23-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 19.03.20


‘‘నిర్మాణము మరియు నిర్మానత యొక్క బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకోండి’’

ఈ రోజు బాప్ దాదా తమ హోలీ, హ్యాపీ (పవిత్రంగా, సంతోషంగా ఉండే) హంసల సభలోకి వచ్చారు. నలువైపుల పవిత్ర హంసలు కనిపిస్తున్నాయి. హోలీ హంసల విశేషత గురించి అందరికీ చాలా బాగా తెలుసు. సదా హోలీ, హ్యాపీ హంసలు అనగా స్వచ్ఛమైన మరియు శుద్ధమైన మనసు కలవారు. ఇలా హోలీహంసలకు స్వచ్ఛమైన మరియు శుద్ధమైన మనసు ఉన్న కారణంగా శుభ ఆశలు అన్నీ సహజంగా పూర్తవుతాయి. సదా తృప్త ఆత్మలుగా ఉంటారు. శ్రేష్ఠ సంకల్పము చెయ్యగానే అది పూర్తవుతుంది. శ్రమ చెయ్యాల్సిన అవసరం ఉండదు. ఎందుకు? బాప్ దాదాకు అందరికంటే ప్రియమైనవారు, అందరికంటే సమీపమైనవారు ఎవరు అంటే శుద్ధమైన మనసు కలవారు, వారు ప్రియమనిపిస్తారు. శుద్ధమైన మనసు కలవారు సదా బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. వారి సర్వ శ్రేష్ఠ సంకల్పాలు పూర్తవుతాయి కనుక వృత్తిలో, దృష్టిలో, మాటలో, సంబంధ-సంపర్కములో సరళంగా మరియు స్పష్టంగా ఉంటారు మరియు ఇవన్నీ సమానంగా ఉన్నట్లు కనిపిస్తాయి. సరళతకు గుర్తు - మనసు, బుద్ధి, మాట అన్నీ సమానంగా ఉంటాయి. మనసులో ఒకటి, మాటలలో మరొకటి ఉంటే, ఇది సరళతకు గుర్తు కాదు. సరళ స్వభావము కలవారు సదా నిర్మానచిత్తులుగా, నిరహంకారులుగా, నిస్వార్థపరులుగా ఉంటారు. హోలీహంస విశేషత ఏమిటంటే - సరళ చిత్తము, సరళ వాణి, సరళ వృత్తి, సరళ దృష్టి.

బాప్ దాదా ఈ సంవత్సరము పిల్లలందరిలో నడవడిక మరియు ముఖములో రెండు విశేషతలను చూడాలనుకుంటున్నారు. మున్ముందు ఏం చెయ్యాలి అని అందరూ అడుగుతుంటారు కదా! ఈ సీజన్ యొక్క విశేష సమాప్తి తరువాత ఏం చెయ్యాలి? ఇక ముందు ఏం జరగనున్నది, ఇక ముందు ఏం చెయ్యాలి... అని అందరూ ఆలోచిస్తుంటారు కదా! సేవా క్షేత్రములో అయితే యథాశక్తిగా మెజారిటీవారు చాలా మంచి ప్రగతిని సాధించారు, ముందుకు వెళ్ళారు. బాప్ దాదా ఈ ఉన్నతి కోసం అభినందనలను కూడా ఇస్తున్నారు - చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది అని అంటారు. అలాగే రిజల్టులో ఒక విషయము కనిపించింది, దానిని వినిపించమంటారా? టీచర్లు చెప్పండి, వినిపించమంటారా? డబల్ విదేశీయులూ, వినిపించమంటారా? పాండవులూ, వినిపించమంటారా? చేతులెత్తండి, అప్పుడే వినిపిస్తాము లేదంటే వినిపించము. (అందరూ చేతులెత్తారు) చాలా మంచిది. ఒక విషయం ఏం చూసారు? ఎందుకంటే ఈరోజు వతనములో బాప్ దాదాలకు పరస్పరములో ఆత్మిక సంభాషణ జరిగింది, ఏ విధంగా ఆత్మిక సంభాషణ చేసుకుంటారు? ఇరువురూ ఒకరితో ఒకరు ఎలా ఆత్మిక సంభాషణ చేసుకుంటారు? ఏ విధంగా ఇక్కడ ఈ ప్రపంచములో మీరు ఏక పాత్రాభినయం చేస్తారు కదా! చాలా మంచి మంచివి చేస్తారు. మీ సాకారీ ప్రపంచంలో ఇలా చేసినప్పుడు ఒకే ఆత్మ రెండు పాత్రలను పోషిస్తుంది మరియు బాప్ దాదా విషయంలోనైతే రెండు ఆత్మలు, ఒకే శరీరము. తేడా ఉంది కదా! ఇది చాలా సరదా అనిపిస్తుంది.

