23-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ముఖ్యమైన రెండు విషయాలను అందరికీ అర్థం చేయించాలి - ఒకటి, తండ్రిని స్మృతి చేయండి, రెండు, 84 జన్మల చక్రాన్ని తెలుసుకోండి, అప్పుడిక అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి’’

ప్రశ్న:-
తండ్రి మహిమలో వచ్చే ఏ పదాలు శ్రీకృష్ణుని మహిమలో రావు?

జవాబు:-
వృక్షపతి ఒక్క తండ్రియే, శ్రీకృష్ణుడిని వృక్షపతి అని అనరు. తండ్రులకే తండ్రి అని, పతులకే పతి అని ఒక్క నిరాకారుడినే అంటారు, శ్రీకృష్ణుడిని కాదు. వీరిరువురి మహిమను వేరువేరుగా స్పష్టం చేయండి.

ప్రశ్న:-
పిల్లలైన మీరు పల్లె-పల్లెలో ఏ దండోరాను వేయించాలి?

జవాబు:-
మనుష్యుల నుండి దేవతలుగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా తయారవ్వవచ్చో వచ్చి అర్థం చేసుకోండి, స్థాపన, వినాశనము ఎలా జరుగుతాయో వచ్చి అర్థం చేసుకోండి అని పల్లె-పల్లెలో దండోరా వేయించండి.

పాట:-
నీవే తల్లివి, తండ్రివి నీవే...

ఓంశాంతి
ఈ పాట చివరిలో - నీవే నావవు, నీవే నావికుడవు... అనే వాక్యము ఏదైతే వస్తుందో, అది తప్పు. ఏ విధంగా మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అంటారో, అలా ఇది కూడా అటువంటిదే. జ్ఞాన ప్రకాశము కలవారు ఎవరైతే ఉంటారో, వారు వెంటనే ఆ పాటను ఆపేస్తారు ఎందుకంటే అది తండ్రిని అవమాన పరిచినట్లు అవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకైతే జ్ఞానము లభించింది, ఇతర మనుష్యులకు ఈ జ్ఞానము ఉండదు. మీకు కూడా ఇప్పుడే లభిస్తుంది. ఇక తర్వాత ఎప్పుడూ ఇది ఉండదు. గీతా భగవానుడి జ్ఞానము పురుషోత్తములుగా అయ్యేందుకు లభిస్తుంది అని ఇంతవరకు అర్థం చేసుకుంటారు. కానీ, ఎప్పుడు లభిస్తుంది, ఎలా లభిస్తుంది, ఇది మర్చిపోయారు. గీతా శాస్త్రము ధర్మ స్థాపనా శాస్త్రము, ఇంకే ఇతర శాస్త్రాలు ధర్మ స్థాపనార్థము ఉండవు. శాస్త్రము అనే పదము కూడా భారత్ లోనే ఉపయోగపడుతుంది. సర్వ శాస్త్రాలకూ శిరోమణి వంటిది ఈ గీత. ఇక మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వచ్చేవి. వాటిని శిరోమణి అని అనరు. వృక్షపతి ఒక్క తండ్రియేనని పిల్లలకు తెలుసు. వారు మన తండ్రి. వారు పతి కూడా, అలాగే అందరికీ పిత కూడా. వారిని పతులకే పతి, తండ్రులకే తండ్రి అని అంటారు. ఈ మహిమ ఒక్క నిరాకారునికే గాయనం చేయబడుతుంది. శ్రీకృష్ణుని మహిమను మరియు నిరాకారుడైన తండ్రి మహిమను పోల్చడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచానికి యువరాజు. మరి అతను పాత ప్రపంచములో సంగమయుగములో రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు! మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు. మీరు చదువుకుని ఇలా (దేవీ-దేవతలుగా) తయారవుతారు. తర్వాత ఇక ఈ జ్ఞానము ఉండదు. కనుమరుగైపోతుంది. పిండిలో ఉప్పులా ఏదో కొంత మిగులుతుంది, వారి చిత్రాలు మిగులుతాయి. వాస్తవానికి ఎవరి చిత్రాలూ యథార్థమైనవి కావు. మొట్టమొదట వారికి తండ్రి పరిచయము లభిస్తే, ఇక ఇదంతా భగవంతుడే అర్థం చేయిస్తున్నారని మీరు చెప్తారు. వారు అంతా స్వతహాగానే చెప్తారు. మీరు ఏమని ప్రశ్నలు అడుగుతారు! ముందు తండ్రినైతే తెలుసుకోండి.

