25-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 04.09.2005


‘‘శిక్షణతోపాటుగా క్షమను మరియు దయను అలవరచుకోండి, ఆశీర్వాదాలను ఇవ్వండి,ఆశీర్వాదాలను తీసుకోండి, అప్పుడు మీ ఇల్లు ఆశ్రమములా అవుతుంది’’

ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి మస్తకముపై పవిత్రత యొక్క రేఖలను చూస్తున్నారు ఎందుకంటే బ్రాహ్మణ జీవితము యొక్క పునాదియే పవిత్రత. పవిత్రతా రేఖలు ఏమిటో తెలుసా? పవిత్రత అందరికీ ప్రియమైనది. పవిత్రత సుఖము, శాంతి, ప్రేమ, ఆనందాలకు జనని. పవిత్రత మానవునికి సత్యమైన అలంకారము. పవిత్రత లేకపోతే మానవ జీవితానికి విలువ లేదు. మీరు చూస్తుంటారు కదా, దేవతలు పవిత్రులు కావుననే గౌరవనీయులుగా, పూజ్యనీయులుగా ఉంటారు. పవిత్రత లేకపోతే మానవ జీవితము ఎలా ఉంటుంది అనేది ఈ రోజుల్లో చూస్తున్నారు. బాప్ దాదా పిల్లలైన మీ అందరికీ బ్రాహ్మణ జన్మ యొక్క వరదానముగా - పవిత్ర భవ, యోగీ భవ అన్న ఈ వరదానమునే ఇచ్చారు. ఏ ఆత్మలోనైతే పవిత్రత ఉంటుందో, వారి నడత, నడవడిక, ముఖము మెరుస్తుంటాయి, అందుకే పవిత్రతయే జీవితాన్ని శ్రేష్ఠముగా తయారుచేస్తుంది. వాస్తవానికి పిల్లలైన మీ అందరి ఆది స్వరూపమే పవిత్రత. అనాది స్వరూపము కూడా పవిత్రతయే. ఇటువంటి పవిత్ర ఆత్మల విశేషత ఏమిటంటే - వారి జీవితములో సదా పవిత్రతతో కూడిన పర్సనాలిటీ కనిపిస్తుంది. పవిత్రత యొక్క రియాలిటీ, పవిత్రత యొక్క రాయల్టీ వారి ముఖము మరియు నడతలో కనిపిస్తుంటుంది. ఈ రేఖలు జీవితానికి అలంకారములు. రియాలిటీ ఏమిటంటే - నేను అనాది, ఆది స్వరూపమును అన్న ఈ స్మృతి ద్వారా సమర్థులుగా అవుతారు. రాయల్టీ ఏమిటంటే - స్వయము కూడా స్వమానములో ఉంటారు మరియు ప్రతి ఒక్కరికీ గౌరవాన్ని ఇస్తూ నడుచుకుంటారు. పర్సనాలిటీ ఏమిటంటే - సదా సంతుష్టత మరియు ప్రసన్నత. స్వయము కూడా సంతుష్టముగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. పవిత్రతతో ప్రాప్తులు కూడా ఎన్నో లభిస్తాయి. బాప్ దాదా పిల్లలైన మీ అందరికీ ఏయే ప్రాప్తులను అందించారు, తెలుసు కదా! ఎన్ని ఖజానాలతో నిండుగా చేసారు, ఒకవేళ ప్రాప్తులను స్మృతిలో ఉంచుకున్నట్లయితే నిండుగా అవుతారు.

అన్నింటికంటే మొదటగా ఇచ్చిన ఖజానా - జ్ఞాన ఖజానా. దీని ద్వారా జీవితములో ఉంటూ దుఃఖము, అశాంతుల నుండి ముక్తులుగా అవుతారు. వ్యర్థ సంకల్పాలు, నెగెటివ్ సంకల్పాలు, వికల్పాలు, వికర్మల నుండి ముక్తులైపోతారు. ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పము లేక వికల్పము వచ్చినా కూడా జ్ఞాన బలముతో విజయులుగా అయిపోతారు.

