25-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - నేను ఒక ఆత్మను అని పక్కాగా నిశ్చయం చేసుకోండి, ఆత్మగా భావించి ప్రతి కర్మనూ ప్రారంభించండి, అప్పుడు తండ్రి గుర్తుకు వస్తారు, పాపాలు జరగవు’’

ప్రశ్న:-
కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏ కృషిని చేయాలి? కర్మాతీత స్థితి సామీప్యతకు గుర్తు ఏమిటి?

జవాబు:-
కర్మాతీతముగా అయ్యేందుకు స్మృతి బలముతో మీ కర్మేంద్రియాలను వశం చేసుకునే కృషిని చేయండి. నిరాకార ఆత్మనైన నేను నిరాకార తండ్రి సంతానాన్ని అని అభ్యాసం చేయండి. అన్ని కర్మేంద్రియాలూ నిర్వికారముగా అయిపోవడము - ఇది చాలా గొప్ప కృషి. ఎంతగా కర్మాతీత అవస్థకు సమీపముగా వస్తూ ఉంటారో, అంతగా అంగాంగమూ శీతలముగా, సుగంధితముగా అవుతూ ఉంటాయి. వాటి నుండి వికారీ దుర్గంధము తొలగిపోతుంది. అతీంద్రియ సుఖము యొక్క అనుభవమవుతూ ఉంటుంది.

