21-09-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి కల్ప-కల్పమూ వచ్చి పిల్లలైన
మీకు తమ పరిచయాన్ని ఇస్తారు, మీరు కూడా అందరికీ తండ్రి యొక్క యథార్థ పరిచయాన్ని
ఇవ్వాలి’’
ప్రశ్న:-
పిల్లల
యొక్క ఏ ప్రశ్నను విని తండ్రి కూడా ఆశ్చర్యపోతారు?
జవాబు:-
పిల్లలు అంటారు
- బాబా, మీ పరిచయాన్ని ఇవ్వడము చాలా కష్టము. మేము మీ పరిచయాన్ని ఎలా ఇవ్వాలి? ఈ
ప్రశ్నను విని తండ్రికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. తండ్రి మీకు తమ పరిచయాన్ని
ఇచ్చినప్పుడు మరి మీరు కూడా ఇతరులకు ఇవ్వవచ్చు, ఇందులో కష్టము అన్న మాటే లేదు, ఇది
చాలా సహజము. ఆత్మలమైన మనమందరము నిరాకారులము, కావున తప్పకుండా ఆత్మల తండ్రి కూడా
నిరాకారునిగానే ఉంటారు.
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, మేము అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నాము అని
భావిస్తారు. అనంతమైన తండ్రి ఈ రథములోకే వస్తారని కూడా పిల్లలకు తెలుసు. బాప్ దాదా
అని అన్నప్పుడు, శివబాబా ఉన్నారు మరియు వారు ఈ రథములో కూర్చున్నారు, వారు తమ
పరిచయాన్ని ఇస్తున్నారు అన్నది తెలుస్తుంది. పిల్లలకు తెలుసు - వారు బాబా, బాబా ఏ
మతాన్ని ఇస్తున్నారంటే - ఆత్మిక తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమైపోతాయి,
దానినే యోగాగ్ని అని అంటారు. ఇప్పుడు మీరు తండ్రినైతే గుర్తించారు. కావున తండ్రి
పరిచయాన్ని ఇతరులకు ఎలా ఇవ్వాలి అని ఎప్పుడైనా అనవచ్చా. మీకు కూడా అనంతమైన తండ్రి
పరిచయముంది కావున దానిని తప్పకుండా మీరు ఇవ్వగలరు కూడా. పరిచయాన్ని ఎలా ఇవ్వాలి
అన్న ప్రశ్నయే ఉత్పన్నమవ్వలేదు. ఏ విధంగా మీరు తండ్రిని తెలుసుకున్నారో, అలాగే మీరు
చెప్పవచ్చు - ఆత్మలైన మన తండ్రి ఒక్కరే అని, ఇందులో తికమకపడవలసిన విషయమేమీ లేదు.
కొంతమంది ఏమంటారంటే - బాబా, మీ పరిచయాన్ని ఇవ్వడము చాలా కష్టము. అరే, తండ్రి
పరిచయాన్ని ఇవ్వడమంటే, అందులో అసలు కష్టమనే విషయమేమీ లేదు. జంతువులు కూడా, మేము
ఫలానావారి సంతానము అని సైగలతో అర్థం చేసుకుంటాయి. అలాగే ఆత్మలైన మనకు వారు తండ్రి
అని మీకు కూడా తెలుసు. ఆత్మ అయిన మనము ఇప్పుడు ఈ శరీరములోకి ప్రవేశించాము. ఆత్మ
అకాలమూర్తి అని బాబా అర్థం చేయించారు, అలాగని దానికెటువంటి రూపమూ లేదని కాదు.
