22-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ హృదయముపై చేయి వేసుకుని ప్రశ్నించుకోండి, బాబా ఏదైతే వినిపిస్తున్నారో అవన్నీ నాకు ఇంతకుముందు తెలుసా, మీరు ఏదైతే విన్నారో దానిని అర్థ సహితముగా అర్థం చేసుకుని సంతోషముగా ఉండండి’’

ప్రశ్న:-
మీ ఈ బ్రాహ్మణ ధర్మములో అన్నింటికన్నా ఎక్కువ శక్తి ఉంది - అది ఏమిటి మరియు ఎలా?

జవాబు:-
మీ ఈ బ్రాహ్మణ ధర్మము ఎటువంటిదంటే, అది శ్రీమతమనుసారముగా మొత్తం విశ్వానికి సద్గతిని కలిగిస్తుంది. బ్రాహ్మణులే మొత్తం విశ్వాన్ని శాంతింపజేస్తారు. బ్రాహ్మణ కుల భూషణులైన మీరు దేవతలకన్నా ఉన్నతమైనవారు, మీకు తండ్రి ద్వారా ఈ శక్తి లభిస్తుంది. బ్రాహ్మణులైన మీరు తండ్రికి సహాయకులుగా అవుతారు, అన్నింటికన్నా గొప్ప ప్రైజ్ మీకే లభిస్తుంది. మీరు బ్రాహ్మాండానికి కూడా యజమానులుగా అవుతారు మరియు విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు.

ఓంశాంతి
మధురాతి-మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత ఒక్కసారి మాత్రమే తప్పకుండా వస్తారని ఆత్మిక పిల్లలకు తెలుసు. దానికి కల్పము అన్న పేరు పెట్టారు కనుక అలాగే అనవలసి వస్తుంది. ఈ డ్రామా లేక సృష్టి యొక్క ఆయుష్షు 5 వేల సంవత్సరాలు, ఈ విషయాలను ఒక్క తండ్రి మాత్రమే కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలను ఎప్పుడూ మనుష్యమాత్రులెవ్వరి నోటి ద్వారా వినలేరు. ఆత్మిక పిల్లలైన మీరు కూర్చుని ఉన్నారు. తప్పకుండా ఆత్మలైన మనందరికీ తండ్రి వారొక్కరే అని మీకు తెలుసు. తండ్రియే కూర్చుని పిల్లలకు తమ పరిచయాన్ని ఇస్తారు, వారి పరిచయము గురించి మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. గాడ్ లేక ఈశ్వరుడంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. వారిని గాడ్ ఫాదర్ తండ్రి అని అంటున్నప్పుడు మరి వారి పట్ల చాలా ప్రేమ ఉండాలి. వారు అనంతమైన తండ్రి కనుక వారి నుండి తప్పకుండా వారసత్వము కూడా లభిస్తూ ఉండవచ్చు. ఇంగ్లీషులో హెవెన్లీ గాడ్ ఫాదర్ అని మంచి మాట వాడతారు. స్వర్గము అని కొత్త ప్రపంచాన్ని అంటారు మరియు నరకము అని పాత ప్రపంచాన్ని అంటారు. కానీ స్వర్గము గురించి ఎవ్వరికీ తెలియదు. సన్యాసులైతే అసలు ఒప్పుకోరు. వారెప్పుడూ తండ్రి స్వర్గ రచయిత అని అనరు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అనే మాట చాలా మధురమైనది మరియు హెవెన్ కూడా ప్రసిద్ధమైనది. పిల్లలైన మీ బుద్ధిలో స్వర్గము మరియు నరకము యొక్క పూర్తి చక్రము, సృష్టి ఆదిమధ్యాంతాలు తిరుగుతూ ఉంటాయి, సర్వీసబుల్ గా ఉన్నవారి బుద్ధిలో తిరుగుతూ ఉంటాయి, అందరూ అయితే ఏకరసముగా సర్వీసబుల్ గా అవ్వరు.

