ్రి ఇప్పుడు మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, దీనిని వారు 5000 సంవత్సరాల క్రితం నేర్పించారు.

మీకు తెలుసు, మనం పవిత్రముగా ఉండేవారము, పవిత్ర గృహస్థ ధర్మము ఉండేది. ఇప్పుడు దీనిని ధర్మము అని అనరు. అధర్ములుగా అయిపోయారు అనగా వికారులుగా అయిపోయారు. ఈ ఆటను పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది అనంతమైన డ్రామా, ఇది ప్రతి 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతూ ఉంటుంది. లక్షల సంవత్సరాల విషయాన్ని అయితే ఎవరూ అర్థం చేసుకోలేరు కూడా. ఇది నిన్నటి విషయం వంటిదే. మీరు శివాలయములో ఉండేవారు, ఈ రోజు వేశ్యాలయములో ఉన్నారు, మళ్ళీ రేపు శివాలయములో ఉంటారు. సత్యయుగాన్ని శివాలయము అని అంటారు, త్రేతాను సెమీ శివాలయము అని అంటారు. ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారు. పునర్జన్మలలోకి అయితే రావలసిందే. దీనిని రావణ రాజ్యము అని అంటారు. మీరు అర్ధకల్పం పతితముగా అయ్యారు, ఇప్పుడు తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రముగా అవ్వండి. కుమారులు మరియు కుమారీలైతే ఎలాగూ పవిత్రముగానే ఉంటారు కావున వారికి ఇలా అర్థం చేయించడం జరుగుతుంది - ఇటువంటి గృహస్థములోకి ఇక వెళ్ళకండి, లేకపోతే మళ్ళీ పవిత్రముగా అయ్యేందుకు పురుషార్థము చేయవలసి వస్తుంది. పావనులుగా అవ్వండి అని భగవానువాచ ఉంది కావున అనంతమైన తండ్రి మాటను వినాలి కదా. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండగలరు. తండ్రి ఇప్పుడు 21 జన్మల వరకూ పతితముగా అవ్వడం నుండి రక్షిస్తుంటే, మరి పిల్లలకు పతితముగా అయ్యే అలవాటు ఎందుకు చేస్తారు? ఇందులో లోక మర్యాదలను, కుల మర్యాదలను కూడా వదలవలసి ఉంటుంది. ఇది అనంతమైన విషయము. బ్యాచిలర్స్ (కుమారులు) అయితే అన్ని ధర్మాలలోనూ ఎంతోమంది ఉంటారు కానీ సురక్షితముగా ఉండడం కాస్త కష్టమవుతుంది, ఎంతైనా రావణ రాజ్యములో ఉంటారు కదా. విదేశాల్లో కూడా ఇలా ఎంతోమంది మనుష్యులు వివాహం చేసుకోరు, మళ్ళీ వృద్ధాప్యములో తోడు కోసం చేసుకుంటారు, వారు అక్కడ ఆశుద్ధ దృష్టితో వివాహం చేసుకోరు. ఇలాంటివారు కూడా ప్రపంచములో ఎంతోమంది ఉంటారు. వారిని పూర్తిగా సంభాళిస్తారు, మళ్ళీ చనిపోయేటప్పుడు ఎంతోకొంత ఆ తోడుగా ఉన్నవారికి ఇచ్చి వెళ్తారు, కొంత ధర్మార్థము ఉపయోగిస్తారు, ట్రస్టును ఏర్పరచి వెళ్తారు. విదేశాల్లో కూడా పెద్ద-పెద్ద ట్రస్టులు ఉంటాయి, అవి ఇక్కడ కూడా సహాయం చేస్తూ ఉంటాయి. విదేశాలకు కూడా సహాయం చేసే ట్రస్టులు ఇక్కడ ఏవీ ఉండవు. ఇక్కడ పేదవారు ఉన్నారు, వారు ఏమి సహాయం చేస్తారు! అక్కడ వారి వద్దనైతే ఎంతో ధనము ఉంటుంది. భారత్ అయితే నిరుపేదగా ఉంది కదా. భారతవాసుల పరిస్థితి ఎలా ఉందో చూడండి! భారత్ ఎంత గొప్ప కిరీటధారిగా ఉండేది, ఇది నిన్నటి విషయమే. 3000 సంవత్సరాల క్రితం ప్యారడైజ్ ఉండేది అని వారు స్వయం కూడా అంటారు. తండ్రే దానిని తయారుచేస్తారు. పతితులను పావనులుగా తయారుచేయడానికి తండ్రి ఏ విధంగా పై నుండి కిందకు వస్తారో మీకు తెలుసు. వారు ఉన్నదే జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత అనగా సర్వులనూ పావనంగా తయారుచేసేవారు. నా మహిమను అందరూ గానం చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. మిమ్మల్ని పావనంగా తయారుచేయడానికి నేను ఇక్కడకు పతిత ప్రపంచములోకే వస్తాను. మీరు పావనంగా అయిపోతే ఇక మొట్టమొదట పావన ప్రపంచములోకి వస్తారు. ఎంతో సుఖాన్ని పొందుతారు, మళ్ళీ రావణ రాజ్యములో పడిపోతారు. పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు, పతిత-పావనుడు అని గానం చేస్తారు కానీ పావనంగా తయారుచేయడానికి వారు ఎప్పుడు వస్తారు - ఇది ఎవరికీ తెలియనే తెలియదు. తండ్రి అంటారు, మీరు నా మహిమను చేస్తారు కదా. ఇప్పుడు నేను వచ్చాను, మీకు నా పరిచయాన్ని ఇస్తున్నాను. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంగమయుగములో వస్తాను, నేను ఎలా వస్తాను అన్నది కూడా అర్థం చేయిస్తాను. చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మా ఏమీ సూక్ష్మవతనములో ఉండరు. బ్రహ్మా ఇక్కడే ఉన్నారు మరియు బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు, వారినే గ్రేట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు, వారి వంశవృక్షము ఇక్కడ తయారవుతుంది. మనుష్య సృష్టి యొక్క వంశవృక్షమైతే ప్రజాపిత బ్రహ్మా నుండే మొదలవుతుంది కదా. ప్రజాపిత ఉన్నారంటే తప్పకుండా వారి ప్రజలు కూడా ఉంటారు. వారు కుఖవంశావళి అవ్వరు, తప్పకుండా దత్తత తీసుకోబడ్డవారై ఉంటారు. వారు గ్రేట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినప్పుడు మరి తప్పకుండా దత్తత తీసుకుని ఉంటారు. మీరందరూ దత్తత తీసుకోబడ్డ పిల్లలు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ మీరు దేవతలుగా అవ్వాలి. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు, ఇది పిల్లిమొగ్గల ఆట. విరాట రూపము యొక్క చిత్రము ఉంది కదా. అక్కడి నుండి అందరూ ఇక్కడకు తప్పకుండా రావాలి. ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో అప్పుడు ఇక క్రియేటర్ కూడా వస్తారు. వారు క్రియేటర్, డైరెక్టర్ మరియు పాత్రను కూడా పోషిస్తారు. తండ్రి అంటారు - ఓ ఆత్మల్లారా, మీకు నా గురించి తెలుసు. ఆత్మలైన మీరందరూ నా పిల్లలే కదా. మీరు మొదట సత్యయుగములో శరీరధారులుగా అయి ఎంత మంచి సుఖమయమైన పాత్రను అభినయించారు, మళ్ళీ 84 జన్మల తర్వాత మీరు ఎంత దుఃఖములోకి వచ్చేశారు. డ్రామాకు క్రియేటర్, డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ ఉంటారు కదా. అలా ఇది అనంతమైన డ్రామా. అనంతమైన డ్రామా గురించి ఎవరికీ తెలియనే తెలియదు. భక్తి మార్గములో ఎటువంటి విషయాలను చెప్తారంటే, ఇక మనుష్యుల బుద్ధిలో అవే విషయాలు కూర్చుండిపోయాయి.

