23-09-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - రాత్రింబవళ్ళూ లోలోపల బాబా, బాబా అన్న స్మృతి కొనసాగుతూనే ఉన్నట్లయితే అపారమైన సంతోషము ఉంటుంది, బాబా మనకు కుబేరుని ఖజానాను ఇవ్వడానికి వచ్చారు అని బుద్ధిలో ఉంటుంది’’

ప్రశ్న:-
బాబా ఏ పిల్లలను నిజాయితీపరులైన పుష్పాలు అని అంటారు? వారి గుర్తులను వినిపించండి?

జవాబు:-
ఎవరైతే ఎప్పుడూ మాయకు వశమవ్వరో వారే నిజాయితీపరులైన పుష్పాలు. వారు మాయ గొడవలోకి రారు. ఇటువంటి నిజాయితీపరులైన పుష్పాలు చివరిలో వచ్చినా కూడా ఫాస్ట్ గా వెళ్ళేందుకు పురుషార్థము చేస్తారు. వారు పాతవారికన్నా ముందుకు వెళ్ళే లక్ష్యాన్ని పెట్టుకుంటారు. తమ అవగుణాలను తొలగించుకునే పురుషార్థములో ఉంటారు. ఇతరుల అవగుణాలను చూడరు.

ఓంశాంతి
శివ భగవానువాచ. వారు ఆత్మిక తండ్రి ఎందుకంటే శివుడైతే సుప్రీమ్ ఆత్మ కదా, వారు ఆత్మ కదా. తండ్రి అయితే ప్రతిరోజూ కొత్త-కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. గీతను వినిపించే సన్యాసులు మొదలైనవారు ఎందరో ఉన్నారు. వారు తండ్రిని స్మృతి చేయలేరు. ‘బాబా’ అన్న పదము వారి నోటి నుండి ఎప్పుడూ వెలువడదు. ఈ పదము గృహస్థ మార్గము వారి కోసమే. సన్యాసులైతే నివృత్తి మార్గము వారు, వారు బ్రహ్మ తత్వమునే తలచుకుంటూ ఉంటారు. వారు తమ నోటితో ఎప్పుడూ శివబాబా అని అనరు, కావాలంటే మీరు పరిశీలించి చూడండి. గొప్ప-గొప్ప విద్వాంసులు, సన్యాసులు, చిన్మయానందుడు మొదలైనవారు గీతను వినిపిస్తారు కానీ వారు శ్రీకృష్ణుడిని గీతా భగవానుడిగా భావించి అతనితో యోగాన్ని జోడించగలరని కాదు, అలా కాదు. వారు ఎంతైనా బ్రహ్మ తత్వముతోనే యోగాన్ని జోడించే బ్రహ్మజ్ఞానులు లేక తత్వజ్ఞానులు. శ్రీకృష్ణుడిని ఎప్పుడూ ఎవరూ బాబా (తండ్రి) అని అనరు, అలా జరగదు. కావున శ్రీకృష్ణుడు గీతను వినిపించే తండ్రి అయితే కారు కదా. శివుడినయితే అందరూ బాబా అని అంటారు, ఎందుకంటే వారు సర్వాత్మలకూ తండ్రి. సర్వాత్మలూ వారిని, పరమపిత పరమాత్మ అని పిలుస్తారు. వారు సుప్రీమ్, ఉన్నతోన్నతమైనవారు ఎందుకంటే వారు పరంధామములో ఉంటారు. మీరు కూడా అందరూ పరంధామములోనే ఉంటారు కానీ వారిని పరమాత్మ అని అంటారు. వారు ఎప్పుడూ పునర్జన్మలలోకి రారు. వారు స్వయం అంటారు, నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది. ఈ విధంగా రథములోకి ప్రవేశించి మీకు విశ్వాధిపతులుగా తయారయ్యే యుక్తిని తెలియజేసేవారు ఇంకెవరూ ఉండరు. అందుకే తండ్రి అంటారు - నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అలా యథార్థ రీతిగా నా గురించి ఎవరికీ తెలియదు, నేను ఎప్పుడైతే నా పరిచయాన్ని ఇస్తానో అప్పుడే తెలుసుకోగలరు. ఈ బ్రహ్మమును లేక తత్వాలను నమ్మేవారు శ్రీకృష్ణుడిని తమ తండ్రిగా ఎలా అంగీకరిస్తారు? ఆత్మలందరూ అయితే పిల్లలే కదా. శ్రీకృష్ణుడిని అందరూ తండ్రి అని ఎలా అనగలరు. శ్రీకృష్ణుడు అందరికీ తండ్రి అని, మనమందరమూ సోదరులము అని అనరు. అలాగని శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అని కూడా కాదు. అందరూ శ్రీకృష్ణుడిగా ఎలా అవ్వగలరు? ఒకవేళ అందరూ శ్రీకృష్ణులు అయినట్లయితే మరి అతని తండ్రి కూడా కావాలి కదా. మనుష్యులు చాలా పొరపాటులో ఉన్నారు. వారికి తెలియదు. అందుకే కోట్లాదిమందిలో ఏ ఒక్కరో నన్ను తెలుసుకుంటారు అని అంటారు. శ్రీకృష్ణుడినైతే ఎవరైనా తెలుసుకోగలరు. విదేశీయులందరికీ కూడా అతను తెలుసు. లార్డ్ కృష్ణ అని అంటారు కదా. చిత్రము కూడా ఉంది, అసలైన చిత్రమైతే లేదు. భారతవాసుల నుండి వారు వింటారు, ఇతని పూజ ఎంతగానో జరుగుతుంది, కావున మళ్ళీ గీతలో శ్రీకృష్ణ భగవానుడు అని వ్రాసేసారు. ఇప్పుడు భగవంతుడిని ఎక్కడైనా లార్డ్ అని అంటారా? లార్డ్ అని కృష్ణుడిని అంటారు కదా. లార్డ్ అన్న టైటిల్ వాస్తవానికి పెద్ద వ్యక్తులకు లభిస్తుంది. వాళ్ళు అయితే అందరికీ ఇచ్చేస్తూ ఉంటారు, దీనిని అంధకార నగరము... అని అంటారు. ఏ పతిత మనుష్యులనైనా లార్డ్ అని అనేస్తారు. ఈ నాటి పతిత మనుష్యులు ఎక్కడ, శివుడు లేక శ్రీకృష్ణుడు ఎక్కడ! తండ్రి అంటారు, మీకు ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తానో, అది మళ్ళీ మాయమైపోతుంది. నేనే వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. జ్ఞానాన్ని కూడా నేను ఇప్పుడే ఇస్తాను. నేను ఎప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తానో, అప్పుడే పిల్లలు వినగలరు. నేను తప్ప ఇంకెవరూ దానిని వినిపించలేరు, ఎవరికీ తెలియనే తెలియదు.