మీరు మీ రాజధానిని మళ్ళీ స్థాపన చేస్తున్నారు. ఆత్మిక పిల్లలమైన మనము తండ్రి యొక్క శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతముపై నడుస్తున్నామని మీరు అంటారు. ఉన్నతోన్నతమైన తండ్రి ఇచ్చేదే శ్రీమతము. శ్రీమద్భగవద్గీత అని కూడా అంటూ ఉంటారు. ఇది మొదటి నంబరు శాస్త్రము. తండ్రి పేరు వినగానే వెంటనే వారసత్వము గుర్తుకొస్తుంది. గాడ్ ఫాదర్ నుండి ఏం లభిస్తుంది అన్నది ప్రపంచములోనివారికెవ్వరికీ తెలియదు. ప్రాచీన యోగము అనే పదము వాడతారు. కానీ ప్రాచీన యోగాన్ని ఎవరు నేర్పించారో అర్థం చేసుకోరు. వారైతే శ్రీకృష్ణుడే నేర్పించారని అంటారు ఎందుకంటే గీతలో శ్రీకృష్ణుని పేరు వేసేశారు. తండ్రియే రాజయోగాన్ని నేర్పించారని, దాని ద్వారా అందరూ ముక్తి-జీవన్ముక్తులను పొందుతారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. భారత్ లోనే శివబాబా వచ్చారని కూడా అర్థం చేసుకున్నారు, వారి జయంతిని కూడా జరుపుకుంటారు కానీ గీతలో వారి పేరు మాయమవ్వడముతో మహిమ కూడా మాయమైపోయింది. ఎవరి ద్వారానైతే మొత్తం ప్రపంచమంతటికీ సుఖ-శాంతులు లభిస్తాయో, ఆ తండ్రినే మర్చిపోయారు. దీనినే ఒకే ఒక్క పొరపాటు గల నాటకమని అంటారు. తండ్రి గురించి తెలియకపోవడమే అన్నిటికంటే పెద్ద పొరపాటు. ఒక్కోసారి, వారు నామ-రూపాలకు అతీతుడు అని అంటారు, మళ్ళీ వారే కూర్మావతారము, మత్స్యావతారము అని అంటారు, అలాగే రాయి-రప్పలలో కూడా ఉన్నారు అని అంటారు. పొరపాటు తర్వాత పొరపాటు జరుగుతూ ఉంటుంది. మెట్లు దిగుతూ వస్తారు, కళలు తగ్గిపోతూ వస్తాయి, తమోప్రధానముగా అవుతూ ఉంటారు. డ్రామా ప్లాన్ అనుసారముగా ఏ తండ్రి అయితే స్వర్గ రచయితనో, ఏ తండ్రి అయితే భారత్ ను స్వర్గానికి యజమానిగా చేసారో, వారిని రాయి-రప్పలలో ఉన్నారని అనేస్తారు. మీరు మెట్లు ఎలా దిగుతూ వచ్చారు అనేది ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎవ్వరికీ ఏమీ తెలియదు. డ్రామా అంటే ఏమిటి, అని అడుగుతూ ఉంటారు. ఈ ప్రపంచము ఎప్పుడు తయారయ్యింది, కొత్త సృష్టి ఎప్పుడు ఉండేది అని అడిగితే లక్షల సంవత్సరాల క్రితం ఉండేది అని అంటారు. పాత ప్రపంచానికి ఇప్పుడింకా చాలా సంవత్సరాలు మిగిలి ఉన్నాయి అని భావిస్తారు, దీనినే అజ్ఞాన అంధకారమని అంటారు. సద్గురువు అయిన పరమాత్మ జ్ఞానము అనే అంజనము ఇచ్చినప్పుడు మనసులోని అజ్ఞాన అంధకారము తొలగిపోతుంది అని గాయనము కూడా ఉంది. రచయిత అయిన తండ్రి తప్పకుండా స్వర్గాన్నే రచిస్తారని మీరు అర్థం చేసుకుంటారు. తండ్రియే వచ్చి నరకాన్ని స్వర్గముగా తయారుచేస్తారు. రచయిత అయిన తండ్రియే వచ్చి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. వారు రావడము కూడా అంతిమములోనే వస్తారు. సమయమైతే పడుతుంది కదా. స్మృతియాత్రకు ఎంతైతే సమయము పడుతుందో, జ్ఞానానికి అంత సమయము పట్టదని పిల్లలకు ఇది కూడా అర్థం చేయించారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం ఎవరి రాజ్యముండేది, ఆ రాజ్యము ఏమయింది అన్న విషయాలు తెలిపే ఈ 84 జన్మల కథ ఒక కథ వలె ఉంటుంది.

