22-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇక్కడికి మీరు పరివర్తన అయ్యేందుకు వచ్చారు, మీరు ఆసురీ గుణాలను పరివర్తన చేసుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి, ఇది దేవతలుగా తయారయ్యే చదువు’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు ఏ చదువును తండ్రి ద్వారా మాత్రమే చదువుతారు, ఇంకెవ్వరూ దీనిని చదివించలేరు?

జవాబు:-
మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువును, అపవిత్రుల నుండి పవిత్రులుగా అయి కొత్త ప్రపంచంలోకి వెళ్ళే చదువును ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ కూడా చదివించలేరు. తండ్రే సహజ జ్ఞానము మరియు రాజయోగము యొక్క చదువు ద్వారా పవిత్ర ప్రవృత్తి మార్గాన్ని స్థాపన చేస్తారు.

ఓంశాంతి
తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి ఇరువురూ తండ్రులే, ఒకరు హద్దు తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. ఆ తండ్రి కూడా ఉన్నారు, అలాగే ఈ తండ్రి కూడా ఉన్నారు. అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తారు. మేము కొత్త ప్రపంచమైన సత్యయుగం కొరకు చదువుతున్నామని పిల్లలకు తెలుసు. ఇటువంటి చదువు ఎక్కడా లభించదు. పిల్లలైన మీరు ఎన్నో సత్సంగాలకైతే వెళ్ళారు. మీరు భక్తులుగా ఉండేవారు కదా. తప్పకుండా గురువుల వద్దకు వెళ్ళారు, శాస్త్రాలను అధ్యయనం చేసారు. కానీ ఇప్పుడు తండ్రి వచ్చి మేల్కొలిపారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము మారనున్నది అని తండ్రి అంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కొత్త ప్రపంచం కొరకు చదివిస్తున్నాను, నేను మీ శిక్షకుడిని. ఇంకే గురువునూ ఇలా టీచర్ అని అనరు. స్కూలులో టీచరు చదివిస్తారు, దాని ద్వారా ఉన్నత పదవిని పొందుతారు. కానీ వారు ఇక్కడి కోసం చదివిస్తారు. మనం ఏ చదువునైతే చదువుతున్నామో అది కొత్త ప్రపంచం కోసమని ఇప్పుడు మీకు తెలుసు. దానిని స్వర్ణయుగ ప్రపంచం అని అంటారు. ఈ సమయంలో ఆసురీ గుణాలను మార్చుకొని దైవీ గుణాలను ధారణ చేయాలనైతే తెలుసు. ఇక్కడకు మీరు పరివర్తన అవ్వడానికి వచ్చారు. క్యారెక్టర్ ను మహిమ చేయడం జరుగుతుంది. దేవతల ఎదురుగా వెళ్ళి - మీరు అలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాము అని అంటారు. మీకు ఇప్పుడు లక్ష్యము-ఉద్దేశ్యము లభించింది. భవిష్యత్తు కోసం తండ్రి కొత్త ప్రపంచాన్ని కూడా స్థాపన చేస్తారు మరియు మిమ్మల్ని చదివిస్తారు కూడా. అక్కడైతే వికారాల విషయము ఉండదు. మీరు రావణునిపై విజయాన్ని పొందుతారు, రావణ రాజ్యంలో అందరూ వికారులే ఉన్నారు. యథా రాజా రాణి తథా ప్రజా. ఇప్పుడైతే పంచాయతీ రాజ్యం ఉంది. దీని కన్నా ముందు రాజా, రాణుల రాజ్యం ఉండేది, కానీ వారు కూడా పతితులుగానే ఉండేవారు. ఆ పతిత రాజుల వద్ద మందిరాలు కూడా ఉంటాయి. నిర్వికారీ దేవతల పూజను చేసేవారు. ఆ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారని తెలుసు. ఇప్పుడు వారి రాజ్యం లేదు. తండ్రి ఆత్మలను పావనంగా తయారుచేస్తారు, అంతేకాక మీరు దేవతా శరీరాలు కలవారిగా ఉండేవారు అని స్మృతిని కూడా కలిగిస్తారు. మీ ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రముగా ఉండేవి. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి పతితుల నుండి పావనులుగా తయారుచేస్తారు, అందుకోసమే మీరు ఇక్కడకు వచ్చారు.

