ఓంశాంతి
పిల్లలు ఓం శాంతి అర్థాన్ని అర్థం చేసుకున్నారు. తండ్రి అర్థం చేయించారు - మనము
ఆత్మ, ఈ సృష్టి డ్రామాలో మనది ముఖ్యమైన పాత్ర. ఎవరి పాత్ర? ఆత్మ శరీరాన్ని ధరించి
పాత్రను పోషిస్తుంది. కనుక పిల్లలను ఇప్పుడు ఆత్మ- అభిమానులుగా తయారుచేస్తున్నారు.
ఇంత సమయమూ దేహ-అభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని
స్మృతి చేయాలి. మన బాబా డ్రామా ప్లాన్ అనుసారముగా వచ్చి ఉన్నారు. తండ్రి వచ్చేది
కూడా రాత్రిలోనే. ఎప్పుడు వస్తారు - దాని తిథి-తారీఖులు ఏవీ లేవు. ఎవరైతే లౌకిక
జన్మ తీసుకుంటారో వారికే తిథి-తారీఖులు ఉంటాయి. వీరైతే పారలౌకిక తండ్రి. వీరికి
లౌకిక జన్మ లేదు. శ్రీకృష్ణుని విషయములో తిథి-తారీఖు, సమయము మొదలైనవన్నీ ఇస్తారు.
బాబా విషయములో దివ్య జన్మ అని అంటారు. తండ్రి వీరిలో ప్రవేశించి - ఇది అనంతమైన
డ్రామా అని తెలియజేస్తారు. ఇందులో అర్ధకల్పము రాత్రి. ఎప్పుడైతే రాత్రి ఉంటుందో అనగా
ఘోర అంధకారము ఉంటుందో అప్పుడు నేను వస్తాను. తిథి-తారీఖులు ఏవీ లేవు. ఈ సమయములో
భక్తి కూడా తమోప్రధానముగా ఉంది. అర్ధకల్పము అనంతమైన పగలు. నేను వీరిలో ప్రవేశించాను
అని తండ్రి స్వయం అంటారు. గీతలో కూడా భగవానువాచ అని ఉంది, కానీ భగవంతుడు మనిషి
కాలేరు. శ్రీకృష్ణుడు కూడా దైవీ గుణాలు కలవారు. ఇది మనుష్య లోకము. ఇది దేవ లోకము
కాదు. బ్రహ్మా దేవతాయ నమః అని పాడుతారు కూడా... వారు సూక్ష్మవతనవాసి. అక్కడ మాంసము,
ఎముకలు ఉండవు అన్నది పిల్లలకు తెలుసు. అది సూక్ష్మమైన తెల్లని నీడ. మూలవతనములో
ఉన్నప్పుడు ఆత్మకు నీడ వంటి సూక్ష్మ శరీరము లేదు, అలాగే ఎముకలతో కూడిన శరీరము లేదు.
ఈ విషయాల గురించి ఏ మనుష్యమాత్రులకూ తెలియదు. తండ్రే వచ్చి వినిపిస్తారు,
బ్రాహ్మణులే వింటారు, ఇతులెవ్వరూ వినరు. బ్రాహ్మణ వర్ణము భారత్ లోనే ఉంటుంది, అది
కూడా ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే పరమపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ
ధర్మాన్ని స్థాపిస్తారో అప్పుడు. ఇప్పుడు వీరిని రచయిత అని కూడా అనరు. కొత్త రచననేమీ
రచించరు. కేవలము కొత్తదిగా చేస్తారు. ఓ బాబా, పతిత ప్రపంచములోకి వచ్చి మమ్మల్ని
పావనముగా తయారుచెయ్యండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు మిమ్మల్ని పావనముగా
తయారుచేస్తున్నారు. మీరు తిరిగి యోగబలముతో ఈ సృష్టిని పావనముగా తయారుచేస్తున్నారు.
