21-12-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సత్యమైన సంపాదన చేసుకునే పురుషార్థాన్ని మొదట స్వయం చెయ్యండి, ఆ తర్వాత మీ మిత్ర-సంబంధీకులతో కూడా చేయించండి, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ (దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది)’’

ప్రశ్న:-
సుఖ-శాంతులను ప్రాప్తి చేసుకునే విధి ఏమిటి?

జవాబు:-
పవిత్రత. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో, అక్కడ సుఖ-శాంతులు ఉంటాయి. తండ్రి పవిత్ర ప్రపంచమైన సత్యయుగాన్ని స్థాపన చేస్తారు, అక్కడ వికారాలు ఉండవు. దేవతల పూజారులు ఎవరైతే ఉంటారో, వారు ఎప్పుడూ - వికారాలు లేకుండా ప్రపంచము ఎలా నడుస్తుంది అన్న ప్రశ్నను అడగలేరు. ఇప్పుడు మీరు శాంతిమయమైన ప్రపంచములోకి వెళ్ళాలి, అందుకే ఈ పతిత ప్రపంచాన్ని మర్చిపోవాలి, శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యాలి.

ఓంశాంతి
ఓంశాంతి అర్థమైతే పిల్లలకు అర్థం చేయించబడింది. శివబాబా కూడా ఓంశాంతి అని అనవచ్చు, అలాగే సాలిగ్రామాలైన పిల్లలు కూడా అనవచ్చు. ఆత్మ ఓంశాంతి అని అంటుంది. ఆత్మ సైలెన్స్ ఫాదర్ కు పుత్రుడు. శాంతి కొరకు అడవులు మొదలైన చోట్లకు వెళ్ళి ఉపాయాలు ఆలోచించవలసిన అవసరము లేదు. వాస్తవానికి ఆత్మయే సైలెన్స్. ఇంకే ఉపాయాలు ఆలోచించాలి? ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఎక్కడైతే సుఖ-శాంతులు పొందుతామో, అక్కడకు తీసుకువెళ్ళండి అని ఆ తండ్రినే అడుగుతారు. శాంతిని మరియు సుఖాన్ని మనుష్యులందరూ కోరుకుంటారు. కానీ సుఖము మరియు శాంతికంటే ముందు కావలసినది పవిత్రత. పవిత్రులను పావనులని, అపవిత్రులను పతితులని అంటారు. పతిత ప్రపంచము వారు పిలుస్తూ ఉంటారు - మీరు వచ్చి మమ్మల్ని పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అని. వారు ఉన్నదే పతిత ప్రపంచము నుండి విముక్తులుగా చేసి పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళేవారు. సత్యయుగములో పవిత్రత ఉంది, కలియుగములో అపవిత్రత ఉంది. అది నిర్వికారీ ప్రపంచము, ఇది వికారీ ప్రపంచము. ప్రపంచము వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నదైతే పిల్లలకు తెలుసు. సత్యయుగము నిర్వికారీ ప్రపంచము కావున మనుష్యులు తప్పకుండా కొద్దిమందే ఉంటారు. ఆ కొద్దిమంది ఎవరు ఉంటారు? తప్పకుండా సత్యయుగములో దేవీ-దేవతల రాజ్యమే ఉంటుంది, దానినే శాంతిమయ ప్రపంచము మరియు సుఖధామము అని అంటారు. ఇది దుఃఖధామము. దుఃఖధామాన్ని మార్చి సుఖధామాన్ని తయారుచేసేది ఒక్క పరమపిత పరమాత్మయే. సుఖ వారసత్వాన్ని తప్పకుండా తండ్రే ఇస్తారు. ఇప్పుడు ఆ తండ్రి చెప్తున్నారు - దుఃఖధామాన్ని మర్చిపోండి, శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యండి, దీనినే మన్మనాభవ అని అంటారు. తండ్రి వచ్చి పిల్లలకు సుఖధామాన్ని సాక్షాత్కారము చేయిస్తారు. దుఃఖధామాన్ని వినాశనము చేయించి శాంతిధామానికి తీసుకువెళ్తారు. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి. 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ఎవరైతే మొదట సుఖధామములోకి వస్తారో, వారికి 84 జన్మలు ఉంటాయి. కేవలం ఈ కొన్ని విషయాలను గుర్తుంచుకున్నా సరే పిల్లలు సుఖధామానికి అధిపతులుగా అవ్వగలరు.

