22-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీకు తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే వినండి, ఆసురీ విషయాలను వినకండి, మాట్లాడకండి, చెడు వినకండి, చెడు చూడకండి...’’

ప్రశ్న:-
పిల్లలైన మీకు ఏ నిశ్చయము తండ్రి ద్వారానే కలిగింది?

జవాబు:-
తండ్రి మీకు ఏమని నిశ్చయం కలిగిస్తారంటే - నేను మీ తండ్రిని కూడా, టీచర్ ను కూడా, సద్గురువును కూడా, మీరు ఈ స్మృతిలో ఉండేందుకు పురుషార్థము చేయండి. కానీ మాయ మీ చేత ఈ విషయాన్నే మరపింపజేస్తుంది. అజ్ఞాన కాలములోనైతే మాయ విషయమే ఉండదు.

ప్రశ్న:-
ఏ చార్టును పెట్టుకోవడములో విశాల బుద్ధి కావాలి?

జవాబు:-
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంత సమయము స్మృతి చేసాను - ఈ చార్టును పెట్టుకోవడములో చాలా విశాల బుద్ధి కావాలి. దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి.

ఓంశాంతి
టీచర్ వచ్చి ఉన్నారని విద్యార్థులు అర్థం చేసుకున్నారు. వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా, మరియు పరమ సద్గురువు కూడా అన్నదైతే పిల్లలకు తెలుసు. పిల్లలకు ఇది స్మృతిలో ఉంది కానీ నంబరువారు పురుషార్థానుసారముగా ఉంది. నియమము ఏం చెప్తుందంటే - వీరు టీచరు మరియు తండ్రి మరియు గురువు అని ఒక్కసారి తెలుసుకున్న తర్వాత ఇక ఎప్పుడూ ఈ విషయాన్ని మర్చిపోలేరు. కానీ ఇక్కడ మాయ మరపింపజేస్తుంది. అజ్ఞాన కాలములో మాయ ఎప్పుడూ మరపింపజేయదు. బిడ్డ ఎప్పుడూ - వీరు మా తండ్రి అని, వీరి వృత్తి ఇది అని మర్చిపోలేడు. నేను తండ్రి ఆస్తికి యజమానిని అని కొడుకులకు సంతోషము ఉంటుంది. వారు స్వయము చదువుకున్నా కానీ తండ్రి ఆస్తి అయితే లభిస్తుంది కదా. ఇక్కడ పిల్లలైన మీరు కూడా చదువుకుంటారు మరియు తండ్రి యొక్క ఆస్తి కూడా మీకు లభిస్తుంది. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. నేను తండ్రికి చెందినవాడిని అని తండ్రి ద్వారా నిశ్చయము ఏర్పడుతుంది. తండ్రియే సద్గతి యొక్క మార్గాన్ని చూపిస్తున్నారు, అందుకే వారు సద్గురువు కూడా. ఈ విషయాలను మర్చిపోకూడదు. తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే వినాలి. చెడు వినవద్దు, చెడు చూడవద్దు... అని కోతుల బొమ్మను ఏదైతే చూపిస్తారో, అది వాస్తవానికి మనుష్యుల విషయము. తండ్రి అంటారు, ఆసురీ విషయాలను మాట్లాడకండి, వినకండి, చూడకండి. చెడు వినవద్దు... పూర్వము కోతుల బొమ్మలు ఈ విధంగా తయారుచేసేవారు. ఇప్పుడు మనుష్యులవి తయారుచేస్తున్నారు. మీ వద్ద నళిని ఫోటో అలా తయారుచేసారు. కావున మీరు తండ్రిని గ్లాని చేసే విషయాలను వినకండి. తండ్రి అంటారు, నన్ను ఎంత గ్లాని చేస్తారు. శ్రీకృష్ణుడి భక్తులు ధూపాన్ని వేస్తే రాముడి భక్తులు ముక్కు మూసుకుంటారు అని మీకు తెలుసు. ఒకరి వేసిన ధూపము యొక్క సుగంధము కూడా ఇంకొకరికి నచ్చదు. వారు పరస్పరము శత్రువులు వలె అయిపోతారు. ఇప్పుడు మీరు రామ వంశీయులు. ప్రపంచములోని వారందరూ రావణ వంశీయులు. ఇక్కడ ధూపము విషయమేమీ లేదు. తండ్రిని సర్వవ్యాపి అని అనడము వలన ఏ గతి పట్టిందో మీకు తెలుసు! రాయి-రప్పలలో ఉన్నారు అని