25-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి యొక్క పిల్లలైన మీరు యజమానులు, మీరేమీ తండ్రి వద్ద శరణు తీసుకోలేదు, బిడ్డ ఎప్పుడూ తండ్రి వద్ద శరణు తీసుకోరు’’

ప్రశ్న:-
ఏ విషయాన్ని సదా స్మరణ చేస్తూ ఉన్నట్లయితే మాయ విసిగించదు?

జవాబు:-
మేము తండ్రి వద్దకు వచ్చాము, వారు మా బాబా కూడా, శిక్షకుడు కూడా, సద్గురువు కూడా, కానీ వారు నిరాకారుడు. నిరాకారీ ఆత్మలైన మమ్మల్ని చదివించేవారు నిరాకారుడైన బాబా, ఈ విషయాన్ని బుద్ధిలో స్మరణ చేస్తూ ఉన్నట్లయితే సంతోషము యొక్క పాదరసము ఎక్కి ఉంటుంది, అప్పుడిక మాయ విసిగించదు.

ఓంశాంతి
త్రిమూర్తి అయిన తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. త్రిమూర్తి తండ్రియే కదా. ఆ ముగ్గురిని రచించేవారు సర్వులకు తండ్రి ఎందుకంటే ఉన్నతోన్నతమైనవారు ఆ తండ్రియే. మేము వారి పిల్లలము అని పిల్లల బుద్ధిలో ఉంది. ఏ విధంగా తండ్రి పరంధామములో ఉంటారో, అలా ఆత్మలైన మనము కూడా అక్కడి నివాసులమే. తండ్రి ఇది కూడా అర్థం చేయించారు - ఇది ఒక డ్రామా, ఏదైతే జరుగుతుందో అది డ్రామాలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే చదివించడానికి వస్తారు. మీరు ఏమి శరణాగతి తీసుకోరు. నేను మీ శరణులోకి వచ్చాను - అన్న ఈ వాక్యము భక్తి మార్గానికి సంబంధించినది. బిడ్డ ఎప్పుడైనా తండ్రి శరణును తీసుకుంటారా ఏమిటి! పిల్లలైతే యజమానులుగా ఉంటారు. పిల్లలైన మీరు తండ్రి శరణును తీసుకోలేదు. తండ్రి మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. అలాగే పిల్లలు తండ్రిని తమవారిగా చేసుకున్నారు. బాబా, రండి, మమ్మల్ని మన ఇంటికి తీసుకువెళ్ళండి మరియు రాజ్యాన్ని ఇవ్వండి అనే పిల్లలైన మీరు తండ్రిని పిలుస్తారు. ఒకటేమో శాంతిధామము, రెండవది సుఖధామము. సుఖధామము తండ్రి ఆస్తి మరియు దుఃఖధామము రావణుడి ఆస్తి. పంచ వికారాలలో చిక్కుకోవడము వలన దుఃఖమే దుఃఖము ఉంది. మనము బాబా వద్దకు వచ్చామని ఇప్పుడు పిల్లలకు తెలుసు. వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా, కానీ వారు నిరాకారుడు. నిరాకారీ ఆత్మలైన మనల్ని చదివించేవారు కూడా నిరాకారుడే. వారు ఆత్మలకు తండ్రి. ఈ విషయాన్ని సదా బుద్ధిలో స్మరణ చేస్తూ ఉన్నా సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవడము వలనే మాయ విసిగిస్తుంది. ఇప్పుడు మీరు తండ్రి వద్ద కూర్చుని ఉన్నారు కావున తండ్రి మరియు వారసత్వము