పిల్లలైన మీకు ఇప్పుడు మొత్తం జ్ఞానమంతా ఉంది. మీరు ఎంత సాధారణముగా ఉన్నారు. అజామిళ్ వంటి పాపులను, అహల్యలను, కుబ్జలను, ఆదివాసి స్త్రీలను ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు. ఎలా ఉన్న మీరు ఎలా తయారయ్యారు అనేది తండ్రి అర్థం చేయిస్తున్నారు. పాత ప్రపంచము యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూడండి అని తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. మనుష్యులకు సృష్టి చక్రమెలా తిరుగుతుంది అనేది ఏ మాత్రమూ తెలియదు. తండ్రి అంటున్నారు, మీరు మీ హృదయముపై చేయి వేసుకుని ప్రశ్నించుకోండి - ఇంతకుముందు ఇవేమైనా మాకు తెలుసా? ఏమీ తెలియదు. బాబా మళ్ళీ వచ్చి మాకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. విశ్వ రాజ్యాధికారము అంటే ఏమిటి అనేది ఎవ్వరి బుద్ధిలోకి రాదు. విశ్వమంటే మొత్తం ప్రపంచము. అర్ధకల్పము వరకు ఎవ్వరూ మన నుండి లాక్కోలేనటువంటి రాజ్యాన్ని తండ్రి మనకు ఇస్తున్నారని మీకు తెలుసు. కనుక పిల్లలకు ఎంత సంతోషముండాలి. తండ్రి నుండి ఎన్ని సార్లు రాజ్యము తీసుకున్నారు. తండ్రి సత్యమైనవారు, వారు సత్యమైన శిక్షకుడు కూడా, సద్గురువు కూడా. ఇది ఇంతకుముందు అసలు ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు అర్థ సహితముగా మీరు అర్థం చేసుకున్నారు. మీరు పిల్లలు, కావున తండ్రిని స్మృతి చేయగలరు. ఈ రోజుల్లో బాల్యములోనే గురువును ఆశ్రయిస్తారు. గురువుల ఫోటోలను తయారుచేసి మెడలో వేసుకుంటారు లేక ఇంట్లో పెట్టుకుంటారు. ఇక్కడ అద్భుతమేమిటంటే, తండ్రి, శిక్షకుడు, సద్గురువు అన్నీ ఒక్కరే. నేను నాతోపాటు తీసుకువెళ్తాను అని తండ్రి చెప్తున్నారు. మీరు ఏమి చదువుకుంటున్నారు అని మిమ్మల్ని అడుగుతారు. మీరు చెప్పండి - మేము కొత్త ప్రపంచములో రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు రాజయోగము చదువుకుంటున్నాము. ఇది రాజయోగము. ఉదాహరణకు బ్యారిస్టరు యోగము ఉంటే, అందులో బుద్ధియోగము తప్పకుండా బ్యారిస్టరు వైపుకు వెళ్తుంది. టీచరునైతే తప్పకుండా గుర్తు చేసుకుంటారు కదా. మేము స్వర్గ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకే చదువుకుంటున్నామని మీరు అంటారు. ఎవరు చదివిస్తున్నారు? భగవంతుడైన శివబాబా. వారి పేరు అయితే ఒక్కటే, అదే కొనసాగుతూ వచ్చింది. రథము యొక్క పేరు అయితే లేదు. నా పేరు శివ. తండ్రిని శివ అని మరియు రథమును బ్రహ్మా అని అంటారు. ఇది ఎంత అద్భుతమో మీకు ఇప్పుడు తెలుసు ఎందుకంటే శరీరమైతే ఒక్కటే. వీరిని భాగ్యశాలి రథమని ఎందుకంటారు? ఎందుకంటే వీరిలోకి శివబాబా ప్రవేశిస్తారు కావున తప్పకుండా రెండు ఆత్మలు ఉన్నాయి. ఇది కూడా మీకు తెలుసు, ఇంకెవ్వరికీ వీటి గురించి ఆలోచన కూడా రాదు. భగీరథుడు గంగను తీసుకువచ్చారని ఇప్పుడు చూపిస్తారు. వారు నీరును తీసుకువచ్చారా? ఏమి తీసుకువచ్చారు మరియు ఎవరు తీసుకువచ్చారు అనేది మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తున్నారు. ఎవరు ప్రవేశించారు? తండ్రి ప్రవేశించారు కదా. మనుష్యులలో నీరు ప్రవేశించదు. జటాజూటముల నుండి నీరు వస్తుందా. ఈ విషయాల గురించి మనుష్యులు ఎప్పుడూ ఆలోచించను కూడా ఆలోచించరు. రిలీజియన్ ఈజ్ మైట్ అని అంటారు అనగా ధర్మములో శక్తి ఉంది. అన్నింటికన్నా ఎక్కువగా ఏ ధర్మములో శక్తి ఉందో చెప్పండి? (బ్రాహ్మణ ధర్మములో). అవును, ఇది రైట్, ఏదైతే శక్తి ఉందో, అది బ్రాహ్మణ ధర్మములోనే ఉంది, ఇంకే