రెండవ ఖజానా - స్మృతి, యోగము. దీని ద్వారా శక్తుల ప్రాప్తిస్తాయి మరియు శక్తుల ఆధారముతో సర్వ సమస్యలను, సర్వ విఘ్నాలను సహజముగా దాటివేస్తారు.

మూడవ ఖజానా - ధారణల ఖజానా, దీని ద్వారా సర్వ గుణాల ప్రాప్తి కలుగుతుంది. మరియు నాల్గవ ఖజానా - సేవ యొక్క ఖజానా, దీని ద్వారా సేవ చెయ్యడముతో, ఎవరి సేవనైతే చేస్తారో వారి ఆశీర్వాదాలు లభిస్తాయి, సంతోషము లభిస్తుంది.

ఇన్ని ఖజానాలు బాబా ద్వారా పిల్లలందరికీ ప్రాప్తిస్తాయి. బాబా అందరికీ ఒకేలా ఖజానాలను ఇస్తారు, కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఇవ్వరు. కానీ తీసుకునేవారిలో తేడా వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలు ఖజానాలను ప్రాప్తి చేసుకుని తింటారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, మరియు ఆ ఎంజాయ్ లో ఖజానాలను సమాప్తము చేసేసుకుంటారు. మరికొంతమంది పిల్లలు తింటారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తూ జమ కూడా చేసుకుంటారు. మరికొంతమంది పిల్లలు వాటిని కార్యములో కూడా ఉపయోగిస్తారు కానీ పెంచుకుంటూ వెళ్తారు. ఖజానాలను పెంచుకునేందుకు తాళము చెవి - ఆ ఖజానాలను స్వయము కొరకు మరియు ఇతరుల కొరకు ఉపయోగించటము. ఎవరైతే ఉపయోగిస్తారో వారు వాటిని పెంచుతారు. మరి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - ఈ విశేష ఖజానాలు జమ అయ్యి ఉన్నాయా? జమ అయ్యి ఉన్నాయా, ఏమంటారు? జమ అయ్యి ఉన్నాయా లేక కొద్దికొద్దిగానే జమ అయ్యి ఉన్నాయా? ఎవరి వద్దనైతే ఈ ఖజానాలు జమ అయ్యి ఉన్నాయో, వారు సదా నిండుగా ఉంటారు. చూడండి, ఏ వస్తువైనా నిండుగా ఉంటే అలజడి కలగదు. ఒకవేళ నిండుగా లేకపోతే అలజడి కలుగుతుంది, అది కదులుతుంది. ఏ వస్తువునైనా ఒకవేళ పూర్తిగా నింపకపోతే అది కదిలిపోతుంది, అలాగే ఇక్కడ కూడా ఒకవేళ సర్వ ఖజానాలతో నిండుగా లేకపోతే అలజడి కలుగుతుంది. బాబా ఖజానాలు నా జన్మసిద్ధ అధికారము అని సదా ఈ నషా ఉండాలి. బాబా ఇచ్చారు, మీరు తీసుకున్నారు, అంటే మరి సర్వ ఖజానాలు ఎవరివయ్యాయి? మీవే అయ్యాయి కదా. మరి ఎవరి వద్దనైతే ఖజానాలు ఉన్నాయో, వారు ఎంత నషాలో ఉంటారు? రాజుకు కొడుకైన చిన్న వయసులోని రాకుమారుడు ఉంటాడు కదా, అతడికి అతడి తండ్రి వద్ద ఏమేమి ఖజానాలు ఉన్నాయి అనేది తెలియదు కూడా, అయినా కానీ నా తండ్రి ఖజానాలు నా ఖజానాలు అన్న నషా ఉంటుంది మరియు ఆ ఖజానాల సంతోషములో ఉంటాడు. ఒకవేళ సంతోషము తక్కువగా ఉంటే దానికి కారణము ఏమిటి? బాబా అయితే ఖజానాలను ఇచ్చారు. విన్నారా! కానీ ఒకరు వినేవారు, మరొకరు ఇముడ్చుకునేవారు, ఎవరైతే ఇముడ్చుకుంటారో వారు నషాలో ఉంటారు.

