25-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - శాంతి అనే గుణము అన్నింటికన్నా పెద్ద
గుణము, అందుకే శాంతిగా మాట్లాడండి, అశాంతిని వ్యాపింపజేయడం ఆపివేయండి’’
ప్రశ్న:-
సంగమయుగములో తండ్రి నుండి పిల్లలకు ఏ వారసత్వము లభిస్తుంది? గుణవంతులైన పిల్లల
గుర్తులేమిటి?
జవాబు:-
మొదట జ్ఞానమనే
వారసత్వము లభిస్తుంది, 2. శాంతి, 3. గుణాల వారసత్వము. గుణవంతులైన పిల్లలు సదా
సంతోషములో ఉంటారు. వారు ఎవరి అవగుణాలనూ చూడరు, ఎవరి గురించి ఫిర్యాదు చేయరు,
ఎవరిలోనైతే అవగుణాలు ఉంటాయో వారి సాంగత్యము కూడా చేయరు. ఎవరైనా ఏదైనా అంటే వినీ
విననట్లుగా ఉంటూ తమ ఆనందములోనే ఉంటారు.
ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఒకటేమో మీకు తండ్రి నుండి
జ్ఞానము యొక్క వారసత్వము లభిస్తోంది. తండ్రి నుండి కూడా గుణాలను తీసుకోవాలి, అలాగే
ఈ చిత్రాల నుండి (లక్ష్మీ-నారాయణుల నుండి) కూడా గుణాలను తీసుకోవాలి. తండ్రిని
శాంతిసాగరుడు అని అంటారు. కావున శాంతిని కూడా ధారణ చేయాలి. పరస్పరం ఒకరితో ఒకరు
శాంతిగా మాట్లాడండి అని శాంతి గురించే తండ్రి అర్థం చేయిస్తారు. ఈ గుణాన్ని
తీసుకోవడం జరుగుతుంది. జ్ఞానమనే గుణమునైతే మీరు తీసుకుంటూనే ఉన్నారు. ఈ జ్ఞానాన్ని
చదువుకోవాలి. ఈ జ్ఞానాన్ని కేవలం ఈ ఒక్క విచిత్రుడైన తండ్రే చదివిస్తారు.
విచిత్రులైన ఆత్మలు (పిల్లలు) చదువుతారు. ఇది ఇక్కడి కొత్త విశేషత, దీని గురించి
ఇంకెవరికీ తెలియనే తెలియదు. శ్రీకృష్ణుని వంటి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి.
తండ్రి అర్థం చేయించారు, నేను శాంతి సాగరుడిని కావున శాంతిని ఇక్కడ స్థాపన చేయాలి.
అశాంతి అంతమవ్వనున్నది. తమ నడవడికను చూసుకోవాలి - ఎంతవరకు మేము శాంతిగా ఉంటాము.
శాంతిని ఇష్టపడే పురుషులు ఎంతోమంది ఉంటారు. శాంతిగా ఉండడము మంచిది అని భావిస్తారు.
శాంతి గుణము కూడా చాలా గొప్పది. కానీ శాంతి ఎలా స్థాపన అవుతుంది, శాంతి అర్థమేమిటి,
ఇది భారతవాసులైన పిల్లలకు తెలియదు. తండ్రి భారతవాసుల గురించే చెప్తారు. తండ్రి
రావడము కూడా భారత్ లోనే వస్తారు. తప్పకుండా లోపల కూడా శాంతి ఉండాలి అని ఇప్పుడు మీరు
భావిస్తారు. ఎవరైనా అశాంతపరిస్తే మనం స్వయాన్ని కూడా అశాంతపరచుకోవాలి అని కాదు. అలా
కాదు. అశాంతిగా అవ్వడము కూడా అవగుణమే. అవగుణాలను తొలగించుకోవాలి. ప్రతి ఒక్కరి నుండి
గుణాలను గ్రహించాలి. అవగుణాల వైపుకు చూడను కూడా చూడకూడదు. శబ్దం వింటున్నా,
చేస్తున్నా కూడా స్వయం శాంతిగా ఉండాలి ఎందుకంటే తండ్రి మరియు దాదా ఇరువురూ శాంతిగా
ఉంటారు, వారెప్పుడూ డిస్టర్బ్ అవ్వరు, గట్టిగా మాట్లాడరు. ఈ బ్రహ్మా కూడా
నేర్చుకున్నారు కదా. ఎంతగా శాంతిలో ఉంటే అంత మంచిది. శాంతిగానే స్మృతి చేయగలుగుతారు.
