21-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - దేవతలుగా అయ్యే కంటే ముందు మీరు బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వాలి, బ్రహ్మా ముఖ సంతానమే సత్యమైన బ్రాహ్మణులు, వారు రాజయోగ చదువుతో దేవతలుగా అవుతారు’’

ప్రశ్న:-
ఇతర సత్సంగాలన్నింటితో పోలిస్తే మీ ఈ సత్సంగము ఏ విషయములో అద్భుతమైనది మరియు భిన్నమైనది?

జవాబు:-
ఇతర సత్సంగాలలో ఎటువంటి లక్ష్యమూ-ఉద్దేశ్యము ఉండదు, ఇంకా ధనము-సంపద మొదలైనవాటన్నింటినీ పోగొట్టుకొని భ్రమిస్తూ ఉంటారు. ఈ సత్సంగములో మీరు భ్రమించరు. ఇది సత్సంగముతోపాటు స్కూల్ కూడా. స్కూల్లో చదవవలసి ఉంటుందే కానీ భ్రమించడము కాదు. చదువు అనగా సంపాదన. ఎంతగా మీరు చదువుకొని ధారణ చేస్తారో మరియు చేయిస్తారో, అంతగా సంపాదన ఉంటుంది. ఈ సత్సంగములోకి రావడము అనగా అంతా లాభమే లాభము.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక పిల్లలే ఈ చెవుల ద్వారా వింటారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని అనంతమైన తండ్రి పిల్లలకు చెప్తున్నారు. దీనిని ఘడియ-ఘడియ వినడం ద్వారా బుద్ధి భ్రమించడం ఆగి స్థిరమవుతుంది, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చుండిపోతారు. ఇక్కడకు మనం దేవతలుగా అయ్యేందుకు వచ్చాము అని పిల్లలు భావిస్తారు. మనం దత్తత తీసుకోబడిన పిల్లలము. బ్రాహ్మణులమైన మనం చదువుకుంటాము. ఏం చదువుకుంటాము? బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఎవరైనా పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు - మేము ఇప్పుడు చదువుకుని ఇంజనీర్ గా లేక డాక్టర్ మొదలైనవారిగా అవుతాము అని భావిస్తారు. అక్కడ కూర్చోవడంతోనే వెంటనే అలా భావిస్తారు. మీరు కూడా బ్రహ్మా పిల్లలైన బ్రాహ్మణులుగా అయినప్పుడు మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము అని భావిస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు అన్న గాయనం కూడా ఉంది. కానీ అలా ఎవరు తయారవుతారు? హిందువులందరూ ఏమీ దేవతలుగా అవ్వరు. వాస్తవానికి హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. హిందూ ధర్మం ఆది సనాతనమైనది కాదు. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? అని ఎవరినైనా అడిగితే, వారు తికమకపడతారు. అజ్ఞానంతో ఈ పేరును పెట్టేసారు. హిందుస్థాన్ లో ఉండేవారు స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు. వాస్తవానికి దీని పేరు భారత్, అంతేకానీ హిందుస్థాన్ కాదు. భారత్ ఖండము అని అంటారు, అంతేకానీ హిందుస్థాన్ ఖండము అని అనరు. ఇది ఉన్నదే భారత్. వారికి ఇది ఏ ఖండము అన్నది కూడా తెలియదు. అపవిత్రముగా ఉన్న కారణముగా స్వయాన్ని దేవతలుగానైతే భావించలేరు. దేవీ-దేవతలు పవిత్రముగా ఉండేవారు. ఇప్పుడు ఆ ధర్మం లేదు. మిగిలిన ధర్మాలన్నీ కొనసాగుతూ వస్తాయి. బుద్ధునిది బౌద్ధ ధర్మం, ఇబ్రహీంది ఇస్లాం ధర్మం, క్రైస్టుది క్రిస్టియన్ ధర్మం. కానీ అలా హిందూ ధర్మానికి ఎవ్వరూ లేరు. ఈ హిందుస్థాన్ అన్న పేరును విదేశీయులు పెట్టారు. పతితులుగా ఉన్న కారణముగా స్వయాన్ని దేవతా ధర్మానికి చెందినవారిగా భావించరు. ఆది సనాతనమైనది దేవీ-దేవతా ధర్మమని, ఇది అతి పురాతనమైనదని తండ్రి అర్థం చేయించారు. మొదటి ధర్మం ఏది? దేవీ-దేవత ధర్మం. దానిని హిందూ ధర్మం అని అనరు. ఇప్పుడు బ్రహ్మా ద్వారా దత్తత తీసుకోబడ్డ పిల్లలైన మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. హిందువుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు అని కాదు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. దీనిని బాగా ధారణ చేయాలి. ఇప్పుడు చూడండి, ఎన్నో ధర్మాలు ఉన్నాయి, అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా భాషణ మొదలైనవి చేసేటప్పుడు ఇది అర్థం చేయించడం మంచిది. ఇప్పుడు ఇది కలియుగం. అన్ని ధర్మాలూ ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నాయి. మీరు చిత్రాల ద్వారా అర్థం చేయించినట్లయితే - నేను ఫలానాను, నేను ఇది... అన్న అహంకారం తొలగిపోతుంది, మేము తమోప్రధానంగా ఉన్నాము అని అర్థం చేసుకుంటారు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి, ఆ తర్వాత ఇక ఈ పాత ప్రపంచం మారనున్నది అని చూపించాలి. రోజురోజుకు చిత్రాలు కూడా శోభాయమానంగా అవుతూ ఉంటాయి. ఏ విధంగా స్కూళ్ళలో పిల్లల బుద్ధిలో మ్యాప్ లు ఉంటాయో, అలా మీ బుద్ధిలో ఈ చిత్రాలు ఉండాలి. నంబర్ వన్ మ్యాప్ ఇదే. పైన త్రిమూర్తులు కూడా ఉన్నారు, సత్యయుగము మరియు కలియుగము యొక్క రెండు గ్లోబ్ లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమయుగములో ఉన్నాము. ఈ పాత ప్రపంచం వినాశనమవుతుంది. ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము స్థాపన అవుతోంది. మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. ఏ విధంగా సన్యాసులు నివాస స్థానమైన బ్రహ్మమునే ఈశ్వరునిగా భావించారో, అలా హిందుస్థాన్ లో ఉండేవారు హిందూ ధర్మంగా భావించారు. అందులోనూ తేడా ఉంది, ఇందులోనూ తేడా ఉంది. దేవీ-దేవతల పేరైతే ఎంతో ఉన్నతమైనది. వీరైతే దేవత వలె ఉన్నారు అని అంటారు కదా. ఎవరిలోనైనా మంచి గుణాలు ఉంటే, వీరిలో దైవీ గుణాలు ఉన్నాయి అని అంటారు.

