24-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'


‘‘ఈ కర్మక్షేత్రములో కర్మ అనాది అయినటువంటిది, మీరు కర్మను వదలకూడదు కానీ కర్మయోగిగా అవ్వాలి’’

(జగదంబ మాత స్మృతి దివసము సందర్భముగా వినిపించేందుకు వారి ద్వారా ఉచ్చరింపబడిన మధుర మహావాక్యాలు)

ఈ సృష్టి కర్మల పొలము, ఇక్కడ ప్రతి మనుష్యాత్మ తమ-తమ పాత్రను పోషిస్తున్నారు, ఇందులో పరమాత్మునికి కూడా పాత్ర ఉంది, కానీ వారు ఆత్మల వలె జనన-మరణాలలోకి రారు, అలాగే ఆత్మల వలె వారి కర్మల ఖాతా తలక్రిందులుగా అవ్వదు. వారు అంటారు - నేనైతే కేవలం ఆత్మలైన మిమ్మల్ని విముక్తులుగా చెయ్యటానికి వస్తాను, అందుకే నన్ను ముక్తిప్రదాత మరియు బంధనము నుండి విడిపించే గతి-సద్గతుల దాత అని అంటారు.

ఆత్మపై మాయ యొక్క బంధనమేదైతే ఏర్పడిందో, దానిని తొలగించి పవిత్రముగా తయారుచేస్తారు మరియు వారు అంటారు - నా పని ఆత్మలను సర్వ బంధనాల నుండి విడిపించి తిరిగి తీసుకువెళ్ళటము. కనుక సృష్టి యొక్క అనాది నియమాలు మరియు పద్ధతులు ఏవైతే ఉన్నాయో, వాటిని కూడా అర్థం చేసుకోవాలి. ఈ మనుష్య సృష్టి యొక్క వృద్ధి ఏ విధముగా జరుగుతుంది అన్నది కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత, ఆ సంఖ్య తక్కువయ్యే సమయము కూడా వస్తుంది. సృష్టిలో సంఖ్య పెరుగుతుందంటే ఇక అది పెరుగుతూనే ఉంటుందని కాదు. అది తర్వాత తగ్గుతుంది కూడా. సృష్టిలో ప్రతిదానికీ ఒక నియమము ఉంది. తమ ఈ శరీరానికి కూడా నియమము ఉంది. ముందు బాల్యము, ఆ తర్వాత కౌమార్యము, యవ్వనము, ఆ తర్వాత వృద్ధాప్యము. వృద్ధులుగా కూడా త్వరగా అవ్వరు, వృద్ధులుగా అవుతూ-అవుతూ శిథిలావస్థకు చేరుకుంటారు. కనుక ప్రతీదీ పెరగటము, మరల అది అంతమవ్వటము, ఇది కూడా నియమము. ఇదే విధముగా సృష్టిలోని జనరేషన్లకు (తరాలకు) కూడా నియమము ఉంది. జీవితములో కూడా స్టేజెస్ ఉన్నాయి, అలాగే జన్మలలో కూడా స్టేజెస్ ఉన్నాయి, అలాగే గతించిన జనరేషన్లలో కూడా స్టేజెస్ ఉన్నాయి, అదే విధముగా అన్ని ధర్మాలకు కూడా స్టేజెస్ ఉన్నాయి. మొదట ఏ ధర్మమైతే ఉందో, అది అన్నింటికంటే శక్తివంతమైనది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఎవరైతే వస్తారో, వారి శక్తి తక్కువవుతూ ఉంటుంది. కావున ధర్మాల విభజన, ధర్మాలు నడవటము, ప్రతి విషయము నియమము అనుసారముగా జరుగుతుంది, ఈ అన్ని విషయాలను కూడా అర్థం చేసుకోవాలి.