అశాంతిలో ఉండేవారు స్మృతి చేయలేరు. ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించాల్సిందే.
దత్తాత్రేయుడు మొదలైనవారి ఉదాహరణలు కూడా ఇక్కడికే వర్తిస్తాయి. దేవతలవంటి
గుణవంతులైతే ఎవరూ ఉండరు. ఒకే వికారము మూలము, దానిపై మీరు విజయాన్ని పొందుతున్నారు,
పొందుతూనే ఉంటారు. కర్మేంద్రియాలపై విజయాన్ని పొందాలి. అవగుణాలను వదిలేయాలి.
చూడకూడదు కూడా, మాట్లాడకూడదు కూడా. ఎవరిలోనైతే గుణాలు ఉన్నాయో వారి వద్దకే వెళ్ళాలి.
ఉండడము కూడా చాలా మధురముగా, శాంతిగా ఉండాలి. కొద్దిగా మాట్లాడుతూనే మీరు అన్ని
కార్యాలనూ చేయవచ్చు. అందరి నుండి గుణాలను గ్రహించి గుణవంతులుగా అవ్వాలి. తెలివైనవారు
ఎవరైతే ఉంటారో వారు శాంతిగా ఉండడమును ఇష్టపడతారు. కొందరు భక్తులు జ్ఞానులకన్నా కూడా
తెలివైనవారిగా, నిర్మానచిత్తులుగా ఉంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇతను ఏ
లౌకిక తండ్రికి బిడ్డనో, వారు ఒక టీచర్, ఎంతో నిర్మానచిత్తముగా, శాంతిగా ఉండేవారు.
ఎప్పుడూ క్రోధములోకి వచ్చేవారు కాదు. సాధువులు ఉంటారు కదా, వారి మహిమ చేయడం
జరుగుతుంది, వారు భగవంతుడిని కలుసుకునేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు కదా. కాశీకు,
హరిద్వార్ కు వెళ్ళి ఉంటారు. పిల్లలు చాలా శాంతిగా మరియు మధురముగా ఉండాలి. ఇక్కడ
ఎవరైనా అశాంతిగా ఉంటే వారు శాంతిని వ్యాపింపజేసేందుకు నిమిత్తులుగా అవ్వలేరు.
అశాంతిగా ఉండేవారితో మాట్లాడను కూడా మాట్లాడకూడదు. వారికి దూరముగా ఉండాలి. తేడా
ఉంటుంది కదా. వారు కొంగలు మరియు వీరు హంసలు. హంసలు మొత్తం రోజంతా ముత్యాలను గ్రోలుతూ
ఉంటాయి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ మన జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉండండి. మొత్తం
రోజంతా బుద్ధిలో ఇదే ఉండాలి - ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి, తండ్రి పరిచయాన్ని ఎలా
ఇవ్వాలి.
బాబా అర్థం చేయించారు - పిల్లలు ఎవరైతే వస్తారో వారితో ఫారం నింపించడం జరుగుతుంది.