తండ్రి ఆత్మలకు చెప్తారు - నన్ను స్మృతి చేయండి. కేవలం రెండు విషయాలను గుర్తుంచుకోండి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి, అంతే. ఈ రెండు ముఖ్యమైన విషయాలనే అర్థం చేయించాలి. తండ్రి అంటారు, మీకు మీ జన్మల గురించి తెలియదు. బ్రాహ్మణ పిల్లలతోనే ఇలా అంటారు, ఇతరులెవ్వరూ ఇది అర్థం చేసుకోలేరు కూడా. ప్రదర్శనిలో ఎంత గుంపు తయారవుతుందో చూడండి. ఇంతమంది మనుష్యులు వెళ్తున్నారంటే తప్పకుండా చూడదగినది ఏదో ఉండి ఉంటుంది అని భావిస్తారు, ఇక దూరిపోతారు. ఒక్కొక్కరికి కూర్చుని అర్థం చేయిస్తే నోరు అలిసిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రదర్శని మాసమంతా కొనసాగితే ఇలా చెప్పవచ్చు - ఈ రోజు చాలా గుంపుగా ఉన్నారు, రేపు, ఎల్లుండి రండి అని. అది కూడా ఎవరికైతే ఈ చదువు చదవాలనే కోరిక ఉందో మరియు మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలని అనుకుంటున్నారో వారికి అర్థం చేయించాలి. ఒక్క ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని లేక బ్యాడ్జీని చూపించాలి, అంతే. తండ్రి ద్వారా ఈ విష్ణుపురికి యజమానులుగా తయారవ్వవచ్చు, ఇప్పుడు గుంపుగా ఉంది, సెంటర్ కు రండి, చిరునామా అయితే వ్రాసి ఉంది అని చెప్పండి. అంతేకానీ, ఇది స్వర్గము, ఇది నరకము, అని ఊరికే అలా చెప్తే, దానితో మనుష్యులు ఏం అర్థం చేసుకుంటారు? టైమ్ వేస్ట్ అవుతుంది. అలాగని వీరు పెద్ద మనుష్యులా, షావుకారులా లేక పేదవారా అన్నది కూడా గుర్తించలేము. ఈ రోజుల్లో డ్రెస్ మొదలైనవి ఎలాంటివి ధరిస్తారంటే, వాటిని చూసి ఎవరూ అర్థం చేసుకోలేరు. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి స్వర్గ స్థాపనను చేసేవారు. ఇప్పుడు ఇలా తయారవ్వాలి. లక్ష్యము-ఉద్దేశ్యము నిలబడి ఉంది. తండ్రి అంటారు, ఉన్నతోన్నతమైనవాడిని నేను. నన్ను స్మృతి చేయండి, ఇదే వశీకరణ మంత్రము. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు విష్ణుపురిలోకి వచ్చేస్తారు. ఈ మాత్రమైతే తప్పకుండా అర్థం చేయించాలి. 8-10 రోజులు ప్రదర్శనీని పెట్టాలి. మీరు పల్లె-పల్లెలో దండోరా వేయించండి - మనుష్యుల నుండి దేవతలుగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా తయారవ్వవచ్చో వచ్చి అర్థం చేసుకోండి, స్థాపన, వినాశనము ఎలా జరుగుతాయో వచ్చి అర్థం చేసుకోండి అని దండోరా వేయించండి. యుక్తులు ఎన్నో ఉన్నాయి.