అనేటప్పటికి రాతిబుద్ధిగా అయిపోయింది. ఏ అనంతమైన తండ్రి అయితే మీకు వారసత్వాన్ని ఇస్తారో, వారిని ఎంతగా గ్లాని చేస్తారు. జ్ఞానమైతే ఎవ్వరిలోనూ లేదు. అవి జ్ఞాన రత్నాలు కావు, అవి రాళ్ళు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రి అంటారు, నేను ఎవరినో, ఎలా ఉంటానో, యథార్థ రీతిగా నా గురించి ఎవ్వరికీ తెలియదు. పిల్లల్లో కూడా నంబరువారుగా ఉన్నారు. తండ్రిని యథార్థ రీతిగా స్మృతి చేయాలి. వారు కూడా ఎంతో చిన్న బిందువు, వారిలో ఈ పాత్ర అంతా నిండి ఉంది. తండ్రిని యథార్థ రీతిగా తెలుసుకుని స్మృతి చేయాలి, స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనము పిల్లలము కానీ అలాగని తండ్రి ఆత్మ పెద్దగా, మన ఆత్మ చిన్నగా ఉంటుంది అని కాదు. అలా కాదు. తండ్రి నాలెడ్జ్ ఫుల్ అయినా కానీ, ఆత్మ ఏమీ పెద్దగా ఉండదు. మీ ఆత్మలో కూడా జ్ఞానము ఉంటుంది కానీ నంబరువారుగా ఉంటుంది. స్కూల్లో కూడా నంబరువారుగా పాస్ అవుతారు కదా. ఎవ్వరికీ సున్నా మార్కులు రావు. ఎన్నో కొన్ని మార్కులు తెచ్చుకుంటారు. తండ్రి అంటారు, నేను మీకు ఈ జ్ఞానమునేదైతే వినిపిస్తానో, అది కనుమరుగైపోతుంది. అయినా కానీ చిత్రాలు ఉన్నాయి, శాస్త్రాలు కూడా తయారుచేయబడి ఉన్నాయి. తండ్రి ఆత్మలైన మీకు చెప్తున్నారు - చెడు వినవద్దు... ఈ ఆసురీ ప్రపంచాన్ని ఏం చూడాలి. ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు ఆత్మకు ఇది పాత ప్రపంచమని స్మృతి కలిగింది. దీనితో ఏం సంబంధము పెట్టుకోవాలి. ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకూడదని ఆత్మకు స్మృతి కలిగింది. మన శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఆత్మకు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది కావున వీటిని స్మరణ చేయాలి. భక్తి మార్గములో కూడా ఉదయాన్నే లేచి మాలను జపిస్తారు. ఉదయము వేళను మంచి ముహూర్తముగా భావిస్తారు. అది బ్రాహ్మణుల ముహూర్తము. బ్రహ్మా భోజనానికి కూడా మహిమ ఉంది. ‘బ్రహ్మ భోజనము’ కాదు, అది ‘బ్రహ్మా భోజనము’. మిమ్మల్ని కూడా ‘బ్రహ్మాకుమారి’కి బదులుగా ‘బ్రహ్మకుమారి’ అని అనేస్తారు, అర్థం చేసుకోరు. బ్రహ్మా పిల్లలైతే బ్రహ్మాకుమార-కుమారీలు అవుతారు కదా. బ్రహ్మము అనేది ఒక తత్వము, అది నివసించే స్థానము, దానికేమి మహిమ ఉంటుంది. తండ్రి పిల్లలకు ఫిర్యాదు చేస్తున్నారు - పిల్లలూ, మీరు ఒక వైపేమో పూజ చేస్తారు, ఇంకొక వైపేమో అందరినీ గ్లాని చేస్తారు. గ్లాని చేస్తూ-చేస్తూ తమోప్రధానముగా అయిపోయారు. తమోప్రధానముగా కూడా అవ్వవలసిందే, చక్రము రిపీట్ అవుతుంది. ఎప్పుడైనా ఎవరైనా పెద్ద వ్యక్తులు వస్తే వారికి చక్రముపై తప్పకుండా అర్థం చేయించాలి. ఈ చక్రము 5 వేల సంవత్సరాలదే, ఈ విషయముపై చాలా అటెన్షన్ పెట్టాలి. రాత్రి తర్వాత పగలు తప్పకుండా వచ్చేదే ఉంది. రాత్రి తర్వాత పగలు రాకపోవడమనేది జరగదు. కలియుగము తర్వాత సత్యయుగము తప్పకుండా రావాలి. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళము రిపీట్ అవుతుంది.