22-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా, ఇది చాలా బాగా తయారై ఉంది, దీని భూత, భవిష్యత్, వర్తమానాలను గురించి పిల్లలైన మీకు బాగా తెలుసు’’

ప్రశ్న:-
ఏ ఆకర్షణ ఆధారముగా ఆత్మలందరూ మీ వైపుకు ఆకర్షితులై వస్తారు?

జవాబు:-
పవిత్రత మరియు యోగము యొక్క ఆకర్షణ ఆధారముగా. దీని ద్వారానే మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. మున్ముందు తండ్రిని వెంటనే తెలుసుకుంటారు. ఇంతమంది వారసత్వాన్ని తీసుకుంటున్నారు అన్నది చూసి ఎంతోమంది వస్తారు. ఎంతగా ఆలస్యమవుతూ ఉంటుందో, అంతగా మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది.

ఓంశాంతి
ఆత్మలమైన మనము పరంధామము నుండి వస్తాము అని ఆత్మిక పిల్లలకు తెలుసు - ఇది బుద్ధిలో ఉంది కదా. ఎప్పుడైతే ఆత్మలందరూ ఇక్కడకు వచ్చేస్తారో, కేవలం కొద్దిమంది మాత్రమే అక్కడ మిగిలి ఉంటారో, అప్పుడు తండ్రి వస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. దూరదేశములో ఉండే తండ్రి అందరికన్నా చివరిలో వస్తారు. అప్పటికి కొద్దిమంది ఆత్మలే అక్కడ మిగిలి ఉంటారు. ఇప్పటికీ ఇంకా జనాభా వృద్ధి అవుతూ ఉంటుంది కదా. ఇది కూడా మీకు తెలుసు - తండ్రి గురించే ఎవరికీ తెలియదు అన్నప్పుడు మరి రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి ఎలా తెలుసుకుంటారు. ఇది అనంతమైన డ్రామా కదా. మరి డ్రామాలో నటించేవారికి ఇది తెలిసి ఉండాలి. ఏ విధముగా హద్దులోని నటులకు కూడా - ఫలానా, ఫలానా వారికి ఈ పాత్ర లభించి ఉంది అన్నది తెలుస్తుంది కదా. ఏదైతే గతించిపోతుందో దానినే మళ్ళీ చిన్న డ్రామాగా తయారుచేస్తారు. భవిష్యత్తు గురించిన డ్రామానైతే తయారుచేయలేరు. గతంలో ఏదైతే జరిగిందో, దానిని తీసుకుని మరికొన్ని కథలను కూడా రచించి డ్రామాలను తయారుచేస్తారు, వాటినే అందరికీ చూపిస్తారు. భవిష్యత్తు గురించైతే తెలియదు. తండ్రి వచ్చారని, స్థాపన జరుగుతోందని, మనము వారసత్వాన్ని పొందుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఎవరెవరైతే వస్తూ ఉంటారో వారికి మనం - దేవీ-దేవతా పదవిని పొందేందుకు మార్గాన్ని తెలియజేస్తాము. ఈ దేవతలు ఇంత ఉన్నతముగా ఎలా అయ్యారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. వాస్తవానికి ఆది సనాతనమైనది దేవీ-దేవతా ధర్మమే. తమ ధర్మాన్ని మర్చిపోతారు కావున ‘మాకైతే అన్ని ధర్మాలూ ఒక్కటే’ అని అనేస్తారు.