మాయపై మీరు విజయాన్ని పొంది జగత్ జీతులుగా అవుతారు. యోగబలాన్ని సైన్స్ బలమని కూడా
అంటారు. ఋషులు, మునులు మొదలైనవారందరూ శాంతిని కోరుకుంటారు కానీ శాంతి యొక్క అర్థము
గురించి తెలియదు. ఇక్కడైతే తప్పకుండా పాత్రను పోషించాలి కదా. శాంతిధామము స్వీట్
సైలెన్స్ హోమ్. మన ఇల్లు శాంతిధామమని, ఇక్కడకు మనము పాత్రను పోషించేందుకు వచ్చామని
ఆత్మలైన మీకు ఇప్పుడు తెలిసింది. ఓ పతిత-పావనా, దుఃఖహర్త, సుఖకర్త, రండి, మమ్మల్ని
ఈ రావణుని సంకెళ్ళ నుండి విడిపించండి - అని తండ్రిని పిలుస్తారు. భక్తి రాత్రి,
జ్ఞానము పగలు. రాత్రి అంతరించిపోతుంది, తర్వాత జ్ఞానము జిందాబాద్ అవుతుంది. ఇది
సుఖ-దుఃఖాల ఆట. మొదట్లో మనము స్వర్గములో ఉండేవారము, తర్వాత దిగుతూ-దిగుతూ కింద
నరకములోకి వచ్చి పడ్డాము అన్నది మీకు తెలుసు. కలియుగము ఎప్పుడు అంతమవుతుంది మరియు
సత్యయుగము ఎప్పుడు వస్తుంది, ఇది ఎవరికీ తెలియదు. మీరు తండ్రిని తెలుసుకోవటము ద్వారా
తండ్రి ద్వారా అంతా తెలుసుకున్నారు. మనుష్యులు భగవంతుడిని వెతికేందుకై ఎన్ని
ఎదురుదెబ్బలు తింటుంటారు. తండ్రి గురించి తెలియనే తెలియదు. ఎప్పుడైతే తండ్రి వచ్చి
తన మరియు తన ఆస్తి యొక్క పరిచయాన్ని ఇస్తారో అప్పుడే తెలుసుకుంటారు. వారసత్వము
తండ్రి నుండే లభిస్తుంది, అంతేకానీ తల్లి నుండి కాదు. వీరిని మమ్మా అని కూడా అంటారు,
కానీ వీరి నుండి వారసత్వము లభించదు, వీరిని స్మృతి కూడా చేయకూడదు. బ్రహ్మా, విష్ణువు,
శంకరుడు కూడా శివుని సంతానమే - ఇది కూడా ఎవరికీ తెలియదు. అనంతమైన మొత్తము ప్రపంచపు
రచయిత ఒక్క తండ్రియే. మిగిలినవారందరూ వారి రచన లేక హద్దు రచయితలు. ఇప్పుడు పిల్లలైన
మీతో తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి.
మనుష్యులకు తండ్రి గురించి తెలియదు కనుక మరి ఎవరిని స్మృతి చెయ్యాలి? అందుకే తండ్రి
అంటారు, ఎంత అనాథలుగా అయిపోయారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది.
భక్తి మరియు జ్ఞానము, ఈ రెండింటిలోనూ అన్నింటికన్నా శ్రేష్ఠమైన కర్మ - దానము
చెయ్యటము. భక్తి మార్గములో ఈశ్వరార్థము దానము చేస్తారు. ఎందుకు చేస్తారు? ఏదో కోరిక
అయితే తప్పకుండా ఉంటుంది. ఎటువంటి కర్మ చేస్తామో అటువంటి ఫలాన్ని మరుసటి జన్మలో
పొందుతాము, ఈ జన్మలో ఏది చేస్తామో దాని ఫలాన్ని మరుసటి జన్మలో పొందుతాము అని
భావిస్తారు. జన్మ-జన్మాంతరాలు పొందరు. ఒక్క జన్మ కొరకు ఫలము లభిస్తుంది.
అన్నింటికంటే అత్యంత మంచి కర్మ దానము చెయ్యటము. దానము చేసేవారిని పుణ్యాత్మ అని
అంటారు. భారత్ ను మహాదాని అని అంటారు. భారత్ లో ఎంతైతే దానము జరుగుతుందో అంతగా ఇతర
ఖండాలలో జరగదు. తండ్రి కూడా వచ్చి పిల్లలకు దానమిస్తారు, పిల్లలు తిరిగి తండ్రికి
దానమిస్తారు. ఏమంటారంటే - బాబా, మీరు వచ్చినట్లయితే మేము మా తనువు-మనసు-ధనము
సర్వస్వము మీకు సమర్పిస్తాము. మీరు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు. తండ్రి కూడా అంటారు,
నాకు కూడా పిల్లలైన మీరే ఉన్నారు. నన్ను హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు అనగా
స్వర్గాన్ని స్థాపన చేసేవారు. నేను వచ్చి మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తాను.