బాబా చట్టాన్ని జారీ చేస్తారు - పిల్లలూ, కామము మహాశత్రువు. ఇది మీకు ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ పావనంగా అవ్వాలి. దేవీ-దేవతలకు పరస్పరం ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండదని కాదు, కానీ అక్కడ వికారీ దృష్టి ఉండదు, నిర్వికారులుగా ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి అని తండ్రి కూడా అంటారు. మీరు పూర్వము ఏ విధంగా పవిత్ర జంటలా ఉండేవారో, మీ భవిష్యత్తును కూడా అలా తయారుచేసుకోవాలి. ప్రతి ఆత్మ భిన్న నామ-రూపాలను తీసుకొని పాత్రను అభినయిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇది మీ అంతిమ పాత్ర. ఏం చేయాలి, ఏ విధంగా కంపానియన్స్ లా (సహచరుల్లా) ఉండాలి అని పవిత్రత కొరకు చాలామంది తికమకపడుతూ ఉంటారు. కంపానియన్స్ గా ఉండడం అంటే అర్థం ఏమిటి? విదేశాలలో వృద్ధులుగా అయినప్పుడు కంపానియన్ కోసమని, చూసుకునేవారి కోసమని వివాహం చేసుకుంటారు. బ్రహ్మచారులుగా ఉండడాన్ని ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారు. సన్యాసులు విషయము వేరు, అది కాకుండా వివాహం చేసుకోవడం ఇష్టపడనివారు గృహస్థంలో కూడా చాలామంది ఉంటారు. వివాహం చేసుకోవడము, మళ్ళీ పిల్లలు మొదలైనవారిని సంభాళించడము, స్వయమే చిక్కుకునేటువంటి వలను అసలు ఎందుకు తయారుచేసుకోవాలి అని అనుకుంటారు. అటువంటివారు చాలామంది ఇక్కడకు కూడా వస్తారు. బ్రహ్మచారులుగా ఉంటూ 40 సంవత్సరాలు గడిచింది, ఇప్పుడిక ఏం వివాహం చేసుకుంటాము అని అనుకుంటారు. స్వతంత్రులుగా ఉండడం ఇష్టపడతారు. తండ్రి వారిని చూసి సంతోషపడతారు. వీరు ఉన్నదే బంధన-ముక్తులుగా ఉన్నారు, ఇక మిగిలింది శరీర బంధనము, ఇందులో దేహ సహితంగా అన్నీ మర్చిపోవాలి, కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఏ దేహధారినీ, క్రైస్టు మొదలైనవారెవ్వరినీ స్మృతి చేయకూడదు. నిరాకారుడైన శివుడైతే దేహధారి కారు. వారి పేరు శివ. శివుని మందిరాలు కూడా ఉన్నాయి. ఆత్మకు 84 జన్మల పాత్ర లభించి ఉంది. ఇది అవినాశీ డ్రామా, ఇందులో ఏ మార్పు జరగదు.