గుర్తుకొస్తాయి. లక్ష్యము-ఉద్దేశ్యము అయితే బుద్ధిలో ఉన్నాయి కదా. స్మృతి శివబాబానే చేయాలి. శ్రీకృష్ణుడిని స్మృతి చేయడము చాలా సహజము, శివబాబాను స్మృతి చేయడములోనే శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఒకవేళ శ్రీకృష్ణుడు ఇప్పుడు ఉండి ఉన్నట్లయితే, అందరూ అతనిపై వెంటనే బలిహారమైపోతారు. ప్రత్యేకముగా మాతలైతే - మాకు శ్రీకృష్ణుడి వంటి బిడ్డ లభించాలి, శ్రీకృష్ణుడి వంటి పతి లభించాలి అని ఎంతగానో కోరుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను వచ్చాను, మీకు శ్రీకృష్ణుడి వంటి బిడ్డ మరియు పతి కూడా లభిస్తారు అనగా వీరి వలె గుణవంతుడు, సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు, సుఖాన్ని ఇచ్చేవాడు మీకు లభిస్తారు. స్వర్గములో అనగా శ్రీకృష్ణపురిలో సుఖమే సుఖము ఉంటుంది. ఇక్కడ మనము శ్రీకృష్ణపురిలోకి వెళ్ళేందుకు చదువుకుంటున్నాము అని పిల్లలకు తెలుసు. స్వర్గమునే అందరూ తలచుకుంటారు కదా. ఎవరైనా మరణిస్తే ఫలానావారు స్వర్గస్థులయ్యారని అంటారు, మరి అటువంటప్పుడు సంతోషించాలి కదా, చప్పట్లు కొట్టాలి కదా. నరకము నుండి బయట పడి స్వర్గములోకి వెళ్ళారంటే, చాలా మంచి జరిగినట్లు. ఫలానావారు స్వర్గస్థులయ్యారు అని ఎవరైనా అన్నప్పుడు - అతను ఎక్కడి నుండి వెళ్ళారు అని అడగండి. తప్పకుండా నరకము నుండే వెళ్ళారు. మరి ఇది చాలా సంతోషకరమైన విషయము. అందరినీ పిలిపించి టోలీ తినిపించాలి. కానీ ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. వారు 21 జన్మల కొరకు స్వర్గానికి వెళ్ళారు అని ఈ విధంగా అనరు. కేవలం స్వర్గానికి వెళ్ళారు అని అంటారు. అచ్ఛా, మరి వారి ఆత్మను ఇక్కడకు ఎందుకు పిలుస్తారు? నరకము యొక్క భోజనాన్ని తినిపించడానికా? నరకములోకైతే పిలవకూడదు. ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, ప్రతి విషయము జ్ఞానానికి సంబంధించినది కదా. మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారుచేయండి అని తండ్రిని పిలుస్తారు కావున తప్పకుండా పతిత శరీరాలను సమాప్తము చేయవలసి ఉంటుంది. అందరూ మరణిస్తే ఇక ఎవరి కోసము ఎవరు ఏడుస్తారు? ఇప్పుడు మీకు తెలుసు, మనము ఈ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము. శరీరాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలి అని ఇప్పుడు ప్రాక్టీస్ (అభ్యాసము) చేస్తున్నారు. ఇటువంటి పురుషార్థాన్ని ప్రపంచములో ఎవరైనా చేస్తూ ఉండవచ్చా!

