22-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - పిల్లలైన మీ సేవ చేయడానికి తండ్రి
వచ్చారు, మీరు కూడా తండ్రి సమానముగా అయి అందరి సేవ చేయండి’’
ప్రశ్న:-
బ్రహ్మాబాబాకు
కలిగే ఏ ఆలోచనకు, శివబాబా వెయిట్ ఎండ్ సీ (వేచి చూడండి), చింత చేయకండి అని అంటారు?
జవాబు:-
బాబాకు ఆలోచన
కలుగుతుంది - సమయము చాలా సున్నితముగా అవుతూ ఉంది, పిల్లలు అవినాశీ జ్ఞాన రత్నాలను
తీసుకునేందుకు తండ్రి వద్దకు రావాల్సే ఉంటుంది, మరి ఇంతమంది పిల్లలు వచ్చి ఎక్కడ
ఉంటారు, ఎన్ని ఇల్లులు కట్టించాల్సి ఉంటుంది అని. శివబాబా అంటారు - వెయిట్ ఎండ్ సీ
(వేచి చూడండి). కల్పక్రితం ఎలాగైతే వచ్చి ఉన్నారో, అలాగే వచ్చి ఉంటారు. నీవు
చింతించకు, నీవు కేవలం చదువుకుంటూ ఉండు, మన్మనాభవ. నీవు కర్మాతీతముగా అయ్యే
పురుషార్థము చేయాలి.
పాట:-
మిమ్మల్ని
పొంది మేము...
ఓంశాంతి
పిల్లలూ, ఓం శాంతి అని తండ్రి కూడా అంటారు. ఇంకా ఏమంటారు! పిల్లలతో అంటారు - పిల్లలూ,
ఓం శాంతి, తతత్వమ్. ఓ పిల్లలూ, మీరు కూడా శాంతి స్వరూపులే. మీరు కూడా మాస్టర్
పతిత-పావనులే. ఈ విధముగా ఇంకెవరూ అనలేరు. కాకి ఎలా ఉంటుందో, దాని పిల్లలు కూడా అలాగే
ఉంటాయని అంటారు. బాబా ఎలా ఉన్నారో, మనము కూడా అలాగే ఉన్నాము అని - పిల్లలైన మీకు
కూడా తెలుసు. తండ్రి అంటారు - నేను జ్ఞాన సాగరుడను. పిల్లలైన మీరు కూడా - మేము
మాస్టర్ జ్ఞాన సాగరులము అని భావిస్తారు అనగా మీరు నదులు. సాగరానికి పిల్లలు కూడా
ఉంటాయి కదా. పెద్ద-పెద్ద నదులు కూడా ఉన్నాయి. పెద్ద-పెద్ద చెరువులు, పెద్ద-పెద్ద
సరస్సులు కూడా ఉన్నాయి. అవి జడమైనవి, మీరు చైతన్యమైనవారు. మీరు సాగరము నుండే
వెలువడ్డారు. కొంతమంది పిల్లలు ఈ విషయాలను అర్థం చేసుకోరు, ఎందుకంటే కుమార్తెలైతే
చదువుకున్నవారు కాదు. పంచదార దేనితో తయారవుతుంది, బెల్లం దేనితో తయారవుతుంది అని
బాబా ఒకసారి అడిగారు. అప్పుడు పిల్లలు - ఎర్ర చెరుకుతో బెల్లం తయారవుతుందని, తెల్ల
చెరుకుతో పంచదార తయారవుతుందని చెప్పారు. పాపం వారు చదువుకోలేదు కదా. ఇప్పుడు మీకు
ఎంత పెద్ద విషయాలను అర్థం చేయిస్తారు. నీటి సాగరము నుండి నీటి నదులే వెలువడతాయి.
మనుష్యుల సంఖ్య బాగా పెరుగుతూ ఉంటే, నీరు కూడా ఎక్కువే కావాలి కదా. ఎన్ని కాలువలు
మొదలైనవి తయారుచేస్తూ ఉంటారు. పిల్లలైన మీరు లేస్తూ-కూర్చుంటూ, నడుస్తూ-తిరుగుతూ ఇదే
ఆలోచన పెట్టుకోవాలి - మేము ఈ పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేస్తున్నాము అని. బాబా,
మేము మీ నుండి విశ్వ రాజ్యాధికార వారసత్వాన్ని తీసుకుంటాము, దీనిని మా నుండి ఎవరూ
లాక్కోలేరు అని పాటలో కూడా అంటారు. ఈ రాజ్యాధికారము 21 జన్మల వరకు నిలిచి ఉంటుంది.
అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. వారు రాజ్య భాగ్యాన్ని
నడిపించేందుకు యోగ్యులుగా తయారుచేస్తారు, పవిత్రముగా తయారుచేస్తారు. ఓ పతిత-పావనా
రండి, అని పిలుస్తారు కూడా. శ్రీకృష్ణుడిని అలా పిలవరు. నిరాకార భగవంతుడిని
పిలుస్తారు. ఓ పతిత-పావనా అని అన్నప్పుడు బుద్ధిలో శ్రీకృష్ణుడు గుర్తుకు రారు,
పరమాత్మ గుర్తుకువస్తారు. తండ్రి వచ్చి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. ఇప్పుడు
పిల్లలైన మీరు సమ్ముఖముగా కూర్చున్నారు. ఇతనేమీ సాధువో లేక సన్యాసో కాదు. నిరాకార
శివబాబా ఈ బ్రహ్మా తనువులోకి ప్రవేశించి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు.
పరమపిత పరమాత్మ బ్రహ్మా తనువు ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన
చేస్తారని గాయనము కూడా ఉంది. స్థాపన తర్వాతనే వినాశనము జరిగింది. దీని బట్టి
పరమాత్మ పాత ప్రపంచములోకి వస్తారని ఋజువవుతుంది. బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచ
స్థాపన, శంకరుని ద్వారా అనేక ధర్మాల వినాశనము. సత్యయుగములో ఒకే ధర్మముండేది,
ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. చక్రము మొదలైనవి ఒకే ధర్మము కల దేవీ-దేవతలకు గుర్తు.
ఈ లక్ష్మీ-నారాయణులను విశ్వానికి యజమానులని అంటారు. స్వర్గానికి యజమానులే విశ్వానికి
యజమానులు. ఈ విషయాలు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కూర్చున్నాయి. తండ్రి అంటారు -
పిల్లలూ, మన్మనాభవ. పిల్లలకు ఈ అటెన్షన్ పదే-పదే లభిస్తుంది. తండ్రిని మరియు
వారసత్వాన్ని స్మృతి చేయండి. ఈ విషయాన్ని మర్చిపోకండి. వేరే పాయింట్లు మర్చిపోతూ
ఉంటారు కానీ ఇది ముఖ్యమైనది కదా. తండ్రియే పతిత-పావనుడు. వారు పావనముగా అయ్యేందుకు
యుక్తిని తెలియజేస్తారు. తండ్రి అంటారు - మీరు సతోప్రధానముగా ఉండేవారు. ఇప్పుడు
తమోప్రధానముగా, పతితముగా అయిపోయారు. 84 జన్మలను పూర్తిగా తీసుకున్నారు. ఇప్పుడు మీరు
మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. సతోప్రధానముగా అవ్వండి, అప్పుడే మీరు పవిత్ర
ప్రపంచములోకి వెళ్ళగలరు. నిరాకారీ ప్రపంచము కూడా పవిత్రమైనది, ఆ సాకారీ ప్రపంచము
కూడా పవిత్రమైనది. ఇది అపవిత్రమైన పతిత ప్రపంచము. ఆత్మ కూడా తమోప్రధానముగా ఉంది,
శరీరము కూడా తమోప్రధానముగా ఉంది. ఇది సృష్టి నాటకము, ఇందులో బ్రహ్మాండము మరియు
సూక్ష్మవతనము కూడా వస్తాయి. సృష్టి చక్రము ఇక్కడ తిరుగుతుంది. సత్య, త్రేతాయుగాలు
ఇక్కడ ఉంటాయి. అవి సూక్ష్మవతనములో గాని లేక మూలవతనములో గాని ఉండవు. అవి ఇక్కడే
ఉంటాయి. దీనిని మనుష్య సృష్టి అని అంటారు. అది ఆత్మల నిరాకారీ ప్రపంచము.