బాబా మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి డైరెక్షన్ల అనుసారముగానే చిత్రాలు మొదలైనవి తయారు చేయించబడతాయి. బాబా దివ్యదృష్టితో చిత్రాలను తయారు చేయించేవారు. కొందరైతే వారి బుద్ధి ద్వారా కూడా తయారుచేస్తారు. పిల్లలకు ఇది కూడా అర్థం చేయించడం జరిగింది - అందరూ పాత్రధారులైన నటులే కానీ, క్రియేటర్ మరియు డైరెక్టర్ గురించి ఎవరికీ తెలియదు, ఇది తప్పకుండా వ్రాయండి. తండ్రి ఇప్పుడు కొత్త ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచము తయారవ్వనున్నది. ఇది కూడా బుద్ధిలో ఉండాలి. పాత ప్రపంచములోకే తండ్రి వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా తయారవుతారు. యుక్తి ఎంత చక్కగా ఉందో చూడండి. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా, అయినా ఎంత బాగా తయారయ్యిందో చూడండి. తండ్రి అంటారు, మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను నిత్యము వినిపిస్తూ ఉంటాను. ఎప్పుడైతే వినాశనము ప్రారంభమవుతుందో అప్పుడు పిల్లలైన మీకు గతించిన చరిత్ర అంతా తెలిసిపోతుంది. మళ్ళీ సత్యయుగములోకి వెళ్ళిన తర్వాత గతించిన చరిత్ర ఏ మాత్రమూ గుర్తుండదు. అక్కడ ప్రాక్టికల్ గా పాత్రను అభినయిస్తూ ఉంటారు. గతాన్ని ఎవరికి వినిపిస్తారు? ఈ లక్ష్మీ-నారాయణులకు గతము గురించి ఏమాత్రమూ తెలియదు. మీ బుద్ధిలోనైతే - వినాశనమెలా అవుతుంది, రాజ్యము ఎలా తయారవుతుంది, మహళ్ళు ఎలా తయారుచేస్తారు - అంటూ భూత, భవిష్యత్, వర్తమానాలన్నీ ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ తయారవుతాయి కదా. స్వర్గము యొక్క దృశ్యాలే వేరు. పాత్రను అభినయించే కొద్ది తెలుస్తూ ఉంటుంది. దీనినే అనవసరమైన రక్తసిక్తపు ఆట అని అంటారు. అనవసరంగా నష్టం వాటిల్లుతూ ఉంటుంది. భూకంపాలు వస్తే ఎంత నష్టం జరుగుతుంది. బాంబులు విసురుతారు, అది అనవసరము కదా. ఎవరూ ఏమీ చేయరు కదా. విశాలబుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో, వారు వినాశనము తప్పకుండా జరిగింది అని అర్థం చేసుకుంటారు. తప్పకుండా కొట్లాటలు జరిగాయి. అటువంటి నాటకాలను కూడా తయారుచేస్తారు. ఇది అర్థం చేసుకోగలరు కూడా. ఏదో సమయములో ఎవరి బుద్ధికో టచ్ అవుతుంది. మీరు అయితే ప్రాక్టికల్ గా ఉన్నారు. మీరు ఆ రాజధానికి యజమానులుగా కూడా అవుతారు. ఇప్పుడు ఆ కొత్త ప్రపంచములోకి తప్పకుండా వెళ్ళాలని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, బ్రహ్మా ద్వారానైనా లేక బ్రహ్మాకుమార, కుమారీల ద్వారానైనా జ్ఞానము తీసుకుంటారో, వారు అక్కడకు వచ్చేస్తారు. ఉండేదైతే తమ ఇంట్లోనే, గృహస్థములోనే కదా. ఇంతమందిని తెలుసుకోవడం కూడా కుదరదు. సెంటర్లకు ఎంతమంది వస్తారు. అంతమంది గుర్తుండడం కుదురుతుందా. ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, వృద్ధి చెందుతూ-చెందుతూ లెక్కలేనంతమంది అయిపోతారు. ఏక్యురేట్ లెక్కను తీయలేరు. రాజుకు ఏక్యురేట్ గా తన ప్రజలెంతమంది అనేది తెలియదు. జనాభా లెక్కను తీస్తారు కానీ తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే, ఇతను కూడా విద్యార్థియే. సోదరులందరూ (ఆత్మలందరూ) ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. చిన్న పిల్లలకు కూడా బాబా, బాబా అని అనమని నేర్పిస్తారు. మున్ముందు తండ్రి గురించి వెంటనే తెలుసుకుంటారని కూడా మీకు తెలుసు. ఇంతమంది వారసత్వాన్ని తీసుకుంటున్నారు అన్నది చూసి చాలామంది వస్తారు. ఎంతగా ఆలస్యమవుతూ ఉంటుందో, అంతగా మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. పవిత్రముగా అవ్వటము వలన ఆకర్షణ కలుగుతుంది, ఎంతగా యోగములో ఉంటారో అంతగా ఆకర్షణ కలుగుతుంది, ఇతరులను కూడా ఆకర్షిస్తారు. తండ్రి కూడా ఆకర్షిస్తారు కదా. చాలా వృద్ధి చెందుతూ ఉంటారు. దాని కొరకు యుక్తులు కూడా రచింపబడుతున్నాయి. గీతా భగవానుడు ఎవరు? శ్రీకృష్ణుడిని స్మృతి చేయడమైతే చాలా సహజము, అతనిది సాకార రూపమే కదా. నన్నొక్కరినే స్మృతి చేయండి అని నిరాకార తండ్రి అంటారు, ఈ విషయముపైనే అంతా ఆధారపడి ఉంది, అందుకే బాబా అన్నారు, ఈ విషయము గురించి అందరిచేత వ్రాయిస్తూ ఉండండి. పెద్ద-పెద్ద లిస్టులు తయారుచేస్తే అప్పుడు మనుష్యులకు తెలుస్తుంది.