మరి ఈరోజు వతనములో బాప్ దాదాలకు మధ్యన ఆత్మిక సంభాషణ జరిగింది - ఏ విషయంపై? బ్రహ్మాబాబాకు ఏ ఉల్లాసము ఉంటుందో మీకు తెలుసా? మీకు బాగా తెలుసు కదా? త్వరత్వరగా జరిగిపోవాలి అని బ్రహ్మాబాబాకు ఉల్లాసము ఉండేది. అప్పుడు శివబాబా బ్రహ్మాబాబాతో ఏమన్నారంటే - వినాశనము లేక పరివర్తన అవ్వటానికి ఒక్కసారి చప్పట్లు కొట్టినంత సమయం కూడా పట్టదు, ఒక్క చిటికె వేస్తే చాలు, కానీ ముందు మీరు 108 మణుల మాలను కాకపోయినా కనీసం అందులో సగం మాలను అయినా తయారుచేసి ఇవ్వండి. అప్పుడు బ్రహ్మాబాబా ఏం జవాబు ఇచ్చి ఉంటారు? చెప్పండి. (తయారవుతూ ఉన్నారు). అచ్ఛా - సగం మాల కూడా తయారవ్వలేదా? పూర్తి మాల సంగతి వదిలెయ్యండి, సగం మాల అయినా తయారయ్యిందా? (అందరూ నవ్వుతున్నారు) నవ్వుతున్నారంటే ఏదో ఉందని అర్థము! సగం మాల తయారయ్యింది అని ఎవరైతే అంటారో, వారు ఒక చేతిని ఎత్తండి. తయారయ్యిందా? చాలా తక్కువమంది ఉన్నారు. తయారవుతూ ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో, వారు చేతులెత్తండి. మెజారిటీ ఏమో మాల తయారవుతూ ఉంది అని అంటున్నారు మరియు మైనారిటీ ఏమో తయారైపోయింది అని అంటున్నారు. మాల తయారైపోయింది అని ఎవరైతే చేతులెత్తారో, వారితో బాప్ దాదా అంటున్నారు - మీరు ఆ సగం మాలలో వస్తారన్నవారి పేర్లు రాసి ఇవ్వండి. మంచి విషయం కదా! ఆ పేర్లను బాప్ దాదాయే చూస్తారు, మరెవ్వరూ చూడరు, అది బంద్ అయిపోతుంది. ఇటువంటి మంచి రత్నాలు ఎవరెవరు అన్నది బాప్ దాదా చూస్తారు. అటువంటివారు ఉంటారనే బాప్ దాదా కూడా అనుకుంటారు. వీరి నుండి పేర్లు తీసుకోండి, వీరి ఫోటోను తియ్యండి.