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి, ఆత్మయే అన్నీ చేస్తుంది, పాత్రను అభినయిస్తుంది. ఒకవేళ మనము పాత్రధారులమైనట్లయితే నాటకము యొక్క ఆదిమధ్యాంతాలను తప్పకుండా తెలుసుకోవాలి అన్నది ఎవ్వరికీ తెలియదు. ప్రపంచ చరిత్ర-భూగోళము రిపీట్ అవుతుందంటే మరి ఇది డ్రామా అనే కదా. ఏదైతే గతించిపోయిందో, క్షణ-క్షణమూ అదే రిపీట్ అవుతుంది. ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. తక్కువ బుద్ధి కలవారు ఎల్లప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటారు, ఇక టీచరు కూడా ఏం చేయగలరు! కృప చూపించండి లేక ఆశీర్వదించండి అని టీచరుకు ఏం చెప్తారు. ఇది కూడా చదువు. ఈ గీతా పాఠశాలలో స్వయంగా భగవంతుడు రాజయోగాన్ని నేర్పిస్తారు. కలియుగము మారి సత్యయుగముగా తప్పకుండా తయారవ్వాలి. డ్రామా అనుసారముగా తండ్రి కూడా రావాలి. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పమూ సంగమయుగములో వస్తాను. నేను సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చాను అని ఈ విధంగా ఇంకెవ్వరూ అనలేరు. వారు స్వయాన్ని శివోహం అని చెప్పుకుంటారు, దాని వలన ఏం జరిగింది. శివబాబా అయితే చదివించేందుకు, సహజ రాజయోగాన్ని నేర్పించేందుకే వస్తారు. ఏ సాధు-సన్యాసులు మొదలైనవారిని శివ భగవానుడు అని అనలేరు. నేను కృష్ణుడిని, మేము లక్ష్మీ-నారాయణులము అని చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ సత్యయుగ యువరాజు అయిన శ్రీకృష్ణుడు ఎక్కడ, ఈ కలియుగీ పతితులెక్కడ. వారిలో భగవంతుడు ఉన్నారు అని ఏమైనా అంటారా. మీరు మందిరాలలోకి వెళ్ళి ఈ విధంగా అడగవచ్చు - వీరు సత్యయుగములో రాజ్యము చేసేవారు, మరి తర్వాత ఎక్కడికి వెళ్ళారు? సత్యయుగము తర్వాత తప్పకుండా త్రేతా, ద్వాపర, కలియుగాలు వచ్చాయి. సత్యయుగములో సూర్యవంశీ రాజ్యము ఉండేది, త్రేతాయుగములో చంద్రవంశీ రాజ్యము... ఈ జ్ఞానమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇంతమంది బ్రహ్మాకుమార-కుమారీలు ఉన్నారు, మరి తప్పకుండా ప్రజాపిత కూడా ఉంటారు. బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. రచయిత అని బ్రహ్మాను అనరు. ఆ తండ్రి అయితే గాడ్ ఫాదర్. వారు ఎలా రచిస్తారు అనేది తండ్రి సమ్ముఖముగా కూర్చునే అర్థం చేయిస్తారు, ఈ శాస్త్రాలైతే తర్వాత తయారయ్యాయి. ఉదాహరణకు క్రైస్టు అర్థం చేయించినది బైబిల్ గా తయారయ్యింది. ఆ తర్వాత కూర్చుని గాయనం చేస్తారు. సర్వుల సద్గతిదాత, సర్వుల ముక్తిప్రదాత, పతిత-పావనుడు అని ఒక్క తండ్రియే మహిమ చేయబడ్డారు. వారిని - ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి అని తలచుకుంటారు. తండ్రి ఒక్కరే ఉంటారు. వారు మొత్తము విశ్వమంతటికీ తండ్రి. సర్వ దుఃఖాల నుండి ముక్తులుగా చేసేవారు ఎవరు అనేది మనుష్యులకు తెలియదు. ఇప్పుడు సృష్టి కూడా పాతదిగా ఉంది, మనుష్యులు కూడా పాతగా తమోప్రధానముగా ఉన్నారు. ఈ ప్రపంచమే ఇనుపయుగ ప్రపంచము. బంగారు యుగము ఉండేది కదా, మళ్ళీ తప్పకుండా ఉంటుంది. ఇది వినాశనమైపోతుంది, ప్రపంచ యుద్ధము జరుగుతుంది, అనేక ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఇదే ఆ సమయము. మనుష్య సృష్టి ఎంతగా వృద్ధి చెందింది.

