23-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు మహాన్ సౌభాగ్యశాలురు ఎందుకంటే
భగవంతుడు మీకు ఎటువంటి చదువును చదివిస్తున్నారంటే, ఈ చదువును ఇప్పటివరకు ఏ
ఋషులు-మునులు కూడా చదువుకోలేదు’’
ప్రశ్న:-
డ్రామా యొక్క
ఏ రాతను పిల్లలైన మీరు తెలుసుకున్నారు కానీ ప్రపంచములోని మనుష్యులకు తెలియదు?
జవాబు:-
ఈ రుద్ర జ్ఞాన
యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమైందని మీకు తెలుసు. ఇప్పుడు మొత్తం పాత
ప్రపంచమంతా ఇందులో స్వాహా అయిపోతుంది. ఈ రాతను ఎవ్వరూ తప్పించలేరు. ఇది ఎటువంటి
అశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞమంటే, ఇందులో మొత్తం సామాగ్రి అంతా స్వాహా అవుతుంది,
ఇక మళ్ళీ మనము ఈ పతిత ప్రపంచములోకి రాము. దీనిని ఈశ్వరుని రాత అని అనరు, డ్రామా
యొక్క రాత అని అంటారు.
పాట:-
ముఖాన్ని
చూసుకో ప్రాణీ...
ఓంశాంతి
పిల్లలూ,
పిల్లలైన మీరు కూడా మనుష్యులే. ఇది మనుష్యుల సృష్టి. ఈ సమయములో మీరు బ్రాహ్మణ
ధర్మానికి చెందిన మనుష్యులుగా అయ్యారు. తండ్రి ఆత్మలకు శిక్షణను ఇస్తారు. ఆత్మనైన
నేను ఈ శరీరాన్ని నడిపించేవాడిని - అని ఆత్మకు ఇప్పుడు తన స్వధర్మము గురించి
తెలిసింది. ఇది ఆత్మ యొక్క రథము. ఏ విధముగా తండ్రి ఈ రథములోకి వచ్చి సవారీ
చేస్తున్నారో, అదే విధముగా మీ ఆత్మ కూడా ఈ రథముపై సవారీ చేస్తుంది. ఆత్మ కేవలం ఈ
జ్ఞానాన్ని మర్చిపోయింది - ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని, నా నివాస స్థానము
మూలవతనము, ఈ శరీరము నాకు ఇక్కడ లభిస్తుంది... ఈ విధముగా మీతో మీరు మాట్లాడుకోవాలి.
తండ్రి అంటారు - ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు. నేను శాంతిగా కూర్చోవాలి - అని
ఒకవేళ మీరనుకుంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శాంతిధామ నివాసిగా భావించండి. అప్పుడు
కొంత సమయము కోసం శాంతిగా కూర్చోగలరు. మనుష్యులు శాంతినే కోరుకుంటారు. మనసుకు శాంతి
కావాలని ఆత్మ అంటుంది. కానీ నేను ఆత్మను - అనే విషయము మనుష్యులకు తెలియదు. ఈ
విషయాన్ని మర్చిపోయారు. దీని గురించి ఒక కథ కూడా ఉంది - రాణి హారము మెడలోనే ఉంది
కానీ బయట వెతుకుతూ ఉన్నారు. అలాగే తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు - శాంతి మీ
స్వధర్మము. ఆత్మలమైన మేము శాంతి స్వరూపులమని, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు
వచ్చామని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ ఇంద్రియాల నుండి అతీతమైనప్పుడు ఆత్మ శాంతిగా
ఉంటుంది. ఆత్మ తన స్వధర్మమైన శాంతిలో ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోగలదు. ఒకవేళ
మీరు ఈ శరీరముతో పని చేయాలనుకోకపోతే, శాంతిగా కూర్చుండిపోండి. ఇది సత్యమైన శాంతి.
దీనిని మీరు వెతకరు. మీ స్వధర్మము శాంతి. ఇప్పుడు ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు.