ఈ రాధ-కృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారని, వారిని విష్ణువు అని అంటారని మీరు అర్థం చేసుకుంటారు. చిత్రాలు అందరివీ ఉన్నాయి, కానీ ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రినే అందరూ తలచుకుంటారు. తమ నోటితో భగవంతుడిని తలచుకోని మనుష్యులెవ్వరూ ఉండరు. వాస్తవానికి భగవంతుడిని నిరాకారుడు అని అంటారు. నిరాకారుడు అన్న పదము యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకుంటారు. రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అయిపోతారు. ఈ జ్ఞానం భారతవాసుల కోసమే ఉంది, అంతేకానీ ఇతర ధర్మాల వారి కోసం కాదు. ఇకపోతే, ఇంత వృద్ధి ఎలా జరుగుతుంది, ఇతర ఖండాలు ఎలా వచ్చాయి అనేది మీరు అర్థం చేయించవచ్చు. అక్కడైతే భారత్ ఖండము తప్ప ఇంకే ఖండమూ ఉండదు. ఇప్పుడు ఆ ఒక్క ధర్మమే లేదు, మిగిలినవన్నీ ఉన్నాయి. మర్రి వృక్షము ఉదాహరణ కరక్టుగా ఉంది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం యొక్క పునాది లేదు, మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది. కావున ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం ఉండేది అని అంటారు, అంతేకానీ హిందూ ధర్మం అని అనరు. మీరు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు, దేవతలుగా అయ్యేందుకు మొదట తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వవలసి ఉంటుంది. శూద్ర వర్ణము మరియు బ్రాహ్మణ వర్ణము అని అంటారు. శూద్ర వంశము అని అనరు. రాజులు, రాణులు ఉండేవారు. మొదట దేవీ-దేవతలు మహారాజు, మహారాణులుగా ఉండేవారు. ఇక్కడ హిందూ మహారాజు, మహారాణులు ఉన్నారు. భారత్ అయితే ఒక్కటే, మరి వారు వేర్వేరు ఎలా అయిపోయారు? వారి నామ-రూపాలనే మాయం చేసేసారు, కేవలం చిత్రాలు ఉన్నాయి. నంబర్ వన్ సూర్యవంశీయులు. ఇప్పుడు మీరు సూర్యవంశీయులుగా అయ్యేందుకు వచ్చారు. ఇది రాజయోగము కదా. మేము ఈ లక్ష్మీ-నారాయణులుగా అవుతాము అని మీ బుద్ధిలో ఉంది. బాబా మనల్ని మహారాజు, మహారాణులుగా తయారుచేయడానికి చదివిస్తున్నారని మనస్సులో సంతోషము ఉంటుంది. సత్యనారాయణుని సత్యాతి-సత్యమైన కథ ఇదే. ఇంతకుముందు జన్మజన్మాంతరాలూ మీరు సత్యనారాయణుని కథను వినేవారు. కానీ అవేవీ సత్యమైన కథలు కావు. భక్తి మార్గంలో ఎప్పుడూ మనుష్యుల నుండి దేవతలుగా అవ్వలేరు, ముక్తి-జీవన్ముక్తులను పొందలేరు. మనుష్యులందరూ ముక్తి-జీవన్ముక్తులను తప్పకుండా పొందుతారు. ఇప్పుడు అందరూ బంధనములో ఉన్నారు. పై నుండి ఏదైనా ఆత్మ ఈ రోజు వచ్చినా కానీ జీవన్ముక్తిలోకి వస్తుందే కానీ జీవన బంధనములోకి కాదు. సగం సమయం జీవన్ముక్తిలోకి, సగం సమయం జీవనబంధనములోకి వెళ్తారు. ఈ ఆట రచింపబడి ఉంది. ఈ అనంతమైన ఆటలో మనమందరమూ పాత్రధారులము, పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాము. ఆత్మలమైన మనము ఇక్కడి నివాసులము కాము. ఏ విధంగా వస్తాము అన్న ఈ విషయాలన్నింటినీ అర్థం చేయించడం జరుగుతుంది. కొంతమంది ఆత్మలు ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. పిల్లలైన మీకు మొదటి నుండి చివరి వరకూ మొత్తం ప్రపంచ చరిత్ర, భౌగోళములు