సత్యయుగానికి మరియు కలియుగానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉందని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మా యొక్క పగలు మరియు బ్రహ్మా యొక్క రాత్రి అని అనడం జరుగుతుంది. బ్రహ్మా యొక్క పగలే విష్ణు యొక్క పగలు, విష్ణువు యొక్క పగలే బ్రహ్మా యొక్క పగలు, విషయము ఒకటే. బ్రహ్మాకు కూడా 84 జన్మలు, విష్ణువుకు కూడా 84 జన్మలు. కేవలం ఈ లీప్ జన్మ యొక్క తేడా ఉంటుంది. ఈ విషయాలను బుద్ధిలో కూర్చోబెట్టవలసి ఉంటుంది. ధారణ లేకపోతే ఎవరికైనా ఎలా అర్థం చేయించగలరు? ఇది అర్థం చేయించడమైతే చాలా సహజము. కేవలం లక్ష్మీ-నారాయణుల చిత్రం ఎదురుగానే ఈ పాయింట్లు వినిపించండి. తండ్రి ద్వారా ఈ పదవి పొందాలి, నరకము యొక్క వినాశనము ఎదురుగా ఉంది. వాళ్ళు అయితే వాళ్ళ మానవ మతాన్నే వినిపిస్తారు. ఇక్కడ ఉన్నది ఈశ్వరీయ మతము, ఇది ఆత్మలైన మనకు ఈశ్వరుని ద్వారా లభించింది. నిరాకార ఆత్మలకు నిరాకారుడైన పరమాత్ముని మతము లభిస్తుంది. మిగిలినవన్నీ మానవ మతాలు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. సన్యాసులు మొదలైన వారెవ్వరూ కూడా ఈ మతాన్ని ఇవ్వలేరు. ఈశ్వరీయ మతము ఒకేసారి లభిస్తుంది. ఎప్పుడైతే ఈశ్వరుడు వస్తారో, అప్పుడు వారి మతము ద్వారా మనము ఇలా తయారవుతాము. వారు వచ్చేదే దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేయడానికి. ఈ పాయింట్లను కూడా ధారణ చేయాలి, ఇవి సమయానికి ఉపయోగపడతాయి. ముఖ్యమైన విషయాన్ని కొంచెములో వినిపించినా సరే సరిపోతుంది. ఒక్క లక్ష్మీ-నారాయణుల చిత్రముపై అర్థం చేయించినా సరిపోతుంది. ఇది లక్ష్యము యొక్క చిత్రము, భగవంతుడు ఈ కొత్త ప్రపంచాన్ని రచించారు. భగవంతుడే పురుషోత్తమ సంగమయుగములో వీరిని చదివించారు. ఈ పురుషోత్తమ యుగము గురించి ఎవ్వరికీ తెలియదు. కావున పిల్లలు ఈ విషయాలన్నీ విని ఎంత సంతోషించాలి. విని, ఆ తర్వాత వినిపించడములో ఇంకా ఎక్కువ సంతోషము కలుగుతుంది. సేవ చేసే వారినే బ్రాహ్మణులు అని అంటారు. మీ ప్రక్కన సత్యమైన గీత ఉంది. బ్రాహ్మణులలో కూడా నంబరువారుగా ఉంటారు కదా. కొందరు బ్రాహ్మణులైతే చాలా ప్రసిద్ధమైనవారు, వారు చాలా సంపాదిస్తారు. కొందరికైతే తినడానికి కూడా కష్టం మీద లభిస్తుంది. కొందరు బ్రాహ్మణులైతే లక్షాధికారులుగా ఉంటారు. చాలా సంతోషముతో, నషాతో, మేము బ్రాహ్మణ కులమువారమని చెప్పుకుంటారు. వారికి సత్యాతి, సత్యమైన బ్రాహ్మణ కులము గురించి తెలియనే తెలియదు. బ్రాహ్మణులను ఉత్తములుగా భావిస్తారు, అందుకే బ్రాహ్మణులకు తినిపిస్తారు. దేవతలకు, క్షత్రియులకు, లేక వైశ్యులకు, శూద్ర ధర్మము వారికి ఎప్పుడూ తినిపించరు. బ్రాహ్మణులకే తినిపిస్తారు, అందుకే బాబా అంటారు - ఆ బ్రాహ్మణులకు మీరు బాగా అర్థం చేయించండి. బ్రాహ్మణులవి కూడా సంగఠనలు జరుగుతూ ఉంటాయి, వాటి గురించి తెలుసుకుని వెళ్ళాలి. బ్రాహ్మణులనేవారు ప్రజాపిత బ్రహ్మా యొక్క సంతానమై ఉండాలి, మేము వారి సంతానము. బ్రహ్మా ఎవరి సంతానము అనేది కూడా అర్థం చేయించాలి. వారి సంగఠనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది తెలుసుకోవాలి. మీరు ఎంతోమంది కళ్యాణము చేయవచ్చు. వానప్రస్థ స్త్రీలవి కూడా సభలు జరుగుతూ ఉంటాయి. తాము ఎక్కడెక్కడికి వెళ్ళారు అనే సమాచారాన్ని బాబాకు ఎవ్వరూ ఇవ్వరు. మొత్తం అడివంతా నిండుగా ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళినా వేటాడి వస్తారు, ప్రజలను తయారుచేసుకుని వస్తారు, రాజులను కూడా తయారుచేయవచ్చు. సేవ అయితే చాలా ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత సెలవు దొరుకుతుంది, ఈ రోజు ఇక్కడ-ఇక్కడికి వెళ్ళాలి అని లిస్టులో నోట్ చేసుకోవాలి. బాబా యుక్తులనైతే ఎన్నో తెలియజేస్తారు. తండ్రి పిల్లలతోనే మాట్లాడుతారు. పక్కా నిశ్చయముండాలి - నేను ఆత్మను, బాబా (పరమ ఆత్మ) మనకు వినిపిస్తున్నారు, ధారణ చేయవలసింది మనము. శాస్త్రాలను అధ్యయనం చేసేవారు మళ్ళీ ఆ సంస్కారాలనే తీసుకువెళ్తారు, అప్పుడు మరుసటి జన్మలో కూడా ఆ సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. సంస్కారాలను తీసుకుని వచ్చారు అని అంటారు. ఎవరైతే చాలా శాస్త్రాలను చదువుతారో వారిని అథారిటీ (అధికారి) అని అంటారు. వారు తమను తాము ఆల్మైటీ (సర్వశక్తివంతునిగా) భావించరు. ఇది ఒక నాటకము, దీనిని తండ్రియే అర్థం చేయిస్తారు, ఇది కొత్త విషయమేమీ కాదు. డ్రామా తయారై ఉంది, దీనిని అర్థం చేసుకోవాలి. మనుష్యులు దీనిని పాత ప్రపంచముగా భావించరు. తండ్రి అంటారు, నేను వచ్చేశాను. మహాభారత యుద్ధము ఎదురుగా నిలబడి ఉంది. మనుష్యులు అజ్ఞానాంధకారములో నిద్రిస్తూ ఉన్నారు. అజ్ఞానము అని భక్తిని అంటారు. జ్ఞానసాగరుడైతే తండ్రియే. ఎవరైతే చాలా భక్తి చేస్తారో, వారు భక్తి సాగరులు. భక్తి మాల కూడా ఉంది కదా. భక్తి మాల పేర్లు కూడా పోగుచేయాలి. భక్తి మాల ద్వాపరము నుండి కలియుగము వరకే ఉంటుంది. పిల్లలకు చాలా సంతోషముండాలి. ఎవరైతే రోజంతా సేవ చేస్తూ ఉంటారో, వారికి చాలా సంతోషము ఉంటుంది.