భగవంతుడు వచ్చి ఉన్నారని మీరు అంటూ ఉంటారు. బ్రహ్మా ద్వారా ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము స్థాపన అవుతోందని పిల్లలైన మీరు అందరికీ ఛాలెంజ్ చేసి చెప్తారు. డ్రామానుసారముగా అందరూ వింటూ ఉంటారు. దైవీ గుణాలను కూడా ధారణ చేస్తారు. ఒకప్పుడు మీలో ఏ గుణాలు లేవు అని మీకు తెలుసు. నంబరు వన్ అవగుణము - కామ వికారము. అది ఎంతగా హైరానా పెడుతుంది. మాయ కుస్తీ నడుస్తుంది. వద్దనుకుంటున్నా కూడా మాయ తుఫాను పడేస్తుంది. ఇది ఇనుప యుగము కదా. నల్ల ముఖము చేసుకుంటారు. నీలమైన ముఖము అని అనరు. శ్రీకృష్ణుడిని సర్పము కాటు వేసిన కారణముగా నీలముగా అయిపోయారని చూపిస్తారు. పరువు కాపాడేందుకు నీలము అని అన్నారు. నల్ల ముఖము చూపిస్తే పరువు పోతుంది. దూరదేశము నుండి, నిరాకార దేశము నుండి యాత్రికుడు వస్తారు. ఇనుప యుగ ప్రపంచములోకి, నల్లటి శరీరములోకి వచ్చి ఇతడిని కూడా తెల్లగా తయారుచేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. ఈ జ్ఞాన విషయాలు అర్థం చేసుకోవాల్సినవి. బాబా రూప్ (యోగ స్వరూపులు) కూడా మరియు బసంత్ (జ్ఞాన స్వరూపులు) కూడా. వారు తేజోమయ బిందు స్వరూపుడు. వారిలో జ్ఞానము కూడా ఉంది. వారు నామ-రూపాలకు అతీతుడైతే కాదు. వారి రూపమేమిటి అనేది ప్రపంచానికి తెలియదు. తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు, నన్ను కూడా ఆత్మ అనే అంటారు, కాకపోతే నేను పరమ ఆత్మను. పరమ మరియు ఆత్మ, ఈ రెండు కలిపి పరమాత్మ అవుతుంది. వారు తండ్రి కూడా, టీచరు కూడా. వారిని నాలెడ్జ్ ఫుల్ అని కూడా అంటారు. నాలెడ్జ్ ఫుల్ అనగా అందరి హృదయాలలో ఏముందో తెలిసినవారు అని వాళ్ళు అనుకుంటారు. ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే ఇక అందరూ నాలెడ్జ్ ఫుల్ అయిపోతారు. మరి వారొక్కరినే నాలెడ్జ్ ఫుల్ అని ఎందుకు అంటారు? మనుష్యులది ఎంత తుచ్ఛబుద్ధి. జ్ఞాన విషయాలను ఏ మాత్రమూ అర్థం చేసుకోరు. తండ్రి కూర్చుని జ్ఞానము మరియు భక్తి యొక్క వ్యత్యాసాన్ని అర్థం చేయిస్తారు. మొదట సత్య, త్రేతాయుగాలలో జ్ఞానము అనే పగలు, ఆ తర్వాత ద్వాపర, కలియుగాలు రాత్రి. జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. ఈ రాజయోగ జ్ఞానాన్ని హఠయోగులు అర్థం చేయించలేరు. అలాగే గృహస్థులు కూడా అర్థం చేయించలేరు ఎందుకంటే వారు అపవిత్రముగా ఉంటారు. మరి ఇప్పుడు రాజయోగాన్ని ఎవరు నేర్పించాలి? నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి అని ఎవరు అంటారు. నివృత్తి మార్గపు ధర్మమే వేరు, వారు ప్రవృత్తి మార్గపు జ్ఞానాన్ని ఎలా వినిపించగలరు. గాడ్ ఫాదర్ ఈజ్ ట్రూత్ (భగవంతుడైన తండ్రి సత్యము) అని ఇక్కడ అందరూ ఉంటారు. తండ్రియే సత్యము వినిపించేవారు. ఆత్మకు తండ్రి స్మృతి కలిగింది, అందుకే - మీరు వచ్చి నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యేందుకు