బుద్ధిలో ఉన్నాయి. అనంతమైన తండ్రి పైన కూర్చొని ఏమి చేస్తారు, ఏమీ తెలియదు, అందుకే వారిని తుచ్ఛబుద్ధి కలవారు అని అంటారు. మీరు కూడా తుచ్ఛబుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించారు. పేదవారు, సాధారణమైనవారు అయిన మీకు అంతా తెలుసు. మీరు స్వచ్ఛబుద్ధి కలవారు. స్వచ్ఛమైనవారు అని పవిత్రులను అంటారు. అపవిత్రులు తుచ్ఛబుద్ధి కలవారు. మీరు ఇప్పుడు ఏ విధంగా తయారవుతున్నారు! స్కూల్లో కూడా చదువు ద్వారా ఉన్నత పదవిని పొందవచ్చు. మీ చదువు ఉన్నతోన్నతమైనది, దీని ద్వారా మీరు రాజ్య పదవిని పొందుతారు. వారైతే దాన-పుణ్యాలను చేయడం ద్వారా రాజుల వద్ద జన్మ తీసుకుంటారు, మళ్ళీ రాజులుగా అవుతారు, కానీ మీరు ఈ చదువు ద్వారా రాజులుగా అవుతారు. నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అని స్వయంగా తండ్రే అంటారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. తండ్రే మీకు రాజయోగ చదువును చదివిస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తారు. మీరు పతితుల నుండి పావనులుగా అవ్వాలని తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిరాకారుడైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అయిపోతారు మరియు చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా సత్యయుగములో చక్రవర్తీ రాజులుగా అవుతారు. ఇది అర్థం చేయించడం చాలా సహజం. ఇప్పుడు దేవతా ధర్మానికి చెందినవారు ఎవ్వరూ లేరు. అందరూ ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు, మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఇతర ధర్మాలలోకి ఎంతమంది వెళ్ళిపోయారో తండ్రి అర్థం చేయిస్తారు. బౌద్ధులుగా, ముసల్మాన్లు మొదలైనవారిగా ఎంతోమంది కన్వర్ట్ అయిపోయారు. ఖడ్గం శక్తికి భయపడి కూడా ముసల్మాన్లుగా అయ్యారు. బౌద్ధులుగా కూడా ఎందరో అయ్యారు. ఒక్కసారి భాషణ చేస్తే, వేలాదిమంది బౌద్ధులుగా అయిపోయారు. క్రిస్టియన్లు కూడా ఈ విధంగా వచ్చి భాషణ చేస్తారు. ఈ సమయంలో అందరికన్నా ఎక్కువ జనాభా సంఖ్య వారిదే ఉంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రమంతా తిరుగుతూ ఉంటుంది, కావుననే మీరు స్వదర్శన చక్రధారులు అని తండ్రి అంటారు. స్వదర్శన చక్రాన్ని విష్ణువుకు చూపిస్తారు. విష్ణువుకు ఎందుకు చూపిస్తారు అనేది మనుష్యులకు తెలియదు. స్వదర్శన చక్రధారి అని కృష్ణుడిని లేక నారాయణుడిని అంటారు. వారిరువురికీ ఉన్న సంబంధం ఏమిటో కూడా అర్థం చేయించాలి. ఈ ముగ్గురూ ఒక్కరే. వాస్తవానికి ఈ స్వదర్శన చక్రం బ్రాహ్మణులైన మీ కొరకే ఉంది. స్వదర్శన చక్రధారులుగా జ్ఞానం ద్వారా అవుతారు, అంతేకానీ స్వదర్శన చక్రం అనేది చంపడం కోసమో లేక శిరస్సు ఖండించడం కోసమో లేదు. ఇవి జ్ఞాన విషయాలు. మీ ఈ జ్ఞాన చక్రం ఎంతగా తిరుగుతుందో అంతగా మీ పాపాలు భస్మమవుతాయి. అంతేకానీ తల నరికే విషయమేదీ లేదు. చక్రం హింసాయుతమైనదేమీ కాదు. ఈ చక్రము మిమ్మల్ని అహింసాయుతులుగా తయారుచేస్తుంది. ఎక్కడి విషయాన్ని ఎక్కడకు తీసుకువెళ్ళారు. ఒక్క తండ్రి తప్ప వీటిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు.