ఈ రోజు కొత్త-కొత్త పిల్లలు కూడా వచ్చారు. బాప్ దాదా లక్కీ పిల్లలైన మీకు మీ అందరి భాగ్యానికిగాను శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. మీ భాగ్యాన్ని మీరు గుర్తించారు! గుర్తించారా? పరమాత్మ ప్రేమ, అవినాశీ ప్రేమ, ఇది కేవలం ఒక్క జన్మకే కాదు, అనేక జన్మలు సదా ఈ ప్రేమ నిలిచి ఉంటుంది, ఎందుకంటే ఈ సమయమేదైతే నడుస్తుందో, ఈ సమయము కూడా సంగమయుగ భాగ్యశాలి యుగము. సత్యయుగాన్ని కూడా భాగ్యశాలి యుగము అని అంటారు, కానీ వర్తమాన సంగమయుగ సమయము దానికంటే కూడా భాగ్యశాలి అయినది. ఎందుకని? ఈ సంగమయుగములోనే బాబా ద్వారా అఖండ భాగ్యానికి చెందిన వరదానము, వారసత్వము ప్రాప్తిస్తాయి. కనుక ఇటువంటి సంగమయుగములో, భాగ్యశాలి సమయములో మీరందరూ మీ భాగ్యాన్ని తీసుకునేందుకై చేరుకున్నారు. బాప్ దాదా పిల్లలకు చాలా సహజమైన పురుషార్థపు విధి ఒకటి వినిపిస్తున్నారు - సహజమైనదే కోరుకుంటారు కదా! కష్టమైనదైతే కోరుకోరు కదా! ఈ పిల్లలకు (పాతవారికి) అయితే భాగ్యము యొక్క సహజ విధి లభించింది. లభించింది కదా? అన్నింటికంటే సహజమైనది, వేరే ఇంకేమీ చెయ్యాల్సిన పని లేదు, కేవలము ఒక్క విషయము చెయ్యాలి, ఒక్క విషయాన్ని అయితే చెయ్యగలరు కదా! అవునా, కాదా చెప్పండి! హాజీ అని చెప్పండి. అన్నిటికంటే సహజ విధి - అమృతవేళ నుండి మొదలుకుని అందరికీ, ఎవరు కలిసినా సరే వారి నుండి ఆశీర్వాదాలను తీసుకోండి మరియు ఆశీర్వాదాలను ఇవ్వండి. క్రోధీ వ్యక్తి వచ్చినా కానీ మీరు వారికి కూడా ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి, ఎందుకంటే ఆశీర్వాదాలు తీవ్ర పురుషార్థానికి చాలా సహజమైన యంత్రము వంటివి. ఉదాహరణకు సైన్సులో రాకెట్ ఉంటుంది కదా - అది ఎంత త్వరగా పని చేసేస్తుంది. అలా ఆశీర్వాదాలను ఇవ్వటము మరియు ఆశీర్వాదాలను తీసుకోవటము, ఇది కూడా ముందుకు వెళ్ళడానికి చాలా సహజ సాధనము. అమృతవేళలో బాబా నుండి సహజ స్మృతి ద్వారా ఆశీర్వాదాలను తీసుకోండి మరియు మొత్తము రోజంతటిలో ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి, ఇది చెయ్యగలరా? చెయ్యగలరంటే చేతులెత్తండి. ఎవరైనా శాపనార్థాలు ఇస్తే అప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా మిమ్మల్ని పదే-పదే విసిగిస్తుంటే? చూడండి, మీరు పరమాత్ముని పిల్లలు, దాత పిల్లలు, దాతలు కదా! మీరు మాస్టర్ దాతలు. మరి దాత పని ఏముంటుంది? ఇవ్వటము. అన్నిటికంటే మంచి పని ఆశీర్వాదాలను ఇవ్వటము. ఎటువంటి వ్యక్తి అయినా సరే, వారు మీ సోదరుడు మరియు