22-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీకు నషా ఉండాలి - మా పారలౌకిక తండ్రి వండర్ ఆఫ్ ది వరల్డ్ ను (స్వర్గాన్ని) తయారుచేస్తున్నారు, దానికి మేము యజమానులుగా అవుతాము’’

ప్రశ్న:-
తండ్రి సాంగత్యము ద్వారా మీకు ఏయే ప్రాప్తులు కలుగుతాయి?

జవాబు:-
తండ్రి సాంగత్యము ద్వారా మనము ముక్తి-జీవన్ముక్తులకు అధికారులుగా అవుతాము. తండ్రి సాంగత్యము తీరానికి చేరుస్తుంది (దాటించివేస్తుంది). బాబా మనల్ని తమవారిగా చేసుకుని ఆస్తికులుగా మరియు త్రికాలదర్శులుగా తయారుచేస్తారు. మనము రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటాము.

పాట:-
ఓర్పు వహించు మానవా...

ఓంశాంతి
ఈ విధంగా ఎవరు అంటారు? పిల్లలతో తండ్రియే అంటారు, పిల్లలందరితో ఈ విధంగా చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే అందరూ దుఃఖితులుగా, ఇక ఓర్పు కోల్పోయి ఉన్నారు. మీరు వచ్చి దుఃఖము నుండి విడిపించండి, సుఖము యొక్క మార్గాన్ని తెలియజేయండి అని తండ్రిని తలచుకుంటారు. ఇప్పుడు మనుష్యులకు, అందులో కూడా ప్రత్యేకముగా భారతవాసులకు - భారతవాసులమైన మేము ఒకప్పుడు చాలా సుఖముగా ఉండేవారము అన్నది గుర్తు లేదు. భారత్ అతి ప్రాచీనమైన అద్భుతమైన ధరణిగా ఉండేది. వండర్ ఆఫ్ ది వరల్డ్ (ప్రపంచ అద్భుతము) అని అంటారు కదా. ఇక్కడ మాయా రాజ్యములో 7 అద్భుతాలు అని అంటూ ఉంటారు. అవి స్థూలమైన అద్భుతాలు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇవి మాయ యొక్క అద్భుతాలు, వీటిలో దుఃఖము ఉంది. రాముడైన తండ్రి యొక్క అద్భుతము - స్వర్గము. అదే వండర్ ఆఫ్ ది వరల్డ్ (ప్రపంచ అద్భుతము). భారత్ స్వర్గముగా ఉండేది, వజ్రతుల్యముగా ఉండేది. అక్కడ దేవీ-దేవతల రాజ్యము ఉండేది. ఈ భారతవాసులు అంతా మర్చిపోయారు. దేవతల ఎదురుగా తల వంచి నమస్కరిస్తారు, పూజ చేస్తారు కానీ ఎవరి పూజనైతే చేస్తారో, వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా. ఇక్కడ మీరు పారలౌకిక తండ్రి వద్దకు వచ్చారు అని అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పారలౌకిక తండ్రి - స్వర్గాన్ని స్థాపన చేసేవారు. ఈ కార్యాన్ని మనుష్యులెవ్వరూ చేయలేరు, వీరితో (బ్రహ్మాతో) కూడా తండ్రి అంటున్నారు - ఓ శ్రీకృష్ణుని ఆత్మా, నీకు నీ జన్మల గురించి తెలియదు, నీవు శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు సతోప్రధానముగా ఉండేవాడివి, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు నీవు తమోప్రధానముగా అయ్యావు, నీకు అనేక రకాల పేర్లు పెట్టడం జరిగింది, ఇప్పుడు నీకు బ్రహ్మా అన్న పేరు పెట్టారు. బ్రహ్మాయే విష్ణువుగా లేక శ్రీకృష్ణుడిగా అవుతారు. బ్రహ్మాయే విష్ణువు అన్నా లేక విష్ణువే బ్రహ్మా అన్నా విషయము ఒక్కటే. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులే తర్వాత దేవతలుగా అవుతారు. మళ్ళీ ఆ దేవీ-దేవతలే తర్వాత శూద్రులుగా అవుతారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు, ఇది భగవానువాచ. మీరు విద్యార్థులు. కావున మీకు ఎంత సంతోషము ఉండాలి. కానీ అంత సంతోషము ఉండటము లేదు. ధనవంతులు ధనము యొక్క నషాలో చాలా సంతోషముగా ఉంటారు కదా. ఇక్కడ భగవంతునికి పిల్లలుగా అయ్యారు, అయినా కానీ అంతటి సంతోషములో ఉండరు. అర్థము చేసుకోరు, రాతిబుద్ధి కలవారు కదా. అదృష్టములో లేకపోతే జ్ఞాన ధారణను చేయలేరు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి మందిర యోగ్యులుగా తయారుచేస్తున్నారు. కానీ మాయ యొక్క సాంగత్యము కూడా తక్కువేమీ కాదు. మంచి సాంగత్యము తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యము ముంచేస్తుంది అని అంటూ ఉంటారు. తండ్రి సాంగత్యము మిమ్మల్ని ముక్తి-జీవన్ముక్తులలోకి తీసుకువెళ్తుంది, ఆ తర్వాత రావణుడి చెడు సాంగత్యము మిమ్మల్ని