మరి బ్రహ్మాబాబా ఏం జవాబు ఇచ్చారు? మీరందరూ అయితే చాలా మంచి-మంచి జవాబులు ఇచ్చారు. మీరు చిటికె వెయ్యటమే ఆలస్యము, వారు తయారైపోతారు అని బ్రహ్మాబాబా అన్నారు. మరి మంచి విషయమే కదా! అప్పుడు శివబాబా అడిగారు - అచ్ఛా, మొత్తము మాల అంతా తయారైందా? సగం మాల విషయంలోనైతే సమాధానం దొరికింది, పూర్తి మాల గురించి అడిగారు. దాని కోసం కొంత సమయము కావాలి అని అన్నారు. ఇలా ఆత్మిక సంభాషణ జరిగింది. ఎందుకు కొంత సమయం కావాలి? ఆత్మిక సంభాషణలోనైతే ప్రశ్నోత్తరాలే నడుస్తాయి కదా. ఎందుకు కొంత సమయం కావాలి? ఏ విశేషమైన లోపం కారణంగా సగం మాల కూడా తయారవ్వకుండా ఆగిపోయింది? అప్పుడు బాబా నలువైపులా ప్రతి ఏరియా, ఏరియాలో ఉన్న పిల్లలను ఇమర్జ్ చేస్తూ వచ్చారు. ఏ విధంగా మీ జోన్లు ఉన్నాయి కదా, అలా ఒక్కొక్క జోన్ అని కాదు, జోన్లు అయితే చాలా చాలా పెద్దవి కదా. కావున ప్రతి ఒక్క విశేషమైన పట్టణాన్ని ఇమర్జ్ చేస్తూ వెళ్ళారు మరియు అందరి ముఖాలను చూస్తూ వెళ్ళారు. అలా చూస్తూ-చూస్తూ, బ్రహ్మాబాబా ఏమన్నారంటే - పిల్లలందరూ ఒక విశేషతను ఇప్పుడు త్వరత్వరగా ధారణ చేసినట్లయితే మాల తయారైపోతుంది. ఆ విశేషత ఏమిటి? సేవలో ఎంతో ఉన్నతిని సాధించారు, సేవ చేస్తూ ముందుకు వెళ్ళారు, చాలా మంచిగా ముందుకు వెళ్ళారు కానీ ఒక విషయంలో బ్యాలెన్స్ తక్కువగా ఉంది. అది ఈ విషయమే - నిర్మాణము చెయ్యటములోనైతే చాలా బాగా ముందుకు వెళ్ళారు కానీ నిర్మాణముతోపాటు నిర్మానత ఉండాలి - అది నిర్మాణము మరియు ఇది నిర్మానత. ఒక్క అక్షరమే తేడా. కానీ నిర్మాణము మరియు నిర్మానత, ఈ రెండింటి బ్యాలెన్స్ లో తేడా ఉంది. సేవా ఉన్నతిలో నిర్మానతకు బదులుగా అక్కడక్కడ, అప్పుడప్పుడు స్వ-అభిమానము కూడా మిక్స్ అయిపోతూ ఉంటుంది. ఎంతగా సేవలో ముందుకు వెళ్తారో, అంతగానే వృత్తిలో, దృష్టిలో, మాటలో, నడవడికలో నిర్మానత కనిపించాలి, ఈ బ్యాలెన్స్ ఉండటము ఇప్పుడు చాలా అవసరము. ఇప్పటివరకు సంబంధ-సంపర్కములోని వారందరి నుండి ఏ ఆశీర్వాదాలైతే లభించాల్సి ఉందో, ఆ ఆశీర్వాదాలు లభించలేదు. పురుషార్థాన్ని ఎవరు ఎంతగా చేసినా, అది మంచిదే, కానీ పురుషార్థముతోపాటు ఒకవేళ ఆశీర్వాదాల ఖాతా జమ అవ్వకపోతే దాతాతనపు స్థితి, దయార్ద్ర హృదయులుగా అయ్యే స్థితి యొక్క అనుభూతి అవ్వదు. ఇపుడు ఏం అవసరము అంటే - స్వ పురుషార్థము మరియు దానితో పాటుగా బాప్ దాదా మరియు పరివారములోని చిన్న-పెద్ద అందరి యొక్క ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలను పొందటమనేది పుణ్య ఖాతాను జమ చేసుకోవటము. ఇవి మార్కులలో అదనంగా కలుస్తాయి. సేవ ఎంతైనా చెయ్యండి, మీ సేవ ధ్యాసలో ముందుకు వెళ్తూ ఉండండి, కానీ బాప్ దాదా పిల్లలందరిలో ఏ విశేషత చూడాలనుకుంటున్నారంటే - సేవతోపాటు నిర్మానత, కలుపుగోలుతనము, ఈ పుణ్య ఖాతా జమ అవ్వటము చాలా-చాలా అవసరము. మళ్ళీ ఇలా అనకండి - నేనైతే చాలా సేవ చేసాను, నేను ఇది చేసాను, నేను అది చేసాను, నేను ఇది చేసాను, కానీ వెనక నంబరు ఎందుకు వచ్చింది? అందుకే బాప్ దాదా ముందు నుండే ఈ సూచనను ఇస్తున్నారు - వర్తమాన సమయములో ఈ పుణ్య ఖాతాను చాలా చాలా జమ చేసుకోండి. వీరైతే ఇలానే ఉంటారు, వీరైతే మారనే మారరు అని ఇలా ఆలోచించకండి. ప్రకృతినే మార్చగలిగినప్పుడు, ప్రకృతితోనే ఎడ్జెస్ట్ అవ్వగలిగినప్పుడు, బ్రాహ్మణ ఆత్మతో ఎడ్జెస్ట్ అవ్వలేరా? ఎగైనస్ట్ గా ఉన్నవారితో (ప్రతికూలముగా ఉన్నవారితో) ఎడ్జెస్ట్ అవ్వండి - ఇదే నిర్మాణము మరియు నిర్మానత యొక్క బ్యాలెన్స్. విన్నారా!