బాబా అర్థం చేయించారు - మాల అయితే చాలా పొడుగ్గా ఉంటుంది, వేల సంఖ్యలో ఉంటుంది. దానిని కొందరు ఒకచోట నుండి, కొందరు మరోచోట నుండి లాగుతూ ఉంటారు. ఇంత పెద్ద మాలను తయారుచేసారంటే ఏదో ఉండి ఉంటుంది కదా. నోటితో రామ, రామ అని అంటూ ఉంటారు, ఎవరిని రామ రామ అని అంటూ తలచుకుంటున్నారు అని కూడా అడగాలి. మీరు ఏ సత్సంగాలకైనా వెళ్ళి వాళ్ళలో కలిసిపోయి కూర్చోవచ్చు. హనుమంతుని ఉదాహరణ ఉంది కదా. ఎక్కడైనా సత్సంగము జరుగుతుంటే అక్కడ చెప్పుల వద్దకు వెళ్ళి కూర్చునేవారు. మీరు కూడా అవకాశము తీసుకోవాలి. మీరు చాలా సేవ చేయవచ్చు. సేవలో సఫలత ఎప్పుడు లభిస్తుందంటే, జ్ఞాన పాయింట్లు బుద్ధిలో ఉన్నప్పుడు, జ్ఞానములో నిమగ్నమై ఉన్నప్పుడు. సేవ కోసం అనేక యుక్తులు ఉన్నాయి, రామాయణము, భాగవతము మొదలైనవాటికి సంబంధించి కూడా చాలా విషయాలు ఉన్నాయి, వాటిపై మీరు దృష్టి చూపొచ్చు. కేవలం అంధవిశ్వాసముతో సత్సంగములో కూర్చోకూడదు. మేము మీ కళ్యాణము చేయాలనుకుంటున్నాము అని చెప్పండి. ఆ భక్తి పూర్తిగా వేరు, ఈ జ్ఞానము వేరు. జ్ఞానాన్ని ఒక్క జ్ఞానేశ్వరుడైన తండ్రే ఇస్తారు. సేవ అయితే చాలా ఉంది. కేవలం - ఉన్నతోన్నతమైనవారు ఎవరు అన్నది తెలియజేయండి. ఉన్నతోన్నతమైనవారు ఒక్క భగవంతుడే, వారసత్వము కూడా వారి నుండే లభిస్తుంది. మిగిలినదంతా రచన. పిల్లలకు సేవా అభిరుచి ఉండాలి. మీరు రాజ్యము చేయాలి కావున ప్రజలను కూడా తయారుచేసుకోవాలి. ఈ మహామంత్రము తక్కువేమీ కాదు - తండ్రిని స్మృతి చేస్తే అంతిమ స్మృతిని బట్టి గతి లభిస్తుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఏ వశీకరణ మంత్రమునైతే ఇచ్చారో, దానిని అందరికీ గుర్తు చేయించాలి. సేవ కొరకు భిన్న-భిన్న యుక్తులను రచించాలి. గుంపులో తమ సమయాన్ని వృధా చేసుకోకూడదు.

2. జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ఉంచుకొని జ్ఞానములో పూర్తిగా నిమగ్నమైపోవాలి. హనుమంతుడిలా సత్సంగాలలోకి వెళ్ళి కూర్చోవాలి, ఆ తరువాత వారి సేవ చేయాలి. సంతోషంగా ఉండేందుకు రోజంతా సేవలో ఉండాలి.

వరదానము:-
నేను మరియు నాది అన్నదానిని బలిహారము చేసే సంపూర్ణ మహాబలి భవ

ఎవరైనా హద్దులోని వ్యక్తిపై లేక వైభవముపై ఆకర్షణ ఉండడము - నాది అనేది ఉండడమంటే ఇదే. ఈ నాది అనేదానిని మరియు నేను చేస్తున్నాను, నేను చేశాను... ఈ నేను అనేదానిని సంపూర్ణముగా సమర్పణ చేసేవారే అనగా బలి చేసేవారే మహాబలి. ఎప్పుడైతే హద్దులోని నేను, నేను అనేది సమర్పణ అవుతుందో, అప్పుడు సంపూర్ణముగా మరియు తండ్రి సమానముగా అవుతారు. నేను చేస్తున్నాను అన్నది ఉండకూడదు. బాబా చేయిస్తున్నారు, బాబా నడిపిస్తున్నారు. ఏ విషయములోనైనా నేను అనేదానికి బదులుగా సదా స్వాభావిక భాషలో కూడా - బాబా అన్న పదమే రావాలి, నేను అన్న పదము కాదు.

స్లోగన్:-
సంకల్పాలలో ఎటువంటి దృఢతను ధారణ చేయండి అంటే, దాని ద్వారా ఆలోచించడము మరియు చేయడము సమానమైపోవాలి.

మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ఇచ్చే సేవ చెయ్యండి

సమయమనుసారముగా ఇప్పుడు మనసా మరియు వాచా సేవలను కలిపి చెయ్యండి. కానీ వాచా సేవ సహజమైనది, మనసా సేవలో అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది, అందుకే సర్వాత్మల పట్ల మనసాలో శుభ భావన, శుభ కామనలతో కూడిన సంకల్పాలు ఉండాలి, మాటలలో మధురత, సంతుష్టత, సరళతతో కూడిన నవీనత ఉండాలి, అప్పుడు సహజంగా సఫలత లభిస్తూ ఉంటుంది.