తండ్రి అంటారు - పిల్లలూ, శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి మరియు వారసత్వాన్ని అనగా సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు కావున స్వయాన్ని శాంతిధామానికి, బ్రహ్మాండానికి యజమానులుగా భావించండి. నడుస్తూ, తిరుగుతూ స్వయాన్ని అక్కడి వాసులుగా భావించినట్లయితే ఈ ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు. సత్యయుగము సుఖధామము కానీ అందరూ అయితే సత్యయుగములోకి రాలేరు. దేవతల పూజారులెవరైతే ఉంటారో, వారే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. ఇది సత్యమైన సంపాదన, దీనిని సత్యమైన తండ్రి నేర్పిస్తారు. మిగిలినవన్నీ అసత్యమైన సంపాదనలు. అవినాశీ జ్ఞాన రత్నాల సంపాదనయే సత్యమైన సంపాదన అనబడుతుంది, మిగిలిన ధన-సంపదలన్నీ అసత్యమైన సంపాదనలు. ద్వాపరము నుండి మొదలుకుని ఆ అసత్యమైన సంపాదనే చేస్తూ వచ్చారు. ఈ అవినాశీ సత్యమైన సంపాదనకు చెందిన ప్రారబ్ధము సత్యయుగము నుండి ప్రారంభమై త్రేతాలో పూర్తవుతుంది అనగా అర్ధకల్పము అనుభవిస్తారు. ఆ తర్వాత అసత్యమైన సంపాదన ప్రారంభమవుతుంది, దానితో అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖము లభిస్తుంది. ఈ అవినాశీ జ్ఞాన రత్నాలను జ్ఞానసాగరుడే ఇస్తారు. సత్యమైన సంపాదన సత్యమైన తండ్రి చేయిస్తారు. భారత్ సత్యఖండముగా ఉండేది, భారత్ యే ఇప్పుడు అసత్యఖండముగా తయారయ్యింది. ఇతర ఖండాలను సత్యఖండము మరియు అసత్యఖండము అని అనరు. సత్యఖండాన్ని తయారుచేసే చక్రవర్తి, సత్యమైనవారు వారే. సత్యమైనవారు ఒక్క గాడ్ ఫాదరే, మిగిలినవారంతా అసత్యమైన తండ్రులే. సత్యయుగములో కూడా సత్యమైన తండ్రులు లభిస్తారు ఎందుకంటే అక్కడ అసత్యము, పాపము ఉండదు. ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము, అది పుణ్యాత్ముల ప్రపంచము. కావున ఇప్పుడు ఈ సత్యమైన సంపాదన కొరకు ఎంత పురుషార్థము చెయ్యాలి. ఎవరైతే కల్పపూర్వము సంపాదన చేసుకున్నారో, వారే చేస్తారు. ముందు స్వయం ఈ సత్యమైన సంపాదన చేసుకుని, ఆ తర్వాత పుట్టింటివారి చేత, అత్తవారింటివారి చేత ఈ సత్యమైన సంపాదనను చేయించాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. (దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది)

సర్వవ్యాపి జ్ఞానము వారు భక్తి చేయలేరు. అందరూ భగవంతుని రూపాలే అయితే ఇక ఎవరికి భక్తి చేస్తారు? ఈ ఊబి నుండి బయటకు తీసేందుకు కష్టపడవలసి ఉంటుంది. సన్యాసులు తమ ఇంటి నుండి దానాన్ని ఏం ప్రారంభిస్తారు? అసలు ముందుగా వారు తమ ఇంటి సమాచారాన్ని వినిపించనే వినిపించరు. ఎందుకు వినిపించరు? అని అడగండి. కనీసం తెలియాలి కదా. ఫలానా ఇంటివాడిని, తర్వాత సన్యాసాన్ని ధారణ చేసాను అని చెప్పడములో ఏముంది! మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే చెప్పగలరు. సన్యాసులకు అనుచరులైతే చాలామంది ఉంటారు. ఒకవేళ ఆ సన్యాసి భగవంతుడు ఒక్కరే అని చెప్తే అందరూ అతడిని నీకు ఈ జ్ఞానాన్ని ఎవరు వినిపించారు? అని అడుగుతారు. బ్రహ్మాకుమారీలు వినిపించారు అని చెప్తే ఇక అతని వ్యాపారమంతా సమాప్తమైపోతుంది. ఇలా ఎవరు తమ పరువుని పోగొట్టుకుంటారు? ఇక అప్పుడు ఎవరూ భోజనము కూడా పెట్టరు, అందుకే సన్యాసులకైతే ఇది చాలా కష్టము. మొదటైతే మీ మిత్ర-సంబంధీకులు మొదలైనవారికి జ్ఞానాన్నిచ్చి సత్యమైన సంపాదన చేయించవలసి ఉంటుంది, దానితో వారు 21 జన్మలు సుఖాన్ని పొందుతారు. విషయము చాలా సహజమైనది. కానీ డ్రామాలో ఇన్ని శాస్త్రాలు, మందిరాలు మొదలైనవి తయారవ్వడమనేది కూడా నిశ్చితమై ఉంది.