మనము 84 జన్మల పాత్రను అభినయించామని తండ్రి ద్వారా తెలిసింది. ఈ 84 జన్మల చక్రము
గురించి ఎవరికీ తెలియదు. కేవలం పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. ముందు
మనము సూర్యవంశీ రాజులుగా లేక ప్రజలుగా ఉండేవారము, తర్వాత చంద్రవంశీయులుగా, ఆ తర్వాత
వైశ్యవంశీయులుగా, ఆ తర్వాత శూద్రవంశీయులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ మనము
సూర్యవంశీయులుగా అవ్వాలి.
పిల్లలైన మీరు సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు, మీరు ఎంతటి సౌభాగ్యశాలురు.
తండ్రి అయితే యథార్థమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఇది సద్గతి మార్గము. సర్వుల
సద్గతిదాత ఒక్కరేనని అర్థం చేయించాలి. బాబా వచ్చి 21 జన్మల కోసం మనకు సద్గతిని
ప్రాప్తి చేయిస్తున్నారని ఇప్పుడు తెలుసుకున్నారు. బయట మనుష్యులకు ఈ విషయాల గురించి
అసలు తెలియనే తెలియదు. బ్రహ్మాకుమార-కుమారీలైన మీకు మాత్రమే తెలుసు. బి.కె.లైన మీకు
ఏమి తెలుసు అని కొంతమంది అడుగుతారు. బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణీలేనా కాదా అనే
పరీక్ష అయితే జరగాల్సిందే. ఒకవేళ మీరు బ్రహ్మా పిల్లలైతే, సృష్టి చక్రము గురించి
తప్పకుండా తెలిసి ఉంటుంది. రచయిత అయిన తండ్రి గురించి తెలుసా? ఋషులు, మునులు
మొదలైనవారికైతే, రచయిత మరియు రచనల గురించి అసలు తెలియదు, అంటే వారు నాస్తికులైనట్లు.
మీరు కూడా నాస్తికులుగా ఉండేవారు. ఇంతకుముందు మీకు కూడా రచయిత అయిన తండ్రి గురించి
మరియు రచన ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. స్కూలుకు మొదట చదువు రానివారే వస్తారు.
తర్వాత స్కూల్లో ఇవి-ఇవి చదువుకున్నామని చెప్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ చదువులో
ఉన్నారు. పరమపిత పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది బుద్ధితో అర్థం చేసుకోవాలి.
రచయిత అయితే ఒక్క శివబాబా మాత్రమే. రుద్రుడు జ్ఞాన యజ్ఞాన్ని రచించారు అన్న విషయము
శాస్త్రాలలో కూడా ఉంది. ఇప్పుడు రుద్రుడికి మరియు శివ పరమాత్మకు తేడా అయితే ఏమీ లేదు.
రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల వెలువడిందని కూడా అంటూ ఉంటారు. కేవలం
రుద్రుడైన శివుని స్థానములో శ్రీకృష్ణుని పేరును వేసేశారు. గీత అయితే అదే. ఈ జ్ఞాన
యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమైందని అంటారు. కావున ఈ జ్ఞాన యజ్ఞము స్వరాజ్యము
కోసము. ఇందులో పాత ప్రపంచము స్వాహా అవ్వనున్నది. యజ్ఞములో అంతా ఆహుతి చేస్తారు అనగా
సామాగ్రినంతా వేస్తారు, అంతా స్వాహా చేసేస్తారు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞములో మొత్తం పాత
ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. మీరు ఇప్పుడు రాజయోగము నేర్చుకుంటున్నారు. ఈ పతిత
ప్రపంచములోకి ఇక మళ్ళీ రాము. ఈ ప్రపంచము ఇక సమాప్తమవ్వనున్నది. ప్రకృతి వైపరీత్యాలు
మొదలైనవన్నీ సంభవిస్తాయని మీకు తెలుసు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో కూర్చోవాలి. నా
బుద్ధిలోనే జ్ఞానమంతా ఉందని శివబాబా అంటారు. తండ్రి సత్యమైనవారు, చైతన్యమైనవారు,
జ్ఞానసాగరుడు. వారికి సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. మాకు రచయిత మరియు రచనల
గురించి తెలియదు అని ఋషులు, మునులు అంటారు. మీకు ఏమి లభిస్తుంది అని కొంతమంది
మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు చెప్పండి - పెద్ద-పెద్ద ఋషులు-మునులు మొదలైనవారు, మాకు
రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలియదు అని అనేవారు కదా, అది మాకు తెలుసు.