పిల్లలు గుర్తించారు - ఇది చాలా సరళమైన విషయము. ఆత్మలకు ఒక్క నిరాకారుడైన తండ్రే
ఉన్నారు. ఆత్మలైన మనమందరమూ పరస్పరం సోదరులము, తండ్రికి సంతానము. తండ్రి నుండి మనకు
వారసత్వము లభిస్తుంది. తమ తండ్రిని గురించి మరియు అతని రచనను గురించి తెలియని
పిల్లలు ఈ ప్రపంచములో ఎవరూ ఉండరని కూడా మీకు తెలుసు. తండ్రి వద్ద ఏ ఆస్తి ఉంది
అన్నదంతా తమ పిల్లలకు తెలిసి ఉంటుంది. ఇది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా. ఇది
కళ్యాణకారీ మేళా. తండ్రి కళ్యాణకారి. వారు ఎంతో కళ్యాణము చేస్తారు. తండ్రిని
గుర్తించడం ద్వారా - అనంతమైన తండ్రి నుండి మాకు అనంతమైన వారసత్వం లభిస్తుంది అని
అర్థం చేసుకుంటారు. ఆ సన్యాసులు, గురువులు ఎవరైతే ఉంటారో, వారి శిష్యులకు తమ గురువు
వారసత్వము గురించి తెలిసి ఉండదు. గురువు వద్ద ఏ ఆస్తి ఉంది అన్నది శిష్యులకు కష్టం
మీద తెలియవచ్చు. మీ బుద్ధిలో అయితే ఉంది - వీరు శివబాబా, ఆస్తి కూడా బాబా వద్ద
ఉంటుంది అని. అనంతమైన తండ్రి వద్ద విశ్వరాజ్యాధికారమైన స్వర్గము అనే ఆస్తి ఉందని
పిల్లలకు తెలుసు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు.
లౌకిక తండ్రి వద్ద ఏ ఆస్తి ఉంది అన్నది వారి పిల్లలకే తెలుస్తుంది. మేము జీవిస్తూనే
పారలౌకిక తండ్రికి చెందినవారిగా అయ్యాము అని ఇప్పుడు మీరు అంటారు. వారి నుండి ఏం
లభిస్తుంది అనేది కూడా మీకు తెలుసు. మనము మొదట శూద్రకులములో ఉండేవారము, ఇప్పుడు
బ్రాహ్మణ కులములోకి వచ్చేసాము. బాబా ఈ బ్రహ్మా తనువులోకి వస్తారని, వీరిని ప్రజాపిత
బ్రహ్మా అని అంటారని ఈ జ్ఞానం మీకు ఉంది. వారు (శివుడు) ఆత్మలందరి తండ్రి. వీరిని (ప్రజాపిత
బ్రహ్మాను) గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఇప్పుడు మనం వీరికి పిల్లలుగా
అయ్యాము. శివబాబా గురించి - వారు ఇంద్రజాలికుడు అని, అన్నీ తెలిసినవాడు అని అంటారు.
వారు ఏ విధంగా రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు అనేది కూడా ఇప్పుడు మీరు
అర్థం చేసుకున్నారు. వారు సర్వాత్మలకూ తండ్రి, వారిని నామ-రూపాలకు అతీతుడు అని అనడం
అసత్యము. వారి నామ-రూపాలు కూడా గుర్తున్నాయి. రాత్రిని కూడా జరుపుకుంటారు, జయంతి
అయితే మనుష్యులదే ఉంటుంది. శివబాబా యొక్క రాత్రి అని అంటారు. రాత్రి అని దేనిని
అంటారో పిల్లలకు తెలుసు. రాత్రివేళలో ఘోర అంధకారము వ్యాపిస్తుంది. అజ్ఞానాంధకారము
ఉంది కదా. జ్ఞాన సూర్యుడు ఉదయించడముతో అజ్ఞానాంధకారము వినాశనం అవుతుంది అని ఇప్పుడు
కూడా అంటూ ఉంటారు, కానీ దాని అర్థాన్ని ఏమాత్రమూ అర్థం చేసుకోరు. ఆ సూర్యుడు ఎవరు,
వారు ఎప్పుడు ఉదయించారు, ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తారు, జ్ఞాన
సూర్యుడిని జ్ఞానసాగరుడు అని కూడా అంటారు. అనంతమైన తండ్రి జ్ఞానసాగరుడు. సన్యాసులు,
గురువులు, పండితులు మొదలైనవారు తమను తాము శాస్త్రాల అథారిటీగా భావిస్తారు, అదంతా
భక్తి. ఎన్నో వేద-శాస్త్రాలను చదివి విద్వాంసులుగా అవుతారు. తండ్రి కూర్చొని ఆత్మిక