పతిత ప్రపంచములో ఉండేవారు - ఇప్పుడు పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అని అంటారు. సత్యయుగము గడిచి 5000 సంవత్సరాలు అయ్యింది. వారైతే కలియుగ ఆయువునే లక్షల సంవత్సరాలు అని అనేశారు కావున మనుష్యులు సుఖధామము ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉంటుంది అనేది ఎలా అర్థం చేసుకోగలరు? వారు మహాప్రళయమవుతుంది, ఆ తర్వాత సత్యయుగము వస్తుంది, మొట్టమొదట శ్రీకృష్ణుడు బొటనవేలును నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ సముద్రములో రావి ఆకుపై తేలుతూ వస్తారు అని అంటారు. వాస్తవానికి ఎక్కడి విషయాన్ని ఎక్కడకు తీసుకువెళ్ళారు! ఇప్పుడు తండ్రి అంటారు, బ్రహ్మా ద్వారా నేను అన్ని వేద-శాస్త్రాల సారాన్ని వినిపిస్తాను, అందుకే విష్ణు నాభి కమలము నుండి బ్రహ్మాను చూపిస్తారు మరియు వారి చేతిలో శాస్త్రాలను చూపించారు. ఇప్పుడు బ్రహ్మా అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు. సూక్ష్మవతనములో అయితే శాస్త్రాలు ఉండవు కదా. బ్రహ్మా ఇక్కడ ఉండాలి. లక్ష్మీ-నారాయణుల రూపమైన విష్ణువు కూడా ఇక్కడే ఉంటారు. బ్రహ్మాయే విష్ణువు అవుతారు, మళ్ళీ విష్ణువే బ్రహ్మా అవుతారు. ఇప్పుడు బ్రహ్మా నుండి విష్ణువు వెలువడుతారా లేక విష్ణువు నుండి బ్రహ్మా వెలువడుతారా? ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. కానీ ఎవరైతే బాగా చదువుకుంటారో వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు, ఎప్పటివరకైతే మీ శరీరము ఉంటుందో, అప్పటివరకూ అర్థం చేసుకుంటూనే ఉంటారు. మీరు పూర్తిగా 100 శాతం బుద్ధిహీనులుగా, నిరుపేదలుగా అయిపోయారు. మీరే వివేకవంతులైన దేవి-దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ మీరు దేవి-దేవతలుగా అవుతున్నారు. మనుష్యులైతే తయారుచేయలేరు. మీరే దేవతలుగా ఉండేవారు, తర్వాత 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ పూర్తిగా కళాహీనులుగా అయిపోయారు. మీరు సుఖధామములో చాలా శాంతిమయంగా ఉండేవారు, ఇప్పుడు అశాంతిగా ఉన్నారు. మీరు 84 జన్మల లెక్కను తెలియజేయగలరు. ఇస్లాములు, బౌద్ధులు, సిక్కులు, క్రిస్టియన్లు, మఠాలు, ఆశ్రమాలవారు అందరూ ఎన్ని జన్మలు తీసుకుంటారు? ఈ లెక్క తీయడమైతే సహజమే. స్వర్గానికి యజమానులుగా భారతవాసులే అవుతారు. అంటు కట్టబడుతుంది కదా. ఇది వివరణ. స్వయం అర్థం చేసుకుంటే అప్పుడు మొట్టమొదట తమ తల్లిదండ్రులకు, సోదరీ-సోదరులకు జ్ఞానాన్ని ఇవ్వవలసి ఉంటుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా ఉండాలి. దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది. పుట్టింటివారికి, అత్తవారింటివారికి జ్ఞానాన్ని వినిపించవలసి ఉంటుంది. వ్యాపారాలలో కూడా ముందు తమ సోదరులనే భాగస్వాములుగా చేసుకుంటారు. ఇక్కడ కూడా అలాగే. పుట్టింటినీ మరియు అత్తవారింటినీ ఉద్ధరించేవారే కన్య అని గాయనము కూడా ఉంది. అపవిత్రమైనవారైతే ఉద్ధరించలేరు. మరి ఆమె ఎటువంటి కన్య? ఈ బ్రహ్మా యొక్క కన్య, బ్రహ్మాకుమారీ ఉన్నారు కదా. ఇక్కడ అధర్ కన్యా, కుమారీ కన్య మందిరాలు కూడా తయారుచేయబడి ఉన్నాయి కదా. ఇక్కడ మీ స్మృతిచిహ్నాలు తయారుచేయబడి ఉన్నాయి. భారత్ ను స్వర్గముగా తయారుచేయడానికి మనము మళ్ళీ వచ్చాము. ఈ దిల్వాడా మందిరము పూర్తిగా ఏక్యురేట్ గా ఉంది, పైన స్వర్గాన్ని చూపించారు. వాస్తవానికి స్వర్గము ఇక్కడే ఉంటుంది. రాజయోగ తపస్య కూడా ఇక్కడే జరుగుతుంది. అది ఎవరి మందిరమో, వారు ఇది తెలుసుకోవాలి కదా! ఇప్పుడు లోపల జగత్పిత, జగదంబ, ఆదిదేవ్, ఆదిదేవి కూర్చున్నారు. అచ్ఛా, ఆదిదేవ్ ఎవరి సంతానము? శివబాబా సంతానము. అధర్ కుమారీ, కుమారీ కన్యా అందరూ రాజయోగములో కూర్చున్నారు. తండ్రి అంటారు - మన్మనాభవ, అప్పుడు