సత్యాతి-సత్యమైన కథను వినిపించండి అని మనము తండ్రిని స్మృతి చేస్తాము. నేను మీకు ఈ సత్యనారాయణ కథను వినిపిస్తాను కదా. ఇంతకుముందు మీరు అసత్యమైన కథలు వినేవారు. ఇప్పుడు మీరు సత్యమైన కథ వింటారు. అసత్యమైన కథలను వింటూ-వింటూ ఎవరూ నారాయణుడిగా అవ్వలేరు, మరి అది సత్యనారాయణుని కథ ఎలా అవుతుంది? మనుషులు ఎవ్వరినీ నరుడి నుండి నారాయణుడిగా తయారుచేయలేరు. తండ్రియే వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. తండ్రి రావడము కూడా భారత్ లోనే వస్తారు. కానీ ఎప్పుడు వస్తారు అనేది అర్థం చేసుకోరు. శివుడిని, శంకరుడిని కలిపేసి కథలు తయారుచేసారు. శివ పురాణము కూడా ఉంది. గీతను శ్రీకృష్ణుడు వినిపించారని అంటారు, మరి అలాగైతే శివ పురాణము ఉన్నతమైనది అయినట్లు. వాస్తవానికి జ్ఞానమైతే గీతలో ఉంది. భగవానువాచ - మన్మనాభవ. ఈ పదాలు గీతలో తప్ప ఇతర ఏ శాస్త్రాలలోనూ ఉండవు. సర్వశాస్త్రమయి శిరోమణి గీత అని గాయనము కూడా ఉంది. శ్రేష్ఠ మతము భగవంతునిదే. మరికొన్ని సంవత్సరాలలోనే కొత్త శ్రేష్ఠాచారీ ప్రపంచము స్థాపన అయిపోతుంది అని మనము చెప్తున్నాము అని మొట్టమొదట ఇది చెప్పాలి. ఇప్పుడు ఉన్నది భ్రష్టాచారీ ప్రపంచము. శ్రేష్ఠాచారీ ప్రపంచములో ఎంత తక్కువమంది మనుష్యులు ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మనుష్యులు ఉన్నారు. వారందరి కోసము వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. కోరుకోవడము కూడా తండ్రినే కోరుకుంటారు. ఎవరికైనా ధనము ఎక్కువ ఉంటే లేక పిల్లలు పుడితే భగవంతుడు ఇచ్చారు అని అంటారు. కావున భగవంతుడు ఒక్కరే అయినట్లు కదా, మరి అందరిలోనూ భగవంతుడు ఎలా ఉండగలరు? ఇప్పుడు ఆత్మలకు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. మాకు పరమాత్మ జ్ఞానమిచ్చారు, దానిని మేము సోదరులకు ఇస్తున్నాము అని ఆత్మ అంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంత సమయము స్మృతి చేసాము, ఈ చార్టు పెట్టేందుకు చాలా విశాలబుద్ధి కావాలి. దేహీ-అభిమానులై తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. జ్ఞానమైతే చాలా సహజమైనది, ఇకపోతే ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ తమ ఉన్నతిని చేసుకోవాలి. ఈ చార్టును ఎవరో అరుదుగా పెట్టుకుంటారు. దేహీ-అభిమానులై తండ్రి స్మృతిలో ఉండడము ద్వారా ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. తండ్రి సుఖాన్ని ఇచ్చేందుకే వస్తారు కావున పిల్లలు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. తండ్రి స్మృతితో అన్ని భూతాలు పారిపోతాయి, ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ ఆసురీ ఛీ-ఛీ ప్రపంచము నుండి మీ కళ్ళు మూసుకోవాలి. ఇది పాత ప్రపంచము, దీనితో ఎటువంటి కనెక్షన్ పెట్టుకోకూడదు, దీనిని చూస్తూ కూడా చూడకూడదు.