దుర్గతిలోకి తీసుకువెళ్తుంది. పంచ వికారాలతో సాంగత్యము జరుగుతుంది కదా. భక్తిలో సత్సంగము అన్న పేరు ఉపయోగిస్తారు, కానీ మెట్లు అయితే కిందకు దిగుతూనే ఉంటారు, మెట్లపై ఎవరైనా అడుగు తడబడితే తప్పకుండా కింద పడిపోతారు కదా! సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రియే. ఎవరైనా సరే భగవంతుడిని పైన ఉన్నట్లుగా వేలుతో చూపిస్తారు. ఇప్పుడు తండ్రి తప్ప పిల్లలకు పరిచయాన్ని ఎవరు ఇవ్వాలి? తండ్రే పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారు. పిల్లలను తమవారిగా చేసుకుని సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి అంటారు - నేను వచ్చి మిమ్మల్ని ఆస్తికులుగా కూడా తయారుచేస్తాను, త్రికాలదర్శులుగా కూడా తయారుచేస్తాను. ఇది ఒక డ్రామా అని సాధు-సన్యాసులు మొదలైనవారెవ్వరికీ తెలియదు. అవి హద్దులోని డ్రామాలు, ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామాలో మనము సుఖము కూడా చాలా చూస్తాము, అలాగే దుఃఖము కూడా చాలా చూస్తాము. ఈ డ్రామాలో కృష్ణుడికి మరియు క్రిస్టియన్లకు కూడా ఎలాంటి లెక్కాచారాలు ఉన్నాయి. వాళ్ళు భారతవాసులను తమలో తాము కొట్లాడుకునేలా చేసి రాజ్యము తీసుకున్నారు. ఇప్పుడు మీరు కొట్లాడుకోరు. వాళ్ళు తమలో తాము కొట్లాడుకుంటారు, రాజ్యము మీకు లభిస్తుంది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే, వారే సర్వులకు సద్గతిని ఇస్తారు. భారత్ లో దేవీ-దేవతల రాజ్యము ఉన్నప్పుడు సద్గతి ఉండేది. మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామములో ఉండేవారు. భారత్ స్వర్ణిమముగా ఉండేది. మీరే రాజ్యము చేసేవారు. సత్యయుగములో సూర్యవంశీయుల రాజ్యము ఉండేది. ఇప్పుడు మీరు సత్యనారాయణుని కథను వింటున్నారు. ఇది నరుని నుండి నారాయణునిగా తయారయ్యేందుకు కథ. ఇది కూడా పెద్ద అక్షరాలలో వ్రాయండి - సత్యమైన గీత ద్వారా భారత్ సత్య ఖండముగా, అతి విలువైనదిగా తయారవుతుంది అని. తండ్రి వచ్చి సత్యమైన గీతను వినిపిస్తారు, సహజ రాజయోగాన్ని నేర్పిస్తారు, తద్వారా అతి విలువైనవారిగా అవుతారు. బాబా సామెతలైతే ఎన్నో అర్థం చేయిస్తారు, కానీ పిల్లలు దేహాభిమానము కారణముగా మర్చిపోతారు. దేహీ-అభిమానులుగా అయినట్లయితే ధారణ కూడా జరుగుతుంది. దేహాభిమానము కారణముగా ధారణ జరగదు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను సర్వవ్యాపిని అని అంటానా. నన్ను - నీవే తల్లివి-తండ్రివి... అని అంటారు కూడా, మరి దాని అర్థమేమిటి? మీ కృపతో అపారమైన సుఖము అని అంటారు. కానీ ఇప్పుడైతే దుఃఖము ఉంది. మరి ఈ గాయనము ఏ సమయానికి సంబంధించినది - ఇది కూడా అర్థం చేసుకోరు. ఏ విధంగా పక్షులు కిచ్-కిచ్ అంటూ ఉంటాయి, దానికి అర్థమేమీ లేదు, అలాగే వీరు కూడా కిచ్-కిచ్ అని అంటూ ఉంటారే కానీ వారికి అర్థమేమీ తెలియదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, ఇవన్నీ అధర్మయుక్తమైనవి. ఎవరు అధర్మయుక్తముగా తయారుచేసారు? రావణుడు. భారత్ సత్యఖండముగా ఉన్నప్పుడు అందరూ సత్యమే మాట్లాడేవారు, దొంగతనము, మోసము మొదలైనవేవీ ఉండేవి కావు. ఇక్కడ ఎన్ని దొంగతనాలు మొదలైనవి చేస్తారు. ప్రపంచములోనైతే మోసమే మోసము ఉంది. దీనిని పాపపు ప్రపంచము, దుఃఖపు ప్రపంచము అనే అంటారు. సత్యయుగాన్ని సుఖ ప్రపంచము అని అంటారు. ఇది వికారీ వేశ్యాలయము, సత్యయుగము శివాలయము. తండ్రి కూర్చుని ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. పేరు కూడా ఎంత బాగుంది - బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఇప్పుడు తండ్రి వచ్చి తెలివైనవారిగా తయారుచేస్తారు. ఈ వికారాలను జయించినట్లయితే మీరు జగత్ జీతులుగా అవుతారు అని అంటారు. ఈ కామమే మహాశత్రువు. పిల్లలు పిలవడం కూడా - మీరు వచ్చి మమ్మల్ని దేవీ-దేవతలుగా తయారుచెయ్యండి అనే పిలుస్తారు.