ఇప్పుడు తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, ఇవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు. భక్తి మార్గములో ఎంత సామాగ్రి ఉంది. బీజము యొక్క సామాగ్రి వృక్షము, ఇంత చిన్నని బీజము నుండి వృక్షము ఎంతగా అపారముగా వ్యాపించిపోతుంది. భక్తికి కూడా అంతే విస్తారము ఉంది. జ్ఞానము బీజము, అందులో ఎటువంటి సామాగ్రి యొక్క అవసరము ఉండదు. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఇంకే వ్రతాలు, నోములు లేవు, అవన్నీ ఆగిపోతాయి. మీకు సద్గతి లభిస్తుంది, ఇక ఆ తర్వాత ఇంకే విషయము యొక్క అవసరమూ ఉండదు. మీరే ఎంతో భక్తిని చేశారు. దాని ఫలాన్ని మీకు ఇవ్వడానికి నేను వచ్చాను. దేవతలు శివాలయములో ఉండేవారు కదా, అందుకే మందిరాలలోకి వెళ్ళి వారి మహిమను గానం చేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, నేను 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు అర్థం చేయించాను - స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహపు సర్వ సంబంధాలనూ వదిలి తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి, అప్పుడు ఈ యోగాగ్నితో మీ పాపాలు భస్మమైపోతాయి. తండ్రి ఏదైతే ఇప్పుడు అర్థం చేయిస్తారో, దానిని కల్ప-కల్పమూ అర్థం చేయిస్తూ వచ్చారు. గీతలో కూడా కొన్ని-కొన్ని పదాలు బాగున్నాయి. మన్మనాభవ అనగా నన్ను స్మృతి చేయండి. శివబాబా అంటారు - నేను ఇక్కడకు వచ్చాను, నేను ఎవరి తనువులోకి వస్తాను అనేది కూడా తెలియజేస్తాను. బ్రహ్మా ద్వారా సర్వ వేద-శాస్త్రాల సారాన్ని మీకు వినిపిస్తాను. చిత్రాన్ని కూడా చూపిస్తారు కానీ అర్థాన్ని అర్థం చేసుకోరు. శివబాబా ఏ విధముగా బ్రహ్మా తనువు ద్వారా సర్వ శాస్త్రాలు మొదలైనవాటి సారాన్ని వినిపిస్తారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. 84 జన్మల డ్రామా రహస్యాన్ని కూడా మీకు అర్థం చేయిస్తారు. ఇతని అనేక జన్మల అంతిమములోనే నేను వస్తాను. ఇతనే మళ్ళీ మొదటి నంబరు యువరాజుగా అవుతారు, మళ్ళీ 84 జన్మలలోకి వస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ రావణ రాజ్యములో ఉంటూ పతిత లోక మర్యాదలను, కుల మర్యాదలను వదిలి అనంతమైన తండ్రి చెప్పిన మాటను వినాలి, గృహస్థ వ్యవహారములో కమలపుష్ప సమానంగా ఉండాలి.