మధురాతి మధురమైన పిల్లలైన మీకు అపారమైన సంతోషము ఉంటుంది. మనం ఒక ఆత్మ అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మొదట మీరు స్వయాన్ని ఆత్మ అన్నది కూడా మర్చిపోయారు, ఇంటిని కూడా మర్చిపోయారు. ఆత్మనైతే ఎంతైనా ఆత్మ అనే అంటారు, కానీ పరమాత్మనైతే రాయి, రప్పల్లో ఉన్నారని అనేసారు. ఆత్మల తండ్రిని ఎంతగా గ్లాని చేసారు. తండ్రి మళ్ళీ వచ్చి ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తారు. ఆత్మ విషయములో రాయి-రప్పల్లోనూ, కణ కణములోనూ ఉంది అని ఎప్పుడూ అనరు. జంతువుల విషయమే వేరు. చదువు మొదలైనవి మనుష్యులకే ఉంటాయి. మేము ఇన్ని జన్మలు ఈ-ఈ విధంగా అయ్యాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. 84 జన్మలు పూర్తి చేసారు. అంతేకానీ 84 లక్షల జన్మలంటూ ఏమీ లేదు. మనుష్యులు ఎంత అజ్ఞానాంధకారములో ఉన్నారు, అందుకే జ్ఞాన సూర్యుడు ఉదయించారు... అని అంటారు. అర్ధకల్పం ద్వాపర, కలియుగాలలో అంధకారము ఉంది, అర్ధకల్పం సత్య, త్రేతాయుగాలలో ప్రకాశము ఉంది. ఇది పగలు మరియు రాత్రి, ప్రకాశము మరియు అంధకారము యొక్క జ్ఞానం. ఇది అనంతమైన విషయం. అర్ధకల్పం అంధకారములో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నారు, ఎంతగానో భ్రమించడం జరుగుతుంది. స్కూల్లో ఏదైతే చదువుకుంటారో, దానిని భ్రమించడం అని అనరు. సత్సంగాలలో మనుష్యులు ఎంతగా భ్రమిస్తూ ఉంటారు. సంపాదన ఏమీ ఉండదు, ఇంకా నష్టమే కలుగుతూ ఉంటుంది, అందుకే దానిని భ్రమించడం అని అంటారు. భ్రమిస్తూ, భ్రమిస్తూ ధనము-సంపద మొదలైనవాటన్నింటినీ పోగొట్టుకొని నిరుపేదలుగా అయిపోయారు. ఇప్పుడు ఈ చదువులో ఎవరు ఎంతెంతగా బాగా ధారణ చేస్తారో మరియు చేయిస్తారో, అంతగా అందులో లాభమే లాభము. బ్రాహ్మణులుగా అయ్యారంటే ఇక అందులో అంతా లాభమే లాభము. బ్రాహ్మణులమైన మనమే స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు. స్వర్గవాసులుగా అయితే అందరూ అవుతారు, కానీ మీరు అందులో ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు.