చివర్లో హోంవర్క్ అయితే ఇస్తారు కదా! ఏదో ఒక హోంవర్క్ అయితే లభిస్తుంది కదా! బాప్ దాదా అయితే రాబోయే సీజన్ లో వస్తారు కానీ... ఒక షరతు. చూడండి, సాకార పాత్ర కూడా నడిచింది, అవ్యక్త పాత్ర కూడా నడిచింది, ఇంత సమయం అవ్యక్త పాత్ర కూడా నడుస్తుంది అన్నది కలలో కూడా లేదు, కానీ రెండు పాత్రలూ డ్రామానుసారంగా నడిచాయి. ఇప్పుడిక ఏదో ఒక షరతును పెట్టాల్సి ఉంటుందా లేదా! మీ సలహా ఏమిటి? ఇలానే నడుస్తూ ఉంటుందా? ఎందుకు? ఈరోజు వతనంలో ప్రోగ్రాం గురించి కూడా అడిగారు. అందుకే బాప్ దాదాలకు మధ్యన ఆత్మిక సంభాషణలో ఇది కూడా నడిచింది - డ్రామాలో ఈ పాత్ర ఎంత వరకు? ఏదైనా తారీఖు ఉందా? (డెహ్రాడూన్ ప్రేమ్ దీదీతో) ఎప్పటివరకో జాతకాన్ని చెప్పండి? ఎప్పటి వరకు అన్న ప్రశ్న వచ్చిందిప్పుడు. కానీ... 6 నెలలు అయితే ఉంది కదా! 6 నెలల తరువాతే మరుసటి సీజన్ మొదలవుతుంది. కనుక బాప్ దాదా రిజల్టును చూడాలనుకుంటున్నారు. మనసు స్వచ్ఛంగా ఉండాలి, హృదయంలో పాత సంస్కారాలు, అభిమానము, అవమానము యొక్క ఫీలింగ్ కు సంబంధించిన మచ్చలు ఉండకూడదు.

బాప్ దాదా వద్ద కూడా హృదయం యొక్క చిత్రాన్ని తీసే మెషినరీ ఉంది. ఇక్కడ ఎక్స్ రేలో ఈ స్థూల హృదయం కనిపిస్తుంది కదా. అలా వతనములో హృదయం యొక్క చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రకరకాల చిన్న-పెద్ద మచ్చలు, మసకగా ఉన్నవి, స్పష్టంగా ఉన్నవి అన్నీ కనిపిస్తాయి.