ఓంశాంతి
శివ భగవానువాచ - ఇది ఎవరి కోసము అన్నది పిల్లలకు చెప్పనక్కరలేదు. శివబాబా జ్ఞానసాగరుడని, మనుష్య సృష్టికి బీజరూపుడని పిల్లలకు తెలుసు, కావున తప్పకుండా వారు ఆత్మలతో మాట్లాడుతారు. శివబాబా చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. బాబా అన్న పదము ద్వారా పరమాత్మనే బాబా అని పిలుస్తున్నారని అర్థమవుతుంది. మనుష్యమాత్రులందరూ ఆ పరమాత్ముడినే తండ్రి అని అంటారు! బాబా పరంధామములో ఉంటారు. మొట్టమొదట ఈ విషయాలను పక్కా చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు ఈ విషయాన్ని పక్కాగా నిశ్చయము చేసుకోవాలి. తండ్రి ఏదైతే వినిపిస్తారో, దానిని ఆత్మయే ధారణ చేస్తుంది. ఏ జ్ఞానమైతే పరమాత్మలో ఉందో, అది ఆత్మలోకి కూడా రావాలి, దానినే మళ్ళీ నోటితో వర్ణన చేయవలసి ఉంటుంది. ఏ చదువునైతే చదువుతారో, దానిని ఆత్మయే చదువుతుంది. ఆత్మ వెళ్ళిపోతే చదువు మొదలైనవాటి గురించి ఏమీ తెలియదు. ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది, వెళ్ళి ఇంకొక శరీరములో కూర్చుంటుంది. కావున మొదట స్వయాన్ని ఆత్మగా, పక్కాగా భావించవలసి ఉంటుంది. దేహాభిమానాన్ని ఇప్పుడు వదలవలసి ఉంటుంది. ఆత్మయే వింటుంది, ఆత్మయే ధారణ చేస్తుంది. ఆత్మ ఇందులో లేకపోతే శరీరము కదలను కూడా కదలదు. పరమాత్మ ఆత్మలైన మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు అని పిల్లలైన మీరు ఇప్పుడు పక్కాగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మయైన మనం కూడా శరీరము ద్వారా వింటాము మరియు పరమాత్మ కూడా శరీరము ద్వారానే వినిపిస్తున్నారు - ఈ విషయాన్నే ఘడియ, ఘడియ మర్చిపోతారు. దేహము గుర్తుకువస్తుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి అని కూడా మీకు తెలుసు. మద్యం తాగడం, అశుద్ధమైన మాటలను మాట్లాడడం... మొదలైనవాటిని కూడా ఆత్మయే ఈ ఇంద్రియాల ద్వారా చేస్తుంది. ఆత్మయే ఈ కర్మేంద్రియాల ద్వారా ఇంతటి పాత్రను అభినయిస్తుంది. మొట్టమొదట ఆత్మాభిమానులుగా తప్పకుండా అవ్వాలి. తండ్రి ఆత్మలనే చదివిస్తారు. ఆత్మయే మళ్ళీ ఈ జ్ఞానాన్ని తనతోపాటు తీసుకువెళ్తుంది. ఏ విధంగా అక్కడ పరమాత్మ జ్ఞాన సహితముగా ఉంటారో, అలాగే ఆత్మలైన మీరు మళ్ళీ ఈ జ్ఞానాన్ని మీతోపాటు తీసుకువెళ్తారు. నేను పిల్లలైన మిమ్మల్ని ఈ జ్ఞాన సహితముగా తీసుకువెళ్తాను. మళ్ళీ ఆత్మలైన మీరు పాత్రలోకి రావాలి, మీ పాత్ర కొత్త ప్రపంచములో ప్రారబ్ధాన్ని అనుభవించడము. జ్ఞానాన్ని మర్చిపోతారు. ఈ విషయాలన్నింటినీ బాగా ధారణ చేయాలి. మొట్టమొదట నేను ఒక ఆత్మను అన్నది పక్కా చేసుకోవాలి, దీనిని మర్చిపోయేవారు ఎందరో ఉంటారు. తమ విషయములో తాము చాలా-చాలా కష్టపడాలి. విశ్వాధిపతులుగా అవ్వాలంటే కష్టపడకుండా అవ్వలేరు. ఘడియ, ఘడియ ఈ పాయింటునే మరచిపోతారు ఎందుకంటే ఇది కొత్త జ్ఞానము. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మ అని మరచి దేహాభిమానములోకి వస్తారో, అప్పుడు ఏవో ఒక పాపాలు జరుగుతాయి. దేహీ-అభిమానులుగా అవ్వడం ద్వారా ఎప్పుడూ పాపాలు జరగవు, పాపాలు తొలగిపోతాయి. మళ్ళీ అర్ధకల్పం ఎటువంటి పాపాలూ జరగవు. కావున - ఆత్మనైన నేను చదువుతున్నాను, అంతేకానీ దేహము కాదు అన్న ఈ నిశ్చయాన్ని ఉంచుకోవాలి. ఇంతకుముందు దైహికమైన మనుష్య మతం లభించేది, ఇప్పుడు తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇది కొత్త ప్రపంచము యొక్క పూర్తి కొత్త జ్ఞానము. మీరందరూ కొత్తగా అయిపోతారు, ఇందులో తికమకపడే విషయమే లేదు. అనేకానేక సార్లు మీరు పాత నుండి కొత్తగా, కొత్త నుండి పాతగా అవుతూ వచ్చారు, కావున బాగా పురుషార్థం చేయాలి.