బ్రాహ్మణులైన మీరు ఎప్పుడైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారో, అప్పుడు వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. మాయ తుఫానులు కూడా అంతిమము వరకూ వస్తాయి. విజయము పొందిన తర్వాత ఇక పురుషార్థమూ ఉండదు, మాయా ఉండదు. స్మృతిలోనే చాలా వరకూ ఓడిపోతారు. ఎంతగా మీరు యోగములో దృఢముగా ఉంటారో, అంతగా ఓడిపోకుండా ఉంటారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. మా రాజ్యము ఉంటుంది అని పిల్లలకు నిశ్చయముంది, మరి మనము వజ్రాలను, రత్నాలను ఎక్కడి నుండి తెస్తాము, గనులన్నీ ఎక్కడి నుండి వస్తాయి. అవన్నీ ఒకప్పుడు ఉండేవి కదా. ఇందులో తికమకపడవలసిన విషయమేమీ లేదు. ఏదైతే జరగనున్నదో దానినంతా ప్రాక్టికల్ గా చూస్తారు. స్వర్గమైతే తప్పకుండా తయారవ్వనున్నది. ఎవరైతే బాగా చదువుతారో, వారికి ఈ నిశ్చయముంటుంది - మేము వెళ్ళి భవిష్యత్తులో రాకుమారులుగా అవుతాము, వజ్ర-వైఢూర్యాలతో కూడిన మహళ్ళు ఉంటాయి. ఈ నిశ్చయము కూడా సేవాధారీ పిల్లలకే ఉంటుంది. ఎవరైతే తక్కువ పదవిని పొందేవారు ఉంటారో, వారికెప్పుడూ - మేము మహళ్ళు మొదలైనవాటిని ఎలా నిర్మిస్తాము అన్న ఆలోచనలు కూడా రావు. ఎవరైతే చాలా సేవ చేస్తారో, వారే మహళ్ళలోకి వెళ్తారు కదా. దాస-దాసీలు సిద్ధముగా దొరుకుతారు. సేవాయోగ్యులైన పిల్లలకే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. మంచి సేవ చేసేవారు ఎవరెవరు ఉన్నారు, మేమైతే చదువుకున్నవారి ఎదురుగా సేవకులుగా అవ్వవలసి ఉంటుంది అన్నది పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. ఉదాహరణకు ఈ బాబా ఉన్నారు, బాబాకు ఆలోచనలు నడుస్తాయి కదా. వృద్ధుడు మరియు చిన్న బాలుడు సమానమైనవారు, అందుకే ఇతని నడవడిక కూడా చిన్న పిల్లల వలె ఉంటుంది. బాబాకైతే ఒకటే పాత్ర ఉంది - పిల్లలను చదివించడము, వారికి నేర్పించడము. విజయమాలలోని మణిగా అవ్వాలంటే పురుషార్థము కూడా చాలా ఉండాలి. చాలా మధురముగా అవ్వాలి. శ్రీమతముపై నడవవలసి ఉంటుంది, అప్పుడే ఉన్నతముగా అవుతారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. తండ్రి అంటారు, నేను ఏదైతే వినిపిస్తానో, దానిని మీరే జడ్జి చేయండి. మున్ముందు మీకు ఇంకా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. దగ్గరకు వచ్చే కొద్దీ గుర్తొస్తూ ఉంటుంది. మన రాజధానిలోకి వెళ్ళి 5000 సంవత్సరాలవుతుంది. 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు. ఏ విధంగా వాస్కోడిగామా (ఒక ప్రముఖ నావికుడు) గురించి, అతను ప్రపంచాన్ని చుట్టి వచ్చారని చెప్తారో, అలా మీరు ఈ ప్రపంచములో 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. ఆ వాస్కోడిగామా ఒక్కరే వెళ్ళారు కదా, అలా వీరు కూడా ఒక్కరే, వీరు మీకు 84 జన్మల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. రాజ్యవంశము కొనసాగుతుంది. కావున స్వయములో చూసుకోవాలి - నాలో దేహాభిమానమేమీ లేదు కదా? నిరాశ చెందడం లేదు కదా? ఎక్కడా డిస్టర్బ్ అవ్వడం లేదు కదా?