ఈరోజు హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా! చివరి టర్న్ అయిన కారణంగా ముందుగా హోం వర్క్ ను తెలిపాము, కానీ హోలీని జరుపుకోవటము అనగా జరిగిపోయినదేదో జరిగిపోయింది అని హోలీ అర్థాన్ని ఇతరులకు వినిపిస్తారు కదా. హోలీని జరుపుకోవటము అనగా హృదయంలో ఎటువంటి చిన్న-పెద్ద మచ్చ లేకుండా ఉండటము, పూర్తిగా స్వచ్ఛమైన హృదయం, సర్వ ప్రాప్తి సంపన్నము. బాప్ దాదా ఈ విషయాన్ని ముందు కూడా వినిపించి ఉన్నారు - బాప్ దాదాకు పిల్లలపై ప్రేమ ఉన్న కారణంగా వారిలోని ఒక విషయము మంచిగా అనిపించదు, అదేమిటంటే - పిల్లలు చాలా శ్రమ చేస్తారు. ఒకవేళ హృదయం స్వచ్ఛంగా అయిపోతే శ్రమ ఉండదు, మనోభిరాముడు మీ మనసులో ఇమిడి ఉంటారు మరియు మీరు మనోభిరాముని మనసులో ఇమిడి ఉంటారు. మనసులో బాబా ఇమిడి ఉంటారు. అప్పుడు మాయ ఏ రూపములోనూ, అది సూక్ష్మ రూపములోనైనా, రాయల్ రూపములోనైనా, స్థూల రూపములోనైనా, ఏ రూపములోనైనా మాయ రాలేదు. స్వప్నమాత్రంగా, సంకల్పమాత్రంగా కూడా మాయ రాలేదు. అప్పుడు శ్రమ నుండి ముక్తులుగా అయిపోతారు కదా! బాప్ దాదా మనసులో కూడా శ్రమ నుండి ముక్తులవ్వటాన్ని చూడాలనుకుంటారు. శ్రమ నుండి ముక్తులుగా ఉన్నవారే జీవన్ముక్తిని అనుభవం చెయ్యగలరు. హోలీ జరుపుకోవటము అనగా శ్రమ నుండి ముక్తులుగా ఉంటూ జీవన్ముక్తి అనుభూతిలో ఉండటము. ఇప్పుడు బాప్ దాదా మనసా శక్తి ద్వారా సేవను శక్తిశాలిగా చెయ్యాలని కోరుకుంటున్నారు. వాణి ద్వారా సేవ జరుగుతూనే ఉంది. జరుగుతూనే ఉంటుంది. కానీ ఇందుకు సమయము పడుతుంది. సమయమేమో తక్కువగా ఉంది, కానీ సేవ ఇప్పటికీ ఎంతో ఉంది. రిజల్టును మీరందరూ వినిపించారు. ఇప్పటివరకు 108 మాలను కూడా తయారుచెయ్యలేకపోయారు, 16 వేలు, 9 లక్షలు - ఇవైతే ఇంకా చాలా దూరంలో ఉన్నాయి. దీని కోసం ఫాస్ట్ విధి కావాలి. ముందుగా మీ మనసును శ్రేష్ఠంగా, స్వచ్ఛంగా తయారుచేసుకోండి, ఒక్క క్షణము కూడా వ్యర్థంగా పోకూడదు. ఇప్పటికీ మెజారిటీలో వ్యర్థ సంకల్పాల పర్సెంటేజ్ మిగిలిపోయి ఉంది. అశుద్ధ సంకల్పాలు లేవు కానీ వ్యర్థ సంకల్పాలు ఉన్నాయి, అందుకే మనసా సేవ తీవ్ర గతితో జరగలేకపోతుంది. ఇప్పుడు హోలీని జరుపుకోవటము అనగా మనసును వ్యర్థము నుండి కూడా హోలీగా తయారుచేసుకోవటము.

హోలీని జరుపుకున్నారా? జరుపుకోవటము అనగా తయారవ్వటము. ప్రపంచములోని వారైతే రకరకాల రంగులతో హోలీని జరుపుకుంటారు కానీ బాప్ దాదా పిల్లలందరిపై దివ్య గుణాల, దివ్య శక్తుల, జ్ఞాన గులాబీ రంగును వేస్తున్నారు.