ఈ లెక్కనే బాబా కూడా చెప్తున్నారు, నాకు కూడా ఇందులో పాత్ర ఉంది. నేను కూడా ఒక ఆత్మను, భగవంతుడినైన నేను వేరే ఏమిటో కాదు, నేను కూడా ఆత్మనే, కానీ నా కర్తవ్యము చాలా పెద్దది మరియు ఉన్నతమైనది, అందుకనే నన్ను భగవంతుడు అని అంటారు. మీరు ఎలా అయితే ఆత్మనో అలానే నేను కూడా ఆత్మనే. ఏ విధముగా మీ సంతానము కూడా మనుష్యులే, మీరు కూడా మనుష్యులే. అందులోనైతే ఎటువంటి తేడా లేదు కదా. అలానే నేను కూడా ఆత్మనే. ఆత్మకు, ఆత్మకు మధ్యన ఎటువంటి తేడా లేదు, కానీ కర్తవ్యములో చాలా పెద్ద తేడా ఉంది. అందుకే, నా కర్తవ్యము ఏదైతే ఉందో అది అన్నిటికంటే భిన్నమైనది అని అంటారు. నేను హద్దుకు చెందిన ఒక ధర్మ స్థాపకుడిని కాను, నేనైతే ప్రపంచము యొక్క రచయితను, వారు ధర్మము యొక్క రచయితలు. ఏ విధముగా ఆ ఆత్మలు వారి పనిని వారి సమయమనుసారముగా చేస్తారో, అలాగే నేను కూడా నా సమయములో వస్తాను. నా కర్తవ్యము విశాలమైనది, నా కర్తవ్యము గొప్పది మరియు అన్నిటికంటే అసాధారణమైనది. అందుకే, మీ పని అసాధారణమైనది అని అంటారు. వారిని సర్వశక్తివంతుడు అని కూడా అంటారు. అన్నిటికంటే శక్తివంతమైన పని ఆత్మలను మాయ బంధనము నుండి విడిపించటము మరియు కొత్త ప్రపంచము యొక్క అంటు కట్టడము, అందుకే వారిని ఇంగ్లీష్ లో హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. క్రైస్టును క్రిస్టియానిటీకి ఫాదర్ అని అంటారు, వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అనరు. హెవెన్ యొక్క స్థాపకుడు పరమాత్మ. హెవెన్ అనేది ప్రపంచమైపోయింది కదా, హెవెన్ అనేది ఒక ధర్మమేమీ కాదు. కనుక వారు ప్రపంచము యొక్క స్థాపకుడైనట్లు మరియు ఆ ప్రపంచములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటాయి, తత్వాలు మొదలైనవన్నీ మారిపోతాయి, అందుకే వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు.