తండ్రి యొక్క యథార్థ మహిమ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనుష్యులకైతే తండ్రి గురించీ తెలియదు, అలాగే తండ్రి మహిమ గురించీ తెలియదు. వారు ప్రేమ సాగరుడని మీకు తెలుసు. తండ్రి పిల్లలైన మీకు ఇంతటి జ్ఞానాన్ని వినిపిస్తారు, ఇదే వారి ప్రేమ. టీచరు విద్యార్థిని చదివిస్తారు, తద్వారా ఆ విద్యార్థి ఎలా ఉన్నావారి నుండి ఎలా అయిపోతారు. పిల్లలైన మీరు కూడా తండ్రి వంటి ప్రేమ సాగరులుగా అవ్వాలి, ప్రేమతో ఎవరికైనా అర్థం చేయించాలి. తండ్రి అంటారు, మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. నంబర్ వన్ ప్రేమ ఏమిటంటే - తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. మీరు గుప్త దానము చేస్తారు. ఇతరుల పట్ల ద్వేషము కూడా ఉండకూడదు. లేకపోతే మీరు కూడా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఎవరినైనా తిరస్కరిస్తే శిక్షలు అనుభవిస్తారు. ఎప్పుడూ ఎవరి పట్ల ద్వేషము పెట్టుకోకండి, తిరస్కరించకండి. దేహాభిమానములోకి రావడముతోనే పతితముగా అయ్యారు. తండ్రి దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు, తద్వారా మీరు పావనముగా అవుతారు. అందరికీ ఇదే అర్థం చేయించండి - ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తయ్యింది. ఎవరైతే సూర్యవంశీ మహారాజు-మహారాణిగా ఉండేవారో వారే మళ్ళీ 84 జన్మలు తీసుకుని కిందికి దిగుతూ-దిగుతూ ఇప్పుడు నేల మీదకు వచ్చి పడ్డారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ మహారాజు-మహారాణిగా తయారుచేస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పావనముగా అయిపోతారు అని తండ్రి కేవలం ఇదే చెప్తున్నారు. పిల్లలైన మీరు దయార్ద్ర హృదయులుగా అయి మొత్తం రోజంతా సేవ గురించి ఆలోచిస్తూ ఉండాలి. తండ్రి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు - మధురమైన పిల్లలూ, దయార్ద్ర హృదయులుగా అయి అభాగ్యులైన దుఃఖితులైన ఆత్మలెవరైతే ఉన్నారో, ఆ దుఃఖిత ఆత్మలను సుఖవంతులుగా చేయండి. వారికి చాలా క్లుప్తముగా ఉత్తరాలు వ్రాయాలి. తండ్రి అంటున్నారు - నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఒక్క శివబాబాకే మహిమ ఉంది. మనుష్యులకు తండ్రి మహిమ గురించి కూడా తెలియదు. హిందీలో కూడా ఉత్తరము వ్రాయవచ్చు. సేవ చేయడానికి కూడా పిల్లలకు ఉత్సాహము ఉండాలి. చాలా మంది ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతారు, వారికి కూడా మీరు - ఆత్మహత్య మహాపాపమని అర్థం చేయించవచ్చు. ఇప్పుడు పిల్లలైన మీకు శ్రీమతాన్ని ఇచ్చేవారు శివబాబా. వారు శ్రీ శ్రీ శివబాబా. మిమ్మల్ని శ్రీ లక్ష్మీ, శ్రీ నారాయణునిగా తయారుచేస్తారు. శ్రీ శ్రీ అయితే వారొక్కరే. వారు ఎప్పుడూ చక్రములోకి రారు. ఇకపోతే మీకు శ్రీ అనే టైటిల్ లభిస్తుంది. ఈ రోజుల్లోనైతే అందరికీ శ్రీ అనే టైటిల్ ను ఇస్తూ ఉంటారు. ఆ నిర్వికారులు ఎక్కడ, ఈ వికారులు ఎక్కడ - రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి ప్రతి రోజు అర్థం చేయిస్తూ ఉంటారు - ఒకటేమో దేహీ-అభిమానులుగా అవ్వండి మరియు అందరికీ సందేశాన్ని అందించండి. మీరు కూడా సందేశకుని పిల్లలే. సర్వుల సద్గతిదాత ఒక్కరే. మిగిలిన ధర్మ స్థాపకులను గురువు అని అనరు. సద్గతిని ఇచ్చేవారు ఒక్కరే. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరి పట్ల కూడా అయిష్టము లేక ద్వేషము ఉండకూడదు. దయార్ద్ర హృదయులుగా అయ్యి దుఃఖిత ఆత్మలను సుఖవంతులుగా తయారుచేసే సేవ చేయాలి. తండ్రి సమానముగా మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి.