పిల్లలకు అర్థం చేయిస్తారు, దీనిని ఆత్మ పరమాత్మల మేళా అని అంటారు. తండ్రి ఈ
రథములోకి వచ్చి ఉన్నారని మీరు అర్థం చేసుకున్నారు. ఈ మిలనమునే మేళా అని అంటారు. మనం
ఎప్పుడైతే ఇంటికి వెళ్తామో, అప్పుడు అది కూడా ఒక మేళాయే. ఇక్కడ స్వయంగా తండ్రే
కూర్చుని చదివిస్తారు. వారు తండ్రి కూడా, టీచర్ కూడా. ఈ ఒక్క పాయింటును బాగా ధారణ
చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు తండ్రి అయితే నిరాకారుడు, వారికి తమ శరీరము లేదు
కావున తప్పకుండా దానిని తీసుకోవలసి ఉంటుంది. అందుకే వారు స్వయం అంటారు, నేను ప్రకృతి
యొక్క ఆధారాన్ని తీసుకుంటాను, లేకపోతే నేను ఎలా మాట్లాడగలను? శరీరము లేకుండానైతే
మాట్లాడడం సాధ్యం కాదు. కావున తండ్రి ఈ తనువులోకి వస్తారు, ఇతనికి బ్రహ్మా అన్న
పేరును పెట్టారు. మనం కూడా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము కావున పేరు
తప్పకుండా మారాలి. మీకు కొత్త పేర్లు పెట్టారు కానీ వారిలో కూడా ఇప్పుడు చూసుకుంటే
కొంతమంది లేనే లేరు, అందుకే బ్రాహ్మణుల మాల ఉండదు. భక్త మాల మరియు రుద్ర మాల మహిమ
చేయబడ్డాయి. బ్రాహ్మణుల మాల ఉండదు. విష్ణు మాల అయితే ప్రాచుర్యంలో ఉంది.
సూక్ష్మవతనంలో విష్ణువును 4 భుజాలు కలవారిగా చూపించారు. 2 భుజాలు లక్ష్మివి, 2
భుజాలు నారాయణుడివి.
తండ్రి అర్థం చేయిస్తారు, నేను చాకలివాడిని, నేను యోగబలముతో ఆత్మలైన మిమ్మల్ని
శుద్ధముగా తయారుచేస్తాను, అయినా కూడా మీరు వికారాలలోకి వెళ్ళి మీ అలంకరణనే పాడు
చేసుకుంటారు. తండ్రి అందరినీ శుద్ధముగా చేసేందుకే వస్తారు. వారు వచ్చి ఆత్మలకు
నేర్పిస్తారు కావున ఆ నేర్పించేవారు తప్పకుండా ఇక్కడే కావాలి కదా. మీరు వచ్చి
మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా. వస్త్రాలు కూడా మురికిపట్టిపోతే
వాటిని ఉతికి శుభ్రం చేయడం జరుగుతుంది. ఓ పతిత పావన బాబా, మీరు వచ్చి మమ్మల్ని
పావనంగా చేయండి అని మీరు కూడా పిలుస్తారు. ఆత్మ పావనంగా అయితే శరీరము కూడా పావనమైనదే
లభిస్తుంది. మొట్టమొదటి ముఖ్యమైన విషయము తండ్రి పరిచయాన్ని ఇవ్వడము. తండ్రి
పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అన్న ప్రశ్ననే అడగలేరు. మీకు కూడా తండ్రి తమ పరిచయాన్ని
ఇచ్చారు కావుననే మీరు వచ్చారు కదా. మీరు తండ్రి వద్దకు వస్తారు, తండ్రి ఎక్కడ
ఉన్నారు? ఈ రథములో. ఇది అకాల సింహాసనము. ఆత్మలైన మీరు కూడా అకాలమూర్తులే. ఇవన్నీ (శరీరాలు)
మీ సింహాసనాలు, వీటిపై ఆత్మలైన మీరు విరాజమానమై ఉన్నారు. అక్కడ వారు చూపించిన అకాల
సింహాసనము జడమైనది కదా. మీకు తెలుసు - నేను అకాలమూర్తిని అనగా నిరాకారుడిని, నాకు
సాకార రూపమంటూ ఏదీ లేదు. ఆత్మనైన నేను అవినాశీని, నేనెప్పుడూ వినాశనమవ్వను. నేను ఒక
శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను. ఆత్మనైన నా పాత్ర అవినాశీగా నిశ్చితమై
ఉంది. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా మన పాత్ర ఇలాగే ప్రారంభమయ్యింది. 1-1 కాలము