సన్యాసులు శివబాబాను తలచుకోగలరా? నిరాకారుడైన భగవంతుడిని తలచుకోండి అని వారు అనలేరు కూడా. అలా ఎప్పుడైనా విన్నారా? చాలామంది చదువుకున్న మనుష్యులు కూడా అర్థం చేసుకోరు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, శ్రీకృష్ణుడు భగవంతుడు కాదు. మనుష్యులైతే అతడినే భగవంతుడు అని అంటూ ఉంటారు. ఎంత తేడా ఉంది. తండ్రి అయితే పిల్లలను కూర్చోబెట్టి చదివిస్తారు. వారు తండ్రి, టీచర్ మరియు గురువు కూడా. శివబాబా కూర్చుని అందరికీ అర్థం చేయిస్తారు. అర్థం చేసుకోని కారణముగా త్రిమూర్తి చిత్రములో అసలు శివుడినే ఉంచరు, బ్రహ్మాను ఉంచుతారు, అతడిని ప్రజాపిత బ్రహ్మా అని అంటారు. బ్రహ్మా ప్రజలను రచించేవారు కానీ వారిని భగవంతుడు అని అనరు. భగవంతుడు ప్రజలను రచించరు. భగవంతునికైతే ఆత్మలందరూ పిల్లలే, ఆ తరువాత ఎవరో ఒకరి ద్వారా ప్రజలను రచిస్తారు. మిమ్మల్ని ఎవరు దత్తత తీసుకున్నారు? బ్రహ్మా ద్వారా తండ్రి దత్తత తీసుకున్నారు. బ్రాహ్మణులుగా ఎప్పుడైతే అవుతారో, అప్పుడే దేవతలుగా అవుతారు. ఈ విషయాన్ని మీరు ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు. ప్రజాపితకు కూడా తప్పకుండా పాత్ర ఉంది. పాత్ర ఉండాలి కదా. ఇంతమంది ప్రజలు ఎక్కడి నుండి వస్తారు. ఇంతమందైతే కుఖవంశావళి ఉండరు. ఆ కుఖవంశావళి బ్రాహ్మణులు, మా ఇంటిపేరు బ్రాహ్మణ్ అన్ని అంటారు. పేర్లు అయితే అందరివీ వేర్వేరుగా ఉంటాయి. ఎప్పుడైతే శివబాబా వీరిలోకి ప్రవేశిస్తారో అప్పుడే వీరిని ప్రజాపిత బ్రహ్మా అని అంటారు. ఇవి కొత్త విషయాలు. తండ్రి స్వయం అంటారు - నా గురించి ఎవరికీ తెలియదు, సృష్టి చక్రము గురించి కూడా తెలియదు. అందుకే ఋషులు, మునులు అందరూ తెలియదు, తెలియదు అంటూ వచ్చారు. పరమాత్మ గురించీ తెలియదు, అలాగే పరమాత్ముని రచన గురించీ తెలియదు. తండ్రి అంటారు, ఎప్పుడైతే నేను వచ్చి నా పరిచయాన్ని ఇస్తానో అప్పుడే నన్ను తెలుసుకోగలుగుతారు. తాము ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది దేవతలకు అక్కడేమైనా తెలుస్తుందా. వారిలో జ్ఞానమే ఉండదు. పదవిని పొందిన తర్వాత ఇక జ్ఞానము యొక్క అవసరం ఉండదు. జ్ఞానము సద్గతి కోసమే కావాలి. వారైతే సద్గతిని పొందేసారు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన గుహ్యమైన విషయాలు. తెలివైనవారే అర్థం చేసుకుంటారు. ఇకపోతే వృద్ధ మాతలు ఎవరైతే ఉంటారో, వారిలో అంతటి బుద్ధి అయితే లేదు, డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి ఒక్కరికీ తమ-తమ పాత్ర ఉంది. ఓ ఈశ్వరా, బుద్ధిని ఇవ్వండి అని అయితే అనరు. అందరికీ ఒకే విధమైన బుద్ధిని నేను ఇచ్చినట్లయితే అందరూ నారాయణులుగా అయిపోతారు. మరి అలాంటప్పుడు సింహాసనముపై అందరూ ఒకరిపై ఒకరు కూర్చుంటారా! అయితే, అలా తయారయ్యే లక్ష్యమైతే ఉంది. అందరూ నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. పురుషార్థానుసారముగానే అవుతారు కదా. ఒకవేళ అందరూ - మేము నారాయణునిగా అవుతాము అని చేతులు ఎత్తితే తండ్రికి లోలోపల నవ్వు వస్తుంది కదా. అందరూ ఒకేలా ఎలా అవ్వగలరు! నంబరువారుగా అయితే ఉంటారు కదా. ఏ విధంగా ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటారు కదా... అలా నారాయణ ది ఫస్ట్, సెకండ్, థర్డ్... ఉంటారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఇదే అయినా సరే, మా నడవడిక ఇలా ఉంటే మేము ఏ పదవిని పొందగలము? అని ప్రతి ఒక్కరూ స్వయం