మీ సోదరియే కదా. పరమాత్ముని పిల్లలు కనుక సోదర-సోదరీలయ్యారు కదా! కనుక వారు పరమాత్ముని సంతానము, నా ఈశ్వరీయ సోదరుడు, ఈశ్వరీయ సోదరి... వారికి ఏం ఇస్తారు! శాపనార్థాలను ఇస్తారా? బాబా ఎప్పుడైనా శాపానార్థాలు ఇస్తారా! ఇస్తారా? ఇస్తారా? ఇస్తారా, ఇవ్వరా? అవునా, కాదా చెప్పండి. ఇలా చేస్తే చాలా సంతోషముగా ఉంటారు. ఎందుకని? ఒకవేళ శాపనార్థాలు ఇచ్చినవారికి కూడా మీరు ఆశీర్వాదాలను ఇస్తే, వారు ఇచ్చినా, ఇవ్వకపోయినా మీరు ఆశీర్వాదాలను తీసుకుంటే ఇక దుఃఖము ఎందుకు కలుగుతుంది. బాప్ దాదా ఇప్పుడు ఇక్కడకు వచ్చిన పిల్లలైన మీకు ఒక వరదానము ఇస్తున్నారు - ఆ వరదానాన్ని గుర్తు పెట్టుకుంటే సదా సంతోషముగా ఉంటారు. వరదానము వినిపించమంటారా? వింటారా!

వరదానము:- ఏమిటంటే - ఒకవేళ మీకు ఎవరైనా దుఃఖము ఇచ్చినా సరే మీరు ఆ దుఃఖాన్ని తీసుకోకండి, వారు ఇచ్చినా కానీ మీరు తీసుకోకండి. ఎందుకంటే ఇచ్చేవారు ఇచ్చేసారు, కానీ తీసుకునేవారైతే మీరే కదా! దుఃఖాన్ని ఇస్తున్నవారు అది తీసుకోవటం లేదు. ఒకవేళ వారు ఏదైనా చెడు వస్తువు ఇస్తే, దుఃఖమును ఇస్తే, అశాంతిని ఇస్తే, అవి చెడు కదా. మీకు దుఃఖము ఇష్టమా? ఇష్టము లేదు కదా? అది చెడు వస్తువు కదా, మరి చెడు వస్తువును తీసుకోవటం జరుగుతుందా? ఎవరైనా మీకు చెడు వస్తువును ఇస్తే మీరు తీసేసుకుంటారా? తీసుకుంటారా? తీసుకోరు. మరైతే ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకోవడమైతే తీసేసుకుంటున్నారు కదా! ఒకవేళ దుఃఖము తీసుకుంటే ఎవరు దుఃఖితులుగా అవుతారు? మీరు అవుతారా లేక వారు అవుతారా? తీసుకునేవారు ఎక్కువ దుఃఖితులుగా అవుతారు. ఒకవేళ ఇప్పటి నుండి దుఃఖము తీసుకోకపోతే ఇక మీకు సగం దుఃఖము దూరమైనట్లే, ఎందుకంటే తీసుకోనే తీసుకోరు కదా! అంతేకాక, మీరు దుఃఖానికి బదులుగా వారికి సుఖము ఇచ్చినట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. కనుక సుఖముగా కూడా ఉంటారు మరియు ఆశీర్వాదాల ఖజానా కూడా నిండుగా అవుతూ ఉంటుంది. ప్రతి ఆత్మ నుండి, వారు ఎలాంటివారైనా సరే, మీరు ఆశీర్వాదాలను తీసుకోండి. శుభ భావన, శుభ కామన పెట్టుకోండి. అప్పుడప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైనా పొరపాటు పని చేస్తే, వారికి శిక్షణ ఇవ్వడానికి మీరు ప్రయత్నిస్తారు, వీరిని సరి చేస్తాను అని శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇవ్వండి, కానీ శిక్షణ ఇచ్చేందుకు సర్వోత్తమమైన విధి ఏమిటంటే - క్షమా స్వరూపులుగా అయ్యి శిక్షణను ఇవ్వండి. కేవలము