బాబా, అంతా మీదే అని పిల్లలు నా కోసము సర్వస్వము ఇచ్చేస్తారు. భక్తి మార్గములో కూడా
- బాబా, ఇవన్నీ మీరు ఇచ్చినవే అని అనేవారు, కానీ మళ్ళీ అవి పోతే దుఃఖితులుగా
అయిపోతారు. అది భక్తి యొక్క అల్పకాలికమైన సుఖము. తండ్రి అర్థం చేయిస్తున్నారు, భక్తి
మార్గములో మీరు నా పేరు మీద ఇండైరెక్టుగా దాన-పుణ్యాలు చేసేవారు. దాని ఫలమైతే మీకు
లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమయములో నేను మీకు కర్మ-అకర్మ-వికర్మల రహస్యాన్ని
కూర్చుని అర్థం చేయిస్తాను. భక్తి మార్గములో మీరు ఎటువంటి కర్మలు చేస్తారో వాటికి
అల్పకాలికమైన సుఖము కూడా నా ద్వారా మీకు లభిస్తుంది. ఈ విషయాల గురించి ప్రపంచములో
ఎవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి కర్మల గతిని అర్థం చేయిస్తారు. సత్యయుగములో
ఎప్పుడూ ఎవ్వరూ చెడు కర్మలు చెయ్యనే చెయ్యరు. ఎల్లప్పుడూ సుఖమే సుఖము ఉంటుంది.
స్మృతి కూడా సుఖధామాన్ని, స్వర్గాన్నే స్మృతి చేస్తారు. ఇప్పుడు నరకములో కూర్చుని
ఉన్నారు. అయినా కూడా - ఫలానావారు స్వర్గానికి వెళ్ళారు అని అంటారు. ఆత్మకు స్వర్గము
ఎంత మంచిగా అనిపిస్తుంది. ఫలానావారు స్వర్గానికి వెళ్ళారు అని ఆత్మయే అంటుంది కదా.
కానీ తమోప్రధానులైన కారణముగా వారికి - స్వర్గమంటే ఏమిటి, నరకమంటే ఏమిటి అన్నదేమీ
తెలియదు. అనంతమైన తండ్రి అంటారు, మీరంతా ఎంత తమోప్రధానముగా అయిపోయారు. డ్రామా
గురించైతే తెలియదు. సృష్టి చక్రము తిరుగుతుంది అంటే అది తప్పకుండా అలాగే తిరుగుతుంది
కదా అని కూడా అర్థం చేసుకుంటారు. వారు కేవలము అనటానికే అంటారు. ఇప్పుడు ఇది
సంగమయుగము. ఈ ఒక్క సంగమయుగానికే గాయనము ఉంది. అర్ధకల్పము దేవతల రాజ్యము నడుస్తుంది,
మరి తర్వాత ఆ రాజ్యము ఎక్కడికి వెళ్తుంది, ఎవరు గెలుస్తారు? ఇది కూడా ఎవరికీ తెలియదు.
తండ్రి అంటారు, రావణుడు గెలుస్తాడు. దానిని వారు దేవతలు మరియు అసురుల యుద్ధముగా
చూపించారు.
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - 5 వికారాల రూపీ రావణుడితో ఓడిపోతారు,
మళ్ళీ రావణుడిపై విజయము కూడా పొందుతారు. మీరు పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారీ
పతితులుగా అవుతారు, అంటే రావణుడితో ఓడిపోయినట్లే కదా. ఇతను మీ శత్రువు అయిన కారణముగా
మీరు సదా కాలుస్తూ వచ్చారు. కానీ మీకు తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు
- రావణుడి కారణముగా మీరు పతితముగా అయ్యారు. ఈ వికారాలనే మాయ అని అంటారు. మాయాజీతులే
జగత్ జీతులు. ఈ రావణుడు అందరికంటే పాత శత్రువు. ఇప్పుడు శ్రీమతము ద్వారా మీరు ఈ పంచ
వికారాలపై విజయాన్ని పొందుతారు. తండ్రి విజయాన్ని ఇప్పించడానికి వచ్చారు. ఇది ఆట కదా.
మాయతో ఓడిపోతే ఓటమి, మాయతో గెలిస్తే విజయము. విజయాన్ని తండ్రే ఇప్పిస్తారు, అందుకే
వారిని సర్వశక్తివంతుడు అని అంటారు. రావణుడు కూడా తక్కువ శక్తి కలవాడేమీ కాదు. కానీ
అతను దుఃఖాన్ని కలుగజేస్తాడు కనుక అతనికి గాయనము లేదు. రావణుడు చాలా శక్తివంతమైనవాడు.