అర్థం చేసుకోగలరు కదా. పురుషార్థమైతే తప్పకుండా చేయాలి. బాబా నంబరువారు పుష్పాలను తీసుకువస్తారు, అలాగే పుష్పాలను కూడా నంబరువారుగా ఇవ్వగలరు, కానీ అలా చేయరు, చేస్తే నిరాశకు లోనైపోతారు. ఎవరు ఎక్కువ సేవ చేస్తున్నారు అనేది బాబాకు తెలుసు మరియు వారు చూస్తారు కూడా, అటువంటి పిల్లలు మంచి పుష్పాలు. ఆ తర్వాత నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు. చాలామంది పాతవారు కూడా కూర్చున్నారు. కానీ వారిలో మంచి, మంచి కొత్త, కొత్త పుష్పాలు ఉన్నారు. వీరు నంబర్ వన్ నిజాయితీపరులైన పుష్పము, వీరిలో ఎటువంటి గొడవ, ఈర్ష్య మొదలైనవి లేవు అని అంటారు. చాలామందిలో ఏవో ఒక లోపాలు తప్పకుండా ఉన్నాయి. సంపూర్ణము అని అయితే ఎవ్వరినీ అనలేరు. 16 కళల సంపూర్ణులుగా అయ్యేందుకు ఎంతో కష్టపడాలి. ఇప్పుడు ఎవ్వరూ సంపూర్ణముగా అవ్వలేరు. ఇప్పుడైతే మంచి-మంచి పిల్లల్లో కూడా ఈర్ష్య ఎంతో ఉంది. లోపాలైతే ఉన్నాయి కదా. అందరూ ఎటువంటి పురుషార్థాన్ని చేస్తున్నారు అనేది బాబాకు తెలుసు. ప్రపంచం వారికి ఏమి తెలుసు. వారు ఏమీ అర్థం చేసుకోరు. చాలా కొద్దిమందే అర్థం చేసుకుంటారు. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు. అనంతమైన తండ్రి చదివించేందుకు వచ్చారు. ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారా మన పాపాలు అంతమైపోతాయి. మనం తండ్రి వద్దకు వచ్చాము, తండ్రి నుండి కొత్త ప్రపంచము యొక్క వారసత్వము తప్పకుండా లభిస్తుంది. 100 నుండి 1వ నంబర్ వరకూ నంబరువారుగా అయితే ఉంటారు కానీ తండ్రిని తెలుసుకున్న తర్వాత కొద్దిగా విన్నా స్వర్గములోకి తప్పకుండా వస్తారు. 21 జన్మల కొరకు స్వర్గములోకి రావడం ఏమైనా తక్కువ విషయమా! ఎవరైనా చనిపోతే 21 జన్మల కొరకు స్వర్గములోకి వెళ్ళారు అని అయితే అనరు. అసలు స్వర్గం ఎక్కడ ఉంది. ఎంతగా అపార్థమయ్యేలా చేసేసారు. పెద్ద-పెద్ద మంచి వ్యక్తులు కూడా ఫలానావారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. స్వర్గము అని దేనినంటారు, అర్థమేమీ అర్థం చేసుకోరు. ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు. వాస్తవానికి మీరు కూడా మనుష్యులే కానీ మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మీరు స్వయాన్ని బ్రాహ్మణులుగానే పిలుచుకుంటారు. బ్రాహ్మణులైన మీకు ఒక్క బాప్ దాదాయే ఉన్నారు. సన్యాసులను కూడా మీరు ఇలా అడుగవచ్చు - దేహ సహితముగా దేహపు సర్వ ధర్మాలనూ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఈ మహావాక్యమేదైతే ఉందో లేక భగవానువాచ ఏదైతే ఉందో, అక్కడ నన్నొక్కరినే స్మృతి చేయండి అని శ్రీకృష్ణుడు చెప్తున్నారా? మీరు శ్రీకృష్ణుడిని తలచుకుంటారా? మీరు ఇలా అడిగితే, సన్యాసులు ఎప్పుడూ అవును అని అనరు. అక్కడే ప్రసిద్ధమైపోతుంది. కానీ పాపం అబలలు వెళ్తారు, వారికేమి తెలుసు. సన్యాసులు తమ అనుచరుల ముందు క్రోధితులు అవుతారు, దూర్వాసుని పేరు కూడా ఉంది కదా. అతనిలో అహంకారం ఎంతో ఉంటుంది. ఎంతోమంది అనుచరులు ఉన్నారు. ఇది భక్తి యొక్క రాజ్యము కదా. వారిని ప్రశ్నించే శక్తి ఎవరిలోనూ ఉండదు. లేదంటే వారితో ఇలా అనవచ్చు - మీరు తండ్రియైన శివుడిని పూజిస్తున్నారు, మరి భగవంతుడు అని ఎవరిని అనాలి? రాయి, రప్పలలో భగవంతుడు ఉన్నారా? మున్ముందు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎంతటి నషా ఉంది. అందరూ పూజారులుగానే ఉన్నారు, వారిని పూజ్యులు అని అనరు.