శిక్షణ మాత్రమే ఇవ్వకండి, దయ చూపించటము, క్షమించటము కూడా చెయ్యండి మరియు శిక్షణ కూడా ఇవ్వండి. రెండు పదాలను గుర్తుంచుకోండి - శిక్షణ మరియు క్షమ, దయ. ఒకవేళ దయార్ద్ర హృదయులుగా అయ్యి వారికి శిక్షణను ఇచ్చినట్లయితే మీ శిక్షణ పని చేస్తుంది. ఒకవేళ దయార్ద్ర హృదయులుగా అయ్యి శిక్షణ ఇవ్వకపోతే ఆ శిక్షణను ఒక చెవితో వింటారు, మరొక చెవితో వదిలేస్తారు. ఆ శిక్షణ ధారణ అవ్వదు. అంతే కదా? అనుభవము ఉందా? మీరు కూడా ఎవరికో ఒకరికి శిక్షకునిగా అవుతారు కదా? శిక్షకునిగా అవ్వటం త్వరగా వస్తుంది కానీ క్షమించటము... ఈ రెండూ తోడుతోడుగా ఉండాలి. ఇక ఇప్పటి నుండీ దయ ఉండాలి... దయ చూపించేందుకు విధి - శుభ భావన, శుభ కామన. సత్యమైన ప్రేమ రాయిని కూడా నీటిగా మార్చేస్తుంది... అని అంటారు కదా! అలాగే క్షమా స్వరూపముతో శిక్షణను ఇస్తే, మీరు ఏ విషయములోనైతే ఇలా చెయ్యకూడదు, ఇలా జరగకూడదు అని అనుకుంటున్నారో, అది ప్రత్యక్షముగా కనిపిస్తుంది. మీరు దయార్ద్ర హృదయులై శిక్షణ ఇచ్చినందుకు, దాని ప్రభావముతో వారి కఠినమైన హృదయము కూడా పరివర్తన అయిపోతుంది. మరి ఏ వరదానము లభించింది? దుఃఖము ఇవ్వకూడదు, దుఃఖము తీసుకోకూడదు. ఇష్టమేనా? ఇష్టమైతే ఇప్పుడిక తీసుకోకండి. పొరపాటు చెయ్యకండి. బాబా దుఃఖాన్ని ఇవ్వనప్పుడు మరి ఫాలో ఫాదర్ చేయాలి కదా? చేస్తున్నారు! అప్పుడప్పుడు కొంచెం మందలిస్తున్నారు. మందలించకండి. దయ చూపించండి. దయ చూపించడముతో పాటుగా శిక్షణ ఇవ్వండి. పదే-పదే ఎవరినైనా మందలిస్తే ఆ ఆత్మ ఇంకా శత్రువులా అయిపోతారు. వారికి ద్వేషము కలుగుతుంది. పరమాత్ముని పిల్లలు కదా! కనుక ఏ విధంగా బాబా పతితులను కూడా పావనముగా తయారుచేసేవారో, అలా మీరు దుఃఖితులకు సుఖాన్ని ఇవ్వలేరా? ఇప్పుడు వెళ్ళి ట్రయల్ చెయ్యండి, ట్రయల్ చేస్తారు కదా! ముందుగా దానము ఇంటి నుండి ప్రారంభమవ్వాలి. మీ పరివారములో ఒకవేళ ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చినా కూడా దుఃఖము తీసుకోకండి. ఆశీర్వాదాలను ఇవ్వండి, దయార్ద్ర హృదయులుగా అవ్వండి, ముందుగా ఇంటివారితో ఇలా చేయండి. మీ ఇంటి ప్రభావము ఆ ప్రాంతముపై పడుతుంది, ఆ ప్రాంతము ప్రభావము దేశముపై పడుతుంది, దేశము ప్రభావము విశ్వముపై పడుతుంది. సహజమే కదా! మీ పరివారముతో ప్రారంభించండి ఎందుకంటే చూడండి, ఇంట్లో ఒక్కరు కోపగించుకున్నా ఇంటి వాతావరణము ఎలా అయిపోతుంది? ఇల్లులా అనిపిస్తుందా లేక యుద్ధ మైదానములా అనిపిస్తుందా? ఆ సమయములో బాగా అనిపిస్తుందా? అనిపించదు కదా!