మొట్టమొదట మన ధర్మం, మన కర్మ ఏదైతే శ్రేష్ఠంగా ఉండేదో, అది ఇప్పుడు భ్రష్టంగా అయిపోయిందని మీకు తెలుసు. దేవతా ధర్మమే అంతమైపోయింది అని కాదు. దేవతలు సర్వ గుణ సంపన్నులుగా ఉండేవారు అని గానం చేస్తారు కూడా. లక్ష్మీ-నారాయణులు ఇరువురూ పవిత్రముగా ఉండేవారు. పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంది. 84 జన్మలలో భిన్న-భిన్న నామ-రూపాలు మారుతూ వచ్చాయి. తండ్రి చెప్పారు - మధురాతి-మధురమైన పిల్లలూ, మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను మీకు 84 జన్మల కథను వినిపిస్తాను. కావున తప్పకుండా మొదటి జన్మ నుండి అర్థం చేయించవలసి ఉంటుంది. మీరు పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు వికారులుగా అయ్యారు, కావున దేవతల ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. క్రిస్టియన్లు క్రైస్టు ముందుకు, బౌద్ధులు బుద్ధుని ముందుకు, సిక్కులు గురునానక్ దర్బారు ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు, తద్వారా వారు ఏ మార్గానికి చెందినవారో తెలుస్తుంది. వీరు హిందువులు అని మీ కోసమైతే అంటారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం ఏమైందో ఎవ్వరికీ తెలియదు. అది కనుమరుగైపోయింది. భారత్ లో చిత్రాలైతే ఎన్నో తయారుచేయబడి ఉన్నాయి. మనుష్యుల అభిప్రాయాలు కూడా అనేకమున్నాయి. శివునికి కూడా అనేక పేర్లను పెట్టేసారు. వాస్తవానికి వారిది ఒక్క శివ అన్న పేరే. వారు పునర్జన్మలు తీసుకున్నారు కావున వారికి పేర్లు మారుతూ ఉంటాయని కూడా కాదు. అలా కాదు. మనుష్యుల అభిప్రాయాలు అనేకమున్నాయి కావున అనేక పేర్లను పెడతారు. శ్రీనాథ ద్వార్ వద్దకు వెళ్ళినా అక్కడ కూర్చున్నది కూడా అదే లక్ష్మీ-నారాయణులు, జగన్నాథ మందిరంలో కూడా విగ్రహం అదే ఉంది. పేర్లు రకరకాలవి పెట్టారు. మీరు సూర్యవంశీయులుగా ఉండేటప్పుడు పూజ మొదలైనవి చేసేవారు కాదు. మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేసేవారు, సుఖీగా ఉండేవారు. శ్రీమతమనుసారంగా శ్రేష్ఠ రాజ్య స్థాపనను చేసారు. దానిని సుఖధామం అని అంటారు. మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు, మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తున్నారు అని ఇంకెవ్వరూ ఈ విధంగా అనరు. ఆ గుర్తులు కూడా ఉన్నాయి, తప్పకుండా వారి రాజ్యమే ఉండేది. అక్కడ కోటలు మొదలైనవి ఉండవు. కోటలు మొదలైనవాటిని రక్షణ కోసమే నిర్మిస్తారు. ఈ దేవీ-దేవతల రాజ్యంలో కోటలు మొదలైనవి ఉండేవి కావు. దాడి చేసేవారు ఎవ్వరూ ఉండరు. మనం ఆ దేవీ-దేవతా ధర్మంలోకే ట్రాన్స్ఫర్ అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. దాని కోసం మీరు రాజయోగం యొక్క చదువును చదువుతున్నారు. రాజ్యాన్ని పొందాలి. భగవానువాచ - నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను. ఇప్పుడైతే రాజా-రాణులెవ్వరూ లేరు. ఎన్ని గొడవలు-కొట్లాటలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఇది కలియుగము, ఇనుప యుగ ప్రపంచము. మీరు స్వర్ణ యుగములో ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ పురుషోత్తమ సంగమయుగంలో నిలబడ్డారు. తండ్రి మిమ్మల్ని మొదటి నంబరులోకి తీసుకువెళ్ళడానికి వచ్చారు, వారు అందరి కళ్యాణం చేస్తారు. మన కళ్యాణం కూడా జరుగుతుందని మీకు తెలుసు, మొట్టమొదట మనం తప్పకుండా సత్యయుగములోకి వస్తాము. ఇక మిగిలిన ధర్మాలేవైతే ఉన్నాయో, వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. అందరూ పవిత్రముగా కూడా అవ్వాలి అని తండ్రి అంటారు. మీరు ఉన్నదే పవిత్ర దేశ వాసులు, దానిని నిర్వాణధామం అని అంటారు. వాణి నుండి అతీతముగా కేవలం అశరీరి ఆత్మలే ఉంటాయి. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు వాణి నుండి అతీతముగా తీసుకువెళ్తారు. మేము మిమ్మల్ని నిర్వాణధామంలోకి, శాంతిధామంలోకి తీసుకువెళ్తాము అని ఈ విధంగా ఎవ్వరూ అనలేరు. వారు - మేము బ్రహ్మతత్వంలో లీనమవుతాము అని అంటారు. ఇప్పుడు ఇది తమోప్రధాన ప్రపంచమని పిల్లలైన మీకు తెలుసు, ఇందులో మీకు రుచి కలగదు, అందుకే కొత్త ప్రపంచ స్థాపనను మరియు పాత ప్రపంచ వినాశనాన్ని చేయడానికి భగవంతుడికి ఇక్కడకు రావలసి ఉంటుంది. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. మరి వారు వచ్చి ఏం చేస్తారు? ఎవరైనా చెప్పండి. జయంతిని జరుపుతున్నారు అంటే తప్పకుండా వారు వస్తారని కదా. రథముపై విరాజమానమవుతారు. వారేమో ఆ గుర్రపు రథాన్ని చూపించారు. నేను ఏ రథంపై స్వారీ చేస్తాను అన్నది తండ్రి కూర్చుని తెలియజేస్తారు, పిల్లలకు తెలియజేస్తాను. ఈ జ్ఞానం తర్వాత కనుమరుగైపోతుంది. వీరి 84 జన్మల అంతిమంలో బాబాకు రావలసి ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. జ్ఞానం పగలు, భక్తి రాత్రి. కిందకు దిగిపోతూనే ఉంటారు. భక్తి యొక్క షో ఎంతగా ఉంది, ఎన్ని కుంభ మేళాలు, ఫలానా మేళాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు పవిత్రంగా అయి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అని ఈ విధంగా ఎవ్వరూ చెప్పరు, ఇప్పుడు ఇది సంగమయుగమని తండ్రే చెప్తారు. కల్పక్రితము మీకు ఏ చదువైతే లభించిందో, దేని ద్వారానైతే మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారో, అదే చదువు మీకు ఇప్పుడు లభిస్తుంది. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు అన్న గాయనము కూడా ఉంది, అలా తప్పకుండా తండ్రే తయారుచేస్తారు కదా. మనం అపవిత్ర గృహస్థ ధర్మానికి చెందినవారిగా ఉండేవారమని, ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ పవిత్ర ప్రవృత్తిమార్గం వారిగా తయారుచేస్తారని మీకు తెలుసు. మీరు చాలా ఉన్నత పదవిని పొందుతారు. ఉన్నతోన్నతుడైన తండ్రి ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు. తండ్రిది శ్రీ శ్రీ అనగా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతము. మనం శ్రేష్ఠంగా అవుతాము. శ్రీ శ్రీ అర్థము గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక్క శివబాబా టైటిలే, కానీ వారేమో స్వయాన్ని శ్రీ శ్రీ అని పిలుచుకుంటారు. మాలను తిప్పుతారు. మాల 108 మందిది, వారు 16,108 మాలను తయారుచేసారు. అందులో అష్టరత్నాలూ వచ్చేస్తారు. 4 జంటలు మరియు ఒక బాబా, 8 రత్నాలు మరియు 9వ వాడిని నేను. వారిని రత్నాలు అంటారు. వారిని ఆ విధంగా తయారుచేసేవారు తండ్రియే. మీరు తండ్రి ద్వారా పారసబుద్ధి కలవారిగా అవుతారు. రంగూన్ లో ఒక సరస్సు ఉంది, అందులో స్నానం చేయడం ద్వారా దేవకన్యలుగా అవుతారు అని అంటారు. వాస్తవానికి ఇది జ్ఞాన స్నానము, దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఇకపోతే అవన్నీ భక్తి మార్గపు విషయాలు. నీటిలో స్నానం చేయడం ద్వారా దేవతలుగా అయిపోవడమనేదీ ఎప్పుడూ జరగదు. అదంతా భక్తి మార్గము. ఎటువంటి విషయాలను తయారుచేసారు! ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మీ స్మృతిచిహ్నముగానే దిల్వాడా మందిరము, గురుషికర్ మొదలైనవి ఉన్నాయి. తండ్రి చాలా ఉన్నత స్థానములో ఉంటారు కదా. తండ్రి మరియు ఆత్మలమైన మనం ఎక్కడైతే నివసిస్తామో, అది మూలవతనము అని మీకు తెలుసు. సూక్ష్మవతనము కేవలం సాక్షాత్కారమాత్రంగానే ఉంది. అది ప్రపంచమేమీ కాదు. సూక్ష్మవతనము మరియు మూలవతనము విషయములో ప్రపంచ చరిత్ర పునరావృతమవుతుంది అని అనరు. ప్రపంచమైతే ఒక్కటే. ఈ ప్రపంచ చరిత్ర పునరావృతమవుతుంది అని అంటారు.