తండ్రి అంటారు, నా గురించి అరుదుగా ఎవరికో తెలుసు, నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అలా పిల్లలైన మీలో కూడా ఏ ఒక్కరికో ఏక్యురేట్ గా (యథార్థ రీతిగా) తెలుసు, అటువంటివారికి లోలోపల చాలా సంతోషము ఉంటుంది. బాబాయే మనకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారు అని అయితే అర్థం చేసుకుంటారు కదా. కుబేరుని ఖజానాలు లభిస్తాయి. అల్లా అవల్దీన్ నాటకాన్ని కూడా చూపిస్తారు కదా. దీపాన్ని రుద్దినప్పుడు ఖజానా వెలువడింది. చాలా నాటకాలను చూపిస్తారు, ఏ చక్రవర్తికైతే ఖుదాయే స్వయం దోస్తుగా ఉన్నారో, అతను ఏమి చేసేవారు అన్నదానిపై కూడా ఒక కథ ఉంది. ఇలా ఎన్నో నాటకాలను చూపిస్తారు. ఎవరైతే వంతెనపై వచ్చేవారో, వారికి ఒక్క రోజు రాజ్యాన్ని ఇచ్చి రవాణా చేసేవారు. అవన్నీ కథలు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఖుదా పిల్లలైన మీకు స్నేహితుడు, వారు ఇతనిలోకి ప్రవేశించి మీతో పాటు తింటారు, తాగుతారు, ఆడుతారు కూడా. శివబాబా మరియు బ్రహ్మాబాబా యొక్క రథము ఒక్కటే కావున తప్పకుండా శివబాబా కూడా ఆడగలరు కదా. బాబాను స్మృతి చేస్తూ ఆడుతారు కావున ఇరువురూ ఇందులో ఉన్నారు. వారు ఇద్దరు కదా - బాబా మరియు దాదా. కానీ ఎవ్వరూ అర్థం చేసుకోరు. రథములో వచ్చారు అని అనడంతో వారు గుర్రపు బండి రథాన్ని తయారుచేసారు. శ్రీకృష్ణుడిలో శివబాబా కూర్చుని జ్ఞానాన్ని ఇస్తారు అని కూడా అనరు. వారేమో శ్రీకృష్ణ భగవానువాచ అని అంటారు. బ్రహ్మా భగవానువాచ అని అనరు కదా. వీరు రథము, శివ భగవానువాచ. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు తమ మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల పరిచయాన్ని, దాని వ్యవధిని తెలియజేస్తారు. విషయము ఎవరికీ తెలియదు. వివేకవంతులు ఎవరైతే ఉంటారో వారు బుద్ధిని ఉపయోగిస్తారు. సన్యాసులు అయితే సన్యసించాలి. మీరు కూడా శరీర సహితముగా అన్నింటినీ సన్యసిస్తారు. మీకు తెలుసు - ఇది పాత చర్మము, మనమైతే ఇప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి, ఆత్మయైన మనం ఇక్కడి నివాసులము కాము, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాము. మనం పరంధామ నివాసులము. అక్కడ నిరాకారీ వృక్షము ఎలా ఉంది అనేది కూడా పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఆత్మలు అక్కడ ఉంటారు, ఈ అనాది డ్రామా రచింపబడింది. ఎన్ని కోట్ల జీవాత్మలు ఉన్నారు. ఇంతమంది ఎక్కడ ఉంటారు? నిరాకారీ ప్రపంచములో. ఇకపోతే ఆ నక్షత్రాలైతే ఆత్మలు కాదు. మనుష్యులైతే ఆ నక్షత్రాలను కూడా దేవతలు అని అనేశారు. కానీ అవి దేవతలేమీ కావు. జ్ఞానసూర్యుడు అని అయితే మనం శివబాబానే అంటాము, కావున వారిని దేవత అని అనరు. శాస్త్రాలలో ఏవేవో విషయాలను వ్రాసేశారు. ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. వీటి ద్వారా మీరు కిందకు దిగజారుతూనే వచ్చారు. 84 జన్మలను తీసుకుంటారంటే తప్పకుండా కిందకు వస్తారు కదా. ఇప్పుడు ఇది ఇనుపయుగ ప్రపంచము. సత్యయుగాన్ని బంగారు ప్రపంచము అని అంటారు. అక్కడ ఎవరు ఉండేవారు? దేవతలు. వారు ఎక్కడికి వెళ్ళారు - అది ఎవరికీ తెలియదు. పునర్జన్మలు తీసుకుంటారు అని భావిస్తారు కూడా. బాబా అర్థం చేయించారు - పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ దేవతల నుండి మారి హిందువులుగా అయిపోయారు. పతితులుగా అయ్యారు కదా. ఇంకెవరి ధర్మమూ మారదు. వీరి ధర్మము ఎందుకు మారుతుందో ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు, ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిపోయారు. దేవీ, దేవతలుగా ఉన్నప్పుడు పవిత్ర జంటగా ఉండేవారు. తర్వాత రావణ రాజ్యములో మీరు అపవిత్రులుగా అయిపోయారు కావున దేవీ, దేవతలుగా పిలవబడలేరు, అందుకే హిందువులు అన్న పేరు వచ్చింది. దేవీ-దేవతా ధర్మాన్ని శీకృష్ణ భగవానుడు స్థాపించలేదు. తప్పకుండా శివబాబాయే వచ్చి స్థాపించి ఉంటారు. శివజయంతి, శివరాత్రి కూడా జరుపుకోబడుతుంది, కానీ వారు వచ్చి ఏమి చేసారు, అది ఎవరికీ తెలియదు. శివపురాణము కూడా ఒకటి ఉంది. వాస్తవానికి శివునిది ఒక్క గీతయే, దానిని శివబాబా వినిపించారు, ఇంకే శాస్త్రమూ వారిది కాదు. మీరు ఎటువంటి హింసనూ చేయరు. మీ శాస్త్రమేదీ తయారవ్వదు. మీరు కొత్త ప్రపంచములోకి వెళ్ళిపోతారు. సత్యయుగములో ఎటువంటి శాస్త్రమూ, గీత మొదలైనవి ఉండవు. అక్కడ ఎవరు చదువుతారు. ఈ వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ పరంపరగా నడుస్తూ వస్తున్నాయని వారు అంటారు. వారికి ఏమీ తెలియదు. స్వర్గములో శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. బాబా అయితే దేవతలుగా తయారుచేసారు, అందరి సద్గతి జరిగింది, ఇక శాస్త్రాలు చదవవలసిన అవసరం ఏముంది. అక్కడ శాస్త్రాలేవీ ఉండవు. ఇప్పుడు తండ్రి మీకు జ్ఞానపు తాళంచెవిని ఇచ్చారు, దీని ద్వారా బుద్ధి తాళం తెరుచుకుంది. ఇంతకుముందు తాళం పూర్తిగా మూసుకుపోయి ఉండేది, ఏమీ అర్థం చేసుకునేవారు కాదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరిపైనా ఈర్ష్య పడకూడదు. లోపాలను తొలగించుకుని సంపూర్ణముగా అయ్యే పురుషార్థము చేయాలి. చదువుతో ఉన్నత పదవిని పొందాలి.