ఈ మాట మీ కోసం కూడా చెప్తున్నాము (ఈ రోజు వి.ఐ.పి.లతోపాటు మధుబన్ లోని సమర్పిత సోదరీ-సోదరులు కూడా ముందు కూర్చుని ఉన్నారు). మీ, మీ సహచరుల నుండి, మీ కార్యకర్తల నుండి దుఃఖము తీసుకోకండి, దుఃఖము ఇవ్వకండి. ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. ఒకవేళ మీరు అటువంటి సమయములో కూడా హృదయపూర్వకముగా అధికారముతో నా బాబా అని అన్నారంటే, పరమాత్మ తండ్రి, నా బాబా... అని అన్నారంటే, భగవంతుడు సదా హాజరై ఉంటారు అన్న నానుడి ఉంది కదా. ఒకవేళ మీరు హృదయపూర్వకముగా, అధికార రూపముతో అటువంటి సమయములో నా బాబా అని అన్నారంటే, స్వామి అయిన బాబా హాజరైపోతారు, ఎందుకంటే బాబా దేని కోసం ఉన్నారు? పిల్లలు కోసమే ఉన్నారు. అంతేకాక అధికారీ పిల్లలకు బాబా సహయోగాన్ని ఇవ్వకపోవటమన్నది జరగనే జరగదు. అది అసంభవము. కనుక ఈ పరివర్తన చేసుకుని వెళ్ళండి. ఎలా వచ్చారో అలానే వెళ్ళకండి. పరివర్తన అయ్యే వెళ్ళాలి, ఎందుకంటే చూడండి, ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చారు, టికెట్ అయితే తీసుకుంటారు కదా. ఖర్చు కూడా పేట్టుకున్నారు, సమయము కూడా ఇచ్చారు కావున దానికి విలువ అయితే ఇస్తారు కదా! విలువ ఇవ్వడమంటే - స్వ పరివర్తన ద్వారా ముందు ఇంటి పరివర్తన, ఆ తర్వాత, విశ్వ పరివర్తన, దేశ పరివర్తన. మీ ఇల్లు ఆశ్రమముగా అయిపోవాలి. ఇల్లు కాదు, ఆశ్రమము. శాస్త్రాలలో కూడా గృహస్థాశ్రమము అని అంటారు, కానీ ఈ రోజు అది ఆశ్రమములా లేదు. ఆశ్రమము వేరుగా, ఇల్లు వేరుగా ఉంది. కనుక ఇంటిని ఆశ్రమములా తయారుచెయ్యండి. ఆశీర్వాదాలను ఇవ్వటము మరియు తీసుకోవటము, ఇది ఆశ్రమము యొక్క కార్యము. మీ ఇల్లు మందిరములా అయిపోతుంది. మందిరములోని మూర్తి ఏం చేస్తుంది? ఆశీర్వాదాలను ఇస్తుంది కదా! మూర్తి ఎదురుగా వెళ్ళి ఏమని అంటారు? ఆశీర్వదించండి. దయ చూపించండి, దయ చూపించండి అని అంటూ అర్తనాదము చేస్తారు. కనుక మీరు కూడా ఏమివ్వాలి? ఆశీర్వాదాలు. ఈశ్వరీయ ప్రేమను ఇవ్వండి. ఆత్మిక ప్రేమను ఇవ్వండి, శారీరిక ప్రేమ కాదు, ఆత్మిక ప్రేమ. ఈ రోజుల్లోని ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమలా ఉంది. సత్యమైన హృదయముతో కూడిన ప్రేమ లేదు. ఏదైనా స్వార్థము ఉంటే ప్రేమిస్తారు, లేదంటే పట్టించుకోరు. మరి మీరేమి చేస్తారు? ఆత్మిక ప్రేమను ఇవ్వండి, ఆశీర్వాదాలను ఇవ్వండి, దుఃఖము తీసుకోకండి, దుఃఖము ఇవ్వకండి. చూడండి, మీకు ఛాన్స్ లభించింది, బాప్ దాదాకు కూడా సంతోషముగా ఉంది. ఇంతమంది వచ్చారు కదా, (భారత్ నుండి సుమారుగా 250 మంది వి.ఐ.పి.లు రిట్రీట్ కు వచ్చారు) ఇంతమంది ఇళ్లు అయితే ఆశ్రమాలుగా అయిపోతాయి కదా. అలా తయారుచేస్తారా? పక్కానా? లేక కాస్త కచ్చానా? ఏం జరిగినా గాని, కాస్త సహనమైతే వహించాల్సి ఉంటుంది, ఇముడ్చుకునే శక్తిని కూడా కార్యములో వినియోగించాల్సి ఉంటుంది, కానీ సహనశక్తి యొక్క ఫలము చాలా మధురముగా ఉంటుంది. సహనము చెయ్యాల్సి ఉంటుంది, కానీ ఫలము చాలా మధురముగా ఉంటుంది. కనుక ఎవరైతే పక్కా ప్రతిజ్ఞ చేస్తారో, ఇంటింటిని స్వర్గముగా తయారుచేస్తారో, మందిరముగా తయారుచేస్తారో, ఆశ్రమముగా తయారుచేస్తారో, వారు చేతులెత్తండి. ఇతరులను చూసి చేతులెత్తవద్దు ఎందుకంటే బాప్ దాదా తర్వాత లెక్క తీసుకుంటారు కదా. ఇతరులను చూసి చేతులెత్తవద్దు. సత్యాతి సత్యముగా మనసు యొక్క చేతిని ఎత్తండి, మనస్ఫూర్తిగా చేతులెత్తండి. అచ్ఛా! దాదీలూ, ఇందుకుగాను వీరికి ఏ ప్రైజ్ ను ఇస్తారు? చెప్పండి దాదీ, ఇన్ని మందిరాలు తయారైతే మీరు వారికి ఏం ప్రైజ్ ఇస్తారు? (వారి ఇంటివారిని తీసుకురావాలి) ఇది కానుకను ఇచ్చినట్లు కాదు, వారికి పని చెప్పారు. (బాబా ఏది ఆజ్ఞాపిస్తే అదే). చూడండి, మీకు ప్రైజ్ అయితే లభించేస్తుంది, అదేమీ పెద్ద విషయము కాదు, కానీ... కానీ అనేది ఉందా? కానీ ఏమిటో చెప్పనా? మీరు ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత మీ ధారణ ద్వారా పరివర్తన చెయ్యండి మరియు 15 రోజుల తర్వాత, నెల తర్వాత మీ రిజల్టును వ్రాయండి. ఎవరైతే ఒక్క నెల అయినా దుఃఖము తీసుకోరో మరియు ఇవ్వరో, వారికి చాలా మంచి ప్రైజ్ ఇస్తాము. ఒకవేళ మీరు వస్తే అభినందనలు, ఒకవేళ రాలేకపోయినా కూడా సెంటరుకు పంపిస్తాము. అచ్ఛా.