ధర్మములోనూ ఏ మాత్రమూ శక్తి లేదు. మీరు ఇప్పుడు బ్రాహ్మణులు. బ్రాహ్మణులకు తండ్రి నుండి శక్తి లభిస్తుంది, దాని ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీలో ఎంత గొప్ప శక్తి ఉంది. మేము బ్రాహ్మణ ధర్మానికి చెందినవారము అని మీరంటారు. ఇవి ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోవు. విరాట రూపాన్ని తయారుచేసారు కానీ అది కూడా అసంపూర్ణముగా ఉంది. ముఖ్యమైన రచయిత గురించి మరియు వారి మొదటి రచన గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి రచయిత, ఆ తర్వాత బ్రాహ్మణులు పిలక వంటివారు, వీరిలోనే శక్తి ఉంది. తండ్రిని కేవలం స్మృతి చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. పిల్లలైతే తప్పకుండా నంబరువారుగానే తయారవుతారు కదా. మీరు ఈ ప్రపంచములో సర్వోత్తమ బ్రాహ్మణ కుల భూషణులు. మీరు దేవతల కన్నా ఉన్నతమైనవారు. మీకు ఇప్పుడు శక్తి లభిస్తుంది. అన్నింటికన్నా ఎక్కువ శక్తి బ్రాహ్మణ ధర్మములోనే ఉంది. బ్రాహ్మణులు ఏమి చేస్తారు? మొత్తం విశ్వమంతటినీ శాంతింపజేస్తారు. మీ ధర్మము ఎటువంటిదంటే, అది శ్రీమతమనుసారముగా సర్వులకు సద్గతినిస్తుంది. అందుకే తండ్రి - మిమ్మల్ని నా కన్నా కూడా ఉన్నతముగా తయారుచేస్తాను అని అంటారు. మీరు బ్రహ్మాండానికి కూడా యజమానులుగా, విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు. మొత్తం విశ్వమంతటిపై మీరు రాజ్యము చేస్తారు. భారత్ నా దేశము అని ఇప్పుడు పాడుతుంటారు కదా. ఒక్కోసారి మహిమ యొక్క పాటలు పాడుతారు, ఒక్కోసారి భారత్ పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటారు! భారత్ ఇంత ఉన్నతముగా ఎప్పుడు ఉండేదో వారికి తెలియదు! స్వర్గము మరియు నరకము ఇక్కడే ఉన్నాయని మనుష్యులు భావిస్తారు. ఎవరికైతే ధనము, కార్లు మొదలైనవి ఉన్నాయో, వారు స్వర్గములో ఉన్నారని భావిస్తారు. వాస్తవానికి స్వర్గము అని కొత్త ప్రపంచాన్నే అంటారని వారు అర్థం చేసుకోరు. ఇక్కడ అన్నీ నేర్చుకోవాలి. సైన్స్ యొక్క నైపుణ్యము కూడా అక్కడ ఉపయోగపడుతుంది. ఈ సైన్స్ కూడా అక్కడ సుఖము ఇస్తుంది. ఇక్కడైతే వీటన్నిటి ద్వారా అల్పకాలిక సుఖము ఉంటుంది. అక్కడ పిల్లలైన మీ కొరకు ఈ సుఖము సదాకాలికమైపోతుంది. ఇక్కడ అన్నీ నేర్చుకోవాలి, ఈ సంస్కారాలను తీసుకువెళ్తారు. ఇవి నేర్చుకునేందుకు కొత్త ఆత్మలేమీ రారు. ఇక్కడి పిల్లలే సైన్స్ నేర్చుకుని అక్కడికి వెళ్తారు, చాలా తెలివైనవారిగా అవుతారు. అన్ని సంస్కారాలను తీసుకువెళ్తారు, అవి మళ్ళీ అక్కడ ఉపయోగపడతాయి. ఇప్పుడు అల్పకాలిక సుఖముంది. ఆ తర్వాత ఈ బాంబులు మొదలైనవే అందరినీ అంతము చేసేస్తాయి. మృత్యువు లేకుండా శాంతి రాజ్యము ఎలా ఏర్పడుతుంది. ఇక్కడైతే అశాంతి రాజ్యము ఉంది. మేము మొట్టమొదట మా ఇంటికి వెళ్తాము, ఆ తర్వాత సుఖధామములోకి వస్తామని ఇది అర్థం చేసుకునేవారు కూడా మీలో నంబరువారుగా ఉన్నారు. సుఖములో అయితే తండ్రి రానే రారు. తండ్రి అంటారు, నాకు కూడా వానప్రస్థ రథము కావాలి కదా. భక్తి మార్గములో కూడా అందరి కోరికలను పూర్తి చేస్తూ వచ్చాను. భక్తులు తపస్య, పూజలు మొదలైనవి ఎలా చేస్తారో, దేవీలను అలంకరించి, పూజలు మొదలైనవి చేసి మళ్ళీ సముద్రములో ఎలా ముంచేస్తారో - ఇవన్నీ సందేశీలకు కూడా చూపించారు. ఎంత ఖర్చు అవుతుంది. ఇది ఎప్పటినుండి ప్రారంభమయ్యింది అని అడిగితే పరంపరగా కొనసాగుతూ వస్తుంది అని అంటారు. ఎంతగా భ్రమిస్తూ ఉంటారు. ఇది కూడా అంతా డ్రామా.