నుండి పాత్రను అభినయించేందుకు మనం ఇక్కడకు ఇంటి నుండి వచ్చాము. ఇది 5000 సంవత్సరాల
చక్రము. వారైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు, అందుకే ఈ కొన్ని సంవత్సరాల విషయము
వారి ఆలోచనలోకి రాదు. మేము తండ్రి పరిచయాన్ని ఎవరికైనా ఎలా ఇవ్వాలి అని పిల్లలు
ఎప్పుడూ ఇలా అనకూడదు. ఇటువంటి ప్రశ్నలను అడిగితే ఆశ్చర్యమనిపిస్తుంది. అరే, మీరు
తండ్రికి చెందినవారిగా అయ్యారు, మరి తండ్రి పరిచయాన్ని ఎందుకు ఇవ్వలేరు! మనమందరమూ
ఆత్మలము, వారు మన బాబా. వారు సర్వుల సద్గతిని చేస్తారు. వారు సద్గతిని ఎప్పుడు
చేస్తారు అన్నది కూడా మీకు ఇప్పుడు తెలిసింది. కల్ప-కల్పము, కల్పము యొక్క
సంగమయుగములో వచ్చి సర్వుల సద్గతినీ చేస్తారు. వారైతే, ఇప్పుడింకా 40 సంవత్సరాలు ఉంది
అని భావిస్తారు మరియు వారు నామ-రూపాలకు అతీతుడు అని ముందే అనేస్తారు. వాస్తవానికి
నామ-రూపాలకు అతీతమైన వస్తువంటూ ఏదైనా ఉంటుందా. రాయి-రప్పలకు కూడా పేర్లయితే ఉన్నాయి
కదా. తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు.
ఎంతమంది పిల్లలు ఉన్నారో తండ్రికి కూడా తెలుసు. పిల్లలు ఇప్పుడు హద్దు నుండి మరియు
అనంతము నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. వారు పిల్లలందరినీ చూస్తారు, వీరందరినీ నేను
తీసుకువెళ్ళేందుకు వచ్చాను అన్నది వారికి తెలుసు. సత్యయుగములోనైతే చాలా కొద్దిమందే
ఉంటారు. ఇది ఎంత స్పష్టంగా ఉంది, అందుకే చిత్రాలపై అర్థం చేయించడం జరుగుతుంది.
జ్ఞానమైతే చాలా సహజమైనది. ఇకపోతే స్మృతియాత్రలో సమయం పడుతుంది. ఇటువంటి తండ్రినైతే
ఎప్పుడూ మర్చిపోకూడదు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పావనంగా
అయిపోతారు. నేను పతితులను పావనంగా తయారుచేసేందుకే వస్తాను. అకాలమూర్తులైన ఆత్మలైన
మీరందరూ మీ-మీ సింహాసనాలపై విరాజమానమై ఉన్నారు. బాబా కూడా ఈ సింహాసనాన్ని అద్దెకు
తీసుకున్నారు. ఈ భాగ్యశాలీ రథములో తండ్రి ప్రవేశిస్తారు. కొందరు పరమాత్మకు
నామ-రూపాలు లేవు అని అంటారు, కానీ అది అసలు అసంభవం. వారిని పిలుస్తారు, మహిమ
చేస్తారు, అంటే తప్పకుండా వారు ఎవరో ఉన్నారు కదా. తమోప్రధానంగా ఉన్న కారణంగా ఏమీ
అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తారు - మధురాతి మధురమైన పిల్లలూ, 84 లక్షల
యోనులంటూ ఏవీ ఉండవు, ఉన్నవే 84 జన్మలు. పునర్జన్మలు కూడా అందరికీ ఉంటాయి.
బ్రహ్మములోకి వెళ్ళి లీనమవ్వడం లేక మోక్షాన్ని పొందడమనేదైతే జరగదు. ఇది
తయారై-తయారుచేయబడిన డ్రామా. ఒక్కరు కూడా తక్కువ, ఎక్కువ అవ్వరు. ఈ అనాది, అవినాశీ
డ్రామా నుండే మళ్ళీ చిన్న-చిన్న డ్రామాలను లేక నాటకాలను తయారుచేస్తారు. అవి వినాశీ
అయినవి. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతములో ఉన్నారు. మనము ఏ విధంగా 84 జన్మలు
తీసుకున్నాము అన్న జ్ఞానము పిల్లలైన మీకు లభించి ఉంది. ఇప్పుడు తండ్రి తెలియజేశారు,
ఇది ఇంతకుముందు ఎవరికీ తెలియదు. మాకు తెలియదు అని ఋషులు, మునులు కూడా అనేవారు.