ప్రపంచములో శాంతి ఏర్పడాలని మనుష్యులు అంటారు. ఆత్మ స్వధర్మమే శాంతి అని వారికి తెలియదు. అడవిలో శాంతి ఏమీ లభించదు. పిల్లలైన మీకు సుఖము, మిగిలినవారందరికీ శాంతి లభిస్తుంది. ఎవరెవరైతే వస్తారో వారంతా ముందు శాంతిధామములోకి వెళ్ళి ఆ తర్వాత సుఖధామములోకి వస్తారు. కొందరేమంటారంటే - మేము జ్ఞానం తీసుకోకుండా చివరిలో వస్తే, అంతసేపూ ముక్తిధామములో ఉంటాము, అది మంచిదే కదా, అలా అయితే ఎంతోకాలం ముక్తిలో ఉంటాము కదా, అప్పుడు వచ్చి ఏదో 1, 2 జన్మలు పదవిని పొందుతాము! అదేమైనట్లు? దోమలు పుడతాయి మరియు చనిపోతాయి అన్నట్లు ఉంటుంది. ఒక్క జన్మలో ఇక్కడ ఏ సుఖము ఉంటుంది? అది ఎందుకూ కొరగానిదే, అసలు పాత్రయే లేనట్లుగా ఉంటుంది. మీ పాత్ర అయితే చాలా ఉన్నతమైనది. మీకు లభించినంత సుఖాన్ని ఇంకెవ్వరూ చూడలేరు, అందుకే పురుషార్థము చేయాలి, చేస్తూ ఉంటారు కూడా. కల్పపూర్వము కూడా మీరు పురుషార్థము చేసారు. మీ పురుషార్థానుసారముగా ప్రారబ్ధాన్ని పొందారు. పురుషార్థము లేకుండానైతే ప్రారబ్ధాన్ని పొందలేరు. పురుషార్థము తప్పకుండా చేయాలి. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది అని తండ్రి అంటారు. మీ పురుషార్థము కూడా జరుగుతుంది, అది లేకుండా ఊరికే అలా నడవలేరు. మీరు పురుషార్థాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. పురుషార్థము లేకుండా ఏదైనా జరుగగలదా? దగ్గు దానంతట అదే ఎలా తగ్గుతుంది? మెడిసిన్ తీసుకునే పురుషార్థమునైతే చేయవలసి ఉంటుంది. కొందరైతే ఇలా అనుకుంటూ డ్రామాపై భారం వేసి కూర్చుంటారు. డ్రామాలో ఏది ఉంటే అదే జరుగుతుంది అని అంటారు. ఇటువంటి తలకిందుల జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెట్టుకోకూడదు. మాయ ఈ విధంగా కూడా విఘ్నాలు వేస్తుంది. పిల్లలు చదువునే వదిలేస్తారు. దీనినే మాయతో ఓడిపోవడము అని అంటారు. ఇది యుద్ధము కదా. అది కూడా చాలా జోరైన యుద్ధము. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రేష్ఠమైన రాజ్యాన్ని స్థాపన చేసేందుకు శ్రీమతముపై నడుస్తూ తండ్రికి సహాయకులుగా అవ్వాలి. ఏ విధంగా దేవతలు నిర్వికారులో, అలా గృహస్థములో ఉంటూ నిర్వికారులుగా అవ్వాలి. పవిత్ర ప్రవృత్తిని తయారుచేసుకోవాలి.