మీ రాజ్యాన్నే లాగేసుకుంటాడు. మనము ఎలా ఓడిపోతాము, మళ్ళీ ఎలా విజయము పొందుతాము
అన్నదానిని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. నాకు శాంతి కావాలి, నేను నా ఇంటికి
వెళ్ళాలి అని ఆత్మ కోరుకుంటుంది కూడా. భక్తులు భగవంతుడిని స్మృతి చేస్తారు కానీ
రాతిబుద్ధి కలవారైన కారణముగా అర్థం చేసుకోరు. భగవంతుడు తండ్రి, మరి తండ్రి ద్వారా
తప్పకుండా వారసత్వము లభిస్తూ ఉండవచ్చు. తప్పకుండా లభిస్తుంది కూడా, కానీ ఎప్పుడు
లభిస్తుంది, దానిని మళ్ళీ ఎలా పోగొట్టుకుంటారు, ఇది తెలియదు. తండ్రి అంటారు, నేను
కూర్చుని ఈ బ్రహ్మా తనువు ద్వారా మీకు అర్థం చేయిస్తాను. నాకు కూడా ఇంద్రియాలు
కావాలి కదా. నాకు నా కర్మేంద్రియాలంటూ లేవు. సూక్ష్మవతనములో కూడా కర్మేంద్రియాలు
ఉన్నాయి. నడుస్తూ-తిరుగుతున్న మూవీ సినిమాలా ఉంటుంది. ఈ మూవీ, టాకీ సినిమాలు
వెలువడ్డాయి కనుక తండ్రికి కూడా అర్థం చేయించడానికి సహజమవుతుంది. వారిది బాహుబలము,
మీది యోగబలము. ఆ ఇద్దరు సోదరులు కూడా ఒకవేళ కలిసిపోతే విశ్వముపై రాజ్యము చెయ్యగలరు.
కానీ ఇప్పుడైతే విభేదాలు నెలకొని ఉన్నాయి. పిల్లలైన మీకు సైలెన్స్ యొక్క శుద్ధమైన
గర్వము ఉండాలి. మీరు మన్మనాభవ ఆధారముతో సైలెన్స్ ద్వారా జగత్ జీతులుగా అవుతారు. వారు
సైన్స్ గర్వము కలవారు. సైలెన్స్ గర్వము కల మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని
స్మృతి చేస్తారు. స్మృతి ద్వారా మీరు సతోప్రధానముగా అవుతారు. చాలా సహజమైన ఉపాయాన్ని
తెలియజేస్తారు. శివబాబా పిల్లలైన మనకు మళ్ళీ స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు
అని మీకు తెలుసు. మీకు కలియుగ బంధనాలేవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోండి అని
తండ్రి అంటారు. పంచ వికారాలను కూడా నాకు దానముగా ఇచ్చేయండి. మీరు నాది-నాది అని
ఏదైతే అంటూ వచ్చారో, నా తండ్రి, నా ఫలానా, వీటన్నింటినీ మర్చిపోతూ వెళ్ళండి.
అన్నింటినీ చూస్తూ కూడా వాటిపై మమకారాన్ని తొలగించండి. ఈ విషయాన్ని పిల్లలకే అర్థం
చేయిస్తారు. ఎవరైతే తండ్రిని తెలుసుకోనే తెలుసుకోరో, వారు ఈ భాషను కూడా అర్థం
చేసుకోలేరు. తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. దేవతలు
సత్యయుగములోనే ఉంటారు. కలియుగములో మనుష్యులు ఉంటారు. ఇప్పటివరకు వారి గుర్తులు
ఉన్నాయి అనగా చిత్రాలు ఉన్నాయి. నన్ను పతిత-పావన అనే అంటారు. నేనైతే దిగజారను. మీరు
అంటారు - మేము పావనముగా ఉండేవారము, తర్వాత దిగజారి పతితముగా అయ్యాము, ఇప్పుడు మీరు
వచ్చి పావనముగా తయారుచేసినట్లయితే మేము మా ఇంటికి వెళ్తాము. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము.
అవినాశీ జ్ఞాన రత్నాలు కదా. ఇది కొత్త జ్ఞానము. ఇప్పుడు మీకు ఈ జ్ఞానాన్ని
నేర్పిస్తాను. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలియజేస్తాను. ఇప్పుడు ఇది
పాత ప్రపంచము. ఇందులో మీ మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, దేహ సహితముగా
వారందరిపై నుండి మమకారాన్ని తొలగించండి.
ఇప్పుడు పిల్లలైన మీరు మీ సర్వస్వాన్నీ తండ్రికి సమర్పిస్తారు. తండ్రి తిరిగి
స్వర్గ రాజ్యాధికారాన్ని 21 జన్మల కొరకు మీకు అప్పగిస్తారు. ఇచ్చి-పుచ్చుకోవటాలు
అయితే జరుగుతాయి కదా. తండ్రి మీకు 21 జన్మల కొరకు రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. 21
జన్మలు, 21 తరాలు అని అంటూ ఉంటారు కదా అనగా 21 జన్మలు పూర్తి జీవితము నడుస్తుంది.