తండ్రి పదే-పదే పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - నేను మిమ్మల్ని చాలా మధురముగా తయారుచేయడానికి వచ్చాను. ఈ దేవతలు ఎంత మధురమైనవారు. ఇప్పుడు మనుష్యులు ఎంత చేదుగా ఉన్నారు. ఎవరైతే తండ్రికి చాలా సహాయము చేసారో, వారిని పూజిస్తూ ఉంటారు. మీకు పూజ కూడా జరుగుతుంది, మీరు పదవి కూడా ఉన్నతమైనది ప్రాప్తి చేసుకుంటారు. నేను మిమ్మల్ని నా కన్నా ఉన్నతముగా తయారుచేస్తాను అని తండ్రి స్వయం చెప్తున్నారు. ఉన్నతోన్నతమైన భగవంతునిది శ్రీమతము. గీతలో కూడా శ్రీమతము ప్రసిద్ధమైనది. శ్రీకృష్ణుడైతే ఈ సమయములో తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. శ్రీకృష్ణుని ఆత్మ యొక్క రథములో తండ్రి ప్రవేశించారు. ఇది ఎంత అద్భుతమైన విషయము. ఇది ఎప్పుడూ ఎవరి బుద్ధిలోకి రాదు. అర్థం చేసుకున్నవారికి కూడా ఇతరులకు అర్థం చేయించాలంటే చాలా శ్రమించవలసి ఉంటుంది. తండ్రి పిల్లలకు ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. సర్వోత్తమ బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు అని బాబా వ్రాస్తారు. మీరు ఉన్నతమైన సేవ చేస్తారు కావున ఈ ప్రైజ్ లభిస్తుంది. మీరు తండ్రికి సహాయకులుగా అయినట్లయితే అందరికీ నంబరువారు పురుషార్థానుసారముగా ప్రైజ్ లభిస్తుంది. మీలో కూడా చాలా శక్తి ఉంది. మీరు మనుష్యులను స్వర్గానికి యజమానులుగా చేయగలరు. మీరు ఆత్మిక సైన్యము. మీరు ఈ బ్యాడ్జి పెట్టుకోకపోతే, వీరు కూడా ఆత్మిక మిలట్రీ అని మనుష్యులు ఎలా అర్థం చేసుకుంటారు. మిలట్రీవారు సదా బ్యాడ్జి పెట్టుకుని ఉంటారు. శివబాబా కొత్త ప్రపంచ రచయిత. అక్కడ ఈ దేవతల రాజ్యము ఉండేది, అది ఇప్పుడు లేదు. తండ్రి చెప్తున్నారు - మన్మనాభవ. దేహ సహితముగా సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే శ్రీకృష్ణుని వంశములోకి వచ్చేస్తారు. ఇందులో సిగ్గుపడే విషయమేమీ లేదు. తండ్రి స్మృతి ఉంటుంది. వీరు నారాయణుడిని పూజించేవారు, నారాయణుడి మూర్తి వీరితో పాటు ఉండేది, నడుస్తూ-తిరుగుతూ దానిని చూస్తూ ఉండేవారు అని తండ్రి వీరి గురించి కూడా చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము ఉంది. బ్యాడ్జి అయితే తప్పకుండా పెట్టుకుని ఉండాలి. మీరు నరుడిని నారాయణునిగా తయారుచేసేవారు. రాజయోగాన్ని కూడా మీరే నేర్పిస్తారు. నరుని నుండి నారాయణునిగా తయారుచేసే సేవను చేస్తారు. నాలో ఎటువంటి అవగుణాలైతే లేవు కదా అని స్వయాన్ని చూసుకోవాలి.