మీరు యోగబలముతో ఉంటే, శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే, మిమ్మల్ని ఎవరూ చెంపదెబ్బ కొట్టలేరు. యోగబలమే డాలు వంటిది. ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ ఎవరైనా దెబ్బలు తిన్నారంటే తప్పకుండా దేహాభిమానము ఉంది. దేహీ-అభిమానిపై ఎవ్వరూ దెబ్బ వేయలేరు. పొరపాటు తమదే ఉంటుంది. దేహీ-అభిమానిని ఎవ్వరూ ఏమీ చేయలేరని వివేకము చెప్తుంది. అందుకే దేహీ-అభిమానులుగా అయ్యేందుకు ప్రయత్నము చేయాలి. అందరికీ సందేశము కూడా ఇవ్వాలి. భగవానువాచ, మన్మనాభవ. ఏ భగవానుడు? ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. కేవలం ఈ ఒక్క విషయములోనే మీరు విజయము పొందాలి. మొత్తం ప్రపంచములోని మనుష్యుల బుద్ధిలో శ్రీకృష్ణ భగవానువాచ అని ఉంది. ఎప్పుడైతే మీరు అర్థం చేయిస్తారో, అప్పుడు మీరు చెప్తుంది కరక్టే అని అంటారు. కానీ ఎప్పుడైతే మీలా అర్థం చేసుకుంటారో, అప్పుడు - బాబా ఏదైతే నేర్పిస్తున్నారో అది కరక్టు అని అంటారు. నేను ఎలా ఉన్నానో, అలా నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు అని శ్రీకృష్ణుడు అనలేరు. శ్రీకృష్ణుడినైతే అందరూ తెలుసుకోగలరు. శ్రీకృష్ణుడి తనువు ద్వారా భగవంతుడు చెప్తారు అని కూడా కాదు. శ్రీకృష్ణుడు ఉండేదే సత్యయుగములో. అక్కడికి భగవంతుడు ఎలా వస్తారు? భగవంతుడు వచ్చేది పురుషోత్తమ సంగమయుగములో. కావున పిల్లలైన మీరు చాలామంది చేత వ్రాయిస్తూ ఉండండి. మీ వద్ద ఇటువంటి పెద్ద పుస్తకము ముద్రించబడి ఉండాలి, అందులో అందరి అభిప్రాయాలు వ్రాసి ఉండాలి. ఇక్కడ ఇంతమంది ఇలా వ్రాశారు అన్నది చూసి స్వయం కూడా వ్రాస్తారు. అప్పుడు మీ వద్ద - గీతా భగవానుడు ఎవరు? అని ఎంతోమంది ద్వారా వ్రాయబడిన అభిప్రాయాలు ఉంటాయి. ఉన్నతోన్నతమైనవారు తండ్రే, అంతేకానీ శ్రీకృష్ణుడు ఉన్నతోన్నతమైనవారు కాదు అని పైన కూడా వ్రాసి ఉండాలి. శ్రీకృష్ణుడు ‘నన్నొక్కరినే స్మృతి చేయండి’ అని చెప్పలేరు. బ్రహ్మా కంటే ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు కదా. ముఖ్యమైన విషయమే ఇది, ఇందులోనే అందరూ దివాలా తీస్తారు.