ఇది మన పాత శరీరము అని పిల్లలైన మీకు ఈ జ్ఞానము ఉంది. తండ్రి కూడా అంటారు - నేను పాత శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. డ్రామాలో ఈ రథమే నిమిత్తము అయ్యింది. ఇది ఎప్పుడూ మారదు. వీరిని మళ్ళీ మీరు 5 వేల సంవత్సరాల తర్వాత చూస్తారు. డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కదా. తండ్రికి తప్ప ఇంకెవరికీ ఇది అర్థం చేయించగలిగే శక్తి లేదు. ఈ పాఠశాల చాలా అద్భుతమైనది, ఇక్కడ వృద్ధులు కూడా - మేము భగవాన్, భగవతీ గా అయ్యేందుకు భగవంతుని పాఠశాలకు వెళ్తున్నాము అని అంటారు. అరే, వృద్ధ మాతలు ఎప్పుడైనా చదువుకోవడానికి స్కూలుకు వెళ్తారా. మిమ్మల్ని ఎవరైనా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నిస్తే మీరు చెప్పండి - మేము ఈశ్వరీయ యూనివర్శిటీకి వెళ్తున్నాము, అక్కడ మేము రాజయోగాన్ని నేర్చుకుంటాము. వారు ఆశ్చర్యపోయే విధముగా పదాలు ఉపయోగించండి. ఇక్కడ వృద్ధులు కూడా - మేము భగవంతుని పాఠశాలకు వెళ్తున్నాము అని అంటారు. మనము భగవంతుని వద్దకు చదువుకోవడానికి వెళ్తున్నాము, ఇక్కడ ఇది అద్భుతము. ఈ విధంగా ఇంకెవ్వరూ అనలేరు. మరి నిరాకారుడైన భగవంతుడు ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు నామ-రూపాలకు అతీతుడు అని భావిస్తారు, ఇప్పుడు మీరు అర్థం చేసుకుని మాట్లాడుతారు. ప్రతి మూర్తి యొక్క కర్తవ్యము గురించి మీకు తెలుసు. బుద్ధిలో ఇది పక్కాగా ఉంది - ఉన్నతోన్నతమైనవారు శివబాబా, వారికి మనము సంతానము. అచ్ఛా, ఆ తర్వాత సూక్ష్మవతనవాసులైన బ్రహ్మా-విష్ణు-శంకరులు ఉన్నారు, మీరు ఈ విషయాలను కేవలం నామమాత్రముగా చెప్పరు. బ్రహ్మా ద్వారా స్థాపనను ఎలా చేస్తారు అనేది మీకు బాగా తెలుసు. మీరు తప్ప ఇంకెవ్వరూ కూడా వారి జీవిత చరిత్రను తెలియజేయలేరు, వారికి తమ జీవిత చరిత్ర గురించే తెలియనప్పుడు ఇక ఇతరులది ఎలా తెలుస్తుంది? మీరు ఇప్పుడు అన్నింటినీ తెలుసుకున్నారు. తండ్రి అంటారు, నాకు ఏదైతే తెలుసో అది పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. రాజ్యము కూడా తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ లక్ష్మీ-నారాయణులు ఈ రాజ్యాన్ని యుద్ధము ద్వారానేమీ పొందలేదు. అక్కడ యుద్ధము జరగదు. ఇక్కడైతే ఎంతగా కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు, ఎంతమంది మనుష్యులు ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీ హృదయములో ఇది రావాలి - మేము తండ్రి నుండి దాదా ద్వారా వారసత్వాన్ని పొందుతున్నాము. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను ఎవరిలోనైతే ప్రవేశించానో వారిని కూడా స్మృతి చేయండి అని అనటం లేదు. అలా కాదు, కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. ఆ సన్యాసులు తమ ఫొటోలను పేర్లతో సహితముగా ఇస్తారు. శివబాబాకు ఫొటో ఏమి తీస్తారు? బిందువుపైన పేరు ఎలా వ్రాస్తారు! బిందువుపైన శివబాబా అని పేరు వ్రాస్తే బిందువుకన్నా పేరు పెద్దది అయిపోతుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. కావున పిల్లలు, మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అని చాలా సంతోషించాలి. ఆత్మయే చదువుకుంటుంది కదా. సంస్కారాలను ఆత్మయే తీసుకువెళ్తుంది. ఇప్పుడు బాబా ఆత్మలో సంస్కారాలు నింపుతున్నారు. వారు తండ్రి కూడా, టీచరు కూడా, గురువు కూడా. తండ్రి మీకు ఏదైతే నేర్పిస్తున్నారో, దానిని మీరు ఇతరులకు కూడా నేర్పించండి, సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి మరియు ఇతరుల చేత చేయించండి. వారిలో ఏవైతే గుణాలు ఉన్నాయో అవి పిల్లలకు కూడా ఇస్తారు. వారు అంటారు, నేను జ్ఞాన సాగరుడిని, సుఖ సాగరుడిని. మిమ్మల్ని కూడా ఆ విధంగా తయారుచేస్తాను. మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వండి. మనసా, వాచా, కర్మణా ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. శివబాబాను స్మృతి చేసినట్లయితే ఆ స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి అని అందరి చెవులలో ఇవే మధురాతి మధురమైన విషయాలను వినిపించండి. అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది - బాబా వచ్చారు, వారి నుండి ఈ వారసత్వాన్ని పొందండి. చివరికి ఈ విషయాన్ని వార్తాపత్రికల వారు కూడా ప్రచురిస్తారు. ఇదైతే తెలుసు కదా, అంతిమములో అందరూ అంటారు - ఓహో ప్రభూ మీ లీల, మీరే అందరికీ సద్గతిని ఇస్తారు, దుఃఖము నుండి విడిపించి అందరినీ శాంతిధామములోకి తీసుకువెళ్తారు. ఇది కూడా ఇంద్రజాలము కదా. వారిది అల్పకాలికమైన ఇంద్రజాలము. వీరైతే 21 జన్మల కొరకు మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. ఈ మన్మనాభవ అనే ఇంద్రజాలము ద్వారా మీరు లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఇంద్రజాలికుడు, రత్నాకరుడు, ఈ పేర్లు అన్నీ శివబాబాకే ఉన్నాయి, బ్రహ్మాకు కాదు. ఈ బ్రాహ్మణ-బ్రాహ్మణీలు అందరూ చదువుకుంటారు. చదువుకుంటారు మరియు చదివిస్తారు. బాబా ఒక్కరే ఏమి చదివించరు, బాబా మీ అందరినీ కలిపి చదివిస్తారు, మీరు మళ్ళీ ఇతరులను చదివిస్తారు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఆ తండ్రియే రచయిత, శ్రీకృష్ణుడైతే రచన కదా. వారసత్వము రచయిత నుండి లభిస్తుంది, అంతేకానీ రచన నుండి లభించదు. శ్రీకృష్ణుడి నుండి వారసత్వము లభించదు. విష్ణువు యొక్క రెండు రూపాలే ఈ లక్ష్మీ-నారాయణులు. బాల్యములో వీరు రాధ-కృష్ణులు. ఈ విషయాలను కూడా పక్కాగా గుర్తుంచుకోండి. వృద్ధులు కూడా వేగముగా వెళ్ళినట్లయితే ఉన్నత పదవిని పొందగలరు. వృద్ధ మాతలకు కొంత మమకారము కూడా ఉంటుంది. వారు తమ రచన యొక్క వలలో