రచయిత అయిన తండ్రి తప్ప రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని ఎవరూ అర్థం చేయించలేరు.
రచయితయే అర్థం చేయిస్తారు. ఈగలకు కూడా రాణి ఉంటుందని మీకు తెలుసు. రాణి వెనుక మిగతా
ఈగలన్నీ వెళ్తాయి. రాణితో అనగా తల్లితో వాటికి ఎంతటి సంబంధముంటుంది. అనంతమైన తండ్రి
కూడా వచ్చి, పిల్లలందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. బాబా వచ్చి ఉన్నారని, ఆత్మలైన
మనల్ని తమతోపాటు శాంతిధామానికి తీసుకువెళ్తారని మీకు తెలుసు. మళ్ళీ మన సత్యయుగ
పాత్ర ప్రారంభమవుతుంది. ఆ పాత్రను అభినయించేందుకు మీరు ఈ దేవీ-దేవతా పదవిని
పొందుతున్నారు. మనుష్యుల నుండి దేవతా పదవిని పొందడానికే మీరు ఇక్కడకు వస్తారు. అన్ని
గుణాలను ఇక్కడే ధారణ చేయాలి. ఈ లక్ష్మీ-నారాయణుల వలె తయారవ్వాలి. వీరిని దివ్య
దృష్టితో తప్ప ఎవరూ చూడలేరు. మనము సూర్యవంశీ దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు.
స్వర్గము యొక్క రాజధాని ఎలా స్థాపనవుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది. సత్యయుగములో
దేవతల రాజ్యము మాత్రమే ఉండేది, కానీ దేవతల రాజ్యములో కూడా రాక్షసులు మొదలైనవారిని
చూపించారు. ఈ విషయము అసలు ఎవరికీ తెలియదు. భారత్ ఎంత పవిత్రముగా ఉండేది, సర్వగుణ
సంపన్నులుగా ఉండేవారు... అని మహిమను కూడా పాడుతారు. వారి ఎదురుగా తల వంచి కూడా
నమస్కరిస్తారు. మందిరాలు కూడా ఎన్నో తయారుచేయబడి ఉన్నాయి. కానీ సత్యయుగ ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మము ఎప్పుడు మరియు ఎలా స్థాపన అయ్యింది అనేది వారికి తెలియదు.
ఒకప్పుడు అంత ఉన్నతముగా ఉన్న భారత్, అంత తక్కువగా ఎలా అయ్యింది, ఇది ఎవరికీ తెలియదు.
ఈ రాత అలా తయారై, తయారుచేయబడినది అని అంటారు. దేని రాత? అది కూడా అర్థం చేసుకోరు.
డ్రామా రాతను అర్థం చేసుకున్నట్లయితే, డ్రామాను రచించిన క్రియేటర్, డైరెక్టర్ ఎవరు
అనేది అర్థమవుతుంది. కేవలం ఈశ్వరుని రాత అని అంటారు. డ్రామా అని అంటున్నప్పుడు
డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాలి. ఎవరైనా వెళ్ళి డ్రామాను చూడనంతవరకు, కేవలం
పుస్తకాలు చదవడముతో డ్రామా గురించి తెలియదు. ఒకసారి వార్తాపత్రికలో కూడా,
శ్రీకృష్ణుని చరిత్ర గురించి ఒక డ్రామా తయారైందని ప్రకటించారు. కానీ చూడకుండా దానిని
ఎవరూ అర్థం చేసుకోలేరు. చూసినప్పుడే డ్రామాలో ఇదంతా జరగనున్నదని అర్థం చేసుకుంటారు.