సూక్ష్మవతనము బ్రహ్మా, విష్ణు, శంకరుల ఆకారీ ప్రపంచము. ఈ సాకారీ సృష్టి ఎంత పెద్దది.
సత్యయుగములో ఎంత చిన్నని సృష్టి ఉంటుంది. అక్కడ ఉన్నది ఒకే ధర్మము. ఇకపోతే, అక్కడ
కూడా అసురులు మొదలైనవారు ఉండేవారని మనుష్యులేదైతే అంటారో, అదంతా అసత్యము.
కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము అని అంటూ ఉంటారని మీరు అర్థం చేసుకుంటారు.
అంతా వినాశనమైపోతుంది మరియు సత్యయుగ స్వర్గము స్థాపనవుతుంది. మీరు కూడా తండ్రితో
పాటు సేవ చేస్తున్నారు. తండ్రి కూడా పిల్లల సేవ చేసేందుకే వస్తారు. వీరు అనంతమైన
తండ్రి. నా పిల్లలు చాలా దుఃఖితులుగా ఉన్నారని చూసినప్పుడు వారికి తప్పకుండా దయ
కలుగుతుంది కదా. వారు ఉన్నదే దయార్ద్ర హృదయుడైన తండ్రి. ఇప్పుడైతే మొత్తము
ప్రపంచములో అశాంతి ఉంది. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ శాంతిని ఇవ్వలేరు. హఠయోగులు
కూడా చాలామంది ఉన్నారు. వారు ఆత్మ నిర్లేపి అని అంటారు. మనుష్యులకు తప్పుడు విషయాలను
వినిపిస్తారు. వాస్తవానికి ఆత్మ యొక్క స్వచ్ఛత అవసరము. ఆత్మలోనే మాలిన్యము చేరింది,
ఇది మిగిలినవారు ఎవరికీ తెలియదు. ఫలానావారు పాపాత్మ, పాపాలు చాలా చేస్తారు,
ఫలానావారు మహానాత్మ, ఫలానావారు పుణ్యాత్మ అని అంటూ ఉంటారు. అంతేకానీ మహాన్ పరమాత్మ
అని అనరు. సన్యాసులను పవిత్ర ఆత్మలని అంటారు ఎందుకంటే వారు సన్యసించారు. ఇప్పుడు
తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఆత్మను పవిత్రముగా తయారుచేయగలిగింది ఒక్క తండ్రి
అయిన పరమాత్మ తప్ప ఇంకెవరూ కాదు. పతిత ప్రపంచములో పావన ఆత్మలెవరూ ఉండలేరు. ఇప్పుడు
అంటు కట్టడము జరుగుతుంది. నెమ్మది-నెమ్మదిగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ చిన్న-చిన్న
మఠాలు, మార్గాలు మొదలైనవి కొమ్మలు-రెమ్మలు. వాటిలో ఎలాంటి శ్రమ ఉండదు. అనేక రకాల
మంత్రాలు ఇస్తుంటారు. రకరకాల మంత్రాలు ఇస్తుంటారు. ఇది కూడా వశీకరణ మంత్రమే, దీని
ద్వారా మీరు 5 వికారాలపై విజయాన్ని పొందుతారు. రామ-రామ అనే మంత్రాన్ని జపిస్తారు
కానీ దాని వల్ల లాభమేమీ ఉండదు. ఇక్కడైతే తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తే మీ
పాపాలు నశిస్తాయి, మీరు పవిత్ర ఆత్మగా అయిపోతారు. స్మృతినే యోగమని అంటారు. భారత్
యొక్క ప్రాచీన యోగము చాలా ప్రసిద్ధమైనది. ఈ యోగముతోనే మీరు విశ్వముపై విజయము
పొందుతారు. భారత్ యొక్క రాజయోగము చాలా ప్రసిద్ధమైనది. దీనిని తండ్రి తప్ప ఇతరులెవరూ
నేర్పించలేరు. మీరు బ్రహ్మాకుమార-కుమారీలు. బి.కె.లైతే ఇక్కడే ఉంటారు కదా. ప్రజాపిత
బ్రహ్మా పిల్లలు తప్పకుండా బ్రహ్మాతోనే ఉంటారు. బ్రాహ్మణ కులము కూడా తప్పకుండా
కావాలి. దీనిని సర్వోత్తమమైన, ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ కులము అని అంటారు. ఇప్పుడు
మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు, తర్వాత మారిపోతారు. పిల్లిమొగ్గలాటను ఆడతారు కదా.
శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, తర్వాత దేవతలుగా, క్షత్రియులుగా... అవుతారు.
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలూ, ఇది చాలా చిన్న
విషయము - తండ్రి స్మృతిలో ఉండండి. బాబా మనకు 84 జన్మల రహస్యాన్ని తెలియజేస్తున్నారు
అనేది కూడా బుద్ధిలో ఉంది. 84 లక్షల జన్మలు లేక 84 జన్మల లెక్క అయితే కావాలి కదా.
ఇది ఎవరికీ తెలియదు. 84 లక్షల జన్మల యొక్క లెక్కనైతే ఎవరూ చెప్పలేరు. మనుష్యులు 84
జన్మల చక్రములో తిరుగుతారు. ఆత్మలు పాత్రను అభినయించేందుకు పై నుండి వస్తారు.
సత్యయుగము నుండి మొదలుకుని కలియుగ అంతిమము వరకు వస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ-తమ
పాత్రను అభినయిస్తూ ఉంటారు. ఈ విషయాల గురించి మనుష్యులకు తెలియదు. ఒక్క తండ్రి
మాత్రమే తెలుసుకోగలరు. మనుష్యులను ఎప్పుడూ పరమపిత, గాడ్ ఫాదర్ అని అనరు. గాడ్ ఫాదర్
అంటే నిరాకార శివుని వైపుకు బుద్ధి వెళ్తుంది. జీవాత్మలకు తండ్రి అయితే ఉంటారు కదా.
ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. నిరాకార తండ్రి పేరు శివ. మీకు కూడా
ఒకే పేరుంది - ఆత్మ. తర్వాత శరీరాలకు రకరకాల పేర్లు ఉంటాయి. పరమపిత పరమాత్మ కూడా
శరీరములోకి వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. శరీరము లేకుండా వినిపించలేరు. తండ్రి
అర్థం చేయిస్తున్నారు - ఇతనికైతే తనదంటూ పేరుంది, నాదంటూ శరీరానికి ఎలాంటి పేరు లేదు,
అలాగే నేను పునర్జన్మలలోకి రాను. నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను, ఈ విషయము ఇతనికి కూడా
తెలియదు. తిథి, తారీఖులేమీ లేవు. అయితే, నేను కల్పము యొక్క అంతిమములో అనగా రాత్రి
సమయములో వస్తాను. ఇప్పుడిది రాత్రి కదా. ఇది ఉన్నదే పతితుల ప్రపంచము. నేను పావన
ప్రపంచాన్ని అనగా పగలును తయారుచేయడానికి వస్తాను. బాబా ఎప్పుడు ప్రవేశించారనేది
ఇతనికి కూడా తెలియదు. అయితే, వినాశన సాక్షాత్కారాన్ని చూసారు. చాలామంది ధ్యానములోకి
వెళ్ళేవారు, వారు తిథి, తారీఖు, సమయము చెప్పలేకపోయేవారు. శ్రీకృష్ణుడిని కూడా
పూజిస్తారు, అతను రాత్రివేళ జన్మించినట్లుగా చూపిస్తారు. ఏ సమయములో జన్మించారు,
ఎన్ని నిమిషాలకు జన్మించారు మొదలైన లెక్కంతా తీస్తారు. తండ్రి అంటారు - నేను ఉన్నదే
నిరాకారుడిని. నా జన్మ, మిగిలిన మనుష్యులు జన్మ తీసుకున్నట్లుగా జరగదు. నాదైతే
దివ్య, అలౌకిక జన్మ. నేను ఇతనిలో ప్రవేశిస్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను. నందిపై రోజంతా
సవారీ చేయను. నన్ను పిల్లలు ఏ సమయములో గుర్తు చేస్తే, ఆ సమయములో నేను హాజరైపోతాను.