సెంటర్లో ఎప్పుడైనా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే వారి చేత ఫారంను నింపించాలి,
కోర్స్ తీసుకోవాలనుకోకపోతే ఫారం నింపించాల్సిన అవసరం లేదు. వారిలో ఏమేముంది, వారికి
ఏమి అర్థం చేయించాలి అన్నది తెలుసుకునేందుకే ఫారంను నింపించడం జరుగుతుంది. ఎందుకంటే
ప్రపంచములోనైతే ఈ విషయాల గురించి ఎవరూ అర్థం చేసుకోరు. కావున ఫారం ద్వారా వారి
గురించి అంతా తెలుస్తుంది. తండ్రిని ఎవరైనా కలవడానికి వచ్చినా అప్పుడు కూడా ఫారం
నింపవలసి ఉంటుంది, తద్వారా వారు ఎందుకు కలవాలనుకుంటున్నారు అన్నది తెలుస్తుంది. ఎవరు
వచ్చినా వారికి హద్దు తండ్రి మరియు అనంతమైన తండ్రి గురించి పరిచయము ఇవ్వాలి ఎందుకంటే
మీకు అనంతమైన తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇచ్చారు కావున మీరు మళ్ళీ ఇతరులకు ఆ
పరిచయాన్ని ఇస్తారు. వారి పేరు శివబాబా. శివ పరమాత్మాయ నమః అని అంటారు కదా. వారు
కృష్ణుడిని దేవతాయ నమః అని అంటారు. శివుడిని శివ పరమాత్మాయ నమః అని అంటారు. తండ్రి
అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. ముక్తి-జీవన్ముక్తుల
వారసత్వాన్ని పొందేందుకు పవిత్ర ఆత్మలుగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. అది పవిత్ర
ప్రపంచము, దానిని సతోప్రధాన ప్రపంచము అని అంటారు. అక్కడకు వెళ్ళాలనుకుంటే నన్ను
స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఇది చాలా సహజము. ఎవరితోనైనా ఫారం నింపించిన
తర్వాత మీరు కోర్స్ చేయిస్తారు. ఒక రోజు నింపించండి, అప్పుడు అర్థం చేయించండి, మళ్ళీ
ఫారం నింపించండి, అప్పుడు - మనము ఏదైతే వారికి అర్థం చేయించామో అది వారికి గుర్తుందా,
లేదా? అన్నది తెలుస్తుంది. ఆ రెండు రోజులలో నింపిన ఫారంలలో తప్పకుండా తేడా ఉండడాన్ని
మీరు గమనిస్తారు. వారు ఏమి అర్థం చేసుకున్నారు అన్నది మీకు వెంటనే తెలిసిపోతుంది.
మనం అర్థం చేయించినదానిపై వారు ఆలోచించారా? లేదా? అన్నది తెలిసిపోతుంది. ఈ ఫారమైతే
అందరి వద్దా ఉండాలి. బాబా మురళిలో డైరెక్షన్ ఇచ్చినప్పుడు పెద్ద-పెద్ద సెంటర్లు
అయితే వెంటనే ఆచరణలోకి తీసుకురావాలి. ఫారంలు ఉంచాలి, లేకపోతే ఎలా తెలుస్తుంది.
వారికి స్వయం కూడా అర్థమవుతుంది - నిన్న ఏమి వ్రాసాము మరియు ఈ రోజు ఏమి
వ్రాస్తున్నాము అని. ఫారమైతే చాలా అవసరము. వేర్వేరుగా ముద్రించినా పర్వాలేదు, లేదంటే
ఒకేచోట ముద్రించి అన్ని వైపులకూ పంపించండి. ఇది ఇతరుల కళ్యాణము చేయడము.