పిల్లలైన మీరు కూడా డ్రామాను ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాల
యొక్క ఈ చక్రము తిరుగుతూ ఉంటుందని మనుష్యులంటారు. కానీ ఎలా తిరుగుతుంది, ఇది ఎవరికీ
తెలియనే తెలియదు. సత్య-త్రేతాయుగాలు, ద్వాపర-కలియుగాలు, తర్వాత సంగమయుగమని పేర్లు
కూడా వ్రాసి ఉన్నాయి. కానీ ప్రతి యుగములోనూ వస్తారని మనుష్యులు అనుకున్నారు. సత్య,
త్రేతాయుగాల మధ్యన కూడా సంగమము ఉంటుంది. కానీ ఆ సంగమానికి మహత్వమేమీ లేదు. అక్కడేమీ
జరగదు. సత్యయుగీ సూర్యవంశీయులు తర్వాత చంద్రవంశీయులకు రాజ్యాన్ని ఎలా ఇచ్చారు అనే
విషయాలు మీకు తెలుసు. అలాగని చంద్రవంశీయులు సూర్యవంశీయులపై విజయము పొందారని కాదు.
అలా కాదు. చంద్రవంశీ రాజు ఎవరైతే ఉంటారో, అతనికి సూర్యవంశీ రాజు-రాణి రాజ్యభాగ్యము
యొక్క తిలకాన్ని దిద్ది సింహాసనముపై కూర్చోబెడతారు. రాజా రామా, రాణి సీత అనే
టైటిల్స్ లభిస్తాయి. అవి ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మీరు రాజ్యము చేయండి అని చెప్తూ,
సూర్యవంశీయులు ట్రాన్స్ఫర్ చేసారని అంటారు. ఈ దృశ్యాన్ని పిల్లలైన మీరు
సాక్షాత్కారములో చూసారు. అంతేకానీ యుద్ధమేమీ జరగదు. ఏదైనా రాజ్యాన్ని ఎలా
అప్పగిస్తారో, అక్కడ కూడా అలాగే ఇస్తారు. వారి పాదాలు మొదలైనవి కడిగి వారికి రాజ్య
తిలకాన్ని దిద్దుతారు. అక్కడ గురువులు మొదలైనవారెవరూ ఉండనే ఉండరు. మనము దైవీ
స్వభావము కలవారిగా అవుతామని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సూర్యవంశీ,
చంద్రవంశీయుల రాజ్యములో మనము ఎంత సుఖవంతులుగా ఉంటాము. బాబా మనల్ని దుఃఖము నుండి
బయటకు తీసి సుఖములోకి తీసుకువెళ్తారు. ఇతరులెవరూ సుఖవంతులుగా చేయలేరు. స్వయంగా
సాధు-సన్యాసులు కూడా, మేము శాంతిధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. తండ్రి అంటారు -
నేను ఈ సాధువులు మొదలైనవారిని కూడా ఉద్ధరించి అందరినీ శాంతిధామానికి తీసుకువెళ్తాను.
సన్యాసులైతే రావడమే ద్వాపరములో వస్తారు. స్వర్గములో దేవతలైన మనము మాత్రమే ఉంటాము.