ఆత్మయైన మనం కర్మేంద్రియాల ద్వారా ఈ కర్మలు చేస్తాము. ఆఫీస్ మొదలైన చోట్ల కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కర్మేంద్రియాలతో కర్మలు చేస్తున్నట్లయితే నేర్పించే తండ్రి తప్పకుండా గుర్తుకువస్తారు. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. నేను భగవంతుడిని స్మృతి చేస్తాను అని ఇంతకుముందు కూడా అనేవారు, కానీ ఆ సమయములో స్వయాన్ని సాకారునిగా భావిస్తూ నిరాకారుడిని స్మృతి చేసేవారు. స్వయాన్ని నిరాకారునిగా భావిస్తూ నిరాకారుడిని ఎప్పుడూ స్మృతి చేసేవారు కాదు. ఇప్పుడు మీరు స్వయాన్ని నిరాకార ఆత్మ భావిస్తూ నిరాకార తండ్రిని స్మృతి చేయాలి. ఇది చాలా విచార సాగర మంథనము చేయవలసిన విషయము. కొందరేమో, మేము రెండు గంటలు స్మృతిలో ఉంటాము అని వ్రాస్తారు, కొందరేమో, మేము సదా శివబాబాను స్మృతి చేస్తూ ఉంటాము అని అంటారు. కానీ సదా ఎవ్వరూ స్మృతి చేయలేరు. ఒకవేళ అలా స్మృతి చేసినట్లయితే మొదటి నుండే కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. కర్మాతీత అవస్థ అయితే చాలా గొప్ప కృషితో లభిస్తుంది. ఇందులో అన్ని వికారీ కర్మేంద్రియాలు వశమైపోతాయి. సత్యయుగములో అన్ని కర్మేంద్రియాలు నిర్వికారిగా అవుతాయి, అంగాంగము సుగంధితమవుతుంది. ఇప్పుడు దుర్గంధమయమైన, అశుద్ధమైన అంగములు ఉన్నాయి. సత్యయుగానికి ఎంతో ప్రియమైన మహిమ ఉంది. దానిని స్వర్గము, కొత్త ప్రపంచము, వైకుంఠము అని అంటారు. అక్కడి రూపురేఖలు, కిరీటము మొదలైనవాటిని ఇక్కడ ఎవ్వరూ తయారుచేయలేరు. మీరు వాటిని చూసి కూడా వస్తారు, కానీ ఇక్కడ వాటిని తయారుచేయలేరు. అక్కడైతే సహజసిద్ధమైన శోభ ఉంటుంది, కావున ఇప్పుడు పిల్లలైన మీరు స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి, స్మృతి యాత్రను చాలా-చాలా చేయాలి. ఇందులో ఎంతో శ్రమ ఉంది. స్మృతి చేస్తూ-చేస్తూ కర్మాతీత అవస్థను పొందినట్లయితే అన్ని కర్మేంద్రియాలూ శీతలమైపోతాయి. అంగాంగమూ ఎంతో సుగంధితమైపోతుంది, ఇక దుర్గంధము ఉండదు. ఇప్పుడైతే అన్ని కర్మేంద్రియాలలోనూ దుర్గంధము ఉంది. ఈ శరీరము ఎందుకూ పనికిరానిది. మీ ఆత్మ ఇప్పుడు పవిత్రముగా అవుతోంది, శరీరమైతే అలా అవ్వలేదు, ఎప్పుడైతే మీకు కొత్త శరీరము లభిస్తుందో అప్పుడే అది అలా అవ్వగలదు. అంగాంగములోనూ సుగంధము ఉండడమనే మహిమ దేవతలది. పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి. తండ్రి వచ్చారు కావున సంతోషపు పాదరసము పైకి ఎక్కాలి.

తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. గీతలోని పదాలు ఎంత స్పష్టముగా ఉన్నాయి. బాబా అన్నారు - నా భక్తులెవరైతే ఉన్నారో, వారిలో గీతా పాఠకులెవరైతే ఉన్నారో, వారు శ్రీకృష్ణుని పూజారులుగా కూడా తప్పకుండా ఉంటారు. కావుననే బాబా దేవతల పూజారులకు వినిపించండి అని అంటారు. మనుష్యులు శివుని పూజను చేస్తారు, కానీ మళ్ళీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. గ్లాని చేస్తూ కూడా ఇంకొకవైపు మందిరాలకు రోజూ వెళ్తారు. శివుని మందిరాలకు లెక్కలేనంతమంది వెళ్తారు. చాలా ఎత్తయిన మెట్లు ఎక్కి పైకి వెళ్తారు, శివుని మందిరము పైన ఎత్తులో నిర్మించడం జరుగుతుంది. శివబాబా కూడా వచ్చి మెట్లను గురించి తెలియజేస్తారు కదా. వారి నామమూ ఉన్నతమైనది, వారి ధామమూ ఉన్నతమైనది. ఎంత ఎత్తులోకు వెళ్తారు. బద్రీనాథ్, అమరనాథ్ - అక్కడ శివుని మందిరాలు ఉన్నాయి. వారు ఎంతగానో పైకి ఎత్తుతారు, కావున వారి మందిరాలను కూడా ఎంతో ఎత్తులో నిర్మించారు. ఇక్కడ గురుశిఖర్ మందిరము కూడా చాలా ఎత్తయిన పర్వతముపై నిర్మించబడి ఉంది. ఉన్నతమైన తండ్రి కూర్చొని మిమ్మల్ని చదివిస్తారు. శివబాబా వచ్చి చదివిస్తారు అని ప్రపంచములో ఇంకెవ్వరికీ తెలియదు. వారైతే సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు మీ ముందు లక్ష్యము-ఉద్దేశ్యము కూడా ఉంది. ఇది మీ లక్ష్యము-ఉద్దేశ్యము అని తండ్రి తప్ప ఇంకెవరు చెప్తారు? ఇది తండ్రే పిల్లలైన మీకు తెలియజేస్తారు. మీరు కథ కూడా సత్యనారాయణుని కథను వింటారు. వారైతే ఏదైతే గతించిందో, దాని కథలను ఇంతకుముందు ఏమేమి జరిగింది అని అంటూ చెప్తారు. దానిని కథ అని అంటారు. ఈ ఉన్నతోన్నతుడైన తండ్రి చాలా పెద్ద కథను వినిపిస్తారు. ఈ కథ మిమ్మల్ని చాలా ఉన్నతముగా తయారుచేస్తుంది. దీనిని సదా గుర్తుంచుకోవాలి మరియు అనేకులకు వినిపించాలి. కథను వినిపించేందుకే మీరు ప్రదర్శనీని లేక మ్యూజియంను తయారుచేస్తారు. 5000 సంవత్సరాల క్రితం భారత్ యే ఉండేది, అందులో దేవతలు రాజ్యం చేసేవారు. ఇది సత్యాతి-సత్యమైన కథ, దీనిని ఇంకెవ్వరూ తెలియజేయలేరు. ఇది యథార్థమైన కథ, దీనిని చైతన్యమైన వృక్షపతియైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, తద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. పవిత్రముగా అవ్వకపోతే ధారణ జరగదు. పులి పాల కోసం బంగారు పాత్ర కావాలి, అప్పుడే ధారణ జరగగలదు. ఈ చెవులు పాత్ర వంటివి కదా. ఇవి బంగారు పాత్రలా ఉండాలి. ఇప్పుడు రాతి పాత్రల వలె ఉన్నాయి. ఎప్పుడైతే బంగారు పాత్ర వలె అవుతాయో, అప్పుడే ధారణ జరగగలదు. చాలా అటెన్షన్ తో వినాలి మరియు ధారణ చేయాలి. కథ అయితే ఈజీయే, ఇది గీతలో వ్రాయబడి ఉంది. వారు కథలను వినిపించి సంపాదన చేసుకుంటారు. వినేవారి ద్వారా వారి సంపాదన జరుగుతుంది. ఇక్కడ మీకు కూడా సంపాదన జరుగుతుంది. రెండు సంపాదనలు కొనసాగుతూ ఉంటాయి. రెండు వ్యాపారాలూ ఉన్నాయి. చదివిస్తారు కూడా. మన్మనాభవ, పవిత్రముగా అవ్వండి అని అంటారు. ఈ విధంగా ఇంకెవ్వరూ అనరు, అలాగే మన్మనాభవగా కూడా ఉండరు. ఇక్కడ మానవమాత్రులెవ్వరూ పవిత్రముగా ఉండరు ఎందుకంటే వారు భ్రష్టాచారము ద్వారా జన్మిస్తారు. రావణ రాజ్యము కలియుగాంతము వరకూ కొనసాగనున్నది, అందులో పావనంగా అవ్వాలి. పావనులు అని దేవతలనే అంటారు, మనుష్యులను అనరు. సన్యాసులు కూడా మనుష్యులే, వారిది నివృత్తిమార్గపు ధర్మము. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రముగా అవుతారు. భారత్ లో ప్రవృత్తి మార్గపు రాజ్యమే కొనసాగింది. నివృత్తి మార్గమువారితో మీకు ఎటువంటి సంబంధమూ లేదు. ఇక్కడైతే స్త్రీ, పురుషులిరువురూ పవిత్రముగా అవ్వాలి. రెండు చక్రాలూ కలిసి నడిస్తే మంచిది, లేకపోతే గొడవ జరుగుతుంది. పవిత్రత విషయములోనే గొడవ జరుగుతుంది. ఇంకే సత్సంగములోనూ పవిత్రత విషయములో గొడవ జరిగినట్లుగా ఎప్పుడూ విని ఉండరు. ఈ ఒక్కసారే, ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు గొడవ జరుగుతుంది. సాధు-సన్యాసులు మొదలైనవారు ఎప్పుడైనా అబలలపై అత్యాచారాలు జరుగుతాయి అని అంటారా! ఇక్కడైతే బాబా, మమ్మల్ని రక్షించండి అని కుమార్తెలు పిలుస్తారు. వివస్త్రగా అయితే అవ్వడం లేదు కదా అని బాబా కూడా అడుగుతారు. ఎందుకంటే కామము మహాశత్రువు కదా. పూర్తిగా పడిపోతారు. ఈ కామ వికారము అందరినీ పైసకు కొరగానివారిగా చేసింది. తండ్రి అంటారు, 63 జన్మలు మీరు వేశ్యాలయములో ఉంటారు, ఇప్పుడిక పావనంగా అయి శివాలయములోకి వెళ్ళాలి. ఈ ఒక్క జన్మ పవిత్రముగా అవ్వండి. శివబాబాను స్మృతి చేసినట్లయితే శివాలయమైన స్వర్గములోకి వెళ్తారు. అయినా కామ వికారము ఎంత శక్తివంతమైనది. ఎంతగా హైరానా పరుస్తారు, ఆకర్షణ కలుగుతుంది. ఆ ఆకర్షణను తొలగించివేయాలి. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి కావున పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. టీచర్ ఏమైనా సదా కూర్చొనే ఉంటారా. చదువు కొద్ది సమయమే కొనసాగుతుంది. బాబా ముందే చెప్తున్నారు. ఇది నా రథము కదా. రథము యొక్క ఆయువు అని అంటారు. తండ్రి అంటారు, నేనైతే సదా అమరుడిని, నా పేరే అమరనాథ్. నేను పునర్జన్మలను తీసుకోను, కావుననే నన్ను అమరనాథ్ అని అంటారు. మిమ్మల్ని అర్ధకల్పం కోసం అమరులుగా చేస్తారు. అయినా కానీ మీరు పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. కావున ఇప్పుడు పిల్లలైన మీరు పైకి వెళ్ళాలి. మీ ముఖము అటువైపుకు మరియు కాళ్ళు ఇటువైపుకు ఉంచాలి. మళ్ళీ ఇటువైపుకు ముఖం ఎందుకు తిప్పాలి. బాబా, పొరపాటు జరిగిపోయింది, ముఖం ఇటువైపుకు తిరిగిపోయింది అని అంటారు. అనగా తలక్రిందులుగా అయిపోతారు.