ఎలాగైతే మనుష్యులు పరస్పరము కలుసుకున్నప్పుడు, రామ-రామ లేదా నమస్తే అని
చెప్పుకుంటారో, అలా తండ్రి వచ్చి పిల్లలను కలిసినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తారు. ఈ
విషయాలను అనంతమైన ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. నేను పిల్లలైన మీ అందరికీ
తండ్రిని. కావున శివబాబా సంతానమైన మీరందరూ ఆత్మలు, పరస్పరము సోదరులు. అనంతమైన తండ్రి
వచ్చి ఉన్నారు, మాకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు అని సంతోషపు పాదరసము పైకి
ఎక్కాలి. పిల్లలను చూసి తండ్రికి కూడా సంతోషము కలుగుతుంది, చాలామంది పిల్లలు ఉన్నారు.
మమ్మల్ని బాబా స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తున్నారని, రాజ్యాధికారాన్ని
ఇస్తున్నారని పిల్లలకు తెలుసు. ప్రజలు కూడా - మా రాజ్యము అని అంటారు. ఎలాగైతే
భారతవాసులు, ఇది మా భారత దేశము అని అంటారో, అలా రాజు మరియు ప్రజలు ఇరువురూ, ఇది మా
దేశమని అంటారు. పిల్లలైన మీరు నరకవాసులుగా ఉన్నారు, తర్వాత స్వర్గవాసులుగా అవుతారు.
తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి, బాబా ఇంకే కష్టము ఇవ్వరు. ఉండటము
గృహస్థ వ్యవహారములోనే ఉండాలి. ఇక్కడకు వచ్చి ఉండటము కాదు. అందరూ ఇక్కడకు
పరుగెత్తుకుంటూ వస్తే, ఇంతమందిని బాబా ఎక్కడ ఉంచుతారు. ఇంతమంది పిల్లలందరూ ఒకేసారి
ఎలా కలిసి ఉండగలరు. అన్ని సెంటర్ల పిల్లలు ఒకేసారి ఎలా కలుసుకోగలరు. ఎక్కడ ఉంటారు.
కష్టము కదా. రోజురోజుకు పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు, దీనికి కూడా ఏదైనా యుక్తిని
రచించవలసి ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు అన్నింటినీ తీసుకోవలసి ఉంటుంది. ఎంత
కావాలని ఇల్లు కలవారిని అడుగుతారు. సమయానికి తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఇది డబ్బుకు
సంబంధించిన విషయము కాదు. సమయము చాలా సున్నితముగా అవుతూ ఉంటుంది. తండ్రి మరియు
పిల్లలు, ఇరువురూ అవినాశీ. అవినాశీ ఖజానాను పిల్లలకు ఇస్తారు. చాలామంది పిల్లలు
రావాల్సి ఉంటుంది. ఇంతమంది పిల్లలు వచ్చి ఎక్కడుంటారని బాబా ఆలోచిస్తారు. శివబాబా
అంటారు - నీవెందుకు చింతిస్తావు, ‘‘వెయిట్ అండ్ సీ’’ (వేచి చూడండి). నీవు చదువుకుంటూ
ఉండు, మన్మనాభవ.
ఇప్పుడు మనము కర్మాతీత అవస్థకు చేరుకోవాలని, సతోప్రధానముగా అవ్వాలని పిల్లలైన మీరు
గుర్తుంచుకోవాలి. స్మృతి ద్వారానే పావనముగా అవుతారు. బాబా చాలా సహజమైన విషయాలను
తెలియజేస్తారు. ఇది అతి సహజము - కేవలం బాబాను స్మృతి చేయాలి. చూడండి, దూడకు తన తల్లి
గుర్తుకు వచ్చినప్పుడు అరుస్తుంది కదా. అది జంతువు. పిల్లలైన మీరు కూడా ఆర్తనాదాలు
చేసారు కదా. మున్ముందు ఇంకా ఆర్తనాదాలు చేస్తారు, చాలా స్మృతి చేస్తారు. బాబా వచ్చి
ఉన్నారని, వినాశనమైతే తప్పకుండా జరగనున్నదని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ప్రకృతి
వైపరీత్యాలు రానున్నాయి. అందరూ పరస్పరములో కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. ఎంత
ఖర్చు చేసి బాంబులను తయారుచేస్తారు. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఖర్చు అయితే
అవుతుంది కదా. ఇంత ఖర్చు ఎక్కడ నుండి తీసుకువస్తారు. మృత్యువుకు భయపడతారు కూడా.