రెండవది, గాడ్ ఈజ్ ట్రూత్ (భగవంతుడు సత్యము) అని అంటారు. సత్యము అంటే ఏమిటి, ఎందులో సత్యము? ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కొందరు ఏమనుకుంటారంటే - ఎవరైతే సత్యము మాట్లాడుతారో వారే భగవంతుడు, భగవంతుడు అంటే వేరే ఏమిటో కాదు, కేవలం సత్యము మాట్లాడాలి, అంతే అని. కానీ అలా కాదు, భగవంతుడు సత్యము అన్నదానికి కల అర్థమేమిటంటే, భగవంతుడే వచ్చి అన్ని విషయాల సత్యతను తెలియజేశారు. భగవంతుడు సత్యము అనగా భగవంతుడు మాత్రమే సత్యాన్ని తెలియజేస్తారు, వారిలోనే సత్యత ఉంది, అందుకే వారిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ (జ్ఞాన సాగరుడు), ఓషన్ ఆఫ్ బ్లిస్ (ఆనంద సాగరుడు), గాడ్ నోస్ (భగవంతుడికి అన్నీ తెలుసు)... అని అంటారు. కనుక తప్పకుండా విశేషముగా తెలుసుకోవాల్సిన విషయాలేవో ఉన్నాయని కదా! మరి ఆ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? ఫలానావారు దొంగతనము చేసారు, అది భగవంతుడికి తెలుసు అనే విషయాలు కాదు. ఆ పరమాత్మునికి అన్నీ తెలుసు అన్నది వాస్తవమే కావచ్చు, కానీ వారికున్న మహిమ ఏదైతే ఉందో, దాని అర్థమేమిటంటే, ఈ ప్రపంచము ఏదైతే దిగజారి ఉందో అది ఉన్నతముగా ఎలా అవ్వాలి, ఈ చక్రము యొక్క విషయాలు వారికే తెలుసు, అందుకే గాడ్ నోస్ (భగవంతుడికి అన్నీ తెలుసు) అని అంటారు. కావున పరమాత్మునికి ఆ మహిమ ఈ విధముగా వస్తుంది, ఈ మహిమ మనుష్యుల మహిమ కంటే భిన్నమైనది ఎందుకంటే వారికి తెలియడమనేది అన్నింటికంటే భిన్నమైనది. మనుష్యులు తెలుసుకోవడమనేది హద్దు యొక్క విషయము. మనుష్యులను అల్పజ్ఞులు అని కూడా అంటారు కదా. కానీ పరమాత్ముడిని సర్వజ్ఞుడు అని అంటారు. ఇంగ్లీష్ లో వారిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు అనగా వారు సర్వం తెలిసినవారు. కనుక ఎవరైతే సర్వజ్ఞుడు ఉన్నారో, వారే సత్యము తెలుసుకోగలరు. విషయాలు గురించి యథార్థమైన జ్ఞానము ఎవరి వద్ద అయితే ఉంటుందో, వారు తప్పకుండా అందరికీ ఇస్తారు కదా. ఒకవేళ స్వయానికి తెలిసినా కానీ ఆ జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వకపోతే, దాని వలన మనకు లాభమేముంది! తెలిస్తే తెలుసుకోనీ అని అంటారు. కానీ పరమాత్ముని విషయములో అలా కాదు. వారికి తెలియడము వలన మనకు లాభము కలుగుతుంది, అందుకే కదా మనం వారి క్వాలిఫికేషన్లను గాయనం చేస్తాము, వారి వెంట పడతాము. ఎప్పుడైనా ఏదైనా జరిగితే వెంటనే, ఓ భగవంతుడా, ఇప్పుడు ఇక ఇది నువ్వే చేయి, మమ్మల్ని చూసుకో, దయ చూపించు, నా దుఃఖాన్ని దూరం చేయి అని అంటాము కదా. కనుక మనం వారిని అడుగుతాము కదా. వారితో ఏదో ఒక సంబంధము ఉంది కదా, అందుకే వారు మనకు ఏదో మేలు చేసినట్లు వారిని ఆ విధముగా స్మృతి చేస్తాము. ఒకవేళ ఎప్పుడూ మేలు చేయలేదు అని అంటే వారి కోసం ఎందుకు అలా ఆలోచిస్తాము. ఎప్పుడైనా ఎవరైనా కష్టకాలంలో మనకు సహాయము చేస్తే, వీరు చాలా కష్టకాలంలో నాకు సహాయము చేసారు, వీరు అవసరమైన సమయములో నన్ను రక్షించారు అని మనసులో అనిపిస్తుంది కదా. కనుక వారి పట్ల మనసులో ప్రేమ ఉంటుంది. అలాగే పరమాత్ముని పట్ల కూడా - వారు మనకు సమయానికి సహాయము చేసారు అని అటువంటి ప్రేమే కలుగుతుంది. కానీ అలాగని ఎప్పుడైనా ఏదైనా మనిషికి మంచి జరిగితే, భగవంతుడే ఇలా చేసారు, భగవంతుడు ఇలానే చేస్తారు అని అనుకోవడం కాదు. భగవంతుడిది చాలా పెద్ద పని. వారు మొత్తం ప్రపంచానికి చేస్తారు. వారు చేసేది మొత్తం ప్రపంచానికి సంబంధించింది. అంతేకానీ, ఎవరికైనా కాస్త ధనము లభిస్తే, భగవంతుడే అలా చేసారు అని వారి గురించి ఇంతమాత్రమే భావించకండి. ఆ మాటకు వస్తే, మనం కూడా మంచి కర్మలు చేస్తాము కావున ఆ కర్మల ఫలము లభిస్తుంది. మంచి మరియు చెడు కర్మల లెక్క ఉంటుంది కదా. దానిని కూడా మనం పొందుతూ ఉంటాము, కానీ పరమాత్మ వచ్చి ఏవైతే కర్మలు నేర్పించారో, ఆ కర్మల ఫలము వేరుగానే ఉంటుంది. అల్పకాలికమైన సుఖమైతే బుద్ధి ఆధారముగా కూడా లభిస్తుంది. కానీ వారు ఏ జ్ఞానాన్ని అయితే ఇచ్చారో, దానితో మనం సదా సుఖాన్ని పొందుతాము. అంటే, పరమాత్ముని కార్యము భిన్నమైనదనే కదా అర్థము. అందుకే వారు అంటారు, నేనే వచ్చి కర్మల యథార్థ జ్ఞానమేదైతే ఉందో, దానిని నేర్పిస్తాను. దీనినే కర్మయోగము శ్రేష్ఠమైనది అని అంటారు. ఇందులో కర్మలను, ఇంటిని, గృహస్థాన్ని విడిచిపెట్టే విషయమేమీ లేదు. కేవలం మీరు మీ కర్మలను పవిత్రముగా ఎలా తయారుచేసుకోవాలి అన్న జ్ఞానాన్ని నేను తెలియజేస్తాను. కనుక కర్మలను పవిత్రముగా చేసుకోవాలే కానీ కర్మలను విడిచిపెట్టకూడదు. కర్మ అయితే అనాది అయినది. ఈ కర్మక్షేత్రము కూడా అనాది అయినది. మనుష్యులు ఉన్నారంటే కర్మలు కూడా ఉంటాయి, కానీ ఆ కర్మలను మీరు శ్రేష్ఠముగా ఎలా చేసుకోవాలి అన్నది వారు వచ్చి నేర్పిస్తారు. దీని ద్వారా మీ కర్మల ఖాతా అకర్మగా అవుతుంది. అకర్మ అంటే ఎటువంటి చెడు ఖాతా తయారవ్వదు అని అర్థము.