2. ‘‘భగవంతునికి మనము పిల్లలము’’ అన్న ఈ నషా మరియు సంతోషములో ఉండాలి. ఎప్పుడూ మాయ యొక్క తప్పుడు సాంగత్యములోకి వెళ్ళకూడదు. దేహీ-అభిమానులుగా అయ్యి జ్ఞాన ధారణను చేయాలి.

వరదానము:-
తండ్రి సమానముగా వరదానీగా అయి ప్రతి ఒక్కరి హృదయానికి విశ్రాంతిని ఇచ్చే మాస్టర్ దిలారామ్ భవ

తండ్రి సమానమైన వరదానీ మూర్తులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు ఎప్పుడూ ఎవరి బలహీనతలను చూడరు, వారు అందరి పట్ల దయార్ద్ర హృదయులుగా ఉంటారు. ఏ విధంగా తండ్రి ఎవరి బలహీనతలను హృదయములో పెట్టుకోరో, అలాగే వరదానీ పిల్లలు కూడా ఎవరి బలహీనతలను హృదయములో ధారణ చేయరు, వారు ప్రతి ఒక్కరి హృదయానికి విశ్రాంతిని ఇచ్చే మాస్టర్ దిలారామ్ గా ఉంటారు, అందుకే తోటివారైనా లేక ప్రజలైనా అందరూ వారి గుణగానము చేస్తారు. అందరి లోపల నుండి ఇదే ఆశీర్వాదము వెలువడుతుంది - వీరు మాకు సదా స్నేహీలు, సహయోగులు అని.

స్లోగన్:-
ఎవరైతే సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారో, వారే సంగమయుగములో శ్రేష్ఠ ఆత్మలు.

మాతేశ్వరిగారి అమూల్య మహావాక్యాలు

1. ‘‘జ్ఞాన స్వరూప ఆత్మలైన పిల్లలు పొరపాటు చేస్తే 100 రెట్లు దండన’’

ఈ అవినాశీ జ్ఞాన యజ్ఞములోకి వచ్చి సాక్షాత్తు పరమాత్ముని చేతిని అందుకుని మళ్ళీ ఏ కారణము చేతనైనా ఒకవేళ వారి వలన ఏదైనా వికర్మ జరిగినట్లయితే దానికి శిక్ష చాలా భారీగా ఉంటుంది. ఏ విధంగా జ్ఞానాన్ని తీసుకోవడం వలన వారికి 100 రెట్లు లాభము ఉంటుందో, అలా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండగా ఏదైనా పొరపాటు జరిగినట్లయితే ఇక 100 రెట్లు దండన కూడా ఉంటుంది, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే బలహీనమైపోతూ ఉంటారు, అందుకే చిన్న-పెద్ద పొరపాట్లను తెలుసుకుంటూ ఉండండి, ఇక ముందు కోసము గమనిక పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళండి. చూడండి, ఎలాగైతే వివేకము గల పెద్ద వ్యక్తి తప్పుడు పని చేసినట్లయితే వారి కొరకు పెద్ద శిక్ష ఉంటుంది మరియు అధోగతిలో ఉన్న వ్యక్తి ఒకవేళ ఏదైనా తప్పుడు పని చేసినట్లయితే వారి కొరకు అంత పెద్ద శిక్ష ఉండదు. ఇప్పుడు మీరు కూడా పరమాత్ముని పిల్లలుగా పిలవబడతారు కావున అంతగానే మీరు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి, సత్యమైన తండ్రి వద్దకు వచ్చారు కావున సత్యముగా ఉండాలి.