తండ్రి ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు సంగమయుగములోనే వస్తారు. బ్రహ్మా ద్వారా
కొత్త ప్రపంచ స్థాపనను మళ్ళీ చేస్తారు. వారైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు, అలా
అయితే ఏ విషయము గుర్తు కూడా రాదు. మహాప్రళయము కూడా ఏమీ జరగదు. తండ్రి రాజయోగాన్ని
నేర్పిస్తారు, మళ్ళీ రాజ్యాన్ని మీరు పొందుతారు. ఇందులో సంశయం యొక్క విషయమేమీ లేదు.
మొదటి నంబరులో అందరికన్నా ప్రియమైనవారు తండ్రి అని, ఆ తర్వాత నెక్స్ట్ ప్రియమైనవారు
శ్రీకృష్ణుడని పిల్లలైన మీకు తెలుసు. శ్రీకృష్ణుడు స్వర్గము యొక్క మొదటి యువరాజు అని,
వారు నంబర్ వన్ అని మీకు తెలుసు. వారే మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు. వారి యొక్క
అంతిమ జన్మలోనే నేను ప్రవేశిస్తాను. ఇప్పుడు మీరు పతితుల నుండి పావనులుగా అవ్వాలి.
పతిత-పావనుడు తండ్రే, నీటి నదులు పావనంగా చేయలేవు. ఈ నదులైతే సత్యయుగములో కూడా
ఉంటాయి. అక్కడైతే నీరు ఎంతో శుద్ధంగా ఉంటుంది, చెత్త మొదలైనదేమీ ఉండదు. ఇక్కడైతే
ఎంత చెత్త పడుతూ ఉంటుంది. బాబా అదంతా చూసారు, ఆ సమయములోనైతే జ్ఞానము లేదు. నీరు ఎలా
పావనంగా చేయగలదు అని ఇప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంది.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, తండ్రిని ఎలా స్మృతి చేయాలి అని
ఎప్పుడూ తికమకపడకండి. అరే, మీరు తండ్రిని స్మృతి చేయలేరా! అక్కడ వారు గర్భం ద్వారా
జన్మ తీసుకున్న సంతానము, మీరు దత్తత తీసుకోబడ్డ పిల్లలు. దత్తత తీసుకోబడ్డ పిల్లలకు
ఏ తండ్రి నుండైతే ఆస్తి లభిస్తుందో, ఆ తండ్రిని మర్చిపోగలరా? అనంతమైన తండ్రి నుండి
అనంతమైన ఆస్తి లభిస్తుంది కావున వారిని మర్చిపోకూడదు. లౌకిక పిల్లలు తమ తండ్రిని
ఏమైనా మర్చిపోతారా. కానీ ఇక్కడ మాయ అపోజిషన్ జరుగుతుంది, మాయ యుద్ధం నడుస్తుంది.
మొత్తం ప్రపంచమంతా కర్మక్షేత్రము. ఆత్మ ఈ శరీరములో ప్రవేశించి ఇక్కడ కర్మలు
చేస్తుంది. తండ్రి కర్మ-అకర్మ-వికర్మల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇక్కడ రావణ
రాజ్యములో కర్మలు వికర్మలుగా అయిపోతాయి. అక్కడ అసలు రావణ రాజ్యమే ఉండదు కావున కర్మలు
అకర్మలుగా అవుతాయి, వికర్మలేవీ జరగనే జరగవు. ఇది చాలా సహజమైన విషయము. ఇక్కడ రావణ
రాజ్యములో కర్మలు వికర్మలుగా అవుతాయి, అందుకే వికర్మల శిక్షను అనుభవించవలసి వస్తుంది.
రావణుడిని అనాది అని అంటారా. అలా అనరు. అర్ధకల్పము రావణ రాజ్యము, అర్ధకల్పము రామ
రాజ్యము. మీరు దేవతలుగా ఉన్నప్పుడు మీ కర్మలు అకర్మలుగా ఉండేవి. ఇప్పుడు ఇది జ్ఞానము.