మీరు వైకుంఠానికి యజమానులుగా అవుతారు. ముక్తి, జీవన్ముక్తిధామాన్ని స్మృతి చెయ్యండి. ఇది మీ సన్యాసము, జైనుల సన్యాసము ఎంత కష్టముగా ఉంటుంది. వెంట్రుకలను తొలగించేందుకు ఎంత కఠినమైన ఆచారముంది. ఇక్కడ ఉన్నది సహజ రాజయోగము. అది కూడా ప్రవృత్తి మార్గానిది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరో ఒక జైన ముని కూర్చుని తన కొత్త ధర్మాన్ని స్థాపన చేసారు కానీ దానిని ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అనైతే అనరు కదా. అది ఇప్పుడు కనుమరుగైపోయింది. ఎవరో జైన ధర్మాన్ని నడిపించి వెళ్ళిపోయారు. ఇది కూడా డ్రామాలో ఉంది. ఆదిదేవ్ ను పిత అని మరియు జగదంబను మాత అని అంటారు. ఆదిదేవుడు బ్రహ్మా అనైతే అందరికీ తెలుసు. ఆదమ్-బీబీ, ఆడమ్-ఈవ్ అని కూడా అంటారు. ఆ ఆడమ్-ఈవ్ ఇప్పుడు తపస్య చేస్తున్నారని క్రిస్టియన్లకు ఏమైనా తెలుసా. మనుష్య సృష్టి వంశవృక్షానికి వీరు ముఖ్యులు. ఈ రహస్యాన్ని కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. శివునికి మరియు లక్ష్మి-నారాయణులకు ఇన్ని మందిరాలు తయారయ్యాయంటే వారి చరిత్రను గురించి తెలుసుకోవాలి కదా! ఇది కూడా జ్ఞాన సాగరుడైన తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. పరమపిత పరమాత్ముడినే నాలెడ్జ్ ఫుల్, జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు అని అంటారు. ఈ పరమాత్ముని మహిమ గురించి సాధు-సన్యాసులు మొదలైనవారికి తెలియదు. వారు పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు, మరి మహిమ ఎవరిని చెయ్యాలి? పరమాత్మ గురించి తెలియని కారణముగానే స్వయాన్ని శివోహం అని అనుకుంటారు. లేకుంటే పరమాత్ముని మహిమ ఎంత ఉన్నతమైనది. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు. ముసల్మానులు కూడా - మమ్మల్ని ఖుదా పుట్టించారని అంటారు, కావున మనము వారి రచన. రచన రచనకు వారసత్వాన్ని ఇవ్వలేరు. రచనకు రచయిత ద్వారా వారసత్వము లభిస్తుంది, ఈ విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఆ బీజరూపుడు సత్యమైనవారు, చైతన్యమైనవారు, సృష్టి ఆదిమధ్యాంతాల గురించి వారికి జ్ఞానము ఉంది. బీజరూపుడిలో తప్ప ఆదిమధ్యాంతాల జ్ఞానము మనుష్యమాత్రులెవ్వరిలోనూ ఉండదు. బీజము చైతన్యమైనవారు కావున తప్పకుండా జ్ఞానము వారిలోనే ఉంటుంది. వారే వచ్చి మీకు సృష్టి అంతటి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. ఈ చక్రాన్ని తెలుసుకోవడము ద్వారా మీరు సత్యయుగ చక్రవర్తి రాజులుగా లేక స్వర్గ రాజులుగా తయారవుతారు అన్న బోర్డును కూడా పెట్టాలి. ఎంత సహజమైన విషయము. తండ్రి అంటారు, ఎప్పటివరకైతే జీవించేది ఉందో అప్పటివరకూ నన్ను స్మృతి చెయ్యాలి. నేను స్వయమే మీకు ఈ వశీకరణ మంత్రాన్ని ఇస్తాను. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఈ స్వదర్శన చక్రము తిరుగుతూ ఉంటే మాయ శిరస్సు ఖండితమైపోతుంది. నేను మీ ఆత్మను పవిత్రముగా తయారుచేసి తీసుకువెళ్తాను, అప్పుడు మీరు సతోప్రధాన శరీరాన్ని తీసుకుంటారు. అక్కడ వికారాలు ఉండవు. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అని అంటారు. ఇలా చెప్పండి - మీరు బహుశా దేవతల పూజారులు కారేమో, లక్ష్మీ-నారాయణులకు సంపూర్ణ నిర్వికారులు అని మహిమను పాడుతారు. జగదంబ, జగత్పిత నిర్వికారులు. వారు రాజయోగ తపస్య చేసి పతితుల నుండి పావనులుగా, స్వర్గాధిపతులుగా అయ్యారు. తపస్య చేసేదే పుణ్యాత్ములుగా అయ్యేందుకు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరిచేందుకు నడుస్తూ-తిరుగుతూ స్వయాన్ని శాంతిధామ వాసులుగా భావించాలి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తూ సత్యమైన సంపాదనను చేసుకోవాలి మరియు ఇతరుల చేత కూడా చేయించాలి.