ఈరోజు వతనంలోని మరో సమాచారం కూడా ఉంది. ఆత్మిక సంభాషణకు సంబంధించిన ఒక సమాచారాన్ని అయితే వినిపించాము. రెండవ విషయం ఏమిటంటే - మీ మంచి మంచి సేవా సహచరులు ఎవరైతే ఎడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళారో, వారికి ఈరోజు వతనంలో హోలీ జరుపుకునే రోజు. మీ అందరికీ కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వారు గుర్తొస్తారు కదా. మీ దాదీలు, స్నేహితులు, పాండవుల యొక్క స్మృతి వస్తుంది కదా! ఎడ్వాన్స్ పార్టీ వారి గ్రూపు చాలా పెద్దదైపోయింది. పేర్లు తీస్తే చాలానే ఉన్నాయి. కావున వతనంలో ఈరోజు అన్ని రకాల ఆత్మలు హోలీ జరుపుకోవడానికి వచ్చారు. అందరూ తమ, తమ పురుషార్థం యొక్క ప్రారబ్ధం అనుసారంగా రకరకాల పాత్రలను అభినయిస్తున్నారు. ఎడ్వాన్స్ పార్టీ వారి పాత్ర ఇప్పటివరకు గుప్తంగా ఉంది. వారు ఏం చేస్తుంటారు అని మీరు ఆలోచిస్తుంటారు కదా? సంపూర్ణంగా అయ్యి దివ్య జన్మ ద్వారా కొత్త సృష్టికి నిమిత్తులుగా అవ్వండి అని వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అందరూ తమకు లభించిన పాత్రతో సంతోషంగా ఉన్నారు. మేము సంగమయుగము నుండి వచ్చాము అన్న స్మృతి వారికి లేదు. వారిలో దివ్యత ఉంది, పవిత్రత ఉంది, పరమాత్మ లగనము ఉంది, కానీ జ్ఞానం స్పష్టంగా ఇమర్జ్ అయ్యి లేదు. అతీతత్వము ఉంది. కానీ ఒకవేళ జ్ఞానం ఇమర్జ్ అయినట్లయితే అందరూ పరుగెత్తుకుని మధుబన్ కు వచ్చేస్తారు కదా! కానీ వారి పాత్ర అతీతమైనది. జ్ఞానం యొక్క శక్తి ఉంది, శక్తి తక్కువ అవ్వలేదు. నిరంతరము మర్యాదపూర్వకమైన ఇంటి వాతావరణము, తల్లిదండ్రుల సంతుష్టత మరియు స్థూల సాధనాలు, అన్నీ కూడా ప్రాప్తించాయి. మర్యాదలలో చాలా పక్కాగా ఉన్నారు. నంబరువారుగా అయితే ఉన్నారు కానీ విశేష ఆత్మలు పక్కాగా ఉన్నారు. మా పూర్వ జన్మ మరియు పునర్జన్మ చాలా గొప్పగా ఉండేవి మరియు ఉంటాయి అని అనుభూతి చెందుతారు. మెజారిటీ వారి యొక్క ముఖ కవళికలు కూడా ఒక రాయల్ ఫ్యామిలీకి చెందిన తృప్త ఆత్మల వలె, సంపన్న ఆత్మల వలె, హర్షితంగా ఉన్న ఆత్మల వలె మరియు దివ్య గుణ సంపన్న ఆత్మల వలె కనిపిస్తాయి. ఇది వారి చరిత్ర. కానీ వతనంలో ఏం జరిగింది? హోలీని ఎలా జరుపుకున్నారు? మీరు చూసే ఉంటారు, హోలీలో రకరకాల రంగుల పౌడర్లను పళ్ళాలతో నింపి పెడతారు. కావున వతనంలో కూడా, ఎలాగైతే రంగురంగుల పౌడర్లు ఉంటాయో, అలా చాలా చాలా చిన్న ప్రకాశిస్తూ ఉన్న వజ్రాలు ఉన్నాయి, కానీ అవి బరువుగా లేవు. ఏ విధంగా రంగు పౌడర్లను చేతిలోకి తీసుకుంటే తేలిగ్గా ఉంటాయి కదా, అలాగే రకరకాల రంగుల వజ్రాలతో పళ్ళాలు నిండి ఉన్నాయి. వారందరూ వచ్చినప్పుడు వతనంలో ఏ స్వరూపంలో ఉంటారో తెలుసా? లైట్ స్వరూపమే ఉంటుంది కదా! చూసారు కదా! లైట్ తో కూడిన ప్రకాశమయమైన శరీరమైతే ముందే మెరుస్తూ ఉంటుంది. బాప్ దాదా అందరినీ వారి సంగమయుగ శరీరములో ఇమర్జ్ చేసారు. సంగమయుగ శరీరములో ఇమర్జ్ అవ్వగానే ఒకరినొకరు కలుసుకోవటం ప్రారంభించారు. ఎడ్వాన్స్ పార్టీ జన్మ యొక్క విషయాలను మర్చిపోయారు మరియు సంగమయుగ విషయాలు ఇమర్జ్ అయ్యాయి. ఇలా పరస్పరం సంగమయుగ విషయాలు చెప్పుకుంటూ ఉంటే ఎంత సంతోషంలోకి వచ్చేస్తారో మీకు తెలుసు