పిల్లలైన మీరు బాప్ దాదా వద్దకు వస్తారు, తండ్రి శివబాబా, దాదా వారి రథము. తండ్రి తప్పకుండా రథము ద్వారానే కలుసుకుంటారు కదా. తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. సమ్ముఖముగా కూర్చోవడముతో గుర్తుకొస్తారు. తండ్రి తీసుకువెళ్ళేందుకే వచ్చారు. తండ్రి సమ్ముఖముగా కూర్చున్నారు కావున ఎక్కువ గుర్తు రావాలి. మీ స్మృతియాత్రను అక్కడ కూడా మీరు రోజూ పెంచుకోవచ్చు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయాన్ని చూసుకోవాలి - నాలో ఎటువంటి అవగుణాలైతే లేవు కదా! దేవతలు ఏ విధంగా మధురమైనవారో, నేను అదే విధంగా మధురముగా అయ్యానా?

2. తండ్రి యొక్క శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతముపై నడుస్తూ మీ రాజధానిని స్థాపన చేసుకోవాలి. సర్వీసబుల్ గా అయ్యేందుకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని, స్వర్గము మరియు నరకము యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో తిప్పాలి.

వరదానము:-
ఈశ్వరీయ సేవాధారి అన్న స్మృతి ద్వారా సహజ స్మృతిని అనుభవము చేసే సహజయోగీ భవ

ఈశ్వరీయ సేవాధారి అనగా ఖుదా లేక బాబా ఏ సేవనైతే ఇచ్చారో, ఆ సేవలోనే సదా తత్పరులై ఉండేవారు. మాకు స్వయంగా ఖుదాయే సేవను ఇచ్చారు అని సదా ఇదే నషాలో ఉండాలి. కార్యము చేసేటప్పుడు, ఎవరైతే కార్యమునిచ్చారో వారిని ఎప్పుడూ మర్చిపోవటము జరగదు. కావున కర్మణా సేవలో కూడా బాబా డైరెక్షన్ అనుసారముగా చేస్తున్నాము అన్న ఈ స్మృతి ఉన్నట్లయితే సహజముగానే స్మృతిని అనుభవము చేస్తూ సహజయోగిగా అయిపోతారు.

స్లోగన్:-
సదా ఈశ్వరీయ విద్యార్థి జీవితము యొక్క స్మృతి ఉన్నట్లయితే మాయ సమీపముగా రాలేదు.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

స్థాపనకు నిమిత్తమైనవారు ఎంతగా జ్వాలా రూపముగా అవుతారో, అంతగానే వినాశ జ్వాల ప్రత్యక్షమవుతుంది. సంగఠిత రూపములో జ్వాలా రూపపు స్మృతి విశ్వము యొక్క వినాశన కార్యాన్ని పూర్తి చేస్తుంది, దీని కొరకు ప్రతి సేవాకేంద్రములోనూ విశేషముగా యోగ కార్యక్రమాలు నడుస్తూ ఉండాలి, అప్పుడు వినాశ జ్వాల వేగము పుంజుకుంటుంది. యోగాగ్నితో వినాశన అగ్ని వెలుగుతుంది, జ్వాలతో జ్వాల ప్రజ్వలితమవుతుంది.