చిక్కుకుంటారు. ఎంతమంది గుర్తుకొస్తూ ఉంటారు. వారి నుండి బుద్ధియోగాన్ని తెంచి తిరిగి ఒక్క తండ్రితోనే జోడించడము - ఇందులోనే శ్రమ ఉంది. జీవిస్తూనే మరణించాలి. బుద్ధిలో ఒక్కసారి బాణము తగిలితే ఇక చాలు. ఇక యుక్తిగా నడుచుకోవలసి ఉంటుంది. అలాగని, ఎవరితోనూ మాట్లాడకూడదు అని కాదు, గృహస్థ వ్యవహారములో ఉండండి, అందరితోనూ మాట్లాడండి. వారితో కూడా సంబంధాన్ని పెట్టుకోండి. తండ్రి అంటారు - దానము ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ఒకవేళ సంబంధమే పెట్టుకోకపోతే ఇక వారిని ఎలా ఉద్ధరించగలుగుతారు? ఇరువురితోనూ సంబంధాన్ని నిలబెట్టుకోవాలి. వివాహానికి వెళ్ళమంటారా? అని బాబాను అడుగుతారు. బాబా అంటారు, ఎందుకు వెళ్ళకూడదు. తండ్రి కేవలం అంటారు - కామము మహాశత్రువు, దానిపై విజయము పొందినట్లయితే మీరు జగత్తును జయించినవారిగా అవుతారు. నిర్వికారులు సత్యయుగములోనే ఉంటారు. అక్కడ యోగబలముతో పిల్లల జన్మ జరుగుతుంది. తండ్రి అంటారు, నిర్వికారులుగా అవ్వండి. ఒకటేమో - మేము శివబాబా వద్ద కూర్చున్నాము అని పక్కా చేసుకోండి, శివబాబా మనకు 84 జన్మల కథను చెప్తున్నారు. ఈ సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. మొట్టమొదట దేవీ-దేవతలు సతోప్రధానముగా వస్తారు, ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ తమోప్రధానముగా అవుతారు. ప్రపంచము పాతదిగా, పతితముగా అవుతుంది. ఆత్మయే పతితముగా ఉంది కదా. ఇక్కడున్న ఏ వస్తువులలోనూ సారమేమీ లేదు. సత్యయుగములోని ఫలాలు-పుష్పాలు ఎక్కడ, ఇక్కడి ఫలాలు-పుష్పాలు ఎక్కడ! అక్కడ ఎప్పుడూ చేదు వస్తువులు, కుళ్ళిపోయిన వస్తువులు ఉండవు. మీరు అక్కడి వస్తువులను కూడా సాక్షాత్కారములో చూసి వస్తారు. అప్పుడు, ఆ ఫలాలను-పుష్పాలను తీసుకువెళ్ళాలని మనసుకు అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అవి మాయమైపోతాయి. ఈ సాక్షాత్కారాలన్నీ చేయించి బాబా పిల్లలను ఆహ్లాదపరుస్తారు. వీరు ఆత్మిక తండ్రి, వీరు మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ శరీరము ద్వారా చదువుకునేది ఆత్మ, అంతేకానీ శరీరము కాదు. ఆత్మకు ఈ శుద్ధమైన అభిమానము ఉంది - నేను కూడా ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నాను, స్వర్గానికి యజమానిగా అవుతున్నాను. స్వర్గములోకైతే అందరూ వెళ్తారు కానీ అందరికీ లక్ష్మీ-నారాయణులు అన్న పేరు ఉండదు కదా. వారసత్వాన్ని ఆత్మయే పొందుతుంది. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇది ఒక యూనివర్శిటీ, ఇందులో చిన్న పిల్లలు, యువత, అందరూ చదువుకుంటారు. ఇటువంటి కాలేజీని ఎప్పుడన్నా చూసారా? అక్కడ వారు మనుష్యుల నుండి బ్యారిస్టరులు, డాక్టర్లు మొదలైనవారిగా అవుతారు. ఇక్కడ మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు.