కదా. చాలా సంతోషంగా ఒకరి విషయాలు మరొకరికి చెప్పుకుంటున్నారు. అది చూసి బాప్ దాదా - వీరు చాలా ఆనందములోకి వచ్చారు కదా, సరేలే, వీరిని కలుసుకోనిద్దాము అని అనుకున్నారు. పరస్పరం తమ జీవితగాథలను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. బాబా ఇలా చెప్పారు, బాబా నాకు ఇంత ప్రేమను ఇచ్చారు, ఈ శిక్షణలను ఇచ్చారు, బాబా ఇలా చెప్తారు, ఇలా బాబా-బాబా, బాబా-బాబా అని అంటూనే మాట్లాడుకున్నారు. కాసేపటి తర్వాత ఏమైంది? అందరి సంస్కారాల గురించైతే మీకు తెలుసు కదా? ఈ గ్రూపులో అందరికంటే రమణీకమైనవారు ఎవరు? (దీదీ మరియు చంద్రమణి దాది). కావున దీదీ మొదటగా లేచారు, చంద్రమణి దాది చేతిని పట్టుకున్నారు మరియు రాస్ (నృత్యం) చెయ్యటం మొదలుపెట్టారు. దీదీ ఏ విధంగానైతే ఇక్కడ నషాలోకి వెళ్ళిపోయేవారో, అలా నషాలో బాగా రాస్ చేసారు. మమ్మాను మధ్యలో ఉంచారు, అందరూ వారి చుట్టూ గుండ్రంగా నిలుచున్నారు. అలా అందరూ కలిసి దాగుడుమూతల ఆట ఆడుకున్నారు, చాలా ఆడుకున్నారు మరియు బాప్ దాదా కూడా చూసి-చూసి చాలా నవ్వుకున్నారు. హోలీని జరుపుకోవటానికి వచ్చారు కనుక ఆడుకుంటారు కూడా. కొద్ది సమయం తరువాత అందరూ బాప్ దాదా బాహువులలో ఇమిడిపోయారు మరియు అందరూ పూర్తిగా లవలీనమైపోయారు మరియు ఆ తరువాత బాప్ దాదా అందరిపై రంగురంగుల వజ్రాలను వేసారు, అవి చాలా చిన్నగా ఉన్నాయి, ఏదైనా వస్తువును పొడి చేస్తే ఎలా ఉంటుందో, అలా ఉన్నాయి, కానీ మెరుపు చాలా ఉంది. దానిని బాప్ దాదా అందరిపై చల్లారు. ప్రకాశమయ శరీరం కదా, దానిపై రకరకాల రంగుల వజ్రాలు పడగానే అందరూ అలంకరించబడినట్లు మెరవడం ప్రారంభించారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ... ఇలా ఏడు రంగులు అని అంటారు కదా! అలా ఏడు రంగులూ ఉన్నాయి. అందరూ ఎంత మంచిగా మెరుస్తున్నారంటే సత్యయుగంలో కూడా ఇటువంటి వస్త్రాలు ఉండవు. అందరూ ఆనందములో మునిగిపోయి ఉన్నారు. తరువాత ఒకరిపై ఒకరు చల్లుకోవటం ప్రారంభించారు. రమణీకమైన అక్కయ్యలు కూడా చాలామంది ఉన్నారు కదా! చాలా, చాలా ఆనందంగా జరుపుకున్నారు. ఆ ఆనందం తర్వాత ఏం ఉంటుంది? బాప్ దాదా ముందుగానే అందరికీ భోగ్ తినిపించారు, మీరైతే రేపు భోగ్ పెడతారు కదా! కానీ బాప్ దాదా మధుబన్ యొక్క, సంగమయుగము యొక్క రకరకాల భోగ్ లను అందరికీ తినిపించారు. హోలీకి విశేష భోగ్ ఏముంటుంది? (గేవర్ - జిలేబి అనే మిఠాయి) మీరైతే గులాబీ పూలను కూడా వేపుతారు కదా. వీరికి వెరైటీ సంగమయుగ భోగ్ ను తినిపించాము, మీకంటే ముందు వీరికి తినిపించాము, మీకు రేపు లభిస్తుంది. అచ్ఛా! మొత్తానికి చాలా మంచిగా జరుపుకున్నారు, ఆడారు, పాడారు, అందరూ కలిసి వాహ్ బాబా, నా బాబా, మధురమైన బాబా అనే పాటలు పాడారు. ఆడారు, పాడారు, తిన్నారు. ఇక చివర్లో ఏముంటుంది? అభినందనలు మరియు వీడ్కోలు, మీరందరూ కూడా జరుపుకున్నారా లేక కేవలం విన్నారా? కానీ మొదట ఇప్పుడు ఫరిశ్తాగా అయ్యి ప్రకాశమయ శరీరం కలవారిగా అవ్వండి. అవ్వగలరా? లేదా? స్థూల శరీరము ఉందా? లేదు. క్షణములో మెరుస్తూ ఉండే డబల్ లైట్ స్వరూపులుగా అవ్వండి, అవ్వగలరా? పూర్తిగా ఫరిశ్తాలుగా అయిపోవాలి. (బాప్ దాదా అందరి చేత డ్రిల్ చేయించారు).