బాబా అంటారు, నేను ఈ చిన్నని సంగమయుగములో మీ దేశములోకి, ఈ స్థూలమైన ప్రపంచములోకి మీ కోసమే వచ్చాను, కనుక కనీసం ఎంత సమయము ఉంటే అంత సమయము నా గురించి ఆలోచించండి. బాబాకు చెందినవారిగా అయ్యారు కనుక కనీసం అంత సమయమైతే శుద్ధముగా ఉండండి. అప్పుడు మీ ప్రారబ్ధము ఏ విధముగా తయారవుతుందంటే, ఇక మీరు ఆ ప్రపంచములో కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా చేసి, ఒకవేళ దాని కోసం మరణించాల్సి వచ్చినా సరే, పవిత్రముగా ఉండే ప్రతిజ్ఞను మాత్రం చేయండి. మీ దృఢతను ఉంచుకోండి, మీ ధారణలలో ఉండేందుకు పూర్తి ప్రయత్నము చేయండి. బాబా మీకు స్పష్టముగా చెప్తున్నారు, మీరు కేవలం ఈ కొద్ది సమయము కోసమే ఈ శ్రమను చేయండి. నేను మీతో ఇది తప్ప వేరే ఏ శ్రమను చేయించను. మీకు ఎంతైతే లభిస్తుందో, దానితో పోల్చి చూస్తే ఇది అసలు శ్రమ కానే కాదు.