బాబా ఏమీ ఇక్కడే కూర్చోవాలి అని చెప్పరు. అలా చెప్పరు. సద్గురువును మీ వారిగా చేసుకున్న తర్వాత మీ ఇంటికి వెళ్ళి ఉండండి. ప్రారంభములో మీ భట్టీ ఉండేది. శాస్త్రాలలో కూడా భట్టీ ప్రస్తావన ఉంది కానీ భట్టీ అని దేనిని అంటారో ఎవరికీ తెలియదు. భట్టీ అనేది ఇటుకలతో ఉంటుంది. అందులో కొన్ని కాలతాయి, కొన్ని పచ్చిగా ఉండిపోతాయి. ఇక్కడ కూడా చూడండి, బంగారము లేదు, రాళ్ళు-రప్పలు ఉన్నాయి. పాత వస్తువుల పట్ల ఎంతో గౌరవము ఉంటుంది. శివబాబాకు మరియు దేవతలకు కూడా గౌరవము ఉంది కదా. సత్యయుగములో గౌరవము యొక్క ప్రస్తావనే ఉండదు. అక్కడేమీ పాత వస్తువుల కోసం వెతకరు. అక్కడ కడుపు నిండుగా ఉంటుంది. వెతకవలసిన అవసరముండదు. మీకు ఏమీ తవ్వవలసిన అవసరముండదు. ద్వాపరము తర్వాతనే తవ్వడం మొదలుపెడతారు. ఇళ్ళు కట్టేటప్పుడు ఏదైనా బయటకొస్తే, అప్పుడు కింద ఇంకేదో ఉంది అని భావిస్తారు. సత్యయుగములో మీకేమీ అవసరముండదు. అక్కడంతా బంగారమే బంగారము ఉంటుంది. ఇటుకలు కూడా బంగారమువి ఉంటాయి. కల్పపూర్వము ఏదైతే జరిగిందో, ఏదైతే నిశ్చితమై ఉందో, అదే సాక్షాత్కారమవుతుంది. ఆత్మలను పిలవడం జరుగుతుంది, అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇందులో తికమకపడవలసిన అవసరం లేదు. క్షణ-క్షణము పాత్ర నడుస్తూ ఉంటుంది, మళ్ళీ మాయమైపోతుంది. ఇది చదువు. భక్తి మార్గములో అనేక చిత్రాలు ఉన్నాయి. మీ ఈ చిత్రాలన్నీ అర్థ సహితమైనవి. అర్థం లేకుండా ఏ చిత్రమూ లేదు. ఎప్పటివరకైతే మీరు ఇతరులకు అర్థం చేయించరో అప్పటివరకు ఎవరూ అర్థం చేసుకోలేరు. అర్థం చేయిస్తున్నవారు వివేకవంతులు, జ్ఞాన సంపన్నులు అయిన తండ్రి ఒక్కరే. ఇపుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది. మీరు ఈశ్వరీయ వంశానికి, ఈశ్వరీయ కులానికి చెందినవారు. ఈశ్వరుడు వచ్చి వంశాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడు మీకు రాజ్యము ఏమీ లేదు. రాజధాని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. దేవీ-దేవతల ధర్మము కూడా తప్పకుండా ఉంది. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలు ఉన్నాయి కదా. గీత ద్వారా బ్రాహ్మణ కులము కూడా తయారవుతుంది, సూర్యవంశీ, చంద్రవంశీ కులము కూడా తయారవుతుంది. ఇంకేవీ ఉండవు. పిల్లలైన మీరు సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. పెద్ద ప్రళయం జరుగుతుందని ఇంతకుముందు భావించేవారు. ఆ తర్వాత సాగరములో రావి ఆకుపై శ్రీకృష్ణుడు వస్తారని చూపిస్తారు. మొట్టమొదటైతే శ్రీకృష్ణుడే వస్తారు కదా. కానీ సాగరములో నుండి వచ్చే విషమేమీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు చాలా బాగా అర్థమయ్యింది. ఎవరైతే ఆత్మిక చదువును బాగా చదువుతారో, సంతోషము కూడా వారికే కలుగుతుంది. ఎవరైతే బాగా చదువుతారో వారే పాస్ విత్ ఆనర్ అవుతారు. ఒకవేళ ఎవరిపైన అయినా మనస్సు ఉంటే చదువుకునే సమయములో వారే గుర్తుకొస్తూ ఉంటారు. బుద్ధి అక్కడకు వెళ్ళిపోతుంది. అందుకే చదువు ఎల్లప్పుడూ బ్రహ్మచర్యములో జరుగుతుంది. ఒక్క తండ్రివైపుకు తప్ప బుద్ధి ఇంకెక్కడికీ వెళ్ళకూడదని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. కానీ చాలామందికి పాత ప్రపంచము గుర్తుకొస్తూ ఉంటుందని తెలుసు. అప్పుడు ఇక్కడ కూర్చున్నా ఏమీ వినరు. భక్తి మార్గములో కూడా ఇలా జరుగుతుంది. సత్సంగములో కూర్చున్నా బుద్ధి ఇటూ-అటూ పరిగెడుతూ ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన, కఠినమైన పరీక్ష. కొందరైతే ఇక్కడ కూర్చున్నా సరే ఏమీ వినరు. కొందరు పిల్లలకైతే సంతోషముంటుంది. ఎదురుగా సంతోషములో ఊగుతూ ఉంటారు. బుద్ధి తండ్రితో ఉంటే అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది. దాని కోసం చాలా మంచి పురుషార్థము చేయాలి. ఇక్కడైతే మీకు చాలా ధనము లభిస్తుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. విజయమాలలోని మణులుగా అయ్యేందుకు చాలా మంచి పురుషార్థం చేయాలి, చాలా మధురముగా అవ్వాలి, శ్రీమతముపై నడవాలి.