అక్కడ కూడా వేర్వేరు సెక్షన్లు ఉంటాయి. సూర్యవంశీయులది వేరుగా, చంద్రవంశీయులది
వేరుగా ఉంటుంది, తర్వాత ఇస్లాములు, బౌద్ధులు, సన్యాసులు మొదలైనవారు ఎవరైతే వస్తారో,
అందరి సెక్షన్లు వేర్వేరుగా ఉంటాయి. మనము రాజ్యము చేసేటప్పుడు ఇతరులెవరూ ఉండేవారు
కాదు. మూలవతనములో కూడా ఇటువంటి నంబరువారు మాల తయారుచేయబడి ఉంది. ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మమువారి వంశము మొదటిది. తర్వాత వేరే వంశాలు వెలువడతాయి. ఈ వంశము
అన్నింటికన్నా గొప్పది. ఇక మిగతా ధర్మ స్థాపకులు ఎవరైతే వస్తారో, అందరూ దీని నుండి
వెలువడినవారు. ఇస్లామ్ వారిది సెకండ్ నంబర్ వంశమని మీరంటారు. తర్వాత బౌద్ధుల వంశము
థర్డ్ నంబర్. మనది ఫస్ట్. ఇకపోతే హద్దుకు చెందిన చిన్న-చిన్న వంశాలైతే లక్షల్లో
ఉంటాయి. ఇక్కడైతే ముఖ్యమైనవి నాలుగు వంశాలు. మొట్టమొదట మనము వస్తాము, తర్వాత
ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైనవారు వస్తారు. ఇప్పుడు మనము కిందకు
పడిపోయాము. మనమే 84 జన్మలు తీసుకుని పాత్రను అభినయించాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు
లాస్ట్ లో ఉన్నారో, వారే మళ్ళీ ఫస్ట్ లో ఉంటారు. దేవీ-దేవతలు ఇప్పుడు పతితముగా ఉన్న
కారణముగా, తమను తాము దేవీ-దేవతలుగా చెప్పుకోలేరు. దేవతలనైతే పూజిస్తాము, అంటే వారి
వంశమువారిమే అని ఋజువవుతుంది. సిక్కులు గురునానక్ ను నమ్ముతారు, వారు అతని వంశానికి
చెందినవారు. సత్యయుగములో మొదటి నంబరు వంశము మనదే. దాని కన్నా ఉన్నతమైన వంశము ఇంకేదీ
ఉండదు. మనము ఉన్నతోన్నతమైన వంశానికి చెందినవారము. మనము అందరికన్నా ఎక్కువ సుఖాన్ని
అనుభవిస్తాము, మళ్ళీ మనమే నిరుపేదలుగా అవుతాము. అందరికన్నా ఎక్కువ దుఃఖితులు వీరే.
అప్పులు కూడా వీరే తీసుకుంటూ ఉంటారు. ఎంత షావుకార్లుగా ఉండేవారు, ఇప్పుడు ఎంత
నిరుపేదలుగా ఉన్నారు. అంతా పోగొట్టుకొని కూర్చున్నారు. ఇది ఉన్నదే దుఃఖధామము.
ఇప్పుడు తండ్రి మిమ్మల్ని మళ్ళీ సుఖధామానికి యజమానులుగా చేస్తారు. మిగిలినవారంతా
శాంతిధామానికి వెళ్ళిపోతారు. అర్ధకల్పము మీరు సుఖాన్ని అనుభవిస్తారు, మిగిలినవారంతా
శాంతిలో ఉంటారు. మేము ముక్తిలోకి వెళ్ళాలని కోరుకుంటారు కూడా. సుఖాన్ని కాకి రెట్ట
సమానమైనదని భావిస్తారు. వారికి సుఖధామము యొక్క అనుభవమే లేదు. మీకు అనుభవము ఉంది.
మహిమను కూడా పాడుతారు కానీ పతితముగా అయిన కారణముగా మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి
స్మృతినిప్పిస్తున్నారు - ఓ భారతవాసులారా, మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు.