పిల్లలైన మీరు ఇక్కడకు దేవీ-దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. దేవత అన్న పదము చాలా
ఉన్నతమైనది. దైవీ గుణాలను ధారణ చేసేవారిని దేవతలు అని అంటారు. ఇప్పుడు మీరు దైవీ
గుణాలను ధారణ చేస్తున్నారు కావున ఎక్కడైతే ప్రదర్శనీలు లేక మ్యూజియంలు ఉంటాయో అక్కడ
ఈ ఫారంలు ఎన్నో ఉండాలి, తద్వారా ఎటువంటి అవస్థ ఉంది అన్నది తెలుస్తుంది. అర్థం
చేసుకుని ఆ తర్వాత అర్థం చేయించవలసి ఉంటుంది. పిల్లలైతే సదా గుణాలనే వర్ణన చేయాలి,
అవగుణాలను ఎప్పుడూ వర్ణన చేయకూడదు. మీరు గుణవంతులుగా అవుతారు కదా. ఎవరిలోనైతే చాలా
గుణాలు ఉంటాయో వారు ఇతరులలో కూడా ఆ గుణాలను నింపగలుగుతారు. అవగుణాలు కలవారు ఎప్పుడూ
గుణాలను నింపలేరు. సమయము పెద్ద ఎక్కువేమీ లేదని, పురుషార్థము ఎంతగానో చేయాలని
పిల్లలకు తెలుసు. మీరు రోజూ ప్రయాణము చేస్తూ ఉంటారు, యాత్రను చేస్తూ ఉంటారు అని
తండ్రి అర్థం చేయించారు. అతీంద్రియ సుఖము గురించి గోప, గోపికలను అడగండి అన్న
గాయనమేదైతే ఉందో, అది చివరి సమయములోని విషయము. ఇప్పుడైతే నంబరువారుగా ఉన్నారు.
కొందరైతే లోలోపల సంతోషపు పాటలు పాడుతూ ఉంటారు - ఓహో! పరమపిత పరమాత్మ మాకు లభించారు,
వారి నుండి మేము వారసత్వాన్ని తీసుకుంటున్నాము. వారి వద్ద ఎటువంటి ఫిర్యాదులూ ఉండవు.
ఎవరైనా ఏమైనా అన్నా వినీ విననట్లుగా ఉంటూ మీ నషాలో నిమగ్నమై ఉండాలి. ఏదైనా
అనారోగ్యము లేక దుఃఖము మొదలైనవి ఉంటే మీరు కేవలం స్మృతిలో ఉండండి. ఈ లెక్కాచారాలను
ఇప్పుడే తీర్చుకోవాలి, ఇక తర్వాత మీరు 21 జన్మలు పుష్పాలుగా అవుతారు, అక్కడ దుఃఖము
అన్న మాటే ఉండదు. సంతోషము వంటి మందు లేదు అని అంటూ ఉంటారు. ఇక సోమరితనము మొదలైనవన్నీ
ఎగిరిపోతాయి, ఇందులో ఉన్నది సత్యమైన సంతోషము, అక్కడిది అసత్యమైనది. ధనము లభిస్తే,
నగలు లభిస్తే సంతోషిస్తారు. ఇక్కడ ఇది అనంతమైన విషయము. మీరు అయితే అపారమైన సంతోషములో
ఉండాలి. మనము 21 జన్మలు కొరకు సదా సుఖీగా ఉంటాము అని మీకు తెలుసు. మనం ఎలా
తయారవుతున్నాము అన్న ఈ స్మృతిలోనే ఉండండి. బాబా అని అనడముతోనే దుఃఖాలు దూరమైపోవాలి.