2. యోగమే రక్షణకు డాలు వంటిది, అందుకే యోగబలాన్ని జమ చేసుకోవాలి. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు పూర్తి ప్రయత్నము చేయాలి.

వరదానము:-
‘‘విశేష’’ అనే పదము యొక్క స్మృతి ద్వారా సంపూర్ణత యొక్క గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక భవ

సదా ఇదే స్మృతి ఉండాలి - మేము విశేష ఆత్మలము, విశేష కార్యానికి నిమిత్తులము మరియు విశేషతలను చూపించేవారము. ఈ విశేష అన్న పదాన్ని విశేషముగా గుర్తుంచుకోండి - మాట్లాడడం కూడా విశేషముగా ఉండాలి, చూడడం కూడా విశేషముగా ఉండాలి, చేయడం కూడా విశేషముగా ఉండాలి, ఆలోచించడం కూడా విశేషముగా ఉండాలి... ప్రతి విషయములోనూ ఈ విశేష అన్న పదాన్ని తీసుకురావడం ద్వారా సహజముగానే స్వ పరివర్తకుల నుండి విశ్వ పరివర్తకులుగా అవుతారు మరియు సంపూర్ణతను ప్రాప్తి చేసుకోవాలి అన్న లక్ష్యమేదైతే ఉందో, ఆ గమ్యాన్ని కూడా సహజముగా ప్రాప్తి చేసుకోగలరు.

స్లోగన్:-
విఘ్నాలకు భయపడేందుకు బదులుగా వాటిని పరీక్షగా భావిస్తూ దాటి వేయండి.

మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ను ఇచ్చే సేవ చెయ్యండి

ఇప్పుడు మనసు యొక్క క్వాలిటీని పెంచుకోండి, అప్పుడు క్వాలిటీ ఆత్మలు సమీపముగా వస్తాయి. ఇందులో డబుల్ సేవ ఉంది - స్వయానిది మరియు ఇతరులది కూడా. స్వయము కొరకు వేరుగా శ్రమించాల్సిన అవసరముండదు. ప్రారబ్ధము ప్రాప్తించింది అనే స్థితి అనుభవమవుతుంది. ఈ సమయములోని శ్రేష్ఠ ప్రారబ్ధము ఏమిటంటే - ‘‘సదా స్వయం సర్వ ప్రాప్తులతో సంపన్నముగా ఉండటము మరియు అందరినీ సంపన్నంగా తయారుచెయ్యటము.’’