బాబా మన టీచరు, సద్గురువు అని, వారు మనల్ని తనతోపాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు. ఆ తర్వాత మనము చదువు అనుసారముగా వచ్చి సుఖధామములో పదవిని పొందుతాము. తండ్రి అయితే ఎప్పుడూ మీ సత్యయుగాన్ని కనీసము చూడను కూడా చూడరు. శివబాబా అడుగుతున్నారు - నేను సత్యయుగాన్ని చూస్తానా? చూడటము అంటే శరీరము ద్వారా చూడటము జరుగుతుంది, మరి బాబాకు తనదంటూ శరీరము లేదు, మరి ఎలా చూస్తారు? ఇక్కడ పిల్లలైన మీతో మాట్లాడుతారు, ఇదంతా పాత ప్రపంచము అని చూస్తారు. శరీరము లేకుండానైతే ఏమీ చూడలేరు. తండ్రి అంటారు, నేను పతిత ప్రపంచములోకి, పతిత శరీరములోకి వచ్చి మిమ్మల్ని పావనముగా తయారుచేస్తాను. నేను స్వర్గాన్ని చూడను కూడా చూడను. ఎవరి శరీరములోకైనా గుప్తముగా ప్రవేశించి చూసి వస్తాను అని కాదు. అలా జరగదు. అసలు ఆ పాత్రే లేదు. మీరు ఎన్ని కొత్త-కొత్త విషయాలను వింటారు. కావున ఇప్పుడు ఈ పాత ప్రపంచముతో మనసు పెట్టుకోకూడదు. తండ్రి అంటారు, ఎంతగా పావనముగా అవుతారో అంత ఉన్నత పదవి లభిస్తుంది. ఇదంతా స్మృతియాత్రపై ఆధారపడి ఉంది. యాత్రలకు వెళ్ళే సమయములో కూడా మనుష్యులు పవిత్రముగా ఉంటారు, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అపవిత్రముగా అవుతారు. పిల్లలైన మీకు ఎంతో సంతోషము ఉండాలి. అనంతమైన తండ్రి నుండి మనము అనంతమైన స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటామని మీకు తెలుసు కావున వారి శ్రీమతముపై నడవాలి. తండ్రి స్మృతి ద్వారానే సతోప్రధానముగా అవ్వాలి. 63 జన్మల తుప్పు పట్టి ఉంది. దానిని ఈ జన్మలో తొలగించుకోవాలి, వేరే ఏ కష్టమూ లేదు. విషాన్ని తాగాలి అని ఏదైతే ఆకలి కలుగుతుందో, దానిని వదిలేయాలి, దాని గురించి ఆలోచించను కూడా ఆలోచించకండి. తండ్రి అంటారు, ఈ వికారాల ద్వారానే మీరు జన్మ-జన్మాంతరాలు దుఃఖితులుగా అయ్యారు. కుమారీలపైనైతే ఎంతో జాలి కలుగుతుంది. సినిమాలకు వెళ్ళడము వలనే పాడైపోతారు, వీటి ద్వారానే నరకములోకి వెళ్తారు. బాబా కొందరితో, చూసినా ఫరవాలేదు అని అంటారు కానీ మిమ్మల్ని చూసి వేరేవారు కూడా వెళ్ళడం మొదలుపెడతారు, అందుకే మీరు వెళ్ళకూడదు. ఇతను భగీరథుడు, భాగ్యశాలి రథము కదా, డ్రామాలో వీరు తన రథాన్ని అప్పుగా ఇచ్చేందుకు నిమిత్తమయ్యారు. బాబా వీరిలోకి వస్తారని మీరు అర్థం చేసుకుంటారు, ఇతను హుస్సేన్ గుర్రము. వారు మిమ్మల్నందరీ సుందరముగా తయారుచేస్తున్నారు. తండ్రి స్వయం సుందరమైనవారు కానీ ఇతని రథాన్ని తీసుకున్నారు. డ్రామాలో వీరి పాత్రయే ఈ విధంగా ఉంది. ఇప్పుడు నల్లగా అయిపోయిన ఆత్మలను స్వర్ణిమయుగ ఆత్మలుగా తయారుచేయాలి.