2. ఈ వెరైటీ విరాట లీలను బాగా అర్థం చేసుకోవాలి, ఇందులో పాత్రను అభినయించే ఆత్మ నిర్లేపి కాదు, మంచి-చెడు కర్మలను చేస్తుంది మరియు దాని ఫలాన్ని పొందుతుంది, ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని శ్రేష్ఠ కర్మలను చేయాలి.

వరదానము:-

తండ్రి సంస్కారాలను తమ ఒరిజినల్ సంస్కారాలుగా తయారుచేసుకునే శుభ భావన, శుభ కామనాధారీ భవ

ఇప్పటివరకు కూడా కొంతమంది పిల్లల్లో ఫీలింగులోకి వచ్చే సంస్కారము, పక్కకు తప్పుకునే సంస్కారము, పరచింతన చేసే మరియు వినే సంస్కారము... ఇటువంటి భిన్న-భిన్న సంస్కారాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఏమంటారంటే - ఏం చెయ్యను, ఇది నా సంస్కారము... ఈ ‘నాది’ అన్న పదమే పురుషార్థాన్ని ఢీలా చేస్తుంది. ఇది రావణుడి వస్తువు, నాది కాదు. తండ్రి సంస్కారాలేవైతే ఉన్నాయో, అవే బ్రాహ్మణుల యొక్క ఒరిజినల్ సంస్కారాలు. ఆ సంస్కారాలు ఏమిటంటే - విశ్వకళ్యాణకారి, శుభ చింతనధారి, అందరి పట్ల శుభ భావన, శుభ కామనాధారి.

స్లోగన్:-

ఎవరిలోనైతే సమర్థత ఉందో, వారే సర్వ శక్తుల ఖజానాలకు అధికారులు.