2. రాజయోగ తపస్య చేసి స్వయాన్ని పుణ్యాత్ములుగా తయారుచేసుకోవాలి. మాయ శిరస్సును ఖండించేందుకు స్వదర్శన చక్రము సదా తిరుగుతూ ఉండాలి.

వరదానము:-

సంపన్నత ద్వారా సదా సంతుష్టతను అనుభవము చేసే సంపత్తివాన్ భవ

స్వరాజ్యము యొక్క సంపద - జ్ఞానము, గుణాలు మరియు శక్తులు. ఎవరైతే ఈ సర్వ సంపదలతో సంపన్నముగా స్వరాజ్యాధికారులుగా ఉంటారో, వారు సదా సంతుష్టులుగా ఉంటారు. వారి వద్ద అప్రాప్తి యొక్క గుర్తులు కూడా ఉండవు. హద్దు కోరికల నుండి అవిద్య - వారినే సంపత్తివంతులు అని అంటారు. వారు సదా దాతగా ఉంటారు, యాచించేవారిగా కాదు. వారు అఖండ సుఖ-శాంతిమయ స్వరాజ్యానికి అధికారులుగా ఉంటారు. ఏ రకమైన పరిస్థితి అయినా వారి అఖండ శాంతిని ఖండితము చెయ్యలేదు.

స్లోగన్:-

జ్ఞాన నేత్రము ద్వారా మూడు కాలాలను మరియు మూడు లోకాలను తెలుసుకునేవారే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్.