తండ్రి సర్వశక్తివంతుడా లేక డ్రామానా? డ్రామాయే. మరి డ్రామాలో పాత్రధారులెవరైతే ఉన్నారో, వారిలో సర్వశక్తివంతుడు ఎవరు? శివబాబా. ఆ తర్వాత రావణుడు. అర్ధకల్పము రామ రాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. ఘడియ, ఘడియ బాబాకు వ్రస్తారు, మేము తండ్రి స్మృతిని మర్చిపోతున్నాము అని. ఉదాసీనులుగా అయిపోతారు. అరే, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి వస్తే మీరు ఉదాసీనులుగా ఎందుకు ఉంటారు! కృషి అయితే చేయాలి, పవిత్రముగా అవ్వాలి. ఊరికే అలా తిలకాన్ని ఇచ్చేస్తారా! జ్ఞానము మరియు యోగము ద్వారా మిమ్మల్ని మీరే రాజ్య తిలకాన్ని పొందేందుకు యోగ్యులుగా తయారుచేసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ అంతట మీరే తిలకము తీసుకునేందుకు యోగ్యులుగా తయారవుతారు. శివబాబా మన మధురమైన తండ్రి, టీచర్, సద్గురువు అని బుద్ధిలో ఉంది. వారు మనల్ని కూడా ఎంతో మధురముగా తయారుచేస్తారు. మనము శ్రీకృష్ణపురిలోకి తప్పకుండా వెళ్తాము అని మీకు తెలుసు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత భారత్ స్వర్గముగా తప్పకుండా తయారవ్వనున్నది. మళ్ళీ నరకముగా అవుతుంది. ధనవంతులైన వారికి ఇదే స్వర్గమని, పేదవారికి ఇదే నరకమని మనుష్యులు భావిస్తారు. కానీ ఇది సత్యము కాదు. వాస్తవానికి ఇదంతా నరకము. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సినిమా నరకములోకి వెళ్ళే ద్వారము, అందుకే సినిమా చూడకూడదు. స్మృతియాత్ర ద్వారా పావనముగా అయి ఉన్నత పదవిని పొందాలి, ఈ పాత ప్రపంచముపై మనస్సు పెట్టుకోకూడదు.

2. మనసా, వాచా, కర్మణా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరి చెవులలో మధురాతి, మధురమైన విషయాలను వినిపించాలి, అందరికీ తండ్రి స్మృతిని కలిగించాలి. బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడింపజేయాలి.

వరదానము:-
స్మృతి యొక్క స్విచ్ ను ఆన్ చేసి క్షణములో అశరీరి స్థితిని అనుభవము చేసే ప్రీతి బుద్ధీ భవ

ఎక్కడైతే ప్రభు ప్రీతి ఉంటుందో, అక్కడ అశరీరిగా అవ్వడమనేది ఒక్క క్షణకాలపు ఆట వంటిది. ఏ విధంగా స్విచ్ ఆన్ చేయగానే అంధకారము సమాప్తమైపోతుందో అలా ప్రీతి బుద్ధి కలవారిగా అయి స్మృతి రూపీ స్విచ్ ను ఆన్ చేసినట్లయితే దేహము మరియు దైహిక ప్రపంచపు స్మృతి యొక్క స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక్క క్షణకాలపు ఆట. మీ నోటితో బాబా అని అనడానికి కూడా సమయము పడుతుంది కానీ స్మృతిలోకి తీసుకురావడానికి సమయము పట్టదు. ఈ బాబా అన్న పదమే పాత ప్రపంచాన్ని మర్చిపోయేందుకు ఆత్మిక బాంబు.

స్లోగన్:-
దేహ భానము అనే మట్టి యొక్క భారము నుండి అతీతముగా ఉన్నట్లయితే డబుల్ లైట్ ఫరిశ్తాగా అవుతారు.

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను అలవరచుకోండి

సత్యత ఉంది అన్నదానికి పరిశీలన ఏమిటంటే సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధ-సంపర్కాలు అన్నింటిలోనూ దివ్యత యొక్క అనుభూతి కలగటము. కొందరు అంటారు - నేనైతే సదా సత్యమే మాట్లాడుతాను. కానీ మాటలలో మరియు కర్మలలో ఒకవేళ దివ్యత లేనట్లయితే ఇతరులకు మీ సత్యము, సత్యముగా అనిపించదు, అందుకే సత్యతా శక్తితో దివ్యతను ధారణ చెయ్యండి. ఏది సహనము చెయ్యాల్సి వచ్చినా కానీ గాభరాపడకండి. సత్యము సమయము వచ్చినప్పుడు దానంతటదే నిరూపణ అవుతుంది.