2. శరీర సహితముగా అన్నింటినీ సన్యసించాలి. ఎటువంటి హింసనూ చేయకూడదు. అహంకారమును ఉంచుకోకూడదు.

వరదానము:-

అవినాశీ మరియు అనంతమైన అధికారము యొక్క సంతోషము మరియు నషా ద్వారా సదా నిశ్చింత భవ

ప్రపంచములో చాలా కష్టపడి అధికారాన్ని తీసుకుంటారు, మీకైతే కష్టము లేకుండానే అధికారము లభించింది. పిల్లలుగా అవ్వటము అనగా అధికారాన్ని తీసుకోవటము. ‘‘వాహ్, శ్రేష్ఠ అధికారీ ఆత్మనైన నేను’’, ఈ అనంతమైన అధికారము యొక్క నషా మరియు సంతోషములో ఉన్నట్లయితే సదా నిశ్చింతులుగా ఉంటారు. ఈ అవినాశీ అధికారము నిశ్చితమయ్యే ఉంది. ఎక్కడైతే నిశ్చితమై ఉంటుందో అక్కడ నిశ్చింతగా ఉంటారు. మీ బాధ్యతలన్నింటినీ తండ్రికి అర్పించినట్లయితే అన్ని చింతల నుండి ముక్తులైపోతారు.

స్లోగన్:-

ఎవరైతే ఉదారచిత్తులుగా, విశాల హృదయులుగా ఉంటారో, వారే ఐక్యతకు పునాది వంటివారు.