2. ఈ అనంతమైన డ్రామాలో మనము పాత్రధారులము, ఇది క్షణ-క్షణము రిపీట్ అవుతూ ఉంటుంది, ఏదైతే గతించిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది... ఇది స్మృతిలో ఉంచుకుని ప్రతి విషయములోనూ పాస్ అవ్వాలి. విశాలబుద్ధి కలవారిగా అవ్వాలి.

వరదానము:-
రియాలిటీ (వాస్తవికత) ద్వారా రాయల్టీ (హుందాతనము) యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూపించే సాక్షాత్కారమూర్త భవ

ఇప్పుడు ఎటువంటి సమయము వస్తుందంటే - ప్రతి ఆత్మ ప్రత్యక్ష రూపములో తన రియాలిటీ ద్వారా రాయల్టీని సాక్షాత్కారము చేయిస్తుంది. ప్రత్యక్షత సమయములో మాలలోని మణిపూస యొక్క నంబరు మరియు భవిష్య రాజ్య స్వరూపము, రెండూ ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు రేస్ చేస్తూ-చేస్తూ కొద్దిగా ఈర్ష్య అనే ధూళి యొక్క పరదా మెరుస్తున్న వజ్రాలను దాచేస్తుంది, అంతిమములో ఈ పరదా తొలగిపోతుంది, అప్పుడు దాగి ఉన్న వజ్రాలు తమ ప్రత్యక్ష సంపన్న స్వరూపములోకి వస్తాయి, రాయల్ కుటుంబంవారు ఇప్పటి నుండే తమ రాయల్టీని చూపిస్తారు అనగా తమ భవిష్య పదవిని స్పష్టము చేస్తారు, అందుకే రియాలిటీ ద్వారా రాయల్టీని సాక్షాత్కారము చేయించండి.

స్లోగన్:-
ఏ విధి ద్వారానైనా వ్యర్థాన్ని సమాప్తము చేసి సమర్థాన్ని ఇమర్జ్ చేయండి.

అవ్యక్త సూచనలు - ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

స్వ కళ్యాణము చేసుకునేందుకు మరియు స్వ పరివర్తన చేసుకునేందుకు విశేషముగా ఏకాంతవాసులుగా, అంతర్ముఖులుగా అవ్వండి. నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారు కానీ పవర్ ఫుల్ గా (శక్తిశాలిగా) అవ్వండి. ప్రతి విషయము యొక్క అనుభవములో స్వయాన్ని సంపన్నముగా చేసుకోండి. నేను ఎవరి బిడ్డను? నాకు ఏ ప్రాప్తి ఉంది? ఈ మొదటి పాఠము యొక్క అనుభవీమూర్తులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి, అప్పుడు సహజముగానే మాయాజీతులుగా అవుతారు.