ఇక్కడైతే ఇది 21 జన్మల సంతోషము. ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మనం
మన సుఖధామానికి వెళ్తాము. ఇక ఆ తర్వాత ఏమీ గుర్తుండకూడదు. ఈ బాబా తమ అనుభవాలను
వినిపిస్తారు. ఎన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి, ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. బాబాకు
ఏ విషయములోనూ దుఃఖము కలగదు. వింటారు, విన్న తర్వాత - అచ్ఛా, ఇది ఇలా వ్రాసిపెట్టి
ఉంది అని భావిస్తారు. ఇవి అసలు ఏమీ కానే కావు. మనమైతే అపారమైన ఖజానాలు కలవారిగా
అవుతాము. మీతో మీరు మాట్లాడుకోవడముతోనే సంతోషము కలుగుతుంది. చాలా శాంతిగా ఉంటారు,
వారి ముఖము కూడా చాలా సంతోషముగా ఉంటుంది. స్కాలర్షిప్ మొదలైనవి లభిస్తే ముఖము ఎంత
హర్షితముగా ఉంటుంది. మీరు కూడా - ఈ లక్ష్మీ-నారాయణుల వలె హర్షితముఖులుగా అయ్యేందుకు
పురుషార్థము చేస్తున్నారు. వీరిలో జ్ఞానమైతే లేదు. మీకైతే జ్ఞానము కూడా ఉంది కావున
సంతోషము ఉండాలి. హర్షితముగా కూడా ఉండాలి. ఈ దేవతలకన్నా మీరు చాలా ఉన్నతమైనవారు.
జ్ఞానసాగరుడైన తండ్రి మనకు ఎంత ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. అవినాశీ జ్ఞాన
రత్నాల లాటరీ లభిస్తోంది కావున ఎంత సంతోషముగా ఉండాలి. మీ ఈ జన్మ వజ్రతుల్యమైనదిగా
గాయనం చేయబడుతుంది. నాలెడ్జ్ ఫుల్ అని తండ్రినే అంటారు. ఈ దేవతలను అలా అనరు.
బ్రాహ్మణులైన మీరే నాలెడ్జ్ ఫుల్ అయినవారు కావున మీకు నాలెడ్జ్ యొక్క సంతోషము
ఉంటుంది. ఒకటేమో తండ్రి లభించారు అన్న సంతోషము ఉంటుంది. ఈ సంతోషము మీకు తప్ప
ఇంకెవ్వరికీ ఉండదు. భక్తి మార్గములో అపారమైన సుఖము ఉండదు. భక్తి మార్గానిది
కృత్రిమమైన అల్పకాలిక సుఖము. ఆ ప్రపంచము యొక్క పేరే స్వర్గము, సుఖధామము, హెవెన్.
అక్కడ అపారమైన సుఖము ఉంటుంది, ఇక్కడ అపారమైన దుఃఖము ఉంది. రావణ రాజ్యములో మనం ఎంత
అశుద్ధముగా అయిపోయాము అనేది ఇప్పుడు పిల్లలకు తెలిసింది. మెల్లమెల్లగా కిందకు
దిగజారుతూ వచ్చారు. ఇది ఉన్నదే విషయసాగరము. ఇప్పుడు తండ్రి ఈ విషయసాగరము నుండి బయటకు
తీసి మిమ్మల్ని క్షీరసాగరములోకి తీసుకువెళ్తారు. పిల్లలకు ఇక్కడ చాలా మధురముగా
అనిపిస్తుంది, మళ్ళీ మర్చిపోతే అవస్థ ఎలా తయారవుతుంది. తండ్రి ఎంతగా సంతోషపు
పాదరసాన్ని పైకి ఎక్కిస్తారు. ఈ జ్ఞానామృతానికే గాయనము ఉంది. జ్ఞానామృతము యొక్క
గ్లాస్ ను త్రాగుతూ ఉండాలి. ఇక్కడ మీకు చాలా మంచి నషా ఎక్కుతుంది, మళ్ళీ బయటకు
వెళ్ళడముతో ఆ నషా తగ్గిపోతుంది. బాబా స్వయం అనుభవం చేస్తారు, ఇక్కడ పిల్లలకు మంచి
ఫీలింగ్ కలుగుతుంది - మేము మా ఇంటికి వెళ్తాము, మేము బాబా శ్రీమతముపై రాజధానిని
స్థాపన చేస్తున్నాము, మేము గొప్ప యోధులము. బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది, దీని ద్వారా
మీరు ఇంతటి పదవిని పొందుతారు. చదివిస్తున్నది ఎవరో చూడండి! అనంతమైన తండ్రి. వారు
పూర్తిగా మార్చివేస్తారు. కావున పిల్లలకు లోలోపల ఎంత సంతోషము ఉండాలి. ఇతరులకు
సంతోషాన్ని ఇవ్వాలి అని కూడా మీ మనసుకు అనిపించాలి. రావణునిది శాపము మరియు తండ్రి
నుండి లభించేది వారసత్వము. రావణుని శాపము వల్ల మీరు ఎంత దుఃఖితులుగా, అశాంతిగా
అయ్యారు. సేవ చేయాలి అని మనసు కలిగే గోపులు కూడా ఎందరో ఉన్నారు. కానీ కలశం మాతలకు
లభిస్తుంది. ఇది శక్తిదళము కదా. వందేమాతరం అని గానం చేయబడుతుంది. దానితోపాటు వందే
పితరం కూడా ఉండనే ఉంది. కానీ పేరు మాతలదే ఉంది. మొదట లక్ష్మి, ఆ తర్వాత నారాయణుడు.