అలాగని, నేను ఇది చేస్తాను, అది చేస్తాను... ప్రపంచము ఏమంటుంది, వారు ఏమంటారు... అని కేవలం ఇలా అంటూ ఉండటము కాదు... అరే, ప్రపంచము ఏమంటుంది అన్న విషయాన్ని వదిలేసేయండి. ఇప్పుడు ఈ ప్రపంచమే వెళ్ళిపోనున్నది. ఇప్పుడైతే మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. మీరు ఏదైతే ఇంత తయారుచేసుకుని కూర్చున్నారో, ఇదంతా వృధానే అవుతుంది. ఇప్పుడు బాబా అంటున్నారు, వృధా అవ్వకుండా చూసుకోండి. ఈ శరీర నిర్వహణ కోసం ఎంత కావాలో అంతైతే చేసుకోండి. ఎంతైతే మీ రచనతో లెక్కాచారము ఉందో, అంతైతే చేయండి. నేనెక్కడ సంభాళిస్తాను, వారిని మీరే సంభాళించాలి. ఏదైతే అవసరమో, అక్కడ నేను మిమ్మల్ని ఫ్రీ చేస్తాను. కానీ ఇప్పుడు ఏదైతే మీరు ఎక్స్ ట్రా రచించుకుంటున్నారో, దాని కోసం వద్దని చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమైతే కిందకు పడవలసిందే. మరి ఎందుకు మీ సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటున్నారు. ఈ అనవసరమైన జంజాటాలతోనే మీరు దుఃఖితులుగా అయ్యారు. ఈ జంజాటాల నుండి మీరు ఎలా విడుదల అవ్వాలి, అదే కదా నేను మీకు చెప్తున్నాను. అయినా కానీ కూర్చుని అనేక సాకులు చెప్పడమంటే, ఇదెక్కడి పద్ధతి? అప్పుడిక బాబా కూడా అంటారు, మరి చూసుకోండి, ఒకవేళ ఇప్పుడు గనక నాకు మీ వేలును డైరెక్టుగా ఇవ్వకపోతే, మీ చేతిని ఇవ్వకపోతే, మరి చూసుకోండి, నేను మీ ముక్కు పట్టుకుని తీసుకువెళ్తాను. కానీ ముక్కు పట్టుకుంటే గాలి ఆడదు, ఇక దుఃఖము కలుగుతుంది, శిక్షలు తినవలసి ఉంటుంది కదా! అందుకే చెప్తున్నాను, ఇప్పుడు నా చేతిలో చేయి వేసి డైరెక్టుగా వెళ్ళే సమయము వచ్చేసింది. ఒకవేళ ఇప్పుడు మాట వినకపోతే, ఇక నా చేతిలోకి మీ ముక్కు కూడా వస్తుంది, మరి అప్పుడు చూసుకోండి. ఇక ఆ సమయములో ఏమీ జరగదు, ఏమీ చేయలేరు. అందుకే బాబా అంటారు, పిల్లలూ, ఇప్పుడు మీరు నా వారిగా అయ్యి, నా వద్దకు వచ్చి, నా మాటలు విని కూడా ఏమీ చేయకపోతే వారి కొరకు చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఎవరికైతే ఈ విషయాలు తెలియవో వారి విషయము వేరు. కానీ ఎవరికైతే తెలుసో, ఎవరైతే కూర్చుని, విని, మళ్ళీ అవే విషయాల పట్ల నిర్లక్ష్యము చూపితే ఇక వారు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎలాగైతే 10 రెట్లు లాభమూ ఉంటుందో, అలాగే 10 రెట్లు నష్టము కూడా ఉంటుంది. అందుకే మీ నష్టాన్ని బాగా తెలుసుకోండి అని అంటారు. మీ బుద్ధిని మంచిగా తెరవండి. ఇప్పుడు బాబాతో బుద్ధియోగాన్ని జోడించినట్లయితే శక్తి లభిస్తుంది. ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకోండి, మర్చిపోకండి.