మీరు తండ్రిని మరచి దేహాభిమానులుగా అయినట్లయితే తలక్రిందులుగా అయిపోతారు. తండ్రి అన్నీ తెలియజేస్తారు. తండ్రిని బలము ఇవ్వమని, శక్తి ఇవ్వమని ఏమీ అడగవలసిన అవసరం లేదు. తండ్రి అయితే - యోగబలం ద్వారా ఇలా తయారవ్వాలి అని మార్గాన్ని తెలియజేస్తారు. మీరు యోగబలం ద్వారా ఎంత షావుకార్లుగా అవుతారంటే, దాని వల్ల 21 జన్మలు ఎప్పుడూ ఎవ్వరినీ అడగవలసిన అవసరం ఉండదు. అంతగా మీరు తండ్రి నుండి తీసుకుంటారు. బాబా అయితే అపారమైన సంపాదనను చేయిస్తారు అని అర్థం చేసుకుంటారు, వారు అంటారు, ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. ఈ లక్ష్మీ-నారాయణులు అందరికంటే ఉన్నతమైనవారు, ఇక ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. పూర్తిగా చదవకపోతే ప్రజలలోకి వెళ్ళిపోతారు. ప్రజలను కూడా తప్పకుండా తయారుచేసుకోవాలి. మున్ముందు మీ మ్యూజియంలు ఎన్నేన్నో తయారవుతాయి మరియు మీకు పెద్ద-పెద్ద హాళ్ళు లభిస్తాయి, కాలేజీలు లభిస్తాయి, అందులో మీరు సేవ చేస్తారు. వివాహాల కోసం హాళ్ళను ఏవైతే నిర్మిస్తారో, అవి కూడా మీకు తప్పకుండా లభిస్తాయి. నేను మిమ్మల్ని ఈ విధంగా పవిత్రముగా తయారుచేస్తాను అని శివ భగవానువాచ ఉంది అని మీరు అర్థం చేయిస్తారు, అప్పుడు ఆ ట్రస్టీలు హాళ్ళను ఇచ్చేస్తారు. కామము మహాశత్రువు, దాని వల్ల దుఃఖాన్ని పొందారు అని భగవానువాచ అని ఉంది మీరు చెప్పండి. ఇప్పుడు పావనంగా అయి పావన ప్రపంచములోకి వెళ్ళాలి. మీకు హాళ్ళు లభిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇక టూ లేట్ అని అంటారు. తండ్రి అంటారు, నేను అలా మళ్ళీ నింపి ఇవ్వవలసిన వచ్చేలా ఊరికే ఏమైనా తీసుకుంటానా. పిల్లల యొక్క పైసా, పైసాతో సరస్సు తయారవుతుంది. మిగిలినవారందరిదీ మట్టిలో కలిసిపోనున్నది. తండ్రి అందరికన్నా పెద్ద వ్యాపారి కూడా. వారు స్వర్ణకారుడు, చాకలి, నిపుణుడు కూడా. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సత్యాతి-సత్యమైన కథను ఏదైతే వినిపిస్తారో, దానిని అటెన్షన్ తో వినాలి మరియు ధారణ చేయాలి, తండ్రిని ఏమీ అడగకూడదు. 21 జన్మల కోసం మీ సంపాదనను జమ చేసుకోవాలి.

2. ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందుకే యోగబలముతో శరీరపు ఆకర్షణను సమాప్తము చేసుకోవాలి. కర్మేంద్రియాలను శీతలముగా తయారుచేసుకోవాలి. ఈ దేహము యొక్క భానాన్ని వదిలేందుకు పురుషార్థము చేయాలి.

వరదానము:-

ఒకే స్థానములో ఉంటూ అనేక ఆత్మల సేవను చేసే లైట్ మైట్ సంపన్న భవ

ఏ విధంగా లైట్ హౌస్ ఒకే స్థానములో ఉంటూ దూరదూరాల వరకు సేవ చేస్తుందో, అలా మీరందరూ ఒకే స్థానములో ఉంటూ అనేకుల సేవ కోసం నిమిత్తంగా అవ్వగలరు, ఇందులో కేవలం లైట్-మైట్ తో సంపన్నంగా అయ్యే అవసరముంది. మనసు-బుద్ధి సదా వ్యర్థము ఆలోచించడం నుండి ముక్తిగా ఉండాలి, మన్మనాభవ మంత్రము యొక్క సహజ స్వరూపముగా ఉండాలి - మనసా శుభ భావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వృత్తి మరియు శ్రేష్ఠ వైబ్రేషన్లతో సంపన్నంగా ఉన్నట్లయితే ఈ సేవను సహజంగా చెయ్యగలరు. ఇదే మనసా సేవ.

స్లోగన్:-

ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలైన మీరు మైట్ గా అవ్వండి మరియు ఇతర ఆత్మలను మైక్ లుగా తయారుచెయ్యండి.