నలువైపులా ఉన్న దేశ-విదేశాలలోని పిల్లల యొక్క స్మృతులు బాప్ దాదాకు అందాయి. ఫోన్ ద్వారా స్మృతులను పంపించారు, ఉత్తరాల ద్వారా స్మృతులను పంపించారు, హృదయములో స్మృతి చేసుకున్నారు, అన్నీ అందాయి. కనుక బాప్ దాదా పిల్లలందరికీ భారత్ వారికైనా, విదేశాల వారికైనా, రిటర్నులో ఆశీర్వాదాలను మరియు ప్రియస్మృతులను పదమాల రెట్లు ఇస్తున్నారు.
నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమ యొక్క అధికారీ పిల్లలకు, నలువైపులా సర్వ ఖజానాలతో నిండుగా ఉన్న పిల్లలకు, నిర్విఘ్న, నిర్వికల్ప, నిర్వ్యర్థ సంకల్పాలు కల శ్రేష్ఠ ఆత్మలకు, దానితో పాటు స్వ పరివర్తన చేసుకునే మరియు చేయించే ఉల్లాస-ఉత్సాహాలతో ఎగురుతూ ఉండే పిల్లలకు, అలాగే బాప్ దాదాకు తమ మనసు యొక్క సమాచారాన్ని సత్యముగా వినిపించే సత్యమైన మనసు కల పిల్లలకు విశేషముగా మనోభిరాముని రూపములో, తండ్రి రూపములో, శిక్షకుని రూపములో, సద్గురువు రూపములో పదమాల రెట్లు ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-
భ్రమిస్తున్న ఆత్మలకు యథార్థ గమ్యాన్ని చూపించే చైతన్యమైన లైట్-మైట్ హౌస్ భవ

ఎటువంటి భ్రమిస్తున్న ఆత్మలకైనా యథార్థమైన గమ్యాన్ని చూపించేందుకు చైతన్యమైన లైట్-మైట్ హౌస్ గా అవ్వండి. దీని కోసం రెండు విషయాలు అటెన్షన్ లో ఉండాలి - 1. ప్రతి ఆత్మ యొక్క కోరికను పరిశీలించడము, ఉదాహరణకు ఎవరికైతే నాడి చూడడము తెలుస్తుందో, వారిని యోగ్యుడైన డాక్టర్ అని అంటారు, అలా పరిశీలనా శక్తిని సదా ఉపయోగించండి. 2. సదా మీ వద్ద సర్వ ఖజానాల అనుభవాన్ని నిలిపి ఉంచుకోండి. సదా ఈ లక్ష్యము పెట్టుకోండి - కేవలం వినిపించటమే కాదు, కానీ సర్వ సంబంధాలను, సర్వ శక్తులను అనుభవం చేయించాలి.

స్లోగన్:-
ఇతరులను కరెక్షన్ చేసేందుకు బదులుగా ఒక్క తండ్రితో సరైన కనెక్షన్ పెట్టుకోండి.

అవ్యక్త సూచనలు - ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

మీ నిజ స్వరూపము మరియు వరదానీ స్వరూపము సదా స్మృతిలో ఉన్నట్లయితే అపవిత్రత మరియు విస్మృతి యొక్క నామ-రూపాలు సమాప్తమైపోతాయి. విస్మృతి మరియు అపవిత్రత అంటే ఏమిటో తెలియదు అన్నట్లుగా ఇప్పుడు ఉండాలి ఎందుకంటే ఆ సంస్కారాలు మరియు స్వరూపము మీవి కావు, అవి మీ పూర్వ జన్మకు సంబంధించినవి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. అవేమో శూద్రుల సంస్కారాలు మరియు స్వరూపము. ఇలా ఆ సంస్కారాలు నావి కావు, అవి ఇంకెవరివో అన్నట్లు అనుభవమవ్వాలి, దీనినే అతీతముగా మరియు ప్రియముగా ఉండటము అని అంటారు.