మీరు పిల్లలుగా అయ్యారు కావున చదువును కూడా చదవాలి. అంతే, ఇక ఇంకే వ్యాపారాలు
మొదలైనవాటి ఆలోచన కూడా రాకూడదు. కానీ గృహస్థ వ్యవహారములో ఉంటూ వ్యాపారాలు మొదలైనవి
కూడా చేసేవారు ఉన్నారు కావున తండ్రి అంటారు, కమల పుష్ప సమానంగా ఉండండి. మీరు ఇటువంటి
దేవతలుగా అవ్వనున్నారు. ఆ గుర్తులను విష్ణువుకు ఇచ్చేసారు ఎందుకంటే అవి మీకు
శోభించవు, అవి వారికే శోభిస్తాయి. వారే విష్ణువు రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులుగా
అవ్వనున్నారు. అది అహింసా పరమో దేవీ-దేవతా ధర్మము. అక్కడ వికారాల కామ ఖడ్గము ఉండదు,
అలాగే కొట్లాటలు, గొడవలు మొదలైనవేవీ జరగవు. మీరు డబుల్ అహింసకులుగా అవుతారు. మీరు
సత్యయుగానికి యజమానులుగా ఉండేవారు. దాని పేరే గోల్డెన్ ఏజ్, బంగారు ప్రపంచము. ఆత్మ
మరియు శరీరము, రెండూ కాంచనంగా అవుతాయి. కాంచన కాయను ఎవరు తయారుచేస్తారు? తండ్రి.
ఇప్పుడు ఇది ఇనుపయుగం కదా. సత్యయుగం గతించిపోయింది అని ఇప్పుడు మీరు అంటారు. నిన్న
సత్యయుగము ఉండేది కదా, మీరు రాజ్యము చేసేవారు. మీరు జ్ఞాన స్వరూపులుగా అవుతూ ఉంటారు.
అందరూ ఒకేలా అవ్వరు కదా. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఆత్మనైన నేను అకాల సింహాసనాధికారిని, ఈ స్మృతిలో ఉండాలి, హద్దు మరియు అనంతము
నుండి అతీతంగా వెళ్ళాలి, అందుకే హద్దులలో బుద్ధిని చిక్కుకోనివ్వకూడదు.
2. అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఆస్తి లభిస్తుంది, ఈ నషాలో ఉండాలి.
కర్మ-ఆకర్మ-వికర్మల గతిని తెలుసుకుని వికర్మల నుండి రక్షించుకోవాలి. చదువుకునే
సమయములో వ్యాపారాలు మొదలైనవాటి నుండి బుద్ధిని తొలగించివేయాలి.
వరదానము:-
శ్రీమతము అనే కళ్ళెమును టైట్ చేసి మనసును వశము చేసుకునే
బాలక్ సో మాలిక్ భవ
ప్రపంచములోని వారు ఏమంటారంటే - మనసు అనేది గుర్రం వంటిది,
అది చాలా వేగంగా పరుగెత్తుతుంది అని. కానీ మీ మనసు ఇటూ-అటూ పరుగెత్తలేదు ఎందుకంటే
శ్రీమతము అనే కళ్ళెము దృఢంగా ఉంది. ఎప్పుడైతే మనసు-బుద్ధి ప్రక్క దృశ్యాలను చూడటములో
నిమగ్నమైపోతాయో అప్పుడు కళ్ళెము ఢీలా అవ్వడం వలన మనసు చంచలమవుతుంది, అందుకే
ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగితే, మనసు చంచలమైతే, శ్రీమతమనే కళ్ళెమును టైట్ చేయండి,
అప్పుడు గమ్యానికి చేరుకుంటారు. నేను బాలక్ సో మాలిక్ - ఈ స్మృతితో అధికారులుగా
అయ్యి మనసును మీ వశములో ఉంచుకోండి.
స్లోగన్:-
ఏదైతే జరుగుతూ ఉందో, అది
కూడా మంచిది మరియు ఏదైతే జరగనున్నదో అది ఇంకా మంచిది అని సదా నిశ్చయము ఉన్నట్లయితే
అచంచలంగా-స్థిరంగా ఉంటారు.
| | |