2. డ్రామా పాయింటును తలకిందులుగా ఉపయోగించకూడదు. డ్రామా అని అంటూ కూర్చుండిపోకూడదు. చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. పురుషార్థం ద్వారా తమ శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని తయారుచేసుకోవాలి.

వరదానము:-

కమల పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకుని, స్వయాన్ని శ్యాంపుల్ గా భావించే అతీతమైనవారిగా మరియు ప్రియమైనవారిగా కండి

ప్రవృత్తిలో ఉండేవారికి సంబంధించిన గుర్తు ‘‘కమల పుష్పము’’. కావున కమలం వలె అవ్వండి మరియు అమలు చెయ్యండి. ఒకవేళ అమలు చేయకపోతే కమలం వలె అవ్వలేరు. అందుకే కమల పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకుని స్వయాన్ని శ్యాంపుల్ గా భావిస్తూ నడుచుకోండి. సేవ చేస్తూ అతీతంగా మరియు ప్రియంగా అవ్వండి. కేవలం ప్రియంగా మాత్రమే అవ్వకండి, అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వండి, ఎందుకంటే ప్రేమ అనేది ఒక్కోసారి మోహం రూపంలోకి మారిపోతుంది, అందుకే ఏ సేవను చేస్తున్నా సరే, అతీతమైనవారిగా మరియు ప్రియమైనవారిగా అవ్వండి.

స్లోగన్:-

స్నేహము అనే ఛత్రఛాయ లోపలకి మాయ రాలేదు.