మొదట సీత, ఆ తర్వాత రాముడు. ఇక్కడైతే మొదట పురుషుని పేరును, ఆ తర్వాత స్త్రీ పేరును
వ్రాస్తారు. ఇది కూడా ఆటయే కదా. తండ్రి అన్నీ అర్థం చేయిస్తారు. భక్తి మార్గపు
రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. భక్తిలో ఏమేమి జరుగుతుందో చెప్తారు. ఎప్పటివరకైతే
జ్ఞానము ఉండదో, అప్పటివరకూ ఏమీ తెలియదు. ఇప్పుడు మీ అందరి క్యారెక్టర్లు బాగవుతాయి.
మీవి దైవీ క్యారెక్టర్లుగా తయారవుతున్నాయి. పంచ వికారాల వలన ఆసురీ క్యారెక్టర్ గా
తయారవుతుంది. ఎంత మారుతుంది, కావున మీరు కూడా మారాలి కదా. శరీరము పోతే మారలేరు.
తండ్రిలో శక్తి ఉంది, ఎంతమందిలో వారు మార్పును తీసుకువస్తారు. చాలామంది పిల్లలు తమ
అనుభవాన్ని వినిపిస్తారు - మేము చాలా కాముకులుగా, మద్యము తాగేవారిగా ఉండేవారము, మాలో
ఎంతో మార్పు వచ్చింది, ఇప్పుడు మేము ఎంతో ప్రేమగా ఉంటున్నాము, ఆ ప్రేమలో అశృవులు
కూడా వస్తాయి! తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తారు కానీ ఈ విషయాలన్నింటినీ
మర్చిపోతారు. లేకపోతే సంతోషపు పాదరసం పైకెక్కి ఉండాలి. మనం అనేకుల కళ్యాణము చేయాలి.
మనుష్యులు చాలా దుఃఖితులుగా ఉన్నారు, వారికి దారి తెలియజేయాలి. అర్థం చేయించేందుకు
కూడా ఎంతగా కష్టపడవలసి ఉంటుంది. నిందలు కూడా పడవలసి వస్తుంది. వీరు అందరినీ సోదరీ,
సోదరులుగా చేసేస్తారు అని ముందు నుండే ఆ శబ్దం వ్యాపించి ఉంది. అరే, సోదరీ-సోదరుల
సంబంధమైతే మంచిదే కదా. వాస్తవానికి ఆత్మలైన మీరంతా పరస్పరం సోదరులు, అయినా కానీ
జన్మ-జన్మాంతరాల దృష్టి ఏదైతే పక్కా అయిపోయిందో, అది తొలగిపోదు. తండ్రి వద్దకైతే
ఎన్నో సమాచారాలు వస్తాయి. తండ్రి అర్థం చేయిస్తారు, ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి
పిల్లలైన మీ హృదయము తొలగిపోవాలి, మీరు పుష్పాలుగా అవ్వాలి. ఎంతమంది జ్ఞానాన్ని విని
కూడా మర్చిపోతారు. మొత్తం జ్ఞానమంతా బయటకు పోతుంది. కామము మహాశత్రువు కదా. బాబా
అయితే ఎంతో అనుభవజ్ఞులు. ఈ వికారాల వెనుక రాజులు తమ రాజ్యాలను పోగొట్టుకున్నారు.