ఇప్పుడు ఈ సమయమేదైతే నడుస్తుందో, దీనిని గుర్తించండి, కొంచెం కళ్ళు తెరవండి, బుద్ధిని తెరవండి మరియు సమయము యొక్క పూర్తి లాభాన్ని పొందండి. మీ అదృష్టాన్ని పూర్తిగా మేలుకొలపండి. ఎటువంటి సాంగత్యమో అటువంటి రంగు అని అంటారు కదా. అందుకే ఎవరిలోనైతే ఇప్పుడు ఈ ధారణ పూర్తిగా ఉండదో, వారికి మాయ రంగు అంటుకుంటుంది. అందుకే - చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు... అని అంటారు. కొందరు చెడ్డగా ఉండేవారు ఇక్కడ కూడా ఉన్నారు, వారు ఇక్కడ కూడా కొందరిని విడిచిపెట్టరు, అప్పుడు ఇతరుల సాంగత్య దోషములోకి వచ్చేస్తారు. అందుకే, అటువంటి సాంగత్య దోషము నుండి స్వయాన్ని రక్షించుకోండి అని అంటారు. సాంగత్య దోషము బయట ప్రపంచములోనే ఉంది, ఇక్కడ లేదు అని అనుకోకండి. అలా కాదు, ఇక్కడ కూడా అటువంటివారు తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే ఇది వారి రాజ్యము కదా, అందుకే బాబా అంటారు, కవచాన్ని మంచిగా ధరించి ఉండండి. కవచము ఉంటే వారి బుల్లెట్ తగలనే తగలదు. యోగమే కవచము, జ్ఞానము ఖడ్గము వంటిది. ఈ అన్ని అస్త్ర-శస్త్రాలను మీ వద్ద మంచిగా సంభాళించి పెట్టుకోండి.

ఎవరైతే చేస్తారో వారు పొందుతారు అని అంటారు కూడా, ఇవి భవిష్య ప్రారబ్ధాన్ని పొందే విషయాలు. ఇక్కడైతే ప్రారబ్ధాన్ని అనుభవించేది లేదు కదా, ఇక్కడైతే గురువుగా అయ్యి కూర్చునేదీ లేదు. ఈ విషయాన్ని ఎవ్వరూ అపార్థం చేసుకోకూడదు, అందుకే ఇదంతా అర్థం చేయించడం జరుగుతుంది. కావున ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్వయాన్ని సురక్షితముగా ఉంచుకోవాలి. ఇక్కడ ఖర్చు మొదలైన విషయాల మాట రాకూడదు. ఇప్పుడు ఈ ఖర్చులన్నీ ఇతరుల కళ్యాణార్థమే ఉపయోగించాలి. ఒక్కొక్క పైసా కూడా మొత్తమంతా ఈ కార్యములోనే వినియోగించాలి. అచ్ఛా.

బాప్ దాదా మరియు తల్లి యొక్క ఇటువంటి మధురాతి మధురమైన, చాలా మంచి పిల్లలకు, జాగ్రత్తగా ఉండే పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. అచ్ఛా!

ప్రశ్న:- మమ్మా, మేము నడుస్తూ తిరుగుతూ కూడా యోగము యొక్క ఉన్నతమైన స్థితిలో ఎలా స్థితులవ్వవచ్చు?

జవాబు:- వాస్తవానికి మన ఈ జీవితము నేచురల్ గా యోగముతో కూడినదిగా అయిపోవాలి ఎందుకంటే యోగము అంటే నిశ్చయము. కనుక ప్రతి సమయము నిశ్చయాన్ని స్థిరముగా ఉంచుకుని ప్రాక్టికల్ గా ఆ స్వరూపముగా అయిపోవాలి. నిశ్చయ రూపులుగా అయ్యి కర్మేంద్రియాలతో కర్మలు చేయండి. స్థూల కర్మేంద్రియాలు ఏ పని చేస్తున్నప్పటికీ స్వయం ఆ సుఖ స్వరూప అవస్థలో లవలీనమై ఉండాలి. మీ ముఖము సదా సుఖ స్వరూపముగా, రమణీకముగా కనిపించాలి. ఎటువంటి అశుద్ధ సంకల్ప-వికల్పాలు ఉండకూడదు. ఈశ్వరీయ ఆనందములో, ఆంతరిక మగ్న అవస్థలో ఉన్నట్లయితే ఇక ఎటువంటి అశుద్ధ సంకల్ప-వికల్పాలు ఉత్పన్నమవ్వవు. శుద్ధమైన, పవిత్రమైన ధరణిలో ఏ సంకల్పము ఉత్పన్నమైనా గాని అది లోక కళ్యాణము కోసమే మరియు స్వ ఉన్నతి కోసమే ఉంటుంది. ఇది అత్యంత మధురమైన, సుందరమైన అవస్థ, ఇది సమయానికి సహాయము చేస్తుంది. ఇటువంటి ఈశ్వరీయ, అలౌకిక మధురమైన పవిత్ర జీవితాన్ని తయారుచేసుకునేందుకు ఇప్పుడే మీకు గోల్డెన్ ఛాన్స్ లభించింది. మరి ఇటువంటి అవస్థను తయారుచేసుకునేందుకు కొంచెం కష్టపడండి.