మధ్యలో ఎప్పుడూ శరీరము పోదు. అకాల మృత్యువు జరగదు. మీరు అమరులుగా అయ్యి అమరపురికి
యజమానులుగా అవుతారు. మిమ్మల్ని ఎప్పుడూ కాలుడు కబళించలేడు. ఇప్పుడు మీరు
మరణించేందుకు పురుషార్థము చేస్తున్నారు. తండ్రి అంటారు, దేహ సహితముగా దేహపు సర్వ
సంబంధాలను వదిలి ఒక్క తండ్రితో సంబంధాన్ని ఉంచుకోవాలి. ఇప్పుడు సుఖ సంబంధాలలోకి
వెళ్ళేదే ఉంది. దుఃఖ బంధనాలను మర్చిపోతూ ఉంటారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా
అవ్వాలి. తండ్రి అంటారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, దానితోపాటుగా దైవీ గుణాలను
కూడా ధారణ చెయ్యండి. ఈ దేవతల వలె అవ్వాలి. ఇదే లక్ష్యము-ఉద్దేశ్యము. ఈ
లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు, వీరు రాజ్యాన్ని ఎలా పొందారు,
తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఇది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు దైవీ
గుణాలను ధారణ చెయ్యాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. తండ్రి ఉన్నదే దుఃఖహర్త,
సుఖకర్త. కనుక మీరు కూడా సుఖము యొక్క దారిని అందరికీ తెలియజేయాలి అనగా అంధులకు
చేతికర్రగా అవ్వాలి. ఇప్పుడు తండ్రి మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు. తండ్రి
ఏ విధంగా పాత్రను అభినయిస్తారు అన్నది మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి మీకు ఏదైతే
చదివిస్తున్నారో, ఈ చదువు మళ్ళీ కనుమరుగైపోతుంది. దేవతలలో ఈ జ్ఞానము ఉండదు. బ్రహ్మా
ముఖ వంశావళి బ్రాహ్మణులైన మీరే రచయిత మరియు రచనల జ్ఞానాన్ని తెలుసుకుంటారు.
ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. ఈ లక్ష్మీ-నారాయణులు మొదలైనవారిలో కూడా ఒకవేళ ఈ జ్ఞానము
ఉన్నట్లయితే పరంపరగా నడుస్తూ వచ్చేది. అక్కడ జ్ఞానము యొక్క అవసరమే ఉండదు ఎందుకంటే
అక్కడ ఉన్నదే సద్గతి. ఇప్పుడు మీరు సర్వస్వాన్ని తండ్రికి దానముగా ఇచ్చినట్లయితే
తండ్రి తిరిగి మీకు 21 జన్మల కొరకు సర్వస్వాన్ని ఇస్తారు. ఇటువంటి దానము ఎప్పుడూ
ఉండనే ఉండదు. మనము సర్వస్వమూ ఇస్తాము అని మీకు తెలుసు - బాబా, ఇదంతా మీదే, మీరే మాకు
సర్వస్వము. త్వమేవ మాతాశ్చ పిత... పాత్రనైతే అభినయిస్తారు కదా. పిల్లలను దత్తత కూడా
తీసుకుంటారు, మళ్ళీ స్వయమే చదివిస్తారు. మళ్ళీ స్వయమే గురువుగా అయ్యి అందరినీ
తీసుకువెళ్తారు. ఏమంటారంటే - మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనముగా అవుతారు,
అప్పుడు మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. ఈ యజ్ఞము రచింపబడి ఉంది. ఇది శివ
జ్ఞాన యజ్ఞము, ఇందులో మీరు తనువు-మనసు-ధనము సర్వస్వాన్ని స్వాహా చేస్తారు. సంతోషముగా
అంతా అర్పణమవుతుంది. ఇకపోతే ఆత్మ మిగులుతుంది. బాబా, ఇప్పుడు ఇక మేము మీ
శ్రీమతముపైనే నడుస్తాము. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా అవ్వాలి.
60 సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు వానప్రస్థ అవస్థలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు
చేసుకుంటారు కానీ వాళ్ళేమీ తిరిగి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోరు. ఇప్పుడు మీరు
సద్గురువు మంత్రాన్ని స్వీకరిస్తారు - మన్మనాభవ. భగవానువాచ - మీరు నన్ను స్మృతి
చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. అందరికీ చెప్పండి - ఇప్పుడు ఇది మీ అందరి
వానప్రస్థ అవస్థ, శివబాబాను స్మృతి చెయ్యండి, ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.