ద్వాపరము నుండి పేరు మార్చేసుకున్నారు. దేవతా ధర్మమువారే పతితముగా అయిపోయారు. ఓ
పతిత-పావనా రండి, అని పాడుతూ కూడా ఉంటారు. మీరు ఎన్ని జన్మలు పావన ప్రపంచములో
ఉండేవారు, ఎన్ని జన్మలు పతిత ప్రపంచములో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ పావన ప్రపంచములోకి
వెళ్ళాలి అని తండ్రి తెలియజేశారు. ఇది పాఠశాలలకే పాఠశాల, యజ్ఞాలకే యజ్ఞము. మొత్తం
పాత ప్రపంచమంతా ఇందులో సమాప్తమవ్వనున్నది. హోలికను కాలుస్తారు, ఈ పండుగలన్నీ
ఇప్పటివే. ఆత్మ వెళ్ళిపోతుంది, ఇకపోతే శరీరము సమాప్తమైపోతుంది. ఈ జ్ఞానాన్ని
సన్యాసులు మొదలైనవారెవరూ ఇవ్వలేరు. గీతలో కొంచెం జ్ఞానముంది కానీ అది పిండిలో ఉప్పు
అంత మాత్రమే ఉంది. ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. శివబాబా అంటారు - నేను ఈ యజ్ఞాన్ని
రచించాను, ఇందులో తనువు, మనసు, ధనము అంతా స్వాహా చేస్తారు, జీవిస్తూనే మరణిస్తారు.
ఈ జ్ఞానము మీకు ఇప్పుడు లభిస్తూ ఉంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సుఖధామానికి వెళ్ళేందుకు తమ స్వభావాన్ని దైవీ స్వభావముగా తయారుచేసుకోవాలి.
డ్రామా ఆదిమధ్యాంతాల రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుని హర్షితముగా ఉండాలి. అందరికీ ఇదే
రహస్యాన్ని అర్థం చేయించాలి.
2. స్వరాజ్యాన్ని తీసుకునేందుకు ఈ అనంతమైన యజ్ఞములో జీవిస్తూనే తమ తనువు, మనసు,
ధనములను స్వాహా చేయాలి. తమదంతా కొత్త ప్రపంచము కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
వరదానము:-
తమ మస్తకము ద్వారా మూడవ నేత్రపు సాక్షాత్కారాన్ని చేయించే
సత్యమైన యోగీ భవ
స్మృతిచిహ్నాలలో యోగీ మస్తకముపై మూడవ నేత్రాన్ని
చూపిస్తారు. సత్యమైన యోగీ పిల్లలైన మీరు కూడా మీ మస్తకము ద్వారా మూడవ నేత్రాన్ని
సాక్షాత్కారము చేయించేందుకు సదా బుద్ధి ద్వారా ఒక్క బాబా సాంగత్యములో ఉండండి. ఒకటి
బాబా, రెండు మనము, మూడవవారెవరూ ఉండకూడదు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో
అప్పుడు మూడవ నేత్రము యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. ఒకవేళ బుద్ధిలోకి
మూడవవారెవరైనా వచ్చినట్లయితే మూడవ నేత్రము మూసుకుపోతుంది. అందుకే సదా మూడవ నేత్రము
తెరవబడి ఉండాలి. దీని కోసం మూడవవారెవ్వరూ ఉండకూడదు అన్నది గుర్తుంచుకోండి.
స్లోగన్:-
ప్రశ్నచిత్తులుగా అవ్వడము అనగా ఆందోళన చెందడము మరియు ఆందోళన పరచడము.
అవ్యక్త ప్రేరణలు -
సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి
ఎవరు ఎటువంటి కర్మలు
చేస్తారో, దాని అనుసారముగానే వారికి పేరు కూడా వస్తుంది. కర్మలు ఒకవేళ శ్రేష్ఠముగా
ఉన్నట్లయితే, శ్రేష్ఠమణి అన్న పేరు వస్తుంది. శ్రేష్ఠమణిగా అయ్యేందుకు మనసు, వాణి,
కర్మలలో సరళత మరియు సహనశీలత, ఈ రెండు గుణాలు అవసరము. ఒకవేళ సరళత ఉండి సహనశీలత
లేకపోయినా కూడా శ్రేష్ఠము కారు, అందుకే సరళత మరియు సహనశీలత, రెండూ కలిపి ఉండాలి.