మనం యోగములో కూర్చున్నప్పుడు లోలోపల మంత్రము, జపము, పూజ మొదలైనవేవీ చేయము. భక్తి మార్గములో కొందరు లోలోపలే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, మాలను జపిస్తూ ఉంటారు. విగ్రహాన్ని ఎదురుగా ఉంచుకుని పుష్పాలు సమర్పిస్తారు, వారు అదంతా లోలోపలే చేస్తూ ఉంటారు, దానిని మనసా పూజ అంటారు. కానీ మన యోగములో మనం కేవలం మన స్వ స్వరూపములో స్థితి అయ్యి సుఖ స్వరూపులుగా అవుతాము. మన మనసు సహితముగా అన్ని కర్మేంద్రియాలను కంట్రోల్ చేసి ఏకాగ్రచిత్తులై ఈశ్వరీయ సుఖ స్వరూపులుగా అవుతాము, దాని కోసం యోగము చేసే సమయము పర్సనల్ గా ఫిక్స్ అయి ఉంటుంది. ఆ సమయములో కూర్చుని అభ్యాసము చేస్తాము. కేవలం వ్యక్త విషయాలతో సంబంధాన్ని తెంచి అవ్యక్త సంబంధముతో బంధాన్ని జోడించి ఉంచుకోవాలి, అప్పుడు స్మృతి సహజమైపోతుంది. అచ్ఛా. ఓం శాంతి.

వరదానము:-
బాప్ దాదాల తోడు ద్వారా మాయను దూరం నుండే మూర్ఛితము చేసే మాయాజీత్, జగజ్జీత్ భవ

ఏ విధముగా బాబాకు స్నేహీలుగా అయ్యారో, అలా బాబాను సహచరునిగా చేసుకున్నట్లయితే మాయ దూరం నుండే మూర్ఛితమైపోతుంది. మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను, మీ ద్వారానే ఆత్మను సంతోష పరచుకుంటాను అని ప్రారంభములో ఏదైతే ప్రతిజ్ఞ చేశారో, అదే ప్రతిజ్ఞ అనుసారముగా మొత్తం దినచర్యలో ప్రతి కార్యాన్ని బాబాతో కలిసి చేయండి, అప్పుడు మాయ డిస్టర్బ్ చేయలేదు, అది అంతమైపోతుంది. అందుకే సహచరుడిని సదా తోడుగా పెట్టుకోండి. ఆ తోడు యొక్క శక్తితో మరియు మిలనములో మగ్నమై ఉండటం ద్వారా మాయాజీతులుగా, జగజ్జీతులుగా అయిపోతారు.

స్లోగన్:-
మీ ఉన్నతమైన వృత్తి ద్వారా ప్రవృత్తిలోని పరిస్థితులను మార్చివేయండి.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

అవ్యక్త స్థితి రూపీ దర్పణాన్ని స్వచ్ఛముగా మరియు స్పష్టముగా చేసుకునేందుకు సరళత, శ్రేష్ఠత మరియు సహనశీలత - ఈ మూడు విషయాలపై అటెన్షన్ పెట్టండి. ఒకవేళ ఈ మూడింటిలోనూ ఏ ఒక్కదానిలో లోటు ఉన్నా ఆ దర్పణముపై కూడా ఆ లోటు అనే మరక కనిపిస్తుంది, అందుకే ఏ కార్యము చేసినా అందులో సాధారణత కనిపించకూడదు. సాధారణతను శ్రేష్ఠతలోకి మార్చండి, ప్రతి కార్యములోనూ సహనశీలతను మరియు వాణిలో సరళతను ధారణ చెయ్యండి, అప్పుడు సేవలో సఫలత కనిపిస్తుంది.