2. ప్రపంచములోనివారు పరమాత్మ సర్వము తెలిసినవారు అని అంటారు, ఇప్పుడు సర్వము తెలిసినవారు అంటే - అందరి మనసులలో ఏముందో తెలిసినవారు అని కాదు. వారు సృష్టి రచన యొక్క ఆదిమధ్యాంతాలు తెలిసినవారు. అలాగే పరమాత్మ రచయిత, పాలనకర్త మరియు సంహారకర్త అంటే దీని అర్థము పరమాత్మ జన్మనిస్తారు, తినిపిస్తారు మరియు హతమారుస్తారు అని కాదు. మనుష్యులు తమ కర్మల అనుసారముగా జన్మ తీసుకుంటారు. పరమాత్మ కూర్చుని వారి చెడు సంకల్పాలను మరియు మంచి సంకల్పాలను తెలుసుకుంటారు అని కాదు. అజ్ఞానుల మనసులలో ఏం నడుస్తూ ఉంటుంది అనేది వారికి తెలుసు. అజ్ఞానులకు రోజంతా మాయావీ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి మరియు జ్ఞానుల లోపల శుద్ధ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి, అంతేకానీ ఒక్కొక్క సంకల్పాన్ని కూర్చుని ఏమైనా చదువుతారా? ఇకపోతే పరమాత్మకు తెలుసు - ఇప్పుడైతే అందరి ఆత్మ దుర్గతికి చేరుకుంది, వారి సద్గతి ఎలా జరగనున్నది - ఈ పూర్తి పరిచయమంతా ఆ సర్వము తెలిసినవారికి తెలుసు. ఇప్పుడు మనుష్యులెవరైతే కర్మ భ్రష్టులుగా అయ్యారో, వారి చేత శ్రేష్ఠ కర్మలను చేయించటము, నేర్పించటము మరియు వారిని కర్మ బంధనాల నుండి విముక్తులుగా చేయడము, ఇది పరమాత్మకు తెలుసు. పరమాత్మ అంటారు - రచయిత అయిన నా గురించి మరియు నా రచన యొక్క ఆదిమధ్యాంతాల యొక్క ఈ మొత్తము జ్ఞానమంతటి గురించి నాకు తెలుసు. ఆ పరిచయాన్ని పిల్లలైన మీకు ఇస్తున్నాను. ఇప్పుడు పిల్లలైన మీరు ఆ తండ్రి యొక్క నిరంతర స్మృతిలో ఉండాలి, అప్పుడే అన్ని పాపాల నుండి ముక్తులవుతారు అనగా అమరలోకములోకి వెళ్తారు, ఇప్పుడు ఇదంతా తెలుసు కావుననే జానీ-జాననహార్ (సర్వము తెలిసినవారు) అని అంటారు. అచ్ఛా! ఓం శాంతి.

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

ఎప్పుడూ కూడా సభ్యతను వదిలి సత్యతను నిరూపించకండి. సభ్యతకు గుర్తు నిర్మానత. ఈ నిర్మానత నిర్మాణము యొక్క కార్యాన్ని సహజము చేస్తుంది. ఎప్పటివరకైతే నిర్మానులుగా అవ్వరో అప్పటివరకు నిర్మాణము చేయలేరు. జ్ఞానము యొక్క శక్తి - శాంతి మరియు ప్రేమ. అజ్ఞానము యొక్క శక్తి అయిన క్రోధాన్ని చాలా బాగా సంస్కారముగా చేసుకున్నారు మరియు దానిని ఉపయోగిస్తూ కూడా ఉంటారు, ఆ తర్వాత క్షమించమని కూడా అడుగుతూ ఉంటారు. అలా ఇప్పుడు ప్రతి గుణాన్ని, ప్రతి జ్ఞానము యొక్క విషయాన్ని సంస్కార రూపముగా చేసుకున్నట్లయితే సభ్యత వస్తూ ఉంటుంది.