ఇప్పుడు మీపై రకరకాల రంగులతో ఉన్న మెరిసే వజ్రాలను సూక్ష్మ శరీరముపై వేసుకోండి మరియు సదా ఇటువంటి దివ్య గుణాల రంగులను, శక్తుల రంగులను, జ్ఞాన రంగులను స్వయముపై రంగరించుకుంటూ ఉండండి. అన్నింటికన్నా ఉన్నతమైన రంగు బాప్ దాదా సాంగత్యపు రంగు, ఈ రంగుతో సదా రంగరించబడి ఉండండి, ఈ విధంగా అమరులుగా అవ్వండి. అచ్ఛా.

దేశ విదేశాలలో ఫరిశ్తా స్వరూపులుగా ఉన్న ఇటువంటి పిల్లలకు, సదా స్వచ్ఛమైన హృదయము కల ప్రాప్తి సంపన్న పిల్లలకు, సత్యమైన హోలీని జరుపుకునే అనగా అర్థ సహితంగా చిత్రాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకువచ్చే పిల్లలకు, సదా నిర్మాణము మరియు నిర్మానత యొక్క బ్యాలెన్సును ఉంచే పిల్లలకు, సదా ఆశీర్వాదాల పుణ్య ఖాతాను జమ చేసుకునే పిల్లలకు చాలా చాలా పదమాల రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

మధురత ద్వారా తండ్రి సమీపతను సాక్షాత్కారము చేయించే మహాన్ ఆత్మా భవ

ఏ పిల్లల యొక్క సంకల్పములో కూడా మధురత, మాటలో కూడా మధురత మరియు కర్మలో కూడా మధురత ఉంటుందో, వారే తండ్రికి సమీపమైనవారు. అందుకే తండ్రి కూడా వారిని ప్రతిరోజూ - మధురాతి మధురమైన పిల్లలూ అని అంటారు, మరియు పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని బదులిస్తారు. కావున ప్రతిరోజూ పలికే ఈ మధురమైన మాటలు మధురతా సంపన్నంగా చేస్తాయి. ఇటువంటి మధురతను ప్రత్యక్షము చేసే శ్రేష్ఠ ఆత్మలే మహానులు. మధురతయే మహానత. మధురత లేకపోతే మహానత అనుభవమవ్వదు.

స్లోగన్:-

ఏ కార్యమునైనా డబల్ లైట్ గా అయ్యి చేసినట్లయితే మనోరంజనమును అనుభవం చేస్తారు.