అయినా సరే, బాంబులు తయారుచేయడము ఆపరు. బాంబులతో యుద్ధము జరుగుతుంది. బాంబు పడగానే
మనుష్యులు మరణించే విధముగా ఇప్పుడు బాంబులను తయారుచేస్తున్నారు. వస్తువును
తయారుచేయడానికి మొదటిలో సమయము పడుతుంది కానీ తర్వాత నిమిషాల్లో తయారవుతుంది.
త్వరత్వరగా తయారుచేస్తూ ఉంటారు. బాంబులు కూడా తక్కువేమైనా తయారవుతాయా? ఈ పాత సృష్టి
వినాశనమవ్వనున్నదని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వము
తీసుకోవాలి.
గీత భారతవాసులైన మీ దేవీ-దేవతా ధర్మము యొక్క శాస్త్రము. మిగిలినవన్నీ చిన్న-చిన్నవి,
వాటికి గాయనమేమీ లేదు. బ్రాహ్మణ ధర్మము అన్నింటికంటే ఉన్నతమైనది. బ్రాహ్మణుల పని
కథను వినిపించడము. బ్రహ్మాకుమార-కుమారీలైన మనము బ్రహ్మాకు పిల్లలమని, మనకు తాతగారి
వారసత్వము లభిస్తుందని మీరు చెప్పవచ్చు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. డ్రామా యొక్క ప్రతి రహస్యాన్ని తెలుసుకుని ఏ విషయము గురించి చింతించకూడదు.
చదువును చదువుకుంటూ ఉండాలి. మన్మనాభవగా ఉంటూ కర్మాతీతముగా అయ్యే విషయము పట్ల శ్రద్ధ
వహించాలి. స్వయాన్ని సతోప్రధానముగా తయారుచేసుకోవాలి.
2. ఆత్మలమైన మనము శివబాబా సంతానము, పరస్పరము సోదరులము. శివబాబా నుండి
వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ సంతోషములో ఉండాలి.
వరదానము:-
ఆంతరిక స్వరూపములో స్థితులై స్వయము యొక్క మరియు బాబా యొక్క
గుప్త రూపాన్ని ప్రత్యక్షము చేసే సత్యమైన స్నేహీ భవ
ఏ పిల్లలైతే సదా ఆంతరిక స్థితిలో మరియు ఆంతరిక స్వరూపములో
స్థితులై అంతర్ముఖులుగా ఉంటారో, వారు ఎప్పుడూ ఏ విషయములోనూ చిక్కుకోలేరు. పాత
ప్రపంచము, సంబంధాలు, సంపద, పదార్థాలు ఏవైతే అల్పకాలికంగా మరియు ప్రదర్శనామాత్రంగా
ఉన్నాయో, వాటిని చూసి మోసపోలేరు. ఆంతరిక స్వరూపము యొక్క స్థితిలో ఉండటము ద్వారా
స్వయము యొక్క శక్తిస్వరూపము ఏదైతే గుప్తముగా ఉందో అది ప్రత్యక్షమైపోతుంది మరియు ఈ
స్వరూపము ద్వారానే బాబా ప్రత్యక్షత జరుగుతుంది. ఇటువంటి శ్రేష్ఠ కార్యాన్ని చేసేవారే
సత్యమైన స్నేహీలు.
స్లోగన్:-
నిశ్చయము మరియు
జన్మసిద్ధ అధికారము యొక్క గౌరవములో ఉన్నట్లయితే ఆందోళన చెందరు.
అవ్యక్త ప్రేరణలు -
సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి
స్వచ్ఛత కూడా సరళతకు
గుర్తు. ఎంత సరళత ఉంటుందో, అంత స్వచ్ఛత ఉంటుంది, అందుకే అందరినీ తమవైపుకు ఆకర్షితము
చేస్తారు. ఎప్పుడైతే తమ స్వభావాన్ని సరళముగా చేసుకుంటారో, అప్పుడే సత్యత మరియు
స్వచ్ఛత కూడా ఉంటాయి. సరళ స్వభావము కలవారు బహురూపిగా కూడా అవ్వగలరు. ఇటువంటి సరళ
స్వభావము కలవారు సదా హర్షితముగా ఉంటారు మరియు సర్వులను ఆకర్షిస్తారు.