ఇప్పుడు ఇది మీ అందరి వానప్రస్థావస్థ. బాబా, మమ్మల్ని వానప్రస్థములోకి లేక పవిత్ర ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అని మీరు స్వయం అంటారు, అది ఆత్మల ప్రపంచము. నిరాకారీ లోకము ఎంత చిన్ననిది. ఇక్కడైతే విహరించేందుకు ఎంత పెద్ద భూమండలం ఉంది. అక్కడ ఈ విషయం ఉండదు. శరీరమూ ఉండదు, పాత్రా ఉండదు. నక్షత్రాల వలె ఆత్మలు నిలబడి ఉన్నాయి. ఇది ప్రకృతి అద్భుతము కదా. సూర్య, చంద్ర, నక్షత్రాదులు ఆకాశములో ఎలా నిలబడి ఉన్నాయి! ఆత్మలు కూడా బ్రహ్మ తత్వములో తమ ఆధారముపై సహజసిద్ధంగా నిలిచి ఉంటాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞాన స్మరణ చేస్తూ స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ పాపాలను అంతము చేసుకోవాలి. డబల్ అహింసకులుగా అవ్వాలి.

2. మీ బుద్ధిని స్వచ్ఛముగా, పవిత్రముగా చేసుకొని రాజయోగ చదువును చదవాలి మరియు ఉన్నత పదవిని పొందాలి. మేము సత్యనారాయణుని సత్యాతి-సత్యమైన కథను విని మనుష్యుల నుండి దేవతలుగా అవుతాము అని హృదయములో సదా ఇదే సంతోషము ఉండాలి.

వరదానము:-

మనసు-బుద్ధిని ఆర్డర్ ప్రమాణంగా విధిపూర్వకంగా కార్యములో వినియోగించే నిరంతర యోగీ భవ

నిరంతర యోగిగా అనగా స్వరాజ్య అధికారిగా అయ్యేందుకు విశేష సాధనాలు మనస్సు మరియు బుద్ధి. మంత్రము కూడా మన్మనాభవ అనే ఉంది, యోగాన్ని కూడా బుద్ధియోగము అని అంటారు. కావున ఒకవేళ ఈ విశేష ఆధార స్తంభాలు మీ అధికారములో ఉన్నట్లయితే అనగా ఆర్డర్ ప్రమాణంగా ఇవి విధిపూర్వకంగా కార్యము చేసినట్లయితే, ఏ సంకల్పాన్ని ఎప్పుడు చెయ్యాలనుకుంటే అప్పుడు అలా చెయ్యగలగితే, బుద్ధిని ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టగలిగితే, రాజు అయిన మిమ్మల్ని బుద్ధి భ్రమింపజేయకపోతే, విధిపూర్వకంగా కార్యము చేస్తే, అప్పుడు నిరంతర యోగీ అని అంటారు.

స్లోగన్:-

మాస్టర్ విశ్వ శిక్షకులుగా అవ్వండి, సమయాన్ని శిక్షకునిగా చేసుకోకండి.