కామము చాలా చెడ్డది. బాబా, ఇది చాలా కఠినమైన శత్రువు అని అందరూ అంటుంటారు కూడా.
తండ్రి అంటారు, కామాన్ని జయించడం ద్వారా మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. కానీ
కామ వికారము ఎంత కఠినమైనదంటే ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా మళ్ళీ పడిపోతారు. ఎంతో
కష్టం మీద ఏ కొందరో బాగవుతారు. ఈ సమయములో మొత్తం ప్రపంచము యొక్క క్యారెక్టర్
పాడైపోయి ఉంది. పావన ప్రపంచము ఎప్పుడు ఉండేది, అది ఎలా తయారయ్యింది, వీరు రాజ్య
భాగ్యాన్ని ఎలా పొందారు, ఇది ఎప్పుడూ ఎవ్వరూ తెలియజేయలేరు. మున్ముందు ఎటువంటి సమయము
వస్తుందంటే, మీరు విదేశాలకు కూడా వెళ్తారు, వారు కూడా వింటారు. ప్యారడైజ్ ఎలా
స్థాపన అవుతుంది అనేది వింటారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ బాగా ఉన్నాయి. కావున
ఇప్పుడు ఇక మీకు ఇదే చింతన ఉండాలి, ఇతర విషయాలన్నింటినీ మర్చిపోవాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ జ్ఞానాన్ని స్మరిస్తూ ముత్యాలను గ్రోలే
హంసలుగా అవ్వాలి. అందరి నుండీ గుణాలను గ్రహించాలి. ఒకరిలో ఒకరు గుణాలనే నింపుకోవాలి.
2. మీ ముఖాన్ని సదా సంతోషముగా ఉంచుకునేందుకు మీతో మీరు మాట్లాడుకోవాలి - ఓహో!
మేమైతే అపారమైన ఖజానాలకు అధిపతులుగా అవుతాము. జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా మాకు
జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తోంది.
వరదానము:-
మీ టైటిల్ యొక్క స్మృతితోపాటు సమర్థ స్థితిని తయారుచేసుకునే
స్వమానధారీ భవ
సంగమయుగములో స్వయముగా తండ్రి తమ పిల్లలకు శ్రేష్ఠ టైటిల్స్
ను ఇస్తారు, కావున ఆ ఆత్మిక నషాలోనే ఉండండి. ఏ టైటిల్ గుర్తుకువస్తే, అటువంటి సమర్థ
స్థితి తయారవుతూ ఉండాలి. ఉదాహరణకు మీ టైటిల్ స్వదర్శన చక్రధారి, ఈ స్మృతి రావటముతోనే
పరదర్శన సమాప్తమైపోవాలి, స్వదర్శనము ముందు మాయ కంఠము తెగిపోవాలి. నేను మహావీర్ ను,
ఈ టైటిల్ స్మృతిలోకి రావటముతో స్థితి చలించకుండా, స్థిరముగా అయిపోవాలి. కావున టైటిల్
యొక్క స్మృతితోపాటు సమర్థ స్థితిని తయారుచేసుకోండి, అప్పుడు శ్రేష్ఠ స్వమానధారి అని
అంటారు.
స్లోగన్:-
భ్రమిస్తూ ఉన్న ఆత్మల కోరికను
పూర్తి చేయడానికి పరిశీలనా శక్తిని పెంచండి.
| | |